కాజాల్లాంటి బాజాలు-103: మా వదిన ఓ అద్భుతం..

4
9

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]పొ[/dropcap]ద్దున్నే వదిన ఫోన్ చేసి “స్వర్ణా, రేపు పదకొండు గంటలకల్లా రెడీగా ఉండు. మనమో చోటికి వెళ్ళాలి.” అంది.

“ఎక్కడికీ..” అనడిగేను.

ఎందుకంటే ఇదివరకు ఇలాగే ఒకచోటికి వెడదామని ఎవరింటికో తీసికెళ్ళింది. వాళ్ళింట్లో గంటపైన కూర్చున్నా కాఫీనీళ్ళు కాదుకదా మంచినీళ్ళైనా గొంతులో పొయ్యలేదు. పైగా వచ్చేటప్పుడు చాలాసేపు కాబ్ దొరక్క పోవడం వల్ల ఇంటి కొచ్చేటప్పటికి చాలా ఆలస్యమైపోయింది. దానికితోడు విపరీతమైన తలనెప్పి వచ్చేసి ఆ రాత్రి నిద్రకూడా పట్టలేదు. అందుకే ముందు జాగ్రత్తగా అడిగేను.

“మనం ఓ కోర్సులో చేరాలి. మూణ్ణెల్ల కోర్సేలే.. ఇట్టే ఐపోతుంది. ఆ తర్వాత మనకి డబ్బులే డబ్బులు..”  అంది ఊరిస్తూ..

ఈ వదిన ఊరికే ఉండదు సరికదా..ప్రతిదాన్లోకీ నన్నూ లాగుతూంటుంది. “ఏం కోర్సు వదినా.”

“నీకు స్టాండప్ కామెడీ తెల్సు కదా! అది ఎలా చెయ్యాలో నేర్పే కోర్సు.”

నాకర్ధం కాలేదు. “అదేం కోర్సు వదినా.”

“అయ్యో.. అదిప్పుడు ఎంత పాప్యులరో తెల్సా.. మనం ఏదో టాపిక్ మీద ప్రేక్షకుల్ని ఎంటర్టయిన్ చేస్తూ మంచి పంచులు వేస్తూ మాట్లాడాలి. ఆడియన్సుని ఎలా కట్టిపడెయ్యాలో ఈ కోర్సులో చెప్తారు.”

“అమ్మో.. స్టేజిమీదా! నాకసలే స్టేజ్ ఫియర్ వదినా..”

“నీ మొహం.. ఓసారి స్టేజెక్కి కళ్ళు మూసుకుంటే అన్ని భయాలూ పోతాయి.”

స్టేజెక్కి కళ్ళు మూసుకోవాలా! ఇదసలు సాధ్యమేనా!

“అబ్బే.. నాకసలు నలుగురిముందూ మాట్లాడాలంటే వణుకొచ్చేస్తుంది వదినా.”

“ఆ వణుకంతా వాళ్ళు వదలగొడతార్లే..”

“అసలింతకీ ఆ స్టాండప్ కామెడీ అంటే ఏంటో కూడా నాకు తెలీదు.” అన్నాను ఇంక నన్ను వదిలేస్తుందని.

మా వదినా… అంత సులభంగా వదిలేది..

“నీకు కొన్ని లింకులు పంపిస్తాను.. అవి చూడు. ఎంత ఈజీయో తెల్సిపోతుంది. అసలిన్నాళ్ళు ఇది నాకంట ఎందుకు పడలేదా అనుకుంటున్నాను. లేకపోతేనా ఈ పాటికే బోల్డు సంపాదించేదాన్ని.”

“లింకులు చూస్తే డబ్బు లెలా వస్తాయి వదినా!” అమాయకంగా అడిగినా నా ప్రశ్నకి విసుక్కుంది వదిన.

“నీకు ప్రతి విషయం అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పాలా! ఇన్ని రోజుల్నించి యూ ట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నావ్. అందులో స్టాండప్ కామెడీలు ఎప్పుడూ చూడలేదా! ఒక్కసారి మనది పాప్యులర్ అయిందంటే ఇంక ఎన్ని వ్యూస్ వస్తాయో తెల్సా! దాన్ని బట్టి బోల్డు డబ్బులు. ఆమాత్రం తెలీదా! ఎటొచ్చీ  మనం ఆ స్టాండప్ కామెడీ చెయ్యడంలో సక్సెస్ అవాలంతే..”

“అయ్యో వదినా.. యూ ట్యూబ్‌లో వచ్చే వ్యూస్ షార్ట్ ఫిల్మ్స్‌కి. స్టాండప్ కామెడీ అంటే ప్రేక్షకుల ముందు ప్రత్యక్ష్యంగా స్టేజి మీద చేసేది. వాళ్ళ రెస్పాన్స్‌ని బట్టి పండుతుంది. అందుకే దానికి సెపరేట్‌గా షోస్ వేస్తారు. లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్స్‌లో పెర్ఫార్మ్ చేయిస్తుంటారు. అది చేసేవాళ్ల  పెర్ఫార్మెన్స్‌ని  బట్టి వాళ్ల డిమేండూ, రేటూ ఉంటూంటాయి.”

