మావాడి వివాహం, మావారి వ్యవహారం!

9
11

[box type=’note’ fontsize=’16’] ఒక్క మాట: ఎన్నో రకాల విషమ పరిస్థితుల మధ్య చిక్కుకుని నానావిధమైన సమస్యలతో ఉన్న మన సమాజంలో ఈ కథ ద్వారా చూపించిన విషయం చిన్నదిగా, సాధారణమైనదిగా గోచరించవచ్చు. ఊరికే సరదాగా చదివేందుకే కదా అనిపించొచ్చు కొందరికి. నా ఉద్దేశం కూడా అదే! జీవితంలో క్లిష్టమైన సమస్యలతో అలసిపోతున్న ఒక వ్యక్తి పెదవులపై ఈ కథ ద్వారా కనీసం ఒక చిరునవ్వు వెలిగించగలిగినా నా ప్రయత్నం ఫలించిందని ఆనందిస్తాను. ఇక కథలోకి రండి. [/box]

[dropcap]’పె[/dropcap]ళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు’ అన్నారు ఎంతో అనుభవంతో మన పెద్దలు. అమ్మాయి పెళ్ళికి చాలా పాట్లు పడాలని విన్నాను. కానీ అబ్బాయి పెళ్ళికి కూడా తక్కువ ఏమీ కాదని మా సుదీప్ వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టిన కొన్నాళ్ళకే తెలిసొచ్చింది. అందులోనూ, అసలు వ్యవహార జ్ఞానం లేని మా వారితో ఐతే సరేసరి. మాకు ఒక అబ్బాయి, సుదీప్. బీటెక్ చేసి మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అమ్మాయి సునీత ఇంకా చదువుకుంటోంది. అందుకే ముందు అబ్బాయికి పెళ్లి చేయాలని నిర్ణయించాము. సంబంధాలు వెతకటం మొదలుపెట్టాము. మొబైల్ ఫోన్లు, ఆన్‌లైన్ చాటింగ్ కాదుకదా టీవీ అంటే ఏమిటో కూడా సరిగా తెలియని రోజులు అవి. ల్యాండ్‌లైన్ ఫోన్‌లు కూడా అరుదే.

ఆ రోజు మా వాడిని చూసుకుని వారి అమ్మాయిని చూడటానికి రమ్మని ఆహ్వానించటానికి మా ఇంటికి ఒకరు వచ్చారు. వాళ్ల సంగతి ఏమో కాని మాకు అదే మొదటి వ్యవహారం. ఇంటికి అతిథులు వచ్చినప్పుడల్లా కొన్ని మర్యాదలు పాటించాలి కదా. వచ్చినవారికి మా ఊళ్లో బంధుమిత్రులు లేరు. స్టేషన్ నుంచి నేరుగా మా ఇంటికి వచ్చారు. వాళ్ళని ఆహ్వానించి నేను కాఫీ కలపటానికి వంటింట్లోకి వెళ్లాను. డ్రాయింగ్ రూమ్‌లో జరుగుతున్న సంభాషణ నాకు వినిపిస్తోంది.

సుదీప్ చదువు, ఉద్యోగం తెలుసుకున్నాక ఆ వచ్చిన పెద్దమనిషి యధాలాపంగా, “మీ సొంత ఊరు ఇదేనా? మీ కుటుంబంలో ఎవరెవరున్నారు?” అని మా వారిని అడిగారు.

“ఒంగోలులో మాది బాగా పేరున్న కుటుంబం అండి. మేము ఐదుగురం అన్నదమ్ములం. అక్కచెల్లెళ్లం. అందరూ బాగానే సెటిలయ్యారు. మా అక్క మాత్రం చాలా కాలం పక్షవాతంతో మంచం పట్టి పోయింది. మా నాన్నగారు కూడా పక్షవాతంతోనే పోయారు.” ఇలా మావారి మాటలప్రవాహం సాగిపోతోంది.

