కాజాల్లాంటి బాజాలు-115: మా వదిన మా వదినే..

0
8

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap] రోజు తాడో పేడో తేలిపోవాల్సిందే అనుకుంటూ పొద్దున్నే వదినకి ఫోన్ చేసేను. మళ్ళీ కట్ చేసింది. హూ.. ఏంటిదీ! ఇప్పటికి మూడ్రోజుల్నించి ఇదే వరస.. ఏ టైములో ఫోన్ చేసినా కట్ చేసి పడేస్తోంది వదిన. ఏంటో.. అర్థం కాలేదు. నామీదేమైనా కోపం వచ్చిందేమో అనిపించింది. మళ్ళీ అంతలోనే కోపం వస్తే ఓ నాలుగు కేకలేస్తుంది కానీ వదిన ఇలా ఫోన్ కట్ చెయ్యదు అని కూడా అనిపించింది. పోనీ.. అన్నయ్యకి ఫోన్ చేసి అడుగుదామా అనుకుని కూడా అనవసరంగా మా మధ్యకి అన్నయ్యని తేవడ మెందుకులే అని ఊరుకున్నాను. ఇవాళ ఇంకొక్కసారి ఆఖరిసారి వదినకి ట్రై చేసి, ఇలాగే కట్ చేస్తే అన్నయ్యకి ఫోన్ చేసి విషయమేంటో కనుక్కోవాలనుకుంటుంటే వదిన దగ్గర్నించే  వచ్చింది ఫోన్ కాల్.. హుర్రె అనుకుంటూ.. వెంటనే పలికేను.. “ఏంటి వదినా.. ఏమైందీ.. ఒంట్లో బాలేదా!” అంటూ కుశలప్రశ్నలు వేసేను.

“బానేవుంది.. కాస్త బిజీగా ఉన్నాను.. అందుకే ఫోన్ కట్ చేసేను. నువ్వెలా ఉన్నావ్!” అనడిగింది.

“మూడురోజుల్నించీ అంత బిజీగా ఏం చేస్తున్నావ్!” కుతూహలం ఆపుకోలేకపోయేను.

“పుస్తకం రాస్తున్నాను.” చల్లగా వినిపించిన వదిన మాటలు నాకు షాక్ కొట్టినట్లనిపించేయి.

“పుస్తకవా..!”

“ఔను.. పుస్తకవే.” నొక్కి మరీ వక్కాణించింది వదిన.

“ఎందుకూ.. ఏం పుస్తకం..!  అయినా అసలు నీకు రాయడం వచ్చా!” అర్థం పర్ధం లేని ప్రశ్నలే ననుకున్నా కూడా ఆపుకోలేక అడిగేను.

“ఎందుకేంటీ.. అందరూ ఎందుకు రాస్తారూ.. అందుకే.. మరింక ఏ పుస్తకమంటావా.. ప్రస్తుతం చాలా డిమేండ్ ఉన్న పుస్తకం. ఇంక నాకు రాయడం వచ్చో రాదోనని నీ అనుమానవా.. అయితే పుస్తకం చదివేక నీకే తెలుస్తుంది మీ వదిన ఎంత గొప్ప రైటరో!”

నా ప్రశ్నలెలా ఉన్నాయో వదిన జవాబులూ అలాగే ఉన్నాయనిపించింది. ఇంకిలా లాభం లేదని.. “అసలు సంగతేంటి వదినా! అన్నయ్యతో దెబ్బలాడేవా!” అన్నాను.

“ఇదిగో.. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడి నా మూడ్ చెడగొడతావనే ఈ మూడ్రోజుల్నించీ నీ ఫోన్ ఎత్తటం లేదు. ఇందాకే రాయడం పూర్తయింది. ఇంక పబ్లిషర్‌ని ఎవర్నైనా పట్టుకోవాలి. నీకెవరైనా తెల్సా..!” అనడిగి.. మళ్ళీ అంతలోనే.. “అయినా.. నీ మొహం.. నీకెవరు తెలుస్తార్లే..” అనేసింది.

నాకు ఆపుకోలేనంత ఉక్రోషం వచ్చేసింది. పోనీ.. పోనీ అని ఊరుకుంటుంటే అర్ధమొగుడనే ఆలోచనైనా లేకుండా ఇంత మాట అనేస్తుందా!

“ఎందుకు తెలీదూ! బోళ్డుమంది తెల్సు.. ఐనా.. మూడ్రోజుల్లో రాసిపడేసిన నీ పుస్తకాన్నిఏ పబ్లిషరూ తీసుకోడు కానీ నువ్వే వేయించుకో..” నాలో ఉన్న కసంతా వెళ్ళగక్కేసేను.

“మూడ్రోజులేంటీ.. మూడు పగళ్ళూ, నాలుగు రాత్రులూ నిద్రాహారాల్లేకుండా రాసేను. అసలు నేను ఏ సబ్జెక్ట్ మీద రాసేనో తెలిస్తే పబ్లిషర్స్ అంతా నా ఇంటి ముందు క్యూలు కడతారు. అసలా టైటిల్ వింటేనే అందరూ నోళ్ళు తెరిచేస్తారు తెల్సా!”

