కాజాల్లాంటి బాజాలు-136: మా వదిన మూడురోజుల ప్రయోగాలు..

4
12

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]మా[/dropcap] వదిన సంగతి నా కన్న మీకే బాగా తెలుసు కదా! ఎప్పుడూ ఏదో కొత్త ఆలోచన ఆవిడ బుర్రలోకి వస్తూనే ఉంటుంది. అలా ఆలోచన వచ్చాక ఊరుకుంటుందా.. అబ్బే.. అలా ఊరుకుంటే ఆవిడ వదిన ఎందుకు అవుతుందీ! ఆ ఆలోచనని ఆచరణలో పెట్టే మార్గాలు అన్వేషిస్తుంది. అలా ఆచరించడానికి వదినకి తోడుగా మనుషులు కావాలి. అదిగో సరిగ్గా అలాంటప్పుడు మా వదినకి మొట్టమొదటగా గుర్తొచ్చేది నేనే. అన్ని ప్రయోగాలూ నా మీదే. ఈసారి కూడా అలాంటి ఏదో ప్రయోగం చేస్తోందేమో ఎప్పట్లాగే పొద్దున్నే ఫోన్ చేసింది.

ఈ వదిన ప్రయోగాలతో బోల్డు దెబ్బలు తిని ఉన్న నేను అంతకుముందే ఏమైనా సరే వదిన ఫోన్ చేస్తే తియ్యకూడదనే నిర్ణయానికి వచ్చేసాను. అందుకే మొదటిసారి చెయ్యగానే తియ్యకుండా ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టేసాను. రెండోసారీ, మూడోసారీ కూడా చేసిన వదిన నేను ఫోన్ తియ్యకపోవడంతో మెసేజ్ పెట్టింది.

“స్వర్ణా, ఫోనెత్తు. మీ అన్నయ్య గురించి మాట్లాడాలి”

ఆ మెసేజ్ చూసాక నేను ఖంగారుపడుతూ వదినకి ఫోన్ చేసేను.

“ఏంటి వదినా.. అన్నయ్య కేమైందీ!” ఆత్రంగా అడిగాను.

“మూడుసార్లు చేసినా ఫోనెత్తకుండా మీ అన్నయ్య మాటెత్తేటప్పటికి ఎంత ఖంగారుగా ఫోన్ చేసావూ!”

వదిన మాటలని మధ్యలోనే ఆపేస్తూ,

“ఇంతకీ అన్నయ్యకి ఏమైంది వదినా!” అన్నాను.

“ఏమీ కాలేదు. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నారు.”

“ఏమీ కాకుండా అబ్జర్వేషన్ ఏంటీ! ఏ హాస్పిటల్!”

“అబ్బా.. అబ్జర్వేషనంటే హాస్పిటల్లోనే ఉండాలా! ప్రస్తుతం నా అబ్జర్వేషన్‌లో ఉన్నారు”

వదిన మాటలకి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను.

“ఇప్పుడేంటీ! పెళ్ళైనప్పట్నించీ అన్నయ్య ఉంటున్నది నీ అబ్జర్వేషన్ లోనే కదా! ఇవాళ కొత్తగా చెప్పాలా!”

నా వేళాకోళానికి వదిన కాసేపు మౌనం వహించింది. వదిన వెంటనే రిపార్టీ ఇవ్వకుండా అలా మాట్లాడకుండా ఉండదే. నా మాట పూర్తయేలోపే బాణం లాంటి సమాధానం వస్తుంటుంది అనుకుంటూ,

“ఏమైంది వదినా!” గొంతు తగ్గించి, కుతూహలంగా అడిగాను.

“నువ్వోసారి రాకూడదూ!” అంది. విషయమేదో సీరియస్సే అనుకుంటూ “ఇప్పుడే వస్తాను.” అంటూ ఫోన్ పెట్టేసి అరగంటలో అన్నయ్యా వాళ్ళింటికి వెళ్ళాను.

నేను వెళ్ళేసరికి అన్నయ్య సోఫాలో నిటారుగా బొమ్మలా కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు.

“అన్నయ్యా..” అని పిలిచాను. కళ్ళు తెరవలేదు, మాట్లాడలేదు.

