మాసిన గడ్డం

0
12

[dropcap]ఇం[/dropcap]టికి బయలుదేరడానికి స్కూటర్ తియ్యబోతుంటే చరవాణి మ్రోగింది. ఎత్తాను. “ఎక్కడున్నావు? సభకు రావటం లేదా?” అటునుంచి వనమాలి. అప్పుడు గుర్తుకొచ్చింది నగరంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శన ఉత్సవంలో జరుగనున్న ఓ సభలో వనమాలి ప్రత్యేక అతిథిగా పిలువబడ్డాడని; నన్ను తప్పకుండా రమ్మని వనమాలి చెప్పిన విషయం. నాలిక కరచుకోకుండానే బండిని సభవైపుకు పోనిచ్చాను. ‘వనమాలి’ అనే కలం పేరు కలిగిన ‘రాంబాబు’ నా మిత్రుడు. రచయిత, సాహిత్య సభలలోనే కాకుండా ఇంకా అనేక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంటాడు. ‘వ్యక్తిత్వవికాసం’ మీద అనేక పుస్తకాలు వ్రాసాడు. ‘మన కోసం’ అనే సంస్థను స్థాపించి సాయంత్రం పూట ఆ సంస్థకు వచ్చిన వాళ్ళకు ఉచితంగా వారి వారి మానసిక, సామాజిక సమస్యలకు సలహాలిస్తుంటాడు. అతడి మొదటి పాఠకుడిని, శ్రోతని నేనే.

పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి చేరుకొన్నాను. సభాధ్యక్షులు తొలిపలుకులు పలుకుతున్నారు. సగం కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. మిత్రుడికి చేయి ఊపి కూలబడ్డాను. కళ్ళతోనే పలుకరించాడు వనమాలి వేదిక పై నుంచి. ‘నీకు నువ్వే దిక్కు’ పేరు గల పుస్తకం ఆవిష్కరణ సభ అది. ఆ పుస్తకం కూడా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినదే కావడంతో అటువంటివి అనేకం వ్రాసిన ఆ వనమాలిని ఆహ్వానించాడా రచయిత. పుస్తక ఆవిష్కరణ, పరిచయం, ముఖ్య అతిథి ప్రసంగాల తరువాతే వనమాలి వంతు వచ్చింది. వనమాలి బాగానే మాట్లాడతాడు. ఎవ్వరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఏ కష్టం వచ్చినా నిన్ను నువ్వే సమాయత్తం చేసుకోవాలన్నాడు. ముఖ్యంగా ఆత్మహత్యలు, ఆత్మన్యూనత, భయం, పిరికితనం వంటి అంశాల మీద వ్రాయబడిన పుస్తకం కావడంతో వనమాలి ప్రసంగమూ అదే తరహాలో సాగింది.

భయం గురించి చెబుతూ “మీలో ఓ అమ్మాయి మీద బొద్దింక పడితే ఆమె కెవ్వున అరచి బొద్దింకను తోసేస్తుంది. ఆ బొద్దింక మరొక అమ్మాయి మీద పడితే ఆ అమ్మాయి మరింత కంగారుపడి త్రాగుతున్న టీ కప్పును కూడా పారవేసి అందరి మీద టీని కూడా పోసేస్తుంది. కుర్చీని కూడా క్రిందకు పడేస్తుంది. అదే బొద్దింక అక్కడున్న అబ్బాయిమీద పడితే కేవలం దులిపేసుకొంటాడు ఏ మాత్రం కంగారు పడకుండా. ఇక్కడ ముగ్గురి మీదా పడిన బొద్దింక ఒకటే. అదేమి అంత ప్రమాదకారి కీటకం కాదు. అది ముగ్గురికీ తెలుసు. కాని ముగ్గురూ ఒకేలా స్పందించలేదు. అసలు సమస్యకన్నా సమస్యను ఎదురుకొనే పద్ధతిలోనే విజయరహస్యం దాగుంది. ఏ తేలో, త్రాచుపామో మీద పడితే చూపించే ప్రతిచర్య బొద్దింక పడినప్పుడు చూపించనక్కరలేదు” అంటూ తను స్థాపించిన ‘మనకోసం’ సంస్థ ద్వారా ఏ విధంగా డీలా పడిపోయిన వారిలో చైతన్యాన్ని రగిలిస్తున్నాడో చెప్పాడు. చప్పట్లు కొట్టారందరు. నేను కూడా కొట్టాను; నా ముందు సీట్లో కూర్చొన్న ‘మాసిన గడ్డం’ మాత్రం చప్పట్లు కొట్టలేదు. నిర్లిప్తంగా కూర్చొన్నాడు, ‘ఏదో ఆలోచిస్తున్నట్లు’. సభ పూర్తయ్యింది. ఇద్దరం బయటపడ్డాం.

