మా మిత్రుల వియత్నాం పర్యటన-2

0
9

[శ్రీ విజయ భాస్కరరెడ్డి, తన స్నేహితుడు దయానందబాబుతో కలిసి జరిపిన వియత్నాం పర్యటన అనుభవాలను అక్షరబద్ధం చేసి అందిస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం. నెరేషన్ విజయ భాస్కరరెడ్డి గారు.]

నవంబరు 4వ తారీఖు (5వ రోజు):

హలాంగ్ బే క్రూయిజ్ టూర్:

హానోయ్ నుంచి హలాంగ్ బే మూడు గంటల ప్రయాణం. ఉదయం పదిగంటలకు హలాంగ్ బే లో క్రూయిజ్ బయలుదేరి సాయంత్రం వరకు సముద్రంలో విహరించాము.

హలాంగ్ బే క్రూయిజ్

క్రూయిజ్ ప్రయాణం అరుదైన అనుభవం. క్రూయిజ్‌లో సకల సౌకర్యాలు, డైనింగ్ హాలు, కూర్చొను సౌకర్యంగా సీట్లు ఉన్నాయి.

టి టాప్ ద్వీపంలో రష్యన్ జనరల్ టి టాప్ విగ్రహం పెట్టారు కృతజ్ఞతగా. అమెరికాతో యుద్ధకాలంలో ఆ జనరల్ హోచిమన్‍కు సహాయం చేశారట. క్రూయిజ్ ప్రయాణంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి హనీమూన్‍కు వచ్చిన దంపతులు పరిచయం అయ్యారు.

టి టాప్ విగ్రహం

నవంబరు 5వ తారీఖు (6వ రోజు):

డాంగ్ హాయ్ (Dong Ha):

5-11-23. ఆదివారం ఉదయం 6 గంటలకే హానోయ్ నుంచి రైల్లో డాంగ్ హాయ్ వెళ్ళాము, ఆ పగలంతా రైల్లోనే గడిచిపోయింది. సాయంత్రానికి ‘డాంగ్ హాయ్’ చేరి, రాత్రి భోజనం వీధుల్లోని షాపుల్లోనే తిని, గెస్ట్ హౌస్‌లో విశ్రమించాము.

వియత్నాంలో ఉన్న నెలరోజులు దాదాపు ప్రతిరోజు స్ట్రీట్ ఫుడ్ మాత్రమే తిన్నాము. పలహారానికి సుమారు 150/- రూపాయలు, భోజనానికి 200/- నుంచి 300/- రూపాయలు అయ్యేది. వరన్నం, ఉడకబెట్టిన కూరలు, మాంసం, పచ్చి కూరలు, నూడుల్సు భోజనంలో ఉన్నా ఆ రుచులు వేరు. నాతో వచ్చిన మిత్రుడు భోజనానికి అంతగా అలవాటు పడలేదు.

నవంబరు 5న మా హోం స్టే వారు ఏర్పాటు చేసిన సైకిళ్ళ మీద ఇద్దరం రాత్రి 9 గంటల దాకా ఊరంతా తిరిగాము.

రాత్రిపూట డాంగ్ హాయ్‌ వీధులు

డాంగ్ హాయ్‌లో ఒక విశాలమైన పార్క్, సరస్సు ఎంతో నచ్చాయి.

వియత్నాం పార్కుల్లో పెద్ద పెద్ద సిమెంటు తొట్లలో బోన్సాయి వృక్షాలు (మరుగుజ్జు చెట్లు) కనువిందు చేస్తాయి, ఇక్కడి ప్రజలు వృక్షప్రేమికులు. రోడ్ల పక్కన ఎక్కడ చూచినా పురాతన కాలం నాటి వృక్షాలను చక్కగా సంరక్షించారు.

నవంబరు 6వ తారీఖు (7వ రోజు):

పేరడైజ్ కేవ్:

6-11-23. ఈ రోజు ఉదయం Phong Nha-Kẻ Bàng లోని పేరడైజ్ కేవ్ (Thiên Đường Cave) చూడడానికి తయారయ్యాము.

ఈ రోజు పేరడైజ్ కేవ్ చూడాలని ముందుగానే ఏర్పాట్లు చేసుకొన్నాము. సుమారు 30 కిలోమీటర్లు పొడవు, 60-150 అడుగుల వెడల్పున ఉన్న ఈ గుహ అంతటా విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు. లక్షల సంవత్సరాల క్రితం ఈ గుహల్లో సహజంగా ఏర్పడిన stalactites, stalagmites స్తంభాలు విచిత్రమైన ఆకృతుల్లో సందర్శకులను ఆకట్టుకొంటాయి. మన బొర్రా గుహల్లోనూ ఇటువంటి సహజ స్తంభాలున్నాయి. ఈ గుహలో కొంత దూరం రాతి మెట్ల మీద నడవాలి. కొంత దూరం – వేయి చెక్క మెట్లు ఎక్కి గుహ లోపలికి ప్రవేశించవలసి ఉంటుంది.

పేరడైజ్ కేవ్

ఈ కండక్టెడ్ టూర్ ఏర్పాటు చేసిన సంస్థ దారిలో మధ్యాహ్న భోజనం – బఫె లంచ్ కూడా ఏర్పాటు చేసింది. Phong Nha గుహలో చాలా భాగం బోటులో తిరిగి, మరొక ద్వారం గుండా వెలుపలికి వచ్చాము. తర్వాత సరస్సులో రెండు గంటల పాటు బోటులో విహరించాము.

