మానవతే మతం!

2
6

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]ఢి[/dropcap]ల్లీ నగరం అల్లకల్లోలంగా ఉంది! ప్రధాని ఇందిరాగాంధీని, ఆమె బాడీగార్డులే హత్యచేశారు. ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట సైన్యాన్ని స్వర్ణదేవాలయంలోకి, తీవ్రవాదులను పట్టుకొని మట్టుపెట్టడం కోసం, ఆమె పంపడమే, సిక్కులయిన ఆ అంగరక్షకుల ద్వేషానికి కారణమైంది.

ఎంతో ప్రజాభిమానం సంపాదించుకున్న నాయకురాలు ఇందిర. ఆమెను హత్య చేయడం, దేశమంతా ప్రకంపనలు కలిగించింది. దాని పరిణామమే సిక్కుల ఊచకోత! ఢిల్లీలో అది పరాకాష్టకు చేరింది. కనబడిన సిక్కును కనబడినట్లు కాల్చిపారేస్తున్నారు, కత్తులతో పొడుస్తున్నారు, పెట్రోలు పోసి తగలపెట్టేస్తున్నారు. చంపింది ఇద్దరే! కాని వారి జాతి మొత్తం టార్గెట్‌గా మారింది.

రాత్రి పది దాటింది. మందాకినీ కౌర్, లోధీ రోడ్, ఎనిమిదవ క్రాస్ లోని తన ఇంట్లో భర్త కోసం ఎదురు చూస్తుంది. ఆయనకు కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో ఒక ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దుకాణం ఉంది. తొమ్మిదిన్నరకు షాపు మూసి, పది గంటల తర్వాత ఆయన ఇల్లు చేరుకుంటాడు. ఆయన పేరు సుఖ్వీందర్ సింగ్.

వారికి మూడేండ్ల పాప ఉంది. నవనీత్ కౌర్. తండ్రి వచ్చేంత వరకు నిద్రపోదు. తల్లిని సతాయిస్తూ ఉంటుంది, తన ప్రశ్నలతో. వారి ప్రక్క ఇంట్లో పట్నాయక్ గారి కుటుంబం ఉంటుంది. బంచానిధి పట్నాయక్, ఒరిస్సాలోని గంజాం నుంచి ఢీల్లీకి వచ్చి, ఇరవై ఏండ్ల కిందటే సెటిలయ్యాడు. ఆయన లోధీ రోడ్ లోనే ఒక రెడీమేడ్ షాపు నడుపుతాడు. ఆయన భార్య మహానంద. వారికి పిల్లలు లేరు. పట్నాయక్, తొమ్మిదిన్నరకే యిల్లు చేరుకున్నాడు.

రెండు కుటుంబాలూ స్నేహంగా ఉంటాయి. వారి రాష్ట్రం, భాష, మతం, వారి మధ్య ఆప్యాయతకు అభిమానానికి అడ్డు రాలేదు. ఆ మాట కొస్తే, ఢిల్లీలో రకరకాల మతాల, భాషల, ప్రాంతాల వాళ్లు హాయిగా, పరస్పర ప్రేమతో, కలిసి బతుకుతుంటారు. ఢిల్లీలోనే కాదు. అది భారతదేశంలో ఎక్కడైనా ఉన్నదే.

మహనంద, బయట గేటుకు తాళం వేద్దామని వచ్చి, పక్కింటి వైపు చూచింది. నాన్న ఇంకా రాలేదేమని తనకు డ్రైగులాబ్ జాములు తెస్తానన్నాడని, వాళ్ళమ్మను వేధిస్తోంది నవనీత్. “ఏమిటి బెహన్‌జీ, నవనీత్ ఇంకా పడుకోలేదా?” అంటూ పలకరించింది మహానంద.

“వాళ్ల పప్పా వచ్చేంత వరకు ఇంతేనండీ!” అన్నది నవ్వుతూ మందాకిని.

“పాపా, దా! మా యింటికి! నాన్న వచ్చేస్తుంటారు. కాసేపు ఆడుకుని వద్దువుగాని, అంకుల్ కూడ వచ్చేశారు” అన్నది మహానంద.

పాప తల్లి వైపు చూసింది. తల్లి నవ్వుతూ వెళ్లమంది. కూర చేసి పెట్టింది. రోటీలు వేడిగా లేకుంటే తినడు భర్త. కాసేపు ఈ పిల్ల వెళితే రోటీలయినా చేసుకోవచ్చు అనుకుంది.

