మాయా లోకం

1
11

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి సుమారు పన్నెండు, ఒంటిగంటా మధ్య గడియారం టిక్, టిక్ మంటూ కొట్టుకుంటోంది.

మరుసటిరోజు సెలవు కావడంతో పెయింటింగ్ వేస్తూ మెలకువగా ఉంది హారిక. అప్పుడే ఇంటర్ అయ్యి, ఇంజినీరింగులో చేరడానికి సిద్ధంగా ఉండి, సెలవల్లో ఖాళీగా ఉండటం ఎందుకని తనకి నచ్చిన, వచ్చిన పెయింటింగ్‌లో మరిన్ని మెలకువలు నేర్చుకుంటోంది.

ఇంతలో రంగులు అన్నీ అయిపోవడంతో క్రింది హాల్లో ఉన్న వార్డు రోబ్‌లో ఉన్న రంగులు తెచ్చుకోవడానికి తన గదినుండి వెళ్ళి, తీసుకు వస్తుండగా,ఏదో చిన్న అలికిడి అవ్వటం చూసి వెనుకకు చూసింది.

ఏమీ కనిపించలేదు. అలా మెట్లు ఎక్కుతూ తన గదిలోకి వెడుతుంటే మరోసారి ఎవరో మెట్లు ఎక్కుతున్న సవ్వడి, ఈ సారి స్పష్టంగా. మరోసారి ఉలిక్కిపడి, అనుమానం వచ్చి వెనుతిరిగి చూసింది.

ఎవ్వరూ లేరు, బయట మారుతున్న వాతావరణానికి తగ్గట్టుగా చల్లటిగాలి జువ్వున కొట్టింది. ఏమీ లేదులే అనుకుంటూ, మరో రెండడుగులు వేసింది, మళ్లీ అదే శబ్దం, ఈ సారి మరింత స్పష్టంగా, ఎవరో తనను అనుసరిస్తున్నట్టు, వెచ్చగా ఊపిరి ఏదో అంతటి చల్లటి వాతావరణంలోనూ తన భుజాలకు తగులుతున్నట్లు ఏదో అనుభూతి కలిగింది. ఒక్కసారి వళ్ళు ఝల్లుమంది, నెమ్మదిగా వెనక్కు చూసింది. ఎవ్వరూ లేరు, కానీ, ఏదో జరుగుతోందని మనసు పదే పదే హెచ్చరిస్తుండగా, అలా మనసులో బయలుదేరిన అనుమానం పెద్దదై వటవృక్షంలా మారింది. ఎవరో తనను పరిశీలిస్తున్నారని, తన వెంటే అడుగులు వేస్తున్నారని, తనతో కలవటానికి ప్రయత్నిస్తున్నారని అనిపించసాగింది. అంతే అంతటి చలిలోనూ హారికకు ముచ్చెమటలు పట్టడం మొదలయ్యాయి. గుండెల్లో ఏదో అలజడి, వణుకుతున్న కాళ్లతో గబగబా తన గదివైపు పరిగెత్తింది.

అలా పరిగెడుతూ ఉండగానే చేతిలో ఉన్న రంగుల సీసాలలో, నల్లటి రంగు సీసా ఒకటి కింద పడి పగిలిపోయింది. అయినా అది పొద్దున్నే సద్దుకోవచ్చులే అని దాన్ని వదిలేసి గదిలోకి పరిగెట్టడం మొదలు పెట్టింది.

తాను పరిగెడుతుంటే తన వెంట ఎవరో తరుముకు వస్తున్నట్టు, చిన్నగా నవ్వుతున్నట్టు, ఏదో ఒక విధమయిన సవ్వడి తీతువు పిట్ట కూతలాగా వచ్చినట్టు అనిపించసాగింది. గబగబా మంచం ఎక్కేసి దుప్పటీ ముసుగేసి తనకు వచ్చిన అంజనేయ దండకం గట్టిగా చదవటం మొదలు పెట్టింది.. శ్రీఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. ప్రభాదివ్యకాయం… అంటూ గట్టిగా.. జై శ్రీరాం.. జై వీరంజనేయ… అంటూ అరవటం మొదలుపెట్టింది.

“హారిక.. హారిక.. ఏమైంది.. ఏమైందే” అంటూ హారిక అమ్మ వనిత ఒక్క కుదుపు కుదుపుతూ లేపడంతో మెలుకువలోకి వచ్చిన హారికకు అర్థం అయ్యింది, ఏదో పీడకల వచ్చిందని.

“ఏమయ్యిందే.. ఎందుకు అంతలా భయపడ్డావ్, ఈ చమటలు ఏమిటి, బయట ఇంత చలిగా ఉంటే నీకు ఇంత చమటలు ఎలా పట్టాయి? అందుకే అర్ధరాత్రి దాక మెలకువగా ఉండకు, అలా ఒక్కత్తివే ఇక్కడ పడుకోకు. రేపటి నుండి కిందే నా పక్క రూమ్‌లో పడుకో, ఇలాంటి భయాలు ఉండవు” అంటూ జాగ్రత్తలు చెప్పింది వనిత.

అప్పటికే తెల్లవారుజాము సుమారు ఐదు గంటలు దాటడం, శీతాకాలం వల్ల అర్ధరాత్రిలాగా ఉన్నా ఉదయం అవ్వటానికి ప్రకృతి సిద్ధంగా ఉంది. అలా హఠాత్తుగా తెలివి వచ్చిన హారికకు ఇంక నిద్ర పట్టలేదు. నెమ్మదిగా కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ తాగి, మళ్లీ తన పెయింటింగ్ వేద్దామని కింద హాలులో వార్డ్ రోబ్ దగ్గరనుండి రంగుసీసాలు తెస్తుండగా తన పెయింటింగ్ డబ్బలలో నల్లరంగు సీసా కనబడటంలేదని హారిక గ్రహించడం, అదే సమయంలో హారిక తల్లి వనిత మాట్లాడుతూ

“ఇదేంటే.. ఇక్కడ నల్లరంగు పెయింట్ సీసా బద్దలయిపోయింది, నీకు తెలీదా.. అయ్యో.. ఇంకెవరూ ఇటువైపు రాలేదు, లేకుంటే గాజుపెంకులు గుచ్చుకునేవి.” అంటూ వాటిని ఎత్తటానికి చీపురు, చాట తేవటానికి లోపలికి వెళ్ళింది.

“నిజమా.. ఇదేంటి నిజంగానే నల్లరంగు పెయింట్ సీసా బద్దలయ్యిందా, అది కలలో కదా, మరి ఇక్కడ నిజంగా జరిగింది. ఒకవేళ జరిగితే ఎప్పుడు జరిగింది? అంటే నిన్న రాత్రి కల నిజమా.. లేక.. మాయా అమ్మో” అనుకుంటూ హారిక గుండె గుభిల్లుమంది.