వెనకనించి వదిన “ఉహూ.. డిస్టర్బ్ చెయ్యకు. మీ అన్నయ్య బ్రెయిన్ ప్రస్తుతం నా అధీనంలో ఉంది.” అంది నెమ్మదిగా.

ఇదేంటి.. రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు అన్నయ్య బ్రెయిన్ వదిన అధీనంలో ఉండడమేంటీ..

అర్థం కాక చూస్తున్ననన్ను పక్క గదిలోకి తీసికెళ్ళి నెమ్మదిగా చెప్పడం మొదలెట్టింది.

“మీ అన్నయ్యకి ప్రస్తుతం ప్రమోషన్ వచ్చే టైమ్ కదా.. కానీ మీ అన్నయ్యతో పాటు ఇంకో ముగ్గురు కూడా ఉన్నారుట ప్రమోషన్‌కి రెడీగా. వాళ్లని పక్కన పెట్టి మీ అన్నయ్యకి ప్రమోషన్ రావాలంటే వాళ్లకి లేని ప్రత్యేకత ఏదోటి మీ అన్నయ్యకి ఉండాలి కదా! అందుకని మూడు రోజుల్నించీ మీ అన్నయ్య బ్రెయిన్‌ని నా అధీనంలోకి తీసుకుని, అందులో చాలా చాలా ప్రత్యేకతలని నింపుతున్నాను. ఇంకాస్సేపటికి మూడు రోజులూ అయిపోతాయి. రిజల్ట్ చూసేటప్పుడు పక్కన నువ్వు కూడా ఉంటే మీ అన్నయ్య ప్రోగ్రెస్‌కి సంతోషిస్తావని నిన్ను రమ్మన్నాను.”

ఊపిరి పీల్చుకుందుకు ఆగింది వదిన.

నాకు బుర్ర తిరిగిపోయింది. ఈ మూడురోజుల గడువేవిటీ! బ్రెయిన్‌ని అధీనంలో ఉంచుకోవడం ఏవిటీ అని అర్థం కాకుండా చూస్తున్న నావైపు జాలిగా చూస్తూ వదిన అంది.

“అందుకే స్వర్ణా.. నిన్ను అప్డేట్ అవమని అస్తమానం చెప్తుంటానూ. మీ అన్నయ్య కూడా అంతే.. ఏదీ వినిపించుకోరు. ఇప్పుడు చూడు బాస్‌ని బుట్టలో వెయ్యడమెలా అనే సాఫ్ట్‌వేర్‌ని మీ అన్నయ్య బుర్రలోకి అప్లోడ్ చెయ్యడానికే ఆయన బుర్రని నా అధీనం లోకి తీసుకున్నాను.”

ఇంకా వెర్రిమొహం వేసుకు చూస్తున్న నన్ను చూసి వదిన వివరించింది.

“నువ్వు చూసే ఉంటావు.. ఆమధ్య ముఫ్ఫై రోజులలో వేరే భాష నేర్చుకోవడమెలా.. ముఫ్ఫై రోజుల్లో ప్రేమించడమెలా.. లాంటి బోల్డు కాన్సెప్ట్‌లు వచ్చాయి కదా! కానీ ఈ స్పీడ్ రోజుల్లో ముఫ్ఫై రోజులదాకా ఎవడు ఆగుతాడని నేనే మూడు రోజుల్లో వేరే భాష నేర్చుకోవడమెలా!.. మూడు రోజుల్లో ప్రేమించడమెలా.. లాంటి కాన్సెప్ట్‌లు కనిపెట్టేను. ఇదివరకైతే అది సరిగ్గా పనిచేస్తోందో లేదో చూడడానికి నీ మీద ప్రయోగాలు చేసేదాన్ని. కానీ ప్రస్తుతం మీ అన్నయ్య ప్రమోషన్ లిస్ట్‌లో ఉండడంతో ఆ ప్రమోషన్ మూడురోజుల్లో సంపాదించడమెలా అన్నది మీ అన్నయ్య మీదే ప్రయోగించొచ్చు కదా అనిపించింది..”

“కానీ అన్నయ్య..”

