మాయక్క కాపురం

2
9

[dropcap]మా[/dropcap]యక్కని కాపురానికి అంపిచ్చి ఈ పొద్దుటితో సరీగ రెన్నెళ్ళాయ. ఐనాగానీ, మాయమ్మ- నాయన అక్కని మర్సిపోల్యాక పూటకి పదిమాట్లు నెపుకి(1) సేసుకుంటావుండారు…  ‘సాయిత్రి’ వున్నప్పుడు సిన్నపని.. పెద్దపని సేసుకుంట ఇంట్లో పారాడుతుంటే, అచ్చం ఆ లచ్చిందేవే తిరగాడుతున్నట్లుండి ఇల్లంత ఎంత కళకళ్లాడిపొయ్యేది! పాప కాపురానికని కడపమాను దాటిందే కడా.. ఇల్లంత బోసిపొయ్యి, యాడో.. పాడుబడిన కొంపలో తల దాసుకున్నట్ల గుబులు.. గుబులు అయితుండాది. ఇంట్లో నిమిషం కాలు పెట్టి నిలుతామంటే నిలబుద్దికాకున్నట్లు ఉండాదం’టా ఒగటే యదారు(దిగులు) సేత్తుండారు.

మొన్న ‘గాలెన్న’న్న పెండ్లాం రంగమ్మొదిన కూరగాయలు అమ్మేకి ‘ముత్తుకూరు’కి పోతుండాదని తెలిసి ‘మా సాయిత్రి యట్లుండాదో కనుకోని రా’మని, అమ్మనాయన సెప్పులరిగేతట్ల తిరిగినారు వాళ్ళింటికి.

ఆ వొదిన- ‘అంతగా సెప్పాల్నా అత్తా! ఆ మాత్రం నాకి తెల్దా? నాను ఆడపిల్లని కానా!? కనుకోని మాపుసారి(సాయంత్రాని)కి ఇంటికొత్తాన్ల్యా!’ అని గంప నెత్తి పెట్టుకోని యాపారానికి పొయ్యింది.

మాపుసారి ఇంటికొచ్చి, “సాయిత్రి’ని ఇచ్చిండే గేరి(2) లేకి పోయింటి అత్తా! వాళ్ళు ఇంటికి బీగాలేసి తోటకి పోయిండ్రి. ఓర్నీ ఇదేం గాశారమప్పా నాను వొచ్చిన్నాడే ఇట్ల జరగాల్నా! అని ఆలోసన సేసి పక్కనింటోళ్ళని ‘మా వూరి పాప యట్లుండాది..? పెండ్లాం-మొగుడు ఇద్దరు బాగుండారు కదా..’ అని ఇశారిత్తే, ‘ఓ.. వాళ్ళకేమి ఆలు-మగలు అనుకూలంగే వుండారుల్యా! న్యాత(3) పాపని వాళ్ళత్తమామలు గూడ కష్ట పెట్టకుండ సెప్పి ఒపిచ్చుకునే రకమేగాని, మరీ అంత య(వ్య)త్యాసం మనుషులైతే కాదని సెప్పుకొచ్చిరి. మన పాపగూడ అందర్లో కల్సిపోకుంట ఆ గేర్లో మంచి పేరే తెచ్చుకునేదని ఇరుగుపొరుగంతా ఒగటేమాట సెప్పిరి సూడత్తా! మనకింతకంటే ఇంగేం కావల్ల సెప్పు! నానుగూడ పెండ్లప్పుడు పనుండి రాల్యాకపోతినని, వాళ్ళ ఇండ్లు వాకిల్ని బయట్నుంచే అంత పార సూసొస్తి. ఆ మాత్రం ఇల్లు మనోళ్ళలో ఎవురికి వుండాది సెప్పు.. వాటం తప్పయితే మనింట్లోనన్న బువ్వుంటే పొప్పుండదు.. పొప్పుంటే బువ్వుండదు. వాళ్ళకేమి ఆ ఇల్లు సూస్తే మనూరి పెద్దరొద్దాళ్ళ కంటే గెట్టిగ కనపతుండారు. ఐనా ఇట్లా టెయింలో మన పిల్లగురించి పట్టీపట్టనట్లుంటేనే మనకి మంచిది సూడత్తా! ఆపాపే మొగుని మర్లుతో.. తన మొగుడు, తన అత్తమామలు, తన సంసారం అని ‘సంసారం’లో ఇమిడి పోతాది. అట్లగాకుండ మీరు ఆ పాపని మర్సిపోకుండ యాయాళ పొద్దున యదారు సేసుకుంట వాళ్లతో వీళ్ళతో సెప్పంపుకుంట వున్నారనుకో, మనల్ని మర్చి మడ్సానంగ కాపురం సేసే