Phong Nha అనే ప్రపంచంలోనే అతి పెద్ద గుహలలో ఒకటి వియత్నాం లోనే ఉంది. ఈ గుహను దర్శించడానికి దేశదేశాలనుంచి సందర్శకులు ముందుగానే టిక్కట్లు రిజర్వ్ చేసుకొంటారు. గుహను చూడడానికి అయిదు రోజులు పడుతుందట!

ఈ రోజు రాత్రి డాంగ్ హాయ్‍లోనే విశ్రాంతిగా ఉన్నాము.

నవంబరు 7వ తారీఖు:

Hue (old capital):

ఉదయమే బయల్దేరి వియత్నాం పాత రాజధాని హ్యు నగరం సైకిళ్ళ మీద తిరిగి చూచాము. ఇక్కడ లాడ్జ్‌లు, గెస్టు హౌస్‌ల వారు స్థానికంగా తిరిగి చూచేందుకు సైకిళ్లు ఉచితంగా ఇస్తారు. మోటారు బైక్‍లకు మాత్రం బాడుగ వసూలు చేస్తారు.

పాత రాజధాని హ్యు నగరం
పాత రాజధాని హ్యు నగరం

రాయల్ పేలెస్‌ను పునరుద్ధరిస్తున్నందు వల్ల అంతా తిరిగి చూచే అవకాశం లేకపోయింది. హ్యు నగరంలో పగోడాలు, వస్తు ప్రదర్శనశాలలు తిరిగి చూసాము. రాయల్ పేలెస్ లోపల చాలా భాగం దారు నిర్మాణం. పగోడాలు, స్తంభాలు, నగిషీలు అన్నీ కొయ్యతోనే. వియత్నాం, కాంబోడియాలలో ప్రతి భవనం ఆవరణలో, పార్కుల్లో ఎప్పటివో మహా వృక్షాలను, బోన్సాస్ వృక్షాలను జాగ్రతగా సంరక్షణ చేస్తున్నారు.

హ్యు నుంచి బస్ లో దనాంగ్ కు వెళ్లి, అక్కణ్ణించి టేక్సీలో Hoi Anకు వెళ్ళాము. అక్కడ Madd monkety hostel లో దిగి, వారివద్ద సైకిళ్ళు తీసుకొని Hoi An లో పగొడాలు, మార్కెట్లు తిరిగి చూచాము.

Hoi An Pagoda
Hoi An night view

నవంబరు 9వ తారీఖు:

మైసన్‍లో భద్రేశ్వరాలయం, ఇంతర హిందూ ఆలయాల సందర్శన:

Hoi An కు సమీపంలోనే మైసన్ అనే ప్రదేశంలో హిందూ ఆలయ శిధిలాలను చూడడానికి పేకేజ్ టూర్‍లో వెళ్ళాము. మైసన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశం.

మైసన్‍లో హిందూ శిధిలాలయాలు

9-11 శతాబ్దాల మధ్యకాలంలో చంపా రాజ్యం అనే ఈ ప్రాంతాన్ని హిందూమతాన్ని అనుసరించే రాజులు పాలించారు. ఆనాడు చంపా ప్రజల చామ్ (cham) భాషలో, సంస్కృత భాషలో శాసనాలు కూడా ఇక్కడ లభించాయి. ఇక్కడ చామ్ భాష మాట్లాడే ప్రజలు ఈనాడు కూడా ఉన్నారు. 19వ శతాబ్దాలలో ఫ్రెంచి దేశపు పరిశోధకులు చంపా ఆలయాల శిధిలాలను మొట్ట మొదట కనుగొన్నారు. ఈ ఆలయాలన్నీ ఇటుకలతో నిర్మించినవే. అన్నీ శిధిలాలయాలే, కొన్ని చోట్ల పానవట్టంలో శివలింగానికి మారుగా బుద్ధ విగ్రహాలు ప్రతిష్టించబడి ఉన్నాయి. ఈ ఆలయ సముదాయంలో భద్రేశ్వరాలయం ప్రధానమైన ఆలయం.

మైసన్‍లో పర్యాటక శాఖ ఈ శిధిలాలయాల మీద 15 నిమిషాల ప్రదర్శన ఏర్పాటు చేసింది. నర్తకులు రంగస్థలం మీద ఆనాటి నృత్యరీతులను అభినయించి చూపించారు. ఈ ఆలయ సముదాయాన్ని మన పురావస్తుశాఖ పునరుద్ధరిస్తోంది.

రాత్రి Hoi An గ్రామంలో Mad monkey Back Packer’s Hostel లో విశ్రమించాము.

నవంబరు 10 వ తారీఖు:

బాణా హిల్స్ థీమ్ పార్క్:

ఉదయం Hoi An నుంచి బాణా హిల్స్‌కు పెళ్లి, కేబుల్ కారులో సన్ వరల్డ్ సంస్థ నిర్వహిస్తున్న పర్యాటక కేంద్రాన్ని చూచాము. బాణా హిల్స్‌లో ఫ్రెంచి దేశపు నమూనాలో మోడల్ విలేజ్‌ని నిర్మించారు. థీమ్ పార్కు, గోల్డెన్ బ్రిడ్జి చూడదగ్గవి.

గోల్డెన్ బ్రిడ్డ్

పెద్ద పెద్ద స్తంభాలు మానవ హస్తాలు వంతెనను మోస్తున్నట్లు కాంక్రీటు స్తంభాలను తీర్చిదిద్దారు. సాయంత్రాలు స్థానికులు, సందర్శకులు ఈ వంతెన మీద షైరు తిరుగుతూ ఆనందిస్తారు.

థీమ్ పార్కు

బాణా కొండల మీదికి కేబుల్ కారు నిర్వహించబడుతోంది. 15 నిమిషాల ప్రయాణం, హిల్స్ పైన విలాసవంతమైన హోటళ్లున్నాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here