వనమాలిది వ్యాపారం. ఓ ఉన్నత పాఠశాలలో వాటా ఉన్నది. ఆ కార్యాలయ వ్యవహారాలు చూస్తుంటాడు. అప్పుడప్పుడు ‘వ్యక్తిత్వ వికాసం’ మీద పాఠాలు చెబుతుంటాడు. ఓ అయిదారు దిన, వార పత్రికలలో ధారావాహికలు వ్రాస్తుంటాడు. పుస్తకాలు వ్రాసి స్వంతంగానే ముద్రించుకొని విడుదల చేస్తుంటాడు. అనేక సామాజిక సేవా సంస్థలలో సభ్యుడిగా వివిధ పదవులలోను కొనసాగుతూ ఉంటాడు. పాఠశాల అయిపోయాక ఒక గదిలో సలహా కేంద్రాన్ని నడుపుతుంటాడు. మొత్తానికి చాలా చురుకైన వ్యక్తే. నాది ఉద్యోగం. బాగా చదువుతాను. తీరిక దొరికినప్పుడల్లా వనమాలితో కలిసి సలహా కేంద్రంలో కూర్చొంటాను. తన పుస్తకాల మీద, ఆలోచనల మీద నా అభిప్రాయాలను చెబుతుంటాను. “నువ్వు వ్రాయొచ్చుకదరా బాగా వివరించగలవు కదా..” అని వాడనడం నేను నవ్వేయడం మాములే. “నేను నీ ద్వారా వ్రాస్తున్నానులే” అంటాను వాడు రెట్టిస్తే. సలహా కేంద్రం ఏర్పాటు చేసిన ఉద్దేశం మంచిదే కానీ ఎవరూ పెద్దగా రారు. రోజుకి ఒకరొస్తే గొప్పే. సాధారణంగా మేం ఇద్దరం కబుర్లు చెప్పుకోవటానికి అభిప్రాయాలు పంచుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది.

***

ఆ మరునాడు సాయంత్రం వాడి సలహాకేంద్రానికి వెళ్ళాను. వెళ్ళేసరికి వాడు ఆ రోజు దినపత్రికలోంచి కొన్ని కొన్ని భాగాలను కత్తిరిస్తున్నాడు. అవన్నీ సాధారణంగా పెళ్ళాం తిట్టిందని, మొగుడు కొట్టాడని, పరీక్ష తప్పాడని, ప్రేమించలేదని ఇలా రకరకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకొన్న వార్తలు ఇంకా గృహహింస, వరకట్నం, వివాహేతర సంబంధాలకు చెందిన వార్తలు అయ్యుంటాయి.

“చూడు ‘మరొక రైతు ఆత్మహత్య’, ఇదిగో ‘పరీక్షపోయిందని భవనం మించి దూకిన ఇంటర్ విద్యార్థిని’, నా ఆత్మహత్యల ఫైలు బరువెక్కిపోతోంది” అన్నాడు. చూశాను. దినపత్రికలు చూస్తే అవేగా వార్తలు. మరొకచోట ‘పెరుగుతున్న పులుల జనాభా’ అని ఉన్నది. చదివితే “ప్రభుత్వం తీసుకొంటున్న జాగ్రత్తలు, సముచిత చర్యల మూలంగా దేశంలో ఒకప్పుడు ‘అంతరించే పోయే’ స్థాయినుంచి పైకొచ్చి పులులు స్వేచ్ఛగా గాండ్రిస్తున్నాయని” తెలుస్తోంది.

“నిజమే.. అంతరించిపోతున్న జాతీయ జంతువుల జనాభాను పెంచగలిగారు. కాని జాతిని బ్రతికించే రైతుల సంఖ్య పడిపోతున్నా పట్టించుకోటం లేదు. ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నవాళ్ళు శవాలుగానో లేదా జీవశ్చవాలుగానో తయారవుతున్నారు. కొత్తగా వ్యవసాయరంగంలోకి అడుగుపెట్టడానికి యువత ముందుకురావటం లేదు. అసలు యువరైతులకు పెళ్ళిళ్ళు కూడా కావటం లేదు. రైతన్నలకు ‘వదినలు’ దొరకటం లేదు” అన్నాను.

“బాగా చెప్పావు.. ఏదో ఒక సభలో చెబుతాను ఇలా” అన్నాడు వనమాలి. నా అభిప్రాయాలను, భాషను కూడా యథాయథంగా వాడుకొంటాడు. అందుకే అంటాను నేను “నేను నీ ద్వారా వ్రాస్తున్నాను లేరా” అని. ఆ రైతు ఆత్మహత్య వార్త చదివి వినిపించి “పాపం! ఈయనివి సినిమా కష్టాలుగా ఉన్నాయిరా” అన్నాడు. సకాలంలో వానలు పడక, అకాలంలో విపరీతంగా కురిసి, వరదలకు గురై వరుసగా నాలుగేళ్ళు పంట చేతికి రాక, చేతిలో డబ్బులు లేక, పాత అప్పులు తీరక క్రొత్త అప్పులు పుట్టక పురుగుల మందు త్రాగాడా రైతు.

“ఎంతయినా ప్రాణం తీసుకోకూడదురా” అన్నాడు వనమాలి.

“ఏం చెయ్యాలి మరి? పులుల సంరక్షణకు తీసుకొన్న చర్యలు, చిత్తశుద్ది ఇక్కడ లేదు మరి” అన్నాను.

“నిజం.. అయితే ప్రభుత్వమొక్కటే ఎన్ని చేస్తుంది? అతనూ ఆలోచించాలి కదా! భార్య ఇద్దరు పిల్లలు. అమ్మాయి పెళ్ళి, అబ్బాయి చదువు ఆగిపోతాయి కదా! ఏదో ఒక ప్రయత్నం చేయాలి.”

“ఆగిపోతాయని కాదు.. ఆత్మహత్య చేసుకొన్నది. ఆగిపోయాననే. కట్నాలు, కాలేజీ ఫీజులు, పెళ్ళి ఖర్చులు కాదు, దినవారి ఖర్చులకే డబ్బులు చాలక ఆత్మహత్య చేసుకొన్నాడు” అన్నాను.

“ఎన్నైనా చెప్పు. ఆ రైతుది ప్రతికూల ధోరణే. వేరే రంగానికో వేరే చోటకో మారిపోవాల్సింది” అన్నాడు వనమాలి.

