‘మధురమైన బాధ – గురుదత్ సినిమా 1 – జాల్

3
10

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం గురుదత్ దర్శకత్వం వహించిన ‘జాల్’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

పూర్తిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోను చూపించిన గురుదత్ సినిమా ‘జాల్’

[dropcap]‘గు[/dropcap]రుదత్’ సినీ ప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే వారు కొన్ని సినిమాలలో నటించారు, కొన్నిటికి దర్శకత్వం వహించారు. కొన్నిటికి నిర్మాతగా వ్యవహరించారు. సినిమాకు సంబంధించిన అన్ని శాఖలలో వారికి ప్రవేశం ఉంది. తాను సంపాదించినదంతా సినిమా నిర్మాణానికే ఖర్చుపెట్టారు. సినిమా రంగంలో ముందు కొరియోగ్రాఫర్‌గా ప్రవేశించి తరువాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా, తరువాత దర్శకుడిగా మారిన ఆయన విభిన్న పార్శ్వాలలో ఇప్పటికీ ప్రపంచం అతన్ని గుర్తుపెట్టుకునేది దర్శకుడిగానే. వారి దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా ‘జాల్’. ఇది 1951లో రిలీజ్ అయ్యింది. అప్పట్లో అది సూపర్ డూపర్ హిట్. ‘బాజీ’ సినిమా తరువాత అందులో నటించిన దేవానంద్, గీతా బాలీలతోనే ఈ సినిమా తీయాలని సంకల్పించారు గురుదత్.

గురుదత్ మంగళూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి. గోవా నేపథ్యంతో వారికి పూర్వ పరిచయం ఉంది. అప్పటిదాకా గోవా ప్రాంతపు వ్యక్తుల ఇతివృత్తంతో సినిమా హిందీలో రాలేదు. పోర్చుగీసు ప్రభావిత ప్రాంతం అయిన గోవా ప్రాంతపు వ్యక్తులను అప్పటిదాకా దొంగలుగా, లేదా తాగుబోతులుగానో సినిమాలలో చూపించేవారు. ఇది గమనించి ఆ ప్రాంతాన్ని బేస్ చేసుకుని ఒక కథను రాసుకున్నారు గురుదత్. ఎం.ఏ.లతీఫ్ దీన్ని సినిమాకు అనుగుణంగా మార్చారు. అంతకు ముందు అశోక్ కుమార్ 1943లో నటించిన కిస్మత్, హిందీ సినిమా చరిత్ర లోనే మొదటి నెగటివ్ హీరో పాత్ర. అయితే ఆ పాత్రకన్నా భిన్నంగా స్వభావరీత్యా మోసపూరితమైన వ్యక్తిగా ఈ సినిమాలో హీరో పాత్రను మలిచారు గురుదత్. అంటే ఎటువంటి సానుభూతి లభించని పాత్ర ఇది. మొదటి నుండి చివరి దాకా చెడునే అంటి పెట్టుకుని ఉన్న పాత్ర. పరిస్థితుల కారణంగా అతను మోసగాడయినట్లు కాకుండా అతని స్వభావంలోనే నమ్మించి మోసం చేసే గుణం ఉందన్నది ఇక్కడ గుర్తించవలసిన విషయం. ఇలాంటి పాత్ర అప్పట్లో సినీ ప్రేక్షకులకు చాలా కొత్త. మనసు లేని దుర్మార్గుడైన ‘టోనీ’ పాత్రలో దేవానంద్ మొదటిసారి కనిపించారు.

అప్పట్లోని నోఇర్ సినిమా కల్చర్‌కు అతి దగ్గరగా ఉన్న సినిమా ‘జాల్’. నోఇర్ సినిమా అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల క్రిమినల్ స్వభావం, ఉద్దేశాల ఆధారంగా నిర్మించబడిన సినిమా. 1940 నుండి 50ల దాకా అమెరికన్ హాలీవుడ్ సినిమాలలో ఈ రకమైన కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ఫిలిం నోయర్ అన్నది ఒక ఫ్రెంచ్ పదం. దీని అర్థం బ్లాక్ ఫిలిం లేదా డార్క్ ఫిలింగా తీసుకుంటారు. అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, క్రైం తో సంబంధించిన కథ ఉన్న సినిమాలని అర్థం.

