మాలిన్యం

24
6

[శ్రీ ఆసూరి హనుమత్ సూరి రచించిన ‘మాలిన్యం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“మే[/dropcap]డం! మీ కోసం డాక్టర్ గారు వచ్చారు! లోపలికి పంపించమంటారా?” భయం, వినయంతో కూడిన స్వరంతో అడిగింది ఆ పనిమనిషి.

“మేనేజర్ జోషి ఎటు వెళ్ళాడు? డాక్టర్ వస్తాడని నిన్నే చెప్పలేదా తనకి? తీరా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు?” గద్దించినట్టు ప్రశ్నించింది మాలిని అరోరా.

“ఏమో తెలియదు మేడం. ఫోన్ కూడా ఇక్కడే ఛార్జింగ్ పెట్టి వెళ్లారు” అంది పనిమనిషి.

“సరే కానీ డాక్టర్‌ని వెయిటింగ్ హాల్‌లో కూర్చోమని చెప్పి టీ ఇవ్వమని వంటమనిషికి చెప్పి నువ్వు వచ్చి పక్క సర్దు. అలాగే నా మేకప్ కిట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఈ బ్యూటిషియన్ ఇప్పుడే సెలవు పెట్టింది. ఖర్మ!” రుసరుసలాడుతూ చెప్పింది మాలిని అరోరా.

“సరే మేడం” అంటూ పరుగు పరుగున క్రిందికి వెళ్ళింది పనిమనిషి.

***

“నమస్తే మాలిని గారూ! ఎలా ఉన్నారు? టిఫిన్ చేశారా? మందులు వేసుకున్నారా?” కుశల ప్రశ్నలతో మాట్లాడించారు డాక్టర్.

“నో డాక్టర్! చెప్పాలంటే అసలు నేను నాలా లేను. ఏమీ తినబుద్ధి కావటం లేదు. మందులు తినాలంటే వాంతి వచ్చినంత పనవుతోంది. ముందు నన్ను పరీక్షించి చెప్పండి!

నాకేమీ అర్థం కావటం లేదు. ఇంతకీ నిన్నటి రిపోర్టులు వచ్చాయా?” ఆందోళనగా అడిగింది మాలిని.

“అదే మేడం. అవి తీసుకుని ఇటే వచ్చాను” అంటూ ఓపెన్ చేసి చూపించాడు డాక్టర్.

“బ్లడ్ రిపోర్ట్‌లో పెద్ద తేడా ఏం లేదు. కానీ..” అంటూ చెప్పబోయేంతలో..

“త్వరగా చెప్పండి! ఇబ్బందేం లేదు కదా?” అంటూ ఆత్రంగా అడిగింది మాలిని.

“కడుపులో ఏదో కణితి ఉన్నట్టు స్కానింగ్ రిపోర్ట్ చెబుతోంది. అందుకే శాంపిల్ తీసి బయాప్సికి పంపించాలి. మీరు అపాయింట్మెంట్ ఇస్తే రేపే చేసేద్దాం అన్నారు డాక్టర్ సేథీ గారు.” చెప్పాడు డాక్టర్.

“మరి అప్పటి దాకా వేరే మందులేం ఇవ్వరా? ఈ రోజంతా ఇలా గడపాల్సిందేనా?” ఆందోళనగా అడిగింది మాలిని.

“తప్పదు మేడం. కణితి ఎలాంటిదో తెలిసాక గానీ ట్రీట్మెంట్ మొదలు పెట్టలేం అన్నారు సేథీ గారు. మీరు ఓకే అంటే రేపే ఫార్మాలిటీస్ పూర్తి చేసేద్దాం. బయాప్సి రిపోర్ట్ రాగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టొచ్చు” చెప్పాడు డాక్టర్.

“సరే డాక్టర్! మా మేనేజర్ జోషి రాగానే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. నేనే మళ్ళీ కాల్ చేయిస్తాను. థాంక్యూ!” అంది మాలిని.

***

మాలిని అరోరా! ఇరవయ్యేళ్ళ పాటు హిందీ చిత్రసీమను రాజ్యమేలిన స్టార్ హీరోయిన్. సగటు కుర్రాళ్ళ నుండీ స్టార్ హీరోల దాకా మనసు పారేసుకున్న కలల రాణి.

ఇప్పుడిప్పుడే కుర్ర హీరోయిన్‌ల ప్రవేశంతో పెద్ద వయసు పాత్రలతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెడుతున్న నిన్నటి తరం అందాల తార మాలిని.

