మా మధ్య ప్రదేశ్ పర్యటన-9

1
13

[ఇటీవల మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]మా[/dropcap] మొదటి మజిలీ, ‘మాండు’లో జహాజ్ మహల్. ‘మాల్వా’ ప్రాంతంలోని ముఖ్యమైన టారిస్ట్ ఆకర్షణ మాండు. కొండలు, లోయలు పరచుకొని ఉన్న ప్రదేశం. అక్కడక్కడ విశాలమైన సరస్సులు. దాన్ని ‘ప్రిన్స్ ఆఫ్ పిల్‌గ్రిమ్స్’ అంటారు.

మాండు ప్రవేశ ద్వారం

జహాజ్ మహల్ ఒక పురాతన రాజభవనం. 15 వేలమంది రాణివాసపు స్త్రీలు అక్కడ ఉండేవారట. వారు నివసించే అంతఃపురాలు చాలా విలాసవంతమైనవి. జహాజ్ మహల్‌ని ‘షిప్ ప్యాలెస్’ అని కూడ అంటారు. మొత్తం భవనం ఒక పెద్ద పడవ ఆకారంలో ఉంటుంది. ముఖద్వారం ఇరువైపులా ఆరు కళాత్మకమైన ఆర్చ్‌లను చూశాము.

జహాజ్ మహల్‌

గ్రౌండ్ ఫ్లోర్‍లో మూడు అతి విశాలమైన హాల్స్ ఉన్నాయి. ప్రతి హాలు చివర అందమైన చెక్కడం పనితనం ఉన్న పెవిలియన్స్. ‘ముంజ్ తలావ్’ అన్నది జనానా పేరు. ఇక్కడ ప్రతి సంవత్సరం ‘మాండు’ ఫెస్టివల్ జరుగుతుంది. సంగీతం, షోస్, విద్యుద్దీప విన్యాసాలు, బెలూన్‍లు, ఇలా. అవి కాక జహాజ్ మహల్‌లో రాత్రి జరిగే సౌండ్ అండ్ లైట్ షో చాలా బాగుంటుంది.

జహాజ్ మహల్‌ వద్ద

మహాల్ నిర్మాణం పూర్తిగా మొఘల్ శైలి. మధ్య యుగపు నిర్మాణరీతి. ఎంట్రీ ఫీజు 5 రూపాయలు మాత్రమే. ‘జహాజ్’ అంటేనే ‘ఓడ’ అని అర్థం. భవనాన్ని అనుకుని పెద్ద రిజర్వాయరు ఉంది. రాజభవనం మొత్తం ఒక పెద్ద ఓడలాగా నీటిలో ఉన్నట్లు నిర్మించారు. భవనం ప్రతిబింబం నీటిలో చక్కగా కనబతుతుంది.

రాజుల స్విమ్మింగ్ పూల్

అక్కడినుంచి ‘హోషంగా టోంబ్’ కు వెళ్లాము. అది ఒక సమాధి. 6వ శతాబ్దానికి చెందిన హోషంగ్ షా మాండూను పరిపాలించాడు. సమాధిని పాలరాతితో నిర్మించారు. ఆఫ్ఘన్ నిర్మాణరీతిలో నిర్మించబడింది. షాజహాన్ దీని వల్ల ప్రేరితుడై, తాజ్ మహాల్‌కు రూపకల్పన చేయించాడని అంటారు. ఆ హోషంగ్ షా, ఘోరీ వంశీయుడు. ఆయనను ‘అల్వాఖాన్’ అని పిలిచేవారు. మాల్వా సుల్తానేట్‌ను పరిపాలించిన వారితో ఆయన ప్రముఖుడు.

సమాధి అంటే మామూలుగా ఉంటుందనుకోన్నాము. ఒక అపూర్వ చారిత్రిక కట్టడం అది. 15వ శతాబ్దంలో నిర్మించారు. షాజహాన్ చక్రవర్తి తన ఆస్థాన శిల్పి, ఉస్తాద్ హమీద్‍ను, హోషంగా టోంబ్‌ను జాగ్రత్తగా పరిశీలించి రమ్మని పంపాడట. టోంబ్ ఒక పూలబుట్ట ఆకారంలో చెక్కారు. స్తంభాలు, బ్రాకెట్లు, కొంత హిందూ నిర్మాణశైలిని పోలి ఉన్నాయనిపించింది మాకు. మూడు వైపులా అందమైన ఆర్చ్‌లున్నాయి. శవపేటిక కూడా అంత కళాత్మకంగా ఉంటుందా? అని ఆశ్చర్యపోయాము.