అలా ఆ రోజంతా గడిచిపోయింది. హారిక మాత్రం అప్పుడప్పుడు ఎవరో తనను వెనకాల అనుసరిస్తున్నట్టు అనుమానం పడుతూనే అన్యమనస్కంగా గడిపింది. ఆ రాత్రి మొండిగానే తన గదిలోకి తల్లి వద్దంటున్నా వెళ్లి పడుకుంది. బహుశా పొద్దుటనుండి అలసి సొలసి ఉందేమో వెంటనే నిద్ర పోయింది. కాసేపటికి ఎవరో మంచం మీద తనతో పాటు నిద్ర పోతున్నట్టు, గట్టిగా ఊపిరి తీసుకుంటున్నట్టు అనుమానం కలిగి నెమ్మదిగా కళ్ళు తెరిచింది.

ఏమీ కనపడలేదు కానీ తన గది తలుపులు కిర్రు కిర్రు మంటూ కొట్టుకోవడం, ఎవరో అదాటుగా వెళ్లినట్టు అనిపించడం జరిగింది. నెమ్మదిగా మంచం దిగి లేని ధైర్యం కూడ గట్టుకుని మెట్ల మీదుగా మెల్లగా కిందకు దిగింది. అదే సమయంలో కింది హాలులో వెనుక గార్డెన్ వైపు ఉన్న తలుపు తెరిచి, వేయటం మరచినట్టుగా ఉండటంతో తలుపు వేసి వచ్చేసింది ఎందుకు వేయటం మరచిపోయారా? లేక ఎవరైనా నేను రావటం చూసి బయటకు వెళ్లి పోవటం జరిగిందా అర్థం కాలేదు.

అదే విషయం ఆలోచిస్తూ నెమ్మదిగా మళ్లీ మేడమీదకు వెళ్లిపోయే సమయంలో హాలులో కిటికీ గుండా బయట గార్డెన్ లోకి తొంగి చూసింది. ఎవరో అక్కడ మల్లెపందిరి దగ్గర ఉన్నట్టుగా నీడను చూడగానే గతుక్కుమంది. అయినా ధైర్యం తెచ్చుకుని అలా అటువైపు చూడటం మొదలుపెట్టింది. ఆ మల్లె పందిరి కింద సుమారు తన వయసే ఉన్న అమ్మాయి నవ్వుతూ, చిన్నగా సైగలు చేస్తూ కనబడటం చూడగానే ఒక్క దెబ్బకు అదిరిపడింది హారిక.

‘ఇది నిజమా.. ఎవరిది.. అయినా ఇంత అర్ధరాత్రి చిమ్మ చీకటిలో ఎవరై ఉంటారు? ఎందుకు అక్కడ ఉన్నారు? నన్నే ఎందుకు అనుసరిస్తున్నారు?’ అంటూ ఆలోచిస్తుండగా హారిక భుజంపై ఒక చెయ్యి పడింది. ‘అయ్యబాబోయి..’ అని పెద్దగా అరుస్తూ హారిక వెనుకకుతిరిగి చూడగానే..

“ఏమైందే హారిక.. నేను అమ్మనే.. ఎవరిని చూసి ఎవరనుకున్నావ్.. అంత కేక పెట్టావేమిటి.. అయినా నీ గదిలో నిద్దుర పోకుండా ఇక్కడ ఏమి చేస్తున్నావ్? ఆ కిటికీలోంచి ఏమి చూస్తున్నావ్? ఏమయ్యింది?” అంటూ కంగారుగా అడిగింది వనిత.

“అమ్మా!.. అక్కడ మల్లెపందిరి దగ్గర నీకు ఎవ్వరూ కనపడటం లేదా? ఒక అమ్మాయి నా వయసు ఉన్నదే అక్కడ ఉండి నా వైపు చూసి పలకరింపుగా నవ్వుతోంది, నన్ను పిలుస్తోంది. నీ అలికిడి విని వెంటనే అక్కడనుండి పారిపోయింది” అంటూ వగరుస్తూ సమాధానం చెప్పింది హారిక.

“నిజమా.. అలాంటిది ఏమీ లేదు. అయినా ఈ పిచ్చి మాటలు, కలలు ఏమిటి నిన్న రాత్రి నుండి.. ఉండు దిష్టి తీస్తాను. అయినా అర్ధరాత్రి దాకా ఆ పిచ్చి సినిమాలు చూడొద్దు అంటే వినవు.” అంటూ గబగబా వంట యింట్లోకి వెళ్లి గుప్పెడు ఉప్పు తీసుకు వచ్చి హారికకు దిష్టి తీసి తనతో పాటు తన గదిలోకి నిద్ర పోవటానికి తీసుకుపోయింది.

ఇలా ఇంకో రెండు రోజులు గడిచాయి, రోజూ ఏదో ఒక విధంగా హారికకు ఆ అమ్మాయి ఏదో ఒక సమయంలో కనిపించడం మొదలుపెట్టింది. అదే విషయం వనితకు చెప్పడం, కూతురుకు ఏదో అయ్యిందని భయం పట్టుకుంది. ఆ తరువాత రోజు ఉదయం తెల్లవారుజామున వనిత లేచేటప్పటికీ హారిక ఎవ్వరితోనో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఏమై ఉంటుందా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ హారికకు దగ్గరగా వెళ్ళింది. అక్కడ ఎవ్వరూ తనకు కనిపించలేదు కానీ హారిక మాత్రం ఎవరో తన ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్టుగా గలగలా మాట్లాడుతూ కనిపించడం జరిగింది. అలా హరికను చూసిన వనితకు గుండె జారిపోయింది. ఇదేమిటి ఈ పిల్లకు ఏమైనా గాలి సోకిందా లేక పిచ్చి పట్టిందా అని అనుకుంటూ

“హారిక.. ఎవరితో మాట్లాడుతున్నావ్? ఎవరు అక్కడ లేరుగా?” అని హారిక భుజంపై చెయ్యి వెయ్యంగానే హారిక ఒక్కసారి ఉలికి పడింది.

“ఏం లేదమ్మా.. అదే మొన్న రాత్రి చూసానే అదే అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. నిన్ను చూసి భయపడి ఇప్పుడే వెళ్ళిపోయింది, అయినా నీకు అంత కంగారు ఎందుకు?” అంటూ విచిత్రంగా ముఖం పెట్టి అడిగింది.

కూతురు హారిక సమాధానానికి విస్తుపోయిన వనితకు అర్థం అయిపోయింది. ఏదో జరిగింది హారికకు, దేని ప్రభావానికో లోనయ్యిందని.

“సరే హారిక.. చూద్దాంలే, కానీ నువ్వు రాత్రి నుండి సరిగ్గా నిద్ర పోలేదు కదా.. వచ్చి నిద్దరపో.. ఉదయం మాట్లాడుకుందాం” అంటూ హారిక చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకువెళ్లి హారికకు నిద్ర పట్టేవరకు ఉండి ఆ తరువాత భర్త నగేష్‌కు ఫోన్ చేసింది.

