మధుమాలిక – పుస్తక పరిచయం

0
6

[dropcap]శ్రీ[/dropcap]మతి ఉప్పలూరి మధుపత్ర శైలజ గారు రాసిన 20 కథల సంపుటి ఈ పుస్తకం.

***

“ఇప్పుడు ‘మధుమాలిక’ పేరుతో ప్రచురిస్తున్న నా కథల విషయానికొస్తే, కొందరి వ్యక్తుల జీవితాలను గమనిస్తే మనసును కదిలిస్తాయి. మరికొందరి జీవితాల్లో వారి అమాయకత్వం, దానితో ఏర్పడే సమస్యలను చూస్తే జాలి కలుగుతుంది. కొందరి జీవితాలు మనలో స్ఫూర్తిని రగిలిస్తాయి. నా జీవితంలో ఎదురైన వివిధ వ్యక్తుల జీవితాలను, సంఘటనలను చూసి నా మనస్సులో నేననుభవించిన స్పందనల అక్షరరూపమే ఈ కథలు” అన్నారు రచయిత్రి శైలజ తమ ముందుమాట ‘మదిలోని మాట’లో.

***

“శైలజ గారి కథల సంపుటిలో ఇరవై కథలు వున్నాయి.

చిన్నప్పటి నుంచి ఆమె చూస్తున్న జీవితం, మనుషులు ఈ కథల నిండా కనిపిస్తారు. ఈ రచయిత్రికి బడుగు బలహీన వర్గాల పట్ల మమకారం వుంది. సానుభూతి వుంది. అలాంటి వారి జీవితాల్లో మార్పు రావాలని కోరుకుంది. అలాగే మహనీయుల జీవితాలను ఈ తరం చదివి స్ఫూర్తి పొందాలని కోరుకుంది.

ఈ కథల్లో ఎక్కువ భాగం వ్యక్తిగత సంస్కరణలను చూపిస్తాయి. అయితే అది చిన్న భాగం మాత్రమే. చాలా మంది ఓ సమస్యను చూపించి దానికి ఆదర్శాన్ని జోడిస్తూంటారు. మంచి కథకి ఇంకేదో కావాలి. మరింత లోతులకు వెళ్ళి సమస్య మూలాలు తెలుసుకోవాలి.

అన్నింటి కంటే భిన్నమైన కథ ‘వలసలు ‘. సామాజిక అన్యాయాల మీద ప్రశ్నించిన కథ. పోలవరం బాధితులగురించి మాత్రమేకాక అన్ని వలసల గురించి తడిమిన కథ. మరింత అధ్యయనం పెంచుకొంటే శైలజ గారి రచనల్లో గుణాత్మక మార్పు వస్తుంది అనే ఆశను కలిగించిన కథ” అన్నారు పి. చంద్రశేఖర ఆజాద్ తమ ముందుమాట ‘కథల ప్రపంచంలోకి శ్రీమతి మధుపత్ర శైలజ తొలి అడుగులు’లో.

***

“వాస్తవ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలను చక్కగా విపులీకరిస్తూ, అసంగతమైతే సరిదిద్దుతూ, పిల్లలకు, పెద్దలకు తగిన రీతిలో సమన్యాయం చేసేలా రచించిన ఇవి ఖచ్చితంగా కథానికలే.

శైలజ గారి కథానికల్లో మనసు స్పష్టీకరణకు, మానవ వ్యక్తీకరణకు మధ్య ఏమి చేయాలో తెలియక నిలుచున్న అమాయక సమాజం కనిపిస్తుంది. ఈ అమాయకతలోంచి ఈ సమాజాన్ని ఎలాగైనా, కాస్తంతైనా ఎదిగేలా చేయాలనే తపన కనిపిస్తుంది. తన పాత్రలతో నీతిని బోధిస్తుంది. ప్రగతి శీల దృక్పథాన్ని విడవకుండా, ఉబుసుపోని రచనలకు తావివ్వకుండా పాఠకుల మనసుల్ని నిత్య చైతన్యం వైపూ, నిజ దృక్పథం వైపు నడిపిస్తుంది. ఎందుకంటే ఈ రచయిత్రికి తెలుసు, కథంటేనే వాస్తవ దృశ్యాల అలంకరణ అని. కథంటేనే జీవితపు అరమరికల్లో తేడాలను గుర్తించి సరిచేయగల రక్షణ అని. ఇవి గాక జన జీవితంలోని సామాజిక సమస్యల్ని, సంక్లిష్ట జీవిత విధానాల్ని చిత్రించడమే కాకుండా వాటికి పరిష్కారాలు చూపేలా వీరి కథలు ప్రయాణం చేయడం బావుంది” అన్నారు శ్రీమతి శైలజామిత్ర తమ ముందుమాట ‘మానవీయతకు ఆనవాలు – మధుమాలిక’లో.

***

మధుమాలిక (కథాసంపుటి)
రచయిత్రి: ఉప్పలూరి మధుపత్ర శైలజ
పేజీలు:148, వెల: ₹ 60/-
ప్రతులకు: శ్రీమతి శైలజ,
ఫ్లాట్ నుం. 405, సి.ఎం.ఆర్. రెసిడెన్సీ, ఎం.ఎన్.ఆర్.హైస్కూల్ ఎదురుగా,
రెడ్డి కాలని, చందానగర్, హైదరాబాద్-500050. 7032094260

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here