మధురమైన బాధ – గురుదత్ సినిమా 17

1
10

[box type=’note’ fontsize=’16’] గురుదత్ చేసిన సైలాబ్, మధ్యలో ఆపేసిన మరికొన్ని సినిమాలు గురించి సంచిక పాఠకులకు వివరిస్తున్నారు పి. జ్యోతి. [/box]

సైలాబ్ (1956)

[dropcap]గీ[/dropcap]తా దత్ సోదరుడు ముకుల్ రాయ్ సంగీత దర్శకునిగా కొన్ని సినిమాలకు పనిచేసారు. 1956లో ‘సైలాబ్’, 1958లో ‘డిటెక్టివ్’, తరువాత ‘భేద్’ అనే సినిమాలను ముకుల్ రాయ్ నిర్మించారు కూడా. సైలాబ్ సినిమాకు గీతాబాలి,  గీతా దత్ కూడా పెట్టుబడి పెట్టారు. ఈ సినిమాకు రవీంద్ర ధావే ముందు దర్శకత్వం వహించారు. కాని కొన్ని కారణాల వలన ప్రొడ్యూసర్లకు దర్శకులకు గొడవ జరిగి రవీంద్ర ధావే , నాలుగు రీళ్ళు షూట్ చేసిన తరువాత, ఈ సినిమా నుండి తప్పుకున్నారు. అప్పటికే చాలా పెట్టుబడి పెట్టి ఉండడం వలన గీత దత్ ఈ సినిమాను పూర్తి చేయమని గురుదత్‌ని బ్రతిమాలవలసి వచ్చింది.

మామూలుగా గురుదత్ ప్రతి సినిమాని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తన టీం సభ్యుల మధ్య కథను సంగీతాన్ని తయారు చేసుకునేవారు. చాలా సార్లు సినిమా మొదలుపెట్టి తాను అనుకున్నట్లు రావట్లేదని ఆ సినిమాను నిలిపివేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సినిమాల విషయంలో ఎవరి మాట వినేవారు కాదు.

ఆయనకు సినిమా నచ్చకపోతే ఎంత నష్టం జరిగినా ఆ సినిమా థియేటర్లకి వెళ్ళేది కాదు. ఇలా ఎవరో మొదలెట్టిన సినిమాను తీసుకుని పూర్తి చేయడం ఆయనకు సరి పడని విషయం. డబ్బు లెక్క చేయని వ్యక్తి ఆయన. కాని ఇక్కడ గీత దత్ స్వంత డబ్బే కాకుండా ముకుల్ రాయ్ పెట్టిన డబ్బుకూడా ఇరుక్కుపోయి ఉంది. సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయవలసిన అవసరం ముకుల్ రాయ్‌ది. ఈ ఇబ్బందుల మధ్య గురుదత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి ఒప్పుకున్నారు. కాని ఒక్క అబ్రర్ అల్వీ తప్ప అయన టీం లోని వారెవ్వరూ ఈ సినిమాకు పని చేయలేదు.

(సోదరుడు ముకుల్ రాయ్ తో గీతా దత్)

సైలాబ్ సినిమాలో గీతా బాలీ, స్మృతి బిస్వాస్, అభి భట్టాచార్య, రాం సింఘ్ ప్రధాన తారలు. సినిమా కథ కాళిదాసు శాకుంతలాన్ని పోలి ఉంటుంది. గౌతం అనే ఒక యువకుడు తన తండి టీ ఎస్టేట్ల పర్యవేక్షణకు అసాం బైలుదేరతాడు. మధ్యలో అతనెక్కిన విమానం ప్రమాదానికి గురి అయి అత్యవసరంగా మధ్యలో లాండ్ అవుతుంది. గౌతం ఈ ప్రమాదంలో గాయపడతాడు, తన గతాన్ని మర్చిపోతాడు. ఆ ప్రాంతంలో ఒక భక్తుల ఆశ్రమం ఉంటుంది. ఇక్కడి స్త్రీలు వివాహం చేసుకోకుండా తమ జీవితాలను దైవ సేవకు అంకితం చేస్తారు. కంచన్ ఆ ఆశ్రమంలో స్త్రీ. గౌతంను ఈ ఆశ్రమవాసులే కాపాడతారు. కంచన్ అతనికి సపర్యలు చేస్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ లోపు గౌతం కోసం వెతుకుతున్న అతని తండ్రి గౌతం ఈ ప్రాంతంలో ఉన్నాడని విని అతన్ని వచ్చి తనతో తీసుకువెళతాడు.