“ఏమండీ.. ఎప్పుడు వస్తున్నారు? ఇంకా ఎన్నాళ్ళు మీ కాంప్? మీతో చాలా విషయాలు మాట్లాడాలి.” అంటూ వాళ్ళ ఆయనను నిద్రనుండి ఫోన్ చేసి లేపేసింది.

“వనితా.. పొద్దున్నే ఏమిటీ ఈ గోల? రేపు సాయంత్రంకల్లా వచ్చేస్తాగా, ఎందుకంత కంగారు పడుతున్నావ్? ఇంతలో ఏమి కొంపలు మునిగాయి?” అంటూ ఒకింత విసుగు, బద్దకంతో మిళితమయిన స్వరంతో అడిగాడు నగేష్.

అలా భర్త ఆడిగాడో లేదో గత నాలుగు రోజులుగా జరిగిన పరిణామాలు, హారిక ప్రవర్తనలో మార్పులు మొత్తం వివరించింది. అది విన్న నగేష్‌కు మతిపాయింది. “ఇదేమిటి ఇలా జరుగుతోంది. ఇదివరకు ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదే? పైగా హారిక చక్కని పిల్ల, ఎలాంటి మానసిక ఇబ్బందులు లేవు.ఈ మధ్యే మోజుపడి కొనుక్కున్న బంగ్లాలో అందరం కలిసి హాయిగా ఉన్నాంగా”.. ఇలా ఎన్నో రకాల ఆలోచనలతో గడిపి, తరువాత రోజు బయలుదేరవలసిన ప్రయాణాన్ని అదే రోజుకు మార్చుకుని రాత్రికల్లా ఇంటికి వచ్చేశాడు నగేష్.

వస్తూనే హారిక గదిలోకి వెళ్లి చూసాడు, ఏదో పుస్తకం చదువుతూ కనిపించింది. “హాయ్.. డాడీ. ఎలా ఉన్నారు? వచ్చేసారా? ఏమిటీ నాకు ఏదో జరిగింది, ఏమైపోతానో అని వచ్చేసావా.. అమ్మ అన్ని విషయాలు నీకు చెప్పేసిందిగా” అంటూ బుంగమూతి పెట్టి తల్లి, తండ్రిల మధ్య జరిగిన సంభాషణలు పూస గుచ్చినట్టు చెప్పేయడంతో ఆశ్చర్యపోవడం నగేష్ వంతయ్యింది.

వనిత చెప్పడం ఎప్పుడు వింది? నేను అదే కారణంగా తిరిగి వచ్చేశానని ఎలా తెలిసింది? అనుకుంటూ ఉండగా,. ఇదంతా గమనిస్తున్న వనిత కూడా ఆశ్చర్యంగా నగేష్ వైపు చూసి అది నిద్రపోతున్నప్పుడు నేను దూరంగా వచ్చి మీకు ఫోన్ చేసాను, ఆ విషయం ఎలా తెలిసి ఉంటుందో నాకు అర్థం కావటం లేదు,నేను మీతో మాట్లాడిన అన్ని విషయాలు హచ్చు గుద్ధినట్టుగా ఎలాచెప్పేసిందో.. అంటూ సౌజ్ఞలతో వాపోయింది భర్తతో.

“అది సరే కానీ హారిక.. నీ పెయింటింగ్ ఎక్కడి దాకా వచ్చింది, నీకు కాలక్షేపం బాగా అవుతోందా? ఇంకా ఏమైనా పెయింటింగ్ సీసాలు కావాలా?” అంటూ నగేష్ మాట మార్చేశాడు. అలా చాలాసేపు ముగ్గురూ కబుర్లు చెప్పుకుని రాత్రి భోజనం చేసి హరికను తన గదిలోనే ఉండనిచ్చి వీరు ఇద్దరూ హాలులో మాట్లాడుకుంటూ కూర్చున్నారు.

“ఇదేమిటి.. మనం మాట్లాడుకుంది తూచ తప్పకుండా ఇది ఎలా చెబుతోంది. ఏం జరిగింది. పైకి చూస్తే మామూలుగానే ఉంది కానీ ఏదో ఇబ్బంది మనకు ఎదురవుతోంది. రేపు మన ఫ్యామిలీ డాక్టర్ను కలిసి మాట్లాడుదాం.” అని అనుకుంటూ నిద్ర పోవడానికి ఉపక్రమిస్తుండగా హారిక ఉన్న గదినుండి మాటలు వినిపించడం మొదలయ్యాయి.

వనిత అదుర్దాగా నగేష్ వంక చూస్తూ “అదిగో ఏదో పిచ్చివాగుడు మొదలు పెట్టింది. దానిని ఒక్కత్తినే వదలకుండా మన దగ్గర పడుకోబెట్టుకుందాం. రేపు ఏదో ఒకటి చెయ్యాలి. లేకుంటే మన అమ్మాయి మనకు దక్కేట్టు లేదు, మీరు దాని గదిలో ఏంజరుగుతోందో నెమ్మదిగా వెళ్ళి గమనించండి. నాకు భయంగా ఉంది” అంటూ చెప్పింది.

నగేష్ మెల్లగా హారిక గదిలోకి తొంగి చూసాడు. హారిక టేబుల్ లాంప్ దగ్గరగా కూర్చుని ఎదురుకుండా ఎవరో ఉన్నట్టు, వారితో మాట్లాడుతున్నట్టు గడిపేస్తోంది.

“ఏమైంది హారిక.. ఇంకా నిద్రపోలేదా? ఎవరితో మాట్లాడుతున్నావ్?” అంటూ హారిక గదిలోకి అడుగుపెట్టాడు.

“డాడీ.. అక్కడే ఆగండి. నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నారా. డాక్టర్కు చూపించాలని అనుకుంటున్నారు. అమ్మ నా గదిలోకి రావటానికి ఎందుకు భయపడుతోంది? అదిగో నాకు ఎదురుకుండా తను కూర్చుంది. మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. మీరేమో అనుమానంగా చూస్తున్నారు.” అంటూ కాస్త కోపంగా నిగ్గతీసింది.

నగేష్‌కు దూరంగా గమనిస్తున్న వనితకు ఒక్కసారి బుర్ర తిరిగినంత పనైంది. ఇదేమిటిరా బాబూ.. ఏం మాట్లాడుకున్నా దీనికి ఇలా తెలిసిపోతోంది.. అంటూ గొణుక్కుంటూ ఆశ్చర్యపోయింది. ఈ సంఘటన చూసిన నగేష్ ఒక్క క్షణం స్థాణువులా ఉండి వెంటనే తేరుకుని

“హారిక.. నీకు భలేగా అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. ఇంతకూ నీకు ఎదురుగా ఉన్న ఫ్రెండ్ ఎవరు? పేరు ఏమిటి? మరి మాకు పరిచయం చేయవా? మరి మాకు కనబడటం లేదు? ఎందువల్ల” అంటూ హారిక నెత్తిమీద చెయ్యి వేసాడు.

