మధురమైన బాధ – గురుదత్ సినిమా 24 – కాగజ్ కే ఫూల్-1

0
12

[box type=’note’ fontsize=’16’] గురుదత్ నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘కాగజ్ కే ఫూల్’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

‘కాగజ్ కే ఫూల్’ సినిమా నేపథ్యం, చూడవలసిన కోణం

[dropcap]‘కా[/dropcap]గజ్ కే ఫూల్’ 1959లో వచ్చిన సినిమా. ఇది భారతదేశంలో నిర్మించిన మొదటి సినిమా స్కోప్ సినిమా కూడా. గురుదత్ జీవితాన్ని మార్చివేసిన సినిమా. చాలా మంది ఇది గురుదత్ జీవిత కథ అంటారు. కాని ఇది సంపూర్ణంగా గురుదత్ జీవితం కాదని అతని కుటుంబీకులు పలు సందర్భాలలో చెప్పారు. ఈ సినిమా తీస్తున్నప్పటికి గురుదత్ చాలా పెద్ద డైరెక్టర్‌గా పేరు తెచ్చుకుని ఉన్నారు. అతని ఖాతాలో ఇంచుమించు అన్ని విజయాలే ఉన్నాయి. కాని ఈ సినిమా చూస్తుంటే సినీ ప్రపంచంలో తన భవిష్యత్తు వారికి ముందే తెలిసినట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో సురేష్ సిన్హా జీవితాన్ని గురుదత్ భవిష్యత్తులో చాలా వరకు అనుభవించారంటే ఏదో భవిష్యత్ వాణి వారితో ఈ సినిమా తీయించిందా అనిపిస్తుంది. ఈ సినిమాలో సురేష్ సిన్హా అనే సినిమా దర్శకుడు వరుస విజయాలతో సినీ రంగంలో దూసుకుపోతున్నప్పుడు అతని వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యల కారణంగా పని మీద శ్రద్ధ వహించలేక ఆ తరువాత తీసిన సినిమా ఫెయిల్ అవుతుంది. అప్పటి దాకా అతనికి బ్రహ్మరథం పట్టిన సినీ ప్రపంచం అతన్ని అధఃపాతాళానికి తొక్కేస్తుంది. సినీ ప్రపంచంలో నువ్వెన్ని విజయాలనిచ్చినా ఒక్క అప్పజయం నీ స్థితిని తారుమారు చేస్తుంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని సురేష్ సిన్హా మెల్లగా తాగుడికి బానిస అయి చాలా హీన స్థితికి జారిపోతాడు. చివరకు ఓ ఖాళీ స్టూడియోలో డైరెక్టర్ కుర్చీలో కూర్చుని ఒంటరిగా మరణిస్తాడు.

ఈ సినిమాను గురుదత్ ఒక అద్బుత కావ్యంగానే తీసాడు. కాని సినిమాలో సురేష్ సిన్హాను నిరాదరించినట్లే ప్రజలు ఈ సినిమాను కూడా నిరాదరించారు. స్క్రీన్ పై చెప్పులు పడ్డాయని కూడా కొందరు చెబుతారు. ఇది తన కళ్ళతో చూసిన గురుదత్ ఆ ప్రజా తిరస్కారాన్ని భరించలేకపోయాడు. తనకు జరిగిన ఘోరమైన అవమానంగా, అన్యాయంగా ఆయన ఈ పరాజయాన్ని తీసుకున్నారు. ఇది ఆయన మనసును ఎంతగా గాయపరిచిందంటే, అతను  జీవితంలో మళ్ళీ దర్శకుడిగా స్కీన్ పై కనిపించలేదు. అయితే చాలా ఆశ్చర్యంగా ఇప్పుడు ‘కాగజ్ కే ఫూల్’ని ప్రతి ఒక్కరూ ఒక క్లాసిక్ అని ప్రస్తావిస్తారు. సినీ రంగంలో పెద్ద నటులు, దర్శకులు చాలా మందికి తమకు చాలా ఇష్టమైన సినిమాగా ఈ సినిమాను గుర్తు చేసుకుంటారు. గురుదత్ సినిమాలను ప్రదర్శించే క్రమంలో తప్పకుండా ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించడం తప్పనిసరి. ఈ సినిమాను తీస్తున్నప్పుడే ఇది అనుకున్నంతగా విజయం సాధించదని ఈ సినిమా తీయవద్దని ఎస్.డీ బర్మన్, కైఫీ ఆజ్మీ లాంటి సినీ ప్రముఖులు గురుదత్‌కి చెప్పారంట. కాని ఈ సినిమా విషయంలో గురుదత్ చాలా మొండి పట్టుదలకు పోయారు. అప్పట్లోనే పద్దెనిమిది లక్షలు పెట్టి ఈ సినిమా తీసారు. ఈ సినిమాకు పెట్టిన ఖర్చుకు అప్పట్లో ఆరు సినిమాలు తీయగలిగేవారంట. ఒకో ఫ్రేంని ఒక పెయింటింగ్ గానే మలిచారు గురుదత్. ఇప్పుడు చూస్తే ఆ ఫోటోగ్రఫీ, కెమెరా యాంగిల్స్ అన్నీ కూడా అత్యద్భుతంగా కనిపిస్తాయి. ఒక్క గురుదత్ ఫోటోలను వెతికితే ‘కాగజ్ కే ఫూల్’ సినిమా ఫ్రేమ్ లోనించే అతి చక్కని స్టిల్స్ పట్టుకోవచ్చు. అంత సొఫిస్టికేటడ్ ఎక్విప్మెంట్ ఉపయోగించి తీసిన సినిమా ఇది.