గురుదత్ దేవానంద్ ఇద్దరు కూడా విదేశీ సినిమాలను ఎక్కువగా చూసేవారు. ‘బాజీ’ సినిమా ఆ పద్ధతిలో నిర్మించినదే. దాని తరువాత మరో సినిమా తీయాలని అనుకుంటున్న సందర్భంలో ‘బిట్టర్ రైస్’ అనే ఇటాలియన్ సినిమా చూసారిద్దరూ. అది వారికి బాగా నచ్చింది. ఆ సినిమా ప్రేరణతో వినూత్నంగా గోవా నేపథ్యంలో ‘జాల్’ సినిమా కథ రూపొందింది. ఇందులో గోవా ప్రాంతపు మత్సకారులందరూ అంతకు ముందు సినిమాలలో చూపిన విధంగా తాగుబోతులు తిరుగుబోతులు కాదు. కష్టజీవులు, సాటి మనుష్యులను ప్రేమించే అమాయకులు, క్రైస్తవం బోధించే ప్రేమ సూత్రాలను ఆచరించే నిజాయితీపరులు. ఈ సినిమాలో పాత్రలందరూ క్రైస్తవులే అన్నది గమనించవలసిన మరో పాయింట్.

ప్రశాంతంగా జీవించే ఆ మత్స్యకారుల గ్రామానికి ఒక ఓడ వస్తుంది. దొంగ బంగారాన్ని రవాణా చేసే టోని నావలో ఆ ఊరు చేరతాడు. దోచుకున్న బంగారాన్ని దాచి దాన్ని మరో ప్రాంతానికి చేరవేసే పనిని లీజా అనే అమ్మాయి చేస్తూ ఉంటుంది. ఆమెకు ఆ వృత్తి ఇష్టం ఉండదు. కాని టోనీ బలవంతం మీద ఆ పనికి ఒప్పుకుంటుంది. ఈ గ్రామం దగ్గర రేవులో ఓడ నిలిచినప్పుడు ప్రయాణికులను తనిఖీ చేసే పోలీసుకు లీజాపై అనుమానం వస్తుంది. ఆమె బంగారంతో పారిపోతూ, పోలీసులను తప్పించుకోవడానికి ఒక చిన్న పడవలో దాక్కుంటుంది. ఈ పడవ మారియా అనే జాలరి అమ్మాయిది. ఆమె పట్టిన చేపలను అమ్ముకోవడానికి అక్కడికి వస్తుంది. అయితే లీజా అసహాయతకు జాలి పడి ఆమెను తన పడవలో దాచిపెడుతుంది. తనతో పాటు తన ఇంటికి తీసుకుని వస్తుంది.