ఆమె కాల్షీట్ల కోసం రెండేళ్లయినా నిరీక్షించే నిర్మాతలు, ఆమె కోసం సినిమాలో హీరోయిన్ పాత్ర తీరునే మార్చేసే దర్శకులు, ఆమె కోసమే కథలు రాసే రచయితలూ, ఆమెతో అయితేనే సినిమా చేస్తామని తెగేసి చెప్పే హీరోలు.. ఇలా ఎంతో మందిని తన అందం, అభినయంతో కట్టి పడేసిన మాలిని అరోరా.. గత కొన్ని రోజులుగా ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉంది. ఇదీ బయటి ప్రపంచానికి తెలిసిన నిజం.

కానీ తనకే తెలీని అనారోగ్యంతో మంచానికే పరిమితమయి తన ఆరోగ్యం కంటే అందం గురించిన ఆందోళనలో ఉంది మాలిని.

***

మేనేజర్ జోషి హడావుడిగా లోపలికి రాగానే, “ఎక్కడికి వెళ్లారు చెప్పకుండా! తీరా డాక్టర్ గారు రాగానే మీరు లేకపోవడంతో ఎంత ఇబ్బందయిందో తెలుసా..? మీరు ఉండుంటే రేపటికి డాక్టర్ సేథీ గారికి అప్పోయింట్మెంట్ ఫిక్స్ చేసి ఉండే వాళ్ళం!” నీరసంగా ఉన్నా, స్వరంలో ఏమాత్రం అజమాయిషీ తగ్గడం లేదు.

“అది కాదు మేడం, రెండ్రోజుల నుండీ బ్యూటీషియన్ రావడం లేదు కదా.. మీరే ఇబ్బంది పడడం చూడలేక ఎవర్నైనా అరేంజ్ చేద్దామని వెళ్ళాను. ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో ఇక్కడే పెట్టి వెళ్ళాను. ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారు?” అంటూ సంజాయిషీగా అడిగాడు జోషి.

“కడుపులో ఏదో కణితి ఉందట. శాంపిల్ తీసి బయాప్సికి పంపాలట. మనం అప్పాయింట్మెంట్ ఇస్తే సేథీ గారు చేస్తానన్నారట. మీరేమో సరిగ్గా ఇప్పుడే లేరు. నా డైరీ చూసి రేపు ఎన్నింటికి కుదురుతుందో చెప్పండి. అదే విషయం డాక్టర్ గారికి చెప్పండి. రేపు ఎలాగైనా పూర్తి చేసేద్దాం. త్వరగా నేను నార్మల్ అవ్వాలి” చెప్పింది మాలిని.

ఎలాగైతేనేం మరుసటి రోజు ఉదయాన్నే అంబులెన్సుని పిలిపించి జస్లోక్ హాస్పిటల్‌కి వెళ్లారు మాలిని, మేనేజర్, అలాగే తన అటెండర్‌తో. అన్నీ అనుకున్నట్టే పూర్తి చేసుకుని మధ్యాహ్నాని కల్లా జుహు లోని బంగ్లాకి చేరుకున్నారు.

తాను రెస్ట్ తీసుకుంటానని, కొంచెం అలెర్ట్‌గా ఉండి బయాప్సి రిపోర్ట్ రాగానే డాక్టర్ గారితో డిస్కస్ చేసి ట్రీట్మెంట్‌కి ఏర్పాటు చెయ్యమని జోషికి పురమాయించి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది మాలిని.

పడుకోనయితే పడుకుంది గానీ మాలినికి నిద్ర పట్టటం లేదు. భవిష్యత్తు గురించి, తన అందం గురించి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయ్. ఇలా ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకుంది.

ఒంటికి సెలైన్ ఎక్కిస్తుండడంతో తెల్లవారు ఝాము నాలుగు గంటలకు డాక్టర్ వచ్చారని చెప్పే వరకూ మెలకువ లేదు మాలినికి.

ఎట్టకేలకు డాక్టర్ రిపోర్ట్ చూసి చెప్పాడు. అది ఒక కాన్సర్ కణితి అని. కడుపులో పెద్ద పేగు మొదట్నుంచీ మధ్య దాకా వ్యాపించింది అని. ఇది కాన్సర్ రెండో స్టేజి అని. కొంచెం ఆలస్యం అయినా, నయమయ్యే ఛాన్స్ ఉంది అని.

