కొని, దాచుకుని, బహుమతిగా ఇవ్వదగ్గ ‘మెకంజీ కైఫియ్యత్తులు – తూర్పు గోదావరి జిల్లా’

0
9

[dropcap]క[/dropcap]విగా, రచయితగా ప్రసిద్ధిపొందిన బొల్లోజు బాబాకు చరిత్ర పరిశోధన ఆసక్తికరమైన విషయం. వ్యక్తిగత ఆసక్తితో ఆయన చరిత్ర విషయాలపై పరిశోధిస్తూ చక్కటి విషయాలను ప్రకటిస్తూంటారు. ఆ పరిశోధనలో భాగమే ‘మెకంజీ కైఫియ్యత్తులు – తూర్పు గోదావరి జిల్లా’ అన్న పుస్తకం.

‘కైఫియత్’ అన్న పదానికి పలు అర్థాలున్నాయి. ‘కైఫియత్’ అంటే పరిస్థితి, సమాచారం, వివరణ, కథ, నాణ్యత, ఆనందం, వంటి పలు విభిన్న అర్థాలున్నాయి. ‘కైఫియత్’ అన్న పదానికి ‘మెకంజీ’ సేకరించిన సందర్భంలో ‘narrating’ అన్న అర్థం వస్తుంది. ఈయన ప్రాంతీయ, గ్రామ, దేవాలయ ఆస్తుల వివరాలు, దానాలు, పట్టాలు, శాసనాలు, సామాజిక ప్రజా జీవన విధానాలు; శ్రామికులకు, పాలకులకు నడచిన ఆదాన ప్రదానాలు; యుద్ధాలు విశేషాలను సేకరించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మెకంజీ సేకరించిన విశేషాలు వెలకట్టలేనివి. ఈయన హయాంలో అమరావతి ప్రాంతంలో 132 పలకల చిత్రాలు గీశారు. కానీ ఇప్పుడు వాటిలో 79 పలకలు దొరకడం లేదు. ఈయన రాయలసీమ, గోదావరి జిల్లాల్లో సేకరించి పొందుపరిచిన సమాచారం అపురూపమైనది.  మెకంజీ కైఫియతులను ఆనాటి విజ్ఞాన సర్వస్వాలుగా అభివర్ణించారు విద్వాన్ కట్టా నరసింహులు.  వాటిల్లోంచి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని అందరికీ అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేసి అందిస్తున్నారు బొల్లోజు బాబా.

ఈ పుస్తకానికి తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి రాసిన ‘శుభాకాంక్షలు’ చాలా విలువైనవి. ఈ శుభాకాంక్షలలో ఆయన అనేక చేదు నిజాలను నర్మగర్భితంగా, కొన్ని చోట్ల కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. ఆయన చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవించకపోయినా, చాలా చక్కటి ఆలోచనలను ప్రకటించారు. ‘మొదట చరిత్ర రచనకు పూనుకున్న ఆంగ్ల పండితులు దిగ్భ్రమ కలిగించే ఈ దేశ సామాజిక సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోలేదు. ఆ వైవిధ్యాన్ని వారు సమూలంగా బల్లపరుపు తాపీ పని చేశారు’ అన్నది సత్యం. ‘మనకిష్టమైన అభిప్రాయాలు చారిత్రక వాస్తవాలు అనుకోకుడదు’ అన్నది అందరూ అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాల్సిన సత్యం. చక్కని పుస్తకానికి నిక్కమైన ‘శుభాకాంక్షలు’ ఇవి.

అప్పటి కైఫియతులను అప్పటి భాషలోనే యథాతథంగా ఉంచాలన్న ఆలోచన సమర్థనీయమే అయినప్పటికీ, అందరికీ సులభంగా అర్థమయ్యే భాషలోనే తర్జుమా చేసి అందించటం అభిలషణీయం. ఇందువల్ల కైఫియతులలోని సమాచారం అందరికీ చేరుతుంది. ‘మనవి మాటలు’లో రచయిత ‘కైఫియతులలోని భాష రెండు శతాబ్దాల నాటిది. కామాలు, ఫుల్‌స్టాపులు, పారాగ్రాఫులు లేకుండా కొన్ని చోట్ల ఒకే వాక్యం రెండు మూడూ పేజీల వరకూ ఉండడం గమనించాను’ అంటారు. ఉన్నది ఉన్నట్లు అందిస్తే, సామాన్య పాఠకుడికి ఆసక్తి ఉన్నా, చదవటానికి ఇబ్బంది పడతాడు. నిరాశ పడతాడు. ఒక్కోసారి తెలియని పదాల వల్ల విముఖుడయ్యే అవకాశం కూడా ఉంది. అదీగాక, భాష పోతుంది, పదాలు పోతాయి అనుకునే కాలం పోయింది. కనీసం అప్పటి జ్ఞానం భవిష్యత్తు తరాలకు ఏదో ఒక రూపంలో అందితే చాలుననిపించే రోజులివి. లేకపోతే ఎవరికి వారు మనకు చరిత్రే లేదని, మేమే ఆద్యులనని నమ్మిస్తే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి రచయిత చెప్పినట్టు ‘కైఫియతులను సమకాలీన భాషలోకి మార్చడం అనివార్యం’. ఒక రకంగా సామాజిక బాధ్యత కూడా. అందుకు బొల్లోజు బాబా అభినందనీయులు. భావి తరాలు ఇందుకు రచయితకు కృతజ్ఞతలు తెలుపుకుంటాయి.

పుస్తకం ఆరంభంలో కల్నల్ కాలిన్ మెకంజీ గురించిన సమాచారాన్ని పొందుపరచడం మెకంజీ చేసిన సేవను పరిచయం చేస్తుంది. పుస్తకం చదివించేందుకు భూమికను సిద్ధపరుస్తుంది.