“అదంత సులువుకాదు. తెలిసున్న ఊళ్ళో పది రూపాలడిగితే రూపాయైనా దొరుకుతుంది. కొత్తచోట ఎవరిస్తారు? ఇంకా నయం. ఆ పురుగుల మందును ఆహారంలో కలిపి మొత్తం కుటుంబానికి పెట్టలేదు. తనని మాత్రమే చంపుకొన్నాడు. ఎక్కడ డబ్బు దొరకక, కుటుంబాన్ని సాకలేక, వాళ్ళని అనాథలుగా వదిలివేసి వెళ్ళేముందు ఎంత బాధపడి ఉంటాడో ఆ రైతు” అన్నాను.

“నిజమే! కష్టమే. నువ్వు ఆ రైతు కష్టాల్ని స్వయంగా చూసినట్లు చెప్పావు. రేపటి ప్రసంగంలో ఆ రైతు వ్యథనంతా వర్ణించి అప్పుడు ఎలా పైకి రావాలో చెబుతాను” అన్నాడు వనమాలి. నాకు నవ్వొచ్చింది. ఒక్కొక్క ఆత్మహత్య వాడికో కొత్త ప్రసంగానికో, వ్యాసానికో వస్తువుగా మారుతోంది. మనిషి ప్రాణం వాడి కథావస్తువవుతోందనిపించింది. ఉండబట్టలేక పైకి అనేసాను.

“ప్రార్థించే పెదవులే కాదు, పలికే పలుకులు కన్నా, సానుకూల ధోరణి మీద వ్రాసే పుస్తకాల కన్నా వాళ్ళ చేతుల్లో పెట్టే రూపాయిలే మిన్న” అన్నాను. వాడు నొచ్చుకొన్నాడు

నేను “సారీరా! ఏదో ఆవేశంలో అనేసాను..” అన్నాను.

“పర్లేదురా! నిజం చెప్పావు. కేవలం ప్రసంగాలు కూడు పెడతాయా?” అన్నాడు. ఈ సారి నొచ్చుకోవటం నా వంతయ్యింది.

“లేదు.. లేదు.. మాటలు మనిషిలో ఉత్తేజాన్ని కలిగిస్తాయి. బహుఃశ ఆ అభాగ్యులకు ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోయిండొచ్చు..” అన్నాను. మరికొంచెం సేపు గడిపి “మళ్ళీ రేపు కలుస్తానురా.. కొంచెం పని ఉంది..” అని లేచి బయటకు వచ్చేయబోయాను. “ఓ.కే.. నేనూ దుకాణం కట్టేస్తాను. నిన్న మొన్నా ఒకరిద్దరు వచ్చారు. ఇవ్వాళ ఎవరూ లేరు. ఉచిత సేవ ఎవ్వరికీ అక్కర్లేదు. నిజంగా మనం ఇద్దరం కలిసి సమస్యను చక్కగా సమీక్షించి సలహా ఇవ్వడానికి గంటలు గంటలు ఆలోచిస్తాం. వివరిస్తాం. ఆ మాత్రం దానికి గంటకి వెయ్యి రూపాయలు దాకా తీసుకొనే సలహాదార్లు ఉన్నారు. జనాలు కూడా వాళ్ళ దగ్గరికే వెడతారు. మనది ఉచిత సలహా కదా..” అని బాధపడ్డాడు. “జనం అలాగే ఉన్నారురా” అనేసి వచ్చేస్తుంటే బయట ఎవరో తచ్చాడటం కనబడింది. “ఎవరో వస్తున్నారురా.. కట్టేయ్యకు” అని వాడికి చెప్పి బయటకు వచ్చాను. ఓ మాసిన గడ్డం.. ఎక్కడో చూసినట్లనిపించింది. “బాగా చెప్పారండి! మీ మాటలన్ని విన్నాను. మిమ్మల్ని కలవడం ఎలా” అన్నాడు. నా విజిటింగ్ కార్డు ఇచ్చి “మావాడు ఇంకా బాగా చెబుతాడు వెళ్ళండి” అని ఆయనని లోనికి పంపాను. మొన్నటి సభలో ఆ మాసిన గడ్డాన్ని చూసిన విషయం గుర్తొచ్చింది.

***

ఓ రెండు రోజుల తరువాత మళ్ళీ వెళ్ళాను. “చూశావురా ఈ వార్త” అన్నాడు. దినపత్రికలు ముందు పడేస్తూ.. కత్తిరించటానికి ఉపక్రమిస్తూ..

“నటుడు శ్రీనాథ్ ఆత్మహత్య గురించే కదా” అన్నాను. అవునన్నాడు.. కవి, నటుడూ అయిన శ్రీనాథ్ ఆత్మహత్య చేసుకొన్న వార్త ఉదయం నుంచి మారుమ్రోగుతోంది.

“అలాంటి వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎలా? యువతకు మార్గదర్శకులుగా ఉండవలసిన వాళ్ళు!!! నటుడు, దర్శకుడు పైగా కవి అయ్యిండి తిరోగమన ధోరణిని ప్రదర్శిస్తే ఎలా? ఆత్మహత్యని ఏ మతమూ సమ్మతించదు? పాపం! అని తెలియదా? కష్టాలుంటాయి.. మనిషన్నాకా జీవితం అన్నాక కష్టాలు వస్తూనే ఉంటాయి.. ప్చ్.. “ అన్నాడు వనమాలి.

“నువ్వు చెప్పేవన్ని ఆయనకు తెలియదనుకొంటున్నావా? చాలామందికి ఆయన నటుడిగానే తెలుసు. నాకు కవిగా కూడా తెలుసు.. ఆయన పాల్గొన్న సభలకి నేను వెళ్ళాను. చాలా మంచి కవి” అన్నాను.