మాలిని చాలా షాక్‌కి గురయింది. కాళ్ళ కింది భూమి కదులుతున్నట్లు ఉంది. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. ఒక్కసారి తన తల్లిదండ్రులు, మావయ్యలు గుర్తుకు వచ్చారు. వాళ్ళందర్నీ కాదని తన కలల్ని నెరవేర్చుకునేందుకు బొంబాయి రావడం, అనతి కాలం లోనే తనకు సినిమా అవకాశాలు రావడం, అతి కొద్దీ సమయం లోనే తన దశ తిరిగి పోవడంతో కష్టం కంటే అదృష్టాన్ని ఎక్కువగా అనుభవించింది మాలిని. ఇన్నాళ్లూ తాను ఒంటరిని అన్న భావనే కలగలేదు. చుట్టూ పరివారం, చేతి నిండా డబ్బూ ఒంట్లో అందం, అడుగులకు మడుగులొత్తే అభిమానులు, ఎక్కడికి వెళ్లినా విలాసవంతమైన సౌకర్యాలు ఉండడంతో ఒక విధంగా తనని తానే మర్చిపోయేంత సుఖంలో గడిపింది తన జీవితాన్ని మాలిని.. మాలిని అరోరా.

***

ఎలా అయితేనేం మరుసటి రోజు కాన్సర్ ట్రీట్మెంట్కి ప్లాన్ చేసారు మాలినికి. అనుకున్నదే తడవుగా ఆపరేషన్ పూర్తయింది. కణితిని తొలగించారు. వారం రోజుల్లోనే డిశ్చార్జి చేసారు. అయితే కొన్ని రోజులు పూర్తిగా ద్రవ ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని చెప్పారు. మంచం మీది నుండీ లేవకూడదు. యూరిన్ బ్యాగ్ తగిలించారు. కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటుండడంతో మంచం మీదే ఉన్నా పెద్ద ఇబ్బంది లేదు. తన బంగ్లా లోనే ఉంది. తన ముఖ్యమైన సహాయకులు ఇద్దరితో పరిస్థితి బాగానే ఉంది. అయితే ఇన్నాళ్లూ సంగీత సాహిత్యాలకు అనుగుణంగా కదిలిన తన కాళ్ళు ఒక్క అడుగు కూడా వెయ్యలేని స్థితిలో నిశ్చేతనంగా ఉండడం తనకు అసలు రుచించడం లేదు. ఒక్క సారిగా రంగుల సినిమాల నుండీ నలుపు తెలుపు సినిమాల వైపు వెళ్తున్నట్లు గా ఉంది జీవితం.

ఇలా ఓ వారం గడిచింది.

రెండో వారం డాక్టర్ వచ్చాడు. ఇక నెమ్మదిగా ఘన పదార్థాలు తీసుకోవాలని శరీరం శక్తి పుంజుకోవాలని చెప్పాడు. అయితే ఒక ముఖ్యమైన విషయం అంటూ ఇలా చెప్పాడు.

“మీ పెద్ద ప్రేగులో కణితి తొలగించిన చోట పుండు ఇంకా మానలేదు. అందుకే మీ కడుపు దగ్గర చిన్న గాటు పెట్టి మలం అక్కడ్నించీ బయటకు వచ్చే ఏర్పాటు చేసాం. అక్కడ ఓ బాగ్‌లో పోగయిన మలాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసి శుభ్రంగా ఉంచుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. దీనికి తగిన ఏర్పాటు చేసుకోవాలి. హాస్పిటల్‌లో అయితే ఇది చాలా సులువైన పని. కానీ మీరు బంగ్లా దాటి రానంటున్నారు కాబట్టి మీరు ఎంత త్వరగా ఈ ఏర్పాటు చేసుకుంటే అంత త్వరగా మీ ఆహారంలో మార్పు చెయ్యొచ్చు. ఓ రెండ్రోజుల్లో మీరు ఆ విషయం చూసుకోండి. మీరు జోషి గారితో చర్చించి ఈ పని పూర్తి చేసుకోండి. నేను మళ్ళీ రేపు వస్తాను.”