పిల్ల సంసారాన్ని, మనమే సెయ్యిచ్చగ(4) సెడుపుకున్నట్లయితాది సూడండం’టా ఎచ్చరించి ఆ వొదిన ఇంటికి యల్లబారిపొయ్యింది.

ఆ వొదిన సెప్పి పొయ్యినంక అమ్మనాయనల మనసు తేలికపన్నట్ట్లై మొఖాల్లో రోంత కళ కనపడింది. బాగ ఆలోసన సేసి ఆ వొదిన సెప్పింది కూడా ‘రైటే’ల్యా అనుకున్యారు. ఇంగ ఆ పొద్దునుంచి అక్క గురించి యదారు సేసేది తగ్గిచ్చి మెల్లం..గ సేన్లకి పొయ్యి, కొయ్య-కంప ఏరుకునే పనుల్లో మునిగిపోయినారు.

దినాలు గడ్సిపోతావుండంగ.. వానలు పడి వంకలు దొల్లినాయి. ఈ యేడు వానదేవుడు సరైన కార్తిలో తొంగిసూసినాడని, సంకలు గుద్దుకుంట రైతులు ఇత్తనాలు సల్లుకోని, భూమిలో నుంచి ఎగిసొచ్చే మొలకల్ని సూసి, నీదింత-నాదింత అని ఆశలు పెంచుకుంటా వుండారు.

ఆపొద్దు నాను మా పెద్ద కట్ట(అరుగు) మింద కుసున్కోని ‘హోంవర్క్’లు రాసుకుంటా వుండాను. పొయ్యికాడ వంట సేస్తున్న మాయమ్మ ‘ఒ(వ)రే

రామాంజి..!’ అని క్యాకేసి పిల్సి ‘దసరా’ పండగ యన్నాళ్ళుండాదో తెల్సా నాయనా నీకి?’ అని అడిగింది.

నాను- ‘నాకి తెల్దు మ్యా(అమ్మా), బళ్ళో సారొళ్ళు ఇంగా సెప్పలేదం’టి.

బాగనే ‘పత్తికొండ’ బడికి పొయ్యి సదువుకుంటుండావు కద నాయనా! అది గూడ తెల్దా నీక’ని కసురుకున..!

బళ్ళో సారొళ్ళు ఎవురన్న సెప్పింటే నాకి తెలుస్తుండ. వాళ్ళెవరు సెప్పలేదనుకుంట ఆడే నిలబడితి.

‘నెత్తి గీరుకుంట బాగ నిలబన్నావుగానీ ఆడ.. రామన్న తాతని అడిగి రాపో’మనింది. సరే మా! అని ఒంటికాలి మింద పొయ్యి ఆ తాతని అడిగితే, ఆ తాత.. గోడకుండే క్యాలండర్ని తిరగేసి సూసి, ‘రేపొచ్చే శనారం గాక వచ్చే శనారమే పండగ సిన్నోడా. ఈ పొద్దుటికి సరీగ పద్దినాలుండద’ని సెప్పినాడు. వురికీతొచ్చి(5) అదే మాట అమ్మతో సెప్పినాను.

అమ్మ- ‘అట్లయితే మీ నాయన్ని రేపు శనారం పోయి, అక్క బావల్నిని పిల్సుకురమ్మంటాన’ని ఆ..త్రపడుకుంట సెప్పింది.