ఈ సినిమా ఫెయిల్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మన భారతీయ ప్రేక్షకులలో సినిమాల పట్ల కళాత్మక దృష్టి చాలా తక్కువ. గురుదత్ తీసిన ఈ సినిమాలో కథ చాలా మంది సామాన్యులకు అర్థం కాలేదు. పేదరికం, కడుపు నింపుకోవడమే ప్రధాన సమస్యలుగా ఉన్న మన దేశపు సామాన్యులకు ఈ ఆత్మగౌరవ బాధ ఏమిటో అర్థం కాలేదు. సినిమా అంటే రంగుల ప్రపంచం గానే చూసే వారికి ఈ సినిమా కష్టాల వైపు దృష్టి పెట్టే అవసరం లేదు. ముఖ్యంగా సినిమా అంటే సామాన్యులకు కేవలం హీరోలే కనిపిస్తారు. ఒక దర్శకుడి కథ అయిన ఈ ‘కాగజ్ కే ఫూల్’ వారిని ఆకట్టుకోలేదు. ఆ అద్భుతమైన ఫోటోగ్రఫీ, టెక్నికల్ గొప్పతనం, ఇవి సామాన్యులకు అక్కరలేదు. ఒక స్క్రీన్‌లో అద్భుతమైన చిత్రీకరణ కన్నా ఒక హీరోయిన్ హీరోల మధ్య కళ్ళతో నడిచే ప్రేమ అంటేనే మన ప్రేక్షకులకు ఇష్టం. వారి దృష్టిలో సురేష్ సిన్హా ఒక పిచ్చివాడు. అంత గొప్పగా డబ్బు సంపాదించి చివరకు అంతా పోగొట్టుకుని ప్రేమించిన స్త్రీ సహాయం చేస్తానన్నా వినకుండా తాగి తాగి ఒంటరిగా చచ్చిన చేతగానివాడు. ఇలాంటి వాడిని హీరోగా చూసేటంత పరిజ్ఞానం మన ప్రేక్షకులకు ఎప్పుడూ లేదు. అంతే బలహీన మనస్కుడైన దేవదాసుని అందరూ ఇష్టపడతాడు. కారణం అతను ప్రేమ కోసం పిచ్చివాడయ్యాడు, ప్రియురాలిని పొందాలని కోరుకుని పొందలేక ఆ ప్రేమను మర్చిపోలేక ఒంటరి అయ్యాడు. అతని ప్రేమైక హృదయాన్ని ప్రేమించి పూజించే చంద్రముఖిని సంపాదించుకోగలిగాడు. చంద్రముఖీ, పార్వతి ఇద్దరు కూడా దేవదాసుని కోరి వస్తారు. దేవదాసే వారిని తిరస్కరిస్తాడు. పైగా దేవదాసు అవివాహితుడు. అతని ప్రేమ ఆమోదయోగ్యమే అందరికి. ఎవరీ ఎవరితో మర్యాద అతిక్రమణ ఇక్కడ జరగలేదు.