“అదే డాడీ.. నిన్ను చూడగానే వెంటనే ఆ మల్లెపందిరి వైపు వెళ్ళిపోయింది. తన పేరు రోషిణి. నాలాగే ఇంటర్ అయ్యింది. ఇంకా ఎందులో చేరాలో నిర్ణయించుకోలేదు. చక్కటి అమ్మాయి. భలే కబుర్లు చెబుతుంది.” అంటూ ఎంతో గారంగా, మురిపెంగా కళ్ళు మెరిసిపోతూ చెప్పింది హారిక.

“అలాగా.. పోనీలే నీకు మంచి ఫ్రెండ్ దొరికిందిగా. నాతో పాటు పడుకో. నేను వెళ్లిన కాంప్ విశేషాలు చెబుతాను” అంటూ హారికను తనతో పాటు తీసుకుపోయాడు. ఆ రాత్రి ప్రశాంతంగా గడిచిపోయింది. హారిక హాయిగా నిద్ర పోయింది కానీ నగేష్‌కు ఒక్క కునుకు కూడా రాలేదు.

మరునాడు ఉదయం 8.30 కల్లా ముగ్గురూ కలిసి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వెంకట్రావ్ దగ్గరకు వెళ్లారు. హారిక నాకు సమస్య ఏమీ లేదు అంటూ కాస్త మొండికేసినా తరువాత వీళ్ళతోపాటే వెళ్లి చూపించుకుంది. అన్ని రకలుగాను హరికని చూసిన తరువాత నగేష్ ను పక్కకి పిలిచి ” నగేష్.. మీ అమ్మాయికి నా శిష్యుడు, సైక్రియాటిస్ట్ అయిన డాక్టర్ ఆనంద్‌కు చూపించండి. నేను ప్రత్యేకంగా మీ కేసు చూడమని చెబుతాను. మీరు ఏమీ కంగారుపడకండి తప్పకుండా తగ్గిపోతుంది.”అంటూ నగేష్‌కు భరోసా ఇచ్చి వెంటనే డాక్టర్ ఆనంద్‌కు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పి అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు నగేష్ వాళ్ళను వెళ్ళమని చెప్పాడు.

అలా ముగ్గురూ ఆ హాస్పిటల్ నుండి బయటకు వచ్చి ఇంటికి వెడుతూ దారిలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్లి దండం పెట్టుకుని బయటకు వస్తుండగా, పిచ్చివాడులా ఉన్న బైరాగి ఒకడు నగేష్ కు ఎదురయ్యి ”మీ అమ్మాయి వెనకాల అదే వయసున్న ఒక కన్నె దెయ్యం తిరుగుతోంది. అమ్మవారికి శుక్రవారం నాడు నిమ్మకాయలతో దండ వేసి పూజలు చేయించి, అదే దండ ఆమె మెడలో వేయించు. అది వదిలేస్తుంది. దానికి నచ్చిన చోటకు పోతుంది. నా మాట నమ్ము. అంతేకానీ ఉత్త వైద్యులను పట్టుకుంటే ఇది వదిలేది కాదు.” అంటూ జై.. మాత.. జై.. మాత అని అరుస్తూ వెళ్ళిపోయాడు.

నగేష్‌కు ఒక్క నిమిషం ఏమి చెయ్యాలో అర్థం కాలేదు, దగ్గరలో భార్య, కూతురు లేదు కదా అని అనుకుని దూరంగా వస్తున్న వాళ్ళను చూసి అమ్మయ్య అనుకుంటూ, ఇదేమిటి ఈ బైరాగి ఇలా ఎలా జరుగుతున్నది చెప్పాడు, నిజమేనా.. ఇలాంటివి ఉంటాయా? నమ్మాలా? నాకు దేముడిపై భక్తి ఉంది కానీ ఇంత నమ్మకాలు లేవు, కానీ ఇతను చెబుతుంటే ఏదో అనుమానం కలుగుతోంది. అనుకుంటూ అన్యమనస్కంగానే గడిపాడు.

మధ్యాహ్నం మూడు గంటలు అయ్యింది, అనుకున్నట్టుగానే డాక్టర్ ఆనంద్ ను కలిశారు. ఆనంద్ వాళ్ళ సంభాషణలు మొత్తం విన్న తరువాత నగేష్ దంపతులను బయటకు పంపించి హరికతో ప్రత్యేకంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.

“హాయ్ హారిక.. ఎలా ఉన్నావ్? ఏం చదువుతున్నావ్? అంటూ ఆనంద్

“డాక్టర్.. నేను బాగానే ఉన్నా, వీళ్ళే నాకు ఏదో ఉంది అనుకుంటున్నారు. నేను ఇంటర్ పాస్ అయ్యాను, ఇంకా ఇంజనీరింగ్‌లో జాయిన్ అవ్వాలి.” అంటూ హారిక

“అవునులే. నాకు అర్థం అయ్యింది నువ్వు చూస్తే చాలా చక్కగా,చలాకీగా ఉన్నావ్. వీళ్ళు నీకు ఆరోగ్యం బాగోలేదని అనుకుంటున్నారు. వాళ్ళ ఇద్దరి భయాలు మనమే పోగొట్టాలి. మరి ఇంజినీరింగ్ ర్యాంక్ మంచిది వచ్చిందా” డాక్టర్ ఆనంద్ ఆమెను పరిశీలిస్తూ.

“థాంక్యూ డాక్టర్.. మీరైనా అర్థం చేసుకున్నారు. నాకు ఇంజినీరింగ్ ర్యాంక్ మంచిది వచ్చింది. త్వరలో మంచి కాలేజీలో జాయిన్ అవుతాను” అంటూ నమ్మకంగా జవాబిచ్చింది.

“అది సరే.. ఇంత మంచి అమ్మాయి మీద అమ్మా, నాన్న భయాలు ఏమిటి? ఎందుకని నీకు ఏదో అయ్యిందని భయపడుతున్నారు? ఏం చేద్దాం వీళ్ళని? వీళ్ళ భయాలు ఎలా పోగొట్టాలి?” అంటూ నెమ్మదిగా పూర్తి సంభాషణలోకి దించాడు.

తాను చూస్తున్న విషయాలు, రోషిణి అన్న అమ్మాయి పరిచయం, అమ్మా, నాన్న అది నమ్మకపోవడం ఇలా ఎన్నో విషయాలు ఎంతో నమ్మకంగా, ఆత్రంగా చెప్పేసింది. ఆమె ఈ విషయాలు చెబుతుంటే ఆమె కళ్ళల్లో ఆనందం కనిపించడం గమనించాడు డాక్టర్ ఆనంద్.