వెంటనే జోషిని పిలిపించింది మాలిని. “నా పేరు కానీ, బంగ్లా పేరు గానీ వెల్లడించకుండా రోజు వారీ శుభ్రంగా ఉంచే సహాయకులు కావాలని ప్రకటన ఇవ్వండి. వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అసలేం పని చెయ్యాలో, ఎక్కడ ఉండాల్సి ఉంటుందో చూచాయగా చెప్పండి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు. ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త వహించండి.” అని పురమాయించింది మాలిని.

మాలిని చెప్పినట్టు గానే ప్రకటన ఇచ్చాడు జోషి. పారితోషికం ఎక్కువగానే ఉండడంతో చాలా మందే వస్తారని అనుకున్న జోషికి పది మంది కూడా రాకపోయేసరికి ఆందోళన మొదలైంది. వచ్చిన వాళ్ళు కూడా ఏదో తెలీని ప్రదేశంలో పని అనేటప్పటికీ రావడానికి వెనుకంజ వేశారు. చివరికి మిగిలిన ఇద్దర్లో ఒకరిని ఎంపిక చేసి ఎక్కడికి రావాలో చెప్పి జుహు లోని మాలిని బంగ్లా లోకి రహస్యంగా తీసుకెళ్లారు. ఒకటి రెండు రోజులు చేసారో లేదో అక్కడి దుర్గంధానికి, నిర్బంధానికి తాళలేక వెళ్ళిపోనారంభించారు.

మాలినికి ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. ఆచ్ఛాదన లేకుండా ఉన్న తన నాభి ప్రాంతపు అందాలతో కుర్రకారుని ఉర్రూతలూగించిన తాను, ఇప్పుడు అదే చోట నెత్తుటి గాటుతో, మరో మల ద్వారం, దాని ద్వారా వచ్చే దుర్గంధానికి తట్టుకోలేక పోతోంది. తానే భరించలేని ఈ పరిస్థితిని వేరెవరో భరించలేక పోవడంలో ఆశ్చర్యం ఏముంది?

డాక్టరు గారు రోజూ వచ్చి చూస్తూ ఉన్నారు. కానీ పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడడం లేదు. చివరికి ఒక రోజు చెప్పాడు “మాలిని గారు! మీరు భేషజాలని వీడి హాస్పిటల్‌కి షిఫ్ట్ అయిపోవడం మంచిది. మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువవుతున్నాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.”

ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు ఆమెకు. మెల్లిగా డిప్రెషన్ లోకి వెళ్ళసాగింది.

ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి? నేను ఎవరికి ఏం కీడు చేసాను. భగవంతుడా నాకు ఎందుకీ శిక్ష! అని పశ్చాత్తాపంలో మునిగి పోయింది.

***

అది 2013, ముంబై లోని ధారావి దగ్గర మురికివాడ ప్రాంతం. తనకు బాగా నచ్చిన పాత్ర కోసం తొలిసారి ఆ ప్రాంతంలో షూటింగ్ చెయ్యడానికి వచ్చింది మాలిని అరోరా. అప్పటికే తాను ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చి టాప్ హీరోయిన్‌గా హిందీ చిత్రసీమను ఏలుతున్న తార.

ఆ రోజు తన షూటింగ్ మూడో రోజు. ఒబెరాయ్ హోటల్ నుండీ బెంజి కారులో బయలుదేరిన మాలిని కోసం సెట్లో అంతా ఎదురు చూస్తున్నారు. ఇంకాసేపట్లో ధారావి మురికి వాడ చేరుకుంటామనగా అక్కడ బాగా జనాలు పోగై వున్నారు. ఏమయిందో కనుక్కు రమ్మని మేనేజర్ జోషిని పురమాయించింది మాలిని. తను వచ్చే లోపు అసహనంగా అటూ ఇటూ చూస్తూ ఉన్న మాలినికి ఓ చిత్రం కనిపించింది. అది తనదే. తనకు తొలి హిట్ చిత్రంగా నిలిచిన ‘ప్యార్ కా మౌసమ్’ సినిమా లోని స్టిల్. దాని కింద ఏదో రాసి ఉంది. పరీక్షగా చూస్తే లేడీస్ అని ఇంగ్లీషులో రాసి ఉంది.

అదేంటో చూసి రమ్మని తన మేకప్ అసిస్టెంట్‌ని పంపింది. ఇంతలో జోషి వచ్చి విషయం చెప్పాడు. “మేడం ఈ జనాలకి కారణం ముందు మీ అభిమాన సంఘం వాళ్ళు మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. షూటింగ్‌కి టైం అవుతోంది. ఇది బాగా ఇరుకైన దారి. వెనక్కి వెళ్లే అవకాశం లేదు. ఎలాగో మేనేజ్ చేద్దాం. ఇక వెళదామా మేడం?” అన్నాడు జోషి.