అక్కా బావలు పండక్కి వొస్తుండారంటే నాకి శానా సంబరం అయితుండాది. ఈ రొన్నాళ్ళు వాళ్లకేలోటు రాకుండ సూసుకోవల్ల. అక్కకి ఈ కాలంలో సిక్కే అన్ని రకాల పొం(పం)డ్లు పెరుక్కోరావల్ల, రాతనొళ్ళ సేన్లో రకరకాల పూల సెట్లు ఏసినారు. అక్క ‘జడ’కని ‘సంద్రమ్మ’క్కని అడిగి, దినాము ఒగ రకంపూలు కోసుకొచ్చి అక్క సేతిలో పెట్టల్ల. బావకి మా వూరంత తిప్పి గుళ్ళూ- గోపురాలు సూపీయల్ల, అట్లే ‘దెయ్యాలబండ’ కాడుండే పెద్ద సింత సెట్టులో కొటారు కొమ్మకి పెద్ద తాని(6) పోసుండాది. దాన్ని ‘మ్యాకల రంగసామి’ని పిల్పకపోయి సోపుకోనొచ్చి బావ నోరు తీపి సేయల్ల, మా వూరి అంద్రి (హంద్రి నది)లో శ్యాపలు బో(బలే) రుసుంటాయి ల్యా! జతాగాళ్ళని ఎంటేసుకోనిపోయి ఒగ గంపకి పట్టుకోనొచ్చి, ఆ శ్యాపలు రుసేంటో బావకి సూపీయల్ల, ఎంత బలవంతుడైనా ఇవతల గడ్డ మింద నుంచి అవతల గడ్డకి రాయి ఇసర్లేనంత పే..ద్ద రొడ్డల్ల బాయిండాది. ఆ బాయికి బావని ఈతకి పిల్సుకుపోవల్ల. అంత పెద్ద బాయిలో ఆ గడ్డనుంచి ఈ గడ్డకి రొండు సుట్లు ఆపకుండ ఈతకొట్టి బావతో శభాష్ బామ్మర్టీ..! అని అనిపించుకోవల్ల… ఇట్లా పండగలో అక్కా బావల్తో యట్లెట్ల గడపల్నో తల్సుకుంటుంటే మనసుకి యక్కల్లేని ఉల్లాసమొచ్చి కాళ్లు న్యాల మీద నిలబడడం లేదు. ఆ ఉసుల్తో.. సరీగ నా దమ్ములెత్తుండే మా పెద్దకట్టని మూరెడు సందు(గ్యాప్) పెట్టుకోని కుప్పలిచ్చి ఎగిరి, అట్ల.. స్టై..ల్ గ జులపాలెగరేసినాను సూడు!…

శనారంనాడు నాయన ముత్తుకూరికి పోతే, బావ- ‘సేన్లో శానా పన్లుండాయి… నాను ఈ పండక్కి రాలేనుల్యా మామా! ఇంగో పండక్కి వస్తాన్ల్యా’ అని సెప్పి అక్కనొకదాన్నే అంపినాడు.

అక్క వస్తా..వస్తా.. నా కోసం కారాలు.. బొరుగులు, బాలేపొండ్లు తెచ్చింది. నాను లొట్టలేత్తా సంచి అందుకుంటి. పనులు ఎక్కువ వుండబట్టో ఏమో! అక్క ముందుమాదిర్గ కాకుండ మనిషి తగ్గినట్ల కనపడ!

