మానని గాయం

0
9

[dropcap]హ[/dropcap]ర్షవర్ధన్ తొమ్మిదో తరగతి పూర్తి చేసుకొని పదవ తరగతిలోకి ప్రవేశించాడు. పాఠశాల హర్షవర్ధన్ వాళ్ళింటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతి రోజు సైకిల్‌పై ఆ ఊరి పిల్లలతో పాటు కలిసి స్కూల్‌కి వెళ్ళివచ్చేవాడు అమ్మ ఇచ్చిన టిఫిన్ బాక్సుతో. ఇప్పటి వరకు చదివినది ఒక ఎత్తు, ఇక పై చదవాల్సినది మరో ఎత్తు. కాస్త శ్రద్ధగా చదివితే పదవ తరగతిలో పాసైతే పై చదువులకి వెళ్ళడానికి ఆస్కారం వుంటుందని ప్రతి రోజు నూరిపోసేవాడు వాళ్ళ నాన్న. అన్నయ్యలు కూడా చక్కగా చదువుకొమ్మని ప్రోత్సాహించేవారు. అలా ప్రతిరోజు పాఠశాలకి శ్రద్ధగా వెళ్ళి పాఠాలు నేర్చుకొని సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. పాఠశాల విరామ సమయాలలో తనతోటి జూనియర్, విద్యార్థినీ, విద్యార్థులతో ఆట, పాటలతో కాలక్షేపం చేసేవాడు, అప్పుడప్పుడు తన ఊరి స్నేహితుల కోసం 9వ తరగతి గదిలోకి వెళ్ళి కొద్ది సేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందించేవాడు. ఈ క్రమంలో పరిచయమైంది శ్రీనిధి హర్షవర్ధన్ కి, తనది కూడా స్కూల్‌కి నాలుగు కిలో మీటర్ల దూరంలోని ఊరు. తోటి విద్యార్థులతో కలిసి బస్సు ద్వారా స్కూల్‌కి వచ్చేది.

శ్రీనిధి వాళ్ళ నాన్నది దిగువ మధ్య తరగతి కుటుంబం. క్లాసులో హర్షవర్ధన్ ఎంత చురుకుగా ఉండేవాడో శ్రీనిధి కూడా అంతే చురుకుగా ఉండేది. పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షలలో ఎప్పుడు ఇద్దరూ ప్రథమ శ్రేణిలోనే పాసు అయ్యేవారు. పాఠశాలకి మధ్యాహ్నం (Lunch Break) భోజన సమయంలో హర్షవర్ధన్ మరియు అతని స్నేహితులు కళ్యాణి, రమ్య, అంజి, నరేష్, దేవేందర్, సంతోష్, సత్యనారాయణ, అనిత మొదలైన వారు అంతా పాఠశాలలో చెట్ల క్రింద కూర్చొని భోజనం చేసేవారు. ఈ క్రమంలో అన్నం, కూరలు ఒకరికొకరు పంచుకొనేవారు. ఒక రోజు పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్, 05) ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హర్షవర్ధన్ తొమ్మిదో తరగతి వారికి ఆంగ్ల ఉపాధ్యాయుడిగా (A Test of True Love) పాఠం చెప్పాడు. పాఠం విన్న పర్యవేక్షక ఉపాధ్యాయులు హర్షవర్ధన్కి బహుమతిని ప్రకటించారు.

అలానే శ్రీనిధి కూడా 8వ తరగతి విద్యార్థులకు గణితం (త్రికోణమితి) అధ్యాయంలోని లెక్కలు చెప్పింది. తనకు కూడా బహుమతిని ఖాయం చేశారు పర్యవేక్షకులు (Observers). ఆ రోజు సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడి చేతుల మీదుగా ఇద్దరు (హర్షవర్ధన్, శ్రీనిధి) బహుమతులు అందుకున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వార్షిక పరీక్షలకు ప్రిపేర్ చేయించేవారు. ప్రతిరోజు సాయంత్రం గంట సేపు స్టడీ అవర్స్ (Study hours) నిర్వహించేవారు. ఆ రోజు బాధ్యులుగా వున్న ఉపాధ్యాయులు సందేహ నివృత్తి చేసేవారు, చివర్లో చిన్న స్లిప్ టెస్ట్ (Slip Test) పెట్టి మార్కులు దిద్ది ఇంటికి పంపేవారు. జనవరి 01 వచ్చింది. కొత్త సంవత్సరం కొత్త బట్టలతో పాఠశాలకి హాజరు అయ్యాడు. వెళ్తూ వెళ్తూ అంతకు ముందు రోజు కిరాణ కొట్టులో – దొరికే గ్రీటింగ్ కార్డులను కొని Wish you happy New Year అని వ్రాసి, మిత్రులందరికి పంచాడు తొమ్మిదో తరగతి గదిలోకి వెళ్ళి శ్రీనిధికి మరియు తన స్నేహితులకు కూడా పంచాడు, ఆ రోజు అందరూ ఆనందంగా గడిపారు.

ఈ క్రమంలోనే సంక్రాంతి సెలవులు వచ్చాయి. పది రోజుల పాటు విరామం దొరికింది. ఈ పది రోజులు ఉపాధ్యాయులు ఇచ్చిన నియోజనం మరియు ఇంటి పని (Assignment and Homework) పూర్తి చేశాడు. సెలవులు పూర్తికావటంతో, పాఠశాలకు వెళ్ళాడు హర్షవర్ధన్, ఆ రోజు శ్రీనిధి పాఠశాలకు రాలేదు, శ్రీనిధి స్నేహితులతో పాఠశాలకు ఎందుకు రాలేదని ఆరా తీయగా సెలవుల్లో వాళ్ళ మామయ్య గారింటికి కుటుంబంతో కలిసి వెళ్ళిందని ఇంకా రాలేదని చెప్పారు. ఆ రోజును భారంగానే గడిపాడు హర్షవర్ధన్. జనవరి-26 (గణతంత్ర్య దినోత్సవంను) పురస్కరించుకొని నోటీసు పంపారు ప్రధానోపాధ్యాయులు. దాని సారాంశం ఆటలు, పాటలు, మొ॥ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు గెలిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లుగా వుంది ఆ ప్రకటన సారాంశం. కబడ్డి, క్రికెట్, ఖో-ఖో, వాలీబాల్ మరియు పాటల పోటీలలో తన పేరును క్లాసు టీచర్ వద్ద రాయించాడు హర్షవర్ధన్. అలానే శ్రీనిధి కూడా ఆడపిల్లలు ఆడే ఆటల్లో తన పేరు కూడా రాయించుకుంది. అన్నింట్లో ఇద్దరూ సమానంగా బహుమతులు గెల్చుకున్నారు. జనవరి-26 జెండావిష్కరణ అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆ ఊరి సర్పంచ్ గారి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు ఇద్దరు.

వార్షిక పరీక్షలు దగ్గరపడున్నాయి, ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థులపై ఇంకాస్త శ్రద్ధ ఎక్కువగా పెట్టి క్లాసులో బాగా చదివే విద్యార్థులను మరింతగా ప్రోత్సహిస్తున్నారు, పాఠశాలను మండలంలోనే ప్రథమ స్థానంలో వుంచడానికి. వార్షిక పరీక్షల హాల్ టికెట్లు వచ్చాయి. పరీక్ష సెంటర్ సెయింట్ మేరీ ఉన్నత పాఠశాల తన గ్రామానికి దగ్గరలోని పట్టణం. ఆ రోజు పదవ తరగతి విద్యార్థులను అందరిని పిలిచి పరీక్షకు పదిహేను రోజుల ముందుగానే అందర్ని పరీక్షా కేంద్రానికి దగ్గరలో ప్రయివేటు పాఠశాలలో భోజనం మరియు పడుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు, పరీక్ష సమయంలో ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలో, ఎలా చదువుకోవాలో ఒక్కొక్క సబ్జెక్టు ఉపాధ్యాయుడు వచ్చి పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు వివరించారు. ఆ రోజు సాయంత్రం శ్రీనిధి హర్షవర్ధన్‌కి వ్రాయబోయే వార్షిక పరీక్షలకు All the best చెప్పింది. పరీక్షలు బాగా వ్రాయాలని, ప్రథమ శ్రేణిలో పాసుకావాలని సూచించింది. తను కూడా ఆనందం వ్యక్తం చేశాడు.

