మార్గదర్శులు

0
12

[‘మా మంచి మాస్టారు’ వ్యాసరచన పోటీ కోసం శ్రీ గోనుగుంట మురళీకృష్ణ రచించిన ‘మార్గదర్శులు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

“సంచిక” వెబ్ మ్యాగజైన్ లో ప్రచురితం అయిన డా.రాయపెద్ది వివేకానంద్ వ్రాసిన “స్వాతిచినుకు” కథ చదివి ప్రేరణ పొంది ఈ వ్యాసం రాస్తున్నాను. మీరు కూడా ఆ కథ తప్పక చదవండి.

https://sanchika.com/swathi-chinuku-dr-vrp-story/

“గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్” అని నన్నయగారు అన్నట్లు గడిచిపోయిన కాలం తలచుకుంటే అందులోనూ బాల్యం గుర్తుకువస్తే సన్నజాజి పరిమళంతో కూడిన పిల్లగాలి సోకినట్లు ఆహ్లాదంగా ఉంటుంది. అప్రయత్నంగా పెదవుల మీద చిరునవ్వు కదలాడు తుంది. చిన్నప్పుడు చదువు నేర్పిన గురువు మదిలో మెదలగానే మనసులో గౌరవభావం కలుగుతుంది ఎవరికైనా. కొన్ని కోట్లమందిలో నేనూ ఒకడినే! నాకూ అలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి.

ప్రాథమిక పాఠశాలలో మా తరగతికి సుంకర శాయాజీరావు అనే మాష్టారు తెలుగు చెప్పేవారు. ఆయన పాఠాలు చాలా సులభశైలిలో చందమామ కథలు లాగా చెప్పేవారు. పరీక్షలు జరిగేటప్పుడు “ముందు మీ పేర్లు, గోత్రాలు రాసి ఏడవండి” అనేవారు హాస్యంగా. పరీక్ష పేపర్లు దిద్ది ఇచ్చేటప్పుడు “నాకు ఎన్ని మార్కులు వచ్చాయి సార్!” అని అడిగితే “తినబోతూ రుచి అడగటం దేనికి?” అంటూ సందర్భానుసారంగా జాతీయాలు, సామెతలు వాడుతూ ఉండేవారు. నాకు తెలుగు మీద ఆసక్తి కలగటానికి బీజం వేసింది ఈ మాస్టారే అని చెప్పవచ్చు.

హెడ్ మాస్టర్ యెండూరి లక్ష్మీ కాంతారావు అని ఉండేవారు. “ఎప్పుడూ చదువుకుంటూనో, రాసుకుంటూనో ఉండండి. ఖాళీగా కనబడ్డారంటే తాట తీస్తాను” అనేవారు. అనటమే గానీ ఎప్పుడూ పిల్లల ఒంటిమీద దెబ్బ వేయలేదు. కోపంతో ఒక్క అరుపు అరిచారంటే పిల్లలంతా బిక్కచచ్చిపోయినట్లు ఉండిపోయేవారు. ఒకరోజు నన్ను పిలిచి “నేను పనిమీద బయటకు వెళుతున్నాను. అల్లరి చేసిన వాళ్ళ పేర్లు రాయి. వచ్చిన తర్వాత తంతాను” అని చెప్పివెళ్ళారు. తిరిగివచ్చి “ఏరా కిట్టిగా! మొదటే పద్మపేరు రాశావు ఎర్రగా బుర్రగా ఉందనా!” అంటూ నవ్వారు. (ఈ రోజుల్లో అలా మాట్లాడితే అది పెద్ద ఇష్యూ చేసి గొడవచేస్తారు. అప్పట్లో పేరెంట్స్ తేలికగా తీసుకుని నవ్వుకునేవారు). “ఇంత పెద్ద లిస్టు రాశావేరా! అంటే నీ మాట ఎవరూ వినటం లేదనేగా! లీడర్‌గా పెట్టాల్సింది బాగా చదివేవాడిని కాదు, బాగా తన్నగలిగే వాడిని” అని నన్ను తీసేసి, ఇంకో మొద్దబ్బాయిని లీడర్‌గా పెట్టారు. ఆయనలో జోవియల్‌గా ఉండే ఈ రూపాన్నే చూడటానికి ఇష్టపడేవారు గానీ ఉగ్రనరసింహ మూర్తిలా అవటం ఇష్టపడేవారు కాదు పిల్లలు. అందుకని ఆయన చెప్పినట్లే నడచుకునేవారు. ఆయన నేర్పిన క్రమశిక్షణే తర్వాత కాలంలో నేను ఉపాధ్యాయుల అభిమానానికి పాత్రుడనవటానికి కారణం అయింది.