ఊర్లో.. పండగ సంబరంగనే జరుగుతుండాది గాని, అక్క ఏమంత సంతోషంగ ఉన్నట్ల కనపల్యా! ఆ మాటే అమ్మ అక్కని అడిగితే, అట్లాదేమిలేదుల్యామా! అని మాట దాటేసింది. అమ్మకేమో అనుమానమొచ్చి సంగతేమో కనుకోమని ‘ప్రమీల’త్తతో సెప్తే, ఆయత్త ఇంటికి పిల్పకపొయ్యి ఆరాతీస్తే..,

‘తొలుత రెన్నెల్లు నాతో బాగనే వున్యాడు. రాంగ..రాంగ రాజు గుర్రం గాడిదయినట్ల.. ‘అయ్య’ది అసలు రంగు బైటపడింది! తాగటం, ప్యాకాట, సుట్టంరాళ్ళ(7) తో సావాసాలు… అన్ని అలవాట్లుండాయి ఆ మొగోనికి. అవును.. పొగులంత గాడిద పనిసేసొచ్చి, ఇంటికాడ నా కోసం ఒగ ఆడది ఎదురు సూస్తుంటాదే, అరే! అది తినిందా లేదా అనే ద్యాస కూడ లేదా.. మనిషికి! సిల్లరొల్ల జత గట్టి తాగితందనాలాడి సగరుపొద్దు(8) కాడ ఇంటికొచ్చి, మనిషిని నిద్ర పోనీకుండ నోటికొచ్చినట్ల తిడుతా వుంటాడు. కడుపునిండ తిండి తిని, కంటార నిద్రపొయ్యి యన్నాళ్ళాయనో..! ఏమిటికిట్లా..ని అడిగితే, పెద్దమొగోన్లక్క వివరము అడుగుతావా? అని సేతికి ఏమి సిక్కితే దాంతో కొడతాడు. ఎవ్రుతో సెప్పుకోను నా బాధని?! దినాము తన్నులు తినేదానికి నానేమి యనప గొడ్డు’ని కాదు తల్లీ..! ఆవూరికో దండం, ఆయప్పకో దండమ’ని ఏడ్సుకుంట విషయమంత యల్లకక్కి, ‘అసలు కాపురానికే పోన’ని అక్క మొండికేస్కోని కుసునింది.

నాయనకి విషయం తెలిసి బాధపడ్డా.. బాగ ఆలోసన సేసి అక్కని వద్దకి పిల్సుకోని, ‘సూడు సాయిత్రి..! ‘సంసారం’ అన్నంక ఇట్లా.. సిన్నాసితక సిక్కులు మామూలే తల్లి..! నీకో మాట సెప్తాను మనసు పెట్టి ఇనమని… ‘సేన్లో ‘ఇత్తనం’ సల్లుకున్నంక అది బాగ ఎదిగొచ్చేదానికి.. సరైన అదున్లో సేద్యాలు సేయడం, కలుపు ఏరేయడం, బలం కోసం ఎరువులు సల్లడం, సీడ-పీడ పడితే తగినంత మందులు కొట్టుకోవడం, అడ్డమైన పచ్చులు- పశువులు పడి మేయకుండ సుట్టు కంప నాటుకోవడం, బెదుర్లు(9) కట్టడం.. ఇట్ల.. ఎన్నో కష్టాలుపడి పంటని కాపాడుకుంటాం కదా! మూన్నెళ్ళ పంటని సెయ్యి సిక్కిచ్చుకునేదానికే మనం ఇన్ని యతలు పడాల్సొస్తుంటే..; ‘పెండ్లంటే నూరేండ్ల పంట’ని అంటారు కదా మన పెద్దలు! మరి అన్నేండ్ల ‘పంట పండల్లంటే మనం ఇం..గెంత జాగర్తగ కాపాడుకోవల్నో ఒక్క పా(సా)రి ఆలోసన సెయ్యి తల్లీ..!’ నీ మొగుడు దినాము తాగొచ్చి, తిడుతుండొచ్చు.. కొడుతుండొచ్చు. దానికి నీ మనసు అరె, సుట్టుపక్కల అందరి సంసారాలు బాగుండాయి.. నా కాపురమేంటికిట్లా కాలబడిందనే బాధుండొచ్చు. దాన్ని నాను కాదనను. కానీ ఇట్లా తప్పుడే తెలివిగా ఆలోసించి మసులుకోవల్ల, అదే ‘జీవితం’!’ అంటా.. నాయన, పెద్దల కాలంలో జరిగిన ఒక కథ సెప్పడం మొదల్పెట్నాడు…

