మా రమణీయం – 3

0
14

ఇలా కూడానా!!

[dropcap]మా[/dropcap] రమణికి అన్నీ ఆశ్చర్యాలేనండీ. ఏ పనయినా మనమెంత వివరంగా చెప్పినా తనకి అర్థం అయిన పధ్ధతిలో చేస్తుంది. అంతే. ఆ రోజు ఇడ్లీకి నానబోసిన పప్పు మిక్సీ వెయ్యమన్నాను. ఏ మాటకామాటే చెప్పాలి. వెంటనే పని మొదలు పెట్టింది. నేను వేరే పనిలో వున్నాను. కొంచెం సేపయిన తర్వాత మెత్తగా రుబ్బిందో లేదోనని చూడటానికి వెళ్ళాను. మరి అంతకు ముందు అంతా పప్పు పప్పుగానే వుంది. మిక్సీ ఎదురుగా చేతులు కట్టుకుని చూస్తూ నుంచుంది. మధ్య మధ్యలో మిక్సీ మూతలోంచి బయటకి వస్తున్న పిండిని చేత్తో తీస్తోంది.

ఏమయింది అన్నా. ఇదేమిటో అయింది. పాడయినట్లుంది. ఇట్టా వస్తోంది అన్నది మళ్ళీ బయటకొచ్చే పిండిని చేత్తో తుడుస్తూ. పాడవ్వటం కాదు. నువ్వు పప్పు ఎక్కువ వేశావు అని చూద్దామని ఎంత నెమ్మదిగా మూత తీసినా లోపల చోటులేక ఉరుకులు పరుగులతో బయటకి పొంగుకొచ్చింది పలచగా వున్న ఆ పిండి.

ఆ రోజు మా అబ్బాయి వచ్చాడు. వాడికి గ్రీన్ టీ అలవాటు. రమణికి నేను సరిగ్గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వటం లేదనే అనుమానంతో మావాడు ఆ అమ్మాయికి తనే చెప్పాడు. ఒక కప్పు నీళ్ళు వేడి చేసి ఈ పేకెట్‌లో టీ బేగ్స్ వుంటాయి. ఒకటి వేసి ఇవ్వు, చక్కెర వెయ్యక్కరలేదు అని.

రమణి తెచ్చిన టీ చూసి ఫక్కున నవ్వాడు. టీ చూసి నవ్వుతున్నాడేంటా అని మా అనుమానం. మా రమణి టీ పెట్టిన విధానం చెబుతాను. మీరూ నేర్చుకోండి. నీళ్ళు వేడి చేసి టీ బేగ్ వెయ్యమన్నాడు కదా. నీళ్ళు వేడి చేసింది. టీ బేగ్ కూడా సరిగ్గా ఒక్కటే వేసింది. అయితే దాన్ని అలాగే వెయ్యకుండా చక్కగా చించి లోపలి పొడి వేసింది నీళ్ళల్లో.

మా రమణితో అయిన అనుభవంతో ఈ మధ్య చాలా చోట్ల వెలుస్తున్న ఇలా సహాయకులను పంపించే సంస్ధలకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే. మేము అత్యవసర పరిస్ధితుల్లో అవసరముండి, కొంతమందికి శక్తి వున్నా లేకపోయినా, బోలెడు డబ్బు ఖర్చు చేసి సహాయకులని పెట్టుకునే ధైర్యం చేస్తున్నాం. అందరికీ అన్ని వస్తువుల గురించీ తెలిసి వుండక పోవచ్చు. అన్ని పనులూ రాకపోవచ్చు. మీరు పంపేవారికి ముందు ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి, అందరి ఇళ్ళల్లో వాడుకునే సాధారణ పరికరాలని వినియోగించుకోవటం నేర్పించి పంపండి. వాళ్ళని మాకు సహాయకులుగా పంపుతున్నారుగానీ, మా దగ్గర ట్రైనింగుకి కాదని గ్రహించండి.

ఎప్పుడెప్పుడు అంగీకరించిన ఒక నెల కాంట్రాక్టు అయిపోతుందా అని ఎదురు చూసి రమణిని వెంటనే పంపేశామని మీరు గ్రహించారులెండి. మరి కొనసాగించే శక్తి నాకు లేకపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here