“సరే.. హారిక. నేను మీ వాళ్లకు నెమ్మదిగా అర్థం అయ్యేలా చెబుతాను. కానీ వాళ్లకు నమ్మకం రావటం కోసం నువ్వు ఈ మందులు క్రమం తప్పకుండా వాడు. వాళ్లకు అనుమానం రాదు, ఇవేవీ ఇబ్బంది కలిగించే మాత్రలు కావు, బలం పెంచి,ఆకలి కలిగించేవే. మన ఇద్దరం మీ వాళ్లకు కలిగిన భయాలు, అనుమానాలు పోగొట్టేద్దాం. సరేనా? చిన్న గేమ్ ఆడదాం. నేను చెప్పినట్లు నువ్వు వింటే అంతా మంచే జరుగుతుంది. నేను రోజూ మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళ భయాలు కొద్దీ రోజుల్లో పొగిట్టేస్తా. నేనూ నీ ఫ్రెండ్‌ను కదా, అర్థం అయ్యింది కదా” అంటూ హారికని హుషారు చేసి బయటికు పంపాడు.

ఎంతో ఆనందంగా డాక్టర్ గదిలోంచి బయటకు వచ్చిన హరికను చూసి నగేష్ దంపతులు ఆనంద పడ్డారు.

ఇంతలో డాక్టర్ వీళ్ళని లోపలకి రమ్మండంతో హరికను బయట వదిలి ఇద్దరూ డాక్టర్ ను కలవటానికి లోపలకు వెళ్లారు.

“రండి నగేష్ గారు.. మీ అమ్మాయి హరికతో అంతా మాట్లాడాను. నాకు ఒక విషయం చెప్పండి, ఇలాంటి సన్నివేశం మీ వైపు దగ్గర రక్తబంధువులలో ఏమైనా జరిగిందా కనుక్కోండి. ఇలాంటి మనస్తత్వం చాలా కారణాల వల్ల వస్తుంది. ముఖ్యంగా ఎక్కువ ఖాళీగా ఉండే బాగా తెలివితేటలున్న వ్యక్తులకు సరైన పని లేకపోవడం వల్ల, లేదా ఇంటిలో ఏమైనా మానసిక సమస్యలు ఉన్న జీన్ ఉండటం వల్ల. దీన్ని ఇదివరలో మన పెద్ద వాళ్ళ భాషలో ‘చిత్ర భ్రమలు’ అంటారు. ఎవరో వాళ్ళకే కనబడుతున్నట్టు, వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, వాళ్లనే అనుసరిస్తున్నట్టు, ఇంకా చెప్పాలి అంటే ఏదో ఒక అదృశ్య వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్టు భ్రమ చెందుతారు. నిజానికి ఇదంతా అభూత కల్పన. వాళ్లకు ఈ సమస్య ఉందని, రోగంతో బాధపడుతున్నారని తెలియదు, ఒప్పుకోరు. దీనిని మా మెడికల్ భాషలో ‘స్కెజో ఫేనియా’ అంటారు.

ఈ సమస్యతో మీ అమ్మాయి బాధ పడుతూ మూడో స్టేజిలో ఉంది. ఇది సాధారణంగా ఏమైనా బలమైన సంఘటన చిన్నప్పుడు జరిగినా, లేక ఇంట్లో మానసిక సమస్యల ఇబ్బందులు వంశపారంపర్యంగా వున్నా, ఖాళీగా ఒక్కత్తినే ఉన్నప్పుడు ఏమైనా చూసి భయపడినా వచ్చే అవకాశం ఉంది.

మన మెదడులో ఎంజైములు స్రవిస్తూ ఉంటాయి, వాటి సమతుల్యత దెబ్బతిని ఒక్కో ఎంజైమ్ ఎక్కువగా స్రవించడం, లేదో ఒక్కో ఎంజైమ్ మరీ తక్కువగా స్రవించడం వల్ల ఇది వచ్చే అవకాశం ఉందని ఇప్పటి పరిశోధకుల సిద్ధాంతం.

మీ అమ్మాయికి ఆ మెదడు సమతుల్యత సరిచేసే మందులే నేను ఇచ్చాను, అవి కొంత కాలం వాడుతూ ఉండాలి. దీనితో పాటు సైకిక్ తెరపీ కూడా నేను రోజు వచ్చి ఇస్తాను, త్వరలో మీ అమ్మాయికి తగ్గిపోతుంది. మీ అమ్మాయిని ధైర్యంగా, ఉల్లాసంగా ఉండేట్టు చూసుకోండి. ఆమెకు నచ్చినట్టు, ఆమెకు ఇష్టమయిన పనులు చేస్తూ, మన దారిలోకి తెచ్చుకోవాలి. అలా కాకుండా బలవంతం చేసినా, భయపెట్టినా, కంగారుపెట్టినా మొదటికే మోసం వస్తుంది. నేను ఎలా చెప్పానో, అలా ఆమెతో ప్రవర్తిస్తే త్వరలో తగ్గిపోతుంది. కానీ మీ అమ్మాయి కేసు మొత్తంలో ఒక విషయం ఇంకా నా ఊహకు అందటం లేదు. అదేమిటంటే మీరు ఎక్కడో దూరంగా మాట్లాడుకున్న విషయాలు మీకు తూచా తప్పకుండా, అక్షరం పొల్లుపోకుండా చెప్పడం.. ఎలాగో ఊహించాలి.” అంటూ తన దీర్ఘ ప్రసంగాన్ని ముగించాడు.

నగేష్ దంపతులు ఈ విషయాలు అన్నీ విన్న తరువాత తమకు వచ్చిన సందేహాలను మరో సారి అడిగి తెలుసుకుని అక్కడ నుండి బయట పడ్డారు.

రాత్రి ఎనిమిది గంటలు అయ్యాయి, అప్పుడే భోజనాలు ముగించుకుని ఇల్లు అంతా సద్దుతుండగా, నగేష్ తన కూతురు హారిక ఏమి చేస్తోందా అని అనుకుంటూ హాల్లోకి రాగానే అక్కడ మెట్ల మీద కూర్చుని హారిక ఎవ్వరితోనో మాట్లాడుతూ కనిపించింది. ఆ ఘటన చూసి అదిరిపడ్డ నగేష్ మెల్లగా హారిక దగ్గరగా వెళ్లి నుంచున్నాడు. తండ్రి వచ్చిన విషయం గమనించకుండానే హారిక ఏదో విషయాలు గడగడా మాట్లాడేస్తోంది.

“హారిక.. నిన్నే, ఎవరితో మాట్లాడుతున్నావ్? ఏం మాట్లాడుతున్నావ్? నిజంగానే అక్కడ ఎవరైనా ఉన్నారా? నాకు కనిపించడం లేదు ఏమిటి?” అంటూ హారిక చెవిలో గొణిగాడు.