కాని సురేష్ సిన్హా కనీసం ప్రేమను వ్యక్తపరచలేడు. శాంతి పై ప్రేమ ఉన్నా చెప్పలేడు. శాంతి పై ఉన్నది ఒక మగవానికి మరో స్త్రీకి మధ్య ఉన్న ప్రేమ కాదు. అది ఒక ఆత్మీయ బంధం. ఈ ఆత్మీయ బంధంలో విరహం, తపన లాంటివి లేకపోతే అది సామాన్య జనానికి రంజింపజేసే ప్రేమ కథ ఎన్నటికీ కాలేదు. శాంతి అతని బాగు కోసం ఎన్ని విధాలుగా శ్రమపడినా సురేష్ ఆ సహాయాన్ని స్వీకరించలేడు. ఆమెకి దూరంగానే జరుగుతాడు తప్ప ఆమెకు దగ్గరవాలని అస్సలు ప్రయత్నించడు. పైగా అంత ధనవంతుడు చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్న భావన కలుగుతుంది ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి. ఈ నాశనం ప్రేమ కోసం అయితే ఒప్పుకోగలరు కాని దీని వెనుక ఉన్న ప్రధాన విషయం ఆత్మగౌరవ పోరాటం. ఇది చాలా మందికి అర్థం కానిది. చాలా మందికి ఈ ఆత్మగౌరవం అహంకారంగా కూడా కనిపించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చాలా కోణాలలో గురుదత్ వ్యక్తిగత విషాదం, ఆలోచనలను వ్యక్తిగతాలుగానే చూపించడం వలన ఆ అర్థం కాని ఒంటరితనాన్ని అర్థం చేసుకోలేని సామాన్య జనం ఈ సినిమాను తిరస్కరించారు.

మరి ‘ప్యాసా’ సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయింది అంటే నిశితంగా పరిశీలిస్తే కొన్ని కారణాలు కనిపిస్తాయి. ‘ప్యాసా’ సినిమాలో విజయ్ “యె దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హై” అని ప్రపంచాన్ని తిరస్కరిస్తాడు. ఇక్కడ దునియా అంటే ప్రపంచం, విజయ్ ప్రశ్నలన్నీ ప్రపంచంలోని అసమానతల పట్ల అతనిలో చెలరేగేవి. అతనో సాధారణ కవి. పేదవాడు. జివితంలో ఒక స్థాయి వచ్చిన తరువాత గుర్తుంపు పొందిన తరువాత, అందరి  క్రూరత్వానికి జవాబుగా ఈ ప్రపంచమే నాకొద్దు అని అందరినీ కాలదన్ని వెళ్ళిపోతాడు. ఇది హీరోయిక్‌గా అనిపిస్తుంది. కాని ‘కాగజ్ కే ఫూల్’లో సురేష్ సిన్హా ధనికుడు, మరో డబ్బున స్త్రీని వివాహం చేసుకుంటాడు. విజయాన్ని నిలుపుకోలేక తన వ్యక్తిగత దుఃఖాల కారణంగా సినిమాలు అపజయం పాలైనందున గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. ఇక్కడ జరిగింది ఓ గొప్ప సినిమా తీసి అపజయం పాలవడం కాదు, పని సమయంలో శ్రద్ధ చూపలేక వ్యక్తిగత దుఃఖంతో కొట్టుకుపోతూ మనసుపై నియంత్రణ లేక అపజయం పాలవుతాడు. ఇది సహేతుకం అనే అనిపిస్తుంది చాలా మందికి. జయాపజయాల ఆధారంగా మనిషిలోని శక్తి సామర్థ్యాలను నిర్దేశించడం సహజమని ఒప్పుకునే జనం మధ్య ఈ సినిమా కథలో హీరో విషాదంతో ఎవరూ కనెక్ట్ కాలేకపోయారు. అప్పటికి మనకు స్వాతంత్రం వచ్చి కేవలం పన్నెండు సంవత్సరాలు. ఇంకా తిండి గింజల సమస్యతో కొట్టుకుంటున్న సామాన్యుల మధ్య ఈ పై స్థాయి జీవితపు అస్తిత్వవాద పోరాటం ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది.

(కాగజ్ కే ఫూల్ ప్రిమియర్ కి గురుదత్‌తో పాటు అప్పటి రాష్ట్రపతి రాధాకృష్ణన్)

‘కాగజ్ కే ఫూల్’లో ఒకే పాట సురేష్ జీవితంలోని విషాదాన్ని చూపిస్తుంది. “దేఖీ జమానే కీ యారీ… భిచడే సభీ బారీ బారీ” ఇక్కడ జమానా అంటే సమాజం. ‘ప్యాసా’లో విజయ్ తిరస్కరించిన దునియా విశాలత్వం ఇక్కడ లేదు. ఇది వ్యక్తిగత సమాజం. సురేష్ తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ అందరూ ఒకొక్కరుగా తనను వీడి వెళ్ళిపోయారు అని బాధపడతాడు. అక్కడ విజయ్ తిరస్కారంలోని హీరోయిజం, ఇక్కడ సురేష్ పాత్రలో చూడలేకపోయారు ప్రేక్షకులు.

