మా శివకోటి తాతయ్య

0
11

[dropcap]చా[/dropcap]వా శివకోటి గారు 82 నిండి 83వ ఏట అడుగుపెట్టి కొద్దిరోజులే అయ్యింది. ఆయన 14 డిసెంబర్ 1940న ఖమ్మంకు అతి దగ్గర గ్రామం అయిన గోకినేపల్లిలో పుట్టారు. ఖమ్మం పట్టణం లోని తన కూతురు సౌరిస్ గారి ఇంట్లో 20 డిసెంబర్ 2022న కన్నుమూసారు. శివకోటి గారిది పరిపూర్ణ జీవితం. తన జీవితాన్ని ఎలా జీవించాలని అనుకున్నారో శివకోటి గారు అలానే బతికారు. ఖమ్మం నుండి సాహితీ రంగంలో విశేషమైన సేవ చేసిన వారిలో శివకోటి గారు ముందు వరుసలో ఉంటారు. కథలు, నవలలు, సాహితీ వ్యాసాలు, సమీక్షలు, చిన్నపిల్లల కథలు, కవితలు రాసారు. వ్రాయడం అంటే అప్పుడొకటి, ఇప్పుడొకటి అన్నట్టు కాదు. విస్తృతంగా రాసారు. తను రాసినవి తాను అచ్చువేసుకోవడం కాదు. ప్రముఖ వార, పక్ష, మాస పత్రికల్లో వచ్చాయి ఆయన రచనలన్నీ. మరణించే రోజున కూడా సంచిక వెబ్ మాగజైన్‌లో ‘నియో రిచ్’ అనే ఆయన రచన సీరియల్‌గా వస్తుంది. చివరి శ్వాస వరకు రచయిత గానే బ్రతికారు. ఇలాంటి అరుదైన సందర్బం చాలా తక్కువమంది రచయితల జీవితంలో చూస్తాము.

చదవడం ఆయనకు వ్యసనం. రాసుకోవడం ఇష్టం. స్నేహం చేయడం ఆయన నైజం. వయసుతో పని లేదు. చిన్నా పెద్ద అన్న పట్టింపు లేదు. ఎవరితో అయినా స్నేహం చేయగలరు. స్నేహంలో ఉన్న మాధుర్యాన్ని ఎదుటి వారికి పంచగలరు. అలాంటి శివకోటి గారితో నాకు పరిచయం కలగడం ఈ జీవితానికి దొరికిన ఒక వరంగా భావిస్తాను. ఆయన ఈ క్షణం నా కంటికి కనపడరు. ప్రతీ ఉదయం నాకు క్రమం తప్పకుండా శివకోటి గారి నుండి వచ్చే కాల్ ఇక రాదు. ఇది నిజం. అయినా నా జీవితంలో ఆయనతో గడిపిన క్షణాలు ఎన్నటికి మరువలేను. నేను మా తాతతో కూడా అంత బంధాన్ని కొనసాగించలేదు. కానీ శివకోటి తాతతో పరిచయం అయిన దగ్గర నుండి ఆయన్ని వదిలి ఉండలేదు. సినిమాల్లో పనిచేయడానికి వచ్చిన దగ్గర నుండి కలిసి మాట్లాడుకోవడం తరుచూ కుదరకపోయినా కాల్స్‌లో మాట్లాడుకునే వాళ్ళం. రోజు మాట్లాడుకునే వాళ్ళం. అంతలా అల్లుకుపోయింది మా స్నేహం. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అంతా ఆయన దయే. నా మీద వెన్నెల వర్షంలా కురిసిన ఆ క్షణాలు ఎలా మొదలయ్యాయి అంటే..

