మా మిత్రుల మణిమహేశ్ సరస్సు ట్రెక్కింగ్ యాత్ర

0
10

[తమ మిత్రులు జరిపిన మణిమహేశ్ సరస్సు ట్రెకింగ్ యాత్ర అనుభవాలను అందిస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం.]

61వ ఏట బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత, మిత్రులు ధర్మా విజయభాస్కరరెడ్డి గత పన్నెండేళ్లుగా అవిశ్రాంతంగా కొండలూ, గుట్టలూ, పర్వత శిఖరాలు ఎక్కుతూ దిగుతూ ట్రెక్కింగ్ యాత్రలు కొనసాగిస్తూనే ఉన్నారు. అనేక దేశాలు సందర్శించారు. మౌంట్ ఎల్బ్రస్ (Mount Elbrus) వంటి పర్వత శిఖరాలు అధిరోహించారు. ఆయన సాహస యాత్రల్లో అన్ని వయసుల ఔత్సాహిక పర్వతారోహకులూ పాల్గొంటూ ఉంటారు.

మణిమహేశ్ ట్రిప్‍కు ప్లాన్ తయారు చేసినది తిరుపతి మిత్రులు చిరంజీవి, దిలీప్‍కుమార్, ప్రభాకర్ గార్లు. ఈ ట్రెకింగ్ బృందంలో బెంగుళూరు నుంచి శ్రీరామ్, చెన్నై నుంచి శరత్, శక్తి వేల్; నెల్లూరు నుంచి విజయ భాస్కరరెడ్డితో కలుపులుని మొత్తం ఏడుగురయ్యారు.

బస్ మార్గం

వీళ్ళలో శరత్, విజయభాస్కరరెడ్డి – ఇద్దరికి మాత్రమే పర్వతారోహణ అనుభవం ఉంది.

మణిమహేశ్ సరస్సు సందర్శన యాత్ర ఏటా కృష్ణాష్టమి రోజు ప్రారంభమై రాధాష్టమి నాడు ముగుస్తుంది. అంటే కొంచెం అటూ ఇటుగా ఆగస్టు – అక్టోబరు మధ్య యాత్ర సాగుతుందన్న మాట.

హిమాలయ పర్వతాల్లోని మణిమహేశ్ సరస్సు సందర్శన యాత్రకు హిమాచల్ ప్రదేశ్ లోని Dhancho ను బేస్ క్యాంపుగా పరిగణిస్తారు. కాలినడకన హిమాలయ పర్వత సానువుల గుండా పైకి క్లిష్టమైన మార్గం గుండా నడవవలసి ఉటుంది. సుమారు 18 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళలేని వారికి ఇటీవల హెలికాఫ్టర్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. యాత్రికులు వచ్చే ఆ రెండు నెలలూ దారంతా పెద్ద పెద్ద లంగర్లు (ఉచిత భోజన సౌకర్యాలు) నిర్వహిస్తారు. ఆ దారిన ట్రెకింగ్ చేసేవారికి, పౌష్టికాహారం ఉచితంగా లభిస్తుంది. మణిమహేశ్ ప్రాంతంలో, దారంతా తాత్కాలిక షెల్టర్లు కట్టి రాత్రి విశ్రమించడానికి అద్దెకి ఇస్తారు. సమయానుకూలంగా 200 నుంచి 1000 రూపాయలు కూడా వసూలు చేస్తారు. యాత్ర జరిగినంత కాలం సంతలు, అంగళ్లతో మహా కోలాహలంగా ఉండి, ముగియగానే నిర్జన ప్రదేశంగా మారుతుంది. మంచుతో దారంతా మూసుకొని పోతుంది. ఏటా మణిమహేశ్ యాత్ర తారీఖులు మారుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఆగష్టు 26న ఆరంభమై సెప్టెంబరు 11న ముగిసింది.