నెమ్మదిగా తేరుకున్న హారిక “డాడీ.. నువ్వు వచ్చావని రోషిణి ఇంకా చూడలేదు. అదిగో ఆ రెండో మెట్టు నీడలో కూర్చొని నాతో మాట్లాడుతోంది. నువ్వు గట్టిగా మాట్లాడితే వెళ్ళిపోతుంది” అంటూ నెమ్మదిగా చెప్పింది.

“అలాగా. సరే.. నేను నీ పక్కన కూర్చుంటాను, నువ్వు మాట్లాడు.” అంటూ నెత్తి కొట్టుకుంటూ హారిక పక్కన కూర్చున్నాడు. హారిక మాత్రం రోషిణి అన్న అమ్మాయితో కబుర్లు కొనసాగించింది.

ఇంతలో వంట ఇంట్లో పనులు ముగించుకుని, తన భర్త, కూతురు ఏమి చేస్తున్నారని బయటకు వచ్చిన వనితకు వీళ్ళ ఇద్దరి పరిస్థితి, హారిక మాట్లాడుతూ ఉండటం చూసి గుండె ఆగినంత పని అయ్యింది. ఆ కంగారులో అక్కడే సోఫా పక్కనే ఉన్న పూల కుండీని తన్నివేయటం వల్ల పెద్ద శబ్దం చేస్తూ పడి పగిలిపోయింది.

అకస్మాత్తుగా వచ్చిన శబ్దం వల్ల హారిక, నగేష్‌లు వాస్తవంలోకి వచ్చి హారిక కోపంగా “అమ్మా.. నువ్వు అలాంటి శబ్దం చెయ్యగానే భయపడి రోషిణి వెళ్ళిపోయింది” అంటూ తల్లి మీద విసుక్కుంది.

ఏదో చెప్పబోయిన వనితకు డాక్టర్ మాటలు గుర్తుకు వచ్చి”అయ్యో.. అలాగా. నాకు తెలియదు. నేనే ఏదో కంగారులో పడేశాను, ఈ సారి కంగారు పడి వెళ్లిపోవద్దని చెప్పు” అంటూ కాస్త అనునయంగా చెప్పి

“ఇంక చాలు వచ్చేయి, పడుకుందాం, నువ్వు మందులు వేసుకోవాలి” అంటూ ముగ్గురూ ఒకే గదిలో పడుకోవటానికి వెళ్లారు. హారికకు వెంటనే నిద్ర పట్టేసినా నగేష్ దంపతులకు చేరివైపు నిద్రపోకుండా ఎవరి ఆలోచనల్లో వారు ఉన్నారు.

అలా ఒక వారం గడిచింది. హారికలో పెద్దగా మార్పుఏమీ లేదు. కాకుంటే నగేష్ దంపతులు ఆమె చెప్పిన మాటలు నమ్ముతునట్టు నటిస్తుండటం వల్ల అంతా ప్రశాంతంగా నడిచిపోతోంది. ఇదంతా చూస్తున్న నగేష్‌కు మరోసారి ఆ దుర్గమ్మ గుడికి దగ్గరకు ఒక్కడే వెళ్ళాడు. ఈ సారి మళ్లీ అదే బైరాగి ఎదురయ్యి “ఏం నేను చెప్పింది వినవా.. తెగేదాకా లాగొద్దు. ఇలా ఇంకో పది రోజులు గడిస్తే నీ కూతురు నీకు దక్కదు. పూర్తిగా దాని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఆ సైతాను నీ కూతురి వయసుదే, ఎంతో భవిష్యత్ ఊహించుకున్న ఆమె అర్ధాంతరంగా చచ్చి, నువ్వు ప్రస్తుతం ఉన్న ఇంట్లో చెట్ల దగ్గర కాపు కాస్తోంది. దానికి మీ అమ్మాయి నచ్చింది. అందుకే వదలడం లేదు దానికి మీ అమ్మాయి కన్నా ఇంకోటి బాగుంటే అక్కడకు వెళ్ళిపోతుంది. ఈ సమస్యకు ఇదే పరిష్కారం. నా మాట నమ్ము. తొందరపడి నేను చెప్పింది చేయి. లేకుంటే ఇబ్బంది పడతావ్” అంటూ హెచ్చరించి వెళ్ళిపోయాడు.

ఇలాంటి విషయాలు తక్కువ నమ్మే నగేష్‌కు ఎందుకో ఆ బైరాగి మాటలు ఏదో తెలియని నమ్మకాన్ని కలిగించాయి. అది నిజమా.. లేక.. మూఢ నమ్మకమా.. అని ఆలోచించే దానికన్నా తన కూతురును దక్కించుకోవాలి అంటే ఇదీకూడా ఒక మార్గం, పోయిందేముంది, ఎలాగూ డాక్టర్ దగ్గరకు వెళ్ళాను,  ఆయన వైద్య పరంగా చూసుకుంటాడు, ఈ రకంగా ఇంకో ప్రయత్నం చేద్దాం., ఏమో.. ఏది నిజమో అని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చి శుక్రవారం ఇంకా నాలుగు రోజులు ఉందా అని అనుకుంటూ సాలోచనగా ఇంటి వైపు వెళ్లి పోయాడు.

అదే సమయంలో డాక్టర్ ఆనంద్ నగేష్ వాళ్ళ ఇంటికి వచ్చి హారికతో కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడు.

“హాయ్ హారిక.. నీకు పెయింటింగ్ బాగా వచ్చా? అంత బాగా వేస్తావా? ఏదీ నాకూ చూపించు” అని అనగానే హారిక ఉత్సాహంగా తాను పెయింట్ చేసిన చిత్రాలు అన్నీ తీసుకు వచ్చి చూపించింది. నిజంగా అద్బుతంగా గీస్తుంది, హారిక టాలెంటెడ్ గర్ల్ అని అర్థం అయ్యింది. ఆమె ఎదుట మనిషిని అలాగే అచ్చు గుద్దినట్టుగా గీసేస్తుందని అర్థం అయ్యింది.

“హారిక ఇంత బాగా వేస్తావా? నేను ఏదో సామాన్యంగా ఊహించాను. కానీ ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు. మీ అమ్మ, నాన్న, తాత గారుల అందరి ఫోటోలు అద్బుతంగా గీసావ్. మరి నా ఫోటో ఎప్పుడు గీస్తావ్. ప్లీజ్ వెయ్యవా.” అంటూ హారికను ఉత్సాహపరిచాడు. అది విన్న హారిక ఇంకా సంబరపడిపోతూ

“సార్.. ఎవరి ఫోటో అయినా పెన్సిల్ ఆర్ట్ అయితే ఒక గంటలో, అదే ఆయిల్ పెయింట్ అయితే ఒక్కో దానికి నాలుగు గంటలు పడుతుంది. నేను గట్టిగా శ్రమ పడితే ఒకే రోజు రెండు ఆయిల్ పెయింటులు వెయ్యగలను. నాకు వీటి పోటీల్లో చాలా బహుమతులు వచ్చాయి” అంటూ వివరించింది.

