మారాం చేసే పాపాయితో జోలపాట

0
10

[dropcap]పూ[/dropcap]ర్వపు తల్లులు తమ పిల్లలకు ఉగ్గుపాలతో పాటు ఎన్నో రకాల పాటలను వినిపించారనడానికి నిదర్శనంగా, తెలుగు సాహిత్యంలో పరచిన కాలం నుండి సజీవంగా ఉన్న లాలిపాటలు, జోలపాటలు. పేరేదైనప్పటికి ఈ లాలిపాటలు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాయి. పిల్లలను నిద్రపుచ్చడనికో, ఏడుపుని ఆపడానికో, ఓదార్చడానికో సాధారణంగా తల్లులు పాడే పాటలివి. మారాం చేసేవాళ్ళను, ఏడ్చే పిల్లల్ని సమాధానపెడ్తూ లాలిస్తూ పాడేపాటలు కాబట్టి లాలిపాటలు అని లేదా నిద్రపుచ్చడానికి జోకొడుతూ పాడే పాటలు కాబట్టి జోలపాటలని లోక వ్యవహారం.

ఉగ్గు పాలు తగించేటప్పుడు, స్నానం చేయించేటప్పుడు, ఏడ్చేటప్పుడు, నడక నేర్చుకునేటప్పుడు, దిష్టి తగలకుండా పాడే పాటలు, అన్నం తినిపించేటపుడు, మాటలు నేర్పించడానికి, ఆటలు అడుకునేటప్పుడు ఇలా మన తెలుగుదేశంలో ఎన్నో రకాల పాటలు ఉన్నాయి. ఈ పాటలు పిల్లల మనసు హాయిగా, ఆనందంగా, మానసిక వికాసాన్ని కల్గించడానికి, మనసు ఆహ్లాదకరంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. అంతేకాక తల్లి దగ్గరే ఉంది ఇలా పాడుతూ ఉండటం వల్ల, తల్లి తమ దగ్గరే ఉన్నదన్న ధైర్యాన్ని కలిగించడం వల్ల తల్లికి తమపై ఎంతో ప్రేమ ఉన్నదన్న విషయాన్ని పిల్లలు గ్రహిస్తారు. ఇంట్లోవారి నుండి ఎక్కువ ప్రేమాభిమానాలు పొందిన పిల్లలు, తన తోటి పిల్లలు, సమాజాన్ని, దేశాన్ని కూడా ప్రేమించగలుగుతారు.

తెలుగులో పిల్లల పాటలు అసంఖ్యాకంగా, అపరిమిత వైవిధ్యం కలిగి ఉన్నాయి. పసిపిల్లల జీవితం కవిత్వమయం, సుమధుర గీతమయం. పసికూనలకు అర్థంకాని లాలిపదాల నుంచి, పెరిగి పెద్దయిపాడే ఆటపాటల వరకు అన్నీ ఉన్నాయి. ఆ పాట ఏ విధంగా సాగినా పసిబిడ్డకేమీ అర్థంకాదు.

“హాయి చిచ్చి ళుళుళుళువ హాయి

హాయి హాయి హాయి ఆపదలు గాయీ

చిన్నవాళ్ళను గాయి శ్రీ వేంకటేశా హాయి

హాయమ్మ తాయమ్మ అక్కా చెల్లెళ్ళు”

~

“జో అచ్యుతానంద – జోజో ముకుందా

లాలి పరమానంద – రామగోవింద”

అంటూ పాడే పాటలు తల్లులు పాడే పాటలలో పల్లవి హాయిగా బిడ్డను నిద్రపుచ్చడానికి పనికివస్తుంది. మాటలు రాని పసిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తుంటే తల్లీ మనసు తపించి పోతుంది. అలాంటపుడు తల్లీ ఆ బిడ్డడి కళ్ళు తుడుస్తూ…

“ఏడవకు ఏడవకు వెర్రి నా తండ్రీ

ఏడిస్తే, నీ కళ్ళు నీలాలు కారు

నీలాలు కారితే నే చూడలేను

పాలైన కారవే బంగారు కండ్ల”

అంటూ ఓదారుస్తూ పాడుతుంది. ఎంత ఓదార్చినా ఏడుపు మానకపోతే గుబురుగా ఉన్నా చెట్ల ఆకులను చూపిస్తూ.

