‘రైల్వేమెన్’ సిరీస్‍లో ‘రైల్వేమాన్’ మా నాన్న

2
13

[డిసెంబరు 1984లో భోపాల్‍లో సంభవించిన గ్యాస్ దుర్ఘటన సమయంలో – రైల్వేలో జనరల్ మేనేజర్‍గా ఉన్న శ్రీ గౌరీ శంకర్ తీసుకున్న చర్యల గురించి వారి కుమార్తె సాధనా శంకర్ తన బ్లాగులో పోస్ట్ చేసిన రచనకి కొల్లూరి సొమ శంకర్ అనువాదం.]

సాధనా శంకర్

[dropcap]ఈ[/dropcap] సంవత్సరం నవంబర్ నెల చివరలో, ఓ సాయంత్రం, నాకు ముంబైలోని ఒక స్నేహితురాలి నుండి ఓ మెసేజ్ వచ్చింది.

“నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది రైల్వేమెన్’ సిరీస్‌లో ‘మిస్టర్ గౌరీ శంకర్’ అని ఎక్‍నాలెజ్డ్ చేయబడిన వ్యక్తి మీ నాన్నగారేనా?” అని. నేను ఆ సిరీస్ చూడలేదు, పైగా నా నేస్తం ఏ సందర్భంలో అడుగుతోందో తెలియదు. ఈ ధారావాహికను  1984 నాటి భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా రూపొందించారని  ఆమె వివరించినప్పుడు, నాకు ఒక్కసారిగా గగుర్పాటు కలిగింది.

“అవునవును! ఆయన మా నాన్న. ఆ రాత్రి అక్కడే ఉన్నారు.”

“ఏయ్, ఇన్ని సంవత్సరాలలో నువ్వు నాతో ఎప్పుడూ చెప్పనేలేదు. ఎంత వీరోచితమైన పని అది!” – విస్మయంతో కూడిన ఆమె ప్రతిస్పందన చాలా కాలంగా మరచిపోయిన, కాలక్రమేణా పాతిపెట్టబడిన జ్ఞాపకాలను వెలికి తీసింది.

పోస్టర్. Image Source: Internet

1984లో – అప్పట్లో కొద్ది నెలల క్రితమే డిగ్రీ పూర్తి చేసి నేను ఎల్.ఎల్.బి.లో చేరాను. నాన్నను  సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్‌గా ముంబైలో పోస్ట్ చేశారు. నేను న్యూ ఢిల్లీలోని హాస్టల్‌లో ఉంటున్నాను. నిజం చెప్పాలంటే, భోపాల్‌లో ఆ రాత్రి గురించి ఆయన నాకు ఎప్పుడు చెప్పారో సరిగ్గా గుర్తు లేదు, కానీ నాన్న దాని గురించి నాకు చెప్పడం గుర్తుంది.

Photo by Omkar Pandhare on Pexels.com

తాను  తనిఖీ పర్యటనలో ఉన్నానని, భోపాల్‌ను దాటానని చెప్పారు. దారిలో ఉండగానే భోపాల్‌లో గ్యాస్ లీక్ అయిన విషయం ఆయనకు తెలిసింది. వెంటనే సహాయక చర్యలను పర్యవేక్షించడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఆయన తన ‘జిఎం ఇన్‌స్పెక్షన్ సెలూన్‌’లో భోపాల్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గ్యాస్ లీకైన అదే రోజు రాత్రి భోపాల్‌కు తిరిగి వచ్చారు. ఆ రాత్రి భోపాల్‌లో రైళ్లు ఆగకుండా చూసుకుంటూ, సమీపంలోని స్టేషన్‌ల నుండి భోపాల్‌కి అవసరమైన రైల్వే వైద్య సదుపాయాల రాకను కూడా సమన్వయం చేశారు. ప్రాణనష్టాన్ని తగ్గించడానికి, తన సహోద్యోగులతో కలిసి రాత్రంతా సహాయ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ గడిపారు నాన్న. ఆ ప్రయాణంలో మా అమ్మ కూడా నాన్న వెంట వెళ్ళింది. ఆమెను ఇన్‌స్పెక్షన్ సెలూన్ లోపలే ఉంచి తలుపులు, కిటికీలు మూసివేసారు. ఆ దురదృష్టకరమైన రాత్రి పూట అమ్మానాన్నలిద్దరూ భోపాల్ స్టేషన్‌లో గడిపారు.