కాంపౌండ్ వాల్ గోడ మీద నుండి పాపను తీసుకుంది మహానంద. వాళ్లింట్లో పాపకు చాలా చనువు. పట్నాయక్ పాపను చూసి చేతులు చాచాడు. అతని చేతుల్లోకి ఉరికింది పాప. అతని మెడచుట్టూ చేతులు వేసి ముద్దు ముద్దుగా కబుర్లు చెప్పసాగింది. మహానంద, వంటింట్లోకి వెళ్లి ఒక పింగాణీ కప్పులో వేయించి, ఉప్పు కలిపిన జీడి పప్పు తెచ్చి పాపకు ఇచ్చింది. అవంటే పాప కిష్టం!

సుఖ్వీందర్ సింగ్ షాపు మూసి, ఆ రోజు కలెక్షన్ ఒక చిన్న లెదర్ బ్యాగ్ పెట్టుకొని, తన వెస్పా స్కూటర్ ఇంటికి బయలుదేరాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత, ముద్దుల కూతురు డ్రైగులాబ్ జామూలు తెమ్మన్న విషయం గుర్తొచ్చిందతనికి, తీసుకొని వెళ్లకపోతే గొడవ చేస్తుంది. ‘అగర్వాల్ మిఠాయివాలా’ అన్న దుకాణం ముందు స్కూటరాపాడు. పావు కిలో డ్రైగులాబ్ జామ్మ్ ఇమ్మన్నాడు, భార్యకు మఖ్‌మల్ పూరీ అంటే ఇష్టం. పూరీలను మందంగా కాల్చి, చక్కర పాకంలో వేసి చేస్తారు వాటిని. అవీ ఒక పావు తీసుకున్నాడు. స్వీట్ షాప్ అతన మార్వాడీ.

“సింగ్‌జీ! త్వరగా ఇంటికి వెళ్లండి! సిటీలో పరిస్థితి దారుణంగా ఉంది!” అన్నాడు.

“ఏమయింది భయ్యా!”

“ప్రధానిని ఆమె బాడీగార్డులే చంపేశారట, వాళ్లు మీ సిక్కులట. దానికి ప్రతీకారంగా సిక్కులను చంపేస్తున్నారు.”

సుఖ్వీందర్‌కు కాళ్లు, చేతులు వణికాయి! ఇంట్లో భార్య, చంటిపాప ఉన్నారు. వారికేమన్నా అయితే? సెల్ ఫోన్లు లేని కాలమది. స్కూటర్ స్టార్ట్ చేసి, వేగంగా వెళ్లసాగాడు. అతని ఇల్లు ఇంకా మూడు కిలోమీటర్లు ఉంది.

మెయిన్ రోడ్డు మీదినుంచి, తన ఇంటి వైపు వెళ్లే దారిలోకి మళ్లాడు. నలుగురు వ్యక్తులు అతని స్కూటర్‌కు అడ్డం వచ్చారు. వారి చేతుల్లోని ‘తల్వార్లు’ వీధీ లైటు కాంతిలో మెరుస్తున్నాయి.

“మిల్ గయా సాలా!” అంటూ అతన్ని క్రిందికి లాగారు. సిక్కులను గుర్తించడం చాలా సులభం. వాళ్ల ఆహార్యం అలాంటిది.

ఒకడు క్రింద పడిన సుఖ్వీందర్ గుండెల్లో కత్తి దించాడు. మరొకడు అతని కాళ్లను నరికాడు. భయంతో బాధతో ఆక్రందనలు చేస్తున్నాడు సింగ్. కొందరు వాహనాల మీద ఆ దారిన, వెళుతున్నా, ఏమీ పట్టనట్లు దాటి పోతున్నారు. పట్టించుకుంటే, సింగ్‌కు పట్టిన గతే పడుతుందని తెలుసు.

ముందు గ్రిల్స్ క్యారియర్‌లో ఉన్న బ్యాగ్ తీశాడు ఇంకొకడు. దాంట్లోని డబ్బు తీసి జేబులో కుక్కుకున్నాడు. స్వీట్ పాకెట్లు తెరిచి సాటి దుండగులకిచ్చాడు. సింగ్ శరీరంలో చలనం ఆగిపోయింది. అతని శవాన్ని కాళ్లతో తంతూ పైశాచికానందాన్ని అనుభవించారు.

