మధు కైటభులు

0
8

[dropcap]శౌ[/dropcap]నకాది మునులు సూత మహర్షిని మధు కైటభులు అనే ఇద్దరు రాక్షసుల చరిత్ర గురించి చెప్పమని అడుగుతారు. వీరి ప్రస్తావన శ్రీ దేవి భాగవతము లోని ప్రథమ స్కందములో తెలుపబడింది. నైమిశారణ్యములో సూత మహర్షి శౌనకాది మహామునులకు మధు కైటభుల గురించి చెప్పనారంభిస్తాడు.

క్షీరసాగరములో శ్రీ మహావిష్ణువు శేషశయ్యయై యోగ నిద్రలో ఉన్నప్పుడు అయన చెవుల నుంచి మధు కైటభులు అనే రాక్షసులు పుట్టారు. వీరిద్దరూ నీళ్లలో ఈదుతూ ఆడుతూ ఘోషిస్తున్న సముద్రమును చూసి, ‘ఇంత నీరు ఒక్కచోట ఎలా నిల్చింది? దీనికి ఆధారము లేకుండా ఎలా ఉంటుంది? అలాగే మనము పుట్టటానికి ఏదో అధారము ఉండాలి అది ఏది? మనకు తెలియని శక్తి ఏదో’ అని ఆలోచనలో ఉన్నప్పుడు – ఆకాశము నుండి శుద్ధమైన వాక్కు వారి ముందుకు వచ్చింది. వారు దానిని గ్రహించి జపించ నారంభించారు. వారి ముందు మెరిసిన మెరుపును చూసి ‘ఇది దేవి యొక్క తేజస్సు, సందేహము లేదు’ అని భావించి నిశ్చలబద్ధులై ఆ మంత్రమును నిరాహారులై ఒక వేయి సంవత్సరాలు జపించగా వారి దీక్షకు మెచ్చిన జగన్మాత అశరీరమూర్తి అయి వరము కోరుకోమని అన్నది. వారిద్దరూ స్వచ్ఛంద మరణము ప్రసాదించమని కోరుకున్నారు. “ఇంక మీరు తపస్సు చాలించండి. మీరు కోరుకున్నట్లే వరము ప్రసాదించాను. మీకు ఎదురు లేదు పొండి” అని జగన్మాత సెలవిచ్చింది.

వారు జలాల్లో తిరుగుతూ బ్రహ్మను చూసి “మాతో యుద్దానికి రా” అని పొగరుగా సవాలు చేశారు. అంతటితో ఆగకుండా బ్రహ్మను ఆ పద్మాసనం మాకు వదలి పొమ్మని హెచ్చరించగా బ్రహ్మ భయపడి విష్ణువును చేరి, “దుష్ట రాక్షసుల బారిన పడ్డ నన్ను రక్షించటానికి యోగ నిద్ర నుండి మేలుకో తండ్రి” అని ప్రార్థించాడు. కానీ బ్రహ్మ ప్రార్థనలు ఫలించలేదు, విష్ణువు మేలుకోలేదు. అప్పుడు బ్రహ్మ, “అమ్మా, ముల్లోకాలను మూలమైన నీవు రాక్షసుల బారి నుండి రక్షించటానికి అభయమిచ్చి పుండరీకాక్షుడిని మేలుకొలుపు తల్లి, లేకపోతే ఆ రాక్షసులు నన్ను సంహరిస్తారు. వారి చేతిలో చనిపోవటం కన్నా నీ చేతిలో చనిపోవటానికి సిద్ధముగా ఉన్నాను. నీ వర ప్రభావము వలన వారు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు” అని వేడుకొనగా యోగనిద్ర విష్ణువును విడువగా శ్రీ మహావిష్ణువు నెమ్మదిగా కనులు తెరచి బ్రహ్మను సాపేక్షగా చూసాడు. బ్రహ్మ పరమానంద భరితుడైనాడు.

వింటున్న శౌనకాది మునులకు దివ్య శక్తి సంపన్నుడైన విష్ణువు యోగనిద్రకు లొంగి ఉండటం ఏమిటి? అని సందేహము కలిగి సూత మహామునిని సందేహ నివృత్తి కోసము అడిగారు. “శక్తియే సర్వస్వము శక్తి లేకపోతే హరి హర హిరణ్యగర్భులు కూడా ఎందుకు చాలరు, అని సాక్షాత్తువిష్ణువు బ్రహ్మతో చెప్పగా బ్రహ్మ నారదునికి చెప్పగా నారదుని ద్వారా మా గురువు అయన ద్వారా నాకు తెలిసింది” అని సూతుడు ఇతర మునులకు చెపుతాడు.