మారియాకు కార్లోస్ అనే ఒక అన్న ఉంటాడు. అతనికి ఒక సముద్ర తుఫానులో జరిగిన ప్రమాదం వల్ల కళ్లు పోతాయి. అతనికి మారియా అంటే ప్రాణం. మారియా కూడా అన్నను జాగ్రత్తగా చూసుకుంటుంది. కళ్లు లేకపోయినా కార్లోస్ చాలా విషయాలను మనసుతో గ్రహిస్తాడు. వీరి ఇల్లు చేరిన లీజా తానొక దుర్మార్గపు కుటుంబం నుండి తప్పించుకువచ్చానని చెప్పినా, ఆమె కథ అతనికి నమ్మకం కలిగించదు. అదే రాత్రి లీజాను వెంబడించిన పోలీసు వారి ఇంటికి వస్తాడు. అతను వారి కుటుంబ మిత్రుడు. అప్పటికే లీజా మారియా దుస్తులు ధరించి ఉన్నందువలన ఆమెను అతను గుర్తుపట్టలేడు. తాను వెతుకుతున్న అమ్మాయి చీర కట్టుకుని ఉందని, ఆమె దొంగ అని అతను మారియాకి కార్లోస్ కి చెబుతాడు. మారియాకు మొదటిసారి లీజా పై అనుమానం వస్తుంది. లీజాను ఆమె చీర కట్టులోనే పడవలో దాక్కుని ఉండగా చూస్తుంది. అదే రాత్రి ఆమె బంగారాన్ని నేలలో తవ్వి దాచిపెట్టడం మారియా గమనిస్తుంది. తాను ఆ బంగారాన్ని తీసి ఇంట్లో జీసస్ ఫోటో వెనకాల పెడుతుంది. కార్లోస్‌కి అది దొరికినప్పుడు మారియా లీజా గురించి తాను తెలుసుకున్న నిజం చెబుతుంది. లీజాను ప్రశ్నిస్తున్న కార్లోస్‌కు ఆమె తన గతం గురించి చెబుతుంది. తాను ఒక మంచి కుటుంబంలో పెరిగానని. ఒక వ్యక్తిని ప్రేమించి అతని కోసం ఇల్లు వదిలి మంచి జీవితం ఊహిస్తూ గడప దాటానని చెబుతుంది. కాని ఆ వ్యక్తి తనను ఇంత దూరం తీసుకువచ్చి, తనతో దొంగ వ్యాపారం చేయిస్తూ చివరకి తాను పోలీసులకు పట్టుపడితే తనను రక్షించకుండా పారిపోయాడని, అతని మోసానికి తాను బలి అయింది కాని ఈ వృత్తి తనకు నిజంగా ఇష్టం లేదని చెబుతుంది. ఆమె కథ విని కార్లోస్, మారియా ఇద్దరు కూడా ఆమెను తమ ఇంట్లో ఉండిపొమ్మని చెబుతారు. లీజా వారి రక్షణలో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. కార్లోస్‌ని తన సోదరుడిగా స్వీకరించి ఆ ఇంటి సభ్యురాలిగా మారిపోతుంది.

లీజా ప్రేమించిన వ్యక్తి టోనీ. ఒక ఆదివారం చర్చ్‌కు మారియా లీజా నెక్లెస్ పెట్టుకుని వస్తుంది. అది టోని గుర్తుపడతాడు. ఆమెను అంతకు ముందు సంతలో గమనించిన టోనీ ఇప్పుడు లీజా నగ ఆమె మెడలో చూసి మారియాతో పరిచయం పెంచుకుంటాడు. మారియా అతని పట్ల ఆకర్షితురాలవుతుంది. అతన్ని తన ఇంటికి పిలుస్తుంది. అక్కడ టోనిని లీజా గుర్తు పడుతుంది. టోనీ తనను మోసం చేసి నట్లుగానే మారియాను మోసం చేస్తున్నాడని ఆమె గ్రహిస్తుంది. అందుకే మారియాకు టోని గురించి చెబుతుంది. టోని దుర్మార్గుడని విన్నా అతని అమాయకత్వం, నమ్మకం కలిగించే మాటలు మారియాను అతని ఆకర్షణ నుండి తప్పించలేకపోతాయి. అతను పన్నిన ప్రేమ వలలో ఆమె ఇష్టపూర్వకంగానే ఇరుక్కుపోతుంది.

సైమన్ అనే ఒక యువకుడు మారియాని మనస్పూర్తిగా ప్రేమిస్తాడు. కాని మారియా అతన్ని స్నేహితుడిగానే చూస్తుంది తప్ప ప్రేమించదు. టోనీ పట్ల ఆమె ఆకర్షణకు భయపడి లీజా ఈ విషయం కార్లోస్‌కి సైమన్‌లకు చెబుతుంది. కార్లోస్ మారియా నిశ్చితార్ధం సైమన్‌తో నిర్ణయిస్తాడు. కాని అదే రోజు టోనితో కలిసి మారియా పారిపోతుంది. ఆమె వెనుక కార్లోస్, సైమన్‌లు కూడా పోలీసులతో వెతుకుతూ బైలుదేరతారు. అయితే మారియాను మధ్యలో టోనీ అరబ్బులకు అమ్మేయాలని ప్రయత్నిస్తాడు. మారియా తప్పించుకుంటుంది. అప్పుడే పోలీసులు టోనిని చుట్టుముడతారు. టోని ముందు ప్రతిఘటిస్తాడు. కాని మారియా అతన్ని లొంగిపొమ్మని, అతను శిక్ష అనుభవించి వచ్చేదాకా అతని కోసం తాను వేచి చూస్తానని చెబుతుంది. ఆ నిముషంలో టోని ఆమె ప్రభావంలో పడి పోతాడు. తనను అంతగా ప్రేమించిన మారియా కోసం పోలీసులకు లొంగిపోతాడు. ఆమె తనకోసం వేచి ఉంటుందన్న నమ్మకం అతనికి జీవితం పట్ల కొత్త ఆశలు కలిగిస్తుంది. ఎవరైనా చెడు చెబితే వినవద్దు, చెడు చేస్తే అది మరొకరికి చెప్పవద్దు, చెడు దారిలో ఎవరన్నా నడుస్తున్నప్పుడు వారిని ఆపండి, తప్పు చేసిన వారిని క్షమించండి అనే సూక్తితో మొదలైన ఈ సినిమా ఆ అర్థం తోనే ముగిస్తుంది.