అనగనగా ‘దేవనకొండ’ట్లా ఊర్లోన, ఎత్తుకి ఎత్తు, లావుకి లావుండి కండలు పురి తిరిగిన పెద్ద పాలేగాడు ఉండేవాడంట. కత్తిరి జులపాలు ఇడ్సుకోని తెల్లటి బట్టలు.. కిరికిరి సెప్పులేస్కోని, బొడ్లో పిడిబాకు పెట్టి, మెడకి సెలకాల తగిలిచ్చుకోని, సేతిలో రాగాల కట్టి పట్టుకోని బో(10) గంభీరంగ బయలెల్లేవాడంట! పతి ఊర్లోన.. ‘బొడ్రాయి’కాడ నిలబడి నాతో కలబడే దమ్మున్నోడెవడైనా వుంటే బయటికి రమ్మని తొడకొట్టి, మీసం దువ్వి మరీ పిల్సేవాడంట! సుట్టుముట్టు పదారు పల్లెలొల్లు ఆ మనిషి ఎదురుపన్నాడంటే, భయంతో యక్కడొళ్ళు అక్కడే పిల్లుల్లక్క అణిగేవాళ్ళంట!’

అట్లాంటోనికి పెండ్లి సేయల్లని వాళ్ళ పెద్దలు ఆలోసన సేసి, ఆ పాలేగాన్ని యంటేస్కోని పిల్ల పెత్తనాల కోసం ఊర్లమీదపడి తిరుగుతుండారంట. ఈ రౌడీ నాయళ్కి పిల్లనిచ్చేకన్నా యాడన్న మెట్లులేని బాయిలేకి దొబ్బేది మేలని, ఎవరూ పిల్లని ఇచ్చేకి ముందుకి రాలేదంట! ఎన్నూర్లు తిరిగి ఎవుర్నడిగినా, పిల్ల లేదని సెప్తావుండారంట. ఇంగెట్లప్పా! ఇంతలేసిన పాలేగానికి పిల్ల పుట్లేదంటే మంది నగరా (11) అని ఆలోసన సేత్తుంటే, కడాకి ఒగ ఊర్లోన మన సరోజమ్మ బిడ్డ ‘శ్యామలక్క’!.. పాప ఆ మనిషిని సూస్తానే మోజుపడి మనసు పారేసుకోని, ఆ మాట వాళ్ళ పెద్దలో సెప్పి అతనికి నన్నిచ్చి పెండ్లి సెయ్యండని కోరిందంట.

వాళ్ళు- ‘వొద్దమ్మా! సూస్తా..సూస్తా ఆ కసాయోనికిచ్చి నీ గొంతు కొయ్యలేము ల్యా తల్లీ..! వాడు మంచోడు కాదు, రౌడీ నాయాళు.. వాంతో నువ్వు కాపురం సెయ్యలేవ’ని, అతని గురించి అన్ని విషయాలు సెప్పినారంట. అయినా, ఆయమ్మ మొండిపట్టుదల పట్టి అతన్నే పెండ్లి సేసుకుందంట! ఆ పాప కాపురానికి పోతుంటే, ఊర్లోవాళ్ళంత ‘బంగారమట్లపిల్ల జీవితం ఆ కీసకుడి సేతిలో పడేతట్ల రాసిపెట్నాడు ఆ గుడ్డి దేవుడ’ని అంగలాసినారంట! అట్ల.. కాపురానికి పోయిన పిల్లని ‘తొలిరాత్రి’ నుంచే తాగొచ్చి, కొట్టడం మొదలు పెట్నాడంట! ఆ పాలేగాడు..

ఐనా, సుట్టుపక్కలోళ్ళు కాపాడుతారని గానీ, వాళ్ళ జాలి, దయలు ఆశించేది కాదంట పాపం ఆయమ్మ. తనని ఎంత కొట్టినా బాధపడక, యానాడయితే తలొంచి అతన్తో తాళి కట్టిచ్చుకున్నానో ఆనాడే ఈ పాణం తనది. తను తన్నుకుంటాడు, ల్యాకపోతే సంపుకుంటాడు! అదంత తనిష్టం! అనేదంట.