ఇంటికి వచ్చి పరీక్షలకు సంబంధించిన విషయం అమ్మా నాన్నలకి చెప్పి, (Pocket Money) మరియు బట్టలు పుస్తకాలు, జామెట్రీ బాక్సు అన్నీ బ్యాగులో సర్దుకున్నాడు. అమ్మానాన్న ఇద్దరు జాగ్రత్తలు చెప్పారు. అమ్మ కళ్ళలో నీటి ధారలు చూశాడు హర్షవర్ధన్, బస్తీకి తొలిసారిగా వెళ్తుండటంతో అన్నయ్యలు కూడా సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో పాఠశాల వారు ఏర్పాటు చేసిన బస్సు వచ్చింది, బస్సులో ఎక్కుతూ అమ్మా నాన్నలను గట్టిగా హత్తుకున్నాడు. హర్షవర్ధన్ మొఖంలో భయంతో కూడిన ఆనందాన్ని గమనించాడు వాళ్ళ నాన్న బస్సు బయలుదేరింది. సార్లకి కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని మిగతా తల్లిదండ్రులందరూ చెప్పారు. పరీక్షలు మొదలయ్యేలోపు బస్తీకి ఏదైనా పనిమీద వెళ్ళినపుడు తీరిక చేసుకొని తన కొడుకు దగ్గరికి వెళ్లేవాడు హర్షవర్ధన్ వాళ్ళ నాన్న అరవిందవర్ధన్, స్వీట్లు, చాక్లెట్లు, మొ॥ వస్తువులు కొని ఇచ్చేవాడు. తెల్లవారితే పరీక్ష అందరూ రాత్రి పదింటివరకు చదవి త్వరగా లేచి స్నానాలు చేసి (Breakfast) కి సిద్ధంగా ఉండాలని చెప్పారు. తెల్లారింది పరీక్షకి అందరూ ఆనందంగా వెళ్ళారు. అంతే ఆనందంగా పరీక్ష ముగించుకొని బయటకి వచ్చారు. వీరికోసం ఎదురుచూస్తున్న (Subject Teachers) ప్రశ్న పత్రమును తీసుకొని అందరిని పక్కకు పిలిచి ఎవరు ఎవరు ఎలా వ్రాశారు? అని ఆరా తీస్తున్నారు. హర్షవర్ధన్‌ని కూడా అడిగారు వారి మాస్టారు ఆనందంతో సమధానం చెప్పాడు. వరుసగా పరీక్షలు వ్రాస్తూనే వున్నాడు.

ఈ క్రమంలో ఒక రోజు పరీక్ష వ్రాసి వచ్చిన వారందరికీ ఒక పిడుగు లాంటి వార్త కలవరపాటుకు గురిచేసింది. ప్రశ్నపత్రము లీకైనట్లుగా, ఆ రోజు రాత్రి టీ.వి. వార్తలలో, మరియు ఉదయం పత్రికలలో వచ్చింది. తెలంగాణలో సైన్సు పరీక్షను, ఆంధ్రలో గణితం పరీక్షను మళ్ళీ నిర్వహిస్తారని, షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తారని ఆ వార్తల సారాంశం. పరీక్షలు సంతృప్తిగా రాశామన్న ఆనందంలో మళ్ళీ పరీక్ష వ్రాయాల్సి వస్తుందని బాధతో అందరూ ఇంటికి వెళ్ళారు. పరీక్ష షెడ్యూల్ వచ్చింది ఏప్రిల్-15న సైన్సు పరీక్షను తెలంగాణలో, ఆంధ్రలో గణితం పరీక్షను అదే రోజున నిర్వహిస్తారని. మళ్ళీ రాయాల్సిన పరీక్షను శ్రద్ధగా చదువుతూనే వున్నాడు హర్షవర్ధన్.

ఒక రోజు పాఠశాల ప్రధానోపాద్యాయుడి నుండి పదవ తరగతి విద్యార్థులందరికి పిలుపు వచ్చింది పాఠశాలకి రమ్మని. తెల్లారి తిరిగి పాఠశాలకి తన ఊరి పిల్లలతో కలిసి వెళ్ళాడు. అందరు వచ్చిన తర్వాత ఒక తరగతి గదిలో కూర్చోబెట్టి సైన్స్ లోని ముఖ్యమైన విషయాలు ఉపాధ్యాయులతో చెప్పించారు. పరీక్ష బాగా వ్రాయాలని పాఠశాల ప్రిన్సిపాల్ సూచించారు. అనంతరం తొమ్మిదో తరగతిలోకి వెళ్ళి తన మిత్రులను పలకరించాడు హర్షవర్ధన్, శ్రీనిధి కూర్చున్న బెంచి వైపు అతని దృష్టి పడింది, పాఠశాలకు రాలేదు. పక్కవారిని అడిగి తెల్సుకున్నాడు జలుబుతో, జ్వరంతో వుందని, అందుకే స్కూల్‌కి రాలేదని శ్రీనిధి బెంచిమేట్స్ చెప్పారు. నిరాశతో ఇంటికి వచ్చాడు. మళ్ళీ పుస్తకంపై శ్రద్ధ పెట్టాడు. పరీక్ష రాయాల్సిన రోజు రానే వచ్చింది. హర్షవర్ధన్ వాళ్ళ నాన్నతో పరీక్ష వ్రాయడానికి పట్టణానికి బయలుదేరాడు.

నాన్న చెప్పిన ధైర్యంతో పరీక్ష గదిలోకి వెళ్ళాడు. సంతోషంగా పరీక్ష వ్రాసి వస్తున్న కొడుకును హత్తుకొన్నాడు. ప్రథమ శ్రేణిలో పాసు అవుతానని చెప్పాడు. మధ్యాహ్నం సమయం కావడంతో హోటల్‌కి తీసుకొని వెళ్ళి భోజనం చేయించి, ఏం కావాలని అడిగాడు కొడుకును, తొలిసారిగా నాన్నతో సినిమా చూయించాలని చెప్పాడు, కొడుకు కోరికను కాదనక సినిమాకి తీసుకొని వెళ్ళాడు. నలభై రోజుల తర్వాత వచ్చిన పరీక్ష ఫలితాలలో హర్షవర్ధన్ ప్రథమ శ్రేణిలో పాసు అయినట్టు సమాచారం తెచ్చారు వాళ్ళ నాన్నగారు.

ఇంటికి దగ్గర్లోని దర్గా వద్ద మూడు కొబ్బరి కాయల్ని కొట్టి మొక్కు చెల్లించుకుంది. ఫలహారం చేసి వీధిలో అందరికి పంచింది ఆనందంతో, కొడుకును డాక్టర్‌ని చేయాలని తండ్రి, ఇంజనీరును చేయాలని తల్లి, మరియు అన్నయ్యలు రకరకాల అభిప్రాయాలతో ఆ రోజు రాత్రి గడిపారు.

మంచి రోజు చూసుకొని హర్షవర్ధన్ని పట్టణంలో ఒక మంచి పేరున్న కళాశాలలో చేర్పించారు. హాస్టల్‌లో ఉంటూ శ్రద్ధగా చదువుకొమ్మని పుస్తకాలు, పెన్నులు కొనిచ్చాడు. ఈ సమయంలో హర్షవర్ధన్ పూర్తిగా శ్రీనిధిని మర్చిపోయాడు. అప్పుడప్పుడు తన క్లాసుమేట్సను అడిగి తెల్సుకొనేవాడు. కాని కల్సుకోవటం, మాట్లాడటం వీలుకావటం లేదు, రోజులు గడిచి పోతున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం కళాశాల టాపర్‌గా నిలిచాడు. ఇక్కడ పాఠశాలలో పదవ తరగతి వార్షిక పరీక్షలలో టాపర్‌గా నిలిచింది శ్రీనిధి, ఈ విషయం హర్షవర్ధన్‌కు కూడా తెలిసింది. తన ఫ్రెండ్స్ ద్వారా శ్రీనిధికి చాక్లెట్లతో కూడిన ఒక ఉత్తరం పంపించాడు, అవి తీసుకున్న శ్రీనిధి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. శ్రీనిధి తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు కళాశాలలో MPC గ్రూపులో చేర్పించారు. దగ్గరి బంధువుల ఇంట్లో వుండి ప్రతి రోజు కళాశాలకు వెళ్ళి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. లోలోపల శ్రీనిధికి బాధగా వున్నా మొదటిసారిగా బస్తీ వాతావరణం, కళాశాల వాతావరణం కూడా కొత్త కావటంతో కొంత సమయం పట్టింది సర్దుబాటు చేసుకోవడానికి, అక్కడ హర్షవర్ధన్ కళాశాలలో జరిగే అన్ని అకాడమిక్, నాన్ అకాడమిక్ కార్యక్రమాలలో పాల్గొని అందరి దృష్టిలో పడ్డాడు. రెండవ సంవత్సరం కూడా వేగంగా గడిచిపోయింది. ఆ సంవత్సరం వ్రాసిన ఎంసెట్ పరీక్షలో మంచి ర్యాంకుతో మళ్ళీ వార్తల్లో నిలిచాడు. ఇంట్లో అందరు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మెడికల్ కౌన్సిలింగ్ జరగటానికి కొంత సమయం ఉండటంతో తన తోటి మిత్రులతో కలిసి శ్రీనిధి వారింటికి వెళ్ళాడు. హర్షవర్ధన్ చూడగానే శ్రీనిధికి ఆనందం కలిగింది.