‘జాల్’ సినిమా సినిమాటోగ్రఫర్ వీ.కే.మూర్తి. వీరి పూర్తి పేరు వెంకటరామ పండిట్ కృష్ణమూర్తి. 2010లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందారు ఆయన. గురుదత్ సినిమాలకు తన సినిమాటోగ్రఫీతో ప్రాణం పోసారు వీ.కే మూర్తి. గురుదత్ మదిలో మెదిలో దృశ్యాలను ఆయన తెరపై గురుదత్‌కు కావలసిన విధంగా చిత్రీకరించేవారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో ఆయన పనితనం ఎంత గొప్పగా ఉండేదంటే, మన దేశం సినిమాటోగ్రఫీని అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు ఆయన. గురుదత్ దర్శకత్వం వహించిన ‘బాజీ’ సినిమాలో సినిమాటోగ్రఫర్ వీ. రాత్రాకు ఆయన అసిస్టెంట్‌గా చేసారు. ఆ సినిమాలో ఆయన పనితనం నచ్చి ‘జాల్’ సినిమాకు ఆయనకి సినిమాటోగ్రఫర్‌గా అవకాశం ఇచ్చారు గురుదత్. అలా ‘జాల్’ ఆయన పూర్తి స్థాయి సినిమాటోగ్రఫర్‌గా చేసిన మొదటి సినిమా. ఇందులో కొన్ని షాట్లలో వారి పనితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ‘పిగ్లా హై సోనా’ అనే పాటలో వెలుగు నీడలతో వీరు చిత్రించిన కొన్ని షాట్లు తరువాత రాబోయే గురుదత్ సినిమాలలో కనిపించబోయే గొప్ప చిత్రీకరణకు పునాదిగా నిలుస్తాయి. పాటలన్నిటిలో క్రేన్‌ను ఉపయోగించిన విధానం, పై నుండి తీసిన షాట్లు వీరి సిగ్నేచర్ మార్క్ సీన్లకు మొదటి పాఠాలని మనం ఈ సినిమాలో అర్థం చేసుకోవచ్చు.

‘జాల్’ సినిమాకు సంగీతం అందించింది ఎస్.డి. బర్మన్. గీతా దత్ గొంతు ప్రతి పాటలో శ్రోతలను ఆకట్టుకుంటుంది. హేమంత్ కుమార్ పాడిన ‘యే రాత్ యే చాందనీ ఫిర్ కహా‘ అన్న పాట ఇప్పటికీ హిందీ సినీ గీతాలలో ఒక అద్భుత గీతం. సినిమాలో గోవా జానపద సంగీతాన్ని ఉపయోగించారు ఎస్.డి. బర్మన్. ‘చోరీ చోరీ మేరీ గలీ ఆనా హై బురా’ అన్న పాట పూర్తి గోవా జానపద శైలిలో వినిపిస్తుంది. ‘దే భి చుకే హమ్ దిల్ నజరానా’ అన్న యుగళ గీతం గీతా దత్, కిషోర్ కుమార్ గొంతులతో అలరిస్తుంది. చెట్టు కొమ్మలపై దేవానంద్ గీతాబాలీల అల్లరి నేపద్యంలో చిత్రించిన ఈ పాట గురుదత్ ట్రేడ్ మార్క్ పాటగా ఇప్పుడు కనిపిస్తుంది. గురుదత్ సినిమాలన్నిటిలో కూడా పాటను చిత్రీంచే తీరు అప్పటి దర్శకులలోకి విభిన్నంగా ఉండేది. కథకు, పాత్రల మధ్య నడిచే సంభాషణకు కొనసాగింపుగా వారి సినిమాలలో పాటలు ఉండేవి. ఈ సినిమా పాటల్లో అది మనం గమనించవచ్చు. ఆలాగే ‘సోచ్ సమఝ్కర్ దిల్ కో లగానా‘ అనే మరో పాటలో గీతా దత్ గానం మర్చిపోలేం.