గౌతం తల్లి అనుకోని పరిస్థితులలో మరణిస్తుంది. ఆ విషాదాన్ని గౌతం తట్టుకోలేకపోతాడు. ఆ షాక్‌తో అతనికి పూర్వ స్మృతి వస్తుంది. కాని ఇప్పుడు అతను కంచన్‌ను మర్చిపోతాడు. గౌతం కోసం వెతుకుతూ కంచన్ కలకత్తా వస్తుంది. కంచన్‌ను గౌతం గుర్తించలేకపోతాడు. మనసు విరిగి కంచన్ తన తెగవారితో కలిసి ఉండిపోవాలని నిశ్చయించుకుని అసాం వెళ్ళిపోతుంది. ఈ లోపు గౌతంకు పూర్తి ఆరోగ్యం చేకూరి అందరినీ గుర్తించడం మొదలెడతాడు. కంచన్‌ని వెతుక్కుంటూ ఆమె ఊరు వెళతాడు. చివర్లో ప్రేమికులు కలవడం కథకు ముగింపు.

(అభి భట్టాచార్య్ తో గీతా బాలి )

సినిమాలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. ఒక్క పాట హేమంత్ కుమార్, మరొకటీ లక్ష్మీ రాయ్ పాడితే మిగతావన్నీ గీతా దత్ పాడారు. గీతా దత్ గొప్పగా గానం చేసిన ఈ పాటలు ఇప్పుడు కూడా లభ్యమవుతున్నాయి. “హాయ్ ఏ దునియా కౌన్సీ” అనే పాట హేమంత్ కుమార్, గీతా దత్ ఇద్దరూ రెండు సార్లు పాడతారు. ఇద్దరి స్టైల్ భిన్నంగా ఉండి రెండు పాటల్లో ఎవరిది బావుంది అంటే గీతా దత్ పాడిన పాటకే ఎక్కువ మార్కులు పడతాయి. సినిమాకు పాటలు హస్రత్ జైపురి, మజ్రూహ్,  మధుకర్ రాజస్థానీ రాసారు. నబెందు ఘోష్ స్క్రీన్ ప్లే అందించారు.

ఈ సినిమా నిర్మాణం గురించి ముకుల్ రాయ్ ఇలా అన్నారు ” My craze for music was always inside me…So when I was doing BCom in calcutta, one of my friends sent me a  letter that Mukul you come along, a new music director is required, so I came back to Bombay and I took up music. The name of the film was vidhaata, produced by a parsi fellow in 1949.  But that picture could not be released. So then my craving was there, but because of the vicious circle in the film industry, I could not cop up with it. So, I decided to make Sailab. That was in 1953″

(సైలాబ్ లో గీతా బాలీ)

 

(సైలాబ్ లో గీతా బాలీ)

సైలాబ్ సినిమా  రిలీజ్ చేయవద్దని, ఈ సినిమా తమకు చెడ్డ పేరు తీసుకువస్తుందని గురుదత్ ముకుల్ రాయ్‌కి చెప్పారట. కాని అప్పటికే సినిమా పై ఎక్కువ పెట్టుబడి పెట్టామని, దీన్ని ఆపలేమని ముకుల్ రాయ్ వాదించారట. సినిమా రిలీజ్ అయి అతి పెద్ద ప్లాప్ అయ్యింది. ఇప్పుడు ఈ ప్రింట్ కూడా దొరకట్లేదు. ఈ సినిమాపై రెవ్యూలన్నీ కూడా అప్పట్లో సినిమా చెత్తగా ఉందనే వచ్చాయి. ఈ సినిమా కారణంగా గీతా దత్తరువాత ఐ.పీ పెట్టవలసి వచ్చిందట. దీని కోసం గురుదత్ సినిమాలలో భాగస్వామ్యం నుంచి కూడా అమె తప్పుకోవలసి వచ్చింది అంటారు. ఇది, గురు గీతాల మధ్య ప్రేమ అంతమవటానికి ఆరంభం అంటారు.  గురుదత్ స్వభావంలోని వైచిత్రిని ఇక్కడ గమనించే వీలు చిక్కుతుంది. గురుదత్ ఆర్ధిక ఇబ్బందులలో వున్నప్పుడు గీతాదత్ అతడికి సహాయం చేసింది. కానీ, గీతాదత్ ఆర్ధిక ఇబ్బందులలో వున్నప్పుడు, వరుసగా నాలుగు హిట్లు కొట్టి, ఆర్ధికంగా మంచి స్థితిలో వున్న గురుదత్ ఆమెకు సహాయానికి రాలేదు. ఇందుకు కారణం, వాసంతి పదుకోనే ప్రకారం, గురు గీతాను పెళ్ళి చేసుకున్నప్పుడు అతడు ఆమెను డబ్బుకోసం పెళ్ళిచేసుకున్నాడని కొందరు వ్యాఖ్యానించారు. ఇది గురుదత్ అహాన్ని దెబ్బ తీసింది. అందుకని గీతాదత్ ఆర్ధికంగా తనకన్నా దిగజారి వుండాలని, తనపై ఆధారపడాలని గురు కోరుకున్నాడు. అందుకే, గీతా ఆర్ధిక ఇబ్బ్బందులలో వున్నప్పుడు, సహాయం చేయగలిగివుండి కూడా గురుదత్ మౌనంగా వుండిపోయాడు. గమనించవలసిన మరో విషయం ఏమిటంటే, తన సోదరుడికి సినిమాల్లో తనకు నచ్చిన సంగీతాన్ని సృజించే అవకాశాన్నివ్వాలని, గీతా తన ధనమంతా ఖర్చుపెట్టి దివాళా తీస్తే, ఆమె సోదరుడు గీఎతాకు సహాయం చేసే ప్రయత్నమే చేయకపోవటం. ఒక రకంగా గీతాదత్ నమ్మి సర్వస్వం ధారాపోసిన వాళ్ళంతా ఆమెను మోసం చేశారు. బహుషా తనవారే తనను విస్మరించటం చూసిన గీతా సైలాబ్ సినిమాలోని పాటలోని ఈ పంక్తులను పాడుకునివుంటుంది.
సున్ భీ లో గం కీ సదాయేన్, దర్ద్ కా పైగాం లో
డగ్మగాకే జారహే హైన్, ఆకే హుం కో థాం లో..