“ఉండండి జోషిజీ. మేకప్ అసిస్టెంట్‌కి ఓ పని చెప్పాను. రాగానే వెళ్దాం” అంది మాలిని. చేసేదేం లేక కారెక్కి కూర్చున్నాడు జోషి. ఇంతలో మేకప్ అసిస్టెంట్ ముక్కుకు కర్చీఫ్ అడ్డు పెట్టుకుని గబా గబా వచ్చి కారులో కూర్చున్నాడు.

“ఏమైంది రహీం? ఎందుకు అంతలా ముక్కు మూసుకు కూర్చున్నావ్? ఇంతకీ నేను చెప్పిన పని ఏమైంది? నా చిత్రం అక్కడ దేనికోసం ఉంచారు? ” అడిగింది మాలిని.

“ఏం లేదు లెండమ్మా! ఏదో మీ అభిమానులు.. అంతే!” అని మాట దాటవేశాడు మేకప్ మాన్.

“అయితే ముక్కు ఎందుకు మూసుక్కూచున్నావ్?” అడిగింది మాలిని.

“అంటే అది.. అది.. వాళ్ళు మీ అభిమానులనుకుంటాను.. మీ ఫోటో గోడకు తగిలించుకున్నారు. అంతే! మరేం లేదు. మనం ఇక్కడినుంచి త్వరగా వెళ్ళాలమ్మా! షూటింగ్‌కు టైం అవుతోంది. మళ్ళీ మీకు టచ్ అప్ అద్దెటప్పటికి లేట్ అవుతుంది!” అన్నాడు మేకప్ మాన్.

“మరయితే కింద లేడీస్ అని రాసి ఉంది చూడలేదా? ఓహ్ నీకు ఇంగ్లీష్ రాదు కదా! అక్కడేం షాపు ఉంది లేడీస్‌కి?”మళ్ళీ ప్రశ్నించింది మాలిని.

ఇక వదిలేలా లేదు ఈవిడ అని అర్థమయింది అతనికి.

“అమ్మా అది ఓ లేడీస్ టాయిలెట్!” మెల్లిగా చెప్పాడు మేకప్ మాన్.

“డ్రైవర్! ముందు కారు అటు పోనియ్!” కొంచెం కోపంగా చెప్పింది మాలిని.

“మేడం, ఇంకాసేపట్లో సెట్‌కి వెళ్లొచ్చు. మీకు అక్కడ ఫ్రెషప్ అవడానికి అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇక్కడెందుకు మేడం?” సముదాయింపు గా చెప్పాడు జోషి.

“మతి ఉండే మాట్లాడుతున్నారా మీరు? మీకు ఇంకా అర్థం కాలేదా? అక్కడేం ఉందో? వాళ్ళ సంగతి ఇక్కడ కాదు. పోలీస్ స్టేషన్‌లో తేలుస్తా! దగ్గర్లోని స్టేషన్ ఎక్కడుందో కనుక్కుని అక్కడికి వెళ్ళండి!” అంటూ గదమాయించింది డ్రైవర్‌ని మాలిని.

చేసేదేం లేక జోషి దగ్గర్లోని స్టేషన్‌కి దారి కనుక్కుని కారుని అక్కడికి తీసుకెళ్లాడు.

కారు ఆపి, మాలిని మేనేజర్ జోషిని వెంట బెట్టుకుని పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళింది.

“మేడం! మీరు అచ్చు ఫిలిం స్టార్ మాలిని అరోరాలా ఉన్నారు. ఇంతకీ విషయం చెప్పండి!” వినయం గానే అడిగాడు పోలీసాయన.

వెంటనే జోషి అందుకుని, “సార్ మేడం నిజం గానే ఫిలిం స్టార్ మాలిని గారు. షూటింగ్ నిమిత్తం ఇటుగా వచ్చారు. కాకపొతే ఇక్కడి నుంచి అరకిలోమీటర్ దూరంలో ఆ రెహమాన్ బట్టల షాపు పక్కన ఓ పబ్లిక్ టాయిలెట్ ఉంది. అక్కడ మేడం గారి ఫోటో తగిలించి క్రింద లేడీస్ అని మార్కు చేసి ఉంది. దాని గురించి కంప్లైంట్ ఇద్దామని మేడం గారు ఇక్కడికి వచ్చారు. మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే మేం షూటింగ్‌కి వెళ్లాల్సి ఉంది.”విషయం చెప్పాడు.

