మా పుట్టింటి తోట భోజనాలు

0
13

[dropcap]“మా[/dropcap]ధవీ పది రోజుల ముందే ఫోన్ చేస్తున్నాను. నువ్వూ, అన్నయ్యగారు పిల్లల్ని తీసుకురండి. మీ అత్తగార్నీ, ఇంకా ఎవరైనా దగ్గర బంధువులు గాని, స్నేహితులు గాని వచ్చే వాళ్లుంటే మీతో పాటు తీసుకురండి.”

“వదినా! ఇదేమైనా పెళ్లా? బంధుమిత్ర సపరివారంతో రావటానికి?”

“పెళ్లిళ్ళూ, ఫంక్షన్లూ ఎవరైనా చేసుకుంటారు. ఇలాంటి వన సమారాధనలు, ఇళ్లల్లో తక్కువ మందే జరుపుతారు. మనకంటే తోట, తోటలో పెద్ద ఇల్లూ వుంది కాబట్టి నలుగుర్నీ పిలిచి చెయ్య్గలుగుతున్నాం. మీలాంటి వారందరి కోసమే, ఆదివారం పెట్టుకున్నాం. సరే వుంటా” అంటూ వదిన సుశీల ఫోన్ పెట్టేసింది.

మా అన్నా వదినలు సిరిపురంలో ఉంటారు. నాలుగైదేళ్ళుగా బంధుమిత్రులందరినీ పిలిచి కార్తీక వన సమారాధన వేడుకగా జరుపుతున్నారు. ఈ సంవత్సరం కూడా కార్తీక బహుళ పక్షదశమీ ఆదివారాన పూజా, ఆ తర్వాత విందు భోజనం ఏర్పాటు చేశారు.

***

వచ్చిన అతిథులు తోటలో వున్న సిమెంటు బెంచీలపై కూర్చుని కబుర్లలో పడ్డారు. విశాలమైన పండ్లతోట కనువిందు చేస్తున్నది. అన్నయ్య వాళ్లది సువిశాలమైన భవంతి. భవంతికి నాల్గువైపులా ఏపుగా పెరిగిన వృక్షాలు. తోట మధ్య నుండి రాకపోకలకు వీలుగా చక్కని విశాలమైన దారులు. దారుల కిరుప్రక్కలా ఆరోగ్యకరమైన గాలిని ప్రసరింపచేస్తూ వేప, కొబ్బరి లాంటి చెట్లు ఠీవిగా నిలబడి వున్నాయి. ఈ దారుల్లో పరుగులు పెడుతూ, చెట్టు చెట్టును పలుకరిస్తూ, విరిసిన పూలను చూసి మురిసిపోతూ, నా చిన్నతనాన్నంతా ఇక్కడే గడిపాను. సందర్భం వచ్చినప్పుడల్లా అమ్మమ్మగారింటి సోయగాల్ని గురించి నా పిల్లలకు వర్ణించి చెప్తూ, వీలున్నప్పుడల్లా, వాళ్లనీ తీసుకొస్తూ వుంటాను. ఈ రోజు కూడా కళ్లెత్తి నలువైపులా చూసుకుంటూ మనసునిండా సంతోషాన్ని నింపుకుంటూ తిరుగుతూ, అతిథుల్ని పరామర్శిస్తున్నాను. ఉదయం పదిన్నర గంటలైనా చెట్లనీడల వాతావరణం హాయిగా, చల్లగా, శరీరాన్ని, మనసుల్ని కూడా సేద తీరుస్తున్నది. జామ, సపోటాల ఫలవృక్షాలు పండ్ల భారంతో నిండుగా కనుపిస్తున్నాయి. వాటి మధ్యలో చిక్కుడు, కాకర, ఆనపలాంటి కూర పొదలు చీడపీడ ఏమీ లేకుండా నవనవలాడుతూ వున్నాయి. సోంపు, రుద్రజడ లాంటి మొక్కలు గుబురుగా పెరిగి సువాసనలు నింపుకుని చూపరులను కట్టిపడవేస్తున్నాయి. కార్తీకమాసంలో ఉసిరిచెట్టు క్రింద దీపారాధన, పూజ చేయ్యాలని పెద్దవారు చెప్తూ వుంటారు. ఆ మాట ప్రకారంగానే ఆ చెట్టు కాండం చుట్టూ కొంత మేర పుసుపు పూసి, కుంకుమ, గంధాలతో బొట్లు పెట్టింది వదిన. అక్కడే నాలుగు వైపులా కృష్ణ తులసి, లక్ష్మీ తులసి మొక్కలు తలలూపుతూ నిలబడి వున్నాయి. వాటి మధ్యలో పసుపు పచ్చని రంగులో వున్న చేమంతి పూలు ఆకులు కనపడకుండా విరగబూసి ఆకాశంలోని నక్షత్రాలను గుర్తుకు తెస్తున్నాయి. ఉసిరిచెట్టు పాదు చుట్టూ నున్నటి వెడల్పాటి రాళ్లు పరిచి వుంచారు. ఆ రాళ్ల మీద దేవతా పటాలు, దీపపు ప్రమిదలు పెట్టుకోవటానికి బాగా వీలుగా వున్నది. ముందే నీళ్లు చిలకరించి, వరి పిండితో ముగ్గులూ, వాటిని పసుపు, కుంకాలతో అలంకరించి వుంచింది వదిన ఆ ప్రదేశాన్నంతా. భక్తి భావం లేని వారిని కూడా పూజా కార్యక్రమానికి కదిలించేటట్లుగా వున్నది ఆ వాతావరణం.