‘సైలాబ్’ సినిమాలో హీరోగా పని చేసిన అభి భట్టాచార్య బెంగాలీ భాషలో పెద్ద నటులు. నితిన్ బోస్ వీరిని ‘నౌకాడూబీ’ సినిమాతో బెంగాలీ రంగానికి పరిచయం చేసారు. సినిమాలలో నటిస్తూనే అధ్యాత్మిక మార్గాన్ని ఆచరిస్తూ దాదాజీ అనబడే అమియా రాయ్ చౌదరి అనే గురువు ద్వారా తాను పొందిన ఆధ్యాత్మిక అనుభవాలను పుస్తకంగా రాసారు ఆయన. 1956 లో ‘జాగ్రితి’ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ సహయ నటుడి పురస్కారం అందుకున్న నటులు అభి భట్టాచార్య. బిమల్ రాయ్, సత్యెన్ బోస్, రిత్విక్ ఘటక్ లాంటి దిగ్గజ దర్శకులతో పాటు గురుదత్ దర్శకత్వంలో కూడా నటించే అవకాశం వీరికి ‘సైలాబ్’ సినిమా ద్వారా కలిగింది.

(అభీ భట్టాచార్య, గీతా బాలీ తో మరో సీన్)

ఈ సినిమాలో మరో సహాయ నటిగా నటించిన స్మృతి బిస్వాస్ గీతా దత్ స్నేహితురాలు. ఆమె ప్రభావం గీతా దత్ పై ఎక్కువగా ఉండేదని, గురుదత్ ఇతర స్త్రీలకు దగ్గర అవుతున్నారనే విషయాన్ని ఈమె గీతా దత్ కు బాగా ఎక్కించేవారని ఆ విషయంగా భార్యా భర్తల మధ్య గొడవలు జరిగేవని అబ్రర్ అల్వీ, గురుదత్ పై రాసిన TEN YEARS WITH GURUDUTT అనే పుస్తకంలో చెప్పుకు వస్తారు. స్మృతి బిస్వాస్ ఇచ్చిన సలహాతో, వహీదా రెహ్మాన్ రాసినట్లు గురుదత్‌కు గురుదత్ రాసినట్లు వహిదా రెహ్మాన్‌కు ఉత్తరం రాసి వారిద్దరిని ఒక చోటకు రమ్మని ఆహ్వానాలు అందాయట. విషయం తెలిసి ఈ ఉత్తరాలు ఎవరు రాసారో కనుక్కోవాలని గురుదత్ అబ్రర్ అల్వీ తో కలిసి అక్కడకు వెళ్ళి, రమ్మన చోటుకు కాస్త దూరంగా నిల్చుని ఉన్నారట. అప్పుడు అక్కడకు గీతా దత్, స్మృతి బిస్వాస్‌లు కలిసి వచ్చారని, వారిని చూసి గురుదత్ కోపంతో ఇంటికి వెళ్ళారని అబ్రర్ అల్వీ తన పుస్తకంలో రాస్తారు.

(స్మృతి బిస్వాస్)
(స్మృతి బిస్వాస్)

భార్యాభర్తల మధ్య ఏర్పడిన దూరం కారణంగా గీతా దత్ లో పెరిగిన అభద్రతా భావం, గురుదత్‌లో పెరిగిన ఒంటరితన్నాన్నీ ఈ సంఘటన స్పష్టపరుస్తుంది. ఈ సంఘటనను బలపరుస్తూ స్మృతి బిస్వాస్ చాలా సంవత్సరాల తరువాత, ఒక ఇంటర్వ్యూలో తనకీ గీతా దత్‌కి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రస్తావిస్తూ ఇదే సంఘటనను ప్రస్తావిస్తారు కూడా.