వర్షంలో భక్తులు

విజయభాస్కరరెడ్డి, ఆయన బృందం సభ్యులు పంజాబ్ రాష్ట్రంలోని పటాన్‌కోటలో కలుసుకోవాలని నిర్ణయించుకొన్నారు. సెప్టెంబరు మొదటి వారంలో కురిసిన వర్షాల వల్ల రైళ్లు ఆలస్యంగా నడవడం వల్ల, విజయభాస్కర్ రెడ్డి 9వ తేది మధ్యాహ్నానికి పటాన్‌కోట చేరుకోగలిగారు. 8వ తేదీన పటాన్‌కోట చేరిన ఇతర సభ్యులు స్వర్ణ దేవాలయం దర్శించుకోను వెళ్ళారు. అక్కడ రద్దీ వల్ల 9 ఉదయానికి గానీ ఆలయంలోకి ప్రవేశం లభించలేదు. వీళ్ళు ఆలయం బయట విడిచిన విలులైన ట్రెక్కింగ్ బూట్లను ఎవరో తీసుకొని పోయారు. అవాంతరాలన్నీ అధిగమించి మొత్తం మీద బృందం సభ్యులు 9వ తేది రాత్రికి హిమాచల్ ప్రదేశ్‍లోని చంబా జిల్లా కేంద్రంలో కలుసుకున్నారు.

పసిపాప నడిచింది

చంపావతి ఆలయం వంటి దర్శనీయ ప్రదేశాలున్నా, సమయాభావం వల్ల మన 7మంది సభ్యుల బృందం వెంటనే ట్రైకింగ్‌కి బయలుదేరింది. పర్వత ప్రాంతం, దారంతా అధిరోహణే! శ్రమతో కూడిన నడక – బ్యాక్‌పాక్‌ల బరువుతో.

సెప్టెంబరు 11వ తారీఖు యాత్రకు చివరిరోజు. జనం గుంపులు గుంపులుగా మణిమహేష్ సరస్సు యాత్ర పూర్తి చేసుకొని మన బృందానికి ఎదురుపడుతున్నారు. యాత్రికుల్లో అత్యధికులు ఉత్తర భారతీయులు. అంగళ్ళ వాళ్లు, వ్యాపారస్థులు కంచర గాడిదలు, పోనీల మీద గుడారాల సామగ్రి, ఇతర వస్తువుల కట్టలు గట్టి వేసుకొని వస్తూంటే పైకి వెళ్లే యాత్రికులకు దారిలో చాలా అవస్థ అయింది. ఏటికి ఎదురీత అంటే ఏమిటో మన వాళ్ళకి ఆ క్షణంలో అనుభవానికి వచ్చింది. పై నుంచి దిగి వస్తున్న జనప్రవాహంలో మన బృందం సభ్యులు విడివడి, ఎవరికి వారై ఒంటరిగా నడక సాగించారు.

తరుణవయస్కురాలు సరస్సుకు నడుస్తూ

దారంతా పంజాబ్ నుంచి వచ్చిన సిఖ్ఖులు లంగర్లు (ధర్మసత్రాలు) నిర్వహిస్తున్నారు. ఏదో ఇంత పెట్టామని కాక, యాత్రికులకు తిన్నంత, శ్రద్ధగా కొసరి కొసరి మరీ వడ్డిస్తున్నారు. జాతి, కులం, మీరెవరూ వంటి ప్రశ్నలేవీ అడగరు. ఏ వివక్షా లేదు. విజయభాస్కరరెడ్డి ఈ లంగరు విధానాన్ని చాలా ప్రశంసించారు. దారిలో యాత్రికులు కాస్త విశ్రమించడానికి, పడుకోడానికి ప్లాస్టిక్ పట్టాలు ఆచ్ఛాదనగా కప్పిన గదుల వంటివి అద్దెకు లభిస్తాయి. సమయానుకూలంగా ధరలు పెచుతారు ఆ గదులు అద్దెకిచ్చే వ్యాపారులు. పరుచుకోను మందంగా ఉండే రజాయిలు, దుప్పట్లు కూడా అద్దెకు ఇస్తున్నారు.

గాడిదలపై సామాన్లు వేసి

మన బృందంలోని సభ్యులు జన సమ్మర్ధాన్ని తొలగ దోసుకొంటూ ముందుకు సాగుతూ ఆ రోజు మధ్యాహ్నం DHANCHO అనే మజిలీ చేరారు – దారిలో లంగర్లలో ఆహారం, టీ సేవించి ఆకలి తీర్చుకొంటూ. మొత్తం మీద 4 గంటల్లో పూర్తి కావలసిన ప్రయాణానికి ఈ రోజు 6 గంటల సమయం పట్టింది. అందరికంటే వేగంగా నడుస్తూ శ్రీరామ్, శక్తివేల్ – మన విజయభాస్కరరెడ్డిని దాటుకొని ముందుకు వెళ్ళిపోయారు. ట్రెక్ ఆరంభంలో కన్పించిన మిగతా వాళ్ళ జాడ విజయభాన్కరరెడ్డికి తెలియలేదు. మొత్తం మన తిరుపతి వాళ్ళు బాగా వెనక పడిపోయి ఆలస్యంగా ధాంఛో చేరారు. ధాంఛో దాటుకొని విజయభాస్కరరెడ్డి అరగంట నడిచివుంటారు, అంతే, పెద్ద వాన అరగంట సేపు కురిసింది. వర్షం ఆగిన తర్వాత తన నడక సాగించారు.

