మానవీయమూర్తికి వీడ్కోలు

4
8

[dropcap]శ్రీ[/dropcap]మతి దాసరి శిరీష అనగానే గుర్తొచ్చేది నిరాడంబరత! మొహంపై ఎప్పుడూ చిరునవ్వు! అభిమానంతో కూడిన పలకరింపు! మంచి రచయిత్రి, భావుకురాలు, సంఘ సేవిక అంతకుమించి గొప్ప మానవతామూర్తి! ఎందరి జీవితాలనో ప్రభావితం చేసిన వ్యక్తి!

శిరీష గారితో నా పరిచయం 2014 నవంబర్ నాటిది. నా అనువాద రచన ‘ప్రయాణానికే జీవితం’ ఆవిష్కరణ ఆలంబనలో పెట్టుకుందామని దాసరి అమరేంద్ర గారు సూచించారు. సభకి కొద్ది రోజుల ముందు ఆయన హైదరాబాద్ రావడం – నేను వారిని, శిరీష గారిని కుకట్‌పల్లి బాలాజీనగర్‍లో మొదటిసారిగా కలుసుకోవడం జరిగింది. మొదటి కలయికలోనే కొత్తవారితో కాకుండా, అత్యంత ఆత్మీయులతో మాట్లాడుతున్నట్టు అనిపించింది.

మేమప్పుడు మియాపూర్‌లో ఉండేవాళ్ళం. శిరీష గారు, అమరేంద్ర గారితో పరిచయం స్నేహంగా మారి తరచూ కలిసేవాళ్లం. శిరీషగారి గురించి, ఆలంబన సంస్థ గురించి వివరంగా తెలిసింది. ఆ సమయంలో నాకు ఉద్యోగంలో చిన్న గ్యాప్ వచ్చి, ఫ్రీలాన్సర్‌గా ట్రాన్స్‌లేషన్ వర్క్స్, బుక్ మేకింగ్ వర్క్స్ చేసేవాడిని.

శ్రీమతి దాసరి శిరీష గారు

శిరీష గారు స్వయంగా రచయిత్రి అయినా, మంచి చదువరి కూడా. వీలైనన్ని పుస్తకాలు చదివేవారు. ఆయా రచనలను విశ్లేషించేవారు. వీలైనప్పుడల్లా బాలాజీ నగర్ వెళ్ళి ఆవిడని కలిసివాడిని. సాహిత్యం గురించి, సమాజం గురించి మాట్లాడుకునేవాళ్ళం. తోటి రచయితల పుస్తకాలు కొని ప్రోత్సహించేవారు. ఆలంబనకి వచ్చే అతిథులకి ఆ పుస్తకాలను కానుకగా ఇచ్చేవారు. ఈ విధంగా ఎందరి చేతో ఎన్నో పుస్తకాలు చదివించారు.

బుక్ మేకింగ్ వర్క్స్ చేస్తున్నానని చెప్తే నా కథల పుస్తకం ఒకటి చేసివ్వండి అన్నారు. ఎప్పుడో రాసినవి కథలు వెతకాలి అన్నారు…. పుస్తకంగా వేయాలనుకున్న కథలన్నీ దొరకడానికి రెండు మూడు నెలలు పట్టింది.

కథలు దొరికాక, వాటిని టైప్ చేసి, పుస్తక రూపంలో అమర్చాకా, నేనొకసారి ఆవిడ ఒకసారి ప్రూఫులు చూశాం. కథల క్రమం కోసం చర్చలు… పుస్తకానికి శీర్షిక ఏం ఉంచాలని బాగా ఆలోచించి అందులోని ఓ కథ – ‘మనోవీధి’ పేరునే పుస్తకానికి పెట్టాలని నిర్ణయించుకున్నాం. కవర్ పేజీకి చక్కని బొమ్మ గీయించాం.

ఈ పుస్తకం తయారయ్యే క్రమంలో నాకు శిరీష గారి మొత్తం కుటుంబం సన్నిహితమయింది. ఆ కుటుంబంలో ఒకరికి దగ్గరయ్యామంటే, అందరికీ దగ్గరయినట్టే. పరిపూర్ణ గారు, అమరేంద్ర గారు, లక్ష్మిగారు, శైలేంద్ర గారు, పద్మగారు, శేషుబాబు గారు, అరుణ్, అపర్ణ, కృష్ణమోహన్… ఇంకా వారి బంధువులు – సన్నిహితులయ్యారు.