“నేను చెప్పేదీ అదే! అన్ని తెలుసున్న వాళ్ళు కూడా ఇటువంటి పనులు చేస్తుంటే ఎటువంటి సందేశం వెడుతుంది. సమస్యలకి పరిష్కారం ఆత్మహత్యలేనా? ముఖ్యంగా కళాకారులు సమాజాన్ని ప్రభావితం చెయ్యగలరు.. అటువంటి వారు కూడా ఆత్మహత్యలంటే ఎలా? ఈ మధ్య కళారంగంలోనూ ఆత్మహత్యలెక్కువైపోయాయి” అన్నాడు.

“పత్రికలలో వ్రాసిన దాన్ని బట్టి చూస్తే ఆయన భార్యను కోల్పోయాడు. మగపిల్లలు లేరు. ముగ్గురు ఆడపిల్లలు. వంటమనిషిని పెట్టుకొని తను ఒక్కడు కాలం గడుపుతున్నాడట. భార్యపోయినప్పటినుంచి తీవ్రమయిన మనస్తాపానికి గురి అయ్యాడట. ఏదో సహాయ నటుడిగా ఉండేవాడు కాబట్టి నేటి కథానాయకుల మాదిరిగా కోట్లకు కోట్లు సంపాదించి ఉండపోవచ్చు. ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. లేకపోయినా ఇంక ‘దేనికోసం’ బ్రతకాలి అనేది ఆయనకు సమాధానం దొరకని ప్రశ్న. కాలు చేయి ఆడుతున్నప్పుడు కాలం గడుస్తుంది. మూలబడితే ఎవరు చూస్తారు. ఆడపిల్లల ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. మంచంపట్టి ఎవరు చూడక దిక్కులేని చావు చావడం ఇష్టం లేక ఎవరికి ఇబ్బంది కలిగించకుండానే వెళ్ళిపోదాం అనుకొని ఉండొచ్చు కదా!” వివరించాను.

“ఆత్మహత్యను సమర్థిస్తున్నావా?” అన్నాడు వనమాలి.

“పరిస్థితిని వివరిస్తున్నాను.. అంతే!” అన్నాను.

“నేను చెప్పేదీ అదే. ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు లేవని చెప్పటం లేదు. ఆత్మహత్య చేసుకొనే పరిస్థితులు ఎదురైనప్పుడే లొంగిపోక ధైర్యంగా నిలబడాలనేదే నేను చెప్పేది.”

“నేనూ ఆత్మహత్యని సమర్థించటం లేదు. ఈ దేశంలో రైతుగా బ్రతకడం కన్నా కష్టమైన పని మరొకటి లేదంటూ భార్య, నలుగురు పిల్లలతో కలిసి ముప్పై ఏళ్ళ క్రితం మహారాష్ట్రలో మొదటిసారిగా ఓ రైతు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం వేలాదిగా రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు.

పరీక్షపోయిందని, అమ్మాయి తిరస్కరించిందని ఆత్మహత్యలు చేసుకొనే కుర్రకారు ఆత్మహత్యలు వేరు. అది కేవలం అపరిపక్వత. అలాంటి వారికి నీ సలహాలు పనిచేస్తాయి. అన్ని దారులూ మూసుకుపోతేనే బరువు బాధ్యతలు మ్రోసిన తెలిసిన రైతు ఏ దారి లేక గోదారిన పడుతున్నాడు. వ్యక్తిగత స్థాయిలో రైతు సమస్యని పరిష్కరించలేం. ప్రభుత్వాలే పూనుకోవాలి. శ్రీనాథ్ వంటి నటులు భవిష్యత్తులో ఏదో అవుతుందేమోనని కొంత, భార్యా వియోగంతో కొంత మనస్తాపం చెంది జీవితం చాలించటం పట్ల నేను కేవలం సానుభూతిని మాత్రమే చూపించగలను. ఇంతకన్నా, దైన్యదశలోకి వెళ్ళకూడదనుకొన్నారేమో!

ఈ మధ్య టిక్ టాక్ వీడియోలలో చిత్రీకరించుకుంటూ ఆత్మహత్య చేసిన చేసుకొన్న వాళ్ళని మాత్రం వీలయితే బ్రతికించి కఠినంగా శిక్షించాల్సిందే. ఆత్మహత్య పాపం కాదని నేనను. కానీ, ఆత్మహత్యలన్ని ఒకటి కాదు. నిజానికి రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేస్తున్న హత్యలే. ఒకరిద్దరు పోయారంటే అది వారి అసమర్థత కావచ్చుకానీ దశాబ్దాలుగా లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు అంటే అవి సమాజం చేస్తున్న హత్యలే” అన్నాను ఆవేశంగా.

“కూల్.. కూల్.. నిజమే..” అన్నాడు వనమాలి.

“పైగా ఆత్మహత్యని నేరంగా పరిగణిస్తారట. సిగ్గు లేకపోతే సరి. ఎవరయినా ఆత్మహత్య చేసుకొన్నారంటే ఎంతో కొంత వారి కుటుంబానిది, సమాజానిది కూడా బాధ్యత ఉంటుంది. అదొక నిస్సహయకస్థితి. అపరిపక్వత అయినా పరిపక్వత చెందకపోవడానికి కారణాలు విశ్లేషించి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత సమాజానికి ప్రభుత్వానికి కూడా ఉన్నది” కొనసాగించాను.. మరి కొంత సేపు కూర్చొని వచ్చేసాను.

***

రెండు రోజుల తరువాత ఫోన్ చేశాడు వనమాలి.