నా మాటలని మధ్యలోనే అందుకుని, “ మీ అన్నయ్య చెప్పగానే ఒప్పుకున్నారనుకున్నావా! ఎంత బెట్టు చేసేరనీ.. ససేమిరా లొంగనని బిగుసుకుపోయి కూర్చున్నారనుకో.. కానీ.. నేనా తగ్గేదీ.. హబ్బే.. అన్ని రకాలుగానూ ప్రయత్నించి విఫలమై ఆఖరికి బ్రహ్మాస్త్రం ప్రయోగించవలసొచ్చింది.”

“బ్రహ్మాస్త్రమంటే..”

“బ్రహ్మాస్త్రమంటే తెలీదా! అదే.. ఏడుపు.. నా కసలు ఏడుపంటే ఇష్టం ఉండదనుకో.. కానీ నిజంగా ఏడవట్లేదు కదా.. అంతా ఉట్టుట్టి నటనే కదా అనుకుంటూ కడవలకొద్దీ కన్నీరు కార్చేసేననుకో.. అంతే దెబ్బకి దిగివచ్చి మహానుభావులు ఈ మూడురోజుల ప్రయోగానికి ఒప్పుకున్నారు.”

“అంటే ఏం చేసేవు మా అన్నయ్యనీ..”

“స్వర్ణా, నీకు ఏదీ తెలీదు. అన్నీ నేనే చెప్పాలి. ఇప్పుడు మనం కొత్తది ఏం చెయ్యాలనుకున్నా ఇదివరకులా ఆ సబ్జెక్ట్ తెలిసున్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ల టైమూ, మన టైమూ పాడుచేసుకోనక్కర్లేదు. ఏదైనా సరే ఎంత సులభంగా, ఎంత తొందరగా చెయ్యొచ్చో ఒక్కసారి యూట్యూబ్ లోకి వెడితే తెల్సిపోతుంది. అందుకే ‘బాస్‌ని బుట్టలో వెయ్యడమెలా!’ అన్న విషయాన్ని యూట్యూబ్‌లో సెర్చ్ చేసేను. ఎంతమంది, ఎన్ని పధ్ధతులు చెప్పేరనుకున్నావూ.. వాటిలో ముఖ్యమైనవి కొన్ని తీసుకున్నాను. కానీ అవన్నీ ముఫ్ఫై రోజులు పట్టే ప్రయోగాలు. మరి మన దగ్గర అంత టైము లేదే.. అందుకని, వాటి సారాంశాన్నంటటినీ ఒక కాప్స్యూల్ లాగా చేసి కేవలం మూడురోజుల్లో వాటినన్నింటినీ మీ అన్నయ్య బుర్రలోకి ఎక్కించేసేనన్న మాట.”

వదిన చెప్పిన మాటల్లో ఒక్క ముక్క నాకు అర్థమయితే ఒట్టు. అసలు బుర్రలోకి ఎక్కించడమేంటీ.. ఏవైనా ద్రవపదార్థాన్ని ట్యూబ్ ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు కానీ అనుకున్నాను. అంతలోనే గుర్తొచ్చింది..అదేదో సినిమాలో హిప్నాటిస్ట్ పట్టాభిరామ్ గారనుకుంటాను శ్రీలక్ష్మి మెదడుని తన కంట్రోల్ లోకి తీసుకుని మెలకువ వచ్చాక ఆమె ఏమేం చెయ్యాలో ఆ బుర్రలో పెట్టేస్తారు. ఆ సినిమా చూసి నవ్వుకున్నాను కానీ అదే పరిస్థితిలో వున్న అన్నయ్యని చూస్తుంటే గాభరా లాంటిది వస్తోంది. అయోమయంగా చూస్తున్న నన్నుచూసి వదిన నవ్వింది.

“నీలాగే మీ అన్నయ్యది కూడా మొద్దు బుర్రే.. లేకపోతే ఈ పాటికే నేను చెప్పేది ఆయన ఆచరించి చూపిద్దురు. అబ్బే.. ఒకటికి రెండుసార్లు చెప్పినా ఓ పట్టాన ఆ బుర్రలోకి ఎక్కితేనా! అయినా సరే పట్టు వదలకుండా మూడురోజులూ బలవంతంగా కూర్చోబెట్టి ఎక్కించేసేను. ఇప్పుడు మనం మీ అన్నయ్యని యథాస్థితిలోకి తీసుకువచ్చి, ఎంతవరకూ డెవలప్ అయ్యేరో చూడాలి.”

