మధురమైన బాధ – గురుదత్ సినిమా 14 – బహారే ఫిర్ భీ ఆయేంగీ

0
10

[box type=’note’ fontsize=’16’] గురుదత్ నిర్మించిన ‘బహారే ఫిర్ భీ ఆయేంగీ’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

[dropcap]‘బ[/dropcap]హారే ఫిర్ భీ ఆయేంగీ’ 1966లో వచ్చిన సినిమా. గురుదత్ మరణించేటప్పటికే ఈ సినిమా పన్నెండు రీళ్ళ షూటింగ్ జరుపుకుంది. ఆయన మరణంతో ఈ సినిమా ఆగిపోయింది. కాని అప్పటికే సినిమా కోసం చేసిన అప్పులు  తీర్చవలసిన పరిస్థితిలో ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయవలసిన అవసరం ఏర్పడింది. గురుదత్ సినిమాలను విశ్లేషిస్తున్నప్పుడు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం ఉంది.  ఒక దర్శకుని ప్రతిభను గుర్తించాలంటే అతను లేకుండా చేసిన సీన్లను అతని పర్యవేక్షణలో చేసిన సీన్లను పోల్చి చూసుకునే అవకాశం అన్నిసందర్భాలలో రాదు. గురుదత్ మరణం ద్వారా ‘బహరే ఫిర్ భి ఆయేగీ’ సినిమాను ఆ విధమైన స్టడీకి ఉపయోగించుకునే అవకాశం గురుదత్ సినిమాలను పరిశీలించాలనే శ్రద్ధ ఉన్నవారికి కలుగుతుంది. గురుదత్ తాను దర్శకుడిగా పని చేయడం ‘కాగజ్ కే ఫూల్’ తరువాత విరమించుకున్నా, గురుదత్ ప్రొడక్షన్స్‌లో మరే దర్శకుడితో పని చేయించుకుంటున్నా అందులో గురుదత్ మార్క్ తప్పకుండా ఉండేది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ పూర్తిగా వారి పర్యవేక్షణలోనే జరిగేది అన్నది అందరూ ఒప్పుకున్న విషయమే. ఈ సినిమాలో గురుదత్ జీవించి ఉండగా మిగతా నటులతో చేయించిన సీన్లను యథాతథంగా ఉంచేసి తరువాత షూట్ చేసిన సీన్లను జతపరిచి సినిమాను రిలీజ్ చేసారు. అందుకే గురుదత్ జీవించి ఉండగా షూట్ చేసిన సీన్లను అతను లేకుండా తీసిన సీన్లలో తేడా స్పష్టంగా ఈ సినిమాలో గమనించే అవకాశం దొరుకుంతుంది.

‘బహారే ఫిర్ భి ఆయేంగి’ సినిమాలో గురుదత్, మాలా సిన్హా, తనూజ, జానీ వాకర్, ప్రధాన తారాగణంగా కొన్నాళ్ళు షూటింగ్ నడించింది. ఈ సినిమాకు మాటలు అందించింది అబ్రర్ అల్వి. దర్శకత్వం వహించింది షాహిద్ లతీఫ్. ఇతను రచయిత్రి ఇస్మత్ చుగ్తాయి భర్త. గురుదత్ చివరి రోజులలో ఆయనను దగ్గరగా పరిశీలించే అవకాశం ఈ సినిమా ద్వారా వీరికి లభించింది. గురుదత్ మరణం తరువాత ఇస్మత్ చుగ్తాయి ఉర్దూలో ‘అజీబ్ ఆద్మీ’ అనే  నవలను గురుదత్ జీవిత కథ ఆధారంగానే రాసారు.  ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా రాసిన నవల అది. ఆ నవలను అంత లోతుగా ఇస్మత్ చుగ్తాయి రాయడానికి కారణం గురుదత్‌తో కొన్నాళ్ళు పని చేసిన అనుభవం కూడా అన్నది గమనించవలసిన విషయం.

న్యూ ధియేటర్స్ వారు హిందీ బెంగాలీ భాషలలో 1937లో నితిన్ బోస్ దర్శకత్వంలో ‘ప్రెసిడెంట్’ అనే సినిమా తీసారు. ఇదే సినిమా ‘దీదీ’ పేరుతో బెంగాలీలో రిలీజ్ అయింది. కె. ఎల్ సైగల్, లీలా దేశాయిలు నటించిన ఈ సినిమా సైగల్ కు మంచి పేరు తీసుకువచ్చింది. ఇందులో సైగల్ పాడిన “ఇక్ బంగలా బనే న్యారా” అనే పాట అప్పట్లో సూపర్ హిట్ అయింది. కేదార్ శర్మ రాసిన ఈ పాట భారతీయ సగటు మనిషికి సొంత ఇంటిపై ఉండే కోరికకు ప్రతీకగా నిలిచింది. కాటన్ మిల్స్ నేపథ్యంలో నడిచిన ఈ కథను గురుదత్ తన సినిమాకు న్యూస్ పేపర్ ఆఫీస్ నేపథ్యంలో తిరిగి రాసుకున్నారు.