“సాయంత్రం వస్తావా? కొంచెం పనుంది”

“ఏమిటో విశేషం”

“ఓ కేసు వచ్చింది. మొన్న ఓ ఆవిడ వచ్చి కల్సింది. దూరపు చుట్టం కూడాను. భర్త ఏమి పనిచెయ్యడట.. గుండెపోటు వచ్చిందట. ఆపరేషన్ చెయ్యవలసి వస్తుందన్నారట డాక్టర్లు.. ఇతను ఏమో చేయించుకోనంటున్నాడు. నిన్న కొంచెం సేపు మాట్లాడాను.. మరల ఇవాళ వస్తారు.. నువ్వు కూడా వస్తే బాగుంటుంది..”

“ఆపరేషన్ వద్దంటాడా? అంటే వేరే వైద్యం ఏమైనా చేయించుకొంటాడా? లేదా డబ్బులు లేకా? భీమా లాంటి సదుపాయాలు ఏవి లేవా?”

“ఆ కారణాలే కాదు.. చెప్పాలంటే తలతిక్క బాగా ఉంది.. కాని ఆ అమ్మాయి మొహం చూసి ఊరుకొంటున్నాను. వీలయితే ఓ సారి రా”

“ఓ.. అలాగే తప్పకుండా వస్తాను.”

***

సాయంత్రం వెళ్ళి కలిసాను.

రమ వనమాలికి మేనకోడలు వరుస. నడివయసు.. పాతికేళ్ళ క్రితం ఒకతనిని ప్రేమించి పెళ్ళి చేసుకొంది. కులాంతరం అని పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. ఆ అబ్బాయికి ఆస్తులున్నమాట నిజమే కానీ కష్టపడే స్వభావం కాదు.. ఏదో ఒక ఉద్యోగంలో చేర్చినా ఎవడో ఏదో అన్నాడని ఆత్మాభిమానం చంపుకొని ఒకరి క్రింద పని చెయ్యనని వదిలేసి వస్తూ ఉంటాడు. చదువు కూడా అంతంతమాత్రం.. డిగ్రీ పూర్తి చెయ్యలేకపోయాడు. అదే కాలేజీలో చదువుతున్న రమని ప్రేమించాడు. ఇద్దరూ ఇష్టపడ్డారు.. ఉద్యోగం వచ్చేక పెళ్ళి చేసుకొందామనేది. ఆమె చదువు పూర్తిచేసి మంచి ఉద్యోగంలో చేరింది. అతడు మాత్రం డిగ్రీ దాటలేకపోయాడు కాని ప్రేమను హద్దులు దాటించాడు. దాంతో అతను కూడా స్థిరపడకుండానే వివాహం చేసుకోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దొంగచాటుగా పెళ్ళి చేసుకొన్నారు. రమకి బంధువర్గం తక్కువే. తండ్రి లేడు. మేనమామ పంచన పెరిగింది. అతడికీ తండ్రి లేడు. తల్లి, అన్నగారూ ఉన్నారు. స్వంత ఇల్లు, బంగారం బ్యాంకు బేలన్స్ తాతలనాటి వ్యాపారం ఉన్నాయి. అన్నగారు ఎప్పుడో దుబాయి వెళ్ళిపోయాడు. అతడి భార్యకి, ఇతడి తల్లికి సత్సంబంధాలు లేవు. ఎప్పుడో గాని ఇండియా రాడు. పెద్ద కొడుకు దూరంగా వెళ్ళిపోవడంతో చిన్న కొడుకు మీద మొదటి నుంచి అభిమానమే.. ఆమె గారాబం అతడిని బద్ధకస్తుడిని చేసింది. “నా కొడుకు రాజా.. కాలిమీద కాలేసుకు బ్రతుకుతాడు. ఉద్యోగం చెయ్యడు..” అనేది.

“కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయే.. ఆలోచించుకో” అని మేనమామ హెచ్చరిస్తున్నా అతడి మోజులో పెళ్ళి చేసుకొంది రమ. మొదట్లో బాగానే ఉండేది. ఆమె ఉద్యోగం చేస్తూ సంపాదించే జీతంతో, వాళ్ళకి వచ్చే వడ్డీలతో ఓ సంవత్సరం బాగానే గడిచింది. ఆమె ఉద్యోగం చెయ్యటం అత్తగారికి ఇష్టం ఉండేది కాదు. ఇరుగు పొరుగు కూడా పెళ్ళాం జీతంతో బ్రతుకుతున్నాడంటూ మాటలు వదులుతూ ఉండటంతో రోషం తెచ్చుకొని ఉద్యోగం తెచ్చుకోవటం మానివేసి పెళ్ళాం చేత ఉద్యోగాన్ని మానిపించేసాడు. ఆత్మన్యూనతభావం ముదిరిపోవటంతో, ఎవరూ సంపాదించకుండానే ఇల్లు గడవసాగింది.. తాతలనాటి వ్యాపారం జోలికిపోడు.. ఆరు గదుల ఇంట్లో రెండు గదులు అద్దెకిచ్చారు.. మరికొంత కాలానికి మరో రెండు గదులు అద్దెకిచ్చారు. బంగారం నగలు, విలువైన వస్తువులు ఒక్కొక్కటి మార్వాడి దుకాణాలకి వెళ్ళసాగాయి. ఇప్పుడు ఇద్దరూ ఏభైలలో పడ్డారు. తినడం, టి.వీ చూడటం మాత్రమే చేస్తూ ఉండటంతో చక్కెర వ్యాధి ప్రవేశించింది. ఎప్పుడైనా ఎవరైనా ఏమి చేస్తున్నారు అంటే అలా అడిగినందుకు కోపం తెచ్చుకొనేవాడు. దానితో అసలే తక్కువగా ఉన్న బంధుమిత్రులు పలకరించడం కూడా మానేసారు. కొడుకునెప్పుడు వెనకేసుకొచ్చే తల్లీ రోగగ్రస్థురాలయింది. ఇల్లు గడవటం కష్టమయింది. అతడిలో గుండెజబ్బు కూడా ప్రవేశించింది. చేబదుళ్ళు ఎక్కువయ్యాయి. అప్పు కూడా దొరకని పరిస్థితి. రమ మొహం చూసి మేనమామ పది పరకా సర్దుతూ ఉండేవాడు కాని ఎల్లకాలం ఎవరూ సాయం చేయలేరుగా… వైద్యులేమో అతనికి శస్త్ర చికిత్స అవసరం ఉందని తేల్చేసారు. నిజానికి దిగువ తరగతులకు ప్రభుత్వం అనేక రాయితీలను ఇస్తోంది. వాటికోసం ప్రయత్నం చేస్తే వీరికీ వస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా పెద్ద పెద్ద ఆసుపత్రులలో సైతం శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయించుకోవచ్చు. వాటికోసం వాళ్ళు ప్రయత్నించరు. అహం అడ్డొస్తోంది. ‘వాటికోసం కార్యాలయాల చుట్టూ తిరగాలి. లంచాలు ఇవ్వాలి. ఎవడు తిరుగుతాడ’నేవాడు. “పోనీ ఏదైనా ఉద్యోగం చూపిస్తాను.. ఉద్యోగం చేస్తుంటే క్రొత్తగా అప్పు పుట్టే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తూ నెమ్మదిగా తీర్చేసుకోవచ్చు” అని మేనమామ చెబితే ఉద్యోగం చేయటానికి గతంలో ఉన్న బద్దకానికి ఇప్పుడు రోగం కలిసింది. అయినా ఎంతోమంది రోగగ్రస్థులు ఉద్యోగాలు చేయటం లేదు. ఉద్యోగం చెయ్యడట. రాయితీల కోసం ప్రయత్నించడట. ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉంటాడట. ఎవరైనా ఆపరేషన్ చేయిస్తే చేయించుకొంటాడట. లేదంటే ఆత్మహత్య చేసుకొంటాడట. మహారాజులాగే బ్రతికాడట. అలాగే వెళ్ళిపోతాడట..” ఇదీ అతని తంతు.. మన సలహా కేంద్రం సేవల గురించి ఆ నోట ఈ నోట విని ఏమైనా సలహా చెబుతారేమోనంటూ రమ వచ్చింది మొగుడిని తీసుకొని. మాటలలో బంధుత్వం బయటకు వచ్చింది. కాసేపట్లో ఇద్దరూ వస్తారు…” అని చెప్పాడు.

కాసేపట్లో ఇద్దరు వచ్చారు. వనమాలి ఎప్పటివలె చెప్పే అనునయ వాక్యాలు, ధైర్యం, సూచనలు ఫలితాన్ని ఇవ్వటం లేదు. నాకేసి చూశాడు వనమాలి. నేను కలుగ చేసుకొన్నాను.. “అయితే ఎవరయినా వారంతట వారే మీకు చికిత్స చేయించాలి తప్ప మీరు చేయి చాచరు.. రుణగ్రస్తులుగా మారరు.. ఉద్యోగం చెయ్యరు.. కుదరకపోతే చచ్చిపోతారు అంతే కదా” అన్నాను..

“అంతే! నాది రాజ రక్తం.” అన్నాడు

“అయితే చచ్చిపోండి” అన్నాను. ఆశ్చర్యంగా అదోలా చూశారు. “మీరు సరిగానే విన్నారు. మీకు చికిత్స చేయించి పోషించగల వనరులు మా దగ్గర లేవు. నేను కావాలంటే విషమో, పురుగుల మందో ఉచితంగా ఇవ్వగలను. త్రాగేయ్యండి. అందరి సమస్యలు తీరిపోతాయి.” అన్నాను.. “ఇదేంటన్నయ్యా.. ఈయన ఇలా మాట్లాడతారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని సలహాలిస్తారంటే వచ్చాను” అంటూ వనమాలి కేసి చూసింది. వనమాలి ఆమెకు కనబడకుండా నవ్వుతూ నా వంక చూశాడు.

“మీరు రాజాలాగే వెళ్ళిపొండి. మంచం మీద పడి అన్నీ మంచంమీదే కానిస్తూ చూసే చేసే దిక్కులేక యాచన పడే రోజులు త్వరలో రానున్నాయి. ఇప్పుడు కొంచెం కాలు, చేయి ఆడుతూనే ఉంది కాబట్టి తొందరగా విషం త్రాగేయ్యండి” రెట్టించాను.

“మీ మాటలు సరిగ్గా లేవు” అన్నాడు కోపంగా.

“మీ పద్ధతి సరిగ్గా ఉన్నదా? మీది సరే అయితే నాదీ సరే..” అన్నాను. చాలాసేపు మౌనంగా ఉన్నాడు.

“ఆలోచించుకోండి. ప్రస్తుతం మీరుండటానికి ఓ ఇల్లుంది కదా” అన్నాడు వనమాలి.

“సగం అమ్మేసాం” అన్నదామె..

“ఇలాగే ఉంటే ఈ సగం కూడా మిగలదు. బాగా ఆలోచించుకొని రేపు రండి. ఇంటిపత్రాలు తీసుకురండి. మంచి సెంటరులోనే ఉంది కాబట్టి మంచి రేటే వస్తుంది. ఆపరేషన్ ఖర్చులు పోగా కూడా ఇంకా మిగులుతుంది. వాటితో చిన్న వ్యాపారం మొదలు పెట్టండి. సానుకూల ధోరణితో ప్రారంభిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఒకవేళ వ్యాపారం కాకపోతే చేయడానికి ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. చేసుకొంటూ ఒకపూటే తింటూ కూడా రాజాలాగే బ్రతకొచ్చు.. రేపటి సాయంత్రానికి మీ ఇల్లు అమ్మకానికైనా, కుదువబెట్టడానికైనా సిద్ధమయి రండి. లేదా నేనో విషం సీసాతో ఇక్కడ సిద్ధంగా ఉంటాను. మీ ఇష్టం” అన్నాను..