శ్రీనిధి వాళ్ళమ్మ అందర్ని కూర్చోబెట్టి, టీ, మరియు స్నాక్స్ ఏర్పాట్లు చేసింది, ఎంసెట్‌లో ర్యాంకు వచ్చినట్లుగా కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పాడు. శ్రీనిధి తల్లిదండ్రులు కూడా హర్షవర్ధన్ చదువులో చూపించే చురుకుదనం చూసి అభినందనలతో ముంచెత్తారు. శ్రీనిధిని మంచిగా చదువుకోవాలని, సమయాన్ని వృధా చేయవద్దని చెప్పి తన అనుమతితో వారింటి నుండి బయలుదేరాడు. ఈ క్రమంలోనే ఎంసెట్ కౌన్సిలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది, ఆ ఊరు నుండి మెడిసిన్ చదువబోతున్న మొదటి వైద్య విద్యార్థి హర్షవర్ధన్ కావడంతో ఊళ్ళో ఆ నోటా, ఈ నోటా అందరికి తెల్సింది, మెడికల్ సీటు వచ్చినట్లు దగ్గరి వారు, దూరపు బంధువులు వారింటికి వచ్చి అభినందించటం, కళాశాల యాజమాన్యం వారు కూడా వచ్చి ఊరిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ విధంగా మండల స్థాయిలో, విద్యార్థులందరికి ప్రేరణగా నిలిచాడు, కరపత్రాలు, బ్యానర్లు మొ॥ వాటితో యాజమన్యాలు ప్రచారం చేసుకున్నాయి. మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ, కొత్తగా పరిచయం అయిన స్నేహితులు, స్నేహితురాళ్ళతో ఉల్లాసంగా, ఉత్సాహంగా రోజులు గడిచిపోతున్నాయి. శ్రీనిధి ఇంటర్ రెండో సంవత్సరం కళాశాల టాపర్‌గా నిలిచింది. ఈ విషయం హర్షవర్ధన్కి కూడా తెలిసింది. అప్పట్లో సెల్ ఫోన్లు అందుబాటులో లేకపోవటంతో తను వుండే హాస్టల్ మేట్‌తో కలిసి శ్రీనిధి వాళ్ళింటి ల్యాండ్ లైన్ నెంబర్‌కి ఫోన్ చేశాడు, అదృష్టవశాత్తు తనే ఫోన్ లిఫ్ట్ చేసింది, హైద్రాబాద్ నుండి హర్షవర్ధన్ మాట్లాడుతున్నట్లుగా చెప్పాడు. ఆశ్చర్యంతో శ్రీనిధికి మాటలు రాలేదు. ఈ లోపు వంటింట్లో నుండి వాళ్ళమ్మ (సరస్వతి) మాటలు వినిపించాయి శ్రీనిధికి.

ఫోను ఎవరు చేశారని? తన క్లాస్‌మేట్ రమ్య చేసిందని అబద్దం చెప్పింది, ఇంటర్ తర్వాత ఏం చేయబోతున్నావని? ఎక్కడ చదువుతావని అడిగాడు హర్షవర్ధన్, శ్రీనిధికి ఇంకొక తమ్ముడు వున్నాడు, వాడు కూడా ఈ సంవత్సరం పదవ తరగతి వార్షిక పరీక్షలో ప్రథమ శ్రేణిలో పాసు అయ్యాడు. శ్రీనిధి వాళ్ళ నాన్నకు ఇద్దర్ని చదివించడం భారం కావడంతో, ఈ విషయాలు అన్ని హర్షవర్ధన్‌కి చెప్పింది ఆ రోజు ఫోన్‌లో, పై చదువుల విషయం అమ్మ నాన్నలపై ఆధారపడి వుందని తను ఏం చేయలేనని, ఎంసెట్‌కి అప్లయి చేయమని సూచించాడు హర్షవర్ధన్.

తను ఇంటర్ లో చదివింది MPC విభాగం కావడంతో, ఎంసెట్ కోచింగ్‌కి సంబంధించిన పుస్తకాలు స్నేహితుని ద్వారా పంపిస్తానని తను చదివే కళాశాల పేరు అడిగి తెల్సుకొని అన్ని వివరాలు వ్రాసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత వీలు చూసుకొని ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అన్ని పుస్తకాలు కోఠిలోని పుస్తకాల షాపు నుండి కొనుగోలు చేసి ట్రెయిన్‌లో బయలుదేరాడు. కిటికి ప్రక్కన కూర్చొని పాత జ్ఞాపకాలలోకి వెళ్ళాడు, శ్రీనిధితో ఏం మాట్లాడాలి? ఎలా ప్రోత్సహించాలి? అని మనసులో ఊహించుకుంటున్నాడు. ఆ ఊహలతో రెండు గంటల ప్రయాణం చేశాడు, రైలు చేరుకుంది, ఆటో అతను తన కోసమే అన్నట్లుగా హర్షవర్ధన్ చూసి అడిగాడు, తను చదివే కళాశాల పేరు చెప్పి కిరాయి మాట్లాడినాడు హర్షవర్ధన్. కళాశాల గేటు ముందు నిలబడి శ్రీనిధికి అటెండర్ ద్వారా సమాచారం చేరవేశాడు. క్లాసులోంచి లెక్చరర్ అనుమతితో బయటకు వచ్చింది.

హర్షవర్ధన్ను చూడగానే ఆశ్చర్యం, ఆనందం రెండూ ఒకేసారి కలిగాయి శ్రీనిధికి. మున్సిపాల్ పార్కుకి వెళ్ళి అక్కడే మూడు గంటల పాటు గడిపారు, చాలా విషయాలు మాట్లాడుకున్నారు. తన మెడిసిన్ పూర్తవ్వగానే, M.S చదవాలని అది పూర్తైన తర్వాత తన గ్రామానికి దగ్గర్లోని పట్టణంలో ఒక పెద్ద మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించాలని వున్నట్లు చెప్పాడు. బాగా చదువుకోవాలని ఇంజనీరింగ్‌లో సీటు వస్తే ఇంజనీరింగ్ కళాశాలలు హైద్రాబాద్ పరిసరాలలో ఉంటాయి కాబట్టి తరుచు కలుసుకోవచ్చునని చెప్పాడు సరేనంది శ్రీనిధి,

కాని తన చదువులు తల్లిదండ్రుల నిర్ణయముపై ఆధారపడి వుంటాయని ఊరికి దూరంగా తనని చదివిస్తారో లేదో అని, ఇప్పటికే అమ్మ తన పెళ్ళి ప్రయత్నాలు నాన్న వద్ద ప్రస్తావిస్తుందని చెప్పింది భవిష్యత్తులో జరుగబోయే పరిణామాలు ఎలా ఉన్నా ముందు చదువు మీద శ్రద్ధ పెట్టాలని అవన్నీ తర్వాత చూసుకుందామని ధైర్యం చెప్పాడు, మధ్యాహ్నం మాటల్లో ఇద్దరూ కలిసి భోజనం చేసి శ్రీనిధిని కాలేజీ గేటు ముందు వదిలి శ్రద్ధగా చదువుకోవాలని చెప్పి తను హైద్రాబాదు బయలుదేరాడు.

తర్వాత జరిగిన ఎంసెట్ పరీక్ష ఫలితాల్లో శ్రీనిధికి రాష్ట్ర స్థాయిలో 125 (నూట ఇరవై ఐదు) ర్యాంకు వచ్చింది. కాని ఇంజనీరింగ్ లాంటి ఖర్చుతో కూడిన ఉన్నత చదువులు చదివించే సేమత లేకపోవటంతో కూతురి ఇంజనీరింగ్ చదువులపై నీళ్ళు పోశారు శ్రీనిధి అమ్మా, నాన్నలు. ఇరుగు పొరుగువారు చదివించాలని, చదువులకు కూడా సహకరిస్తామని చెప్పినా భార్య మాటకు ఎదురు చెప్పలేక కూతురును ఇంజనీరింగ్ చదివించలేకపోతున్నందుకు మనసులో చాలా మధన పడ్డాడు రంగయ్య, వారం రోజులుగా ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతోంది, మధ్యలో ఒకసారి హర్షవర్ధన్ తనతోటి మెడిసిన్ విధ్యార్థినితో శ్రీనిధి ఇంటి ల్యాండ్ ఫోన్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ కలిపి హర్షవర్షన్‌కు ఇచ్చింది, ఎంసెట్ ర్యాంకు వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్పాడు, ఇంట్లో ఏమంటున్నారని అడిగాడు? అదే చర్చ జరుగుతోందని అమ్మా, నాన్నల మధ్య గొడవ జరుగుతుందని, తమ్ముడి చదువుకి కూడా ఖర్చులు పెరుగుతాయని అతని కోసం తనను ఇంజనీరింగ్ చదువులు వద్దు అంటున్నారని, దగ్గరలోని ఓ ప్రయివేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేయమంటున్నారని చెప్పింది శ్రీనిధి. త్వరలో వస్తానని ధైర్యం చెప్పాడు. ఈ వారం రోజుల్లో పనిమీద పట్టణానికి వెళ్ళిన ప్రతిసారి అన్ని డిగ్రీ కాలేజీలు, అందుబాటులో వున్న కోర్సుల వివరాలు, ఆయా కళాశాలల కరపత్రాలు ఇంటికి తెచ్చి కూతురితో చర్చిస్తూనే వున్నాడు, తనకి పూర్తిగా అర్థం అయింది ఇక ఇంజనీరింగ్ చదవటం దాదాపు కలేనని.

ఒక రోజు స్కూల్లో పాఠాలు చెప్పిన మాస్టారు వచ్చారు, పిల్లల చదువుల వివరాలు అడిగి తెల్సుకొని, వారి ఆర్థిక పరిస్థితిని గమనించి అబ్బాయి, ఇంటర్ రెండో సంవత్సరం, అమ్మాయిని డిగ్రీ చదివించాలని చెప్పాడు వాళ్ళ నాన్న రంగయ్య, వారి ఆర్థిక పరిస్థితిని చూసి ఏమి అనలేక, పిల్లల దగ్గర చదువుల తల్లి వున్నా చదివించే స్తోమత లేకపోవడంతో మాట్లాడలేకపోయారు మాస్టారు. జేబులోంచి రూ॥10,000/-లు (పది వేల రూపాయలు) తీసి శ్రీనిధి చేతిలో పెట్టి శ్రద్ధగా చదువుకోవాలని దీవించి వెళ్ళిపోయాడు. ఒక రోజు కూతురిని వెంటబెట్టుకొని పట్టణానికి బయలుదేరాడు రంగయ్య. బస్టాండుకు దగ్గర్లోని ఓ ప్రయివేటు కళాశాలో B.SC బియస్సీ కంప్యూటర్ కోర్సులో చేర్పించాడు. ఫీజుల వివరాలు వాయిదా పద్దతిలో చెల్లించే విధంగా కళాశాల సమయాలు అన్ని తెల్సుకున్నాడు.