ఇప్పటి తరంలో పేరున్న దర్శకులు అనురాగ్ కశ్యప్, కొన్ని సంవత్సరాల ముందు గురుదత్ పై ఒక సినిమా తీద్దామనుకున్నారు, వీరికి చాలా ఇష్టమైన దర్శకులు గురుదత్. అప్పుడు గురుదత్ తీసిన అన్ని సినిమాలను చూసే ప్రయత్నం చేసారు. అలా ‘సైలాబ్’ సినిమా కోసం అనురాగ్ చాలా ప్రయత్నించారట. కాని ఆ ప్రింట్ సంపాదించలేకపోయారు. ఈ సినిమా రీలు ఏమయిందో ఎవరికీ తెలీదు. అనురాగ్ కశ్యప్ ‘సైలాబ్’ సినిమాను గురుదత్ సినిమాలలో మిసింగ్ లింక్‌గా ప్రస్తావిస్తారు.

(సైలాబ్ సినిమాలో ఇతర నటులతో మరో సీన్)

గురుదత్ సగంలో నిలిపి వేసిన సినిమాలు

గురుదత్ ఎన్నో సినిమాలను సగంలో ఆపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. గొప్ప రచయితలతో కథను రాయించుకొని, రైట్లు కొని వాటిని సినిమాగా తీయకుండా, లేదా సగం తీసి తాను అనుకున్నట్లుగా రావట్లేదని గురుదత్ ఒదిలేసిన సినిమాలు ఎన్నో. వీటి వలన చాలా డబ్బు ఖర్చయ్యేది. ఒక స్థితిలో ఆయన తీసిన సినిమా పూర్తవుతుందా అనే అనుమానంతో టీం సభ్యులు ఉండేవారట. నిశితంగా పరిశీలిస్తే ఆయన మానసిక స్థితిలో ఆ సమయంలో చాలా మార్పులు కనిపిస్తాయి. చాలా అలజడీ, వేదన, ఒక అభిప్రాయానికి రాలేని సందిగ్ధ స్థితి, హఠాత్తుగా శరీరంలో శక్తి కోల్పోయిన భావన, ఒకసారి ఎంతో ఉత్సాహంతో మరో సారి వెనువెంటనే మితి మీరిన నిరాశ నిస్పృహలతో ఆయన కొట్టుకుంటున్న రోజులవి. అప్పుడే ఆయన కొన్ని సినిమాలు మొదలెట్టడం వాటిని కొంత భాగం షూట్ చేసి వదిలి వేయడం జరిగేది. ఇంత అలజడితో ఆయన గడుపుతున్నప్పుడూ ఎప్పటినుండో వారిని చూస్తున్న వ్యక్తులు కూడా సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేకపోయేవారట. గురుదత్ అందరితో కలిసి మసలుతున్నా ఎవరికీ మనసు విప్పి తనలోని మథనాన్ని చెప్పలేకపోయేవారు. గురుదత్ సోదరి లలితా లాజ్మి ఒక ఇంటర్వ్యూలో చాలా సార్లు “నీతో మాట్లాడాలి రా” అని తనను ఇంటికి పిలిపించుకుని ఇంటికి వచ్చాక మౌనంగా తనను చూస్తూ గురుదత్ ఉండిపోయేవారని ఏ విషయం చెప్పేవారు కాదని ప్రస్తావించారు.

గురుదత్ మరో స్నేహితుడు అబ్రర్ అల్వీ గురుదత్ చివరి రోజులల్లో మద్రాసులో పని చేయడానికి వెళ్ళారు. “బహరే ఫిర్ భీ ఆయేగీ” సినిమాకు పని చేయడానికి గురుదత్ అబ్రర్ అల్వీని తన దగ్గరకు పిలిపించుకున్నారు. అప్పుడు ఆయన పరిస్థితి చూసి అబ్రర్ కొన్ని రోజులు ఆయనతో ఉన్నానని చెప్పుకున్నారు. కాని ఎవరూ కూడా వారి స్థితి పట్ల సీరియస్‌గా వైద్యపరంగా ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజ్ ఖోస్లా నేను గురుదత్‌తో కలిసి పనిచేసినా అయన నాకు ఎప్పటికీ అర్థం కాలేదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంటితో కన్నా గురుదత్‌కీ స్టూడియోతో మిత్రులతోనే ఎక్కువ అనుబంధం ఉండేది. కాని ఏ మిత్రుడు కూడా వారి మనసుకు దగ్గరగా రాలేకపోయారంటే, గురుదత్ పడుతున్న వేదనకు వైద్యపరమైన సహాయం అవసరం ఏమో అని ఎవరూ అర్థం చేసుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

గురుదత్ దిలీప్ కుమార్ ఇద్దరూ కూడా సమకాలీకులే. ఇలాంటి నిర్వేదం నిరాశతో ఒకానొక సందర్భంలో బాధపడుతూ తనలో ఏదో తేడా జరుగుతుందని దిలీప్ కుమార్ గారు కనుక్కుని తనకు తానుగా సైక్రియాటిస్ట్‌ను సంప్రదించి లండన్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అప్పుడే ఒక విషాద సినిమా తరువాత కామెడీ చేయాలని ట్రాక్ మార్చుకున్నారు. అతని మిత్రులు అది పెద్ద రిస్క్ అవుతుందని చెప్పినా అయన వినకుండా కెరీర్ కన్నా తన మానసిక ఆరోగ్యానికి ప్రాధ్యాన్యత ఇస్తూ నడుచుకున్నారు. ఇటు పక్క గురుదత్‌కి తనలో జరుగుతున్న సంఘర్షణ అర్థం కాలేదు. కనీసం చుట్టు ఉన్న వారు చెప్పలేకపోయారు. అంతటి చనువు అతనితో ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరూ కెరీర్ పరంగా మాత్రమే ఆలోచించి ఆయనతో నడుచుకోవడం కనిపిస్తుంది కాని గురుదత్‌కి నిజమైన సహాయం ఎలా అందివ్వగలమని ఎవరూ ఆలొచించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