“అయ్యో మేడం! మీ సెక్యూరిటీ గురించే మా వాళ్ళు షూటింగ్ స్పాట్‌లో ఉన్నారు. అయినా మీరు సెక్యూరిటీ లేకుండా ఇలా ఎందుకు వచ్చారు.? అయినా మీరు వెళ్ళండి! నేను ఆ టాయిలెట్ వాళ్ళని పిలిపించి మాట్లాడుతాను! వెంటనే ఆ బోర్డును తీయించేస్తాను” ఒకింత నెమ్మదిగా చెప్పాడు పోలీసాయన.

“ఇక్కడ జరిగింది మళ్ళీ ఎక్కడా జరగ కూడదు. మీరు ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యండి. నేను షూటింగ్ అయ్యాక ఇక్కడికి వస్తాను. అతన్ని పిలిపించి ఉంచండి. నేను వచ్చి సైన్ చేస్తాను.” పోలీస్ అని కూడా చూడకుండా దురుసుగా చెప్పి అక్కడి నుంచి తన స్టాఫ్‌తో వెళ్లి పోయింది మాలిని.

***

యాదవ్ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన కూలివాడు. తన తండ్రిలా కాక ఏదైనా వ్యాపారం చేసి కొంతైనా ఎదగాలని ఆరాట పడుతున్నప్పుడు తన స్నేహితుడు ఇచ్చిన సలహాతో భార్య తాళి తాకట్టు పెట్టి ధారావిలో ఓ టాయిలెట్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు తీసుకున్నాడు. బాగా రద్దీ ప్రాంతం కావడంతో రోజూ వచ్చి పోయే జనాలతో రెండు వేల దాకా పోగయ్యేది. కాంట్రాక్టర్‌కి పదిహేను వందలు పోను అయిదు వందలు మిగిలేవి. వేరే పని వాళ్ళని పెట్టకుండా తాను, తన భార్య కలిసి జెంట్స్ మరియు లేడీస్ టాయిలెట్‌లు చూసుకునే వాళ్ళు.

తామిద్దరూ అభిమానించే సినిమా తార మాలిని అరోరా ఫోటో, అలాగే హీరో గౌరవ్ కపూర్ ఫోటో లామినేట్ చేయించి లేడీస్ మరియు జెంట్స్ టాయిలెట్‌కి గుర్తుగా తగిలించుకున్నారు. ఇలా తమ జీవితాలు హాయిగా సాగి పోతున్న తరుణంలో..

ఆ రోజు హఠాత్తుగా పోలీస్ స్టేషన్ నుండీ పిలుపు రావడంతో భార్యకు కూడా చెప్పకుండా పరుగు పరుగున వచ్చేశాడు ఆందోళనతో యాదవ్.

ముందు ఆ ఫోటోలు తీసెయ్యమని గదమాయించాడు పోలీసాయన.

“అయ్యా ఏదో నా అభిమానం కొద్దీ వాళ్ళ ఫోటోలు తగిలించుకున్నాను. అవే మా టాయిలెట్‌కు గుర్తింపు. ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే ఆ ఫోటోల వల్ల వచ్చిన గుర్తింపే మా టాయిలెట్ బాగా నడవడానికి కారణం. మమ్మల్ని ఇలా బతకనియ్యండి. మేం ఎవరికీ అన్యాయం చెయ్యలేదు” బతిమాలుకున్నాడు యాదవ్.

“ఒరే యాదవ్, ఎవరూ పట్టించుకోనంత వరకూ సరే గానీ ఆ ఫోటోలో ఉన్న ఆవిడే కుదరదన్నాకా నువ్వు వదిలెయ్యాల్సిందే. నా మాట విని ఆ ఫోటోలు తీసెయ్యి. పెద్దోళ్లతో పెట్టుకోకు. ఆవిడ వచ్చే లోపల వెళ్లి తీసెయ్యి.” అని పోలీసు చెప్తున్నంత లోనే అక్కడికి వచ్చాడు మాలిని మేనేజర్ జోషి. విషయం ఎంత వరకూ వచ్చిందో కనుక్కు రమ్మని పంపారు మాలిని మేడం గారు నన్నిక్కడికి అన్నాడు.