శ్రీనిధికి కళాశాల లెక్చరర్లు, ఆ రోజు అదే గ్రూపులో ప్రవేశం పొందిన అశ్విని, సుమ, శోభ పరిచయం అయ్యారు. ఇలా ప్రతి రోజు బసు ద్వారా కళాశాలకు వెళ్ళి వచ్చేది. ఈ క్రమంలోనే శ్రీనిధి పుట్టిన రోజు వచ్చింది, ఆ రోజు కళాశాలకు కొత్త డ్రస్సులో వెళ్ళింది, కళాశాల ఒక పూట మాత్రమే కావటంతో అందరితో ఉత్సాహంగా గడిపింది, మధ్యాహ్నం కళాశాల గేటు ముందు హర్షవర్ధన్‌ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది, హర్షవర్ధన్‌కి, తన తోటి సహచరులను (క్లాస్‌మేట్స్) పరిచయం చేసింది. అందరూ కలిసి దగ్గర్లోని బేకరీలో కూర్చొన్నారు. తెచ్చిన గిఫ్టును శ్రీనిధికి ఇచ్చి బేకరీలో తన చేత కేక్ కట్ చేయించాడు. శ్రీనిధి చదువుల క్రమం మారిపోతుండటంతో కనీసం బీ.ఇడి. చేస్తే టీచర్ ఉద్యోగం ఐనా వస్తుందని త్వరలో సెట్ అవ్వచ్చునని సూచించాడు, పై చదువుల సంగతి ఏమోకాని ఇంట్లో తనకి వాళ్ళమ్మ పెళ్ళి చేసుకొమ్మని, ప్రతిరోజు తండ్రితో ఒత్తిడి చేస్తోందని ఏడుస్తూ చెప్పింది, పుట్టినరోజు ఆనందం అంతా ఆవిరైంది శ్రీనిధికి, తను అన్ని చూసుకుంటానని, బాధపడవద్దని ధైర్యంగా ఉండమని, ఎలా జరగాల్సి వుంటే అలానే జరుగుతుందని చెప్పాడు. ఆ రోజు శ్రీనిధికి స్పష్టంగా అర్థమైంది. హర్షవర్ధన్ మనసులో తను వున్నట్లు అందుకే ఇంతగా ఎందుకు తనను ప్రోత్సహిస్తాడని, కాని తను వేరు తన కుటుంబం పరిస్థితులు వేరు. ఇంటికి వెళ్ళి తల్లి పెట్టే పెళ్ళి వేధింపులు భరించలేక తను హర్షవర్ధన్‌ను ప్రేమిస్తున్నట్లు ఇంట్లో అంగీకరిస్తే పెళ్ళి చేసుకోవాలని, తను కూడా డాక్టర్ చదువులు అయిపోయాక పట్టణంలో పట్టణంలో హాస్పిటల్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తండ్రికి చెప్పాలనుకుంది.

కానీ చేస్తే ఎక్కడ డిగ్రీ కూడా మాన్పించి ఇంట్లో ఉంచుతారోనని భయంతో చెప్పలేక పోయింది. ఈ క్రమంలోనే హర్షవర్ధన్ మెడిసిన్ పూర్తి చేసి M.S. చేయడానికి లండన్ వెళ్ళాడు, శ్రీనిధి డిగ్రీ చివరి సంవత్సరంలోకి వచ్చింది. అప్పుడప్పుడు హర్షవర్ధన్ తను చదివే కాలేజీకి రావటం, కలవటం ధైర్యం చెప్పటం జరుగుతూనే వున్నది. డిగ్రీ చివరి సంవత్సరం కావటంతో బీఈడి ప్రవేశ పరీక్షకి సంబంధించిన అన్ని పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు. హర్షవర్ధన్ చేస్తున్న ప్రయత్నానికి ఇంట్లో జరుగుతున్న పరిణామాలకి ఏం చెప్పాలో అర్థం కాక బాధను తనలోనే దిగమింగుకుంటూ ప్రతిరోజు కళాశాలకి వస్తూ వున్నది. ఒకసారి పెళ్ళి చూపుల్లో భాగంగా తను చదివే కళాశాలకి ఓ అబ్బాయి వచ్చి చూసి వెళ్ళాడని తన తోటి క్లాసుమేట్సును తన గురించి అడిగి తెల్సుకున్నాడని స్నేహితుల ద్వారా తెలిసిందని చెప్పింది. ఇంకొకసారి తను ఇంటికి వెళ్ళే క్రమంలో బస్సు కోసం బస్టాండులో ఎదురు చూస్తున్నప్పుడు మరోకతను వచ్చి తన వివరాలు, చేసేపని అన్ని తనే పరిచయం చేసుకున్నాడని చెప్పింది, హర్షవర్ధన్ గుండెకి తూటా తగిలినట్లుగా అయింది. తనకి కూడా ఏం చెయ్యాలో తోచలేదు.

లండన్ నుండి సెలవులకి వచ్చాడు, శ్రీనిధి వాళ్ళింటికి వెళ్ళి అడిగితే ఏం చేస్తున్నావని? ఎలా పోషిస్తావని అడిగితే ఏం చెప్పేది? అర్థం కాని ఆలోచనలతో తను ఇక్కడ వున్నన్ని రోజులు ప్రతి రోజు ఏదో ఒక కారణంతో ఇంట్లో చెప్పి పట్టణానికి ఇద్దరూ ఒకే బస్సులో వచ్చేవారు తన క్లాసులు అయిపోయినాక బేకరిలో కల్సుకోవటం, మాట్లాడుకోవటం, మళ్ళీ బస్సులో కలిసి ఎవరింటికి వారు వెళ్ళడం జరుగుతూ ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు శ్రీనిధి పక్కింటి అతని దృష్టిలో వీరిద్దరూ పడ్డారు, చూసిందే తడువుగా శ్రీనిధి తల్లికి సమాచారం చేరవేశాడు.

మరో వైపు సెలవులు పూర్తి కావటంతో తిరిగి లండన్ వెళ్ళడానికి ఇంట్లో ఏర్పాట్లు జరుతున్నాయి హర్షవర్ధన్‌కి. వెళ్ళే రోజు శ్రీనిధి కలుస్తుందని శ్రీనిధి ఎక్కే బస్సు ఎక్కి పట్టణానికి నాన్న అన్నయ్యలతో కలిసి హైద్రాబాద్ కి వెళ్ళేలా ప్లాన్ చేసుకున్నాడు. కాని శ్రీనిధి ఆరోజు బస్సు ఎక్కలేదు. బస్సు ప్రక్కన కిటికీ లోంచి వారింటి వైపు చూశాడు, ఇంట్లోనే వుండి బస్సు వైపు దీనంగా చూసింది. ఆ రోజు తన కోసమే చూస్తున్నట్లుగా బస్సు వైపు తదేకంగా చూసింది, కిటికీ వైపు నుండి ఎవరో టా టా చెప్తున్నట్లు గమనించి, తను కూడా బై చెప్పినట్లుగా తలూపింది. ఇదంతా తన పక్కన కూర్చొన్న హర్షవర్ధన్ వాళ్ళన్నయ్య గమనించి అడిగాడు, జరిగినదంతా హైద్రాబాద్ చేరుకొనే లోపు అన్నయ్యతో చెప్పి తన మనసులో వున్న అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అన్ని నేను చూసుకుంటాను అధైర్యపడవద్దని చెప్పి పంపించి వేశాడు.

ఒకరోజు శ్రీనిధి వారింటికి పక్క ఊరివారు పెళ్ళి సంబంధం చూడడానికి బంధువులతో వచ్చారు, అబ్బాయి ఇంటర్ ఫెయిల్, ఒక్కడే కొడుకు, శ్రీనిధి వారి ఆర్థిక పరిస్థితితో పోల్చుకుంటే కొంచెం మెరుగ్గా వుండే మధ్యతరగతి కుటుంబం, అబ్బాయి పేరు జానకిరామ్, తండ్రికి ఒక్కడే కొడుకు ఇద్దరు అక్కలు, శ్రీనిధిని చూడగానే అమ్మాయి నచ్చినట్లుగా తన అక్కల వైపు చూసి సైగ చేశాడు. అబ్బాయి తరుపు వారు అమ్మాయిని చూసి ఆనందం వ్యక్తం చేశారు, కాని శ్రీనిధికి మాత్రం అతని చదువు, కుటుంబ నేపథ్యం, చేసేపని వృత్తి రీత్యా కంపౌండర్ (డాక్టర్ వద్ద సహాయకుడు) ఇవేవి పెద్దగా నచ్చలేదు. కాని ఏం చేయగలదు, పంజరంలో పావురంలా ఇప్పుడు తన భవిష్యత్తు తన అమ్మా నాన్నల చేతులలో ఆధారపడి వుంది అని మనసులో అనుకుంటూ బాధను దిగమింగుకొని నీళ్ళు నిండిన కళ్ళతో నాన్న వైపు చూసింది. అబ్బాయి తరపున వచ్చిన పెద్దమనుషులు పెళ్ళి లాంఛనాలకు సంబంధించిన కట్నకానుకలు అన్ని అడగడం మొదలు పెట్టారు రంగయ్యను.

