మార్పు తెచ్చిన స్నేహం

0
13

[శ్రీమతి అనూరాధ మంగళ్ హిందీలో రచించిన ‘దోస్తీ’ అనే పిల్లల కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]వి[/dropcap]నాయక చవితి ఉత్సవాలు. ముంబయి నగరంలోని బీదప్రజలవాడలో ఎంతో సందడిగా ఉంది. వీలైనంత మేర మంచి దుస్తులు ధరించి మండపంలో వినాయకుడిని దర్శించుకోడానికి వెళ్తున్నారు అందరు. ‘గణపతి బప్పా మోరియా, అగలే బరస్ తూ జల్దీ ఆ’ అనే నినాదాలు చేస్తున్నారు.

మండపం వద్ద ఆటపాటలు కొనసాగుతున్నాయి. చందా ఈ రోజు తన పనికి సెలవు పెట్టింది. కొడుకు గోవింద్‌ని తీసుకుని గణేశ మండపానికి వెళ్ళింది. అక్కడంతా వేడుకగా ఉంది. చందా దగ్గరలోని కొన్ని ఇళ్ళల్లో పనిచేస్తుంది. ఆమె భర్త కోవిడ్ వల్ల చనిపోయాడు. ఇంటి భారం అంతా చందాపైనే పడింది. గోవింద్‌కి చిన్నతనంలో ఓ ప్రమాదంలో కాలుపోవడంతో, ఊతకర్రల సాయంతో నడుస్తాడు. బళ్ళో కొందరు పిల్లలు ‘కుంటోడా’ అని వెక్కిరిస్తూ ఏడిపించినా, అవేం పట్టించుకోకుండా చదువులో ముందుండేవాడు గోవింద్. బడికి సంబంధించిన ఏ పనినైనా గోవింద్ ఎంతో శ్రద్ధగా చేసేవాడు. అందుకని ఉపాధ్యాయులు గోవింద్‍ని అభిమానించేవారు.

ఓ రోజు కొందరు పిల్లలు మైదానంలో ఫుట్‍బాల్ ఆడుతున్నారు. వాళ్ళ ఆటని చూస్తున్న గోవింద్‌ని – “వచ్చాడురా కుంటోడు!  పాపం, ఆడలేడుగా, చూడ్డం తప్ప ఏమీ చేయలేడు” అని హేళన చేశారు కొందరు. గోవింద్ బాధపడ్డాడు. భగవంతుడిని తలచుకున్నాడు. ‘బహుశా దేవుడు నాకిదే రాసిపెట్టాడేమో’ అనుకున్నాడు. ఏడుపొచ్చింది, అక్కడ్నించి లేచి, మెల్లిగా ఇంటికి వెళ్ళిపోయాడు.

***

ఆ బడిలో అజయ్ అనే పిల్లాడు, గోవింద్ తరగతిలోనే కొత్తగా చేరాడు. వాళ్ళు ధనికులు. క్లాసులోని పిల్లలతో త్వరగా స్నేహం చేశాడు అజయ్. మర్నాడు పాఠం చెప్పడానికొచ్చిన మాస్టరు గారు ఈ కొత్త కుర్రాడిని చూశారు. “అబ్బాయి ఇలా రా”, అని పిలిచారు. అజయ్ లేచి వెళ్ళబోతుండగా, పక్క బెంచీ కుర్రాడు, ‘ఆయనకి సరిగా వినబడదు, గట్టిగా చెప్పు’ అని అజయ్ మాత్రమే వినబడేలా అన్నాడు. మాస్టారు గారి దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు అజయ్. ఆయన ప్రేమగా, “నీ పేరేంటి నాయనా?” అని అడిగారు. “నా పేరు అజయ్ సర్” అంటూ గట్టిగా అరిచి చెప్పాడు. ఆయనకు కోపం వచ్చింది. “ఎందుకంత గట్టిగా అరుస్తున్నావ్? నాకేమైనా చెవుడుందని అనుకుంటున్నావా?” అన్నారు. ఆ చిరాకులో అజయ్ వీపు మీద ఒక దెబ్బ వేశారు. పిల్లలంతా గొల్లున నవ్వారు. మాస్టారు గారికి సరిగా వినబడదని చెప్పిన కుర్రాడి కేసి కోపంగా చూశాడు అజయ్. క్లాసు అయిపోయాకా, ఇద్దరూ కొట్టుకున్నారు. విషయం ప్రిన్సిపాల్ దాకా వెళ్ళింది. ఆ కుర్రాడికి శిక్ష విధించారు. అజయ్ గొప్పవాళ్ళ కొడుకు. అతనికీ ధనమదం కాస్త ఉంది. “మళ్ళీ ఇలా చేశావంటే, ఏమవుతుందో చూడు” అంటూ ఆ కుర్రాడిని తీవ్రంగా బెదిరించాడు. రోజులు గడుస్తున్నాయి. అజయ్‍కి చదువు మీద కన్నా ఆటపాటల మీద దృష్టి ఎక్కువ.

