మాస్టారి హృదయం

0
8

[dropcap]ఉ[/dropcap]దయం తొమ్మిది గంటల సమయం.

రామ్ నారాయణ్ రావు మేష్టారు గారు గాంధీనగర్లో తను పనిచేస్తున్న స్కూలుకేసి నడవడం మొదలుపెట్టారు. సుమారు తన యింటి దగ్గర్నుంచి స్కూలు ఆరు కిలోమీటర్ల దూరంలో వుంది. అయినా మేష్టారు నడిచే వెళ్ళాలనుకోవడానికి కర్ణుని చావుకు వేయి కారణాలన్నట్లు ఎన్నో వున్నా రథచక్రాలు భూమిలో కూరుకుపోయి కుదేలయినట్టు కరోనా పుణ్యమా అని ఆర్ధిక కారణం జీవిత రథాన్ని కుదేలు చేయడమే. కరోనా మూలాన్ని స్కూలు ప్రత్యక్షంగా నడవడం ఆగిపోయి జీతంలో ముప్పై శాతం కోత పడింది. ఆ వచ్చే జీతం కూడా ఎన్నో తారీఖున యిస్తారో నికరంలేదు. స్కూల్లో అకౌంట్స్ క్లర్కులని ఉద్యోగంలోంచి తీసేసి ఆ బాధ్యత కూడా మాష్టార్లకే వంతుల వారీగా అప్పగించారు. జీతంలో కోతలయ్యాక ఖర్చుల్లో కోతలు మరింత తప్పదుగా! అందుకే కష్టమైనా పదకొండో నెంబరు బస్సుని ఆశ్రయించారు రామ్ నారాయణ్ మేష్టారు. దారిలో స్కూలు చేరే ముందు ఓ పెద్ద పెంటకుప్ప ఎదురవుతుంది.

బస్సులో పోతే ఓ రెండు నిమిషాలు ముక్కు మూసుకుంటే సరిపోయేది. ఇప్పుడు మాస్కువున్నా అది దాటే వరకు కంపు భరించటం కష్టంగానే వుంటోంది.

పెంటకుప్ప దగ్గర పడుతోందని మాష్టారు గారు మాస్కుని మరికాస్త బిగించి తొందరగా అడుగులేద్దామనుకుంటూండగా వెనకాల భుజానికి ఓ పెద్ద ప్లాస్టిక్ సంచీ వేలాడుతూ తను పనిచేస్తున్న స్కూలు యూనిఫారమ్‌లోనే ఓ పన్నెండేళ్ల కుర్రాడు పెంటకుప్పలో ఏవో ఏరుతూ కనిపించాడు. వాడు అలా వంగి ఏదో తీయబోయేసరికి ఓ కుక్క భౌ! భౌ! మంటూ వాడిపైకి ఉరకబోయేంతలో బరువైన ప్లాస్టిక్ సంచీతో కొట్టడానికి యిటువైపు తిరిగేసరికి ఆ అబ్బాయి మొహం తెలిసినట్లు అనిపించి కళ్ళు కాస్త చికిలించి చూస్తే కిషోర్. తన స్కూల్లోనే ఆరవ తరగతి చదువుతుండేవాడు. ఆన్‌లైన్ క్లాసుల్లో కూడా ఈ మధ్య కనిపించలేదు. క్లాసులో ఫస్ట్ కాకపోయినా చాలా తెలివైన కుర్రాళ్ళలో ఒకడు. అసలు తను పనిచేస్తున్న ప్రైవేటు స్కూలులో కిషోర్ లాంటి వాళ్ళకి మామూలుగా సీటు అసలు దొరకదు. పలుకుబడిగల రాజకీయ నాయకులు విద్యాసంస్థలు కడతామన్న మిషతో ఎంతో తక్కువ ధరకే ప్రభుత్వ భూములు సంపాదించుకుని విద్యావ్యాపార సంస్థలుగా మారిపోవడంతో అలాంటి సంస్థలకు ప్రభుత్వం తక్కువ ధరకు భూములు యివ్వకూడదని పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో యిటీవలే ఢిల్లీ ప్రభుత్వం అలా తక్కువ ధరకే భూములు పొందిన విద్యాసంస్థలు కనీసం యిరవై అయిదు శాతం పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించాలని చట్టం తీసుకురావడంతో మళ్ళీ దాన్ని అడ్డుకునేందుకు ఆ సంస్థలు చేసిన అనేక ప్రయత్నాలు దాటుకుని చివరగా ప్రవేశ పరీక్షలో నెగ్గిన కిషోర్ లాంటి విద్యార్థులను చేర్చుకోక తప్పలేదు. కిషోర్ ఇంగ్లీష్ భాషలోనే కాస్త బలహీనంగా వుండడంతో వాడి తెలివితేటలకు ముచ్చటపడి కొంత కాలం వ్యాకరణం స్వయంగా నేర్పించాడు.