అమ్మాయికి కొంత బంగారం పెళ్ళి ఖర్చులు తప్ప ఏమి ఇవ్వలేనని అందరి సమక్షంలో చెప్పాడు. ఏమి ఇవ్వకపోయిన ఫర్వాలేదు అన్ని ఖర్చులు మేమే భరిస్తాం మాకు అమ్మాయి నచ్చింది అనటంతో శ్రీనిధికి ఇక తన పెళ్ళి ఖాయం దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు, అద్భుతం జరిగితే తప్ప అనుకుంది. కాని మనసులో ఏదో మూలన హర్షవర్ధన్ మెదులుతూనే వున్నాడు, ఈ సమస్యను ఎలా అధిగమించాలి, ఎలా ముగించాలో? తెలియని అపరిపక్వ వయసులో వుంది, తన మనసుకి లక్ష బాణాలు ఒకేసారి గుచ్చుకున్నట్లుగా అనిపించాయి.

ఈ ఆలోచనలతోనే యాంత్రికంగా ఆ రోజు జరిగిన అన్ని కార్యక్రమాల్లో మరబొమ్మలా ప్రవర్తించింది, అప్పటికప్పుడే అబ్బాయి తరపు వారు బస్తీకి వెళ్ళి బంగారం షాపులో ఒక ఉంగరం, స్వీటు, తువ్వాల తెచ్చి అమ్మాయి “మాదే” అన్నట్లుగా ఉంగరం తొడిగి స్వీట్లు పంచుకొని భోజనాలు చేసి మిగతా వివరాలు త్వరలో మాట్లాడుకుందామని చెప్పి వెళ్ళిపోయారు. ఈ సంఘటనతో ఇంకా నిస్సాహాయ స్థితిలోకి వెళ్ళింది శ్రీనిధి. ఏది ఏమైనా ఈ రోజు తను హర్షవర్ధన్ గురించి చెప్పాలనుకొంది, ఇంటికి వచ్చిన చుట్టాలు ఎవరింటికి వారు వెళ్ళిపోయారు.

రాత్రి శ్రీనిధి వాళ్ళ నాన్న నాటు సారా త్రాగి ఇంటికి ఆలస్యంగా రావటం గమనించింది, ఈ లోపు అన్ని విషయాలు, పూర్తిగా అమ్మకి చెప్పింది, తల్లి తన మీద మాటలతో దాడి చేస్తుండడాన్ని గమనించాడు.

ఇంట్లో ఏం జరుగుతోందని భార్యవైపు చూసి ప్రశ్నించాడు రంగయ్య, విషయం భర్తకి చెప్పింది, నీ కూతురు ప్రక్క ఊరి అరవిందవర్ధన్ గారి అబ్బాయి హర్షవర్ధన్ ను ప్రేమిస్తున్నట్లు తను కూడా శ్రీనిధిని ఇష్టపడుతున్నట్లు పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నారని చెప్పింది, తను ప్రస్తుతం లండన్ లో M.S (Master of Surgeon) చివరి సంవత్సరం చదువుతున్నట్లుగా చెప్పింది, రంగయ్య కి విషయం విన్న వెంటనే మత్తు దిగింది, ఏం మాట్లాడాలో అర్థం కాక కాసేపు మౌనంగా నిలబడి పోయాడు, ఈ విషయం భార్యకు ముందే తెలిసిన, భర్తకు తెలిస్తే త్రాగి ఇంట్లో గొడవ చేస్తాడని శ్రీనిధి వాళ్ళమ్మ తండ్రికి చెప్పలేదు. కొద్ది సేపటి తర్వాత తేరుకొని ఇలా అన్నాడు రంగయ్య “బిడ్డా నీ పెళ్ళి దాదాపు ఖాయం అయింది, నిశ్చితార్థం కూడా జరిగింది, వారు పెళ్ళి తేది కోసం ఒత్తిడి తెస్తున్నారు, నీ డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలను దృష్టిలో పెట్టుకొని పెళ్ళి తేదీని వాయిదా వేస్తున్నట్లుగా” చెప్పాడు, ఒక్కదానివి, నీ పెళ్ళి చేయలేక వేరే కులం వాడితో లేచి పోయింది అంటే సమాజంలో నేను బ్రతికి ఉండగలనా? ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలతోనే మీ అమ్మ చచ్చినా చస్తుంది, నేను బయట ధైర్యంగా తిరగగలనా?” అని కూతురి వైపు చూస్తూ ప్రశ్నించాడు.

“వాళ్ళ కుటుంబం మంచిదేకాని, సమాజంలోని కులాల మధ్య, అడ్డుగోడలు తొలగనంత వరకు ముందు ముందు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి, సమాజం ఆధునీకత వైపు అడుగులు వేస్తున్నా, పురాతన లక్షణాలను వదిలించుకోలేక పోవటం మనలాంటి వాళ్ళ దౌర్భాగ్యం తల్లి, హర్షవర్ధన్‌తో నీ పెళ్ళి ఐతే నువ్వు మాత్రమే సంతోషంగా ఉండగలవేమో? కాని, ఈ సమాజం పెట్టే హింసలకు మేము సంతృప్తిగా ఉండగలమా తల్లి? నిన్ను నువ్వు ప్రశ్నించుకో! నువ్వు కూడా చదువుకున్నదానివి, తార్కికంగా ఆలోచించుకో సాంప్రదాయమా? తిరుగుబాటా? ఏది మంచో, ఏది చెడో ఒక రోజు సమయం ఇస్తున్నాను.

ఈ లోగా తల్లి జోక్యం చేసుకొని ఇలా అంది, “ఒక్కొగానొక్క కూతురికి మీ నాన్న పెళ్ళి చేయలేక, వేరే కులం వాడికి ఇచ్చి పెళ్ళి చేశాడనే అపవాదును ఈ వయస్సులో జీవితాంతం మోస్తూ బ్రతకలేము, నువ్వు ప్రేమించినవాడు డాక్టర్, నిన్ను ఇష్టపడేవాడు డాక్టర్ వద్ద సహాయకుడు (కాంపౌండర్) నిన్ను చూసిన దగ్గరి నుండి వాళ్ళింట్లో నువ్వే కావాలంటున్నాడట, మనం పెద్దగా ఆస్థిపరులం కాదు, అన్ని ఖర్చులు వారే భరిస్తామంటున్నారు, మా అందరికి నచ్చిన నిర్ణయం తీసుకుంటావని అనుకుంటున్నా” అన్నది.

ఈ మాటలు విని తల్లిని గట్టిగా హత్తుకొని బోరున ఏడ్చింది శ్రీనిధి, కళ్ళలో నుండి ఉబికి వస్తున్న కన్నీటిని తన పైట కొంగుతో తుడిచి ధైర్యం చెప్పింది తల్లి. ఆ రోజు నిద్ర పోకుండా ఆలోచిస్తూ ఈ విషయం హర్షవర్ధన్‌కి తెలిస్తే కుమిలిపోతాడని, గతం తాలూకు జ్ఞాపకాలన్ని ఒక్కసారిగా చుట్టుముట్టినవి. తను తొమ్మిదో తరగతిలో వున్నప్పుడు, తనకోసం రావటం, మధ్యాహ్నం భోజన సమయంలో అన్నం, కూరలు షేర్ చేసుకోవటం, తన కోసం స్వీట్లు,

చాక్లెట్లు ఇవ్వడం. పుస్తకాలు సేకరించి పోటీ పరీక్షలకు చదవమని ప్రోత్సహించడం. అన్ని ఒక్కసారిగా గుర్తుకొచ్చి బరువెక్కిన హృదయంతో ఒంటరిగానే తన బాధను ఎవరికి చెప్పినా సమాధానం లేని ప్రశ్నగా మిగులుతుందని భావించి, ఆ రాత్రి గడిపింది. మరోవైపు ఆ రోజు రాత్రి హర్షవర్ధన్ లండన్ నుండి తన ఇంటికి ఫోన్ చేశాడు, ఫోన్ లిఫ్టు చేసిన హర్షవర్ధన్ వాళ్ళన్నయ్య అన్ని విషయాలు చెప్పాడు, శ్రీనిధి నిశ్చితార్థం జరిగినట్లు త్వరలోనే పెళ్ళి కూడా ఉండొచ్చని, ఇది విన్న హర్షవర్ధన్ కాసేపు మౌనంగా రిసీవర్ చెవి వద్ద పెట్టుకొని విగ్రహంలా నిలబడిపోయాడు, తమ్ముడి పరిస్థితిని అర్థం చేసుకొని ధైర్యం చెప్పాడు, ఎలా జరగాల్సి వుంటే అలా జరుగుతుందని విధి రాతను ఎవరూ మార్చలేరని చదువులపై శ్రద్ధ పెట్టాలని, త్వరగా M.S పూర్తి చేసుకొని ఇంటికి వస్తే నాన్న ఇక్కడే హాస్పిటల్ ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నారని, అందరం ఆసక్తిగా తన కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పాడు, ఈ నెలలోనే నీ పరీక్షలు వున్నట్లు తెలిసిందని శ్రద్ధ పెట్టి చదువుకోవాలని సూచించాడు. సరేనని, గద్గద స్వరంతో ఫోన్ పెట్టేశాడు హర్షవర్ధన్.