***

Art by Mrs. Anuradha Mangal

స్కూల్లో స్పోర్ట్స్ డే జరుగుతోంది. రకరకాల ఆటలను నిర్వహించారు. గోవింద్ మైదానంలో ఓ మూల కూర్చుని వాటిని చూడసాగాడు. అజయ్ గోవింద్‍ని పలకరించకుండా, ఆటల్లో లీనమైపోయాడు. ఇంతలో కొందరు పిల్లలు అక్కడికొచ్చి, “రా గోవింద్, నువ్వు కూడా ఆడు” అని కావాలని అంటూ, గోల చేయసాగారు. “పాపం, కుంటోడురా” అని ఒకబ్బాయి అన్నాడు. ఈ ‘పాపం’ అనే పదం గోవింద్ మనస్సుని చివుక్కుమనిపించింది. దుఃఖం ముంచుకొచ్చింది. జరిగినదంతా గమనించిన అజయ్ అక్కడికొచ్చాడు. నిస్సహాయులని ఏడిపించకూడదని అతని అభిప్రాయం. ఇదే మాట ఆ కుర్రాళ్ళకు చెప్పి, వాళ్ళతో గొడవ పెట్టుకుని, “మీతో ఆడను వెళ్ళిపొండి” అని వాళ్ళను అక్కడ్నించి పంపించేశాడు. గోవింద్ పక్కనే కూర్చుని అతన్ని ఓదార్చాడు. “నాతో ఎప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తారు” చెప్పాడు గోవింద్. “నాతో స్నేహం చేస్తావా?” అడిగాడు అజయ్. గోవింద్ చిరునవ్వుతో తల ఊపాడు. అప్పట్నించి వాళ్ళిద్దరూ మంచి మిత్రులయిపోయారు. కలిసి తిరగడం, కలిసి చదువుకోడం చేయసాగారు.

***

తమకి చాలా డబ్బుందని అజయ్‍కి కాస్త గర్వం ఉన్నా, దీనులన్నా, దుఃఖితులన్నా కొంచెం సానుభూతి ఉంది. అజయ్ పొరుగున ఓ కుర్రాడున్నాడు. అతనికి చిన్నప్పుడే పోలియో వల్ల ఒక కాలు అవిటిదయ్యింది. కానీ కుర్రాడు చాలా మంచివాడు. ఆ అబ్బాయికీ, గోవింద్‍కీ కూడా స్నేహం ఉంది. దివ్యాంగులతో కఠినంగా మాట్లాడకూడదనీ, వాళ్ళ హృదయాలు సున్నితంగా ఉంటాయని అనుకుంటాడు అజయ్.

***

చందా పని చేసే ఓ ఇంట్లో యజమానురాలి బంగారు గొలుసు దొంగతనం జరిగింది. ఆ ఇంట్లో ఇంకా చాలామంది పనిమనుషులున్నా నెపం చందాపై మోపి, ఆమెను పని లోంచి తీసేశారు. ఈ విషయం గోవింద్, అజయ్‍కి చెప్పాడు. అయ్యో అన్నాడు అజయ్. మర్నాడు బడిలో ఫీజు కట్టాల్సి ఉంది. చందా డబ్బు సర్దలేకపోయింది, గోవింద్ ఫీజు కట్టలేకపోయాడు, మిత్రుడికి సాయం చేయలేక అజయ్ మౌనంగా ఉండిపోయాడు. కానీ, ఓ వారం తర్వాత ఎలాగోలా గోవింద్ ఫీజు కట్టేశాడని తెలిసి ‘హమ్మయ్య’ అనుకున్నాడు.

***

Art by Mrs. Anuradha Mangal

వార్షిక పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. గోవింద్ క్లాస్ ఫస్ట్ వచ్చాడు. చదువు మీద శ్రద్ధ పెట్టని అజయ్ ఫెయిల్ అయ్యాడు. ఇక చదువు వద్దనుకున్నాడు. సెలవల్లో రోడ్ల మీద తిరుగుతూ, సినిమాలు చూస్తూ, హోటల్‍లో తింటూ, అక్కర్లేని కబుర్లతో సమయం వృథా చేయసాగాడు. చదువుకోమని చెప్పేవారు కానీ, మందలించే వారు కానీ ఇంట్లో ఎవరూ లేరు. తండ్రికి ఫ్యాక్టరీ వ్యవహారాలతో తీరిక లేదు, తల్లికి క్లబ్బులు, పార్టీలతో సమయం ఉండదు! పిల్లాడు పక్కదారి పట్టేందుకు అనువైన వాతావరణం!