మేల్కొన్న విష్ణువు బ్రహ్మను చూసి తపస్సు విడిచి రావటానికి గల కారణము, దిగులుగా ఉండటానికి కారణము అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ జరిగిన వృత్తాంతాన్ని విష్ణువుకు తెలియజేస్తాడు. విష్ణువు ఇలాంటి రాక్షసులను శిక్షించటమే తన పని అని చెపుతూ ఉండగా మధు కైటభులు వచ్చి బ్రహ్మను చూసి, “మమ్ములను మోసము చేసి తప్పించుకోవటం అసాద్యము. నీవు మా చేతిలో చావవలసినవాడివే. పోరాడు లేదా మాకు లొంగిపోయి మీ సేవకుడిని అని చెప్పు. చచ్చేవాడివి నీవు ఒక్కడివే చావకుండా ఈ పెద్ద మనిషిని కూడా మాచేత చంపిస్తావా?” అని పొగరుగా మాట్లాడుతుంటారు. బ్రహ్మను తన వెనుకకు చేర్చిన విష్ణువు “మీ అట కట్టించటానికి నేనున్నాను రండిరా” అనగా మొదట మధువు పళ్ళు పటపట కొరుకుతూ విష్ణుమూర్తితో యుద్ధానికి తలపడతాడు. వీరిద్దరి మధ్య భీకరముగా పోరు సాగుతుంటే పైనుంచి జగదాంబ నీళ్లల్లో నుంచి బ్రహ్మ ఆ యుద్దాన్ని చూస్తున్నారు. వీరి యుద్ధానికి సముద్రము అల్లకల్లోల్లము అవుతుంది. మధువు క్రమమంగా అలిసిపోవటం గమనించిన కైటభుడు మాధవునితో యుద్ధానికి తలపడతాడు. ఇద్దరితో యుద్ధము చేయటము వలన మాధవుడు కూడా అలసిపోతారు. ఇది గమనించిన రాక్షసులు, “యుద్ధము చేయలేక పోతే లొంగిపో, లేదా నిన్ను ఆ పద్మాసనుడిని మట్టు పెట్టి మరి వెళతాము” అని మాధవుడిని హెచ్చరిస్తారు. ఆ విధముగా వారు ఐదు వేల సంవత్సరాలు పోరు సాగించారు.

“అలసి ఉన్న వానితో యుద్ధము చేయకూడదు. అదియునుగాక మీరు ఇద్దరు నేను ఒక్కడినే. మీరు విశ్రాంతి తీసుకుంటూ ఒకరి తరువాత మరొకరు యుద్ధము చేస్తున్నారు. ఇది యుద్ధనీతి కాదు” అని విష్ణువు మధు కైటభులతో అంటే వారు కూడా ఆలోచించి ‘సరే’ అని కొంతసేపు విశ్రమించారు. విష్ణువు వీళ్ళ శక్తి తెలిసినవాడై స్వచ్ఛంద మరణము వరము పొందిన వాళ్ళు కాబట్టి జగదాంబ దయతోనే వీరిని సంహరించాలి అని జగదాంబను ప్రార్థించి జగదాంబ సహాయాన్ని కోరాడు. అప్పుడు జగదాంబ ప్రత్యక్షమై, “మాధవా విచారించకు, నేను వారి మీద నా మాయ ప్రయోగిస్తాను. అప్పుడు నీవు వారిని సులభముగా సంహరించవచ్చు” అని చెపుతుంది. ఎక్కడలేని శక్తి తనలో ప్రవేశించినట్లుగా అనిపించిన విష్ణువు లేచి ఎదురుగా వచ్చిన మధుకైటభులను ఒక్కమారు ఇద్దరి గుండెల మీద పిడికిలితో పొడిచాడు. ఆ తరువాత విష్ణువు మనస్సులో జగజ్జనిని స్మరించుకున్నాడు. ఆ తల్లి ముగ్ధమోహనమైన చూపులతో వారిని చూసింది. అంతే, ఆ రాక్షసులు యుద్ధము మాని ఆ తల్లి వైపు వికారంగా చూడనారంభించారు. జగదాంబ చిరునవ్వులు, కడకంటి చూపులు ఆ రాక్షసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

ఇది గ్రహించిన విష్ణువు వారితో, “ఇంతకు మునుపు ఎందరో రాక్షస వీరులను చూచాను. కానీ వారెవరు మీతో సరిపోలరు. మీతో యుద్ధము నాకెంతో సంతోషము కలుగజేస్తుంది. మీ కోరిక ఏమిటో చెప్పండి తీరుస్తాను” అని అంటాడు. ఈ మాటలు విన్న రాక్షసులు గర్వముతో, “నీవు మాకు ఇచ్చేది ఏమిటి? నీకు ఏమి కావాలో కోరుకో ఇస్తాము” అని అంటారు. ఆ మాటలకు విష్ణువు, “నాతో యుద్ధము చేసి మీరు నా చేతిలో చావాలి. అదే నా కోరిక” అని అంటాడు. అప్పుడు రాక్షసులు తెలివిగా, “నీరు లేని చోట మాతో యుద్దానికి రా, అక్కడ మమ్మల్ని చంపుదువు గాని” అని అంటారు. అప్పుడు విష్ణువు సువిశాలముగా తన తొడలను పెంచగా ఆ రాక్షసులు కూడా వాళ్ల శరీరాలను పెంచారు. చివరకు రాక్షసుల శరీరాలు విష్ణువు తొడల మధ్య అణిగిపోయాయి. వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రాన్ని స్మరించగా దివ్యతేజస్సుతో వచ్చిన చక్రము మధు కైటభుల తలలను తెగవేసింది. రాక్షసుల తలలు సముద్రములో పడి ఆ ప్రదేశమంతా పెద్ద దిబ్బగా ఏర్పడింది ఆ దిబ్బను ‘మేదిని’ అంటారు. ఆ విధముగా మధు కైటభుల కధ ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here