నవనీత్, పట్నాయిక్ వాళ్లింట్లోనే నిద్రపోయింది. కాసేపుండి ఇచ్చి వద్దామంది భార్య. ఇంతలో పక్కింట్లోంచి గొడవల శబ్దం! కిటికీ రెక్క తెరిచి చూశారు. భర్తెమో అనుకుని తలుపు తీసిందా ఇల్లాలు. ముగ్గురు దుండగలు లోపల దూరారు. అది సిక్కుల యిల్లని వారికి తెలిసే వచ్చారు. యవ్వనంలో ఉన్న మందాకిని వారిలో కామ వాంఛలు రేకెత్తించింది. హాల్లోకి ఆమెను పడవేసి, ఒకరి తర్వాత ఒకరు ఆమెను రేప్ చేశారు. ఇంట్లో టి.వి.ని ఇతర విలువైన వస్తువులను పగలగొట్టారు. నిస్సహాయంగా పడి ఉన్న ఆమె శరీరంలో కత్తులు దింపారు.

పట్నాయక్ దంపతులు భయంతో కంపిస్తూ ఉండిపోయారు. దుండగల నెదిరించే బలంగానీ, ధైర్యంగాని వారికి లేవు! తల్లీ తండ్రీ చనిపోయారని తెలియని నవనీత్ నిద్రపోతూ ఉంది, అమాయకంగా!

తెల్లవారింది. ధైర్యం చేసి పట్నాయక్ పక్కింట్లోకి వెళ్లాడు. ఆ ఘోరాన్ని చూడలేక కళ్లు మూసుకున్నాడు. తన ఇంటి ల్యాండ్‌లైన్ నుంచి పోలీస్ స్టేషనుకు ఫోను చేశాడు. రెస్క్యూ టీమ్ వచ్చింది కాని ఎవరిని రెస్క్యూ చేస్తుంది? మందాకిని శవాన్ని తరలించారు. కాసేపటికి సుఖ్వీందర్ శవం కూడా హాస్పిటల్‌కు చేరింది. వారింట్లో ఫోను దగ్గరున్న చిన్న నోట్ బుక్‍లో నున్న కొన్ని నంబర్లకు ఫోను చేశాడు పట్నాయక్. కొందరు జలంధర్‌లో, కొందరు పఠాన్‍కోట్‍లో ఉన్నారు ఆయన బంధువులు. కొందరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కొందరు “అయ్యో! ఎంత ఘోరం జరిగిపోయింది!” అన్నారు. కానీ ఎవరూ ఢిల్లీకి రావటానికి ఇష్టపడలేదు. పరిస్థితి అలాంటిది!

వేల సంఖ్యలో సిక్కులను ఊచకోత కోశారు. అందరికీ సామూహిక దహనకాండ నిర్వహించింది ప్రభుత్వం. అమ్మ నాన్న ఏమయ్యారో తెలియక, బిక్క చచ్చిపోయి, ఏడుస్తూంది పాప.

పరిస్థితులు సద్దుమణిగాయి! జలంధర్ నుంచి సుఖ్వీందర్ కజిన్ ఒకతను వచ్చాడు. షాపు అద్దెదే! ఇల్లు అద్దెదే! షాపులోని స్పేర్ పార్ట్స్‌తో సహా వేరే వారికి, కొంత గుడ్‌విల్ అమౌంట్ తీసుకుని, ఇచ్చేశాడతను. మందాకిని బంధువులెవరూ రాలేదు.

నవనీత్‍ను వాళ్ల చిన్నాన్న తీసుకుపోతాడనుకున్నారు పట్నాయక్ దంపతులు. షాపు అమ్మిన డబ్బులోంచి ఇరవై వేలు వాళ్లకిచ్చి, పాపను ఏదైనా రిహాబిలిటేషన్ హోంలో అప్పగించమని చెప్పి వెళ్లిపోయాడా ‘రాబంధువు!’

అలా అనాథగా మిగిలిపోయింది నవనీత్ కౌర్. డబ్బు తీసుకోకూడదనుకున్నారు కానీ, వారూ మధ్య తరగతి వారే. పిల్లలు లేని తమకు పూరీ జగన్నాథుడిచ్చిన వరంగా భావించి, తామే పాపను పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇరవై వేలను యు.టి.ఐ. వారి రాజ్యలక్ష్మీ స్కీమ్‌లో డిపాజిట్ చేశారు. పాపకు పద్దెనిమిదేండ్లు నిండిన తర్వాత పెద్ద మొత్తం చేతికి వస్తుంది.