“అది నాకూ తెల్సులే.. కానీ టీవీల్లో వచ్చే కొన్ని రియాలిటీ షోలలో వీటినీ చూపిస్తున్నారుగా.. ఏకపాత్రాభినయం చేసినట్టే..” అంది భానుమతి అత్తగారు నిమ్మకాయెంతో ఆవకాయంతా అన్నట్టు.

నాకు కడుపులోంచి దుఃఖం లాంటిది వచ్చేసింది.

ఎంత కష్టపడితే వచ్చే కళ అదీ.. వదిన  ఎంత తేలిగ్గా చెప్పేసిందీ! అసలు క్రియేటివ్‌గా ఏదైనా చెయ్యడమంటే మాటలు కాదు. ముందు మనం ఆడియన్స్ ఎవరో, ఎలాంటివారి కోసం చేస్తున్నామో, వాళ్ళెలాంటి సబ్జెక్ట్స్ ఇష్టపడతారో తెల్సుకోవాలి. ఆ తర్వాత దానికి తగ్గ బేక్‌గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పైన స్క్రిప్ట్ రాసుకోవాలి. ఆ స్క్రిప్ట్ కూడా మంచి పంచులతో ఉండాలి. స్టేజి మీద స్టడీగా నిలబడ్డం తెలియాలి. డైలాగులు స్పష్టంగా తెలిసేలా చెప్పగలగాలి. ప్రతి డైలాగూ ఒక టపాకాయలా పేలాలి. ఎంతో ప్రతిభావంతులయినవారు మాత్రమే చెయ్యగలిగే షోని టివీల్లో మామూలుగా చూపించేసి ఎంతకి దిగజార్చేస్తున్నారూ!

“ముందు నువ్వు నేను పంపించిన లింకులు చూడు. అవి నేను చేసినవే..”

“కోర్సు చెయ్యకుండానే షో కూడా చేసేసేవా! ఎప్పుడూ.. ఎక్కడా!”

“మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్‌లో ఓసారీ, మా అపార్ట్మెంట్ వాళ్ళ మీటింగ్‌లో ఒకసారీ ట్రయల్ వేసి చూసేను. చాలా బాగుందన్నారు అందరూ. అందుకే ఓ మూణ్ణెల్లు కోర్సు కూడా చేసేస్తే బైట ఫంక్షన్స్‌లో కూడా అవకాశం వస్తుంది.. అంతేకాకుండా మనం ఎంత డిమేండ్ చెయ్యాలో కూడా తెలుస్తుంది. ముందు ఆ లింకులు చూడు.. ఎంత ఈజీయో నీకే తెలుస్తుందీ..” అంటూ ఫోన్ పెట్టేసింది వదిన..

తప్పుతుందా.. తీరుబడిగా కూర్చుని లింక్ మీద క్లిక్ చేసేను.

ఆ ఫంక్షన్ నిర్వహించేవారనుకుంటాను వదినని పరిచయం చేస్తూ స్టేజి మీదకి ఆహ్వానించేరు.

ముదరాకుపచ్చ ఉప్పాడ పట్టుచీర కట్టుకుని, డిజైనర్ బ్లౌజ్ వేసుకుని, మెడలో పింక్ పెరల్స్‌తో, ఒక చేతికి లావుపాటి బంగారు కంకణం, మరో చేతికి గోల్డ్ వాచ్, వేళ్ళకి డైమండ్ ఇంకా నవరత్నాల ఉంగరాలు పెట్టుకుని, కాళ్ళకి షోలాపూర్ చప్పల్స్‌తో వదిన హుందాగా స్టేజి మీద కొచ్చి నిలబడింది. అసలే అందమైంది వదిన. దానికి తోడు ఎంతో కాన్ఫిడెంట్‌గా వస్తున్న వదినని అలా చూస్తుండిపోయేను.

వదిన నెమ్మదిగా మైక్ ముందు కొచ్చి నిలబడింది. చేతులు రెండూ జోడించింది.

“సభకు నమస్కారం. మిమ్మల్నందర్నీ ఉత్సాహపరచడానికి ఇవాళ మీతో ఒక సంగతి పంచుకుందామనుకుంటున్నాను. ఇది నాకు స్వయంగా అనుభవమైంది. మీ అందరికీ కూడా ఇలాంటి అనుభవాలు ఉండొచ్చు. నాతో పాటు మీ మీ అనుభవాలు కూడా ఓసారి గుర్తు చేసుకుంటారు కదూ!”

కెమెరా ఆడియన్స్ వైపు తిప్పినట్లున్నారు.. స్టేజి ఎదురుగా కుర్చీల్లో కూర్చున్నవాళ్ళందరూ కాస్త కుతూహలంగా ముందుకు వంగేరు. మళ్ళీ కెమేరా వదినని ఫోకస్ చేసేరు. వదిన స్పష్టంగా, నెమ్మదిగా, చిన్నగా నవ్వుతున్న మొహంతో మాట్లాడడం మొదలుపెట్టింది.