అయితే సినిమాను తీస్తున్నప్పుడే గురుదత్ పన్నెండు రీళ్ళ షూటింగ్ తరువాత కూడా ఇది అనుకున్నట్లుగా రావట్లేదనే అసంతృప్తిని ప్రదర్శించేవారు. గురుదత్ ఆఖరి రోజు అబ్రర్ అల్వీతో ఈ సినిమాలో చేయవలసిన మార్పుల గురించే చర్చించాలనే అబ్రర్ అల్వీని తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. అప్పుడు వారి మధ్య సినిమాలో మాలా సిన్హాకు చివర్లో మతి చలించే సీన్ గురించిన చర్చ జరిగింది. నేను కూడా పిచ్చివాడిని అవుతున్నాను అబ్రర్ అని గురుదత్ తనతో ఆ అఖరి రాత్రి అన్నారని తాను ఆ మాటలు కొట్టి పడేసానని అబ్రర్ అల్వీ తన పుస్తకంలోనూ,  నస్రీన్ మున్నీ కబీర్ గురుదత్ పై తీసిన డాక్యుమెంటరీకిచ్చిన ఇంటర్వ్యూ లోనూ చెప్పారు. ఈ సినిమాకు ముందుగా ఎస్. డి. బర్మన్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు గురుదత్. కాని అప్పటీకే బర్మన్ ఆరోగ్యం పాడయిన కారణంగా కొన్ని నెలలు పనికి దూరంగా ఉండవలసి వచ్చింది. పని విషయంలో ఎటువంటీ నిర్లక్ష్యాన్ని, ఆలస్యాన్ని భరించలేని గురుదత్ ఎస్. డి. బర్మన్ కోసం ఆగలేక ఓ.పి. నయ్యర్ కు సంగీత బాధ్యతలు అప్పగించారు. ఓ.పి. గురుదత్‌కు సినిమాలు చేసి చాలా రోజులయ్యింది. ఎంతో శ్రద్దతో ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు ఆయన.

బహారే ఫిర్ భీ ఆయేగీ సినిమా స్టిల్ లో గురుదత్

మరో సినిమా రికార్డింగ్‌లో ఓ.పి. నయ్యర్ ఉండగా అతనితో సినిమా విషయంలో ఏదో చెప్పాలని గురుదత్ అతనింటికి ఫోన్ చేసారట. సెల్ ఫోన్లు లేని కాలం అది. తరువాత రాజ్ కపూర్‌తో మాట్లాడి  మరుసటి రోజు అతన్ని కలవాలని నిశ్చయించుకున్నారట. మాల సిన్హాతో కూడా మాట్లాడి, కథలో కొన్ని మార్పులు చర్చించడానికి మరుసటి రోజు ఆమెను కలవాలని చెప్పారట. అతని గొంతులో అసహనాన్ని గమనించిన రాజ్ కపూర్,  ఓ.పి. నయ్యర్ ఇంటికి ఫోన్ చేసి గురుదత్‌ని కలవమని నయ్యర్‌కి కబురు చేసారట. అయితే ఇంటికి ఆలస్యంగా వచ్చిన నయ్యర్ ఇంట్లో వారు గురుదత్ ఫోన్ల గురించి చెప్పినా మరుసటి రోజు కలుద్దాం కదా అని బద్దకించి పడుకుండిపోయారట. ప్రొద్దున గురుదత్ ఇంటికి వెళ్ళేసరికి అబ్రర్ అల్వీ ఇంటి ముందు ఏడుస్తూ కనిపించారట. తాను ఆ రాత్రి గురుదత్ కి పోన్ చేయకుండా ఉండడం తనను తాను క్షమించుకుకోలేని పెద్ద తప్పిదం అని ఓ.పి. నయ్యర్ కొన్ని సందర్భాలలో చెప్పారు కూడా. ఓ.పి.నయ్యర్ జీవిత కథ నుండి సేకరించిన  విషయాలు ఇవి. నయ్యర్ గురుదత్ పార్ధివ దేహాన్ని చూసి ఆశ్చర్యపోయారట. ఎప్పుడూ అశాంతిగా,  అసహనంగా కనిపించే గురుదత్ మృత్యువులో చాలా ప్రశాంతంగా కనిపించారట. ఆ రోజు ‘బహరే ఫిర్ భీ ఆయెంగీ’ సినిమా కోసం ఆయన ఒక పాటకు ట్యూన్ కట్టుకుని వచ్చారట. గురుదత్ పార్ధివ దేహాన్ని చూసినప్పుడు అతనికి ఆ పాటే మళ్ళీ గుర్తుకు వచ్చిందని ఆయన ప్రస్తావిస్తారు.

గురుదత్ కి సినిమా తాను అనుకున్నట్లుగా రాకపోతే ఎన్ని రీళ్ళూ ఖర్చయినా దాన్ని మధ్యలో వదిలేసే వారట. అలా ఆయన సగం నిర్మించి వదిలేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అబ్రర్ అల్వీ తన పుస్తకంలో గురుదత్ ఈ సినిమా విషయంలో నిరాశగానే ఉన్నారని, ఆయన జీవించి ఉంటే దీన్ని రిలీజ్ చేసి ఉండేవారు కాదని ఒక అభిప్రాయం కూడా వెల్లడిస్తారు.