రాకాసి బుద్ధికల్గిన ఆ మూడుకాసులోనికి ఆ పిల్ల గొప్ప మనసు అర్థంకాక; ‘దీన్ని పెళ్ళయిన మూన్నాళ్ళకే పుట్నింటికి తన్ని అంటుదామనుకుంటే ఇది పారిపోయేతట్ల లేదు కదా! ఇట్లయితే, పెండ్లయినంక ఈ పాలేగాని పొగురుతనం పెండ్లాం రాకతో తోకముడిసిందని నలుగురు.. నగుకోరా..!?’ అని కోపంతో యాదో ఒగ సొట్టు పెట్టుకోని బండి గూటాలు తీసుకోని పశువుని కొట్టినట్లు కొట్టి, గేర్ల (వీథుల వెంబడి) పొడూత పారాటిడిసి, నా గొప్పతనం సూడండి అన్నట్ల మీసాలు దూగుతా గర్వపడేవాడంట.

రాత్రి ఎముకలు నుసి అయ్యేతట్ల తన్నులు తిని, వోయమ్మా కాలునొప్పి- వోనాయనా సెయ్యి నొప్పి.. అని ముక్కుతా-మూళుగుతా పండుకోని, పొద్దున నిద్రలే.. ఆ ముందురోజు రాత్రి ఏమి జరగనట్ల.. మడ్సానంగ మొగునికి శాకీరు(12) – సేస్తా ‘మారాజు’లక్క సూసుకునేదంట ఆ మా..తల్లి!

ఆ మూర్ఖుడు మాత్రం దినాము యా సొట్టు (13) సిక్కుతాదా! యప్పుడు ఆ పిల్ల ఈపులు ఇమానం మోగిద్దామా అని ఎదురుసూసేవాడంట! ఒగనాడు, ఆయమ్మ బాగ ఆకలిగొని బువ్వతింటా కుసోయింటే, ఈ ముండాకోరోడు కావాల్సికని బయట ‘బురద’ తొక్కొచ్చి, ఓయ్! అడుసు మింద కాలేసొచ్చినా కడుగుదువురామని క్యాకేసినాడంట! ఆ ఆలి- ఎనకముందు ఆలోసించకుండ బువ్వ తినేది ఇడ్సి పెట్టి అట్లే బు(వ్వ).. సేత్తోనే కాలుని తిప్పి..తిప్పి కడిగి, కొంగుతో ఇష్టం..గ తుడిసిందంట!

మనసులో ఏ కల్మషం ల్యాకుండ ఆ తల్లి సేసిన సేవకి ఆపొద్దు కరిగిపోయినాడంట ఆ బండరాముడు! దినాము ఆతిరంగ (14) తంతా..తిడతా సిచ్చాకు-సిర్రాకు పెడుతున్నా తట్టుకోవడమే కాకుండ; అన్ని మర్సి, అమ్మ సంటిపిల్లోనికి జోపానం సేసినట్ల నాకి సేవలు సేత్తుండావు కదా! నిజంగ నువ్వు నా కండ్లు తెరిపిచ్చేకొచ్చిన ‘సుంకులమ్మ’ దేవతవ’ని రెండు సేతులెత్తి మొక్కి, ఇన్నాళ్ళు నాను సేసిన తప్పుల్ని పెద్ద మనసుతో శమించమని వేడుకున్నాడంట! ఇంగనుంచి నీకే కష్టం కలగనీకుండ సూసుకుంటానని మాటిచ్చి, ఆ పొద్దునుంచి బడాయి పన్లన్ని మాని మడ్సానంగ కాపురం సేసుకుంట వున్యాడంట! –