GURUDUTT AN UNFINISHED STORY అన్న పుస్తకంలో ఒకసారి గురుదత్‌ని కౌన్సిలర్‌కి చూపిస్తే ఆయన గురుదత్‌తో ఒక గంట మాట్లాడి ఐదు వందల ఫీజు తీసుకున్నారని, ఇంట్లో వారు నవ్వుకున్నారని, దాని తరువాత ఆయన ఏ డాక్టర్‌ను సంప్రదించలేదని రచయిత రాస్తారు. అప్పటికే గురుదత్ మూడు సార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసారు. దీనికి తోడు గీతా దత్ కూడా అత్మహత్య ప్రయత్నాలు చేసినట్లు విమల్ మిత్ర తన పుస్తకంలో రాసారు. మానసికంగా బాలెన్స్ లేని ఇద్దరు వ్యక్తుల నడుమ జీవితం ఎలా ఊంటుంది? వీరి స్వస్థతకోసం సరైన ఆలోచన చేసే వారు లేని కోరత గురుదత్ జీవితంలో కనిపిస్తుంది.

సినిమా మొదలెట్టి దాన్ని మూలన పడేసి ఇబ్బంది పడుతూ మళ్ళీ మరో సినిమా మొదలెడుతున్న గురుదత్‌ని చూస్తున్నప్పుడు కూడా ఎవరికీ వారికి వైద్యాన్ని అందించాలని అనిపించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్పట్లో మానసికారోగ్యం పట్ల ఎవరికీ ఇప్పటిలా పెద్ద అవగాహన లేదు అన్నది నిజమే కాని వ్యక్తి మనస్తత్వంలో త్వర త్వరగా వచ్చే ఈ తేడాలను గమనించి వీటి గురించి సైద్దాంతికంగా ఆలోచించే వారు గురుదత్ పక్కన లేకపోవడం ఒక పెద్ద లోటని గుర్తించాలి. అదే వారి అకాల మరణానికి కారణం అయి ఉండవచ్చు కూడా.

గురుదత్ 1957లో గీతా దత్‌ను హీరోయిన్‌గా తీసుకుని ‘గౌరీ’ అనే సినిమా తీయాలనుకున్నారు. అన్నీ సరిగ్గా జరిగి ఉంటే ఇది భారత దేశంలో మొదటి సెవెంటీ ఎం.ఎం. సినిమా అయి ఉండేది. ‘ప్యాసా’ సినిమా అప్పటికే పెద్ద హిట్ అయింది. ‘గౌరీ’ సినిమాను బెంగాలీలో ఇంగ్లీషులోనూ తీయాలని గురుదత్ అనుకున్నారు. కలకత్తా నగరంలో దుర్గ విగ్రహాలను చేసే వ్యక్తి జీవితం చూట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇతను ఒక రోజు స్నేహితుల బలవంతంతో వేశ్యా గృహానికి వెళతాడు. అక్కడ గౌరీ అనే ఒక వేశ్యను చూస్తాడు. ఆమె అతనికి దుర్గా మాతగా కనిపిస్తుంది. ఆమె ప్రస్తుత స్థితికి బాధపడ్డ ఆ కళాకారుడు ఆమెను వివాహం చేసుకుంటాడు.

(గౌరీ సినిమా కోసం గీతా దత్ పై చిత్రించిన ఒక షాట్)

ఆనందంగా జీవిస్తున్న వీరి మధ్యలో వేశ్యా గృహానికి వెళ్ళే అలవాటున్న మరో స్నేహితుడు వస్తాడు. గౌరీని గుర్తు పట్టి ఆమె గతాన్ని అందరికీ చెబుతానని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటాడు. చివరకు ఆ కళాకారుని తల్లి తండ్రులకు కోడలి గతం తెలుస్తుంది. వారామెను అవమానకరంగా చూడడం మొదలెడతారు. ఈ బాధ, భర్త వేదన చూడలేక గౌరీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆమె కోసం పిచ్చిపట్టినట్లు వెతుకుతాడు భర్త. భార్యకు దూరమైన బాధలో మతి చలిస్తుంది అతనికి. ఆమె మొహం అతనికి ఎప్పుడూ గుర్తుకు వస్తూ ఉంటుంది. అతను తయారు చేసిన అమ్మ వారి విగ్రహాలన్నీ గౌరీని పోలి ఉంటాయి. కొన్ని ఏళ్ళ తరువాత దుర్గాదేవి నిమజ్జనం సంబరాలలో అతను పాలుపంచుకుంటాడు. మరో పక్క శ్మశానానికి తీసుకు వెళుతున్న యువతి శవాన్ని చూస్తాడు. ఆమె అతని భార్య అని గుర్తు పడతాడు. ఈ సినిమా కోసం రెండు సీన్లు షూట్ చేసారు గురుదత్. ఎస్.డి. బర్మన్ రెండు పాటలను రికార్డ్ చేసారు కూడా.