అన్ని తెలిసిన దాన్ని నాకే ఈ మాటలు వింటుంటే వీరి కుటుంబంలో పక్షవాతం వంశపారంపర్యంగా వస్తున్న జబ్బు కాదు కదా అన్న అనుమానం వచ్చింది. ఆ పెళ్లి మాటలకు వచ్చినవారు ఈయన మాటలకి ఎంత బెదిరిపోయారో ఊహించుకోవచ్చు. నేను ఆలస్యం చేస్తే మంచిది కాదని అందరికీ కాఫీలు అందించి మాట మార్చి వాళ్ళ సంగతులు అడగడం మొదలు పెట్టాను.

మావాడు ఇబ్బందిగా కూర్చున్నాడని తనని లోపలికి పంపించాను. పిల్ల తల్లి కొంచెం ముభావంగానే కనిపించింది. తండ్రి మాత్రం వెళ్తూ, “మీరు మా అమ్మాయిని చూడటానికి ఎప్పుడొస్తే బాగుంటుందో తెలియజేస్తాం.” అన్నారు. తల్లి వాలకం చూస్తే ఈ వ్యవహారం ముందుకు వెళుతుందని నమ్మకం కుదరలేదు నాకు. వాళ్ళు వెళ్ళాక మావారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను.

“ఇది మొదటి సంబంధం కాబట్టి ఊరుకుంటున్నాను, ఇక ముందు ఎవరు వచ్చినా ఏమి అడిగినా ఎంత వరకు అడిగారో, అంతవరకే చెప్పి వాళ్ళ విషయాలు తెలుసుకోండి. అది చేతకాకపోతే గమ్మున కూర్చోండి. అంతేకానీ, మీ కుటుంబంలో జబ్బు హిస్టరీ అంతా చెప్పి వచ్చినవాళ్ళని బెదరకొట్టద్దు. పిల్లల పెళ్లిళ్లు చేయాల్సిన వాళ్ళం. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియక పోతే ఎలా?” అని. నేను అనుకున్నట్లుగానే మాకు ఎలాంటి పిలుపు రాలేదు. మొదటి అనుభవం అలా అయిపోయింది.

మరి కొన్నాళ్ళకు మరో సంబంధం వచ్చింది. ఈసారి ఆడవారు ఎవరూ రాలేదు. మావారి మిత్రుని వెంట పెట్టుకొని పిల్ల తండ్రి ఒక్కరే వచ్చారు. సుదీప్ కూడా అప్పుడే ఆఫీసు నుంచి తిరిగి వచ్చాడు. అందరికీ కాఫీలు, స్నాక్స్ అందించాను. వాళ్ళు అడిగిన వాటికి సుదీప్ జవాబులు చెబుతున్నాడు. ఆపైన మావారు అందుకున్నారు,

“మీరు పిల్ల జాతకం పంపించారు. ఇద్దరి జాతకాలు కలిసేయి. కానీ మీరు మరిన్ని వివరాలు ఇవ్వలేదు. మీరు మరోలా అనుకోవద్దు, మీ అమ్మాయి హైట్ ఎంత? అందంగా ఉంటుందా? చదువుతో పాటు సంగీతం కూడా నేర్చుకుందా? మరేంలేదు మా అబ్బాయికి సంగీతం అంటే ఇష్టం, అందుకని.” ఇలా సాగిపోతోంది మావారి ప్రశ్నల దాడి.

సుదీప్ తెల్లబోయి చూస్తున్నాడు తండ్రి వైపు. అదేమిటి, సంగీతం వచ్చిన అమ్మాయి కావాలని అనలేదే. మరి నాన్న ఏమిటి కొత్త ట్విస్ట్ పెట్టారు. ఇంటికి రావల్సిన కోడలు ఇలా ఉండాలి అని నాన్న ముచ్చట పడుతున్నారా? అనుకున్నాడు మనసులో.

