మబ్బు తెలివి

0
11

[dropcap]కొ[/dropcap]త్తగా పెళ్ళయి, వేరే కాపురం పెట్టిన అల్లుడూ, కూతురు ఎలా ఉన్నారో చూద్దామని కూతురు ఇంటికి వెళ్ళాడు సుబ్బారావు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత, కూతురూ అల్లుడూ ఇద్దరూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. సుబ్బారావు గారు తన బెడ్‌రూమ్ లోకి వెళ్ళి, చానెల్స్ మార్చి మార్చి టీవీ చూసినా సరే, కొంత బోర్ కొట్టడంతో, అమ్మాయితో మాట్లాడితే బావుండనుకున్నాడాయన. అనుకున్నదే తడవుగా, వాళ్ళ గది దగ్గరికి వెళ్ళి తలుపు తడదామనుకుంటూనే గబుక్కున ఆగిపోయాడు. కారణం, ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఆ గొంతులో కూతురి బాధ కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. దాంతో తలుపు తట్టడం ఆపి, తాటి మట్ట నెత్తిన పడ్డట్టు, మట్టిబొమ్మలా నిలబడిపోయాడు. ఆ తరువాత తేరుకుని, ఆ తలుపుకు ఆనుకుని, శ్రద్ధగా ఆ సంభాషణ వినసాగాడు. లలిత కాస్త బాధగా, “మధూ,నీకు ఎన్ని సార్లు హితబోధ చేసినా నాకు బాధ కలిగించే పనులు మానడం లేదు. మధ్యాహ్నం మనకి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనబడింది చూడూ, ఆమె ఎవరో మర్యాదగా చెప్పు” అడిగింది కాస్త అసహనంగా.

ఆమె మాటలకి కాస్త చిరాగ్గా ఓ క్షణం ఆలోచించి, “ఆ…ఆమె బిచ్చగత్తె. ధర్మం చేయమంటే, చిల్లర లేక పది నోటు ఇచ్చాను. దాంతో ఆవిడ,ఈ చలి కాలంలో నువ్వు వేడిగా ఉండాలి బాబు అని దీవించి వెళ్ళిపోయింది. అంతేగా” అన్నాడు తేలికగా.

“ఛ, ఆమె కాదు. ఆ సిగ్నల్ దగ్గరే మన కారు పక్కనే స్కూటీ ఆపింది. ఆ తరువాత మిమ్మల్ని చూసి పళ్ళికిలించింది. ఆ తరువాత మెలికలు తిరుగుతూ మిమ్మల్ని పలకరిoచింది. ఆ తరువాత వంకర్లు తిరిగిపోతూ మిమ్మల్ని ఎంతో ఇదిగా ఇంటికి రమ్మని ఆహ్వానించింది, చూడండి ఆమె”.

“ఆమె రోజామేరీ. గాజువాకలో ఉంటుంది. ఇది వరకు నాతోపాటు మా ఆఫీసులో పని చేసేది. అయినా ఇదంతా మధ్యాహ్నం నీకు విడమరిచి చెప్పాను కదా”.

“నాకెందుకో మీ మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. మీరు, బొమ్మను కూడా మీ మాటలతో బొరుసు చేయగలరు. మీలో చాలా రోజులుగా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఈ మధ్య నన్ను సరిగా పలకరించడం లేదు. షాపింగ్‌కి వెళితే బిల్లు కట్టేస్తున్నారు కానీ, మాట వరసకి నేను బూట్లు కొన్నానా, బట్టలు కొన్నానా అని కూడా ఓ ముక్క అడగడం లేదు. సినిమాకి వెళ్తే టికెట్‌లు కొనేస్తున్నారు కానీ, ఓ మాట,మంతీ లేకుండా ఉండ్రాయిలా కూర్చుంటున్నారు. ఇంటర్వెల్లో కుళ్ళిపోయిన టొమోటోలా మొహం పెట్టుకు కూర్చుంటున్నారే కానీ, ఓ రెండు ఉల్లి సమోసాలు కూడా తేవడం లేదు. మీ ఈ కొత్త ప్రవర్తన నన్ను కత్తిలా గుచ్చుతోంది. మీరు ఇదివరకు ఉన్నట్టు లేరు. ఏది అడిగినా పందెం పుంజులా నా మీద పడిపోయి, నా బుర్రని తాటిముంజెలా తినేస్తున్నారు. చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళి వస్తున్నారు. కనీసం బాత్రూంకి వెళ్ళేప్పుడు కూడా నన్ను పిలవడం లేదు” అంటూ ముక్కు చీదింది.

“వ్వాక్ ఛీ. బాత్రూంకి వెళ్ళేప్పుడు నిన్ను పిలవడం ఏవిటే దరిద్రప్పీనుగా. వింటేనే కడుపు తిప్పుతోంది”.