***

పాప క్రమంగా తన తల్లిదండ్రులను మరచి పోసాగింది. పట్నాయిక్ దంపతులనే తన తల్లిదండ్రులుగా భావించసాగింది. ‘టైం ఈజ్ ఎగ్రేట్ హీలర్!’. కాలం ఎంత దుఃఖాన్నయినా మాన్పగలదు.

రెండేళ్లు గడిచాయి. నవనీత్‌కు వాళ్లకు దగ్గర్లోనే ఉన్న కాన్వెంట్‌లో ఎల్.కె.జి.లో జాయిన్ చేశారు. పాప ఆటపాటలతో, ముద్దు మాటలతో వాళ్లిద్దరూ ఆనందంగా ఉన్నారు.

రెడీమేడ్ దుస్తులు హోల్‌సేల్‌గా కొనడానికి పట్నాయక్ లూధియానాకు వెళ్లాడు. తమ షాపులో కావలసినవన్నీ ఆర్డర్ చేశాడు. ఆ పార్సిల్స్ అన్నీ ఒక లారీ ట్రాన్స్‌పోర్టులో బుక్ చేశాడు. అతని ట్రయిన్ రాత్రి పది గంటలకు. అప్పుడు సాయంత్రం ఆరయ్యింది. లాడ్జికి వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకుని, డిన్నర్ చేసి, స్టేషనుకు వెళదామని అనుకున్నాడు. ఈలోపు భార్యకు కాల్ చేసి, పనయిపోయిందనీ, బయలుదేరి వస్తున్నానని చెబుదామనుకొని, దగ్గర్లో పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఏదైనా ఉందేమోనని చూశాడు. రోడ్డు కవతలి వైపు బోర్డు కనబడుతూంది యస్.టి.డి, ఐ.ఎస్.టి.డి అని.

ట్రాఫిక్ అంతగా లేదు. రోడ్ క్రాస్ చేస్తున్నాడు పట్నాయక్. అటూ ఇటూ చూసుకుంటూ జాగ్రత్తగా దాటుతున్నాడు. ఇంతలో, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి డీజిల్ టాంకర్ ఒకటి దూసుకొస్తూంది. దానికి బ్రేకులు ఫెయిల్ అయినాయి. దాని డ్రైవరు భయభ్రాంతుడై, ట్రక్‌ను కంట్రోలు చేయలేక అవస్థ పడుతున్నాడు.

పట్నాయక్ రోడ్డు మధ్యకు వచ్చేశాడు. ఆ రోడ్‌కు డివైడర్ లేదు. ఎడమ పక్క నుంచి, అడ్డదిడ్డంగా దూసుకొస్తున్న ట్రక్‌ను గమనించాడు. గబుక్కున రోడ్ దాటేస్తే మంచిదని నాలుగడుగులు ముందుకు వేశాడు! అంతే! ఊహించని వేగంతో వచ్చిన ట్రక్ అతన్ని ఢీ కొట్టింది! అమాంతం గాల్లోకి ఎగిరి పదడుగుల దూరంలో పడ్డాడు. అతని మీది నుంచి ట్రక్ దూసుకుపోయింది.

పట్నాయిక్ శరీరం నుజ్జు నుజ్జయింది! ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. వారు అతని శవాన్ని పోస్ట్‌మార్టమ్‍కు తీసుకెళ్లారు. ఒక అధికారి తన జేబులు వెతకగా, ఫోన్ నంబర్లున్న ఒక చిన్న పాకెట్ బుక్, ఢిల్లీలో ‘జగన్నాధ్ గార్మెంట్స్’ పేరిట బుక్ చేసిన లారీ ట్రాన్స్ పోర్ట్ రశీదు కనబడ్డాయి.

పాకెట్ బుక్‌లో అతనికి మహానంద నంబరు కనబడింది. లాండ్‍లైన్ అది. అప్పుడు రాత్రి ఎనిమిదిన్నర అయింది. పాపకు అన్నం పెట్టి పడుకోబెట్టి వంటిల్లు సర్దుకుంటూందామె. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. వెళ్లింది లిఫ్ట్ చేసి “హలో!” అంది.