వదిన చెప్పింది వింటుంటే అన్నయ్య డెవలప్ అవడం మాటటుంచి, అసలు మన లోకంలోకి వస్తాడా అనే అనుమాన మొచ్చేసింది నాకు.

“పద.. పద.. ఇప్పటికే ఆలస్యమైపోయింది..” అంటూ నన్ను మళ్ళీ హాల్లోకి లాక్కొచ్చింది వదిన.

అన్నయ్య అలాగే సోఫాలో నిటారుగా బొమ్మలా కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు.

వదిన అన్నయ్య ఎదురుగా మోడా లాక్కుని కూర్చుని తన రెండు అరచేతుల్లోకీ అన్నయ్య చేతులని తీసుకుని, నెమ్మదిగా వత్తుతూ, “మీరు ‘బాస్‌ని పడగొట్టడమెలా!’ అనే ప్రక్రియలో ఇప్పటివరకూ రకరకాల పధ్ధతులు తెల్సుకున్నారు కదా! వాటిని సమయోచితంగా వాడే విధానాలు కూడా మీకు తెల్సిపోయేయి. ఇంక మీరు బాస్‌ని ఈజీగా పడగొట్టెయ్యగలరు.. ఈజీగా పడగొట్టెయ్యగలరు.. ఈజీగా పడగొట్టెయ్యగలరు.. ఏదీ నెమ్మదిగా కళ్ళు తెరవండీ.. నెమ్మదిగా కళ్ళు తెరవండీ..” అంది.

అన్నయ్య కాస్త కనురెప్పలు కదిల్చేడు. అదే మాట వదిన మళ్ళీ మళ్ళీ అనడం మొదలెట్టింది. కాస్త కదిలేడు అన్నయ్య. వదిన నావైపు విజయం వరించినట్టు చూసింది. మళ్ళీ ఇంకోసారి అవే మాటలు అనేటప్పటికి అన్నయ్య కళ్ళు మూస్తూ, తెరుస్తూ సోఫాలో ఓ పక్కకి ఒరిగిపోయేడు. ఖంగారు పడిపోయేం వదినా, నేనూను. వదిన అన్నయ్యని గట్టిగా కుదపడం మొదలెట్టింది. అన్నయ్య నెమ్మదిగా కళ్ళు తెరిచి, నీరసంగా దాహం అన్నట్టు బొటనవేలు నోటి దగ్గర పెట్టి సైగ చేసేడు. వదిన రాకెట్‌లా వంటింటి వైపు మంచినీళ్ల కోసం వెళ్ళింది. నేను సోఫాలోంచి పడిపోతాడేమోనని అన్నయ్యని పట్టుకుందుకు దగ్గరి కెళ్ళేను. నన్ను చూసి అన్నయ్య నవ్వుతూ కన్ను కొట్టేడు. నేను ఆశ్చర్యపోయే లోపలే వదిన మంచినీళ్ళ గ్లాసుతో వచ్చింది.

అన్నయ్యని జాగ్రత్తగా పొదివి పట్టుకుని, నెమ్మదిగా మంచినీళ్ళు తాగించింది.

“ఎలా ఉందండీ ఇప్పుడూ! నీరసంగా ఉందా!” అనడిగింది పాపం జాలిగా..

“ఊ.. కొంచెం వేడిగా కాఫీ ఇస్తావా!” చాలా నీరసంగా అడిగేడు అన్నయ్య.

“ఇదిగో.. ఇప్పుడే తెస్తాను.. అవునూ.. ఇంతకీ మీ బుర్రలోకి కొత్త విషయాలేవైనా ఎక్కినట్టు అనిపించిందాండీ!”

ఆతృత ఆపుకోలేకపోయింది వదిన.

“అవును..ఏవిటీ.. ఏవేవో విషయాలు కొత్తవి చేరినట్టు బుర్రంతా బరువెక్కిపోయింది.. ఎందుకిలా ఉందంటావ్!”