‘జాల్’ సినిమా పాటలన్నిటిని రాసింది ‘సాహిర్ లుధియాన్వి’. గురుదత్ తన సినిమాకు పని చేసిన వారిని మార్చడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. వీరితో కలిసి పని చేసిన వారంతా గురుదత్ టీంగా గుర్తింపు పొందారు. వారందరితో కలిసి పని చేయడానికే గురుదత్ ఆసక్తి చూపేవారు. గురుదత్ మొదటి సినిమా నుంచి సాహిర్‌తో పాటలు రాయించుకోవడాన్ని ఇష్టపడేవారు. ఎస్.డి. బర్మన్ సంగీతం చాలా పాపులర్‌గా ఉండేది. ఈ జోడి ‘ప్యాసా’ దాకా గొప్పగా పని చెసింది. కాని ‘ప్యాసా’ సమయంలో వచ్చిన మనస్పర్ధల కారణంగా సాహిర్ ఎస్.డి. బర్మన్‌తో పని చేయనని చెప్పారు. గురుదత్ దీన్ని హిందీ సినిమాకు జరిగిన నష్టంగా తరువాత పలు సందర్భాలలో చెప్పేవారు. ‘బాజీ’, ‘జాల్’, ‘ప్యాసా’ సినిమాలకు సాహిర్ రాసిన పాటలు, ఎస్.డి. బర్మన్ ఇచ్చిన సంగీతం సంగీత ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. ‘జాల్’ సినిమాలో సాహిర్ కలం చాలా అందంగా కదులుతుంది. పాత్రల వ్యక్తిత్వాన్ని ప్రకటిస్తుంది. బాజి సినిమాలో ‘సునో గజర్ క్యా గాయే‘ పాటలో ప్రత్యక్షంగా, ‘షర్మాయె కాహే‘ పాటలో పరోక్షంగా వ్యక్తపరచిన భావనను ‘యే రాత్ యే చాంద్నీ‘ పాటలో అత్యంత కవితాత్మకంగా వ్యక్త పరచాడు. జీవితం క్షణికం. ఈ క్షణం గడచిపోతే అది మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి జీవితాన్ని ఈ క్షణమే అనుభవించాలి అనే భావన సాహిర్ తన గీతాలలో అవకాశం దొరికినప్పుడల్లానేకాదు, అవకాశాన్ని సృష్టించుకుని మరీ ప్రదర్శించాడు. వినూత్న గేయ రచనా సంవిధానానికి తెర తీశాడు సాహిర్.

దుర్మార్గుడని తెలిసిన తరువాత కూడా, టోనీ తనను రమ్మని పాట పాడుతూ పిలుస్తున్నప్పుడు మారియా ఆ వాక్యాలలోని భావానికి కట్టుబడిపోతుంది. అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళుతుంది. సాహిర్ ఇక్కడ రాసిన వాక్యాలు చూడండి. “లెహరో కె హోఠో పె ధీమా ధీమా రాగ్ హై, భీగీ హవావో మే ఠండీ ఠండీ ఆగ్ హై, ఇస్ హసీన్ ఆగ్ మే తూ భీ జల్కె దెఖ్లే, జిందగీ కె గీత్ కీ ధున్ బదల్ కె దెఖ్లే, ఖుల్నే దె అబ్ ధడకనోం కీ జుబా, సున్ జా దిల్ కీ దాస్తాన్” ఈ వాక్యాలు విని మారియా ఆగలేకపోతుంది. కాని ఆమె విజ్ఞత టోని గతాన్ని గుర్తుచేస్తుంది. వీటి మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెకు మళ్ళీ ఈ వాక్యాలు వినిపిస్తాయి… “జాతీ బహారే హై ఉఠతీ జవానియా.. తారో కె చావో మె కెహలె కహానియా, ఎక్ బార్ చల్ దియె గర్ తుఝె పుకార్కే, లౌట్ కర్ నా ఆయెంగె కాఫిలే బహార్ కె, ఆజా అభీ జిందగీ హై జవాన్ .,,, సున్ జా దిల్ కీ దాస్తాన్” ఇక మారియా అగలేకపోతుంది. పరిగెత్తుకుంటూ టోనీని కలవడానికి వస్తుంది. ప్రేమ అనే భావానికి ఇటువంటీ వ్యక్తీకరణ తోడయితే అది అబద్ధమయినా కాని ప్రతి వారు దానికి లోబడిపోవలసిందే. అంత గొప్పగా ఉంటుండి సాహిర్ రచన, హేమంత్ కుమార్ గానం కూడా.

