మా నాన్న

0
7

[dropcap]బా[/dropcap]ల్య స్మృతులలో
మా నాన్న పిసినారి!
పెద్దయ్యాక తెల్సింది
ఆయన పొదుపరి!
అందుకే అప్పులేని ఆస్తిని అందించారు!
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లోగిలిలో
ఆయన నిలువెత్తు విగ్రహం, ఎనలేని నిగ్రహం!
ముఖంలో కనిపించదు ఏ ఆగ్రహం!
స్వార్థం లేని ‘అర్థం’ కాని మనిషి!
‘మన’ తప్ప ‘నా’ తెలీని ఉమ్మడి జీవి!
లౌక్యానికి దూరంగా
లోకానికి దగ్గర కావాలనుకునే అమాయక ప్రాణి!
కుటుంబ పెద్దరికంతో మురిసిపోయిన
అల్ప సంతోషి!
తన రెక్కల్ని ‘మొక్కలు’గా మలిచాడు
చెమట చుక్కల్ని కొబ్బరి బొండాలుగా అందించాడు
పచ్చదనాన్ని పంచే పచ్చని చెట్టై నిలిచాడు.
తమ్ముళ్ళు రెక్కలొచ్చి ఎగిరిపోతున్నప్పుడు
ఆస్తిని ముక్కచెక్కలు చేస్తునప్పుడు
గుండెలవిసేలా కన్నీరయ్యాడు!
‘మిక్సీ’ ఉన్న తమ్ముడు
‘సన్ని కల్లు’ను కూడా మిగల్చకుండా
‘గౌరీదేవి’ అని తన్నుకుపోతుంటే
స్థాణువై ఆశ్చర్యార్థకమయ్యాడు!
‘అప్పులన్నీ నీవి, ఆస్తులన్నీ మావి’ అన్నప్పుడు కూడా
‘అలాగే’ అన్న, ‘అన్న’ మా నాన్న!
సహనం భూషణంగా
సమష్టి జీవనం సౌఖ్యంగా
సాగిన సంఘజీవి
మా హృదయంలో చిరంజీవి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here