(గౌరీ సినిమా షూటింగ్‌లో గురుదత్, గీతా దత్, వీ. కే. మూర్తి తదితరులు)

అయితే ఈ సినిమా అగిపోవడం వెనుక ఒక కథ చెబుతారు గురుదత్ టీం సభులు. ఒక సారి షూటింగ్‌లో ఉన్నప్పుడు గీతా దత్‌పై సీన్ చిత్రీకరణ కోసం ఎదురు చూస్తున్నారు గురుదత్. ఆమె మేకప్ రూమ్‌లో ఉందట. గురుదత్ లెక్క ప్రకారం ఆ సీన్ కోసం పెద్దగా మేకప్ అక్కరలేదు. ఎన్ని సార్లు కబురు పంపించినా గీతా దత్ మేకప్ పూర్తి కాలేదనే బదులు వస్తుంది. అసహనంగా గురుదత్ ఆమె మేకప్ రూమ్‌కి వెళ్లారు. ఎక్కువ మేకప్‌తో చాలా రిచ్‌గా తయారయి ఉన్నారు గీతా దత్. ఈ సీన్‌కు ఇంత మేకప్ అవసరం లేదని ఇంతగా ఎందుకు మేకప్ చేసారని గురుదత్ అందరి ముందు విరుచుకు పడ్డారు. దర్శకులుగా గురుదత్ చండశాసనుడిగా పని చేసేవారు. ఎవరినీ లక్ష్య పెట్టేవారు కాదు. కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడేవారో ఆయనకే కంట్రోల్ ఉండదు. గీతా దత్ తాను స్క్రీన్ పై బాగా కనపడాలని కావాలని ఇలా తయారయ్యానని చెప్పే ప్రయత్నం చేసారు. కాని గురుదత్ వినిపించుకోలేదు. కోపంతో బాగా అరిచేసారట. అందరి ముందు ఇది అవమానకరంగా తీసుకున్నారు గీతా దత్. ఆమెలో కూడా కోపం పెరిగి పోయింది. “ఎందుకు నేను వహీదా రెహ్మాన్ కన్నా బాగా కనపడకూడదనా మేకప్ అనవసరం అంటున్నారంటూ” ఆమె తిరిగి విరుచుకుపడ్డారట. వహీదా పేరు వినిపించగానే గురుదత్ ఆవేశంతో సినిమా షూట్ కాన్సిల్ చేసి ఇంటికి బయలు దేరారట. అలా కాన్సిల్ అయిన షూట్ మళ్ళీ మొదలవలేదు. ఈ సినిమా కథ కోసం, లొకేషన్లను ఎంచుకోవడానికి గురుదత్ చాలా ఖర్చు చేసారు. కాని మళ్ళీ సినిమాను మొదలు పెట్టలేదు. వహిదా రెహ్మన్ వీరి జీవితంలో రావడం వలన గీతా దత్‌లో పెరిగిన అభద్రతా భావం వెనుక ఉన్న నిజానిజాల కన్నా భార్యభర్తల మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించే ప్రయత్నాలు వారి మిత్రులు ఎంత వరకు చేసారన్నది ఆలోచించవలసిన విషయం. ఫిబ్రవరీ 1-15 , 1985 నాటి ఫిల్మ్ ఫేర్ సంచికలో ఆగిపోయిన గౌరి సినిమా గురించి రాశారు ” Gurudutt’s wife Geetadutt also had her own frustrations . As their marriage went on the ricks, she threw up a flourishing career during whih her virtuosity has ranged from Tadbeer se bigdee huyi to Waqt ne kiya kya haseen sitam. Geeta’s frustration with Gurudutt probably came about when after a few days shooting he abandoned the big budget Cinema Scope film in which she played the title role. There had been a big publicity built-up given to the film to be made in Bengali and English”  గురుదత్ మరణం తరువాత గౌరి సినిమాను తీయాలని గీతాదత్ ప్రయత్నించింది. గురుదత్ ప్రైవేట్ ఫిలంస్ బానెర్ మీదనే ఈ సినిమాను మళ్ళీ తీయాలనుకుంది.

గౌరి షూటింగ్ సమయంలో జరిగిన   మేకప్ సంఘటనను ‘కాగజ్ కే ఫూల్’ సినిమాలో ఉపయోగించుకున్నారు గురుదత్. పార్వతి  పాత్రకు వహీదా ఎక్కువ మేకప్ వేసుకుని కనిపిస్తే దర్శకుడు సురేష్ సిన్హా ఆమెను ఆ మేకప్ తీసేసుకుని మళ్ళీ కనిపించమని అనడం ‘కాగజ్ కే ఫూల్’ లో గమనించవచ్చు. చాలా వరకు గురుదత్ సినిమాలలో సీన్లు వారి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసినవే అంటారు.