ఈ సినిమాలో ఎస్డీ బర్మన్ కు సహాయ సంగీత దర్శకుడిగా వున్న ఎన్ దత్త తరువాత స్వతంత్ర సంగీత దర్శకుడిగా ఎదిగేడు. చక్కని పాటలను అందించాడు. ఆయన సాహిర్ కు మంచి దోస్త్. ఎన్ దత్త సంగీత దర్శకత్వం వహించిన సినిమాలన్నిటికీ గేయ రచయిత సాహిరే..

ఈ సినిమాలో రెండు షాట్లలో గురుదత్ దర్శకత్వాన్ని ప్రత్యేకంగా గుర్తించాలి. లీజా మారియాకి టోనీ నిజస్వరూపం చెబుతున్నప్పుడు వారు ఒక జైంట్ వీల్లో కూర్చుని ఉంటారు. అది పైకి పోతున్నంతసేపు లీజా తన కథ చెబుతూ ఉంటుంది. మెల్లిగా అది క్రిందకు దిగుతూ మారియా ఆలోచనలను, అంత ఎత్తునుండి పడిపోతున్నట్లు బాధను అనుభవిస్తున్న ఆమె స్థితిని ఈ సీన్‌లో చూపిస్తారు గురుదత్. ఇక ‘యె రాత్ ఏ చాందినీ‘ పాట తరువాత పరుగెత్తుకుంటూ టోనీ కోసం వచ్చిన మారియా సముద్రపు ఒడ్డున ఉన్న వలలో చిక్కుకుపోతుంది. సినిమా కథకు, శీర్షికకు, మారియా స్థితికి గొప్ప అర్థం చెప్పే సీన్ అది. గురుదత్ తన సినిమాలలో ఇలాంటి సింబాలిక్ షాట్లను మొదట్లో చాలా ఇష్టపడి చిత్రించేవారు. అలాగే ప్రతి పాటల్లో వెలుగు నీడల దోబూచులాటతో పాత్రల మనోభావలను చూపడం వారి ట్రేడ్ మార్క్. ‘జాల్’ సినిమాలో అలాంటి కొన్ని సీన్లు కనిపిస్తాయి.

ఈ సినిమాలో టోనీ పాత్రలో దేవానంద్ నటన బావుంటుంది. కాని వీరి ఫర్మామెన్స్‌ను మించి ఉంటుంది గీతా బాలీ నటన. ‘కాబ్లర్’ అనే సినిమాతో పన్నెండేళ్ళ వయసులో సినీ రంగంలో అడుగుపెట్టారు గీతా బాలి. 1946లో ‘బద్‌నామీ’ అనే సినిమాతో హీరోయిన్‌గా అమె మారారు. 50లలో ఆమెకి హిందీ సినిమాలలో మంచి క్రేజ్ ఉండేది. షమ్మీ కపూర్‌ని వివాహం చేసుకున్నాక కూడా నటిస్తూనే ఉన్నారు. స్మాల్‌పాక్స్‌తో 1965లో కేవలం 35 సంవత్సరాల వయసులోనే మరణించారీమె. వీరికి అదిత్య రాజ్ కపూర్ అనే కుమారుడు, కంచన్ అనే కుమార్తె ఉన్నారు. ఆదిత్య కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి నటించారు కూడా. అయితే తరువాత కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో సెటిల్ అయ్యారు. ఇక లీజా పాత్ర వేసిన నటి పేరు పూర్ణిమ. ముస్లింగా జన్మించిన పూర్ణిమ అసలు పేరు మెహర్బానో మొహమ్మద్ అలీ. ఆమె మొదటి భర్త షౌకత్ అజ్మీ దేశ విభజన తరువాత పాకిస్తాన్ వెళ్ళిపోయారు. తరువాత భగవాన్ దాస్ వర్మను వివాహం చేసుకుని ఈమె పూర్ణిమ దాస్ వర్మగా మారారు. మొదటి భర్తతో కలిగిన కుమారుడు అన్వర్ హష్మి. ఇతను ఇమ్రాన్ హష్మి తండ్రి. అంటే పూర్ణిమ, ఇమ్రాన్ హష్మీకి స్వయంగా నాన్నమ్మ. ‘జంజీర్’ సినిమాలో అమితాబ్ బచ్చన్ తల్లిగా కూడా నటించారు ఆమె.