సినిమా షూటింగ్ లో టేక్ ఇస్తున్న గురు దత్

గురుదత్ సోదరుడు ఆత్మారాం, అబ్రర్ అల్వీ ఇద్దరు కలిసి ఈ సినిమాను మొత్తానికి పూర్తి చేసారు. గురుదత్ చేసిన పాత్ర కోసం దేవ్ ఆనంద్, సునీల్ దత్, జాయ్ ముఖర్జీలను సంప్రదించారు. సునీల్ దత్‌తో గురుదత్ అంతకు ముందు ‘రాజ్’ అనే ఒక సినిమా తీద్దామనుకుని మధ్యలో దాన్ని ఆపేసారు. అప్పటి నుండి సునీల్ దత్ గురుదత్‌పై కోపంగానే ఉన్నారు. అదీ కాక వహీదా రెహ్మన్ గురుదత్ సినిమాలతో కాంట్రాక్టు ముగిసిన వెంటనే గురుదత్ అనుమతి లేకుండా అతనికి కనీసం తెలియపర్చకుండా  సునీల్ దత్‌తో సినిమా చేయడానికి ఒప్పుకుంది. అలా తన కెరీర్‌ను ఆమె గురుదత్ పర్యవేక్షణ నుండి తప్పించింది. అప్పుడు కూడా గురుదత్ సునీల దత్ నడుమ కొన్ని సంఘటనలు నడిచాయి. షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి గురుదత్ తన స్టేచర్, సినీరంగంలో తన స్థానం అన్నీ మరచి వహీదా రెహ్మాన్ ను తనతో రమ్మని బ్రతిమాలాడని అక్కడ జరిగిన వాగ్వివాదంలో సునీల్ దత్, గురుదత్ పై చేయి చేసుకున్నారని ఇస్మత్ చుగ్తాయి తన పుస్తకంలో వివరంగా రాసారు కూడా. ఇక దేవ్ ఆనంద్,  జాయ్ ముఖర్జీలు మరణించిన హీరో పాత్ర తాము చేయడం తమకు శుభ సూచకం కాదని ఈ సినిమా కష్టాలు తెలిసి కూడా గురుదత్ ప్రొడక్షన్స్ ఎదుర్కుంటున్న ఆర్థికమైన నష్టాల గురించి తెలిసి కూడా సహాయపడడానికి ముందుకు రాలేదు. అప్పుడు అబ్రర్ అల్వీ ధర్మేంద్రను కలుసుకున్నారు.

సినిమాలో ఒక సీన్

ధర్మేంద్ర సినిమాలలోకి రావాలనుకుంటున్న రోజుల్లో ఫిలింఫేర్ పత్రిక జరిపిన టాలెంట్ పోటీలలో నిలబడ్డారు. ఆ పోటీలకు న్యాయ నిర్ణేతగా గురుదత్ రావలసి ఉంది. అక్కడ సెలెక్ట్ అయిన వారికి గురుదత్ ఫిలింస్‌లో చాన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. గురుదత్ మరోచోటకి ప్రయాణం అవుతూ తన టీంలో ముఖ్య వ్యక్తి అయిన అబ్రర్ అల్వీని ఆ పోటీలకు పంపారు. అల్వీ న్యాయనిర్ణేతగా ధర్మేంద్రను పోటీలో సెలెక్ట్ చేసారు. అతనికి తరువాత గురుదత్ ఫిలింస్ లో స్క్రీన్ టెస్ట్ కూడా చేసారు. కాని గురుదత్ సినిమాలలో నటించే అవకాశం ధర్మేంద్రకు రాలేదు. తనకు అంత ప్రోత్సాహం ఇచ్చిన గురుదత్ ఫిలింస్‌ను ధర్మేంద్ర మర్చిపోలేదు. సహాయం కోరుతూ అబ్రర్ ధర్మేంద్రకు తమ సమస్య వివరించగానే మరో ఆలోచన లేకూండా ధర్మేంద్ర ఈ సినిమాలో గురుదత్ పాత్రలో తిరిగి నటించడానికి ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని చాలా వివరంగా TEN YEARS WITH GURU DUTT అనే పుస్తకంలో అబ్రర్ అల్వీ చెప్పుకొస్తారు.  గురుదత్  చనిపోయిన సంవత్సరం తరువాత ఈ సినిమా సెట్స్ పైకి మళ్ళీ వెళ్లింది.