సమాజంలో వున్న కుల, మత అంతరాలను, వాటి ద్వారా వచ్చే సమస్యలను ఎప్పుడో ఒకసారి వీలు దొరికినప్పుడు అంబేద్కర్ జీవిత చరిత్రను చదివాడు, అందులో “కులం యొక్క పునాదులపై ఒక జాతిని గాని, నీతిని గాని, సమాజమును గాని నిర్మించలేము” అన్న మాటలు, బుద్దుని చరిత్రలో బుద్ధుడు ఉపాలితో అన్న మాటలు, కురుక్షేత్రంలో కర్ణుడికి శ్రీ కృష్ణుడు చెప్పిన మాటలు, అసమర్థుని జీవయాత్రలో “సీతారామారావు” పాత్ర మాదిరిగా ప్రస్తుత పరిస్థితులలో తను ఏమి చేయలేని నిస్సహాయుడిగా అసమర్థుడిగా మిగిలిపోయాడు, వున్న ఫళంగా ఇండియా వెళ్ళి పెళ్ళిని ఆపివేస్తే శ్రీనిధి దృష్టిలో చెడ్డవానిగా ముద్రపడిపోతుందని, ఒకవేళ శ్రీనిధి ఈ పెళ్ళి ఇష్టపూర్తిగా చేసుకుంటే తను అందరి దృష్టిలో అవమానింపబడాల్సి వస్తుందని ఆలోచించి, సమస్యను తన తోటి విధ్యార్థులకి చెప్పి షేర్ చేసుకున్నాడు. వారు కూడా తనలాగే ప్రస్తుతం పరీక్షలపై శ్రద్ధ పెట్టమని సూచించారు.

ఆ రాత్రి నిద్రపట్టలేదు, హాస్టల్‌లో ఒంటరిగా బాల్యపు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఇటీవల కలిసి పుస్తకాలు ఇచ్చిన సందర్భం, పుట్టిన రోజు నాటి జ్ఞాపకాలు అన్ని కళ్ళముందు నీటి సుడులతో గిర్రున తిరిగాయ్, మరోవైపు శ్రీనిధి పెళ్ళి తేది ఖరారు చేశారు. ఏప్రిల్-24, పెళ్ళి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. హర్షవర్ధన్ ఇంటికి శుభలేఖ వచ్చింది. అదే రోజు హర్షవర్ధన్ కి చివరి పరీక్ష, శ్రీనిధికి పెళ్ళి. రెండింటి మధ్య బాగా నలిగిపోయాడు. ఇక్కడ పెళ్ళి ఘనంగా జరిగింది. పెళ్ళి రోజు ముభావంగా వున్నప్పటికీ తర్వాత కుదురుకుంది శ్రీనిధి. వివాహ తంతు పూర్తి అయిన తరువాత జరగాల్సిన ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆ పెళ్ళిలో హర్షవర్ధన్ వాళ్ళన్నయ్య వచ్చాడు, ఆశీర్వాదం కోసం అందర్ని కలిసే క్రమంలో శ్రీనిధికి తారసపడ్డాడు, ఊబికి వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ ఆశీర్వదించమని వేడుకొంది, బాధతోనే ఆశీర్వదించి శ్రీనిధి తల్లిదండ్రులని కలిసి అక్కడి నుండి నిష్క్రమించాడు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత హర్షవర్ధన్ స్వంత ఊరికి వచ్చాడు, మిత్రులందరు కలిశారు, పక్క పక్క ఊళ్ళలో వున్నవారు కూడా వచ్చి కలిసి వెళ్ళారు, శ్రీనిధి వాళ్ళ ఊరు వారు కూడా వచ్చారు, చర్చల్లో ఒకతను శ్రీనిధి గురించి ప్రస్తావించాడు. హర్షవర్ధన్ మొఖంలో ఏదో వెలితి స్పష్టంగా కనిపించింది మిత్రులందరూ జరిగిన దాని గురించి మర్చిపొమ్మని, ఇక ముందు కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. శ్రీనిధి ప్రస్తుతం ఎక్కడ వుంది? అని ఆరా తీశాడు. అత్త గారింటి వద్ద వున్నట్లు చెప్పాడొక మిత్రుడు. ఆ రోజు నుండి శ్రీనిధికి పూర్తిగా దూరం కావాలని నిర్ణయించుకొన్నాడు.

M.S పరీక్ష ఫలితాలకోసం ఎదురు చూడటం మొదలు పెట్టాడు హర్షవర్ధన్. దీనితో పాటు హాస్పిటల్ ఏర్పాటుకు తగిన స్థలం కోసం అన్వేషణ మొదలు పెట్టారు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కోసం వైద్య విధాన పరిషత్‌కి అర్జి పెట్టుకొన్నాడు. పట్టణంలోని బస్టాండ్‌కి దగ్గర్లో మూడంతస్థుల భవనాన్ని అద్దెకు తీసుకొని హాస్పిటల్ ఏర్పాట్లలో నిమగ్నమైనాడు. ఆస్పత్రి ప్రారంభోత్సవానికి స్థానిక ఎం.పి, ఎమ్మెల్యే మరియు స్థానిక అధికారులు, గ్రామ పెద్దలు అందర్ని ఆహ్వానించి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. అలా కొద్ది కాలంలోనే పట్టణంలో నలుదిక్కుల హర్షవర్ధన్ పేరు మంచి డాక్టర్‌గా మారుమ్రోగింది. శ్రీనిధి కాన్పుకోసం పట్టణంలో మరో ప్రయివేటు ఆసుపత్రిలో చేరింది, డాక్టర్లు పెద్ద ఆపరేషన్ చేశారు. కవల పిల్లలు (ఇద్దరు ఆడపిల్లలు) పుట్టారు.

కొంత కాలం తర్వాత శ్రీనిధి భర్తకు వున్న త్రాగుడు అలవాటుతో ప్రతిరోజు ఇంటికి ఆలస్యంగా రావటం “ఎందుకిలా?” అని అడిగితే కొట్టడం, తిట్టడం మొదలైంది. ఇలా రోజులు దుర్భరంగా గడిచిపోతున్నాయి. పిల్లలు వేగంగా పెరుగుతున్నారు. మరోవైపు హర్షవర్ధన్ పేరు రోజు రోజుకి చుట్టుప్రక్కల ఊళ్ళల్లో అందరి నోళ్ళలో నానుతోంది. ఆసుపత్రి ప్రతిరోజు పేషంట్లలో నిండి వుండేది, తన గతం తాలూకు విషయాలు నెమరు వేసుకొనే సమయము లేదు, ఆసుపత్రి నిర్వహణలో హర్షవర్ధన్‌కి ఇద్దరన్నయ్యలు సహాయం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఒక రోజు శ్రీనిధి భర్తకు అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేర్పించాల్సి వచ్చింది. పరీక్షలన్నీ చేసి ఆల్కాహాల్ అతిగా తీసుకోవడం వల్ల కాలేయం సగ భాగం చెడిపోయినట్లుగా తేల్చేశారు డాక్టర్లు. వెంటనే హైద్రాబాద్‌కు షిఫ్టు చేయాలని సూచించారు. ఈ విషయం శ్రీనిధి ఫోన్ ద్వారా తల్లిదండ్రులకి చెప్పింది, హైద్రాబాద్ తీసుకెళ్ళడానికి అంబులెన్స్ సిద్ధం చేశారు. ఈ లోపే హాస్పిటల్ కి చేరుకున్నారు తల్లిదండ్రులు, వారిని పట్టుకొని బోరున ఏడ్చింది. పిల్లలకి ఏం జరుగుతుందో తెలియక మొఖాలు చూస్తున్నారు.

శ్రీనిధి తన ఇద్దరు పిల్లలతో కళ్ళలోంచి వస్తున్న కన్నీటి ధారల్ని ఆపుకోలేక భర్త మొఖంవైపు చూసి ఏమీ చెయ్యలేని నిస్సహాయక స్థితిలో నిలబడి (అప్పటికే అంబులెన్స్‌లో జానకిరామ్‌ను పడుకోబెట్టారు) భర్త కాళ్ళు పట్టుకొని ఇద్దరు పిల్లల వంక చూసింది, ఆలస్యం అవుతుందని నర్సు చెప్పగా వెంటనే అంబులెన్స్ కదిలింది, హైద్రాబాద్ లోని కార్పోరేట్ ఆసుపత్రి వైపు, ఆసుపత్రికి చేరేటప్పటికి రాత్రి ఐనది, వెళ్ళగానే పేషెంట్ కేస్ షీట్ (Case Sheet) చూపి ఎమర్జెన్సీ వార్డులోకి చేర్చారు. అన్నీ పరీక్షలు మళ్ళీ చేశారు వ్యాధి నిర్ధారించుకోవడానికి, గంట తర్వాత రిపోర్టులు వచ్చాయి. డాక్టర్ పేషెంట్ తాలూకు వారిని తన చాంబర్ లోకి పిలిపించి మాట్లాడుతున్నాడు ఇలా, ఆల్కాహాల్ త్రాగుతారా మిస్టర్ జానకిరామ్? అని, పొగత్రాగే అలవాటు వున్నదా? అని, ఈ రెండు ప్రశ్నలకి శ్రీనిధి తండ్రి అవునని సమాధానం చెప్పాడు, పేషెంటు పరిస్థితి చాలా సీరియస్ గా వుంది అతిగా మధ్యం సేవించటం, పొగత్రాగడం వల్ల కాలేయం చెడిపోయినట్లు, దాని ప్రభావం ఊపిరితిత్తులపై కూడా పడినట్లు చెప్పాడు. చాలా ఖర్చుతో కూడిన వైద్యం చేయాలని అయినా కూడా చెప్పటం కష్టం అని చెప్పాడు డాక్టర్, ఇది అంతా విన్న జానకిరామ్ తండ్రికి గుండె ఆగినంత పనైంది. చేసేది ఏమి లేక ఒక్కగానొక్క కొడుకు దారి తప్పి తిరుగుతూంటే హద్దులో పెట్టలేక, చేసిన గారాభం ప్రాణాల మీదకు తెచ్చుకొన్న పరిస్థితులు ఒక్కసారిగా గుండె లయ తప్పినట్లయింది. తను రిటైర్ అయినప్పుడు వచ్చిన GPF డబ్బులు, ఇన్సూరెన్స్ డబ్బులు అన్ని కూడబెట్టగా సుమారు రూ॥10,00,000/-లు (పది లక్షలు) వున్నట్లు డాక్టర్‌కు చెప్పాడు, పేపర్లపై సంతకాలు పెట్టించుకొని (ఫార్మాలిటీస్) రూ॥5,00,000/-లు (ఐదు లక్షలు) కౌంటర్లో డిపాజిట్ చేయాలని చిన్న చీటిపై వ్రాసి ఇచ్చాడు డాక్టర్. ఇక్కడ శ్రీనిధి ఇద్దరు పిల్లలతో ఆసుపత్రిలో ఏం జరుగుతుందో భర్త ఆరోగ్యం ఎలా వుందో అన్న కంగారుతో అన్నం ముట్టుకోవటం మానేసింది, పిల్లలతో యాంత్రికంగానే గడుపుతోంది. ఎటూ పాలు పోవవటం లేదు. ఏదో కోల్పోతున్నట్లుగా అనిపిస్తోంది రోజు రోజుకి పిల్లలు తండ్రిని అడగడం మొదలు పెట్టారు. నాన్న గారు ఎప్పుడొస్తారని? నాన్నకు ఏమైందని?