ఒగనాడు- ‘మాయమ్మనాయన కండ్లల్లో కనపడుతుండారు మామా! ఇద్దరం పోయి సూసొత్తామా మామా!’ అని అడిగిందంట ఆ పెండ్లాం. సరే పదమని మర్సునాడు పొద్దున్నే ఆయమ్మని యంటేస్కోని కాలిదావ పట్నాడంట మొగుడు. సగం దూరం పోయినంక అయ్యో మామా! సెప్పులు ఏసుకొచ్చుకోడం మర్సినాను ఎనిక్కి పోయి ఏసుకొచ్చుకుంటానని అడిగితే; ఏ.. ఆడమనిషివి నువ్వు ఎనిక్క్యాడపోతావుల్యా! నానే పొయ్యి సేతపట్టుకోని వస్తాను. నువ్వు మెల్లంగ దావపట్టుకోని పోతావుండమని సెప్పి సెప్పులు త్యాను పోయినాడంట.

అతను ఎనిక్కి తిరుక్కోని వచ్చేతలకే ఆ పాప వాళ్ళ వూరు సేరుకోని, నా మొగుడు యా రకంలో వస్తుండాడో సూడండంటా అందర్ని సిద్ధం సేసిందంట. ఎనకనుంచి సెప్పులు సేతపట్టుకోనొచ్చే ఆయప్పని సూసి, ‘హవ్వ..! కత్తిరి జులపాలు ఇడ్సుకోని తెల్లటి బట్టలు.. కిరికిరి సెప్పులేస్కోని, బొడ్లో పిడిబాకు పెట్టి, మెడకి సెలకాల తగిలిచ్చుకోని, సేతిలో రాగాల కట్టి పట్టుకోని మనూరికి పిల్లని సూన్నీ కొచ్చిన పాలేగాడేనా! ఇతగాడ’ని నోర్లు ఎళ్ళబెట్టుకున్నారంట!

అన్సకారికి ఒగరెనుకొగరు ఇంటికాటికొచ్చి, మారిన ఆ మనిషిని మెచ్చుకోని ‘మీ ఇద్దరి జంట సూడసక్కంగ వుండాదం’టా దీవెనలిచ్చి పోయినారంట. ఇదీ జరిగిందని..,

అంతటితో నాయన కత ముగిచ్చి.., ‘సూడు సాయిత్రీ..! మొగుని ప్రాణాల కోసం ఆ యముడితోనే పోరాటం సేసిన మహా ఇల్లాలి పేరు నీకి పెట్టుకున్నాము. ఆ పేరుని నువ్వు సెడగొట్టొద్దు. ఈ కత వల్ల నువ్వేమి అర్థం సేసుకుంటావో నాకైతే తెల్దుగానీ, మనసు గొప్పగ సేసుకో! మనలో నిజమైన ‘అనుగుదనము’ అనేది వుంటే ఆ బ్రమ్మ దేవుడైనా దిగి రావాల్సిందే.., బండరాయైనా కరిగి తీరాల్సిందేనని గుర్తెరిగి మసులుకో’మని సెప్పినాడు.

అక్క ఆయాళ రేత్రి ఏమి ఆలోసన సేసిందో ఏమో.., పండగైపోయిన మర్సునాడు ట్రంకు పెట్టెతో ముత్తుకూరికి పయనం అయింది. నా కాపురాన్ని యట్ల పండించుకోవాల్నో నాకి తెల్సులే.. అన్న ధీమా అక్క మొకంలో కనపడుతుంటే.. అమ్మనాయన పెదవుల పైన నగవు పూలు పూస్తావుండాయి….

1) జ్ఞప్తికి, గుర్తు, జ్ఞాపకం 2) వీథి 3) లేత 4) చేతులారా, 5) పరుగెత్తి వచ్చి 6) తేనె 7) ఉంపుడుగత్తెలు 8) అర్ధరాత్రి 9) పొలాల్లో పశుపక్ష్యాదులు బెదరడానికి తెల్లటి గుడ్డ ముక్కలు లేదా రెపరెపమని శబ్దాలు చేసే పాలిథీన్ కవర్లు కట్టడం 10) భలే 11) నవ్వుకోరా 12) చాకిరీ 13) వంక 14) అతిగా.., అంత ఎక్కువగా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here