సినిమాలో మాలా సిన్హాతో మరో సీన్

గురుదత్ సినిమాలలో అతని టీం మొత్తం కలిసి పని చేసేది. కాని ఈ సినిమాలో   గీతా దత్ స్వరం వినిపించదు. భర్త చనిపోయిన షాక్‌తో గీతా దత్ తరువాత సంవత్సరం పాటు నర్వస్ బ్రేక్ డౌన్‌తో మంచానికి పరిమితం అయింది. తన బిడ్డలనే గుర్తు పట్టలేని స్థితిలో ఆమె ఉంది. ఇందులో పాటలన్నీ ఓ.పి. నయ్యర్ ఆశా భోంస్లేతో పాడించారు. లతతో ఆయన కలిసి పని చేయరు. గీతా దత్ పాడే స్థితిలో లేదు. కాబట్టి ఆ పాటలు పాడే అవకాశం ఆశా భోంస్లేకు దక్కింది. ఇక గురుదత్ సినిమాలలో సినిమాటోగ్రఫీ ఎప్పుడూ వీ.కే.  మూర్తి గారే చేసేవారు. ఈ సినిమాకు మాత్రం కే. జీ. ప్రభాకర్ సినిమాటోగ్రఫీ అందించారు.  కేజీ ప్రభాకర్ గతంలో ప్యాసా, కాగజ్ కే ఫూల్, సాహబ్ బీబీ ఔర్ గులాం సినిమాల్లో వీకే మూర్తికి అసిస్టంట్ గా పనిచేశారు. గురుదత్ పనితీరు తెలుసు. అందుకే చాలా చక్కని కెమేరా పనితనాన్ని ఈ సినిమాలో చూపారాయన.

సినిమా కథను మార్చి ఏదోలా సినిమాను ముగించినా సినిమా ఎవరూ ఆశించినట్లు రాలేదు. మాలా సిన్హా నటనలో మెలోడ్రామా అతిగా కనిపిస్తుంది.సినిమా షూటింగ్ ఆరంభమయినప్పటినుంచీ గురుదత్ మాలాసిన్‌హాను నటనలో నియంత్రణ పాటించమని చెప్పేవారు. ఆయన తరువాత ఆమె నటనను నియంత్రించేవారు లేకపోవటంతో, అప్పటికే హిట్ హీరోయిన్ అయిన మాలా సిన్‌హా తనకలవాటయిన రీతిలో మెలోడ్రామా ప్రదర్శించింది. ధర్మేంద్ర, జానీ వాకర్లు తామేం చేయాలో తెలియని అయోమయంలో కనిపిస్తారు. ఈ సినిమాకి ఒక్క తనూజ మాత్రమే కాస్త ఊపిరి పోసారని  చెప్పవచ్చు. ఇక ఓ.పి. నయ్యర్ అద్భుతమైన బాణీలు సినిమాను కొందరి దృష్టిలోనయినా నిలిపాయి. రఫి పాడిన “ఆప్ కే హసీన్ రుఖ్” హింది సినిమాలలో అందమైన ప్రేమ గీతాలలో ఒకటిగా నిలిచిపోతుంది.

సినిమా సమాచారంతో మరో ఫోటో

సినిమాలో మాలా సిన్హా ఆఫీస్‌లో చేసిన సీన్లు కొన్ని గురుదత్ జీవించి ఉండగా షూట్ చేసినవి. అలాగే ఆమె పై చిత్రించిన పాట “వో హస్ కె మిలే హంసే” కూడా గురుదత్ తరహాలో చిత్రీకరణ జరిగిన పాట. ఈ పాటను ఆయనే తీసారని సినిమాకు పని చేసిన వారు కొన్ని సందర్భాలలో చెప్పారు. జాగ్రత్తగా గమనిస్తే ఈ పాటలో లైట్ అండ్ షేడ్లతో చేసిన ప్రయోగం, కొరియోగ్రఫీ గురుదత్ చిత్రీకరణకు అతి దగ్గరగా ఉంటుంది. మరే పాటలో మనకు ఆ స్టైల్ కనిపించదు. మాలా సిన్హా శరీర భాష కూడా కొన్ని సీన్లలో చాల కంట్రోల్డ్‌గా డిగ్నిఫైడ్‌గా ఉంటూ కొన్ని చోట్ల హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఒక నటిలో ఒకే సినిమాలో ఇంత కాంట్రాస్ట్ ఈ సినిమాలో మాత్రమే గమనిస్తాం. షాహిద్ లతీఫ్ పేరు అలాగే ఉంచేసినా, గురుదత్ ఉన్న సమయాలలో అతని పర్యవేక్షణలో తీసిన సీన్లలోని ఈస్తటిక్ సెన్స్ తరువాత అదే టీం మళ్ళీ కలిసి పని చేసినప్పుడు కనిపించదు. మనం నిశితంగా గమనించినప్పుడు స్పష్టంగా ఈ తేడా కనిపిస్తూ గురుదత్ పనితనం పట్ల ఒక అవగాహన కలిగిస్తుంది. “ఆప్ కే హసీన్ రుఖ్ పె” అన్న పాటలో కొన్ని షాట్లు ఒక రకంగా,  మరి కొన్ని మరో రకంగా ఉంటాయి. ముగ్గురు ఆర్టిస్టుల క్లోజ్ అప్ షాట్లు విడి విడిగా అనిపిస్తాయి.  ఒక సందర్భంలో గురుదత్ కుమారుడు అరుణ్ దత్ ఈ సినిమాకి షూట్ చేసిన పన్నెండు రీళ్ళు ఎవరూ జాగ్రత్త పర్చలేదని చెప్పారు. లేకపోతే అవి విడిగా ఒక స్టడి మెటీరియల్ అయ్యుండేవి. సినిమా షూట్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో తీసిన ఫోటోలు మాత్రమే గురుదత్ ఈ సినిమాకు సంబంధించి హీరోగా కొంత సినిమాను చేసారనడానికి గుర్తుగా ఉన్నాయి.( అ ఫోటోలన్నీ ఈ వ్యాసంతో జత పర్చాము) తనూజ కూడ గురుదత్ ఉన్నప్పుడు తమపై చిత్రించిన షాట్లను ఈ సినిమాకు ఉపయోగించుకున్నాం అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