“మహానందగారేనా మాట్లాడేది?” అన్నారెవరో అటు వైపు నుంచి.

“అవును. మీరూ..”

“నేను లూధియానా అర్బన్ పోలీస్ అమ్మా, బంచానిధి పట్నాయక్ మీకేమవుతారు?”

 ఆమె గుండె దడదడ కొట్టుకుంది! “ఆయన మావారే, ఏవయింది జీ!”

“ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. గురుగోవింద్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్నారు. మీరు వెంటనే రండి.”

“ఆయన కేం ప్రమాదం లేదు కదా సార్.”

“పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. మీరు త్వరగా వచ్చేయండి!” అని పెట్టేశాడు పోలీస్ అధికారి.

మహానందకు కాళ్లు చేతులూ ఆడలేదు. వెంటనే బెర్హంపూర్‌లో ఉన్న తన అన్నయ్య త్రినాధ బెహరాకు ఫోన్ చేసి విషయం చెప్పింది.

“నేను, మీ వదినె బయలుదేరి వస్తున్నాం మహా! నీవు బెంబేలు పడకు. బావగారికేమీ కాదు. మరో గంటలో బయలుదేరుతున్నాం” అన్నాడాయన.

వాళ్లు రెండో రోజు ఢిల్లీ చేరారు. పాపను రెడీమేడ్ షాపులో పని చేసే కన్వర్‌లాల్ కుటుంబానికప్పగించి, లూధియానా చేరుకొన్నారు. భర్త శవం మీద పడి విలపించింది మహానంద. ఆమె జీవితంలో మహా విషాదం! బాడీని ఢిల్లీకి గాని, బెర్హంపూర్‌కు గానీ తీసుకువెళ్లే స్తోమత లేదు. అవసరమూ లేదు వారికి! అక్కడే, ఒక స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఢిల్లీకి తిరిగి వచ్చారు. చెల్లెలిని తమతో తీసుకుపోతామన్నాడు త్రినాధ బెహారా. కాని అతని భార్య సుభద్రా బాయి మాత్రం పాప బాధ్యతను తీసుకునేది లేదని ఖండితంగా చెప్పేసింది. ఒక ఆడపిల్లలను పెంచి పెద్ద చేసి, చదివించి, వివాహం చేసి పంపే బాధ్యతను నిర్వర్తించడానికి వారికి స్తోమత లేదు! బెహరా బరంపురం యూనివర్సటీలో అటెండరు!

షాపు కన్వర్‍లాల్ తీసుకున్నాడు. గుడ్‌విల్ అమౌంట్ ఏమీ ఇవ్వలేనన్నాడు. షాపులోని సరుకు, రాబోయే సరుకు విలువ లెక్కగట్టి నలభైవేల రూపాయలు బెహారా చేతిలో పెట్టాడు కన్వర్‌లాల్. పాపను ఢిల్లీ నగరానికి దూరంగా మిధిలాపురి ఎక్స్‌టెన్షన్ లోని ‘బాలాశ్రమ’ అనే అనాథ శరణాలయంలో చేర్పించారు. మహానంద తాము పాప పేరిట వేసిన యూటిఏ బాండ్ ఆశ్రమం కార్యదర్శికి అందజేసింది. ఒక పదివేల రూపాయలు పాప పేరిట బ్యాంక్‌లో వేద్దామంటే, వదిన ససేమిరా ఒప్పుకోలేదు. తనను వదిలి వెళ్లిపోతున్న ‘అమ్మ’ను చూస్తూ, ఏడ్వసాగింది నవనీత్ కౌర్! మహానంద నిస్సహాయురాలు!

***

ఒక నెల రోజుల్లోనే, తన పరిస్థితి అర్థమైంది పాపకు. ఆశ్రమంలోనే టెంత్ వరకు స్కూలుంది. పాపను ఎలిమెంటరీ స్కూలు, ఒకటో తరగతిలో చేర్చారు. పది మంది పిల్లలతో కలిసి ఒక రూంలో ఉండి, జంబుకానా మీద పడుకోవాలి. అపురూపంగా పెరిగిన నవీనీత్ అభిశప్తగా మారింది.

కాని ధైర్యాన్ని కోల్పోలేదు. చక్కగా చదువుకోసాగింది. ఆయాలకు టీచర్లకు త్వరలోనే ‘పెట్’గా మారింది. స్కూల్లో ఒక టీచరు నస్రత్. ఆమె నవనీత్‌ను దయగా చూసేది.