వారికి ఏం సమాధానం చెప్పాలో, ఎలా ధైర్యం చెప్పాలో అర్థం కావట్లేదు, ఒక్కసారిగా ప్రపంచం మొత్తం తలక్రిందులుగా తిరిగినట్లు అనిపించింది, కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించి పిల్లల మొఖాలు చూస్తూ గోడకు ఉన్న పెళ్ళి నాటి ఫోటోలు చూస్తూ కూలబడిపోయింది. ఇలా రెండు రోజులు గడిచిపోయాయి. ఎవరో తలుపు తడుతున్నట్లుగా శబ్దం వస్తే వెళ్ళి తలుపు తీసింది, ఎదురుగా శ్రీనిధి వాళ్ళ నాన్న, పోయిన ప్రాణం లేచివచ్చినంతగా ధైర్యం వచ్చింది, కూతురుని చూడగానే ఏం చెప్పాలో అర్థం కాలేదు రంగయ్యకి, మంచినీళ్ళు ఇచ్చి కొద్ది సేపటి తర్వాత తన భర్త ఆరోగ్యం గురించి, అందిస్తున్న వైద్యంతో ఏమైనా పురోగతి వుందా? అని ప్రశ్నల వర్షం కురిపించింది, అన్ని విషయాలు చెప్పాడు రంగయ్య, వాస్తవం చెబితే ఎక్కడ ఇంకా కుమిలి పోతుందో అని మనసులోనే చేదు నిజాన్ని దాచుకొని త్వరలో కోలుకొని వస్తాడని చెప్పి అన్నం వడ్డించమని పురమాయించాడు కూతురిని.

మళ్ళీ రేపు ఆసుపత్రికి వెళ్ళాలని డబ్బుల కోసం వచ్చినట్లు కూతురికి చెప్పాడు, ఫోన్ సౌకర్యం లేకపోవటం వల్ల అక్కడ ఏం జరుగుతుందో ఎవరో ఒకరు చెప్తే తప్ప సమాచారం తెలియని పరిస్థితి. అదే దిగులుతో ప్రతి రోజు గడుపుతుంది, ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఏదైనా జరగరానిది జరిగితే తన పరిస్థితి, తన ఇద్దరు చిన్న పిల్లల పరిస్థితి ఏంటి? పెళ్ళైన కొత్తలోనే భర్త గురించి ఈ విషయాలు తెలిసినా, అందమైన రూపం వెనుక అందవిహీనమైన అలవాట్లు వున్నాయన్న వాస్తవం గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు, కాని ఈ విషయం చెబితే తల్లిదండ్రులు ఎక్కడ మదనపడి పోతారో అని లోలోన కుమిలి పోయింది, చెడు అలవాట్లను మాన్పించే ప్రయత్నంలో గొడవలు, భర్త చేతిలో దెబ్బలు సైతం తినాల్సివచ్చేది శ్రీనిధికి, పెళ్ళైన కొద్ది కాలంలోనే భగవంతుడు ఇంతటి కఠిన పరీక్ష పెడ్తాడని ఎన్నడూ ఊహించలేకపోయింది. ఇద్దరు పిల్లల్ని దగ్గరకు తీసుకొని భర్త త్వరగా ఆరోగ్యంగా తిరిగి రావాలని శివాలయానికి వెళ్ళి పూజలు చేసి వచ్చేది, ఆ రోజు రాత్రి భారంగా గడిచింది,

పిల్లలకి నాన్న రేపు వస్తాడని అబద్దం చెప్పింది, ఆసుపత్రిలో జానకిరామ్‌కి ఖరీదైన వైద్యం చేస్తున్నా శరీరం సహకరించటం లేదు, ఎమర్జెన్సీ వార్డులో నుండి ఐ.సి.యు. లోకి మార్చారు, తెలిసిన వారందరి దగ్గర వడ్డీకి ఐదు లక్షలు పోగు చేసుకొని ఆసుపత్రికి వెళ్తూ కూతురికి చెప్పి హైద్రాబాద్‌కు బయల్దేరాడు రంగయ్య. తెచ్చిన డబ్బులు బిల్ సెక్షన్‌లో కట్టి డాక్టరు వద్దకు వెళ్ళి అల్లుడి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెల్సుకున్నాడు. జబ్బు పూర్తిగా ముదిరిపోయిందని మా ప్రయత్నం మేము చేస్తున్నామని డాక్టర్ చెప్పగానే వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు తన కూతురికి ఇద్దరు పిల్లలు, అల్లుడికి ఏదైనా జరిగితే తన కూతురు బ్రతుకు రోడ్డున పడ్తుందని బోరున ఏడ్చాడు. వ్యాధి ముదరక ముందే వచ్చి వుంటే ఇంతటి దాకా వచ్చేది కాదని పరిస్థితి చేయిదాటి పోయిందని చెప్పాడు డాక్టర్. ఈ మాటలు విన్న రంగయ్య ఇంకా దిగులు చెందాడు, అప్పు సప్పు చేసి కూతురి పెళ్ళి జరిపించాడు, పెళ్ళికి ముందే హర్షవర్ధన్ విషయం కూతురు చెప్తే వద్దని వారించాడు, కోరుకున్నవి దూరంగాను, దూరంగా వున్నవి దగ్గరగాను ఐనట్లు అనిపించింది రంగయ్యకి, ఆకాశంలోకి చూస్తూ అసుపత్రి వరండాలో పచార్లు చేస్తున్నాడు, డాక్టర్ల నుండి పిలుపు వచ్చింది జానకిరామ్ పరిస్థితి విషమంగా మారినట్లు, వైద్యానికి శరీరం సహకరించట్లేదని అందర్ని పిలిపించారు డాక్టర్లు, విషయం అర్థమైంది రంగయ్యకి కొంత సేపటి తరువాత విషయం ఊళ్ళో పెద్దాయన ఇంటికి ల్యాండ్ ఫోన్ ద్వారా తెలియజేశాడు STD బూత్ నుండి, జానకిరామ్‌కి వైద్యం చేయటం వృథా అని, వెంటిలేటర్స్ తీసివేస్తే బ్రతకటం అసాధ్యం అని, చుట్టాలందరికి ఈ సమాచారం చేరవేయాలని రాత్రి వరకు తీసుకొస్తామని చెప్పాడు.

విషయం శ్రీనిధికి కూడా తెలిసింది ఒక్కసారిగా ఇద్దరు ఆడపిల్లల్ని హత్తుకొని కుప్పకూలి పోయింది. అంతా శూన్యంలా తోచింది. ఇరుగు పొరుగు వారు వచ్చి విషయం తెలుసుకున్నారు. తల్లి పడ్తున్న బాధను చూస్తున్న పిల్లలు అమ్మ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక వచ్చిన వారి మొఖాలు చూస్తున్నారు. ఈ లోపే శ్రీనిధి అమ్మ, దగ్గరి బంధువులు ఇంటికి వచ్చేశారు.

బిడ్డను హత్తుకొని తల్లి (శ్రీనిధి) పడున్న బాధను చూస్తున్న పిల్లలు అమ్మ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక వచ్చిన వారి మొఖాలు చూస్తున్నారు. ఈ లోపే శ్రీనిధి అమ్మ, దగ్గరి బంధువులు ఇంటికి వచ్చేశారు. ఏడుస్తున్న వైనాన్ని చూసి అందరూ కన్నీరు పెట్టుకున్నారు. బంధువులు, తెలిసిన వారందరికి విషయం (జానకిరామ్ చనిపోయాడన్న సమాచారం) చేరవేస్తున్నారు, రేపు ఉదయం అంత్యక్రియలు చేయాలనుకుంటున్నట్లు తెలిసిన వారికి కూడా ఈ విషయం చెప్పాలని సూచించారు. పిల్లల్ని అనాథలని చేసిన తండ్రిని, పిల్లలు బిక్క మొఖాలు వేసుకొని అందర్ని చూస్తున్న విధానం అక్కడ వున్న అందర్ని కలిచివేసింది.