సినిమా కథకు వస్తే కలకత్తాలో ఒక దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ అమిత. ఆమె వద్ద రిపోర్టర్‌గా పని చేస్తుంటాడు జితేంద్ర గుప్త. గనులలో పని చేస్తున్న కార్మికుల గురించి ఒక వ్యాసం రాస్తాడు అతను. అవి కొన్ని రోజుల్లో కూలిపోయే స్థితిలో ఉన్నాయి అని అతను రాసిన వ్యాసాన్ని ప్రచురించకుండా ఆపుతాడు ఆ పత్రిక ముఖ్య సంపాదకుడు. కాని జితేన్ అ వ్యాసాన్ని ఎవరికీ తెలియకుండా పేపర్‌లో ప్రచురిస్తాడు. సంపాదకుని సంతకాన్ని ఫోర్జరీ చేసి జితేన్ ఆ వ్యాసాన్ని పేపర్‌లో వచ్చేలా చేస్తాడు. అతను చేసిన ఈ పని యాజమాన్యానికి తెలిసి వారు అమితను సంజాయిషీ అడుగుతారు. అమిత ఈ మోసాన్ని సహించలేక జితేంద్రను ఉద్యోగం నుండి తీసివేస్తుంది. కాని అతను చెప్పినట్లే గనులలో ప్రమాదం జరిగి సుమారు 135 మంది కార్మికులు మరణిస్తారు. తమ పత్రిక బోర్డ్‌లో ఉన్నవారందరూ ఈ గనుల లావాదేవీలతో సంబంధం ఉన్నవారని ఆమెకు తరువాత అర్థం అవుతుంది. జితేంద్రను పిలిచి తన కంపెనీలో ప్రధాన సంపాదకుడిగా తిరిగి ఉద్యోగం ఇస్తుంది అమిత.

ఉద్యోగంలో మళ్ళీ చేరమని జితేన్ ను ఆఫీసులోకి ఆహ్వానిస్తున్న అమిత

అమిత చెల్లెలు సునీత పరీక్షలలో ఫెయిల్ అయ్యానని భయపడి రైలు నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. ఆమెను కాపాడుతాడు అదే రైలులో ఉన్న జితేన్. వారి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. కాని అమిత కూడా జితేన్‌తో ప్రేమలో పడుతుంది. చెల్లెలి కోసం ఇంటికి వచ్చిన జితేన్ తన కోసం వచ్చాడని భ్రమిస్తుంది. తండ్రి వదిలి వెళ్ళిన బాధ్యతలతో సతమతమవుతూ సాధారణ జీవితం కోసం అర్రులు చాచి ఉన్న అమిత జితేన్‌ని ఆరాధిస్తుంది. అతనితో తన భవిష్యత్తుని ఊహించుకుంటుంది. కాని తాను అమితంగా ప్రేమించే చెల్లెలు అతన్ని ప్రేమిస్తుందని తెలుసుకుని ఆమె షాక్‌కు గురి అవుతుంది. వారిద్దరి కోసం  తన ప్రేమను త్యాగం చేస్తుంది. చైనాతో దేశానికి 1962లో జరిగిన యుద్ధాన్ని కవర్ చేయడానికి వెళ్ళిన జితేన్ క్షేమం కోసం అక్క చెల్లెలిద్దరూ ఆరాట పడతారు. తాను ఎప్పటికీ జితేన్ పై ప్రేమను చంపుకోలేనని అమితకు అర్ధం అవుతుంది.

ఈ లోపు అక్క జితేన్‌ను ప్రేమిస్తుందని సునీతకు తెలుస్తుంది. ఆమె మరో వివాహం చేసుకుని అక్క కోసం తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటుంది. ఈ లోపు మతి చలించి, హార్ట్ ఎటాక్‌తో అమిత జితేన్ చేతుల్లో మరణిస్తుంది. ఆ పత్రిక బాధ్యతలను, ఆశయాలను జితేన్‌కు అప్పగిస్తుంది. ఆమె మరణించే ఆఖరి క్షణాలలో ఆమెకు తనపై ఉన్న ప్రేమను తెలుసుకుంటాడు జితేన్.