పిల్ల తండ్రి పాపం ఈ ప్రశ్నలు తట్టుకోలేక “మా పిల్ల మాకు బాగానే ఉంటుంది కదండీ. మా అమ్మాయి సంగీతం నేర్చుకోలేదు. అయినా మీరు పిల్లను చూడటానికి వస్తారు కదా” అంటూ వెళ్లేందుకు లేచారు.

వాళ్ళను పంపించి మావారు లోపలికి రాగానే మా అబ్బాయి నిలదీశాడు,

“నాన్నా, నేను ఎప్పుడు సంగీతం వచ్చిన అమ్మాయి కావాలన్నాను? ఆడపెళ్ళి వారిని అలా బెదరగొట్టటం మీకు సరదానా?” అంటూ.

“అవును మరి, నాకిలాంటి అమ్మాయి కావాలి అని నువ్వు ఎప్పుడూ చెప్పలేదు. అందుకని నాకు ఎలాంటి కోడలు కావాలో నేను చెప్పాను. అయినా చక్కటి సంగీతం వచ్చిన అందమైన పిల్ల దొరికితే నీకు ఏమైనా చేదా?” అన్నారు.

“ఇప్పటికైనా నీకు ఎలాంటి పిల్ల కావాలో చెప్పరా. లేకపోతే ఇలాగే మీ నాన్న కోరికలు పెరుగుతూ పోతాయి” అన్నాన్నేను.

“అమ్మా, ఎలాంటి అమ్మాయి కావాలి అన్నది నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు చూడగానే నచ్చితే మాట్లాడుతాను. ఆ తర్వాత ఆ పిల్ల కూడా సరే అంటే మిగతా విషయాలు మీరు మాట్లాడుకుందురుగాని.” అన్నాడు సుదీప్. నాకెందుకో ఈ సంబంధం కూడా తిరిగిపోతుందని అనుమానం కలిగింది.

ఒక ఆదివారం పది గంటలకు మా ఇంటికో పెద్దాయన వచ్చారు. ఆ రోజు పొద్దుట్నుంచి మబ్బులు కమ్ముకున్నాయి. ఆయన మాటలు మొదలు పెట్టేసరికి కుంభవృష్టి మొదలయ్యింది. రెండు, మూడు అనుభవాలు అయ్యాయి కాబట్టి ఈసారి మా వారు జాగ్రత్తగానే మాట్లాడుతున్నారు. పిల్ల తండ్రి మమ్మల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించడం కూడా అయింది. కానీ వర్షం మాత్రం తగ్గే సూచన లేదు. మధ్యాహ్నం అవుతోంది. ఆ వచ్చిన పెద్దమనిషికి ఆ ఊరిలో ఎవరూ బంధువులూ, స్నేహితులూ లేరని చెప్పారు.

‘కతికితే అతకదు’ అంటారు. ఆ మాట నమ్మినా, లేకపోయినా భోజనం పెట్టకుండా పంపించడం ఇష్టం లేదు. అలా అని భోజనం చెయ్యమనటానికి నాకు ధైర్యం చాల్లేదు, ఎందుచేతనంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు. మేమే కదా అని ఉన్న వాటితో ఊరగాయ పచ్చడితో సరిపెట్టుకుందామనుకుని పెద్దగా వంటలేమీ చేయలేదు. కానీ వచ్చిన వారికి మరీ పచ్చడి మెతుకులు పెట్టి ఎలా పంపడం? ఏం చేయాలి?

సుదీప్‌తో మాట్లాడాను. ఇంట్లో ఉల్లిపాయలు, పావు కేజీ వంకాయలు తప్పితే ఏమీ కనిపించలేదు. “అమ్మా, ఉల్లిపాయలు వేసి సాంబార్ పెట్టు. వంకాయ కూర చెయ్యి. నాన్నకి, ఆయనకి ముందు వడ్డించెయ్యి. నాన్నకి ముందుగానే చెప్పు మారు అడగవద్దని.” అన్నాడు వాడు.