“అదిగో బూచాడు చెట్టు మీదున్నాడు

ఏడిస్తే నిన్నెత్తుకుపోతాడు…”

అని పాడుతుంది. కానీ నేటి తల్లులకు ఈ బూచోడి అవసరం లేకుండా పోయింది. పిల్లవాడు చెప్పినమాట వినకపోయినా, ఏడుపు మానకపోయినా, “నిన్ను స్కూల్లో చేర్పించేయనా?” ఏది వినడంలేదు “అంటూ బెదిరిస్తుంది. సాధారణంగా పిల్లలందరూ అన్నం తినడానికి మారాం చేస్తుంటారు. అలాంటప్పుడు తల్లీ అన్నాన్ని ముద్దులుగా చేసి “ఇది నాన్న ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇది అన్నయ్య ముద్ద” అంటూ తినిపించడం కానీ, బిడ్డను ఎత్తుకుని చందమామను చూపిస్తూ…

“చందమామ రావె జాబిల్లి రావె

కొండెక్కిరావె గోగుపూలు తేవే..”

అంటూ పాడుతూ అన్నం తినిపిస్తుంటే, తిననని మారాం చేసే బిడ్డే ఉండదు. కానీ నేటి నగరాలలో మల్టీ స్టోరిడ్ బిల్డింగ్‌లలో చందమామ ఎక్కడ కనిపిస్తాడు. ఆఫీసుల్లో అలిసిపోయి బస్సుల్లో, ఆటల్లో రాత్రికి ఇళ్ళకు చేరుకునే తల్లులకు పాటలు పాడి అన్నం తినిపించే ఓపికా, తీరికా ఎక్కడిది. ఫలితంగా పిల్లల్ని ఒంటరితనం బాధిస్తోంది.

“చెమ్మా చెక్కా చేరడేసి మొగ్గ,

అట్లుపోయంగా ఆరగించంగ”

“చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ”

అంటూ పాడుకునే బాలబాలికలు గ్రామాల్లో తప్ప మనకెక్కడ కనిపిస్తున్నారు. చల్లని సాయంత్రాలు

“కాళ్ళగజ్జా కంకాళమ్మా, వేగుచుక్క వెలగామొగ్గా మొగ్గా కాదు…”

చికు చికు పుల్లా, చికురాకు పుల్లా దోపిడీకి దొంగలోస్తే దాక్కోవే పుల్లా…”

అంటూ పిల్లలందరూ కలసి మెలిసి ఆటలు ఆడుకుంటూ పాడుకునే వారు. ఈ పాటలు పిల్లల బుద్ధి కుశలతను పెంచి మానసికమైన కసరత్తుగా ఉపయోగపడతాయి. నేడు చల్లని సాయంత్రాలు ట్యుషన్లతో, టివిల సరదాలతో మానసికమైన ఒత్తిడితో గడిచి పోతున్నాయి.

“దాగుడు మూతలు దండాకోర్ పిల్లీ వచ్చే ఎలకా దాగె”

అంటూ దాగుడుమూతలు ఆడుకోవాల్సిన పిల్లలు, స్కూళ్ళలో హోం వర్కులు, మార్కులు, రాంకులు అంటూ దాగుడుమూతలాడుతున్నారు.

“బుజ్జి మేక బుజ్జి మేక ఎక్కడికేల్తివి” అంటూ పాడుకునే వయసులో బుజ్జి బుజ్జి నడకలతో, స్కూళ్ళు, ట్యుషన్ల మధ్య నలిగిపోతున్నారు.

ప్రపంచంలోని ఆనందమంతా తమదే అన్నంత ధీమాగా, నవ్వుతూ తుళ్లుతూ ఆటపాటలతో, ఆనంద పారవశ్యంతో గడపాల్సిన బాల్య జీవితాన్ని బండెడు పుస్తకాలతో, వంగిపోయిన వీవుతో, ముక్కుపై జారే కళ్ళజోడుతో, ఏ భావమూ పలకని ముఖాలతో, అపరితమైన తల్లిదండ్రుల ఆశల మధ్య గడిచిపోతున్నది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లల్లో ఆప్యాయతానురాగాలు కొరవడుతున్నాయి.

తల్లిదండ్రులు ఒక్కక్షణం మీ పసిపిల్లల గురించి ఆలోచించండి. పసి వారిపై మోయలేని భారాన్ని మోపకండి. ఆటపాటలతో ఆనందంగా గడిపేలా చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here