కథాపరంగా కూడ అంతగా ఆకట్టుకోదు ఈ సినిమా. ఇక టేకింగ్‌లో చాలా అతుకులు కనిపిస్తాయి. కాని హాయిగా వినిపించే పాటలు ఈ సినిమాను చూడాలనిపించేలా చేస్తాయి. మహేంద్ర కపూర్ పాడిన “బదల్ జాయే అగర్ మాలి” అనేది ఈ సినిమాకు టైటిల్ సాంగ్. ఈ పాటను కైఫీ ఆజ్మీ రాసారు. మంచి సాహిత్యంతో, సంగీతంతో ఆకట్టుకునే గీతం ఇది. “వో హంస్కే మిలే హమ్సే” అనే పాట ఎస్. హెచ్. బీహారి రాసారు, ఆశా భోంస్లే గానం చేసారు. “దిల్ తో పెహ్లే సే మద్ హోష్ హై” అన్న పాటను రఫీ ఆశాలు గానం చేసారు. ఇది షేవాన్ రిజ్వీ రాసిన గీతం. ఇక ఆజిజ్ కశ్మీరీ రాసిన “సునో సునో మిస్ చటర్జీ” అనే గీతం జానీ వాకర్ పై చిత్రించిన పాట. గురుదత్ సినిమాలన్నిటిలో జానీ వాకర్‌కు ఒక ప్రత్యేక గీతం ఉండేలా చూసుకునే వారు. “కోయీ కెహ్దే కెహ్దే” అనే మరో ఆశా పాట కూడా అజీజ్ కశ్మీరీ రాసిందే. ఇక అంజాన్ రాసిన “ఆప్కే హసీన్ రుక్ పె” అన్న పాట రఫీ నోట పలికిన ఒక అద్భుత గీతం.