“సార్, మిమ్మల్ని కంప్లైంట్ రాసుకొమ్మని చెప్పారు మాలిని మేడం గారు. వచ్చి సంతకం చేస్తారట. ఆవిడ చాలా పట్టుదలగా ఉన్నారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలని వాడడం అందునా ఒక టాయిలెట్‌కి తగిలించడం చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఈ విషయం చెప్పి రమ్మని మరీ నన్ను పంపించారు” అంటూ చెప్పాడు జోషి.

“జోషి గారు! వాడు ఏదో అభిమానం కొద్దీ మేడం గారి ఫోటో తగిలించుకున్నాడు. పక్కన జెంట్స్ టాయిలెట్‌కి కూడా హీరో గౌరవ్ కపూర్ ఫోటో తగిలించాడు. తీసేయిస్తా లెండి. ఇదిగో వాడితో ఇదే చెప్తున్నా. వాడిని వదిలేద్దాం” అనునయంగా చెప్పాడు పోలీసు.

మేడం ససేమిరా అంటోంది అని జోషి చెప్పడంతో, అయిష్టంగానే కంప్లైంట్ రాసుకుని యాదవ్‌ని వార్నింగ్ ఇచ్చి పంపించేశాడు పోలీసు.

విషయం ఇంతటితో అయిపోతుందనుకున్నా, విషయం పైదాకా వెళ్లడంతో టాయిలెట్ కాంట్రాక్టర్‌కి నోటీసు పంపించారు పోలీసులు. చివరికి యాదవ్‌ని ఆ పని నుండీ తొలగించి కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నాడు.

న్యూస్ ఛానెళ్ల పుణ్యమా అని ఈ విషయం దేశమంతా పాకింది.

***

హఠాత్తుగా మెలకువ వచ్చింది మాలినికి. పదేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన తనకు ఇప్పుడెందుకు గుర్తు వచ్చినట్లు. మనసు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తోంది. జోషిని పిలిపించి చెప్పింది. “అసలు ఆ రోజు మళ్ళీ ఏమయిందో మనం పట్టించుకోలేదు. ఒకసారి ఎంక్వయిరీ చేస్తారా?” అని అడిగింది.

“మేడం గారూ! ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన విషయం వాళ్లెవరో కూడా గుర్తు లేదు సరిగా. మీరు అనవసరమైన ఆలోచనలు మానుకుని రెస్ట్ తీసుకోండి. నేను వేరేవర్నయినా ఏర్పాటు చేస్తాను” అన్నాడు జోషి.

“లేదు జోషి గారు, దయచేసి మీరు ఎలాగైనా ఆ రోజు జరిగిన సంఘటన తాలూకు వాళ్ళ వివరాలు కనుక్కోండి. దయచేసి నా మాట కాదనకండి.” అంది మాలిని.

మాలిని మాట కాదన లేక జోషి తల పట్టుకు కూర్చున్నాడు. ఆలోచించగా ఒక ఆలోచన తట్టింది. ఆ రోజు షూటింగ్ జరిగిన ధారావి ప్రాంతపు పోలీస్ స్టేషన్‌లో పదేళ్ల క్రితం నమోదైన కేసు వివరాల్ని వెతికించాడు. ఆ రోజు మాలిని పేరుతో రిజిస్టర్ అయిన కంప్లైంట్ కోసం వెతికితే దొరికింది ఆ టాయిలెట్ తాలూకు వ్యక్తి యాదవ్ అని.

అతని ఆచూకీ కోసం వెతికితే, ముంబై లోనే వేరెక్కడో ఫుట్‌పాత్ పైన వస్తువులు అమ్ముకుంటున్నాడని తెలిసింది. వెంటనే మాలినికి ఉన్న పరపతితో యాదవ్‌కి పొలీసులతో కబురు పంపించాడు జోషి.

పదేళ్ల క్రితం జరిగిన సంగతి ఇంకా మర్చిపోలేదు యాదవ్. భయంతో వణికిపోయాడు. అయ్యో దేవుడా నాకెందుకు ఈ శిక్ష అని భయపడుతూ జోషి దగ్గరికి వెళ్ళాడు పోలీసుల సహాయంతో.

