మానవత్వంలోనే దైవత్వాన్ని దర్శించిన మహనీయులెందరో!

0
8

[dropcap]రా[/dropcap]మకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానందుడు త్యాగం, నిరంతర సేవ అనబడే ఆదర్శాలను ఆచరించి ప్రచారం చేశాడు. చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో అతడు ఒక ప్రభంజనంలా వెలిగిపోయాడు. తన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ అతడు సభికులను – ‘అమృతస్య పుత్ర!’ అని సంబోధించాడు.

అంతకు ముందు మరే సాధువు/సన్యాసి సనాతన హిందూ ధర్మానికి చెందిన ఆ ఉదాత్త భావనను అంత చక్కగా, అంత సులభంగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళలేదు. ప్రపంచ ప్రసిద్ధి, చరిత్ర ప్రసిద్ధి గాంచిన ఆ ఉపన్యాసం మత ప్రసంగాలలో నేటికీ ఒక మైలురాయి. మానవ జాతినే సంబోధించి వివేకానందుడు మానవులలో దైవత్వాన్ని ప్రస్తావించాడు.

“జన్మస్థలాలు వేరైనప్పటికీ నదులన్నీ సముద్రంలో తమ అస్తిత్వాన్ని అర్పించుకున్నట్లే మానవులందరూ – ఎంచుకున్న మార్గాలలో వైరుధ్యమున్నప్పటికీ వారి ఆశయం భగవంతుని చేరడమే” అని అతడు చాటిచెప్పాడు. ఆశయాలలో, ఆచరణలో, ప్రబోధాలలో తానెంత స్పష్టతతో ఉన్నప్పటికీ దేశంలో అన్నార్తులై ఉన్న వివిధ కులలా, జాతుల వారిని ఏకోన్ముఖులను చేసి భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటం ఆషామాషీ వ్యవహారం కాదని ఆయన గుర్తించాడు. నాటికీ నేటిమీ నడుమ గడిచిన సుదీర్ఘ కాలంలో – ఎంత పురోభివృద్ధి సాధించినప్పటికీ మనిషిలో, ఆలోచనా విధానంలో, భావోద్వేగాలలో చెప్పుకోదగిన మార్పేమీ రాలేదు. ఆ కారణంగా ఆయన బోధనలు నేటికీ వర్తిస్తాయి. ఏ కాలానికైనా అనుసరణీయాలే!

ముస్లిం పాలకులలో కొందరు ఉదారవాదులుగా మరి కొందరు మధ్యేవాదులుగా వ్యవహరించారు. కాని, ఔరంగజేబు మటుకు పరమ దుర్మార్గుడుగాను, మత దురహంకారి గాను, పరమత ద్వేషి గాను అపప్రధను మూటగట్టుకున్నాడు. కానీ ఆ ఔరంగజేబు కాశీ, ఉజ్జయినిలలో హిందూ దేవాలయాలకై జాగీర్లను కేటాయించిన సంగతి ఎందరికి తెలుసు? దక్కను పీఠభూమిలో ఒక మసీదును అతను కూలగొట్టించాడు. విధ్వంసకాండ చెలరేగినపుడు హిందువులు దేవాలయాలకు హాని కలిగించిన సందర్భాలు, ముస్లింలు మసీదులకు నష్టం కలిగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ అవి వెలుగు చూడవు. ఏ కాలంలోనైనా రాజకీయాలలో ప్రయోజనకరమైన అంశాలకే ప్రాముఖ్యం, ప్రాచుర్యం లభిస్తూ ఉంటాయి.

మతమొక్కటే ఘర్షణలకు కారణం కాదు. ప్రాంతీయ భాషా భేదాలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. దేశ విభజన తరువాత పంజాబ్, ఎంపి, బెంగాల్, యు.పి., బీహార్ వంటి చోట్ల నివసిస్తున్న లక్షలాది ముస్లిములు పాకిస్తాన్‍కు వెళ్ళిపోయారు. రక్త సంబంధమో, దేశభక్తో, మరొకటో ఏ కారణంగానైనా అలా వలస వెళ్లినవారు ‘ముజిహిర్’‍లుగా సింధ్ ముస్లింల దృష్టిలో నేటికీ తక్కువ స్థాయి వారే. వారంటే తేలిక భావమే. ఇరువర్గాల నడుమ చెలరేగే ఘర్షణలు – హిందూ ముస్లింల నడుమ జరుగుతున్నాయనుకొంటున్న ఘర్షణలకు ఏ మాత్రం తీసిపోవు.

