మా రమణీయం

2
15

[dropcap]ఈ[/dropcap] మధ్య మావారికి ఆరోగ్యం సరిగా లేదు. సరే అనారోగ్యాలు మనష్యులకు రాక మాకులకు వస్తాయా అని సరిబెట్టుకున్నాము. కానీ ఇంట్లో ఇద్దరమూ పెద్దవాళ్ళమే. అందులో ఒక వికెట్ డౌన్. అందుకే మా అబ్బాయి అమ్మా నాన్నల క్షేమం ఆలోచించి, వాళ్ళ ఫ్రెండ్ సలహామీద విజయవాడలో వున్న ఒక హెల్పర్స్‌ని పంపించే కంపెనీకి ఫోన్ చేసి, అమ్మా నాన్నలకి వంట, మందులివ్వటం వగైరా మొత్తం సహాయం చెయ్యటానికి ఒక మనిషిని పంపించమన్నాడు. వాళ్ళూ పాపం సేవా ధోరణిలో వున్నవాళ్ళయినా అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసి వెంటనే 22 ఏళ్ళ అమ్మాయిని ఒక నెల కాంట్రాక్టు మీద తీసుకువచ్చి దించారు. అంత పనీ వచ్చు, మీకు కావాల్సిన విధంగా మీరు చెప్తే చేస్తుందని.

ఇంక నా కలలు మొదలయ్యాయి. ఈ మధ్య నాకూ నీరసం, చికాకు పెరుగుతున్నాయి. ఏ పనీ చెయ్యలేక పోతున్నాను. నా కుమార రత్నం మంచి పని చేశాడులే, నాలుగు రోజులు విశ్రాంతిగా వుండచ్చు. ఆ అమ్మాయి పూర్తిగా ఇంట్లో వుండి అన్ని పనులూ చూసుకుంటుంది గనుక నేనింక విశ్రాంతితోబాటు ఈ మధ్య అనేక కారణాలవల్ల కుంటుబడిన నా పనులు కూడా చూసుకోవచ్చు అని తెగ సంబరపడిపోయాను.

మొదటి రోజు కూరలు ఎలా చెయ్యాలో చెప్పాను. పని అంతా వచ్చంది కదాని సాయంకాలం పాలు తోడెయ్యమ్మా అని చెప్పాను. నేను చూసుకోలేదు. వేశాను అని చెప్పింది. మర్నాడు ఉదయం 7 గంటలయింది. ఆ అమ్మాయి ఇంకా లేవలేదు. పోనీలే నేను కాఫీ తాగుదామని ఫ్రిజ్ లోంచి పాలు తీసుకుని కాఫీ కలుపుకున్నా. అంతలో అనుమానం. నిన్న పాలు తోడేసింది కదా, ఫ్రిజ్‌లో మళ్ళీ పాలు ఎలా వచ్చాయి. బహుశా తోడు పెట్టటం మర్చిపోయిందనుకున్నా. ఇంతలో లేచింది రమణి. వెంటనే అడిగేశాను. నిన్న పాలు తోడెయ్యటం మర్చిపోయావా అని.

లేదు. తోడేశాను అని ఘఠ్ఠిగా చెప్పింది. నాకనుమానం. ఎలా తోడేశావన్నాను. ఫ్రిజ్‌లో పాలున్నాయి కదా. వాటిలో తోడేశాను అన్నది. వాటిని కాచలేదా. కాచలేదు. వాటిలోనే పెరుగేశాను ఆ మాత్రం తెలియదా అన్నట్లు చెప్పింది. తోడేశాక ఏం చేశావంటే ఫ్రిజ్‌లో పెట్టేశాను అన్నది. నవ్వాలో ఏడవాలో తెలియక బి.పీ రైజ్ అయ్యి కొంచెం అరిచేసి, ఇంట్లో వాళ్ళ చేత నేను చివాట్లు తిని నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి నానా అవస్థా పడ్డాను. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే పనిమనిషి అవసరం, ఇంట్లో వుండే హెల్పర్ల అవసరం ఈ మధ్య అందరికీ ఏదో ఒక సమయంలో వస్తోంది. మీకు చేతావనీ అన్నమాట ఇది. అయ్యో. ఇదొక్కటే అనుకునేరు. ఇంకా చాలా వున్నాయి. మళ్ళీ చెబుతాను. అప్పటిదాకా నవ్వుకోండి మరి. అన్నట్లు మా రమణి చెప్పిన తేలిక పధ్ధతిలో పాలు తోడేసుకోండేం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here