తెల్లారింది అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీనిధి తరపు బంధువులు, జానకిరామ్ తరుపు వారు అందరు వచ్చేశారు కడసారి చూడడానికి, బిడ్డ భవిష్యత్తు తలుచుకొంటేనే ధారాళంగా వచ్చే కన్నీళ్ళను ఆపటం సాధ్యం కావటం లేదు శ్రీనిధి తల్లికి. భర్త తనను, తన పిల్లల్ని ఇంత త్వరగా దూరం చేసి వెళ్ళిపోతాడని కలలో కూడా ఊహించలేక పోయింది శ్రీనిధి. పిల్లల భవిష్యత్తు, వారు ఎదుగుతున్న క్రమం ఇద్దరు కూర్చొని అప్పుడప్పుడు చర్చించుకొనేవారు. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు, ఒంటరిదై పోయింది, తండ్రి లేని లోటు పూడ్చటం, మరొక వైపు పిల్లలు ఎదుగుతున్న కొద్ది తండ్రి వెలితిని పూడ్చటం ఎలా? అన్న ప్రశ్నలు మెదడును తొలుస్తున్నాయ్. చివరి ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి, జానకిరామ్‌ను పాడెపై పడుకోబెట్టారు. తనని, పిల్లల్ని వదిలి వెళ్తున్న జానకిరామ్‌ను చూసి బోరున ఏడ్చింది, పిల్లలకి అప్పుడు అర్థమైంది, “తండ్రిలో చలనం లేదని, వీరందరు ఏడుస్తున్నది తన తండ్రి కోసమే” అని ఇంత మంది ఏడుస్తున్నా తండ్రిలో చలనం లేని వైనం చూసి పిల్లలకి అర్థం అవుతోంటే, ఇంతలో చిన్న పాప వచ్చి ఏడుస్తున్న తల్లిని అడిగింది “అమ్మా! నిన్నటి నుండి నాన్నగారు నిద్రలోనే వున్నారు, ఎప్పుడు లేస్తారు?” అని, ఆ మాటలు వినగానే సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక కొయ్యబొమ్మవలె మొద్దుబారిపోయింది, చిన్న పిల్లని దగ్గరికి తీసుకొని నాన్న గారు త్వరలో వస్తారని మీరు మంచిగా చదువుకోవాలని హత్తుకొని ఏడ్వసాగింది శ్రీనిధి తల్లి.

ఈ విషయం హర్షవర్ధన్ వాళ్ళింట్లో తెలిసింది. విషయం చెబితే బాధ పడ్డాడని కొద్ది రోజుల తర్వాత చెప్పాలని అనుకున్నారు. అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. పది రోజులు గడిచిన తర్వాత కూతుర్ని నిద్రచేయించడానికి ఇంటికి తీసుకొని వచ్చాడు రంగయ్య. ఇరుగు పొరుగు వారు కతూర్నీ పరామర్శించడానికి వచ్చి ధైర్య వచనాలు చెప్పారు. అన్నింటికి మౌనంగానే వుండి పోయింది.

జరిగిన సంఘటన నుండి కోలుకోవడానికి చాలా సమయం పడుందని భావించారు అందరూ. మరుసటి రోజు హర్షవర్ధన్ ఇంటి నుండి ఫోన్ వచ్చింది ఇంటికి రమ్మని, తన ఇంటికి (స్వంత గ్రామానికి) బయలుదేరాడు, శ్రీనిధి పిల్లలు ఇద్దరు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నారు. హర్షవర్ధన్ కారు రంగయ్య ఇంటి ముందు ఆగింది, కారు దిగి ఆవరణలో వున్న ఇద్దరు పిల్లల్ని అడిగాడు “రంగయ్య గారు వున్నారా?” అని, తాతయ్య ఉన్నారని చెప్పారు పిల్లలు, మీరు ఎవరు? అని అడిగాడు, మా మమ్మీ పేరు శ్రీనిధి అని చెప్పారు. ఎవరో అపరిచిత వ్యక్తి వస్తున్నారని గమనించి ఇంట్లోంచి బయటికి వచ్చాడు రంగయ్య, అంకుల్ నమస్కారం నేను హర్షవర్ధన్ శ్రీనిధి స్కూల్‌మేట్‌ని అని గుర్తు చేశాడు, గుర్తుపట్టి పట్టన్నట్లు అనిపించింది రంగయ్యకి, లోపలికి రా బాబు! అని తోడ్కొని వెళ్ళాడు, ఆంటి నమస్కారం బాగున్నారా? అని అడిగాడు, బాగున్నాను బాబు ఎక్కడ ఉంటున్నావ్? ఏం చేస్తున్నావ్? అని అడిగింది రంగయ్య భార్య అన్ని విషయాలు చెప్పి శ్రీనిధి గురించి అడిగాడు హర్షవర్ధన్. ఆ ప్రశ్నకి ఇద్దరి కళ్ళలో నీళ్ళు ఉబికి వచ్చాయి (శ్రీనిధి అమ్మకు, నాన్నకు).

అమ్మా బయటికి రా నీ కోసం నీ స్కూల్ మేట్ హర్షవర్ధన్ వచ్చాడు అంది శ్రీనిధిని ఉద్దేశించి తల్లి. తెల్లచీర, బొట్టులేని నుదురు, వాడిపోయిన మొఖంతో గదిలోంచి బయటకి వచ్చింది, ఒక్కసారిగా శ్రీనిధిని చూసి షాకయ్యాడు. శరీరం చమటతో తడిసి పోయింది వెంటనే “మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ” అని అడిగాడు. అర నవ్వుతో నమస్కారం చేసింది హర్షవర్ధన్ కి. తనతో కలిసి ఆడుకున్న చిన్ననాటి జ్ఞాపకాలు, లంచ్ బాక్సు షేరింగ్‌లు అన్ని కళ్ళ ముందు కదిలాయి హర్షవర్ధన్‌కి, ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు నీరు నిండిన కళ్ళలోంచి శ్రీనిధి వైపు చూశాడు.

శ్రీనిధి తల్లి మధ్యలోనే కల్పించుకొని, “అల్లుడు పదిరోజుల క్రితం లివర్ క్యాన్సర్‌తో చనిపోయినట్లు, బిడ్డను నిద్రచేయించడానికి తీసుకొచ్చినట్లు చెప్పింది గాద్గద స్వరంతో, చదువుకుంటుండగానే తడి గుడ్డతో గొంతు కోశాం బాబు, దానికి ఇష్టం లేకపోయినా, పెళ్ళి వద్దు అంది, ఇంకా చదువుకుంటాను అంది, దాని మాటలు లెక్కచేయక తొందరపడ్డాం బాబు. ఆ సంవత్సరం ఆగితే దీని భవిష్యత్తు ఎలా ఉండేదో’. రంగయ్య జోక్యం చేసుకొంటూ “దాని జీవితం దేవుడు ఇలా రాశాడు ఏంచేస్తాం అంతా ఖర్మ” బాబు, దాని మనసులో నువ్వు వున్నట్లుగా పెళ్ళికి ముందే చెప్పింది, కాని నేనే దాని ప్రేమను సమాధి చేశాను. ఇదిగో దాని ఫలితం ఇలా వచ్చింది బాబు అన్నాడు, ఇద్దరు “ఆడపిల్లలు, మగ దిక్కులేని జీవితం మాకు ఈ వయస్సులో దీన్ని ఇలా చూస్తామని, శేషజీవితం ఇంత విషాదంగా మిగులుతుందని ఏనాడు కలలో కూడా ఊహించలేదు బాబూ అన్నాడు”. ఇవన్నీ శ్రీనిధి మౌనంగానే వింటూ కళ్ళలో నుండి వస్తున్న నీటిని పైట కొంగుతో తుడుచుకుంటూ హర్షవర్ధన్ వైపు దీనంగా చూసింది, ఇద్దరు పిల్లల్ని దగ్గరకు తీసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొన్నాడు హర్షవర్ధన్, రంగయ్య ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలా అన్నాడు,

“మీ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ పూడ్చలేనిది, ఈ షాక్ నుండి శ్రీనిధి కోలుకోవడానికి, మళ్ళీ మామూలు మనిషి కావడానికి జీవితంకాలం పట్టొచ్చు కాని ముందు ముందు ఎలా అనేది ఆలోచించండి, నా సహాయం, మీ కుటుంబానికి ఎల్లప్పుడు ఉంటుంది, శ్రీనిధితో నేను గడిపిన క్షణాలు, రోజులు నా జీవితంలో మర్చిపోలేనివి, మధురమైనవి. తనతో నేను అమలినమైన స్నేహం, అవ్యాజ్యమైన ప్రేమను పొందాను, నా నుండి తనను, తన నుండి నన్ను దూరం చేసి తన మనస్సుకు ఒక వెలితిని నా హృదయానికి ఒక గాయాన్ని సృష్టించారు. తను బ్రతికున్నంత కాలం చనిపోయిన మనిషిని తల్చుకుంటూ, అతని జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ గడిపితే, నేను బ్రతికున్నంత కాలం తనతో గడిపిన క్షణాలు తనకు జరిగిన విషాదం గురించి తల్చుకుంటూ ఇలా జీవితాంతం నా మనసుకు “మానని గాయం” చేశారు, అది ఎప్పుడూ నా హృదయాన్ని తొలుస్తూనే వుంటుంది” త్వరలో మళ్ళీ వస్తానని ఎవ్వరూ బాధపడవద్దని శ్రీనిధి కళ్ళలోకి సూటిగా చూస్తూ హామీ ఇచ్చి అక్కడి నుండి నిష్క్రమించాడు హర్షవర్ధన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here