“ఏంటి వదినా టైటిలూ!” కుతూహలం ఆపుకోలేకపోయేను.

“చెప్తాను కానీ.. అప్పుడే ఎవరికీ చెప్పకు.. ఈ బుక్ పబ్లిష్ అయ్యేలోపల ఎవరైనా దీన్ని వాడేసుకోవచ్చు..”

“ఏంటది వదినా!”

“చెప్తున్నా.. జాగ్రత్తగా విను..” నేను చెవిని మొబైల్‌కి అంటించేసేను.

“కోడళ్లని లొంగదీసుకోవడం ఎలా!” ప్రతి అక్షరం పట్టి పట్టి చెప్పింది వదిన.

“హేంటీ..!” చేతిలోంచి జారి పడబోతున్న మొబైల్‌ని గబుక్కున పట్టుకున్నాను.

వదిన అదే మాట మరోసారి నొక్కి చెప్పింది.

“ఇదెక్కడి టైటిల్ వదినా.. అసలేవైనా అర్ధవుందా!” ధైర్యం తెచ్చుకుని అడిగేను.

“ఎందుకు లేదూ! భర్తలని లొంగదీసుకోవడం ఎలా, భార్యలని లొంగదీసుకోవడం ఎలా, ప్రేయసిని లొంగదీసుకోవడం ఎలా.. లాంటి టైటిల్సు ఉన్నప్పుడు ఇదెందుకు ఉండకూడదూ! ప్రస్తుతం అందరూ ఎదుర్కుంటున్న సమస్య కోడళ్లతోనే కదా! అందుకే దాని మీద రాసేను.”

“నా మొహంలా ఉంది. భార్యాభర్తలు ఒకళ్ళ నొకళ్ళు లొంగదీసుకోడానికి సవాలక్ష కారణాలుంటాయి. ముఖ్యంగా తిట్టుకుంటూనైనా కొట్టుకుంటూనైనా ఒకే ఇంట్లో పడుండాలి కనక అలాంటి పుస్తకాలూ, కథలూ  వచ్చేయి. కోడళ్ళని లొంగదీసుకోవల్సిన అవసరం అత్తలకి ఎందుకొస్తుందీ! కోడళ్ళే కదా అత్తారింటి కొచ్చేదీ.. లొంగదీసుకుంటే వాళ్ళు అత్తని లొంగదీసుకునే ఉపాయాలు చెప్తే బాగుంటుంది కానీ..”

నా మాటలింకా పూర్తి కానేలేదు.. వదిన అందుకుంది.

“నీ తెలివితేటలు అంతవరకేనని నాకు తెల్సులే.. తనింటి కొచ్చిన కోడలిని, తన కుటుంబ వారసురాలిని  తన దారిలో పెట్టుకోవల్సిన బాధ్యత అత్తదే కదా! అందుకే అదే రాసేను. ఈమధ్య చాలామంది అమ్మాయిలు అత్తారింటికొచ్చి, వాళ్ళ పుట్టింటి సాంప్రదాయాలూ, ఆనవాయితీలూ అత్తింట్లో అమలు జరిపేస్తున్నారు. మరింక అత్తింటి సాంప్రదాయాలకి నీళ్ళొదులుకోవల్సిందేనా అని ఆలోచించి అత్తలకి కోడళ్ళని ఎలా లొంగదీసుకుని తమ సాంప్రదాయాలని కొనసాగించాలో రాసేను.”

నాకు ఆపుకోలేనంత నవ్వొచ్చేసింది. నేను ఫకాలున నవ్వడం విన్న వదిన కాసేపు మాట్లాడలేదు. నేను నవ్వు నాపుకుని, “ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత స్వతంత్రంగా ఉన్నారో నీకు తెలీదా! వాళ్ళు ఇలాంటి పాత సాంప్రదాయాల గురించి చెప్తే వింటారా!” అడిగేను.

వదిన వెంటనే అందుకుంది.

“అదే అందుకే ఈ పుస్తకం. తిట్టి అమృతం తాగించలేం కానీ మెచ్చుకుని విషమైనా తాగించొచ్చనే మాట తెలీదా నీకూ! అత్తలకి అలాంటి చక్కటి ఉపాయాలెన్నో ఇందులో చెప్పేను నేను”.

“అయినా ఈ రోజుల్లో అత్తలతో కలిసి ఏ కోడళ్ళుంటున్నార్లే.. ..ఇప్పటి ఆడపిల్లలతో పడలేమని ఒకే ఊర్లో ఉన్నా సరే అత్తలే కొడుకు చేత వేరింటి కాపరం పెట్టించేస్తున్నారు. ఎప్పుడో ఓ సారి ఫ్రెండ్స్‌లా కలుస్తుంటారు. అదే బాగుంది అందరికీ.” అన్నాను నేను.