నవీనీత్ పెరిగి పెద్దదయింది. కుందనపు బొమ్మలా ఉంది. టెంత్ కొచ్చింది. ఆమె అదృష్టం! స్కూలు హైయర్ సెకండరీగా అప్‌గ్రేడ్ అయింది! అలా ట్వల్త్ స్టాండర్టు పూర్తి చేసింది. ఆశ్రమం నియమాల ప్రకారం, పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిం తర్వాత ఎవరి దారి వారు చూసుకోవాలి. నస్రత్ మేడం నవనీత్‌కు సాయం చేసింది. చాణక్యపురిలోని ‘ఇంద్రప్రస్థ రెసిడెన్సీ’ అనే హోటల్‌లో రిసెప్షనిస్టుగా ఉద్యోగం ఇప్పించింది. జీతం ఎనిమిది వేల అయిదువందలు. హోటల్ వెనుక స్టాఫ్ క్వార్టర్సులో ఒక గది యిచ్చారా అమ్మాయికి. నస్రత్ మేడంకు కృతజ్ఞతతో పాదాభివందనం చేసింది నవనీత్.

మేడం ఇలా చెప్పింది.“ఇదే నీ జీవితానికి సెటిల్మెంట్ కాదు. నీవు చాలా తెలివైనదానివి. ప్రయివేట్‌గా డిగ్రీకి కట్టు. అకడమిక్‍గా నేను చేతనైన సాయం చేస్తాను. నీ ఉద్యోగం నీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్క్ పెంచుకోడనికి వీలుగా ఉంటుంది. నీవు చాలా ఎదగాలి.”

హైదరాబాద్ నుంచి యాదగిరి రెడ్డి అనే లాయరు తరచుగా వచ్చి ఆ హోటల్‌లో బస చేసేవాడు. ఆయన పేరున్న అడ్వొకేట్. సుప్రీంకోర్టులో కూడ ఆయనకు పరిచయాలుండేవి. నవీనీత్ వినయం, ఒద్దిక ఆయనకు నచ్చాయి. ఆదరంగా మాట్లాడేవాడు.

మూడేళ్లు గడిచాయి. నవనీత్ ప్రయివేటుగా బి.ఎ డిగ్రీ పూర్తి చేసింది. పి.జి.కి కట్టాలని అనుకుంటూంది. కాని ‘ఇంద్రప్రస్థ రెసిడెన్సీ’ని దాని ప్రొప్రయిటర్ వేరే వాళ్లకు ‘టేకోవర్’కిచ్చాడు. ఆయన ఆస్ట్రేలియాలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్లిపోతున్నాడు. కొత్త యాజమాన్యం ‘ఇంపీరియల్ హోటల్స్’ది. వాళ్లు స్టాఫ్‌ను చాలా మందిని తీసేశారు. అందులో నవనీత్ కూడ ఉంది.

అదే సమయంలో యాదగిరి కోర్టు పని మీద వచ్చి ఆ హోటల్లో బస చేసి ఉన్నాడు. ఉద్యోగం పోయిందన్న ఆందోళనను నవనీత్ ముఖంలో గమనించాడాయన.

“ఏమిట్రా, బంగారు తల్లీ! డల్‌గా ఉన్నావివాళ!” అని పలకరించాడు.

తన ఉద్యోగం పోయిందనీ, మరో ఉద్యోగం వెతుక్కోవాలనీ చెప్పిందా అమ్మాయి. ఆయన కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు. “అమ్మలూ! నీకు అభ్యంతరం లేకపోతే నాతో బాటు హైదరాబాదుకొచ్చేయమ్మా! నా భార్య చనిపోయి పదేళ్లయింది. ఒక్కగానొక్క కూతురూ, అల్లుడూ కువైట్‌లో డాక్టర్లు. వారికో బాబు. రెండేళ్లకోకసారి వచ్చి చూసి పోతూంటారు. ఈ మధ్య నాకెందుకో ఒంటరితనంలోని దుర్భరత అనుభవంలోకి వస్తూంది. నీవంటే నాకు అభిమానం. నీకు ఎవరూ లేరు. నాకూ ఎవరూ లేనట్లే లెక్క. నీవు డిగ్రీ పూర్తి చేశావు. నిన్ను హైదరాబాద్‌లో లా కాలేజీలో చేరుస్తాను. లాయరువై నా వృత్తికి వారసురాలవుదువుగాని. నేను రేపు ఫ్లయిట్‌కు సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతాను. ఆలోచించి నిర్ణయం తీసుకో. ”

