మా వూరి మంగలి కతలు – పుస్తక పరిచయం

0
5

[dropcap]”ఈ[/dropcap] కథల సంపుటి పేరు, ‘మా వూరి మంగలి కతలు’. నిజానికి ఇవి ఎన్నో వూర్ల మంగలి కతలు, వూరూరి మంగలి కతలు. నాలుగైదు దశాబ్దాల కిందటి కాలం కథలు ఇవన్నీ.

ఇందులోని కథలన్నీ ఆత్మకథాత్మకంగా నడుస్తాయి. ఉత్తమ పురుషలో సాగుతాయి – ఈ కథలు చెప్పే వ్యక్తి వెంకటరాముడు. ఈ పాత్ర ద్వారా పాఠకులు గతకాలం నాటి మంగలి వృత్తి పనివారల జీవితాల్లోని సాధక బాధకాలను, కుల సమస్యలనూ, అణచివేతలనూ, బతుకువెతల్నీ అనేక కోణాల నుండీ అర్థం చేసుకుంటారు.

ఆర్థిక పరమైన అణచివేతలనీ, సాంస్కృతికపరమైన అణచివేతలన్నీ భరిస్తూ ఎలా జీవితాలు గడిపేవారో ఈ కథలు పొరలు పొరలుగా చెప్తాయి.

పాఠకుల్ని నాలుగైదు దశాబ్దాలు వెనక్కు తీసుకెళ్తాయి, ఈ కథల్నన్నీ. ఇందులోకి ప్రతి కథా ఒక అనుభవాన్ని పాఠకుల ముందు ప్రత్యక్ష్యంగా నిలుపుతుంది. ఆ అనుభవాన్ని తెలియచెప్పే రచయిత పరిశీలనా దృష్టీ, శ్రామిక జన పక్షపాతవైఖరీ, సామాజిక అన్యాయాల పట్ల దిగులుపడే రచయిత కంఠస్వరమూ, పాఠకుల్ని చకచ్చకితుల్ని చేస్తాయి” అన్నారు సింగమనేని నారాయణ తమ ముందుమాట ‘వ్యత్యాసాలు – వ్యాఘాతాలే, అడుగడుగునా…’లో.

***

“ఇందులో 18 కథలున్నాయి. ఈ కథల నిండా బోలెడు సాంఘిక చరిత్ర వుంది. కులవృత్తుల వారి జీవితాల్లో ఆనాటి అస్వతంత్రత, పరాధీనత, దాస్యం, దైన్యాలను యథాతథంగా రిపోర్ట్ చేశాడు రచయిత. ప్రధాన పాత్ర వెంకట్రాముడిని వ్యవస్థకు దాసానుదాసుడిగా చూపిన రచయిత, ఆయన కొడుకు సురేశ్‍ను విప్లవకారుడి పాత్రలో ప్రవేశపెట్టి సమాజంలో రావలసిన మార్పును చెప్పకనే చెప్పాడు. కథల్లోని పాత్రలు, సన్నివేశాల ద్వారా పాఠకుల్లో ఎంతో ఆవేదననూ, ఆలోచనల్ని రేకెత్తిస్తాడు. ఒక మంగలివృత్తే కాదు, కులవృత్తులందరి బతుకులు బాగుపడాలన్నదే ఈ కథల పరమార్థం. కాకపోతే సందేశం స్పష్టంగా సూటిగా గాకుండా కథల్లో ధ్వనిస్తుంది.

కుల వివక్షని విస్తారంగా ఎత్తి చూపే కథలే ‘మావూరి మంగలి కతలు’. రచయితలో మరొక విశేషం ఉంది. చాకలి వృత్తి కాకపోయినా, గతంలో ‘సాకిరేవు కథలు’; మంగలివృత్తి కాకపోయినా ఇప్పుడు ‘మా వూరి మంగలి కతలు’ రాసి మెప్పించడం ఒక్క గోవింద్ గారికే చెల్లింది” అన్నారు సాకం నాగరాజ ‘కథలు ఎందుకు రాస్తారు?’ అనే తమ ముందు మాటలో.

***

“పల్లెటూళ్ళలోని ప్రశాంతత వెనుక కుట్రలు, కుతంత్రాలు, కక్ష్యలూ, కార్పణ్యాలూ, కొన్ని కులాలు ఎదుర్కుంటున్న వివక్ష, కాలానుగుణంగా పల్లె జీవనంలో వొచ్చిన మార్పులు చేర్పులు, కులవృత్తులలో పెరిగిన పోటీతత్వము, పాత కొత్త తరాల మధ్య సంఘర్షణ… ఇలా మరొక కోణాన్ని ‘మా వూరి మంగలి కతలు’లో కొంత వరకు చెప్పగలిగాను.

ఈ పుస్తకంలో పొందుపరిచిన పద్దెనిమిది కతలు, వారు గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్ష, కులవృత్తితో రోజు రోజుకు పెరుగుతున్న పోటీ, దాన్ని అధిగమించడానికి వారెన్నుకొన్న మార్గాలు, కొత్త పాత తరం భావాల మధ్య ఉన్న సంఘర్షణ కూలంకుషంగా వివరించాను.

ఈ పుస్తకంలోని పద్దెనిమిది కథలను మొదటికథ నుండి ఆఖరు కథ వరకు వరుసక్రమంలో చదవగలిగితే మహాభారతాన్ని పోలిన పల్లె భారతం గుర్తుకొస్తుంది” అన్నారు రచయిత ‘మనసులో మాట’లో.

***

మా వూరి మంగలి కతలు

రచన: మూరిశెట్టి గోవింద్‌

ప్రచురణ:

అభ్యుదయ రచయితల సంఘం, చిత్తూరు జిల్లా

పేజీలు: 96, వెల: ₹ 100

ప్రతులకు:

మూరిశెట్టి గోవింద్, చిన్నదొరవారి కండ్రిగ (గ్రామం, పోస్టు), కార్వేటినగరం మండలం

చిత్తూరు జిల్లా, ఆంధ్రపదేశ్, 9502200749, 9440849755

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here