స్కూలు తెరిచారు. తోటివారంతా కొత్త క్లాసుకి వెళ్తే, అజయ్ మాత్రం పాత క్లాసులోనే కూర్చున్నాడు. తన బ్యాచ్ వాళ్ళంతా కొత్త పుస్తకాలతో ఉత్సాహాంగా, సంతోషంగా కనబడ్డారు. ఏదో తెలియని నిస్పృహ ఆవరించింది అజయ్‍ని. ఇంటర్వెల్ సమయంలో గోవింద్ వచ్చి అజయ్‍ని కలిసాడు. “అజయ్, నువ్వు శ్రద్ధగా చదవలేదు కాబట్టే ఫెయిలయ్యావు. ఈసారి బాగా చదివి నువ్వే క్లాస్ ఫస్ట్ రావాలి. బాగా చదువుకుంటే మంచి మనిషివి అవుతావు. బాగా చదువుకుని పైకొచ్చి మీ నాన్నగారికి ఫ్యాక్టరీ పనుల్లో తోడుగా ఉండు. వేలాది మందికి పని ఇవ్వు. నాన్నగారి పేరు నిలబెట్టు” అన్నాడు. దాదాపుగా రోజూ ఇంటర్వెల్ సమయంలో వచ్చి అజయ్‍కి ఇలాంటి మాటలతో ప్రేరణనిచ్చాడు గోవింద్. అజయ్‍లో ఆలోచన మొదలయింది.

***

ఓ రోజు గోవింద్ బడికి వెళ్ళబోతుండగా, ఇంటర్వెల్‍లో తినమని ఓ ప్లాస్టిక్ కవర్‍లో కొద్దిగా పచ్చడి, మరమరాలు ఇచ్చి పంపింది చందా. ఆ రోజు మధ్యాహ్నం అమ్మ తన స్కూల్లోనే ఆయాగా పనిలో చేరడం చూసి సంతోషించాడు గోవింద్. క్లాసులో ఫస్ట్ వచ్చినందుకు గోవింద్‍కి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఉచితంగా లభించాయి. బాగా చదువుకునే బీద విద్యార్థుల కోసం కొందరు దాతలు ఆ ఏర్పాట్లు చేశారు.

***

ఓ రోజు గోవింద్ బడికి వెళ్తున్నాడు. రోడ్డు మీద ఉన్న గుంతలో కాలు పడింది, నిలదొక్కుకోలేక పడిపోయాడు. అదుపు తప్పి వేగంగా వెనుక నుంచి వస్తున్న లారీ గోవింద్‍ని ఢీ కొట్టింది. గోవింద్ ప్రాణాలు పోయాయి. ప్రిన్సిపాల్, టీచర్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొడుకు మరణాన్ని చందా తట్టుకోలేకపోయింది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. మూగగా మారిపోయింది. శూన్యమైన చూపులతో అటూ ఇటూ చూసేది. ఓ రకంగా పిచ్చిదానిలా మారిపోయింది. మంచి మిత్రుడిని కోల్పోయిన అజయ్ బాధ తీరేది కాదు. దాంతో బడికి వెళ్ళడం మానేశాడు.

కొన్ని రోజుల తర్వాత గోవింద్ క్లాసులోని ఇద్దరు ముగ్గురు పిల్లలు అజయ్ ఇంటికి వచ్చి, బడికి రమ్మని, బాగా చదువుకోమని నచ్చజెప్పారు. అది గోవింద్ కోరిక అని గుర్తు చేశారు. “గోవింద్ నీకు ఆప్త మిత్రుడు. అతని కోసమైనా నువ్వు బాగా చదువుకోవాలి. క్లాసులో పస్ట్ వచ్చి గోవింద్ పేరు నిలబెట్టాలి. జీవితంలో ఎదగాలి. మంచి మిత్రుడు అత్తరు వంటి వాడు, మూత ఎప్పుడు తెరిచినా పరిమళాలు వ్యాపింప చేస్తాడు” అంటూ ప్రోత్సహించారు. ఆ మాటలు అజయ్ పై ప్రభావం చూపాయి. అతనిలో మార్పు మొదలయింది.

***

ఆ ఏడాది వార్షిక పరీక్షలలో అజయ్ క్లాస్ ఫస్ట్ వచ్చాడు. బడిలో ఉన్న గోవింద్ ఫోటో ముందు నిలబడి అంజలి ఘటించి, తన మార్క్స్ షీట్‍ని ఆ ఫోటో ముందు ఉంచాడు.

హిందీ మూలం: అనూరాధ మంగళ్

అనువాదం: కొల్లూరి సోమ శంకర్


నా పేరు అనురాధ మంగళ్. నా వయసు 80 సంవత్సరాలు. నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం. డ్రాయింగ్ టీచర్‌గా పిల్లలకి బొమ్మలు గీయడం నేర్పించాను. ఈమధ్య కాలంలో పిల్లల కోసం, పెద్దల కోసం కొన్ని కథలు వ్రాశాను. నా రచనలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here