గురుదత్ దగ్గర నిరంజన్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసేవారు. ఆయనకు దర్శకత్వ భాద్యతలు ఇచ్చి ‘రాజ్’ అనే సినిమాను తీయాలని గురుదత్ అనుకున్నారు. ఇది విల్కీ కాలిన్స్, క్లాసిక్ ‘ది విమెన్ ఇన్ వైట్’ ఆధారంగా తయారయిన కథ. ఈ సినిమాలో ముందుగా సునీల్ దత్, ద్విపాత్రాభినంలో వహీదా రెహ్మాన్‌ను అనుకున్నారు. సునీల్ దత్ ది ఇందులో ఆర్మీ ఆఫీసర్ పాత్ర. అతనితో కొన్ని సీన్లు షూట్ చేసాక గురుదత్‌కి అవి నచ్చలేదు. అందుకని సునీల్ దత్‌ను తొలగించి ఆయనే హీరోగా నటించడానికి పూనుకున్నారు. సిమ్లాలో కొన్ని సీన్లు షూట్ చేసారు. ఈ సినిమాకు ఆర్.డి. బర్మన్ సంగీత దర్శకుడు. ‘ప్యాసా’ సినిమాలో ఎస్.డి. బర్మన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నప్పుడు ఆర్.డి. అసిస్టెంట్‌గా చేసారు. మాల సిన్హా కనిపించినప్పుడల్లా మౌత్ ఆర్గన్ పై వచ్చే ట్యూన్‌ని ఆర్.డి. ఆ సినిమా కోసం ప్లే చేసారు. అప్పుడు అతనితో సంగీత దర్శకుడిగా మరో సినిమా తీస్తానని గురుదత్ మాట ఇచ్చారట. అలా ‘రాజ్’ సినిమాకి ఆర్.డి. కి అవకాశం ఇచ్చారు గురుదత్. ఇది ఆర్.డి. బర్మన్‌కి మొదటి సినిమా అయ్యేది.

(రాజ్ సినిమా కోసం గురుదత్ రిలీజ్ చేయించిన పోస్టర్)

గీతా దత్, ఆశా భోంస్లే, శంషాద్ బేగంతో ‘రాజ్’ సినిమా కోసం ఒక పాట కూడా రికార్డ్ చేసారు. ఆరు రీళ్ల షూటింగ్ తరువాత్ గురుదత్ తాను అనుకున్నట్లుగా ఈ సినిమా రావట్లేదని ఆ సినిమా కూడా మధ్యలో ఆపేసారు. ఈ సినిమా కథనే తీసుకుని రాజ్ ఖోస్లా తరువాత ‘వో కౌన్ థీ’ తీసారు. అందులో ‘లగ్ జా గలే’ పాట చిత్రీకరణ గురుదత్ పాట చిత్రీకరణతో పోలి ఉంటుంది. గురుదత్ శైలిని అంతగా అనుకరించి రాజ్ ఖోస్లా మనోజ్ కుమార్ సాధనాలతో అతి పెద్ద హిట్ సినిమాను ఇండస్ట్రీకి ఇచ్చారు. తరువాత ఆర్.డి. బర్మన్ ఈ సినిమా కోసం తయారు చేసిన ట్యూన్ లను మెహమూద్ నటించిన ‘చోటే నవాబ్’ సినిమాకు వాడుకున్నారు.

(‘రాజ్’ సినిమాలో సునీల్ దత్ ను తొలగించి గురుదత్ నటించిన సీన్)

‘రాజ్’ సినిమా ఆగిపోయాక నిరంజన్ కోసం మరో సినిమా మొదలెట్టారు గురుదత్. దీన్ని ‘మోతి కీ మౌసి’ అని పేరు పెట్టారు. ఇందులో తనూజ, సలీమ్ ఖాన్‌లు నటించాలని అనుకున్నారు. కాని విపరీతంగా తాగే అలవాటున్న నిరంజన్ హఠాత్మరణంతో ఈ సినిమా కూడా ఆగిపోయింది.

ఇక బెంగాలీలో ఒక సినిమా తీయాలని గురుదత్‌కి చాలా కోరికగా ఉండేది. బిమల్ మిత్రతో కూడా ఒక కథ రాయించుకున్నారట. ‘ఎక్ తుకు చూహా’ అనే బెంగాలీ సినిమా కోసం ఒక్క సీన్ మాత్రమే షూట్ చేసారు

గురు దత్. ‘నీల్ కమల్’ అని గుల్షన్ నందా నవల అధారంగా నిర్మించుకున్న మరో కథను సిద్దం చేసుకున్నారు. ఈ సినిమాను సాధిక్ దర్శకత్వం వహిస్తారని బిస్వజిత్ నందా నటీనటులని ప్రకటించారు కూడా. కాని ఈ సినిమా షూటింగ్ జరగకుండానే ఆగిపోయింది. అదీ తరువాత 1968లో రామ్ మహేశ్వరీ దర్శకత్వంలో వచ్చి హిట్ అయింది. మనోజ్ కుమార్, రాజ్ కుమార్, వహీదా రెహ్మాన్ ఈ సినిమాలో నటించారు. ‘ష్. ష్. ష్’ అనే మరో కామెడీకి గురుదత్ సోదరుడు ఆత్మారాం దర్శకత్వం వహించాలని నిశ్చయించారు. ఇదీ నాలుగు రోజుల షూటింగ్ తరువాత ఆగిపోయింది.