“అదే నేనూ చెప్పేది. ఒకే ఊర్లో ఉన్నప్పుడు అలా ఎందుకు వేరే పెట్టుకోవడం.. చక్కగా కలిసుంటే డబ్బు మాట పక్కన పెడితే ఒకరి కొకరు ఎంత సాయంగా ఉంటారూ! అలా ఉండాలంటే ఎలా ఉండాలో చెప్పేను”.

నాకు ఒళ్ళు మండింది. “అంటే అత్తలే అన్నింటికీ ఉపాయాలు వెతుక్కుంటూ కోడళ్ళతో సద్దుకుపోవాలా! కోడళ్ళ కేవీ బాధ్యతల్లేవా! కిందటి తరం అత్తలతో సద్దుకుని గడపి, ఈ తరం కోడళ్ళతో కూడా సద్దుకుపోవాలా మా తరం..”

నా ప్రశ్నకి వదిన దగ్గర్నించి నవ్వు వినిపించింది.

”నేనేవీ అత్తలని సర్దుకుపొమ్మని చెప్పలేదు. కోడళ్లని తమ దారిలోకి ఎలా తెచ్చుకోవాలో ఉపాయాలు చెప్పేను.”

“మరే పాపం.. కోడళ్ళు అమాయకురాళ్ళు. అత్తలు చెప్పగానే వినేస్తారు..” వెటకారంగా అన్నాను.

“వినరు కనకే ఎలా చెప్పి వినేలా చేసుకోవాలో చెప్పేను.” స్థిరంగా అంటున్న వదిన మాటలు నన్ను ఆలోచనలో పడేసేయి. నిజంగానే వదిన ఎంతకైనా సమర్థురాలే. కోడళ్లని బుట్టలో పడేసుకునే అవిడియాలు అత్తగార్లకి చెప్పిందంటే అది చాలా గొప్పవై ఉండాలి. కుతూహలం ఆపుకోలేకపోయేను.

“ఏంటవి వదినా!  మచ్చుకి ఒక్కటి వదులు..” సరదాగా అంటున్నట్టు వదినని ఆట పట్టించేను.

“ఆ.. మరే.. చెప్పేస్తారు పాపం.. పుస్తకం వచ్చేక కొనుక్కుని చదువు.. రేప్పొద్దున్న నీకు ఉపయోగపడుతుంది.” అంది తెలివిగా..

నా పిచ్చి కాకపోతే వదిన నా మాటల వలలో పడుతుందా! అయినా ఊరుకోలేక అడిగేను.

“వదినా, ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా కాలిక్యులేటెడ్‌గా ఉంటున్నారు కదా! నువ్వు చెప్పే పాతకాలం అవిడియాలకి పడతారంటావా!”

వదిన గొంతు హెచ్చింది.

“నా అవిడియాలు పాతవని ఎవరు చెప్పేరు! ఈ రోజుల్లో ఆడపిల్లల మనసుల్లో దూరి, వాళ్లకి ఏవి ఎలా కావాలో తెల్సుకుని, దానిని తీర్చడానికి అత్తలు ఏం చెయ్యాలో నా మేధస్సునంతా మథించి రాసేను. అలా చదవకుండానే తీసిపడెయ్యకు.”

వామ్మో.. వదినకి కోపం వచ్చినట్టుంది. ఆ పుస్తకంలో ఏవుందో చెప్పమంటే చెప్పదు. ఏదో మామూలు పుస్తకమే అనుకుందామనుకుంటే అలా అనుకోనివ్వదు.. ఈ వదినతో ఆడుకోవడం ఎలా అనుకుంటుంటే అద్భుతమైన ఆలోచన వచ్చింది.. ఈ రోజుల్లో పుస్తకాలు ఎవరు కొంటున్నారని.. వేయించుకున్న పుస్తకాలన్నీ రచయితలే అందరికీ ఉచితంగా పంచేస్తున్నారు అనుకున్నాను. అందుకే వదినతో,

“సరేలే.. తెలిసీ గోతిలో దిగుతుంటే ఎవరేం చెయ్యగలరు.. ఆ పుస్తకాలు ఎవరూ కొనరు కానీ ఇంటికొచ్చిన వాళ్లకి బొట్టు పెట్టి జాకెట్టుబట్టతో పాటు ఒక్కో పుస్తకం ఇచ్చెయ్యి. లేకపోతే ఇల్లంతా ఆ పుస్తకాలు చూసి అన్నయ్య కేకలేసినా వేస్తాడు.” అన్నాను.

వదిన ఏమైనా తక్కువదా! మరో బాంబ్ పేల్చింది.

“నీకంత లోకువైపోయేనన్న మాట. చూస్తూండు.. ఒక హారర్ స్టోరీ కూడా రాసేసి పబ్లిష్ చేసేస్తాను..”

“వామ్మో.. హారర్ స్టోరీయే. దాని పేరేవిటో..” భయపడుతున్నట్టు ఎగతాళిగా అడిగేను..

“ఆడపడుచుని అడ్డు తొలగించుకోవడ మెట్లా..!!” అంటూ ఫక్కున నవ్వేసింది మా వదిన..

నాకూ నవ్వొచ్చేసింది.

ఎంతైనా మా వదిన మా వదినే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here