“ఛఛ, నేను అన్నది అందుక్కాదు. ఇది వరకు బాత్రూంకి వెళ్ళేప్పుడు, టవల్ పట్టుకురా, గీజర్ ఆన్ చేసేవా, పేస్ట్ ఇవ్వు, వీపు రుద్దు అని పిలిచేవారు. ఇప్పుడు ఇవేం లేవు” అని మరోసారి ముక్కు చీది, “అవునులెండి నన్ను మోసం చేసినా దగా చేసినా అడిగేవారు లేరు అని మీ ధైర్యం. మొన్న మీరు మన ఎదురింటి పని మనిషిని చూసి నవ్వినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ ఇవాళ అది నేరుగా మన ఇంటికొచ్చిందంటే, దాని ధైర్యం ఏవిటో అర్ధం చేసుకున్నాను” ఈ సారి ముక్కు చీది కళ్ళు కూడా ఒత్తుకుంది.

“ఏడ్చినట్టు ఉంది. నువ్వు తలా తోకా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావ్. మొన్న ఏదో పలకరింపుగా నవ్వాను. ఇవాళ ఆమె వచ్చి జున్ను పాలు ఇచ్చింది. సరే అని ఓ వందిచ్చాను. దానికే ఇంత అనుమానవా”.

“మీరు ఎన్నైనా చెప్పండి. వాటిలో కొన్ని కూడా నేను నమ్మను. మీరు మారిపోయారు.కానీ నన్ను మోసం చేయలేరు” అంటూ మరోసారి ముక్కు చీదింది..

దాంతో విసిగిపోయిన మధు, పటపటా పళ్ళు కొరికేస్తూ, “అవును నాకు ఆమెతో నాకు అక్రమ సంబంధం ఉంది. ఒక్క ఆమెతోనే కాదు.ఇంకా చాలా ఉన్నాయి. ఏం చేస్తావో చేసుకో పో” అన్నాడు.

ఆ మాటలు గది బయట నుండి వింటున్న సుబ్బారావు, గుండె పట్టుకుని దబుక్కున కింద పడ్డాడు. ఆ తర్వాత అతనకి నవ్వులు వినిపించాయి. లలిత కిక్కిక్కి అని నవ్వేస్తూ, “ఇదంతా ప్రాంక్ వీడియో అండీ. యుట్యూబ్‌లో పెట్టడానికని తీశాను. మొన్న నా ఫ్రెండ్ ఇలాంటి ప్రాంక్ వీడియోనే వాళ్ళాయన మీద తీసి పెడితే, బోలెడు వ్యూస్‌తో పాటు డబ్బులు కూడా వచ్చాయట. అందుకే నేనూ ఇలా మీ మీద ప్రయత్నించాను. మీరూ నమ్మేసారు. ఫ్రాంక్ వీడియో కూడా భలే బాగా వచ్చింది” చెప్పిందామె హుషారుగా గంతులేస్తూ. ఆ మాటలు విన్న సుబ్బారావుగారు కళ్ళు తేలేసి గుండెనొప్పితో లబలబలాడుతూ, “పాపిష్టిదానా, ప్రాంక్ వీడియో కోసం, నా గుండెలతో గోటి బిళ్ళ ఆడి, నా ప్రాణం మీదకి తెచ్చావ్ కదే!” అంటూ తలుపు దబదబా బాదారు.

లలిత గదిలోంచి బయటికి వచ్చి, “నాన్నా,నీకు మా మార్బల్ ఫ్లోరింగ్ నచ్చిందా. అలా పడి, పడి నేల మీద దేకుతూ మరీ చూస్తున్నావ్. మార్బల్స్ రాజస్తాన్ నుండి తెప్పించాం. ఈ రంగు నేనే సెలెక్ట్ చేసాను తెలుసా” చెప్పింది గొప్పగా.

దాంతో, తల టపటపా బాదుకుని, “ఆ సోషల్ మీడియా పైత్యంలో పడి, నువ్ మరీ ఇంత మబ్బు మనిషిలా తయారయ్యావేవిటే తల్లీ” అని నెమ్మెదిగా వెల్లకిలా తిరిగి, గుండె నొప్పి చెప్పాడు సైగ చేస్తూ.

దాంతో చెవులు మూసుకుని, “నాన్నా” అంటూ గట్టిగా అరిచింది.

దాంతో మళ్ళీ తల బాదుకుంటూ, “రాక్షస బల్లిలా అంత గట్టిగా అరవకమ్మా. ఇపుడే పోతానూ” విసిగాడాయన. గది లోపలున్న మధు, “మరో ప్రాంక్ వీడియో కోసం అనుకుంటాను ఈ అరుపులు” అని ఏమాత్రం చలించలేదు, పట్టించుకోలేదు. నేరుగా వెళ్ళి చెప్పినా నమ్మలేదు. తర్వాత “కాదు మొర్రో” అని ఫోన్ నేల కేసి కొట్టింది. దాంతో మధు నమ్మి, గబగబా వెళ్ళి సుబ్బారావు గారిని హాస్పిటల్‌లో చేర్చాడు. తరువాత, ఆమె ప్రాంక్ వీడియోలు చేయడం మానేయడమే కాక వాటి వల్ల వచ్చే అనర్థాలు వివరించడం మొదలుపెట్టింది మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here