హైస్కూల్‌కి వచ్చిన తర్వాత తెలుగు వై.హేమలతగారు బోధించేవారు. ఆమె సంతకం చేసేటప్పుడు “లత వై.హెచ్.” అని చేసేవారు. నోట్స్ చెప్పేటప్పుడు ఒక పద్యం చెప్పాలంటే అందులో భావం, సంధులు, సమాసాలు, ప్రకృతివికృతులు అన్నీ ఒకేసారి కలగలిపి చెప్పేవారు. హెడ్ మాస్టర్ “అలా చెబితే పిల్లలు అర్ధం చేసుకోలేరు. పాఠం మొత్తంలో వచ్చేవి  దేనికిదానికి విడివిడిగా చెప్పండి” అని అంటే “అలా చెప్పను. ఇది నా శైలి. ఇలాగే చెబుతాను” అనేవారు ఖచ్చితంగా. అయినా మేము ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవలేదు. ఎకడమిక్‌గా నేను తెలుగు పదవ తరగతిలోనే ఆపేశాను. కానీ ఆమె చెప్పిన చంధస్సు నాకు ఇప్పటికీ గుర్తుంది. అలా మనసు మీద శాశ్వతముద్ర వేసుకునేటట్లు బోధించేవారు ఆవిడ.

ఇంగ్లీష్ మాస్టారు పేరు పానకాచార్యులు. ఆయన పాఠం చెప్పేటప్పుడు “ఇంగ్లీష్ మన భాష కాదు. నేర్చుకోవటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మీరు నేర్చుకోగలిగినంత వరకే నేర్చుకోండి. పరీక్షలో మార్కులు తగ్గాయని నేను అడగను. రాసినంత వరకు నిజాయితీగా కాపీ కొట్టకుండా రాయండి” అని చెప్పేవారు. దానితో మాకు పరీక్షలు అంటే భయం పోయేది. “మార్కులు తగ్గినా ఫర్వాలేదు. కాపీ కొట్టకుండా రాస్తేచాలు” అనుకునేవాళ్ళం.

డ్రాయింగ్ మాస్టారు నాకు డ్రాయింగ్ నేర్పేవారు. అయన పేరు నాకు సరిగా గుర్తులేదు, ప్రసాద్ అనుకుంటాను. ఎందుకంటే అందరూ డ్రాయింగ్ మాస్టారు అనే పిలిచేవారు ఉపాధ్యాయులతో సహా! పేరుతో పిలవటం ఎప్పుడూ చూడలేదు. నా బొమ్మలు చూసి మెచ్చుకునేవారు. “నీకు వీలయినప్పుడల్లా మా యింటికి రారా! ఇంకా బాగా నేర్పి డ్రాయింగ్ పరీక్షలకు పంపుతాను” అని చెప్పారు. “ఫీజ్ ఎంత ఇవ్వమంటారు?” అని అడిగితే “ముందు పరీక్ష పాసవ్వు, తర్వాత చూద్దాం” అన్నారుగానీ నా దగ్గర ఒక్కపైసా కూడా తీసుకోలేదు. “నేను పెద్దయిన తర్వాత మీలాగా డ్రాయింగ్ మాస్టారు అవుతాను” అనేవాడిని. “నీ మొహం! నీకు తెలియదు. అది చాలా చిన్న జాబ్. నువ్వింకా పెద్దపెద్ద ఉద్యోగాలు చేయాలి” అని ప్రోత్సహించేవారు. కానీ దురదృష్టవశాత్తూ నేను పరీక్షలకు కుర్చోకుండానే అయన ట్రాన్స్‌ఫర్ అయి దూరంగా వెళ్ళిపోయారు. అలా ప్రోత్సహించేవారు మళ్ళీ ఇంకొకరు దొరకలేదు.

కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత కాలేజీ మ్యాగజైన్‌లో రచనలు తీసుకోవటానికి మల్లికార్జునరావు అనే తెలుగు లెక్చరర్ ఎడిటర్‌గా వ్యవహరించేవారు. “నీలో బాగారాసే నైపుణ్యం ఉంది. కానీ ఇంకా చదవాలి. ఒక్క పేజీ స్వంతగా రాయాలంటే వంద పుస్తకాలు చదవాలి” అని చెప్పారు. ఆ మాట నా మనసులో ముద్రించుకుపోయింది. ఇప్పటికీ నాకు రచనలు చేయటం కంటే, చదవటమే ఇష్టం. కాలేజీ మ్యాగజైన్‌లో నా కథ వచ్చినప్పుడు మా అమ్మకి చూపించి “నా కథను చదివి ప్రెండ్స్ అందరూ మెచ్చుకున్నారమ్మా!” అని చెప్పేవాడిని. “అన్నీ పొగడ్తలే కోరుకుంటే లోపాలు ఎలా తెలుస్తాయి?” అన్నది. మా అమ్మ పెద్ద చదువులు చదువుకోలేదు. అయినా యథాలాపంగా ఆమె అన్నమాట నేను మర్చిపోలేదు. తల్లే తొలి గురువు అంటారు, మా అమ్మ కూడా ఒక రకంగా నాకు గురువులా మార్గదర్శకత్వం చేసినట్లు భావిస్తాను. ఇప్పటికి కూడా “నా కథలో మీకు నచ్చని అంశాలు ఉంటే చెప్పండి, నేనేమీ అనుకోను” అని అంటూ ఉంటాను తోటివారితో.

నాగార్జున యూనివర్సిటీలో యం.యస్.సి. చదివేటప్పుడు రోశయ్యగారు అనే ప్రొఫెసర్ బోటనీ చెప్పేవారు. పాఠం చెబుతుంటే ఒక గంట అయిదు నిమిషాల్లా గడిచిపోయేవి. అందరూ మంత్రముగ్ధుల్లాగా ఉండిపోయేవారు. విద్యార్ధులతో నవ్వుతూ చాలా కలివిడిగా ఉండేవారు. కానీ చూడటానికి  ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారు. ప్యాంట్, షర్ట్, చెప్పులు తప్ప ఉంగరాలు, వాచీలు వంటి అలంకారాలు ఏమీ ఉండేవికాదు. తను పెద్ద చదువు చదివాననీ, పెద్ద ఉద్యోగం చేస్తున్నాననీ గర్వమే ఆయన మొహంలో కనబడేది కాదు. “అన్నీ ఉన్న విస్తరి అణగిమణగి ఉంటుంది” అంటారు ఇదే కాబోలు అనిపించేది.

ఇలా ఒక్కొక్కదశలో ఒక్కొక్కరు స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిపోయారు మా ఉపాధ్యాయులు. స్ఫూర్తి కలిగించిన వారు ఎవరో ఒక్కరిగురించి చెప్పమంటే నేను చెప్పలేను. అందరూ మార్గదర్శకులే! మా ఇంట్లో “పెద్దవాళ్ళు చెప్పినట్లు వినాలి, ఎదురు చెప్పకూడదు” అని చిన్నప్పటి నుంచీ నేర్పేవారు. అందువల్ల అందరు నేర్పిందీ నేర్చుకున్నాను. ప్రత్యేకంగా ఒక లక్ష్యం అంటూ పెట్టుకోలేదు. ప్రభుత్వోద్యోగం రాకముందు ప్రైవేట్ స్కూల్లో సైన్స్ టీచర్‌గా చేశాను. నేను వేసిన సైన్స్ బొమ్మలు చూసి తోటి టీచర్లు, ప్రిన్స్‌పాల్ మేడమ్ అభినందించేవారు. మీటింగ్‌లు జరిగేటప్పుడు బోర్డ్ మీద “సుస్వాగతం” అని డిజైన్ లతో రాయటానికి నన్ను నియోగించేవారు. చిన్నప్పుడు నేర్చుకున్న డ్రాయింగ్ అలా ఉపయోగపడింది. ఇంగ్లీష్ గురించి చెప్పనక్కరలేదు. అదే ఇప్పుడు జీవన భృతి కలిగిస్తోంది. 26 సంవత్సరాల నుంచీ ఇంగ్లీష్ టీచర్‌గా ప్రభుత్వోద్యోగం చేస్తున్నాను. చిన్నప్పుడు తెలుగు మీద ఏర్పడిన అభిమానం వలన ఎన్నో అపురూపమైన గ్రంథాలు చదివే అవకాశం కలిగింది. రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాను. కాలేజ్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు టైప్, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను. ఇప్పుడు నా కథలు కంప్యుటర్‌లో టైపు చేసి పంపుతూ ఉంటాను (కంప్యుటర్‌లు రాకముందు స్కూల్లో పరీక్షపేపర్లు టైపు చేసేవాడిని. టైప్ రైటింగ్ మర్చిపోలేదు). కాబట్టి నేర్చుకున్న ఏ విద్య అయినా వ్యర్థం కాదు.

నా అభివృద్ధికి తోడ్పడిన నా ఉపాధ్యాయులు అందరూ నా మనసులో మెదులుతూ మార్గదర్శకత్వం చేస్తూనే ఉంటారు ఎప్పటికీ! ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here