మా నాన్న చెప్పిన విషయాలు నాకింతే గుర్తున్నాయి. అయితే భోపాల్ స్టేషన్‌లో వారు గడిపిన ఆ రాత్రి ప్రభావం కొన్నేళ్ల తరువాత నుంచీ మా కుటుంబం అనుభవించింది. మా నాన్న చక్కటి ఆరోగ్యం, అపరిమితమైన శక్తి, నిరంతరం  ఉత్సాహంగా ఉండే  వ్యక్తి. అయితే,  భోపాల్ స్టేషన్‌లో ఆ రాత్రి గడిపిన కొద్దికాలం తరువాత  నాన్నకి గుండె సంబంధిత సమస్యలు వచ్చాయి. రెండుసార్లు స్టెంట్ వేశారు, చివరికి 1997లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆ రాత్రి భోపాల్ స్టేషన్‌లోని క్లోజ్-అప్ సెలూన్‌లో గడిపిన తర్వాత జీవితాంతం శ్వాస సమస్యలను ఎదుర్కొంది అమ్మ. డిసెంబరు 1984లో భోపాల్ స్టేషన్‌లో ఆ రాత్రి  గడిపినప్పటి నుంచి వాళ్ళ ఆరోగ్యం క్షీణించింది. 2004లో అమ్మ 68 ఏళ్లకే మరణించింది, మా నాన్న మూడేళ్ల తర్వాత 2007లో 73 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆ రోజు లీక్ అయిన గ్యాసే మా అమ్మానాన్నల ఆరోగ్య సమస్యలకి కారణమని  ఎప్పుడూ నిర్ధారణ కాలేదు. కానీ అదే కారణం అని వారిద్దరికి,  నా సోదరికి, నాకూ నమ్మకం.

(రచయిత్రి కుటుంబం – ఎడమ నుంచి కుడికి – సాధనా శంకర్, మాలతీ శంకర్, గౌరీ శంకర్, సంగీతా వర్మ)

బహుశా భోపాల్లో ఆ రాత్రి తరువాత వారి ఆరోగ్యం క్షీణించటం ఆ రాత్రే తదుపరి ఆరోగ్య సమస్యలకు కారణమై ఉండవచ్చు అన్న ఆలోచన కలిగించింది. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో ఆ సిరీస్ చూడటానికి నేను ధైర్యం చేయలేకపోయాను. మా నాన్న స్నేహితులు, ఎందరో రైల్వే సిబ్బంది, ఇంకా దానిని వీక్షించిన వ్యక్తుల నుండి ప్రతిరోజూ నాకు ఎన్నో సందేశాలు వస్తున్నాయి. చివరికి గత వారం, మావారితో కలిసి కూర్చుని రెండు సిట్టింగ్‌లలో ఆ సిరీస్‌ని చూశాను.

నాన్న దూరదృష్టి, ధైర్యం నాకు బాగా తెలుసు. నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసే వ్యక్తి నాన్న. ఇది జీవితంలోనూ, పనిలోనూ ఆయన లక్షణం. దేనికీ తలవంచని ఆయన స్ఫూర్తి తరచుగా నాలోని తిరుగుబాటుదారును  బయటకు తెచ్చేది కాబోలు,  ఫలితంగా మేము తరచుగా పోట్లాడుకునేవాళ్ళం. నాన్న మరణం తర్వాత  – అది గుర్తొచ్చి – నేను చాలా కాలం పాటు బాధపడ్డాను. నేను పెద్దయ్యాక ఆయన్ని బాగా అర్థం చేసుకున్నాను. అప్పుడప్పుడు  నా ప్రవర్తనలో, స్వభావంలో మాటల్లో మెరుపులా ఆయన కనబడతారు.

శ్రీ గౌరీ శంకర్

 

శ్రీ గౌరీ శంకర్

అయితే మా నాన్న ఓ హీరో అని నేనెప్పుడూ గ్రహించలేదు. తన సిబ్బంది పట్ల,  రైలు  ప్రయాణీకులపట్ల తన కర్తవ్యం నిర్వహించడం కోసం – తన ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి నాన్న. తన ‘ఇన్‍స్పెక్షన్ సెలూన్‍’ని భోపాల్‌కి వెనక్కి తిప్పాలనే  నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు? విషపూరితమైన, ప్రాణాంతకమైన వాయువు నగరాన్ని కమ్మేస్తోందని తెలిసినప్పటికీ,  సరైన పని చేయాలనే సంకల్పం, అమేయమైన శక్తి ఎక్కడ నుంచి పొందారు? ఇది అపురూపమైనది.

నాన్న పశ్చిమ యుపిలోని ఒక చిన్న గ్రామానికి చెందినవారు. సొంతంగా కష్టపడి ఎదిగిన వ్యక్తి.  భయంకరమైన మృత్యువు విషవాయువు రూపంలో పొంచివున్న ఆ రాత్రి  ‘ఇన్‍స్పెక్షన్ సెలూన్’లో తిరిగి భోపాల్ వైపు వెళ్లినప్పుడు ఆయన ఏమి ఆలోచించి ఉంటారు? తనతోనే ఉన్న భార్య లేదా వేర్వేరు నగరాల్లో ఉంటున్న తన ఇద్దరు కుమార్తెలు ఆయనకు గుర్తు రాలేదా? 1954లో సివిల్ ఇంజనీర్‌గా చేరినప్పటి నుండి రైల్వే, తన పని నాన్నకి ప్రాణంగా ఉండేవి. నాన్న, ఒక క్షణం పాటు అయినా, భోపాల్ వెళ్ళాలనే తన నిర్ణయాన్ని తీసుకునేందుకు సందేహించారా? నిశ్శబ్దంగా, భయంకరంగా, ప్రమాదభరితంగా వున్న నిర్మానుష్యమైన  భోపాల్ స్టేషన్‌లో ఆ రాత్రి అడుగుపెడుతూన్నప్పుడు ఒక్క క్షణం సేపయినా ఆయనకు భయంగా అనిపించి వుంటుందా?