ఆప్ కే హసీన్ రుఖ్ పాట గురించి, పాట చిత్రీకరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సివుంటుంది. ఈపాటను గురుదత్ చిత్రీకరించాడు. గురుదత్ మరణం తరువాత ఆయన కనిపించే సీన్లను ధర్మేంద్రతో చిత్రీకరించారు. ధర్మేంద్ర కనబడని షాట్స్ అన్నీ గురుదత్ చిత్రించినవి. ధర్మేంద్ర షాట్స్ కూడా గురుదత్ ఎలా చిత్రీకరించాడో అలాగే చిత్రీకరించారు. ఈ పాటలో నటించేముందు ధర్మేంద్ర గురుదత్ చిత్రీకరించిన పాటను పలుమార్లు చూశాడు. గురుదత్ చూపిన తీవ్ర భావనలో వందవవంతుకూడా తాను చూపలేకపోయానని అన్నాడు.
బహారే ఫిర్ భి ఆయేంగీ సినిమా తయారయ్యే సమయానికి హిందీ సినిమా రంగులద్దుకుంది. నలుపు తెలుపుల సినిమాలు దాదాపుగా అదృశ్యమయ్యాయి. కానీ గురుదత్ తన జీవితంలో రంగుల సినిమాకు దర్శకత్వం వహించలేదు. అందుకని ఎంతమంది చెప్పినా వినకుండా ఈ సినిమాను నలుపు తెలుపులోనే తీయాలని నిశ్చయించుకున్నాడు గురుదత్. గురుదత్ పర్యవేక్షణలో ఛాయాగ్రహకుడు ప్రభాకర్ నలుపు తెలుపుల్లో అద్భుతమయిన రీతిలో దృశ్యాలను కెమేరాలో బంధించాడు. ఆప్ కే హసీన్ రుఖ్ పాట చిత్రీకరణ ఒక రకంగా తనంతట తాను ఒక కథను చెప్తుంది.
సినిమాలో ఈ పాట వచ్చేసరికి ఇద్దరు సోదరిల్లో గురుదత్ ఎవరిని ప్రేమిస్తున్నాడన్నది అంతగా స్పష్టం కాదు. అక్కచెల్లెళ్ళకి ఇద్దరూ ఒక్కడినే ప్రేమిస్తున్నారన్న విషయమూ తెలియదు. పాట ఆరంభంలో ఇదీ పరిస్థితి. పాట చిత్రీకరణ ఆరంభంలో ఈ సస్పెన్స్‌ను పెంచుతుంది. అక్క చెళ్ళెల్లిద్దరూ నాయకుడిపై ఒకే రకమయిన దృక్కులు ప్రసరిస్తూంటారు. కెమేరా వీరి చూపులను క్లోస్ అప్ లో సమాంతరంగా ఒకరితరువాత మరొకరిని చూపుతూంటుంది. సినిమాల్లో సస్పెన్స్ దృశ్యాలలో ఇలాంటి టెక్నిక్ వాడతారు.
పాట సగం అయ్యేసరికి ఇద్దరూ చెరోవైపునుంచి నాయకుడి దగ్గరకు వస్తారు. పియానోకు చెరోవైపు నిలబడతారు. కెమేరా ధర్మేంద్ర వెనుకనుంచి ముగ్గురినీ చూపిస్తూ, ఒక ముక్కోణపు ప్రేమ కథను దృశ్యాన్ని తెరపై చిత్రిస్తుంది. కెమేరా ఈ కోణం మరో పని చేస్తుంది. తనూజ పాత్ర నాయకుడికి దగ్గరగా వంగి, చూసే చూపులో విశ్వాసం కనిపిస్తుంది. నాయకుడితో సాన్నిహిత్యం ఆమె బుగ్గపై చేయిపెట్టుకుని, కెమేరాపై అనుకుని చూడటంలో తెలుస్తుంది. ఇదే సమయానికి మాలా సిన్‌హా కాస్త దూరంగా, సిగ్గుతో, నాయకుడివైపు తిన్నగా చూడకున్నా, సర్వేంద్రియాలు అతనిపై కేంద్రీకరించి నిలుచోవటంలోనే, ఆమె, తనూజా అంత ఔట్ గోయింగ్ మనిషి కాదని, మనసులోమాటను వ్యక్త పరచదనీ ఆమె స్వభావం స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, ఒకవైపు ముక్కోణపు ప్రేమను చూపుతున్నా, మాలా సిన్‌హా ప్రత్యేకంగా పియానో లిడ్ ఏర్పరచిన త్రికోణంలో వుండటం సినిమాలో ఆమె ప్రధాన్యాన్ని ప్రతీకాత్మకంగా ప్రదర్శిస్తుంది. ఒక్క ఫ్రేం ఇన్ని కథలు చెప్పేట్టు చేయటం ఒక్క గురుదత్ కే సాధ్యం!
ఈ సమయంలో పియానో నోట్స్ ఒకో మెట్టు నుంచి క్రిందకు దూకుతున్న నీటి ధారను తలపిస్తూ, చిక్కనవుతున్న ప్రేమ భావనను స్ఫురింప చేస్తుంది.
తరువాత కెమేరా ధర్మేంద్రనే చూపిస్తుంది. ధర్మేంద్ర ఎవరివైపు చూస్తున్నాడో ప్రేక్షకుడికి తెలియదు. అతను ఇద్దరిలో ఎవరివైపైనా చూస్తూండవచ్చు. కానీ. మాలా ను క్లోస్ అప్‌లో చూపించటంతో ప్రేక్షకుడిలో ఉద్విగ్నత పెరుగుతుంది. పాట అంతం వరకూ ఆమెనా, ఈమెనా అన్నట్టు ప్రేక్షకులను ఊరిస్తూన్న చిత్రీకరణ చివరలో అత్యద్భుతమయిన కెమేరా పనితనంతో ప్రేక్షకుడే నిజం గ్రహించేట్టు చేస్తుంది. తనూజా వెనుకనుంచి ధర్మేంద్రను చూపుతుంది. ఇప్పుడు ధర్మేంద్ర ఎవరిని చూస్తున్నాడో ప్రేక్షకుడికి సందేహమే కలగదు. అలాగే, ధర్మేంద్ర వెనుకనుంచి తనూజాను చూపుతుంది. ఇద్దరి కళ్ళు కలవటం, ఆ కళ్ళల్లో ప్రేమ తొణికిసలాడటమూ ప్రేక్షకుడు గ్రహిస్తాడు. ఇది ప్రేక్షకుడే కాదు, ప్రత్యర్ధి పాత్రలూ గ్రహించటంతో సినిమా రక్తికడుతుంది. ఈ రకంగా ఈ పాట చిత్రీకరణ ఒక పాఠ్యపుస్తకంలాంటిది. పాటను ఆకర్షణీయంగా చెప్పటం, పాటలో కథచెప్తూ సినీగమనానికి ఊపునియ్యటం. అయితే సినిమా అంతా ఈ పట్టు వుండకపోవటంతో బహారే ఫిర్ భి ఆయేంగీ సినిమాగురించి విమర్శకులు  This film  seems to have all the elements of a great work of poetic realism, but lacks all the magic అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరచారు.

ఈ పాట నిజానికి ఓపీ నయ్యర్ పూర్తి స్థాయి ఆర్కెస్ట్రాతో రూపొందించాడు. కానీ, ఎందుకో ఆరోజు వాయిద్యకారులనేకులు రికార్డింగ్ కు రాలేదు. దాంతో నయ్యర్ , సహాయకుడు సెబాస్టియన్ సహాయంతో అందుబాటులో వున్న పరిమితమయిన వాయిద్యకారులనే  సృజనాత్మకంగా వాడుకుంటూ పాటను రికార్డ్ చేశాడు. ఆ అతి తక్కువ వాయిద్యావల్లనే పాట అందం ఇనుమడించింది. ఈ పాటలో పియానో నోట్స్, వయొలిన్ల స్వరాలతో పోటీ పడుతూ, రఫీ స్వరానికి స్పందిస్తూ ఒక త్రిగళ గీతాన్ని విన్నభావనను కలిగిస్తాయి. యమన్ కళ్యాణ్ రాగంలో ఓపీ నయ్యర్ ఈ పాటను రూపొందించటం చక్కగా కుదిరింది. యమన్ కళ్యాణ్ రొమాన్స్ ను చక్కగా పండిస్తుంది. ప్రేమలో అభ్యర్ధననూ, విన్నపాన్ని ఈ రాగం ఇనుమడింపచేస్తుంది. హం దోనోలోని అభీ న జావో చోడ్ కర్ పాట ఈ రాగ ఆధారితమే.