ఆమె వనమాలిని కేసి చూసింది. “రేపు రండి. మాట్లాడదాం” అన్నాడు. వాళ్ళు అదోలా చూస్తూ వెళ్ళిపోయారు.. “ఏమిటి.. చాలా ఘాటైన చికిత్స చేసావు.” అన్నాడు వనమాలి. “అతడికి ఇదే మందు” అన్నాను. “వీడో పరాన్నజీవి. అదిగో ఛస్తాను, ఇదిగో ఛస్తాను అని బెదిరించో పబ్బం గడుపుకొనే నైజం. ఆటలు సాగినంతకాలం సాధించుకొంటాడు. తల్లి గారం, భార్య అభిమానం, ఆస్తిపాస్తులు వాడికి వంతపాడాయి ఇప్పటివరకు. కూడు పెట్టే వనరులు తగ్గిపోయేసరికి బద్ధకం వదిలించుకొని ఏదో ఒక పనిలో చేరకుండా, నాటకాలాడుతున్నాడు. ఆత్మహత్యకి చాలా ధైర్యం కావాలి. వీడింక మన దగ్గరకి రాడు. ఏదో పని చేసుకోవడమో ఇంకెరినో ఆశ్రయించడమో చేస్తాడంతే” అని ముగించాను.

***

మరునాడు ఉదయం దినపత్రికలో నగరంలో అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నట్లు ఫోటోతో సహ వార్త వచ్చింది. ఫోటోని గుర్తుపట్టాను. అతను గత కొద్దిరోజులుగా తరచు తారసపడుతున్న ‘మాసిన గడ్డం’. గుండె చివుక్కుమంది.

ఇంతలో చరవాణి మ్రోగింది. ఊహించినట్లే.. వనమాలి. “పేపరు చూశావా.. నాలుగు రోజులనాడు మనల్ని కలిసిన మాసిన గడ్డం పూర్తిగా మాసిపోయింది” అన్నాడు.

“ఇప్పుడు చూస్తున్నాను. పాపం.. అసలు ముందు జరగాల్సిన కార్యక్రమానికి డబ్బులు కావాలి.. మనం వెడదాం..” అన్నాను.

“అలాగే నేనూ బయలుదేరుతున్నాను. ఆ మాసిన గడ్డం ఇంటి దగ్గర కలుద్దాం.. పేరేదో చెప్పాడు. గుర్తులేదు.”

“జగన్నాథమంట. పేపర్లో వ్రాసారు.”

చెరో అయిదువేలు జేబులో పెట్టుకొని వెళ్ళాం.

ఆత్మహత్య వార్త సాయంతో అతని ఇల్లు పట్టుకోగలిగాం. చాలా పాత ఇల్లు. ఇంటి ముందు ఆ మాసిన గడ్డం పార్థివదేహాన్ని ఉంచారు. భార్య అనుకొంటా ఏడుస్తోంది. దూరంగా దిగాలుగా పిల్లలు. పోలీసులు హడావుడి కూడా ఉంది. దగ్గర్లో ఉన్న పచారికొట్టు దగ్గరున్న వ్యక్తిని “ఏమయిందండీ” అంటూ కదిపాం. “మంచోడే బాబు.. అప్పులపాలైపోయాడు. బంగారం లాంటి పిల్లలు.. బాగా చదువుకొంటారు.. అనారోగ్యం, చాలీ చాలని జీతం వలన అప్పుల పాలయిపోయాడు. మూడు నెలలబట్టి ఇంటి అద్దె కట్టలేదు.. ఇంటివాళ్ళు ఖాళీ చెయ్యమని ఒత్తిడి తెచ్చారు. రెండు రోజులనాడు కరెంట్ బిల్లులు కట్టడం లేదని కరెంట్ కట్ చేశారండి. ఇంటాయన సామాన్లు విసిరేశాడు నిన్న. ఎలాగో బ్రతిమాలుకొంటే ఒక్కరోజు గడివిచ్చాడు. ఆ ఇంటిని వేరే వారికి అద్దెకివ్వడం కూడా జరిగిపోయింది. కొత్త వాళ్ళు ఇవ్వాళే రావాల్సి ఉంది. ఇది చూసి ఆగిపోయింటారు. ఇంకా వివరాలు కావాలంటే అదిగో ఆయనే ఇంటాయన. అడగండి” అంటూ ఇంటాయన వైపు చూపించాడు.

ఎవరా అని చూడబోయేసరికి గబగబా లోపలికి వెళ్ళిపోబోతున్న ఓ వ్యక్తి కనిపించాడు. మమ్మల్ని చూసే లోనికి వెళ్ళిపోతున్నట్లనిపించింది. లోనుంచి బయటకు రాబోతున్న భార్యను కూడా ఆపి లోనికి తీసుకెళ్ళిపోయాడు. ఆమెను చూడగానే ఇతను ఎవరో అర్థమయింది. ఆ రాజవంశం నాటి రమ భర్త.. అంత విషాదంలోనూ నవ్వొచ్చింది. అవును మరి! వాళ్ళకి ఇల్లు అద్దెలే ప్రధాన ఆదాయం.. ఈ మాసిన గడ్డం అద్దె బకాయిలు పడ్డాడు. ఖాళీ చెయ్యమన్నారు.

“దాదాపు ఈ వీధిలో ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళమే.. కాని పాపం” అని ఆగి ఏదో బేరం వస్తే దుకాణంలోకి వెళ్ళాడు.