భారతదేశంలో –

1950లో జరిగిన ‘నెహ్రూ-లియాఖత్’ ఒప్పందం, జామా మసీదు నుంచి అబుల్ కలామ్ అజాద్ విశిష్ట ప్రసంగం వంటివి కొంత సమరస భావాన్ని పాదుకొల్పాయి. ‘భాష’ ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో అప్పటి వరకూ అంతో ఇంతో మిగిలి ఉన్న వైమనస్యాలు, అభద్రతాభావం పూర్తిగా మరుగున పడిపోయాయి. కారణం ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నియమించబడిన కమిటీ అధినేత ఒక ముస్లిం మేధావి. అటువంటి చర్యలే పౌరుల విశ్వాసాన్ని చూరగొని వారిలో భద్రతాభావాన్ని పెంపొందించగలుగుతాయి.

1962లో జబల్‍పూర్‍లో పెద్ద ఎత్తున మత విద్వేషాలు చెలరేగాయి. లౌకిక రాజ్యంగా వెలుగొందాలని కలలు గంటున్న దేశంలో చెలరేగిన ఈ విధ్వంసకాండకు – చలించిపోయిన నెహ్రూ వెంటనే ‘నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్’ను ఏర్పాటు చేశారు. స్వర్గీయ జయప్రకాశ్ నారాయణ నెలకొల్పిన ‘ఇన్సాని బిరాదరి’ (మనుషులంతా ఒక్కటే కుటుంబం) ఆ కోవకు చెందినదే.

జయప్రకాశ్ నారాయణ్, షేక్ అబ్దుల్లా, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటివారు సమావేశాలు నిర్వహించి మత సామరస్యాన్ని ప్రోది చేసే ప్రసంగాలు చేసేవారు. ఆ ప్రసంగాలకు ప్రజలు అమితంగా ప్రభావితులూ అయ్యేవారు. గాంధీజీ హిందువులు, ముస్లింలు భారతదేశానికి రెండు కళ్లవంటి వారనీ, ఏ కన్ను పాడయినా వికారమేనని అనేవారు. మహమ్మద్ ఆలీ జిన్నా సైతం 1928 వరకు హిందూ ముస్లిం సమైక్యత గొప్ప ప్రతీకగా నిలిచేవారు. తరువాత ఆయన ధోరణి మారింది. అయినప్పటికీ దేశ విభజన అనంతరం పాకిస్తాన్ రాజ్యంగ సభలో మాట్లాడుతూ ఆయన –

“మీలో ఎవరు ఏ మతానికి చెందినవారైనా ప్రథమ, ద్విఈయ శ్రేణి పౌరులన్న వివక్ష ఉండదు. చివరి వ్యక్తి వరకూ అందరికీ సమాన హక్కులు ఉన్నాయన్న స్ఫూర్తితో పనిచేయండి” అని ఉద్బోధించారు. దేశ విభజనతో  లక్ష్యం పూర్తి అయిందని, ఇక మీదట వైషమ్యాలు ఉండరాదని, వివక్షకు తావుండరాదనీ భావించడమే అందుకు కారణం.

నిష్కర్షగా చెప్పాలంటే స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి ఆ స్ఫూర్తి ఈ రోజు కాగడా వేసి వెదికినా కనిపించదు. ఏ బహు కొద్దిమందో ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి!

బాబ్రీ విధ్వంసం హిందూమతం లోని ఉదాత్తనే ప్రశ్నార్థకం చేసింది. మత అసహనానికి ప్రతీకగా, దేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయే సంఘటన బాబ్రీ విధ్వంసం.

అయోధ్య పరిణామాల అనంతరం చెలరేగిన విధ్వంసకాండలో ఆహుతి అయిపోయిన ప్రార్థనా మందిరాలను పునర్నిర్మించడంలో హిందూ ముస్లింలు ఇరువురూ కలిసి శ్రమించారు. మతం కన్న మానవత్వం గొప్పదని ఇరు మతాల వారు విశ్వసిస్తున్నారని అనడానికి ఇంతకంటే గొప్ప ఋజువు ఏముంటుంది?

“మసీదైనా, మందిరమైనా, కూలనూ వచ్చు. తిరిగి నిర్మింపబడనూ వచ్చు. కానీ దెబ్బతిన్న మనోభావాలను సమాధానపరచగల శక్తి ఎవరికి ఉంది?” ఏనాడో దశాబ్దాల క్రిందట కవి అన్న పలుకులు అక్షరసత్యాలన్నవి నిష్ఠురసత్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here