“అయ్యా! ఆ రోజు తెలీక తప్పు చేసాను. ఇంకా వెంటాడుతూనే ఉన్నారా నా గురించి. ఊరొదిలి వెళ్ళిపోతాం. మీ జోలికి రాము. దయచేసి మమ్మల్ని వదిలెయ్యండి” అని చెప్తున్నాడు యాదవ్, జోషి చెప్పేది కూడా వినకుండా.

ఇక లాభం లేదనుకుని, జోషి విషయం చెప్పాడు – “చూడు యాదవ్. మాలిని అరోరా గారికి ఆరోగ్యం ఏమీ బాగాలేదు. మిమ్మల్ని ఒకసారి చూడాలి అంటోంది. మీకేం భయం లేదు. ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి. ఆవిడ ఆరోగ్యం బాగుపడితే అంతే చాలు. దయచేసి నా మాట కాదనకు” అని బతిమాలడంతో జోషి వెంట బయల్దేరాడు యాదవ్.

***

ధారావి లాంటి మురికివాడలు తప్ప మరో చోటు చూడని యాదవ్ జుహు లోని మాలిని బంగ్లాకి చేరుకున్నాడు. భయం భయం గానే మాలిని ఉన్న హాల్ లోకి ప్రవేశించాడు. మాలిని జుట్టు చెదిరి పోయి, ముఖం వాడిపోయి కళావిహీనంగా ఉంది. తాము అభిమానించే సినిమా తార మాలిని ఈవిడేనంటే నమ్మలేక పోయాడు.

జోషి మాలినిని సమీపించి మెల్లిగా తట్టి లేపాడు. యాదవ్‌ని చూపించి ఇతనే మీరు చూడాలనుకుంటున్న మనిషి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తే పంపించేస్తాను. డాక్టర్ గారు వచ్చే టైం అయింది. చెప్పాడు జోషి.

“బాబూ! నువ్వు నాకు సరిగా గుర్తు లేవు. కానీ నీ గురించి నేను అన్న మాటలు, నేను చేసిన పని బాగా గుర్తు ఉన్నాయి. ఎలా వున్నావు ఇప్పుడు? నీ భార్య, పిల్లలు ఏమి చేస్తున్నారు? ” అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది మాలిని.

మాలినిని చూడగానే విషయం పూర్తిగా అర్థం అయింది యాదవ్‌కి. “అమ్మా, మీకు కాన్సర్ ఎలా సోకింది.? మీరేమీ చెప్పక్కర లేదు. నా కూతురు టాటా మెమోరియల్ కాన్సర్ ఆసుపత్రిలో నర్స్‌గా మీ లాంటి స్థితిలో ఉన్న ఎందరో రోగులకు సేవ చేస్తోంది.

మీకు అభ్యంతరం లేకపోతే నా భార్యని మీకు తోడుగా ఉంచుతాను. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఇలాంటి పనులు మాకు కొత్తేమీ కాదు. కొద్దిరోజుల్లోనే మీకు నయమయి పోతుంది.” అని యాదవ్ చెపుతుంటే మాలిని అతనిపట్ల తను చేసిన పనికి సిగ్గుతో తలదించుకుని కన్నీరు కార్చింది.

మాలిన్యం తన శరీరం లోనే కాదనీ, మనసులో కూడా ఉందనీ కానీ యాదవ్ తన స్వచ్ఛమైన మనసుతో తన మనసు లోని మాలిన్యాన్ని గుర్తించేలా చేశాడని పశ్చాత్తాపం చెందింది మాలిని.

వెంటనే జోషిని పిలిచి యాదవ్ను అతని భార్యను బంగ్లాలో పనికి తీసుకోమని చెప్పింది.

యాదవ్ తన భార్య సుష్మకు కబురు పంపి వెంటనే రప్పించాడు మాలిని బంగ్లాకి. యాదవ్ కూడా అదే బంగ్లాలో పని చేస్తూ భార్యకి సహాయంగా ఉంటూ మాలినికి సేవ చెయ్యడంతో అనుకున్న దానికంటే త్వరగానే మాలిని మామూలు మనిషయ్యింది.

ఇన్నాళ్లూ ధనం, అందం, గర్వంతో విర్రవీగిన మాలిని అరోరా తన తప్పు తెలుసుకుని సమాజానికి ఏదైనా సేవ చెయ్యాలని నిశ్చయించుకుని తన బంగ్లాను ఓ శరణాలయంగా మార్చి ఎందరో అభాగ్యులకు సేవ చేస్తూ తన శేష జీవితానికి ఓ పరమార్థం కల్పించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here