వదిన మొహం మతాబాలా మెరిసిపోయింది. నావైపు చూసి విజయం సాధించినట్టు థమ్సప్ లాగా బొటనవేలు పైకెత్తింది.

“ఏం పరవాలేదులెండి. కాస్త వేడిగా కాఫీ తాగితే అంతా సర్దుకుంటుంది.” అని కాఫీ కలిపి తెస్తానంటూ వదిన వంటింట్లోకి వెళ్ళిపోయింది.

నేను అన్నయ్య వైపు ఆశ్చర్యంగా చూసేను. అన్నయ్య వదినకి వినిపించకుండా నన్ను దగ్గరికి రమ్మని పిలిచి,

“మీ వదిన కొత్త కొత్త ప్రయోగాలు చేసి గొప్పదై పోవాలనుకుంటుందే.. కానీ.. నా ప్రమోషన్‌కీ, దాని ప్రయోగాలకీ సంబంధమేంటి చెప్పూ.. కాదంటే చిన్నబుచ్చుకుంటుందీ.. అందుకని మీ వదిన చెప్పినట్టు నటించేనంతే.. నిజంగా నా బుర్ర తన అధీనంలోకి వెళ్ళిపోయిందనుకుంటోంది. పోనీ.. అలాగే అనుకోనీ.. అలా అనుకోడంలో తనకి సంతోషమున్నప్పుడు మనం ఎందుకు కాదనాలీ! అందుకే అలా నటించేను.”

“మరి..మరి.. నీ ప్రమోషనూ..అదీ..”

నా మాట ఇంకా పూర్తి కాకుండానే అన్నయ్య నవ్వేస్తూ.. “అదా.. అదీ ఎప్పుడో కాన్సిలైపోయింది. సరిపడ ఫండ్స్ లేవని ఈ ఏడు ప్రమోషన్లన్నీ మా కంపెనీ ఆపేసింది.”

“మరి వదిన..”

“అమ్మో, ఈ విషయం ఇప్పుడే మీ వదినకి తెలిస్తే ఇంకేమైనా ఉందా! ప్రమోషన్లు ఇవ్వడం ఆపేసినందుకు మా కంపెనీ ముందు ధర్నాలు చేసినా చేస్తుంది. అందుకే ఇప్పుడే ఆ మాట చెప్పను. కొన్నాళ్ళపాటు తన ప్రయోగం ఫలించిందని మీ వదిన్ని సంతోషించనీ.. తర్వాత నెమ్మదిగా చెప్పొచ్చు”.

అన్నయ్య మాట పూర్తవకుండానే వేడి వేడి కాఫీ తీసుకుని వదిన వచ్చింది.

“ఇప్పుడెలా ఉందండీ!” అడిగింది అన్నయ్యని.

“ఏంటో.. తలంతా దిమ్ముగా ఉన్నట్టుంది.” నీరసంగా వచ్చింది అన్నయ్య నోటమ్మట మాట.

“కాఫీ తాగి కాసేపు పడుకోండి. రేపు ఆఫీసుకెళ్ళే టైముకి అంతా సద్దుకుంటుంది.” అంది వదిన వెలిగిపోతున్న మొహంతో.

అన్నట్టుగానే అన్నయ్య కాఫీ తాగేసి కాస్త తూలుతున్నట్టు నడుస్తూ బెడ్ రూమ్ వైపు వెళ్ళేడు.

అలా వెడుతున్న అన్నయ్యని చూస్తూ వదిన,

“చూసేవా స్వర్ణా నా ప్రయోగం ఎంతా బాగా ఫలించిందో! ఇంక ఖాయంగా ప్రమోషన్ మీ అన్నయ్యకే వచ్చేస్తుంది.”

అన్నయ్య కోసం వదినా, వదిన కోసం అన్నయ్య పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకెంతో సంతోషంగా అనిపించింది.

వదినని ఇంత అపురూపంగా చూసుకుంటున్న మా అన్నయ్య వలన కదా వదిన ఇంత ఫేమస్ అయిందీ అనుకుంటూ వదిన తెచ్చిన వేడి వేడి కాఫీ అందుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here