ఈ పుస్తకంలో – బోయనపూడి గ్రామ కైఫియ్యతు, చిన్నిపువ్వు తేనె కైఫియ్యతు, రాజమహేంద్రవరం, యామగిరి కైఫియ్యత్తు, సర్పవరం కైఫియ్యతు, జల్లూరు కైఫియ్యతు, కోరుకొండ కైఫియ్యతు, చామర్లకోట కైఫియ్యతు, కిమ్మూరు కైఫియ్యతు, చెల్లూరు కైఫియ్యతు, సిద్ధాంతం కైఫియ్యతు, మెకంజీ సేకరించిన శాసనాలు అన్నవి ప్రధాన అధ్యాయాలు. వీటికి సంబంధించిన అదనపు సమాచారం ‘అపెండిక్స్’లో పొందుపరిచారు.

బొల్లోజు బాబా తర్జుమా సరళంగా, సులభంగా ఉండి అత్యంత ఆసక్తికరంగా, వేగంగా చదివిస్తుంది. ఇందులోని ఒకో అంశం చదువుతుంటే, ఆ కాలం కళ్ళ ముందు నిలబడుతుంది. ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది. ఇందులో ఒకో కథ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు, సమాజం ఎలా రూపాంతరం చెందిందో ఇంకా ఎంతో అధ్యయనం చేయాలన్న ఆలోచన కలుగుతుంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సిద్ధాంతాల గురించి అనుమానం కలుగుతుంది.

‘దేశంలో తురకల ప్రభుత్వం వచ్చింది కనుక కుమారారామ మొదలయిన దేవస్థానముల గుమ్మములలో తురకలు బసలు చేసి పూజలు నడవనిచ్చేవారు కారు. ఉత్సవములు జరిగేవి కావు. ఆ రకంగా అంతవరకూ దేవాలయంను అంటిపెట్టుకుని జీవనాన్ని సాగించిన నీలపువాండ్రకు గడ్దు కాలం వచ్చి పడింది. క్రమేపీ వారు వ్యవసాయ కూలీలుగా స్థిరపడ్డారు.’ (పేజీ నెం.32).

కె.ఎస్. లాల్ వంటి చరిత్రకారులు ఈ దేశంలో తురకల ప్రవేశం తరువాతనే కులవ్యవస్థ రూపాంతరం చెందిందనీ, అంతవరకూ లేని అనేక కులాలు సమాజంలో ఆవిర్భవించాయని తీర్మానించి గణాంక వివరాలతో సహా నిరూపించారు. కానీ ఆధునిక మేధావులు సమాజంలోని ప్రతి దోషానికి అగ్రవర్ణాలను దూషించి సమాజంలో విద్వేషాలు పెంచుతున్నారు. కైఫియతులలో ఇంకా అనేక chronicles ను విదేశీయులు అందించిన colonial mindset తో కాక మన దృష్టితో మన సామాజిక చరిత్రను మనం దర్శించి విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఉందన్న నమ్మకం బలపడుతుంది. కొంపెల్ల లక్ష్మీ సోదెమ్మ ఉదంతం (పేజీ 94), ఇలాంటి ఎన్నెన్నో త్యాగాలు చేసి అనామకులుగా అజ్ఞాతంగా మిగిలిపోయారన్న ఆలోచనను కలిగిస్తుంది. అడుగడుగునా అత్యంత వీరోచితమైన ప్రవర్తన, నిస్వార్థ త్యాగాలే ఈ దేశంలో ఈ ధర్మాన్ని సజీవంగా నిలిపాయన్న ఆలోచన వచ్చి ఒళ్ళు గుగుర్పొడుస్తుంది. ఇలాంటి కొన్ని కోట్ల మంది కొన్ని వందల ఏళ్ళు త్యాగాలు చేస్తూ, బలిదానాలిస్తూండటం వల్లనే కదా, ఈనాడు ఇంకా భారతీయ ధర్మం సజీవంగా నిలిచి ఉందన్న ఆలోచన బలంగా తాకుతుంది. వేమారెడ్డి జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించిన సంఘటన (పేజీ 115) కూడా పలు ఆలోచనలను రేకెత్తిస్తుంది.

ఇలా చెప్తూ పోతే మొత్తం పుస్తకంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. అత్యంత విలువైన, ఉపయుక్తమైన పుస్తకం ఇది. మనము రాత్రింబవళ్ళు నడయాడే ప్రాంతాల – మనకు తెలియని, ఊహకు కూడా అందని అద్భుతమైన చరిత్రను మనకు చేరువ చేస్తుందీ పుస్తకం. ఈ పుస్తకంలోని విషయాల ఆధారంగా పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకత గ్రహింపుకు వస్తుంది. మెకంజీ కైఫియతులను ఇలా అందరికీ అందుబాటులోకి తెచ్చి అందించి తన సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్న బొల్లోజు బాబా అభినందనీయులు. చరిత్ర పట్ల ఏ మాత్రం ఆసక్తి ఉన్నవారయినా కొని, దాచుకుని, వీలయితే ఇతరులకు బహుమతిగా ఇవ్వదగ్గ పుస్తకం ఇది.

***

మెకంజీ కైఫియ్యత్తులు – తూర్పు గోదావరి జిల్లా
బొల్లోజు బాబా
పుటలు: 192
వెల: ₹ 200/-
ప్రతులకు:
బొల్లోజు బాబా, 30-7-31, గొల్లల వీధి
సూర్యనారాయణపురం
కాకినాడ – తూర్పుగోదావరి జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ 533001
9049329443. bollojubaba@gmail.com
మరియు
పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ
9866115655

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here