నవనీత్ కౌర్ కళ్లు చెమ్మగిల్లాయి! “అంకుల్! అంతకంటే కావాలసిందేముంది నాకు. అనాథనైన నన్ను తండ్రిలా ఆదరించి, చదివిస్తానంటున్నారు. చిన్నప్పటి నుంచి నా బాగోగులు నస్రత్ మేడంగారితో ఈ మాట చెప్పి, ఆమె అనుమతి తీసుకుంటాను.”

“తప్పకుండా తల్లీ!” అన్నాడాయన.

ఆరోజే మేడంను కలిసి విషయం చెప్పింది నవనీత్. “పద! నేనూ వస్తాను. ఆయనతో మాట్లాడుతాను. మావారిని కూడ తీసుకు వెళ్దాం.” అని తన భర్త ఖాదర్ వలీతో విషయం చెప్పింది. అతడు జె.యన్.యు.లో అసిస్టెంట్ లైబ్రేరియన్.

యాదగిరి రెడ్డిగారితో మాట్లాడారు. ఆయన జెంటిల్‌మ్యాన్ అని అర్థమైంది వారికి. నిశ్చింతగా తమ నవనీత్‌ను ఆయనతో పంపవచ్చునని అనిపించింది. తమ సమ్మతిని ఆనందంగా ఆయనకు తెలిపారు. కన్నీళ్లుతో వారి దగ్గర సెలవు తీసుకుంది నవనీత్. ఆ అమ్మాయికీ విమానం టికెట్ బుక్ చెయించాడాయన.

ఆయన యిల్లు సికింద్రాబాద్ లోని పద్మావురావునగర్‍లో ఉంది. ఇండిపెండెంట్ హౌస్. ఆయనకు వంట, ఇతర పనులు చేసిపెట్టడానికి ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయన పేరు ఆశీర్వాదం. ప్రకాశం జిల్లావాడు. యాదగిరిరెడ్డి స్వస్థలం కరీంనగర్ జిల్లా జగిత్యాల. ఆయన ఉస్మానియాలోనే ఎం.ఎ. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చేసి, ఎల్.ఎల్.బి. చేశాడు. హైదరాబాదు నగరంలోని పేరున్న లాయరాయన. ఎక్కువగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, మానవ హక్కులు, మహిళా, బాలల హక్కులుకు సంబంధించిన కేసులు ఆయన వాదిస్తుంటాడు. డబ్బుకోసం కాకుండా, న్యాయం కోసం వాదించే సంస్కారి ఆయన. తన తర్వాత వారసురాలిగా నవనీత్‌ను తయారు చేయాలని ఆయన కోరిక. నవనీత్‌తో చెప్పాడు.

“లా చదవడం నీకు ఇష్టమేనా తల్లీ! ఇష్టం లేని చదువు అస్సలు చదవకూడదు. నేను చెప్పానని అసలు చదవకూడదు. పేదవారికి న్యాయ సహాయం చేయాలనేదే నా లక్ష్యం. దాన్ని కొనసాగిస్తావని నా ఆశ.”

“నాకూ యిష్టమే అంకుల్!” అన్నది మనస్ఫూర్తిగా.

‘లాసెట్’కు కట్టించాడు. కోచింగ్ తానే ఇచ్చాడు. ‘లాసెట్’లో మంచి ర్యాంకు సాధించి యూనివర్సిటీ లా కాలేజీలో చేరింది నవనీత్. కన్న కూతురిలా ఆయనకు సేవలు చేసేది. ఆశీర్వాదం వంటలతో నోరు చవిచచ్చిన ఆయనకు మెత్తని పుల్కాలు, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, ఎగ్ దోసె, మామిడికాయ పప్పు, వంకాయ నంచుడు కూర, ఇలా చేసి పెట్టేది. ఆదివారం పునుగులు, మిర్చి బజ్జీలు లాంటివి చేసేది. మధ్యలో రెడ్డిగారి అమ్మాయి, అల్లూడు మనమడు వచ్చి నెల రోజులుండి వెళ్లారు. వారికి నవనీత్ చాలా నచ్చింది.