తర్వాత, మా మజిలీ ‘రాణీ రూప్‍మతీ మహల్’. అదొక రాణివాస భవనం. బాజ్ బహుదూర్ అనే పాలకుని భార్య. రేవాకుండ్ అనే చోట ఈ భవనాన్ని కట్టారు. ఒకసారి ఆయన గొర్రెలు కాచుకుంటున్న ఒక అందమైన అమ్మాయిని చూసి, మోహించాడు. తన ప్రాసాదానికి రాణిగా రమ్మని కోరాడు. తనకెంతో ప్రియమైన నర్మదానది ఒడ్డున ఐతేనే ఉంటానని ఆమె షరతు విధించింది. అలా ఆ భవనం నిర్మితమైంది. అక్చర్ పాదుషా తన సేనాని ఆదమ్ ఖాన్‌ను మాండూ పైకి దండయాత్రకు పంపాడు. బాజ్ బహదూర్ పోరాడినా లాభం లేకపోయింది. ఆయన చిత్తోడ్‌ఘర్‌కు పారిపోయాడు. రాణి విషం తాగి మరణించింది. అసాధారణమైన ఆమె అందం వల్ల ప్రజలు ఆమెను ‘రాణీ రూప్‍మతీ’ అని పిలిచేవారు.

రాణీ రూప్‍మతీ మహల్

రేవాకుండ్ అనేది ఒక రిజర్వాయరు. దాని అక్విడక్టు నుండి రూపమతీ ప్యాలెస్‌కు నీరు సరఫరా అయ్యేది. భవనం ఎత్తయిన గుట్ట మీద నిర్మించారు. పైకి వెళ్లడానికి మెలికలు తిరిగిన స్లోప్ ఉంది. 300 మీటర్లు ఉంటుంది. మాలాంటి సీనియర్ సిటిజన్స్‌కు కూడా అనుకూలంగా ఉంది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించారు. ముందు అత్యంత విశాలమైన ప్రాంగణం (Courtyard) ఉంది. ఉన్నతమైన, నగిషీలు చెక్కిన పైకప్పులున్నాయి. మొదట అది ఒక సైనిక స్థావరమట.

అక్కడ నుంచి నర్మదానదీ లోయ ప్రాంతం చూపరులకు కనువిందు చేస్తుంది. సూర్యాస్తమయాలు మనోహరంగా ఉంటాయట. ఆమె చరిత్ర ఆధారంగా, రాణీ రూప్‌మతి (1931,1959) అనే రెండు హిందీ సినిమాలు తీశారు. ‘బైజు బావ్రా’ (1952)లో రూప్‌మతిగా కుల్దీప్ కౌర్ నటించారు. అందులో ఆమెను బందిపోట్ల నాయకురాలిగా చూపారు.

భవనం లో-భాగంలో విశాలమైన పచ్చిక బయలు ఉంది. భవనం పక్కనే బాజ్ బహదూర్ ప్యాలెస్ ఉంది. ప్రస్తుతం ఈ భవనం భారత పురావస్తు శాఖ ఆధీనంతో ఉంది.

1599లో, అహ్మద్-ఉల్- ఉమి తుర్కొమాన్ అనే కవి, రాణి చరిత్రను పర్షియన్ భాషలో వ్రాశాడు. అందులో ఆమె స్వయంగా రచించి పాడిన 26 పద్యాలు ఉన్నాయి. దానిని ఎల్.ఎమ్. క్రంప్ అనే ఆయన ఇంగ్లీషులోకి అనువదించాడు. దాని పేరు ‘ది లేడీ ఆఫ్ ది లోటస్’.

భవనంలో తిరుగుతూ ఉంటే మా మనస్సుల్లో ఒక మనోహరమైన భావన. మహా సౌందర్యవతి ఐన అమె తిరుగాడిన చోటు. తనను ప్రేమించిన రాజుకు లాయల్‌గా ఉంది. శత్రువులు తన శీలాన్ని అపహరించకుండా ఆత్మత్యాగం చేసిన గొప్ప స్త్రీ. తర్వాత ‘జామా మసీదు’ చూశాము. అది రోడ్డు పక్కనే ఒక కూడలిలో ఉంది. అది కూడా మొఘల్ శైలీ నిర్మా ణమే. హోషంగ్ షా దాన్ని ప్రారంభించగా, 1454లో, మహమ్మద్ ఖిల్జీ కాలంలో అది పూర్తయింది.