మేము ఒక నిర్ణయానికి వచ్చే లోపు మా వారు ఆయన్ని పిలుచుకొచ్చి, డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. నేను, సుదీప్ మొహాలు చూసుకున్నాం.

ఆ పిల్ల తండ్రి “మీ అబ్బాయిని కూడా కూర్చోమనండి.” అంటే తనకి ఇంకా టైం పడుతుంది అని చెప్పి ఎలాగో తప్పించుకున్నాడు దీపు. అంతటితో సరిపోయి అన్ని సవ్యంగా అయితే నాకు ఈ కథ రాసే అవసరం ఉండేది కాదు.

వారిద్దరూ తినడంమొదలుపెట్టారు. కూర వడ్డించి, గిన్నెలో కొంచెం ఉంచాను ఎందుకైనా మంచిదని. ఇద్దరిలో ఎవరూ మారు అడక్కూడదని మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆ పెద్దమనిషి వేసినది కలుపుకుని తింటున్నారు. మా వారు ఊరుకుంటారా,

“అదేమిటి ఆయనకు కూర మారు అడగవా ఏమిటి” అని మందలించారు.

నా పక్కలో బాంబు పడినట్టయింది. చేసేది లేక గిన్నెలో రెండు కూర ముక్కలు మావారికి చూపిస్తూ వడ్డిస్తున్నట్టు నటిస్తున్నాను, చూసైనా అర్థం చేసుకుంటారని. కానీ అంత తేలిగ్గా అర్థం చేసుకుంటే ఆయన మావారు ఎందుకువుతారు?

“అబ్బా నాకు కాదు, ఆయనకు అడుగు” అంటూ మళ్లీ మందలించారు. చేసేదేం లేక ఉన్న నాలుగు ముక్కలు ఆయనకు వడ్డించబోయాను.

నా అదృష్టం కొద్దీ ఆయన చేతులు అడ్డం పెట్టి “వద్దు” అన్నారు. అలా ఆ గండం గడిచింది. వర్షం తగ్గాక పిల్ల తండ్రి మరోసారి మమ్మల్ని ఆహ్వానించి, ధన్యవాదాలు చెప్పి వెళ్లారు. పెళ్లి సంబంధం మాట ఎలా ఉన్నా అతిథికి అన్నం పెట్టి పంపించానని నా మనసుకు తృప్తిగా అనిపించింది.

మంచి రోజు చూసి సుదీప్‌ని పెళ్లి చూపులకు వెళ్లి రమ్మన్నాం. ఇంట్లో సుదీప్ పెళ్లి మాటలు జరుగుతున్న సమయంలో మా అమ్మాయి కాలేజీలో ఉండటంతో ఈ వ్యవహారాన్ని ఇప్పటిదాకా తను చూడలేదు. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక టీ తాగుతున్నప్పుడో, అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడో ఆ మాటలు విని సునీతకి ఇంట్లో జరుగుతున్న విషయాలు అర్థం అవుతూ వచ్చాయి.

ఈసారి ఆదివారం కావడంతో ఇంట్లో వ్యవహారం గమనించింది.

“అమ్మా, అన్నయ్యకి తోడుగా నేను వెళ్తాను. ఈసారి మేము వెళ్లి అమ్మాయిని ఫిక్స్ చేసుకొని మరీ వస్తాం. అయినా నాకు కాబోయే వదినని నేను చూడొద్దూ?” అంటూ మా అమ్మాయి సునీత మొదలుపెట్టింది.

“పోనీ, రానీయమ్మా, నాకు ఒక్కడికే మొహమాటంగా ఉంటుంది.” అంటూ సుదీప్ చెల్లెల్ని సపోర్ట్ చేసాడు.