కార్లోస్‍గా నటించిన నటుడి పేరు కే.ఎన్. సింగ్. ఇతని తండ్రి చాంది ప్రసాద్ సింగ్ అప్పట్లో పేరున్న లాయర్, రాజ వంశస్థుడు. కే.ఎన్. సింగ్ జావలెన్, షాట్‌పుట్ క్రీడలలో భారత దేశం తరుపున బెర్లిన్ ఒలంపిక్స్‌కి సెలెక్ట్ అయ్యారు. కాని తన కుటుంబ మిత్రుడు పృథ్వీరాజ్ కపూర్ గారి ప్రోద్బలంతో సినిమాలలోకి ప్రవేశించారు. అలా హిందీ సినిమాలలో విలన్‌గా కారెక్టర్ నటుడుగా రెండు వందల సినిమాలకి పైగా పని చేశారు. ‘జాల్’లో గుడ్డివానిగా నటించిన ఈయన నిజ జీవితంలో వృద్దాప్యంలో పూర్తిగా చూపు కోల్పోయి గుడ్డివానిగానే జీవించారు. జీవితంలో ఎప్పుడూ సెట్ మీదకి లేటుగా వెళ్ళలేదనే రికార్డు వీరికి సొంతం. వీరు ఉంటే మిగతా నటులు సమయానికి వచ్చి తీరతారనే కారణంతోనే వీరికి చివర్లో చాలా సినిమాలలో కామెయో పాత్రలు ఇచ్చేవారట. 2000లో తొంభై ఒకటవ వయసులో మరణించారీయన. ‘జాల్’ సినిమాకి రాజ్ ఖోస్లా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసారు.  తరువాత రాజ్ ఖోస్లా దర్శకుడయ్యాడు. గురుదత్ పాట చిత్రీకరణ పద్ధతికి తనదయిన ప్రత్యేకతను జోడించి పాటల ఎంపికలో , చిత్రీకరణలో గురుదత్ కు తగ్గ శిష్యుడనిపించాడు.  ముఖ్యంగా సస్పెన్స్ సినిమాల నిర్మాణంలో గురుదత్ పంథాను అనుసరిస్తూ తనదైన ప్రత్యేక ఇమేజీని సృష్టించుకున్నాడు రాజ్ ఖోస్లా.  ఒక చిన్న పాత్రలో జానీ వాకర్ కూడా కనిపిస్తారు. అలా గురుదత్ తన టీంను ఈ సినిమాతో పూర్తిగా తయారు చేసుకున్నారు.

‘జాల్’ సినిమాలో గురుదత్ ఒక కామియో పాత్రలో కనిపిస్తారు. జాలరులందరూ చేపల వేటకు వెళుతూ, పడవలను సముద్రంలోకి బైటికి లాక్కునే సన్నీవేశంలో ‘జోర్ లగాకే హైసా‘ అనే పాట వస్తుంది. ఇందులో ఒక జాలారిగా కనిపిస్తారు ఆయన. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు వారు పోషించిన ఈ చిన్న కామియోను కూడా గమనించాలి. ‘జాల్’ గురుదత్ గొప్ప సినిమాలలో ఒకటిగా చెప్పలేం కాని ఒక మంచి మ్యూజికల్ హిట్ అన్నది మాత్రం నిజం. గురుదత్ గొప్ప చిత్రాలకు పునాదిగా దీన్ని ఒప్పుకోవాలి. అప్పట్లో అది పెద్ద కమర్షియల్ హిట్ కూడా. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక గొప్ప చారిత్రిక సంఘటనను ప్రస్తావించుకోవాలి.