 

ఇక మా అమ్మ – లక్నో విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయిన ఆమెకి తన సొంత అభిప్రాయాలుండేవి, దృఢ సంకల్పం ఉండేది. నిబ్బరంగా ఉండే మహిళ. ‘ఇన్‌స్పెక్షన్ సెలూన్’ యూ-టర్న్ తీసుకుంటున్నప్పుడు అమ్మ ఏమనుకుని వుంటుంది? ఆమె నాన్నని నిలదీయడానికి ప్రయత్నించిందా? తన భద్రత కోసం మధ్యలో ఏదైనా స్టేషన్‌లో దిగిపోవాలని ఆలోచించి వుంటుందా? చివరకు, నాన్నతో పాటు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె తన ప్రాణాల  గురించి భయపడిందా? దురదృష్టకరమైన ఆ రాత్రి పూట సెలూన్‌లో తలుపులు, కిటికీలు మూసుకుని ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆమెకి ఏమేం ఆలోచనలు వచ్చుంటాయి?

వేదికపై పింక్ చీరలో శ్రీమతి మాలతీ శంకర్

కానీ జీవితంలో నా స్వంతంత్ర  మార్గాన్ని కనుగొనే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్న నేను ఆ సమయంలో ఈ ప్రశ్నలేవీ అడగలేదు. ఆ తర్వాత కూడా అడగలేదు. నేనెప్పుడూ వాటి గురించి ఆలోచించలేదు. నా వరకు నాకు – అది వారు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం  వారి జీవితకాలాన్ని తగ్గించిందని నేను నమ్ముతున్నాను.

బహుశా వారి కూతురిని కావడంతో, ఆ నిర్ణయం ఆవశ్యకత, ఆ నిర్ణయంలో ఇమిడిన సాహసోపేత స్వభావం నాకెప్పుడూ తట్టలేదు. ఒక సంస్థగా రైల్వేకు, రైల్వే కార్మికులకు, ఇంకా ప్రయాణీకులకు – ఆ వీరోచిత చర్య ఎలా ఉపకరించిందో నాకు ఎన్నడూ అర్థం కాలేదు. బహుశా నా సోదరి కూడా ఆ సంఘటనను ఈ కోణంలో ఎప్పుడూ చూసి ఉండదు. ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లోని ఒక సిరీస్‌లోని జరిగిన సంఘటనలను  నాటకీయంగా ప్రదర్శించే  బాహ్యమైన, తటస్థమైన ప్రక్రియ ద్వారా – తల్లిదండ్రులు దేని కోసం నిలబడ్డారో గ్రహించేందుకు కొన్నిసార్లు వీలవుతుంది. ఆ రోజు ఆయన తీసుకున్న ఆ  ఒక్క నిర్ణయంతో ఎన్ని జీవితాలు రక్షించబడ్డాయో! ఎన్ని ప్రాణాలు నిలిచాయో!!!

ప్లాట్‌ఫారమ్‌పై – రిలీఫ్, ఇంకా రెస్క్యూ టీమ్‌లకి మార్గనిర్దేశం చేస్తున్న మా నాన్నను ఊహించుకుంటున్నాను. తను రైల్వేలోని సీనియర్ మోస్ట్ అధికారి. తనకూ తన భార్యకు కూడా తీవ్ర ప్రమాదమని తెలిసినా – పనిని పర్యవేక్షించేందుకు, బాధ్యతను నిర్వహించేందుకు అత్యున్నత స్థాయి అధికారి అక్కడ నిలబడి ఉండడం చూసి స్టేషన్‌లో పని చేస్తున్న వారందరూ ఎంతలా ప్రేరణ పొందారో, ఎంత ఉత్సాహం నింపుకున్నారో!!! ఆలోచిస్తే  నా గొంతులో ఏదో అడ్డం పడుతోంది. ఇది దుఃఖపు అనుభూతి కాదు. గాఢమైన, శాశ్వతమైన గర్వపు భావన ఏదో నా కంటి చెమ్మకి కారణమవుతోంది.

ఆ రాత్రి మా నాన్న తనను నమ్మి తనపై ఆధారపడిన వారందరికీ – తన కుటుంబానికీ, రైల్వేకీ, ఇంకా రక్షించబడిన వారందరికీ భరోసా కల్పించారు!!!!

ఆంగ్ల మూలం: సాధనా శంకర్

అనువాదం: కొల్లూరి సోమ శంకర్

Author, and her family Photos courtesy: Sandhna Shanker

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here