యాత్రలో బాలుడు

ఈ జనప్రవాహానికి ఎదురీదుతూ మణిమహేశ్ సరస్సు ఎప్పటికి చేరుకోగలను? అనే సందేహం విజయభాస్కరరెడ్డిని పట్టుకుంది. తన తిరుగు ప్రయాణం రిజర్వేషన్ అయిపోయింది. ఎట్టి పరిస్థితిలోనూ 12 రాత్రికల్లా తను BHARMOUR చేరుకోవాలి. సరస్సును దర్శించి వెనక్కి తిరిగి రావడం అసాధ్యమని తన మనసు చెబుతోంది. మూడు కిలోమీటర్ల అధిరోహణ చేస్తేనే సరస్సు దర్శనం. ఈ పరిస్థితుల్లో తనకు వెనక్కు వెళ్ళడమే మంచిదనిపించి తిరుగుదారి పట్టారు.

దారిలో శ్రీనివాసయోగి అనే తెలుగాయన, సన్యాసి విజయభాస్కరరెడ్డికి పరిచయం అయ్యారు. ఇద్దరూ మాట్లాడుకొంటూ నడిచారు. ఆ రాత్రి లంగరులో భోజనం చేసి, ఇద్దరూ ఒక షెల్టరు గది అద్దెకు తీసుకొని అందులో నిద్రపోయారు.

రాత్రివేళ విశ్రాంతికి వేసిన షెల్టర్లు విప్పుతున్నారు

మరుసటి రోజు ఉదయమే యోగిగారు మన విజయభాస్కరరెడ్డిని నిద్ర లేపారు. అదృష్టం కొద్దీ అక్కడ లంగరు నిర్వహిస్తున్నవారు కమోడ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం వల్ల విజయభాస్కరరెడ్డి పెద్ద ఇబ్బంది పడకుండా తప్పించుకొన్నాడు. తనూ, స్వామీ లంగరులో ఉదయం ఫలహారం చేసి 8 గంటల కల్లా HADSAR చేరారు. HADSAR లోని లంగరులో మధ్యాహ్న భోజనం చేసి, బస్సులో BHARMOUR వెళ్ళారు. ఛార్జి 31 రూపాయలు. BHARMOUR లో విజయభాస్కరరెడ్డి హోటల్లో గది తీసుకున్నారు. స్వామి తాను అక్కడి ఆలయంలో ఆ రాత్రి పడుకుంటానని వెళ్ళిపోతుంటే, విజయభాస్కరరెడ్డి స్వామి చేతికి కొంత డబ్బు ఇవ్వబోతే, శ్రీనివాస స్వామీజీ మర్యాదపూర్వకంగా వద్దని చెప్పి సెలవు తీసుకొన్నారు. స్వామిజీ విజయనగరం ప్రాంతం వారు – ఏవో కుటుంబ సంబంధమైన ఇబ్బందుల వల్ల ఈ ప్రాంతానికి వచ్చేశారట!

శ్రీనివాస యోగితో

మిత్రులు గుర్రాల మీద ఇంత దూరం మణిమహేశ్ యాత్ర చేసి, సరస్సును దర్శించారు. అందరూ BHARMOUR లో కలుసుకొని, సాయంత్రం 4 గంటలకు చంబా నుంచి బస్సులో ఢిల్లీ చేరుకొన్నారు.

ఈ యాత్ర చేసిన బృందంలో శ్రీరామ్ ఒక్కరే రాధాష్టమి రాత్రి వెన్నెల వెలుగుల్లో మణిమహేశ్ సరస్సు తళతళలు చూసి మురిసిపోయిన అదృష్టవంతులు.

మణిమహేశ్ సరస్సు. గూగుల్ సౌజన్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here