పాకిస్తాన్ ఏర్పడిన తరువాత కూడా అక్కడ భారతదేశంలో నిర్మించిన సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. 1954లో పాకిస్తాన్ భారతీయ సినిమాల ప్రసారాన్ని తమ దేశంలో నిషేధించింది. అప్పుడు అక్కడ ‘జాల్’ సినిమా రిలీజ్ అయి ఉంది. తమ దేశంలో సినిమా రంగాన్ని అభివృద్ది పరుచుకోవడానికి భారతీయ సినిమా ప్రదర్శనలు ఆటంకమని నమ్మిన కొందరు పెద్ద ఎత్తున ఈ సినిమాతో ప్రారంభించి, భారతీయ సినిమా నిషేధానికి ఉద్యమించారు. ఉద్యమకారులు ‘జాల్’ సినిమా ప్రదర్శనలను నిలిపివేయాలని నినదించారు. భారతీయ సినిమా నిషేధాన్ని ఈ సినిమాతో ప్రారంభించి జాల్ మూమెంట్ అనే పేరుతో పిలుస్తూ ఒక ఉద్యమాన్ని నడిపారు అక్కడి సినిమా కళాకారులు. అలా ఈ సినిమా పాకిస్తాన్ సినీ చరిత్రలో కూడా గుర్తుండిపోతుంది.

జాల్ సినిమా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని ఏర్పాటు చేసుకోవటం కోసం దేవ్ ఆనంద్ చేసిన ప్రయత్నాలలో ఒక భాగం. దేవ్ ఆనంద్ సినీ రంగంలో ప్రవేశించిన తరువాత అతనికి తనదంటూ ఒక ముద్రవేసే అవకాశాలు రాలేదు. దాంతో తానే అన్నయ్య చేతన్ ఆనంద్ తో కలసి ఒక నిర్మాణ సంస్థను స్థాపించాలని నిర్ణయించాడు. ఫలితంగా నవకేతన్ సినీ నిర్మాణా సంస్థ ఆవిర్భవించింది. అంతకుముందు దేవ్ ఆనంద్ గురుదత్‌ల నడుమ ఒక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం దేవ్ ఆనంద్ సినిమా నిర్మిస్తే గురుదత్ కు దర్శకుడి  అవకాశం ఇస్తాడు. గురుదత్ కు ముందు అవకాశం లభిస్తే దేవ్ ఆనంద్ కు హీరో అవకాశం ఇస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం నవకేతన్ నిర్మించిన చిత్రం బాజీకి గురుదత్ దర్శకుడయ్యాడు. జాల్ సినిమా కూడా పరోక్షంగా దేవ్ ఆనంద్ ఆర్ధిక సహాయంతో నిర్మితమయిన సినిమా. ఈ సినిమాతో దర్శకుడిగా గురుదత్ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆయన తన స్వంత నిర్మాణ సంస్థను ఆరంభించాడు.
తనకంటూ ప్రత్యేకమైన ఇమేజీని ఏర్పాటు చేసుకోవటంలో దేవ్ ఆనంద్ అర్బన్ క్రిమినాలిటీనీ, అసంతృప్త యువత అరాచకానికి పాల్పడి నేరంవైపు ఆకర్షితమవటాన్నీ ప్రదర్శిస్తూ, ఏంటీ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజీని ఏర్పాటుచేసుకున్నాడు. అందుకు, బాజీ, జాల్ వంటి సినిమాల ద్వారా గురుదత్ దేవ్ ఆనంద్ ఇమేజీ ఏర్పాటులో ఏంతో తోడ్పడ్డాడు. అయితే, ప్రతి అయిదేళ్ళకూ తన ఇమేజీని మార్చుకుంటూ దేవ్ ఆనంద్ దాదాపుగా 50ఏళ్ళు ఎవర్ గ్రీన్ నటుడిగా నిలిచాడు.

జాల్’ సినిమా దేవానంద్ ప్రొడక్షన్స్‌కి గురుదత్ చేసిన ఆఖరి సినిమా. దీని తరువాత ఆయన సొంతంగా గురుదత్ ఫిలింస్‌ని ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here