2013వ సంవత్సరంలో జనవరిలో నేను చిక్కడపల్లి త్యాగరాయ గానసభ వీధిలో ఒక నెల రోజులున్నాను. చార్టర్డ్ అక్కౌంటెంట్ చదువు మీద దండయాత్రలు సాగిస్తున్న సమయమది. నేను నా దోస్తు పేరిచర్ల సునీల్ ఒకనాటి మధ్యాహం ‘అక్షరవాచస్పతి’ దాశరథి రంగాచార్య గారిని కలవడానికి వెస్ట్ మారేడ్‍పల్లి లోని వారి ఇంటికి వెళ్ళాము. ఆరోజు జవవరి 7, 2013. ఖమ్మం నుండి వచ్చాము అనగానే మమ్మల్ని మధ్యానం నిద్రపోయే సమయాన చిరాకు పడకుండా లోపలికి పిలిచారు. అప్పటికే చిన్న దాశరథి గారు మంచాన పడ్డారు. మమ్మలి చూసి సంతోష పడ్డారు. “మీ ఆత్మకథ  జీవనయానం చదివిన దగ్గర నుండి మిమ్మల్ని కలుసుకోవాలనే కోరిక పుట్టింది” అని నేనన్నప్పుడు ఆయన సంతృప్తిగా నావైపు చూడటం మర్చిపోలేను. కొద్దిసేపు మాట్లాడి వస్తుంటే.. వారి సతీమణి కమలమ్మ గారు “ఇదిగో బాబు మీది ఖమ్మం అంటున్నావు. గోకినేపల్లిలో శివకోటి అని ఒకతను ఉంటాడు. అతను దాశరథి గారికి చాలా చాలా ఇష్టుడు. వీలుంటే అతన్ని తప్పకుండా కలుసుకో. అతను రచయిత కూడా. ఈ మధ్య మోకాళ్ళ నెప్పులు వచ్చినట్టున్నాయి” చెప్పారు. అదిగో అప్పుడు నేను శివకోటి గారి పేరు మొదటి సారిగా విన్నది. అంతకు ముందు విన్నానేమో గుర్తులేదు. గుర్తులేదంటే విననట్టే భావించుకుంటాం కదా! కమలమ్మ గారు చేసిన ఆ పరిచయం దైవ సంకల్పంగా భావించుకుంటాను. ఆరోజు ఆమె అలా శివకోటి తాత గురించి చెప్పకపోతే జీవితంలో ఎంతో విలువైన బందాన్ని కోల్పోయేవాడిని. కమలమ్మ గారి ఋణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.

ఖమ్మం గ్రంథాలయంలో శైలజా పబ్లికేషన్ వాళ్ళు అప్పట్లో తరుచుగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసేవాళ్ళు. శైలజా పబ్లికేషన్స్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళలో రెండవరైన నరసింహ మూర్తి గారు నాకు మంచి పరిచయం. ఇంటర్మీడియట్ చదివే వయసు నుండి పుస్తక ప్రదర్శన వలన తెలుసు నాకు. మంచి పుస్తకాలు సజెస్ట్ చేసేవారు నాకు. 2013 సంవత్సరంలో పుస్తకప్రదర్శన పెట్టినప్పుడు వారు వెళ్ళాను. “హరీష్ గారని ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఇప్పుడు లేరు. పోయారు. వారు ఉన్నప్పుడు ఎన్నో పుస్తకాలు కొనేవారు. చదివేవారు. కొన్నవాట్లో తనకు తెలిసిన వారి అభిరుచి మేరకు ఆ పుస్తకాలు పంచేవారు. ఆయన కొన్ని కథలు రాసారు. ఆయన చనిపోయిన తరువాత ఆ కథలన్నీ సేకరించి హరీష్ గారి మిత్రుడు చావా శివకోటి పుస్తకంగా వేసారు” అంటూ నా చేతిలో పెట్టారు నరసింహ మూర్తి గారు.

శివకోటి గారి పేరు కమలమ్మ గారి దగ్గర విన్న నేను. ఆయన చిరునామా ఫోన్ నెంబర్ హారీష్ కథల పుస్తకంలో చూసి వెంటనే కాల్ చేసాను. ఆయన ఉండేది ఎక్కడో కాదు. మా ఇంటికి రెండు బజార్ల అవతల.

నాకు బాగా గుర్తు ఆయన్ని 14 ఆగస్ట్ 2013 మధ్యాహ్నం సమయాన కలుసుకున్నాను. ఆయన నా కవితలు చదువుతుంటే ఒక ఫోటో కూడా తీసుకున్నాను. అదిగో ఆనాడు అయిన పరిచయం ఆయన మరణించే రోజు వరకు కొనసాగింది. అతిశయోక్తి కాదు కానీ.. ఆయన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసేవరకు ఒకర్ని విడిచి ఒకరం ఉండలేనంతగా తాత మనవాళ్ళ అనుబంధం మా మధ్య పెనవేసుకుపోయింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here