ఇది నాగోర్ దర్గా కమిటీ అధ్వర్యంలో ఉంది. మసీదుకు మూడు వైపులా మూడు గుమ్మటాలున్నాయి. ప్రార్థన చేసీ హాలు విశాలమైంది. కళాత్మకమైన స్తంభాలు దానికి దన్నుగా ఉన్నాయి. మసీదు 15 అడుగుల ఎత్తైన ప్రదేశం మీద ఉంది.

మసీదు ఎదురుగా ఉన్నపాపులో టీ తాగాము. అతని దగ్గర ‘మిర్చీ బడ’లు ఉన్నాయి. తలా రెండు తిన్నాము. ఆ పక్కనే పురాతన రామాలయం ఉంది. అక్కడ ప్రత్యేకత ఏమిటంటే శ్రీరామచంద్ర ప్రభువు చతుర్భుజుడిగా దర్శనమిస్తాడు. ఆలయం శ్రీ రామమందిర్. అందులో పెద్ద శిల్ప సంపద ఏమి లేదు.

చతుర్భుజ రామ మందిరం
చతుర్భుజ రామాలయం విశిష్టతను తెలిపే బోర్డ్

అక్కడనించి వెళ్ళి హిందోళా మహల్‌ను దర్శించాము. దీనిని ‘స్వింగింగ్ ప్యాలెస్’ అని పిలుస్తారు. ఇది ఒక విశాలమైన సమావేశ మందిరం. ఇదీ హోషంగ్ షా నిర్మించినదే. భవనం ‘T’ షేప్‌లో ఉంది. పై కప్పుకు దన్నుగా ఐదు పెద్ద ఆర్చీలున్నాయి. మాల్వా రాజుల అభిరుచికి ఇది నిదర్శనం. ఇది 1425లో నిర్మించబ డింది. దానికి ‘స్వింగింగ్ ప్యాలెస్’ అని ఎందుకు పేరొచ్చిందో మరి! అది అటు ఇటు ఊగుతున్నట్లుగా మాకైతే భ్రమ కలుగలేదు.

‘మాండూ’లో చివరిది ఆష్రాఫీ మహల్. ఇది ఒక ‘మదరసా’గా ఉండేదట. నాలుగు మూలలా నాలుగు శిఖరాలు. చతురస్త్రాకార నిర్మాణం చుట్టూ కళాత్మకమైన కారిడార్లు.

మాండులో, అడవిలో, కొండల్లో ఖరీదైన రిసార్టులున్నాయి గాని, మనలాంటి వాళ్లం కూర్చుని తినగలిగే రెస్టారెంట్లు కనబడలేదు. లంచ్ ‘ధార్’ లోనే చేద్దాం అన్నాను కుశాగ్ర్‌తో. మేం ధార్ చేరేసరికి రెండు దాటింది. మాకు బుక్ చేసిన హోటల్ పేరు ‘రూప్‍మతీ ఆవాస్’ మొదటి అంతస్తులో మా రూము. లిఫ్ట్ లేదు. హోటల్ చిన్నది. రూం బాగుంది. క్రింద వారిదే రెస్పారెంట్ ఉంది.

చెకిన్ అయ్యాము.

“రూమ్ సాఫ్ కర్ రహే హైఁ. బీస్ మినిట్ ఇంతజార్ కీజియే, సర్ జీ!” అన్నాడు రిసెప్షన్ లోని కుర్రాడు.

“ఈ లోపు భోంచేస్తే, ఓ పనయిపోతుంది” అన్నాను.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సరైంది లేదు. టీ తాగే చోట బ్రెడ్ బజ్జీలు ఉంటే తలా ఒకటి తిన్నాము. అంతే.

‘మాల్వా స్పెషల్ తాలీ’ తెప్పించుకున్నాం. 140 రూపాయలు తల ఒక్కింటికి. రెండు పూరీలు, అనపకాయ కూర్మా, కొంచెం కేసరి, కాలీప్లవర్ పకోడీ, దాల్ తడ్కా, గ్రీన్ సలాడ్, పాపడ్, ప్లెయిన్ రైస్. నో దహీ! చివర్లో రాగి గ్లాసుల్లో అద్భుతమైన మసాలా మజ్జిగ.

సాయంత్రం ఐదు వరకు విశ్రమించాము. కుశాగ్ర్ కు ఫోన్ చేశాను.