“వచ్చేవారం నాకు రెండు, మూడు సెలవులు కలిసివస్తాయి. అన్నకి తోడుగా వెళ్తాను. నాకు కూడా టిక్కెట్ కొనండి.” అంది సునీత అన్న సపోర్ట్ చూసుకుని. ఇది ఒకందుకు మంచికే అని ఇద్దర్నీ పంపడానికి ఒప్పుకున్నాం.

వీళ్లు వెళ్లాల్సిన ఊర్లో మావారు ఇది వరకు ఉద్యోగం చేసిన కంపెనీ గెస్ట్ హౌస్ ఉండడంవల్ల అక్కడ దిగి, తయారయ్యాక పిల్ల అన్న వచ్చి వీళ్ళని పికప్ చేసుకుని వారి ఇంటికి తీసుకు వెళ్తారని నిర్ణయించాము. అనుకున్న ప్రకారం సుదీప్ చెల్లెలితో ప్రయాణమయ్యాడు.

పిల్లల కోసం ఎదురు చూస్తున్నాం. ఊరినుంచి వస్తూనే ఇద్దరూ మాలో సస్పెన్స్ పెంచేస్తూ చెరో బాత్రూం లోకి దూరారు.

ఫ్రెష్ అయి వచ్చాక ఇద్దరికి కాఫీ కలిపి ఇచ్చి, అసలు విషయం చెబుతారా అని చూస్తున్నాను. మా అమ్మాయి ముందు చెప్పింది,

“మా ఇద్దరికీ పిల్ల నచ్చిందమ్మా. వాళ్ల మాటలు బట్టి అన్నయ్య కూడా వాళ్లకి నచ్చినట్టే.” సునీత మాట పూర్తి అవుతూనే సుదీప్ అందుకున్నాడు,

“ఆ పెళ్లికూతురికి ఒక అన్నయ్య ఉన్నాడు. పేరు రాహుల్. అతను ఎం.బి.ఎ. చేసి నాలుగు నెలల నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్లకి మన సునీ బాగా నచ్చింది. మనకి అభ్యంతరం లేకపోతే వాళ్ళు రాహుల్‌కి మాట్లాడుకుందాం అనుకుంటున్నారు.”

సుదీప్ మాటలు మా ఇద్దరికీ ఏమీ అర్థం కాలేదు. అబ్బాయి పెళ్లికే ఇంత కిందామీదా పడుతున్నాంకదా సునీతకి పెళ్లి సంబంధాలు చూడాలంటే ఎన్ని అవస్థలు పడాలో అని బెంగ పడుతుండేవాళ్లం. అలాంటిది అబ్బాయితో పాటు అమ్మాయి వివాహం కూడా నిశ్చయం అవుతుందంటే నమ్మశక్యంగా లేదు.

“అదేమిట్రా, సునీతని అడిగావా? మొన్నటివరకు అప్పుడే నాకు పెళ్లి వద్దు. ఇంకా చదువుకుంటాను అన్నదిగా.” అన్నాను.

“సునీత అభిప్రాయం తెలుసుకునే చెప్తున్నాను అమ్మా. పక్కనే ఉందిగా నువ్వే అడుగు. రాహుల్ సునీతకి బాగా తగినవాడు. కానీ, వీళ్ళిద్దరికీ ఆరేళ్ల వయసు తేడా ఉంది. ఈ విషయంలో మనకు అభ్యంతరం లేకపోతే మిగతా విషయాలు అన్నీ బాగున్నాయి.”

నేను మావారు సునీత వైపు చూశాం. సునీత నవ్వుతోంది. కలలో కూడా ఊహించని విధంగా ఇంత సంతోషకరమైన వార్త! ఎలాగైతేనేమి సుదీప్ పెళ్లి విషయం ఒక దారికి వచ్చింది కదా. ఇంక మిగతా విషయాలు మా వారిని అదుపులో పెట్టుకుంటూ, ఒకటికి రెండు పెళ్లిళ్లు ఎలా చేస్తానో ఏమో అని కొత్తగా బెంగ మొదలైంది నాకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here