ఆలోచింపజేసే : MAD

1
9

[dropcap]ఈ[/dropcap] వారం మరో లఘు చిత్రం MAD. Stylized narrative కారణంగా నచ్చుతుంది. కొన్ని ప్రశ్నలు లేస్తాయి. కొన్ని లోపాలూ స్పష్టంగా కనిపిస్తాయి. ఒకే కథను ఎన్నెన్నో విధాలా చెప్పొచ్చు కదా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కనీసం కథనం లో నైనా కొత్తదనం, ఒరిజినాలిటీ వుంటే ఆహ్వానించవచ్చు.
ఒక తల్లీ (సోనల్ ఝా) కూతుళ్ళ (రీటా హీర్) కథ. తల్లి తన భర్త సంవత్సరీకానికి ముంబై లోని కూతురు అపార్ట్మెంట్ లో అన్ని ఏర్పాట్లు చేసింది. వేళకు కూతురు రాదు. ఉద్యోగం చేస్తున్న కూతురు రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి తను వేళకు రాలేకపోయినందుకు బాధ పడుతుంది. తల్లి భోజనం చేయమంటే, పీట్జా తిని వచ్చానంటుంది. టీ పెట్టనా పోనీ అంటే సరేనంటుంది. ఇద్దరిమధ్యా ఒక రకమైన కృతక మౌనం, అసంపూర్ణ సంభాషణా వింతగా అనిపిస్తుంది. తల్లి టీ తీసుకుని వస్తే తాగబోయి, మళ్ళీ పెట్టేసి తన బేగ్ లోంచి డ్రింక్ బాటిల్ తీసి, ఏమనుకోకు మెట్రో లో కొంత సేవించాను, నువ్వూ తాగు అంటూ రెండు గ్లాసుల్లో పొస్తుంది.తల్లి బాటిల్ లాక్కో బోతుంటే కోప్పడుతుంది ఇదే అన్నయ్యైతే ఇలా చేస్తావా అంటూ. తల్లి తీసుకోకపోతే నా మీద నిజంగా ప్రేమ వుంటే తాగు అంటుంది. ఇద్దరూ సేవిస్తారు. ఇక సంభాషణ మొదలవుతుంది. బహుశా ఇద్దరికీ ఆ డ్రింక్ మనసు విప్పి మాట్లాడుకునే ధైర్యం ఇచ్చిందేమో. అలాగే కూతురు తల్లితో అంటుంది పాట్నా లో నువ్వు అమ్మ వేషం వేద్దువు గానీ ఇక్కడొద్దు అని. ఆ వేషం విప్పేసిన తర్వాత ఇద్దరూ మరింత దగ్గరై మనసులు విప్పుకోగలుగుతారు.
ఇదే కథను ఒక సారి తల్లి తరఫున, మరోసారి కూతురు తరఫునా చెప్పబడుతుంది. మేడ్ అంటే మదర్ అండ్ డాటర్. ఎందుకో నాకు రుదాలీ గుర్తుకొచ్చింది. చాలా కష్టాలమయం డింపల్ కాపడియా జీవితం. కొన్నాళ్ళ కోసం ఆ వూరికి వచ్చిన రాఖీ ఈమె ఇంట్లో వుంటుంది. ఆ కొన్ని రోజుల్లో డింపల్ తన కథనంతా చెబుతుంది. రుదాలీ అయిన రాఖీ కి ఏడుపు రాదు, నేను వూరెళ్ళాలి పిలుపొచ్చింది, నేను తిరిగి వచ్చాక నా కథ చెబుతాను ఏడవటానికి కన్నీళ్ళు చాలవు అంటుంది. ఆమె తిరిగి రాదు గాని, ఆమె డింపల్ తల్లి అన్న కబురు మాత్రం వస్తుంది. ఆ తల్లీ కూతుళ్ళ విషాద గాథ రుదాలీగా మారిన డింపల్ ఏడుపులతో ముగుస్తుంది. బండబారిన ఆమె గుండె ఆ రోజు మొదటిసారిగా మనసు కరిగేలా కన్నీరు పెట్టుకుంటుంది.
ఇందులో, ఇది 22 నిముషాల ఒక లఘు చిత్రం కదా, లైంగిక క్షేత్రం లో స్త్రీ పరిస్థితి ఎంత vulnerable గా వుంటుందో చెబుతూనే మిగతా విషయాలను చూచాయిగా చెబుతుంది.
వినోద్ రావత్ నటుడు, దర్శకుడు, స్క్రిప్ట్ రచయితా, నిర్మాత. దీనికి స్క్రిప్ట్ వ్రాసి, దర్శకత్వం చేయడమే కాదు నిర్మాత కూడా. ఇదివరకు నీరజా, సిటీ లైట్స్ చిత్రాలకు అసోసియేట్ దర్శకుడుగా చేసాడు. షహీద్, ఖామోషియాఁ లలో నటించాడు. ఈ చిత్రాన్ని చాలా బాగా తీసాడు. తల్లీ కూతుళ్ళుగా నటించిన సోనల్, రీటాలు కూడా చాలా బాగా చేసారు. చూడాల్సిన చిత్రమే ఇది.