“టీలు త్రాగటం ఇక ఆపెయ్యాలి. చాలామంది అతిథులు వచ్చేశారు. ఇక పూజకు కూర్చోండి” అంటూ కుసుమ గారు పూజాకార్యక్రమానికి సిద్ధపడిపోయ్యారు.

శివకేశవులు, లలితా, లక్ష్మీ, గాయత్రి దేవతలు తమతమ పీఠాలను అధిరోహించారు. మా వదిన ఎక్కడెక్కడ సేకరించిందో తెలియదుగాని, కుబేర దీపాలు, దేవతామూర్తులుండి రకరకాల భంగిమల్లో వున్న ఇత్తడి దీపాలు, మట్టి, వెండి ప్రమిదలు అన్నింటినీ, పేర్పించి సిద్ధంగా వుంచింది. ఆవునేతితో తడిపిన వత్తులు అన్ని ప్రమిదలలో అమరాయి. మరికొన్ని ఉసిరికాయలు ఆవునేతి వత్తులను ఇముడ్చుకుని ఒక ప్రక్కకు వుంచబడ్డాయి. విఘ్నేశ్వర ప్రార్థనతో పూజ మొదలయ్యింది. ఉసిరిచెట్టు క్రిందే దేవతాపీఠాలకు కొద్ది దూరంలో, రాళ్లతో పొయ్యి అమర్చబడి వున్నది.

“అమ్మా! మాధవీ! ఇంటి ఆడపడుచువు. కట్టెలు వెలిగించు. ఇత్తడి గిన్నెలో పాలు పోసి పొయ్యి మీద పెట్టు. పాలు పొంగు రాగానే ముందుగా ఒక గుప్పెడు బియ్యం నువ్వు వెయ్యి. ఆ తర్వాత మిగతా వారు తలో గుప్పెడు వేస్తారు. నానపెట్టిన బియ్యంలో పప్పు బద్దలు కలిపారుగా” అంటూ మా పెద్దమ్మ సూచించింది.

“ఉసిరిచెట్టు క్రింద రాళ్లపొయ్యి పెట్టి ఇత్తడి గిన్నెలో పాలు పొంగించి పొంగలి చెయ్యటం చాలా బాగుంది. ఎన్నో రోజుల తర్వాత ఇలాంటి దృశ్యాన్ని చూస్తున్నాం” అన్నదొకామె సంతోషపడుతూ.

“సంకల్పం చెప్తున్నాను. ఎవరి గోత్రనామాలు వాళ్లు చెప్పుకోండి. సుశీలగారూ! మీరు యజమానురాలు, పూజ శ్రద్ధగా చేయండి. మధ్యలో లేవవద్దు. అతిథులకు కొబ్బరినీళ్లలాంటివి వేరే ఎవరైనా ఇస్తారు” అంటూ కుసుమగారు వదిన్ను పూజ మధ్యలో నుండి లేవనివ్వలేదు. ఉసిరిచెట్టు నాల్గు వైపుల నుంచీ ప్రమిదల కాంతులు ప్రసరిస్తున్నాయి. ఆ వెలుగులకు భంగం రాకుండా పూజ దగ్గర కూర్చున్నవారు అక్షితలతో, పూలతో దేవీదేవతలకు పూజ చేస్తున్నారు. పూల సజ్జెలు ఖాళీ కాకుండానే మా పిల్లలూ, మరి కొందరు కలిసి రంగురంగుల మందారాలూ, తులసి, మారేడు దళాలు తెంపుకొచ్చి అందిరికీ సరిపడా అందిస్తున్నారు. అప్పుడే చెట్ల నుండి సేకరించుకొస్తూ వడలని, నలగని పూలలాంటి  ద్రవ్యాలు, ప్రాచీన మునివాటికలను గుర్తు చేస్తున్నాయి.