1962లో వచ్చిన ‘ప్రొఫెసర్’ సినిమా కూడా గురుదత్ తయారు చేసుకున్న కథే. శశిభూషన్ దర్శకత్వంలో కిషోర్ కుమార్ వహిదా రెహ్మాన్ లతో ఈ సినిమా తీయాలనుకున్నారు. అబ్రర్ అల్వీని మొదట ఈ సినిమాకు దర్శకత్వం చేయమని అడిగినా ఆయన కాదనడంతో శశిభూషణ్ ని తీసుకున్నారు. గురుదత్ మరణానంతరం లేఖ్ టండన్ ఈ కథను తీసుకుని షమ్మీ కపూర్‌ తో సినిమా తీసారు. దీనికి అబ్రర్ అల్వీ స్క్రీన్ ప్లే రాసారు. తరువాత అన్ని దక్షిణాది భాషలలో ఈ సినిమా రీమేక్ అయ్యింది.

‘సాహెబ్ బీవీ ఔర్ గులాం’ తరువాత గురుదత్ అరేబియన్ నైట్స్ కథ ఆధారంగా సినిమా తీయాలనుకున్నారు. దీన్ని పూర్తిగా కలర్‌తో తీయాలన్నది అతని ఆలోచన. దీనికి ‘కనీజ్’ అనే పేరు ఖరారు చేసారు. తన వ్యాసం Classics and Cash లో ఈ సినిమా తీస్తానన్నప్పుడు మిత్రులు కొందరు గేలి చేసారని గురుదత్ ప్రస్తావిస్తారు. ప్రతి కథకు ఒక విశేషం ఉంటుందని, బ్రాండ్ ఇమేజ్‌లో పడి సినిమాలను క్రియేటివ్‌గా తీసే విధానానికి దర్సకులు దూరం కాకూడదని ఈ వ్యాసంలో గురుదత్ చెప్తారు. ‘ప్యాసా’ తీసిన నువ్వు ‘అరేబియన్ నైట్స్’ తీయడం ఏంటన్న వారి ప్రశ్నకు, కథలో చూడవలసిన అంశాలు చూడకుండా మిగిలిపోయినవి చూపడమే దర్శకత్వం అని. ఆ దిశగా సినిమా దర్శకులు ప్రయాణించాలని చెప్తారు గురు దత్. ‘కనీజ్’ సినిమా కోసం సిమీ గరేవాల్ ని తీసుకున్నాక కొన్ని సీన్లు షూట్ చేసాక సినిమా ఆగిపోయింది. సిమీ గరేవాల్ సినీ ఆర్ట్స్ అసోసియేషన్‌కు వెళ్ళి ఈ సినిమా ఆగిపోయినందుకు గాను నష్ట పరిహారం గురుదత్ నుండి వసూలు చేసుకున్నారట.

(‘కనీజ్’ సినిమాలో సిమీ గరేవాల్)

సాధనా గురుదత్ లతో ‘పిక్నిక్’ అనే మరో సినిమా మొదలయింది. ఆర్. ఎస్. తారా ఈ సినిమాకు దర్శకత్వం వహించాలనుకున్నారు. ఎన్. దత్తా సంగీతం ఇచ్చారు. ఈ సినిమా కోసం చిత్రించిన రెండు పాటలు ఇప్పుడు యూ ట్యూబ్‌లో ఉన్నాయి.

(‘పిక్నిక్’ సినిమా కోసం గురుదత్, సాధనాల పై చిత్రించిన పాట లో ఒక సీన్)

ఈ సినిమాలన్నిటికి కూడా గురుదత్ ఎంతో ఉత్సాహంతో కష్టంతో మొదలు పెట్టి తరువాత మూలన పడేశారు. అప్పట్లో వారి మానసిక స్థితి సరిగ్గా లేదని స్పష్టపరిచే సంఘటనలు ఇవి. కాని వీటిని ఒక కుదురు లేని వ్యక్తి చర్యలుగా చూసిన ఆయన మిత్రులు దాని వెనుక కారణాలపై సహేతుకమైన దృష్టి పెట్టి ఉంటే ఇంతటి క్రియేటివ్ డైరెక్టర్ మరి కొంత కాలం మన ముందు ఉండేవారన్నది ఇప్పటి తరం అర్థం చేసుకోవలసిన విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here