ఇక రఫీ ఈపాటను పాడిన విధానం గురించి ఎంత చెప్పినా సరిపోదు. అనుభవించి తీరవలసిందే ఆ అద్భుతమయిన రొమాంటిక్ తేనెల అమృతవర్షధారను. ఈ పాటను చెవులు వింటాయి. హృదయం గ్రహిస్తుంది. అందుకే, ఓ విమర్శకుడు ఈ పాట చెవికీ, హృదయానికి నడుమ ఘర్షణను కలుగచేస్తుందంటాడు. ఎందుకంటే, చెవులు వినందే హృదయం గ్రహించలేదు. వినేది చెవులు, అనుభూతి హృదయానిది. ఇందులో ఎవరు అదృష్టవంతులని వాదోపవాదాలు జరుగుతాయి కాబట్టి ఘర్షణ సంభవిస్తుందంటాడు. అయితే మరో విమర్శకుడు విన్న చెవులు మైమరచి పోతాయి. స్పందించిన హృదయం తన్మయమైపోతుంది. ఇక ఘర్షణకు తావేది అంతా అనుభూతిమయమయితే అంటాడు. అయితే, అందరూ ఏకగ్రీవంగా అంగీకరించేదేమిటంటే, ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని తన స్వరంలోని తేనె సముద్రంలో ముంచి, హృదయంలోని అమృతంతో తడిపి రఫీ పాడిన విధానం పాటకు ప్రాణంపోసిందనీ, అంజాన్ పదాలకు అంజానే అలౌకికత్వాన్ని, అమరత్వాన్నీ ఆపాదించాయన్న విషయం. ఆప్ నుంచి మొదలవుతుంది రఫీ మాయాజాలం. నూర్ అన్నప్పుడు హృదయనేత్రమ్ముందు వెన్నెల వెల్లివిరుస్తుంది. మేర దిల్ అనటంలోని సాన్నిహిత్యం మచల్ గయా లోని స్పందన, మేర క్యా కుసూర్‌లో చిలిపితనం, నిజాయితీ కలగలసిన అమాయక రొమాంటిక్ భావన…విని అనుభవించే ప్రతిఒక్కరినీ రఫీ భక్తులను చేస్తుంది. రఫీ సృజించిన రోమాన్టిక్ సముద్రపుటలల శృంగాలపై ఆనందనాట్యాలు చేసేట్టు చేస్తుంది. ఇక పాట చరణాలలో రఫీ స్వరం పోయే హొయలు, లయలు, అలలు అలలుగా ఎగసిపడే శృంగార భావనల గురించి చెప్పేందుకు భాష చాలదు. స్థలం సరిపోదు. ఎంత చెప్పినా తనివితీరదు. ఎవరికి వారు అనుభవించాల్సిందే. ఒక అద్భుతమయిన దృశ్యాన్ని ఎంతమంది చూసినా ఎవరి అనుభూతి వారిదే. ఆప్ కే హసీన్ రుఖ్ పాట ఎన్నిసార్లువిన్నా తనివితీరదు. ఆనందం ప్రతిసారీ పెరుగుతుంది తప్ప తరగదు. పాట వినే అనుభూతి ఎవరిది వారిదే!!!

ఈ సినిమా ఓపీ నయ్యర్ సంగీత జీవితాన్ని కూడా మలుపు తిప్పిన సినిమా. ఈ సినిమా పాటల రికార్డింగ్ సమయంలోనే , రికార్డింగ్ కు రఫీ ఆలస్యంగా వచ్చాడనీ, అదీ  శంకర్-జైకిషన్ పాట కావటం ఓపీ నయ్యర్‌కు కోపం తెప్పించింది. రఫీ తో పాటలను ఇక రికార్డ్ చెయ్యనని ఓపీ పట్టుపట్టాడు. దాంతో, మహేంద్ర కపూర్ బదల్ జాయే అగర్ మాలీ అన్న పాటతో ఓపీ నయ్యర్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కానీ, ఓపీ నయ్యర్ పాటలు గతంలోలా హిట్ అవ్వటం తగ్గింది. ఆశా కూడా కొన్నాళ్ళ తరువాత  ఓపీ ని వదిలేయటంతో ఓపీ సంగీత జీవితంపై దాదాపుగా తెరపడింది. ఇందుకు నాందీ ప్రస్తావన రఫీతో ఓపీ పాడించటం మానేయటంతో జరిగిందని విశ్లేషకులు భావిస్తారు.

జర్నలిజం నేపథ్యంలో న్యూస్ పేపర్ యాజమాన్యం చేసే రాజకీయాల నేపథ్యంలో తయారయిన ఈ సినిమా అప్పటి తరానికి ఒక కొత్త సబ్జెక్ట్. కాని ఇది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. గురుదత్ సినీ జీవిత విషాద ముగింపుకి ప్రతీకకగా సినీ చరిత్రలో ఈ సినిమా నిలిచిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here