పట్నాల నుండి వచ్చిన అతిథులు కొందరు ఆసక్తిగా చెట్టు చెట్టునూ, కాయ కాయనూ, పువ్వు, పువ్వూను పలుకరిస్తూ తోటంతా తిరుగుతున్నారు. జామకాయలను కొరికి తినే రామచిలుకలూ, కొమ్మలపై వాలి వున్న గోరువంకలు కనువిందు చేస్తున్నాయి. తోకలు పైకెత్తి ఫింఛంలా విప్పుతూ తిరిగే పిట్టలూ, అవి పెట్టిన గూళ్లూ ముచ్చట గొలుపుతున్నాయి. ఏదో గురుకులంగా లాగా వుంది ఈ ప్రదేశమని కొందరు మెచ్చుకుంటుంటే మరి కొందరు ఫాంహౌస్ లాగా ముచ్చటగా వున్నదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏటా వినే కబుర్లే అయినా నా పుట్టింటిని అలా మెచ్చుకుంటుంటే నాకు ఎంత సంతోషంగా వుంటుందో చెప్పలేను.

వచ్చిన వారిలో బన్నూ అనే పిల్లవాడు అంటున్నాడు “తాతా! ఈ చెట్టుకు తగిలించిన ప్లాస్టిక్ డబ్బా చూశావా? దీనికున్న క్రింద అరలోని ఖాళీలోంచి ఉడుతలు పిట్టలూ లోపలికి నోరు పెడుతున్నాయి. డబ్బాలోపలుంచిన సజ్జలు, జొన్నలూ వాటి నోటి కందుతున్నాయి. ఆ గింజలు తిని ఈ నీళ్ళగోళెంలోని నీళ్లు తాగి అవి ఎగిరిపోతున్నాయి. రంగుగంగుల సీతాకోకచిలుకలు కూడా బోలెడున్నాయి. నేనొక జామకాయ ఫ్రెష్‌ది కోసుకుని తిన్నాను. ఎంత బాగుందో! మీ అందరికీ కూడా తెచ్చేదా!” అని అడిగాడు.

“పిల్లలకేం తోచక గోల పెడతారేమో అనుకున్నాను. వీళ్లకూ బాగానే సంబరంగానే వుంది” అంటున్నారు వాళ్ల తాతగారు.

“పొంగలి కూడా పూర్తయింది. ఈ లింగాష్టకంతో పూజ పూర్తి చెయ్యిండి. ఒంటి గంట దాటుతుంది” అని పెద్దవారు హెచ్చరిస్తున్నారు. “లలితా, విష్ణు సహస్రనామాలు, కార్తీకమాసవైశిష్ట్యం అంతా పూర్తి చేశారు. హారతులు ఇద్దాం.  ఎవరి కొబ్బరి కాయలు వారు కొట్టుకోండి. వాయుదేవాయనమః ఆట్టేగాలి వీచకు అని ప్రార్థించాం కదా?  మన ప్రార్థన ఆలకించాడు. ఆరు బయటకదా! అయినా కుంభవత్తులతో సహా దీపాలన్నీ ఎంత బాగా వెలుగుతున్నాయో చూండండి. మరలా నెయ్యి వడ్డించండి.”  అన్నారు కుసుమగారు.

“అంతేనా? మన పూజ మెచ్చినట్లగా దేవుని పటాల నుంచి ఒక్కొక్క పూవ్వూ క్రిందకి రాలుతూ మనకు ఆ భగవంతుని ఆశీర్వచనం దొరుకుతున్నది” అని మరొకరన్నారు.

“చెట్ల క్రింద కూర్చున్న మగవారిని పిలవండి. రోజూ ఉద్యోగాల్లో తీరికలేకుండా వుంటారు. ఇళ్ల దగ్గర ఎలాగూ దీపం పెట్టరు కాని ఈ రోజైనా వారి చేత ఈ ఉసిరి దీపాల్ని పెట్టింద్దాం” అంటూ మగవారికి కబురు పంపించారు. వారు రాగానే ఆడవారంతా లేచి వారికి దారి ఇచ్చారు. వారంతా కూడా దీపం వెలిగించి శ్రద్ధగా నమస్కరించుకున్నారు.
“నివేదన కొరకు మహా నైవేద్యం తీసుకుని రండి” అనగానే నైవేద్యాన్ని సమర్పించారు. “సర్వేజనా సుఖినోభవంతు” అనే శాంతి మంత్రంతో పూజా కార్యక్రమం పూర్తయింది.

నీకూ నాకూ సుఖం అని కాకుండా సర్వప్రాణికోటికీ సుఖశాంతులు కావాలి అనే ప్రార్థన మన భారతీయ సంస్కృతికే తలమానికంగా వుంటుంది.