“నాకిచ్చిన ఇటినరరీలో ఐతే ‘మాండూ’ మాత్రమే ఉంది సార్. ‘ధార్’ లో ఏమీ లేవు. కాని మీరు చూస్తామంటే ధార్‌లో కొన్ని మందిరాలు మంచివి ఉన్నాయి. తీసుకొని వెళతాను” అన్నాడు

“వెళదాం. రూంలో ఏం చేస్తాం?” అన్నాను.

ధారేశ్వర్ మహాదేవ్ మందిర్‌కు మొదటగా వెళ్లాము. అద్భుతమైన శివ మందిరమది. పక్కనే త్రిపురసుందరమాయి గుడి. పెద్ద నందీశ్వరుడిని తెల్లని రాతితో చిక్కారు. అమ్మవారి గుడి ముందు చండీ హోమం చేయిస్తున్నారెవరో దంపతులు. మేం వెళ్లేసరికి పూర్ణాహుతి జరుగుతూ ఉంది.

ధారేశ్వర్ మహాదేవ్ మందిర్‌
ధారేశ్వర శివలింగం
శ్వేత నందీశ్వరుడు
త్రిపురసుందరమాయి గుడి
చండీ హోమం

హారతి, తీర్థ ప్రసాదాలు తీసుకొని, హోమ భస్మాన్ని నుదుట ధరించాము.

మొత్తం ఆలయం రెడ్‌స్టోన్ నిర్మాణం. రెండు వైపులా సమున్నత గోపురాలు. శివలింగం నల్లనిది. స్వామి సర్వాలంకార భూషితుడు. గర్భగుడి కొంచెం దిగువన ఉంది. కార్తీకమాసంలో మరో శివమందిర దర్శనం మాకు లభించింది. స్వామి మీద వెండి నాగ ప్రతిమ ఉంది.

తర్వాత నిత్యానంద్ జీ ఆశ్రమ్ దర్శించాము. అది చాలా పెద్దది. అక్కడ కూడ శివాలయం ఉంది. స్వామిజీ సమాధి ఉంది. రెండూ కొండల మీదే! వంద మెట్లు ఎక్కాలి. ఈయన రాసలీలలు సాగించి వినుతికెక్కిన నిత్యానంద కాదు!

నిత్యానంద్ జీ ఆశ్రమ్

ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంది. చక్కని చప్టాలను చెట్ల కాండాల చుట్టూ కట్టారు. కాసేపు సేదతీరాము. స్థానికులు కొందరు మమ్మల్ని గమనించి, మేం ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాము? లాంటి వివరాలు అడిగి తెలుసుకొన్నారు.

“‘మా గఢ్ కాళికామాతా మందిర్’ దర్శించారా?” అని ఒకాయన అడిగాడు. లేదని చెప్పాము.

“తప్పక దర్శించండి మహామహిమాన్విత కాళికామాయి. త్వరగా వెళ్లండి 8 గంటలకు మందిరం మూసేస్తారు” అన్నాడు.

మందిరం కొండపైన ఉంది. 150 మెట్లు ఎక్కాలి. కానీ మెట్లు వెడల్పు ఎక్కువ, ఎత్తు తక్కువగా ఉన్నాయి. అప్పుడు టైం ఏడు దాటింది. పావుగంటలో పైకి చేరాము. మెట్ల దారి పైన పైకప్పు ఉంది. దాని పొడవునా లైట్లు! కింది నుంచి చూస్తే దీపాల తోరణంలా అనిపించింది నాకు. వాటర్ బాటిల్‌లో నీళ్లు లేవు! క్రిందికి దిగి వస్తున్న ఒకామెను కొంచెం నీళ్లివ్వమని అడిగాము. ఆమె సంతోషంగా ఇచ్చింది.

మాగధ్ కాళికామాతా మందిర్

అమ్మవారు ప్రశాంతవదన. నల్లని విగ్రహం. పద్మాసనాసీన. గులాబీరంగు చీరను జఖగన్మాతకు ధరింప చేశారు. పైనుంచి చూస్తే ధార్ పట్టణమంతా కనబడుతూ ఉంది. దర్శనం చేసుకోని, ఒక చోట కాసేపు కూర్చున్నాము.

మెల్లిగా క్రిందికి దిగాము. హోటల్ వారి రెస్టారెంటు లోనే పుల్కాలు, ఆలూ పాలక్, టమాటర్ చట్నీ తిని, మజ్జిగ తాగాము. హాయిగా పడుకోని నిద్రబోయాము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here