“మనందరికీ తెలుసు మనం మనుషులతో సమానంగా పశుపక్ష్యాదులను కూడా ప్రేమిస్తామనీ, పెంచుకుంటామనీ.. ఆవులు, గేదెలు వంటి వాటిని పాలకోసం పెంచుకుంటే కుక్కలూ, పిల్లులూవంటి వాటిని మనకి ఇష్టమై కావాలని పెంచుకుంటాం. మన ఇళ్ళలో మనతో సమానంగా వాటిని ప్రేమిస్తాం. వాళ్లకి కావల్సినవన్నీ అందిస్తాం. అలా మనింట్లో ఓ కుక్కని పెంచుకుంటున్నాం కదా అని మరి ఇంటికి వచ్చేవారికి ఇబ్బంది కలగనివ్వం.

ఇలా కుక్కల్ని పెంచుకునేవాళ్ల గురించి నేను చిన్నప్పుడెప్పుడో ఓ పత్రికలో చదివిన మాట గుర్తొస్తోంది. ఓ పెద్దమనిషీ, ఇంకో యువకుడూ రోడ్డమ్మట నడిచి వెడుతుంటే ఓ పెద్ద బంగళాగేటుకి ‘కుక్కలున్నవి జాగ్రత్త..’ అనే బోర్డు వేళ్ళాడుతూ కనిపించిందిట. ఆ పెద్దమనిషి ఎవరో నాలాంటి అమాయకుడే అనుకుంటానూ.. ‘ఒరే అబ్బాయ్… కుక్కలకి ఇంత పెద్ద మేడ ఎందుకురా..’ అన్నాడుట.”

ప్రేక్షకుల్లోంచి నవ్వుల శబ్దం వినిపించింది. అవి సద్దు మణిగిన తర్వాత వదిన మళ్ళీ అందుకుంది.

“అలాగే.. నాకు తెల్సిన ఓ పెద్దమనిషి జెర్మన్ షెపర్డ్ లాంటి కుక్కని పెంచుకుంటున్నారు. ఓసారి వాళ్ళింటికి వెళ్ళవలసొచ్చింది. పాపం ఆయన ఆ కుక్కని.. ఓ సారీ కుక్క అనకూడదు కదూ.. దాని పేరు టైగర్‌ట.. ఆ టైగర్‌ని తన సోఫా పక్కనే కూర్చోబెట్టుకుని, దానిని నిమురుతూ నన్ను ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోమన్నాడు. ఆయన మాట కాదనలేక సోఫా అంచుకి ఆనీ ఆనకుండా కూర్చున్నాను కానీ నా దృష్టంతా ఆ టైగర్ మీదే ఉంది. అది ఒక్కసారి లేచి ఉరికితే అందేంత దూరంలోనే ఉన్నాను.

“ఊ.. చెప్పండి… ఏం కావాలీ..” అడిగేడాయన..

నాకేమో కాళ్ళు వణికిపోతున్నాయి. నోరార్చుకు పోతోంది. అదింక మీదకి ఉరికేస్తుందేమోనన్నంత గాభరాలో ఉన్నాను. నన్ను చూసి ఆ పెద్దమనిషి నవ్వుతూ ‘భయపడకండీ.. నేను చెప్తున్నానుగా.. ఈ టైగర్ కరవదు.’  అన్నారు.

‘కరవదని మీకు తెలుసండీ.. కాని కరవకూడదని దానికి తెలియాలిగా..’ అన్నాను.”

వణుకుతూ వదిన చెప్పిన మాటలకి ఆడియన్స్ ఒక్కసారి గొల్లుమంటూ నవ్వేసేరు.

అంతే ఇంక వదిన మొదలెట్టి కుక్కల ప్రేమికుల గురించీ, వాటికోసం వాళ్ళు పడే పాట్ల గురించీ, కొత్తవారు వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవాల గురించీ చెపుతుంటే ఒక్కొక్కదానికీ ప్రేక్షకులనించి వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది. ఆ పైన అలా కుక్కల్ని పెంచుకుంటున్న వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వాటిని ఎలా మచ్చిక చేసుకోవాలో వదిన చెపుతుంటే ఎఫ్ 2 సినిమాలో వెంకటేష్ నటన ఒక్కసారి గుర్తొచ్చింది.

మొత్తానికి ఆ షో అయ్యేసరికి నవ్వలేక నాకు ఆయాసమొచ్చింది. ఇంక రెండో లింక్ చూడవలసిన అవసరం  కనిపించలేదు. అసలు వదినకి మూణ్ణెల్ల కోర్సు అనవసరం. కావాలంటే వాళ్లకే మూడ్రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చి పడేస్తుంది.

మా వదినలోని అద్భుతాన్ని చూసిన నేను వదినని ఆరాధించకుండా ఎలా ఉండగలనూ!…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here