“వావ్.. అలాగా మరి. అయితే నాది ఆయిల్ పెయింట్ వెయ్యి. మా ఆసుపత్రిలో పెట్టుకుంటాను. కింద నీ పేరు రాయి. నేను అందరికీ గొప్పగా చెబుతాను. మరి నాకు ఎప్పుడు ఇస్తావ్. నీకు ఫోటో ఏమైనా కావాలా,? లేక ఎదురుకుండా ఉండాలా?” అంటూ హారిక టాలెంట్‌కు ముగ్దుడవుతూ అడిగాడు.

“ఏదైనా పరవాలేదు, అయినా డాక్టర్ మీరు బిజీగా ఉంటారుగా మీ ఫోటో ఇవ్వండి రేపటికల్లా వేసేస్తాను.” అంటూ చాలా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.

“మరి అలా అయితే నీ కొత్త ఫ్రెండ్.. అదే రోషిణి ఫోటో కూడా వేసేయ్. ఈ సారి అయినా మీ అమ్మా, నాన్నలకు కనిపిస్తే గుర్తుపడతారుగా, అలాంటిది ఎవ్వరూ లేరు అని వాళ్ళు అనుకుంటున్నారు కదా అర్థం అయ్యేలా చెబుదాం” అంటూ మెల్లగా హారిక చెవిలో చెప్పాడు.

“బ్రిలియంట్ ఐడియా సార్.. నిజమే కదా, నాకు ఈ ఆలోచన రాలేదు. రేపు మీది, రోషిణిది ఇద్దరివి కాన్వాస్ పెయింటింగ్ వేసేస్తాను. అప్పుడు తెలుస్తుంది. ఎస్.. రేపు సాయంత్రంకల్లా ఇచ్చేస్తా” అంటూ ఉత్సహంగా చెప్పింది హారిక.

అలా వాళ్లిద్దరూ ఇంకొంచెం సేపు మాట్లాడుకుని డాక్టర్ వెళ్ళి పోగానే పెయింటింగ్ వేయటానికి సన్నాహాలు మొదలు పెట్టింది. అలా ఆ రోజంతా గడిచిపోయింది, హారిక పెయింటింగ్ వెయ్యడంలో పూర్తిగా మమైకం అయిపోయింది. డాక్టర్ చెప్పిన సలహా మేరకు ఎవ్వరూ హరికను ఇబ్బంది పెట్టకుండా వదిలేశారు.

మరునాడు మధ్యహ్నం మూడు గంటలు అయ్యింది. డాక్టర్ ఆనంద్ అనుకున్నట్టుగానే వాళ్ళ ఇంటికి వచ్చాడు. హారిక రెండు పెద్ద కాన్వాస్ పెయింటింగ్స్ పట్టుకుని డాక్టర్ ముందు పెట్టింది. ఆనంద్ ఆ పెయింటింగ్ చూడగానే ఒక్కసారి ఆమె టాలెంట్‌కు ఆశ్చర్యపోయాడు. తన ఫోటో అచ్చంగా వేసేసింది. హరికను అభినందనలతో ముంచెత్తాడు. తరువాత పెయింటింగ్ చూడగానే ఒక అమ్మాయి చాలా అందంగా హారిక గదిలో కూర్చున్నట్టుగా ఉంది. అక్కడున్న అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. నిజంగానే ఎవరో అమ్మాయ్ వచ్చి పెయింటింగ్ వేయించుకున్నట్టుగా ఉంది.

“వావ్.. ఈమె రోషిణి కదా.. ఎంత అందంగా ఉంది. ఇంతకూ ఏం చదువుతోంది? ఏ కాలేజ్ కనుక్కున్నవా? వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కున్నావా? నిజంగా ఇంత అందంగా ఉంటుందా ఈ అమ్మాయి.. ఈ సారి వచ్చినప్పుడు మమ్మల్ని కలవమను” అంటూ హారికను పొగిడాడు.

“నిజమే డాక్టర్.. నేను ఎప్పుడూ తాను ఏమి చదువుతుందో, ఎక్కడ ఉంటుంది, ఏ కాలేజ్ కనుక్కోలేదు. ఈసారి కనుక్కుంటాను. నిజంగానే ఆమె అందగత్తె. అందుకే మీకు అంతగా నచ్చింది”అంటూ హారిక ఎంతో ఉల్లాసంగా కనిపించింది. అలా ఆరోజంతా అవే విషయాలు చర్చిస్తూ గడిచిపోయింది.

మరునాడు అదేవిధంగా మరోసారి డాక్టర్ ఆనంద్ రావటం హారికను కలవటం, హారిక ఎందుకో కాస్త నిరాశగా కనిపించడం డాక్టర్ ఆనంద్ గమనించాడు. “ఏమైంది హారిక.. ఏదో హుషారు లేకుండా ఉన్నావ్? ఏమైనా జరిగిందా?” అని అనగానే

“అవును డాక్టర్.. రోషిణికి కోపం వచ్చింది. తన ఫోటో వేసి మీకు అందరికీ చూపించినందుకు చికాకు పడింది. అదీకాక తన విషయాలు అడగగానే ఎందుకూ, అంటూ కొప్పడింది కూడా. ఆమె అలా ఎందుకు అన్నదో నాకు అర్థం కాలేదు. అయినా మనమేమీ ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఆమెను అడగలేదు. అయినాగానీ కోపం వచ్చేసింది ఆమెకు. ఆ విషయం వల్లే నాకు చికాగ్గా ఉంది.” అంటూ కాస్త నిరుత్సాహంగా చెప్పింది హారిక.

“ఓహో అలాగా.. మరి నీ ఫ్రెండ్ అన్నావ్, వేసిన బొమ్మ తనదే కదా, వాళ్ళ ఇల్లు ఎక్కడ, ఏ కాలేజ్, ఏం చదువుతోంది ఇవేకదా ఆడిగావు. ఇందులో రహస్యం ఏముంది. ఈ పాటికే కోపం వస్తే ఎలా.. అసలు ఆమె నీ ఫ్రెండేనా.. సరేలే వదిలేయ్. బహుశా ఈసారి చెబుతుందేమో చూద్దాం.” అంటూ తన చేస్తున్న ప్రయత్నం, వైద్యం ఫలిస్తున్నాయని బొటన వేలు పైకి చూపిస్తూ నగేష్ దంపతులకు సౌజ్ఞ చేసాడు.

అలా ఇంకో రెండు రోజులు గడిచాయి. హారిక రోజూ విసుగు చెందిన దానిలాగా తయారయ్యింది. తాను రోషిణిని ఆ విషయాలు ఎప్పుడు అడిగినా కోపగించుకుని వెళ్లిపోవడం, ఏమీ చెప్పకపోవడం హారిక గమనించింది.