“ఈడు ఇంటాయన మీద చెబుతాడు కానీ ఈడు సరుకులు ఇవ్వను పొమ్మన్నాడు” అంటూ మరోవ్యక్తి దుకాణందారు మీద చెప్పాడు.

“సమస్యలుంటాయి.. మనిషికి కాకపోతే మానుకొస్తాయా కష్టాలు? ఎలాగో అలా బ్రతకాలి కాని.. కుటుంబాన్ని బయటపడేసి పోయాడు” అన్నాడు మరో పెద్దాయన..

“బ్రతికుంటే బలుసాకు తినైనా బ్రతకొచ్చంటారు కదా” ఆ మరొకరు. నేను వనమాలి మోహమొహాలు చూసుకొన్నాం. నా దగ్గర విజిటింగ్ కార్డు తీసుకొన్న మరునాడే నన్ను కలిసాడు.. అప్పుల పాలైన వైనం చెప్పి పిల్లలకి పరీక్షలు అవుతున్నాయి. కరెంట్ తీసేస్తామంటున్నారు. ఒక్క పదివేలు దొరికితే ఇంకొన్నాళ్ళు తలదాచుకోగలం. ఈలోగా ఏదో ఒకటి చేస్తా. కాస్త సాయం చెయ్యగలరా అని అడిగాడు. అతనెవరో తెలియదు అప్పులు తీర్చలేడని తెలుస్తోంది. అందుకే ఓ అయిదు వందలు మాత్రమే ఇచ్చి పంపించేశాను. వనమాలి కూడా కలిసాడు.. “కష్టాలు వచ్చినప్పుడే నిలబడాలి. ధైర్యంగా ముందుకు పోవాలి” తరహా సలహాలు ఇచ్చి ఓ మూడొందలుంటే ఇచ్చి పంపించేశాడట.

పిల్లల పరీక్షలయ్యేంత వరకు కరెంట్ ఉండనిస్తే బాగుంటుందనుకొన్నాట్ట. ఇంటర్ పూర్తయితే ఉద్యోగం చూపిస్తానని పిల్లల్ని చదివించమని చెప్పాడట ఒకాయన. కాని రెండు రోజుల నుంచి కరెంట్ లేదు. తెల్లారితే ఇల్లు ఖాళీ చెయ్యాలి. బాగా చదువుకొంటున్న పిల్లలకి పరీక్షల సమయంలో సరిగ్గా చదువుకోవటానికి కూడా అవకాశం కల్పించలేకపోయాననే ఆవేదనతో ఉరివేసుకొన్నాడట.

‘సానుకూల, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడం ఎలా’ అంటూ ఎన్నో పుస్తకాలు వ్రాసి ప్రసంగాలు చేస్తున్న వనమాలితో బాటు నేను కూడా దోషుల్లా ఆ మాసిన గడ్డం కలిగిన శవానికి నమస్కరించాం. అయిదువేలు రమ మెగుడికిచ్చి కొంతకాలం వాళ్ళని ఇంట్లో ఉంచమన్నాం.. దహన సంస్కారాదులకు ఇంకో అయిదువేలు భార్య చేతికిచ్చాం.. “అయ్యా.. ఈ పదివేలకోసమే రెండు రోజులబట్టి తిరిగాడయ్యా! నిన్నే దొరికుంటే ఇంకొన్నాళ్ళు ఉండేవాడయ్యా.. పిల్లాడి పరీక్షలు అయిపోయేవి..” అంటూ భోరుమంది భార్య.. కడుపులో దేవినట్లయింది మా ఇద్దరికి.

ఇక్కడ ఎవరిది తప్పు? వ్యక్తిగత స్థాయిలో సహాయం చెయ్యటానికి ప్రతివ్యక్తికి కొన్ని పరిధులుంటాయి. నెలలకి నెలలు బాకీలుంటే ఇంటాయనగాని షావుకారు కానీ ఎంతకాలం దయ చూపిస్తారు.. బలుసాకు తినైనా బ్రతకొచ్చంటారు. అసలు బలుసాకెక్కడుంటుందో ఎవరు చెప్తారు. మోసగాళ్ళకి మాత్రమే డబ్బులు ఊరికే వస్తాయి.

ఈ మాసిన గడ్డానిది సానుకూలధోరణా, ప్రతికూలధోరణా? కష్టాలు మనుషులకే కాని మానులకు రావని తెలియదా? ఆశతో శుభోదయం కోసం చూడటం తెలియదా?

నా మనసులో మెదలే ప్రశ్నలు వనమాలికి వినబడుతున్నాయి. సమాధానం మాత్రం లేదు. చీకటి తరువాత వెలుగొస్తుంది. కాని ఈ చీకటి రాత్రి గడవటం ఎలా? కొందరికి చీకటి రాత్రులు చాలా సుదీర్ఘంగా ఉంటున్నాయి. ఎందుకంటే తెలియదు. మాసిన గడ్డానిది నెగటివ్ మైండు, తళతళలాడే గడ్డానిది పాజిటివ్ మైండా? ‘ఆకలి’ ప్రతికూల ధోరణికి, ‘తేన్పు’ సానుకూలధోరణికి ప్రతీకలా?

విషణ్ణవదనాలతో ‘మనకోసం’ సలహా కేంద్రానికి తిరిగొచ్చేసాం. ఆకలి తీర్చే అన్నదాతల ఆకలిచావుల చిత్రాల మధ్య ‘కలకానిదీ విలువైనదీ బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు’ పాట చరణాలు మా ఇద్దరినీ వెక్కిరిస్తున్నట్లు కనిపించాయి అప్పటికి..

వనమాలి మర్నాడు ఓ సభలో ‘సానుకూల దృక్పథం’ మీద ప్రసంగించాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here