***

కిషోర్ ముఖానికి మాస్క్ పెట్టుకున్నా అది నల్లగా జిడ్డు పట్టేసి వుంది. భయం భయంగానే కాస్త దూరంగానే వుంటూ “నువ్వు కిషోరే కదా?” అని అడిగిన వెంటనే “అవును మాష్టారూ” అని బదులిచ్చాడు. రామ్ నారాయణ్ మాష్టారు “చదువు వదిలేసి పెంటకుప్పల్లో ప్లాస్టిక్ సంచీలు, సామాన్లు ఏరుకోవడమేమిటి?” అని అడిగినా జవాబు కోసం ఎదురు చూడకుండా ఈలోగా చేతిలో ఉండలా చుట్టిన గుడ్డముక్కని నోట్లో పెట్టుకొని వాడు పీల్చడం చూసి “ఎందుకు ఈ థిన్నర్ పీల్చే అలవాటు చేసుకున్నావ్? ఎంత ప్రమాదమో?” అని అనగానే కిషోర్ “అమ్మానాన్నలు కరోనాతో చనిపోయాక నేను సంపాదన కోసం పెంటకుప్పల్లోంచి ప్లాస్టిక్ సంచీలు ఏరుకోవడం మొదలుపెట్టాను మాష్టారూ” అన్నాడు. “సరే! కానీ యిది నీ ఆరోగ్యం నాశనం చేసేస్తుంది” అనేసరికి కిషోర్ “మాష్టారు గారు కనీసం మూడు నాలుగు కిలోల ప్లాస్టిక్ దొరకాలంటే సిటీలో పదిహేను యిరవై కిలోమీటర్లు నడవాలి. దానికీ ఆ కంపు భరించడానికి నేను ఈ మత్తు లేకపోతే పనిచేయలేను” అన్నాడు. అంతసేపు ఆ పెంటకుప్పలోంచి వచ్చే దుర్గంధం వలనా, కిషోర్ చెప్పిన మాటలు విన్నాక రామ్ నారాయణ్ మేష్టారుకి కడుపులో దేవేసి వాంతి వచ్చినంత పని అయ్యింది. అంతే కాదు ఆ పీక్కు పోయిన శరీరాన్ని, మొహాన్ని చూస్తుంటే మరికొంత కాలానికి కిషోర్ ఎలా అయిపోతాడో ఊహించటానికే భయం వేసింది.

కొంతసేపు తర్వాత తేరుకుని “ఒరేయ్! నీలాగ అనాథలైపోయిన వారందరినీ ఎలాగో నేను ఆదుకోలేను.. కనీసం నువ్వైనా యిప్పుడే ఆ సంచీ, మత్తు పీలుస్తున్న ఆ గుడ్డ ముక్కా విసిరేసి నాతో మా యింటికి పద” అని కిషోర్ చేయిపెట్టి లాగారు మాష్టారు గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here