ఈలోగా శుక్రవారం రానే వచ్చింది. అనుకున్నట్టుగానే నగేష్, హారికను దుర్గాదేవి గుడికి తీసుకువచ్చాడు.

అక్కడ నిమ్మకాయల దండ పెద్దది చేయించి అమ్మ వారి మెడలో వేసి శాస్త్రోక్తంగా పూజ చేయించాడు.

అంతా అయిన తరువాత అమ్మవారి కుంకుమ హారికకు పెట్టి అమ్మ వారి మెడలో ఉన్న నిమ్మకాయల దండను ఆమె మెడలో పూజారి గారి ద్వారా వేయించాడు. ఇదంతా చూస్తున్న హారికకు “ఇదేంటి నాన్న.. ఏదో కొత్తగా ఉంది. ఇలాంటి పూజ ఏమిటి? ఈ దండ ఏమిటి? నాకు ఏమయ్యింది?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. హారిక వేస్తున్న ప్రశ్నలకు మౌనంగానే నవ్వే జవాబుగా ఇచ్చి ఊరుకున్నాడు. నగేష్.

అలా పూజ తతంగం అంతా పూర్తి అయి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళడానికి కారు ఎక్కబోతుండగా అదే బైరాగి ఎదురు వచ్చి” కడిగిన ముత్యంలా మారింది. ఇంక మళ్లీ ఆ ఇబ్బంది రాదులే. ఆ పిల్ల పిశాచం దారి మరల్చుకుంది. శుభం.. అమ్మా.. దుర్గమ్మ తల్లీ.. నువ్వు చల్లని తల్లివమ్మా” అంటూ హారికను చూసి నగేష్ వైపు తిరిగి అరుస్తూ అక్కడినుండి వెళ్లి పోయాడు.

“అదేంటి నాన్న. ఆ బైరాగి ఏమిటీ అంటున్నాడు? అని హారిక ప్రశ్నకు నగేష్ నవ్వుతూ “ఏదంటే ఏముంది. అంతా మంచే జరిగిందని అన్నారుగా, వదిలేయ్. ఇంక రా. ఇంటికి పద, వెడదాం” అంటూ ఇంటివైపు దారి తీసాడు. ఇంక ఆరోజు మధ్యాహ్నం మరోసారి డాక్టర్ ఆనంద్ రావటం జరిగింది.

“హారిక.. ఎలా వున్నావ్. ఎలా ఉంది నీ ఫ్రెండ్, ఏమంటోంది.”అన్న డాక్టర్ మాటలకు

“డాక్టర్.. అదేదో కలలాగా ఉంది. ఆమె నాకు కనిపించడం మానేసింది. నాకు మంచి నిద్ర పడుతోంది. ఏదో తెలియని ఆనందంగా ఉంది. ఈ సారి కనిపిస్తే చెబుతాను.” అంటూ రోషిణి కనిపించడం లేదు అన్న బాధ కూడా లేకుండా మాట్లాడింది. హారిక. హారిక మాటలు విన్న నగేష్ దంపతులు ఆనందంగా డాక్టర్‌కు నమస్కారం పెట్టారు. డాక్టర్ ఆనంద్ బయటకు వస్తూ నగేష్ ను బయటకు రమ్మని సైగ చేసాడు.

“నగేష్ గారు. హారికకు పూర్తిగా నయమయినట్లే, ఇంక ఆ అమ్మాయి జ్ఞాపకాలు నెమ్మదిగా అసలు గుర్తు లేకుండా పోతాయి. ఆ మందులు ఇంకో నెల వాడండి. ఆమెను ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోండి. మీ అమ్మాయిలో మంచి టాలెంట్ ఉంది. దాన్ని ప్రోత్సాహం చేయండి. ఉంటాను. బహుశా నా అవసరం ఇంక ఉండక పోవచ్చు” అంటూ తన కారు ఎక్కపోతూ మల్లె పందిరి ఉన్నచోట ఎవరో అలికిడి అయినట్టుగా తేరిపార చూసి వెళ్లి పోయాడు.

అలా డాక్టర్ వెళ్ళగానే పెద్దగా నిట్టూరుస్తూ నగేష్ లోపలకి వచ్చి హారిక ఎక్కడుందా అని చూస్తే కొత్త పెయింటింగ్ వేస్తూ చాలా నిర్మలంగా కనిపించింది.

“అమ్మయ్య.. సమయానికి మంచి డాక్టర్ గారు తారసపడ్డం వల్ల మన అమ్మాయి మనకు దక్కింది. లేకుంటే ఏమి అయ్యేదో. అంతా బాగానే ఉంది కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థం కాలేదు. మనం ఇంట్లో ఏమి మాట్లాడుకున్నా హారికకు అక్షరం పొల్లుపోకుండా ఎలా తెలిసేది. దీనికి సమాధానం  డాక్టర్ ఆనంద్ కూడా చెప్పలేదు. ఈ సారి కలిసినప్పుడు అడిగి తెలుసుకోవాలి.” అని హాయిగా పెద్ద భారం దిగిపోయినట్టు నిట్టూర్చింది హారిక తల్లి వనిత.

వనిత మాటలకు నగేష్ నవ్వుకుంటూ హాలులో కిటికీ గుండా మల్లె పందిరి వైపు చూసి నిట్టూర్చాడు. అలా వారి ఇంట నుండి వెళ్లిన డాక్టర్ ఆనంద్ నేరుగా తన క్లినిక్ కు వెళ్లి పేషంట్లను చూడటం మొదలు పెట్టాడు. హాలులోకి తొంగి చూసి ఇంకా నలుగురు ఉన్నారు అని అనుకుంటూ గబగబా ముగ్గురిని చూసేసి మిగిలిన నాలుగో వాళ్ళని పంపమని అక్కడ ఉన్న రిసెప్షన్లో చెప్పాడు.

“డాక్టర్ సర్.. అందరూ అయిపోయారు. ఇంకెవరూ లేరు. మీ గురించి ముగ్గురే ఇక్కడ ఉన్నారు.”

అంటూ వచ్చిన సమాధానం విని ఆశ్చర్యంగా నేను నలుగురిని చూసాను కదా.. మరి నాలుగో వారు ఏమయ్యారు అని అనుకుంటూ హాలులోకి వచ్చి చూడంగానే అక్కడ బెంచీ మీద రోషిణి కూర్చుని ఉంది.

అరే.. ఆమేనా.. నాకు కనిపించడం మొదలు పెట్టిందా.. ఇదేమిటి అని అనుకుంటుండగానే రోషిణి నవ్వుతూ చెయ్యి ఊపడం చూసి తన గదిలోకి వెళ్లి ఆలోచనలో పడ్డాడు.. డాక్టర్ ఆనంద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here