మనోవీధి పుస్తకం ఆవిష్కరణ ‘సప్తపర్ణి’లో ఘనంగా జరిగింది. ఆ సభలో – పుస్తకం బాగా వచ్చిందనీ, ఆ ఘనత నాదేనంటూ ఆ క్రెడిట్ నాకిచ్చారు శిరీషగారు. ఓ రచయిత్రి తన పుస్తకం బాగా వచ్చినందుకు బుక్ మేకర్‍కి ప్రశంసలీయడం – వారి అభిమానమది!

ఆ తర్వాత అమరేంద్ర గారికి, పరిపూర్ణగారికి వాళ్ళ రచనలు పుస్తక రూపంలో రావడంలో సహకరించాను.

ఈ క్రమంలో నన్ను ఆలంబన సంస్థలోకి తీసుకోవాలని శిరీషగారు అనుకోవడం, కుటుంబ సభ్యులతో సంప్రదించడం – వారు సంతోషంగా నన్ను సంస్థలోకి ఆహ్వానించడం జరిగింది.

ఆలంబనలో పిల్లలని, టీచర్లని చూసి – విద్య, పోషణ ద్వారా భావితరాలకు మేలు కలిగించి, తద్వారా మేలైన సమాజాన్ని చూడాలన్న ఆవిడ ఆకాంక్షను గ్రహించగలిగాను. ఆలంబనలో మేనేజర్‍గా చేరి శిరీషగారికి తోడుగా వ్యవహరించాను. మియాపూర్ నుంచి బాలాజీనగర్‍కి ఇల్లు మారేలా నన్ను ఒప్పించారు.

ఆలంబన పిల్లలతో శిరీష గారు

ఆలంబన పిల్లలకి ఉపయోగపడే ఏ పని ఎవరు చేసినా శిరీషగారికి అత్యంత సంతోషం కలిగేది. పేద కుటుంబాలలోని ఆ పిల్లలకు ఏ రూపంలో మేలు జరిగినా ఆనందపడేవారు. పిల్లలకి చదువుతో పాటు లోకజ్ఞానం, మంచి చెడు విచక్షణ అత్యంత అవసరమని, అది బాల సాహిత్యం ద్వారా లభిస్తుందని నమ్మి ఎన్నో పిల్లల కథల పుస్తకాలు కొని టీచర్ల చేత పిల్లలకి చదివి వినిపించేవారు. ఆలంబన టీచర్లని, వారి పిల్లలని కూడా ఎంతో ఆప్యాయంగా చూసేవారు.

శిరీషగారి సదుద్దేశం గ్రహించిన ఎందరో వాలంటీర్లుగా సంస్థకు తమ సేవలందించారు. కొందరు పిల్లలకు పాఠాలు బోధిస్తే, మరికొందరు పుస్తకాలు తదితర సామాగ్రి తెచ్చేవారు. మరికొందరు లింకేజ్‍ల ద్వారా మరికొందరిని సంస్థకి పరిచయం చేసేవారు. విరాళాలు తెప్పించేవారు. ఆలంబన మొదటి రెండు బ్యాచ్‌ల పిల్లలు చదువులు పూర్తి చేసుకుని, ఉద్యోగాలు తెచ్చుకున్నప్పుడు శిరీషగారు ఎంతో సంతోషించారు.

శిరీష గారికి ప్రకృతి అంటే ఇష్టం. మొక్కల పెంపకం ఇష్టం. ఆ ఇష్టాన్నే ఆలంబన పిల్లలకు నేర్పారు. ఎన్నో మొక్కలు తెప్పించి, ఆలంబనలో నాటించి – పిల్లలు వాటి పట్ల శ్రద్ధ వహించేలా చేశారు. శిరీష గారికి విజయవాడ అంటే అభిమానం. విజయవాడ ఎప్పుడు వెళ్లాల్సి వచ్చినా ఎంతో ఇష్టంగా ప్రయాణించేవారు. విజయవాడలో మా ఇంటికి వచ్చి అమ్మని, తమ్ముడిని కలిసి ఒక పూట భోం చేశారు.

ఆలంబనలో పని చేస్తుండగా శిరీష గారికి మరో రెండు పుస్తకాలు – దూరతీరాలు (నవల), కొత్త స్వరాలు (కథా సంపుటి) రూపొందించాను. ఆ సందర్భంగా మా మధ్య ఎన్నో చర్చలు… తరువాత హైదరాబాద్, విజయవాడ బుక్ ఫెయిర్లలో ఆలంబన తరఫున స్టాల్ పెట్టడం – మంచి అనుభవం. పుస్తకాలు ఎన్ని అమ్మాము అన్నది కాక, ఏ పూట ఎంతమంది మిత్రులని కలిసాం అని చూసేవారు. పాత స్నేహితులో, తోటి రచయితలో కలిస్తే ఎంతో సంతోషపడేవారు.