ఆ తర్వాత అందరూ గోపూజకంటూ బయలుదేరారు. తల్లిగోవు మాలక్ష్మి, కూతుళ్లు సర్వమంగళ, సులక్షణ మా వదిన పెంపుడు కూతుళ్లు. మూడు ఆరోగ్యంగా ముచ్చటగా, కామధేనువుల్లాగా నిలబడి వున్నాయి తోట మధ్యలో. తాడు ఎప్పుడు విప్పుతారా అన్నట్లుగా ఎదురచూస్తున్నాయి. వచ్చినవారితో గోపూజ చేయించుకుని యజమానుల దగ్గర గారాలు పోతూ, అరటి, జామ పండ్ల ఆరగించాయి. వాటికి మేతకు విప్పే సమయమైందని కట్టుగొయ్యి తాడు విప్పగానే సర్వమంగళ, దగ్గర్లో వున్న నీళ్ల కుళాయి దగ్గర ఆగింది. తన నోటితో నీటి కుళాయిని తిప్పింది. నీరు రాగానే మెడ ముందుకు చాచి నీటిని తాగి మేతకు వెళ్లిపోయింది. ‘కుళాయిని విప్పటం వచ్చింది కాని, కట్టేయటం రాలేదు కాబోలు’ అనుకుంటూ మురిపెంగా చూశారు వారంతా సర్వంగళ వైపు. సులక్షణ అతిథులవంక చూసుకుంటూ అమ్మతో కలిసి ముందుకు సాగింది పచ్చిమేత వున్న వైపుకు. నా చిన్నప్పటి నుండి ఇంట్లో ఆవుల్ని పెంచుతూనే వున్నారు. బొట్టు పెన్సిల్ తీసుకుని వాటి ముఖాన బొట్టు దిద్దేదాన్ని. నేను గోరింటాకు పెట్టుకున్నప్పుడల్లా వాటి ఒంటి మీదా గోరింటాకు పెట్టేదాన్ని. అందరి మనస్సులో ఒక పరవశం. ఒక ఆనందం. ఒక తృప్తీ నిండి ఎవరికీ ఆకలి అని అనిపించలేదు.

“రెండువుతుంది. ఇక భోజనాలు చెయ్యిండి” అని చెప్తే అప్పుడు కదిలారు భోజనాల వైపుకు. డిస్పోజబుల్ ప్లేట్లలో గుండ్రంగా కత్తిరించిన అరిటాకులు వేసి వుంచారు. కందాబచ్చలి కూర, గారె, పూర్ణం, పులిహోర లాంటి సంప్రదాయ బద్ధమైన వంటకాలు. ఆత్మీయిత, ప్రేమానురాగాలు కలిపి వడ్డించటంతో పదార్థాలకు మరింత రుచి పెరిగింది. భోజనాల తర్వాత ఎవరికి వారు స్వయంగా సోంపు గింజల్ని తుంచుకుని నోట్లో వేసుకున్నారు. వచ్చిన అతిథులెవ్వరికీ ఆ వాతావరణం నుంచి త్వరగా తిరిగి వెళ్లాలని లేదు. మరలా పిచ్చాపాటి కబుర్లు మొదలయ్యాయి.
“కుసుమగారూ! పూజా కార్యక్రమం బాగా జరిపించారు. దేవాలయాల్లో ఉన్నంత పవిత్రత అందమూ ఇక్కడ కూడా తీసుకొచ్చారు” అంటూ మనసారా అభినందించారు.

“నాదేముంది! అంతా మా వదిన సుశీలగారి సంకల్పబలం. ప్రతి సంవత్సరమూ ఇలా, అందరం కలుసుకునేటట్లు అన్ని ఏర్పాట్లు చేసి ఖర్చుకు, శ్రమకూ వెరవకుండా అతిథులందరినీ మా తోటలో సేదదీరుస్తున్నారు. టౌనుల్లో వుండేవాళ్లు ఏ తోటలకు వెళ్తారు? వనభోజనాలంటూ ఏ గుళ్లోకో, కల్యాణమండపానికో వెళ్తున్నారు. కొంతమందికైనా ఇలా తోటలోనే భోజనాలు పెట్టిన పుణ్యం దక్కంచుకుంటున్నారు.” అన్నారు ఆవిడ.

“వచ్చిన వారందరికీ మన గుర్తుగా గిఫ్ట్ బాక్సులు అందివ్వమ్మా మాధవీ” అంటూ వదిన కేకవేసింది. సంవత్సరానికొక రోజైనా అతిథులకు యాంత్రిక జీవితాన్నుంచి మార్పునూ, హాయినీ పంచే మా అన్నావదినలు నిజంగా ధన్యులనిపించింది. అతిథులు తిరిగి బయలుదేరారు. మా పిల్లలు ఇంకా చెట్లలోనే తిరుగుతున్నారు. వాళ్లనిప్పడే ఇక్కణ్ణుంచి కదలించలేను అనుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here