“చెల్లీ! మా నాన్న నీవు వచ్చినప్పటి నుండి ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాడు. నీ రుణం ఎలా తీర్చుకుంటామో” అంది రెడ్డిగారి అమ్మాయి. ఆమె పేరు రుక్మిణి.

“అయ్యో అక్కా! అంకుల్ నాకు చేసిన మేలు ముందు ఇది ఎంతని?” అన్నదా అమ్మాయి వినయంగా.

***

నవనీత్ లా పూర్తి చేసింది. అంకుల్ దగ్గరే అసిస్టెంటుగా చేరింది. వృత్తిలోని మెళకువలన్నీ నేర్పిస్తున్నాడాయన. ఆమెకు పెళ్లి చేయాలని సంకల్పించాడు. సంబంధాలు చూద్దామని రడీ ఐపోయాడు.

ఒక ఆదివారం ఒక యువకుడిని తీసుకుని వచ్చింది ఇంటికి. అతని పేరు సైదులు. దళితుడు. అతన్ని అంకుల్‌కు పరిచయం చేసింది.

“అంకుల్! ఇతడు నా స్నేహితుడు. నాంపల్లి కోర్టులో పరిచయం అయ్యాడు. బేగంబజారు పోలీస్ స్టేషన్ యస్.ఐ.గా పని చేస్తున్నాడు. నాలాగే అనాథ.”

“నీవు అనాథవని ఇంకా అనుకుంటున్నావా తల్లీ!” అన్నడాయన బాధగా.

“అయ్యో! సారీ అంకుల్!” అన్నదా అమ్మాయి. “మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మీ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం.”

“ఒకవేళ నేను కాదంటే?” అన్నాడాయన గంభీరంగా. ఇద్దరూ మ్రాన్పడిపోయారు. వెంటనే నవ్వేశాడాయన. “కాదనడానికి నేనెవర్ని? నీవు వెంట బెట్టుకుని వచ్చినప్పుడే చూచాయగా నాక్థమైందిలే నవనీతా! గాడ్ బ్లెస్ యూ బోత్!”

వారి ముఖాలు వికసించాయి. తనది సూర్యాపేట దగ్గర పల్లెటూరనీ, చిన్నపుడే తల్లిదండ్రులు చనిపోయారనీ, వారు వ్యవసాయ కూలీలనీ, తన టీచర్ నరసింహశర్మగారు తనను యస్.సి. వెల్ఫేరు స్కూలులో చేర్పించారనీ, ఇంటర్ కూడ యస్.సి. వెల్ఫెర్ జూనియర్ కాలేజీలో, డిగ్రీ నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకున్నాననీ, డైరెక్ట్‌గా ఎస్.ఐ. రిక్రూట్‌మెంట్‌లో సెలెక్ట్ అయినాననీ చెప్పాడు సైదులు.

డి.డి.కాలనీలోని అహోబిలమఠం, నరసింహ స్వామి వారి సన్నిధిలో వారిద్దరి వివాహం నిరాడంబరంగా జరిగింది. రుక్మిణి కుటుంబం కువైట్ నుంచి వచ్చారు.

మరో ఐదేళ్లు గడిచాయి. సైదులు ఇప్పుడు మల్కాజ్‌గిరి సి.ఐ. నవనీత్ లాయర్‌గా పేరు తెచ్చుకుంది. వృత్తిలో రాణిస్తోంది. వారికిద్దరు పిల్లలు. పెద్దది ఆడపిల్ల, పేరు నస్రత్. తర్వాత మగపిల్లాడు. పేరు యాదగిరి! అన్నట్లు, వాళ్లు వారి సొంత పిల్లలు కాదు! ఇద్దరూ అనాథలే! వారిని దత్తత తీసుకున్నారు నవనీత్ దంపతులు. తాము పిల్లలను కనదలుచుకోలేదు.

నవనీత్‍ది సిక్కు మతం. పట్నాయక్ లది హిందూమతం. నస్రత్‌ది ఇస్లాం. యాదగిరి రెడ్డి హిందువు. ఆశీర్వాదం క్రైస్తవుడు. సైదులు దళితుడు. నరసింహశర్మ బ్రాహ్మడు! దీన్ని బట్టి తెలిసిందేమిటి? మానవతే మతం! అన్ని మతాలకు సమ్మతం! అది పరిఢవించాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here