ఆలంబనలో ‘వేదిక’ తరఫున ఎన్నో సాహిత్య సమావేశాలు నిర్వహించారు. కథలను, పుస్తకాలను నిష్పాక్షికంగా విశ్లేషించేవారు.

నాకు సంచిక వెబ్ పత్రికలో ఉద్యోగావకాశం రావడంతో నా ఉన్నతిని కాక్షించి నన్ను ఆలంబన నుంచి సంతోషంగా రిలీవ్ చేశారు. వీడ్కోలు సభ కూడా జరిపారు. నాకు, మా పిల్లలకి గిఫ్ట్‌లు ఇచ్చారు. మా ఇద్దరు పాపలంటే ఆవిడకి చాలా ఆపేక్ష.

శ్రీమతి దాసరి శిరీష, ఆలంబన టీచర్‍లతో సోమ శంకర్

గత ఏడేళ్ళుగా ఒకళ్ళ కథలకు ఒకళ్ళం తొలి పాఠకులం. కథలో ఏమైనా మార్పులు సూచించాలంటే, సున్నితంగా, నొచ్చుకోకుండా చెప్పేవారు. ఆవిడ కోసం ఎన్నో కథలు, వ్యాసాలు టైప్ చేశాను. ఆ రచనల ద్వారా ఆవిడ జీవన దృక్పథం, ఔన్నత్యం అర్థమైంది.

పాత హిందీ, తెలుగు సినిమా పాటలను ఆస్వాదించేవారు. మరీ ఉత్సాహంగా ఉంటే ఆయా పాటలు హమ్ చేసేవారు.

శేషుబాబు గారి వియోగం ఆవిడని క్రుంగదీసింది. ఆ వెలితిని ఎవరూ పూడ్చలేకపోయారు. అది జరిగిన కొన్నాళ్ళకి కేన్సర్ తిరగబెట్టడంతో, ఎంతో ధైర్యంగా కీమోథెరపీ చేయించుకున్నారు. మౌనంగా, గుండె దిటవుతో నొప్పిని భరించారు. అప్పటి నుండి చిన్న చిన్న అనారోగ్యాలు ఆవిడని వెంటాడాయి. వాటితో పోరాడారు. కోలుకున్నారు.

కోవిడ్ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. లాక్‌డౌన్ సడలించాకా, రోజు విడిచి రోజు లేదంటే వీలయినప్పుడల్లా – వాళ్ళింటికి వెళ్లి కబుర్లు చెప్పేవాడిని. పరిస్థితులు మెరుగవుతాయని ఎంతో ఆశావహంగా ఉండేవారు. కోవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా సంభవించిన పరిణామాలకు బాధపడ్డారు.

2021 జూన్ నెలలో మా పిల్లల చదువుల దృష్ట్యా, మేము బాలాజీనగర్ నుంచి తిరుమలగిరి ప్రుడెన్షియల్ బ్యాంక్ కాలనీకి ఇల్లు మారాము. వీలైనప్పుడల్లా వచ్చి కలమన్నారు. ఆవిడ కోరినట్టే కలిసాను.

29 ఆగస్టు 2021 ఆదివారం సాయంత్రం శిరీషగారిని కలిసాను. స్వల్ప అనారోగ్యంతో ఉన్నారు. వారిని ఎక్కువ సేపు మాట్లాడించి ఇబ్బంది పెట్టకూడదనుకుని, ఓ అరగంటలో బయల్దేరిపోయాను. అదే మా చివరి సంభాషణ అయ్యింది.

03 సెప్టెంబరు 2021 మధ్యాహ్నం శిరీష గారు తనువు చాలించారు. మరణాంతరం కన్నులను ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‍స్టిట్యూట్‌కీ, భౌతికకాయాన్ని ఇఎస్‌ఐ ఆసుపత్రికి అందజేశారు. తన తదనంతరమూ, మరో వ్యక్తికి కంటి చూపు ప్రసాదించే అవకాశం కల్గించిన శిరీష గారు ధన్యులు.

వ్యక్తులు భౌతికంగా కనుమరుగవుతారు, వ్యక్తిత్వం సదా నిలిచిపోతుంది. శిరీష గారు భౌతికంగా లేకపోయినా, వారి స్ఫూర్తి కొనసాగుతుంది. ఆ మానవీయమూర్తికి వీడ్కోలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here