SPOILER ALERT
ఎప్పటిలా ఈ భాగం చిత్రం చూసాక చదవమని విన్నపం.
లైంగిక కోరికలు స్త్రీ పురుషులిద్దరికీ సమానమే అయినా అది వివాహ బహంధం లో కాకపోయినట్లైతే మగవాడికి భయపడాల్సిన విషయం కదు. పై పెచ్చు ఆ యొక్క స్త్రీని బ్లాక్‌మేల్ చేసే అవకాశం ఇస్తుంది. అందులో ఈ అధునాతన నాగరికత సెల్ ఫోన్ అనే పరికరంలోనే ఎన్నో అమర్చి చేతికిచ్చింది. ఫోటోలు, వీడియోలు తీసుకోవడం వాటిలో ఒకటి. విభిన్న కారణాల వల్ల జంటలు ఆ సమయాన్ని షూట్ చేసుకోవడం, ఆనక ఇబ్బందులు పడటం, అవి నెట్ లోకి ఎక్కేస్తే అవమానం పాలయ్యి నలిగిపోవడం ఇదంతా మనం వార్తల్లో చూస్తున్నాం. అయితే ప్రతిసారీ మగవాడు తప్పించుకుని, ఆ అవమాన భారాన్ని ఆడదే మోయాల్సి వస్తోంది. కూతురి బాయ్ ఫ్రెండ్ అలా షూట్ చేసిన దాన్ని చూపించి ఆమెను నిరంతరం బ్లాక్‌మేల్ చేస్తున్న సంగతి తల్లితో చెప్పగలుగుతుంది ఆ రోజు. వెంటనే స్పందించి తల్లి ఆ యువకుడికి ఫోన్ చేసి బాగా తిడుతుంది, వార్నింగ్ ఇస్తుంది పోలీసులకు చెబుతాను నువ్విలా వేధిస్తే అని. ఇక్కడి దాకా కథ తెలిసిన కథే కదా అనిపిస్తుంది.
తల్లీ కూతుళ్ళ సంభషణలో కూతురంటుంది : అమ్మా నాన్న నీకు సరిగ్గా న్యాయం చేయలేదు, నిన్ను సరిగ్గా చూసుకోలేదు కదా అని. పిల్లలకు అన్నీ అర్థమవుతాయి, చెప్పుకోరంతే. ఇందులో ఈ ప్రత్యేక క్షణంలో ఇద్దరూ చెప్పుకోగలిగారు.
తల్లి వైపు నించి కథనం లో తెలిసేదేమిటంటే ఆమె ప్రస్తుతం కడుపుతో వుంది. కూతురి దగ్గర ఏడ్చి, చెప్పుకుని తనకు అబార్షన్ చేయించమని వేడుకుంటుంది. పాట్నా లో కుదరదు, ముంబై లో ఎవరికీ తెలియదు. ఇక్కడ సంభాషణ చూడండి, ముందు తల్లిని అనునయించి, తర్వాత అతనెవరు అని అడగడానికి “ఇప్పుడు పేలు, అతను ఎవరు?” అంటుంది. ఈ మాట, లింగ భేదం లేకుండా, మనలో జీర్ణించుకుపోయిన ఒక విషయాన్ని చెబుతుంది. అతను ఎవరో నందు అంట. అతనికి ఇక్కడ ఏ సమస్యా లేదు; దాన్ని బయట పెట్టలేక, అబార్షన్ చేయించుకోవాలనుకున్న తల్లికే కష్టాలు. కూతురు ఆ పని వొద్దు, కని నాకివ్వు నేను పెంచుకుంటానంటుంది. తల్లి కూడా ఆ యువకుడిని ఫోన్ లో తిట్టేటప్పుడు అమ్మలక్కల తిట్లే తిడుతుంది. అన్నీ మగవాళ్ళ తిట్లే. ఇద్దరి మనసులూ తేలికయ్యాక కూతురు నవ్వుతూ అంటుంది, నిన్ను సుఖపెట్టింది నాన్నా, లేక నందూ నా అని. నందు అంటుంది తల్లి. అనుకున్నాను అంటుంది కూతురు. ఇద్దరి నవ్వుల మధ్య టైటిల్స్ వస్తాయి.
సమస్య ఏమిటి, దానికి పరిష్కారం ఏమిటి, నీతి స్త్రీ పురుషులకు వేరేలా ఎందుకుండాలి?, దీనికి ఇదే పరిష్కారమా? ఇలంటి తీర్పులు లేవుగానీ ఒక కోణంలో అర్థం చేయిస్తుందీ చిత్రం.

యూట్యూబ్ లో వుంది. చూడండి.

https://youtu.be/aEhnbqQv2A8

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here