ఈ సినిమాలో వివాహం వల్ల జీవితంలో వచ్చే కళాకారుల జీవితంలో చేరే పరిమితులు, ఖ్యాతి కోసం తపించే కళాకారులు, అంతరించిపోతున్న స్టూడియో వ్యవస్థ అనే మూడు క్రొత్త కోణాలను కూడా గురుదత్ చూపించాలనుకున్నారు.

(అంతరించిపోతున్న స్టూడియో వ్యవస్థకు ప్రతీకగా కూడా ‘కాగజ్ కే ఫూల్’ని విశ్లేషించవచ్చు)

అప్పటికి వివాహ వ్యవస్థను పూజించే స్థితిలోనే ఉన్న వారికి సురేష్, అతని భార్య నడుమ తగాదాలు వింతగానే అనిపిస్తాయి. ఇక బ్రతకడానికి ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా, దర్శకుడిగా అవకాశాలు పోతే ఇలా ఇంకా దిగజారాలా, శాంతి ఇప్పించిన అవకాశాన్ని కూడా వదులుకోవడం మూర్ఖత్వం కదా అనుకునే భావజాలమే సామాన్యులలో ఎక్కువగా ఉంటుంది. స్టూడియో వ్యవస్థ గురించి పెద్దగా తెలియని సామాన్య సినీ ప్రేక్షకుడికి ఆ నేపథ్యంలో వచ్చిన ఏ సినిమా అయినా అంతగా దగ్గర అవ్వదు. సురేశ్ పేరు కోరుకుంటున్నాడు కాని దానికి తన షరతులు తనకున్నాయి. ప్రేమకు కూడా లొంగని షరతులు అవి. ఇది చాలా మంది ఒప్పుకోలేని విషయం. అందుకే సురేష్ చాలా మందికి అపజయాలను ఎలా స్వీకరించాలో తెలియని బలహీనుడిగా కనిపించాడు. ‘ప్యాసా’లో విజయ్ యువకుడు, ఓ భగ్న ప్రేమికుడు కాని ‘కాగజ్ కే ఫూల్’లో సురేష్ ఒక మధ్య వయస్కుడు, కళ్ళద్దాలు లేకుండా ఓ వాక్యం కూడా చదవలేని ముదుసలి. ఇతన్నిహీరోగా భారతీయ ప్రేక్షకులు ఎలా స్వీకరించగలరు? ‘ప్యాసా’లో విజయ్ తాగుబోతు కాదు బాధ ఎక్కువయినప్పుడు తాగుతాడు. కాని సురేష్ ఓ ధనికుడు, డబ్బుతో ఏదన్నా పొందగల సమర్థుడు, తాగుడికి బానిసవుతాడు. ప్రేమించే వ్యక్తులు ఉన్నా వారిని స్వీకరించగల పరిస్థితులు ఉన్నా అన్నిటిని వదులుకుంటాడు. కొని సంవత్సరాల తరువాత కూతురు వెతుక్కుంటూ వస్తే ఆమెను కలవడానికి ఇష్టపడడు కాని ఆమె పెళ్ళికి కానుక ఇద్దాం అనుకుంటాడు. ఈ ద్వంద్వం, మనుష్యులను వదులుకోవడం అన్నది ‘ప్యాసా’ సినిమాలో ఎంత హీరోయిక్‌గా కనిపించిందో అదే ‘కాగజ్ కే ఫూల్’కి వచ్చేసరికి పక్కా చేతకాని తనంలోకి దిగిపోయింది.

హాలీవుడ్‌లో ఇంచుమించు ఇదే ఇతివృత్తంతో వచ్చిన “ఏ స్టార్ ఈస్ బార్న్” అనే ప్రఖ్యాత సినిమాను మొదటి సారి 1937లో తీసారు. ఇది తరువాత 1954లో మళ్ళీ తీసారు. రెండు సార్లు కూడా ఇది అక్కడ విజయం సాధించింది. తరువాత 1976లో, మళ్ళీ 2018లో ఈ సినిమా తీసినా ఈ కథను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. అయితే చాలా మందికి తెలియనిది “ఏ స్టార్ ఈజ్ బార్న్” అనే సినిమా కన్నా ముందు 1932లో ఇంచుమించు ఇదే కథావస్తువుతో “వాట్ ప్రైస్ హాలీవుడ్” అనే సినిమా వచ్చింది. ఇది మొదటి సారి ఈ బలహీన మనస్కుడు, వ్యసనపరుడైన హీరోని హాలీవుడ్‌కి పరిచయం చేసింది. మూకీ సినిమాల సమయంలో హాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న కాలెన్ మూరే అనే ఒక నటి, ఆమె భర్త హాలీవుడ్ సినీ నిర్మాత జాన్ మెక్కార్మిక్ జీవితాన్ని అధారం చేసుకుని ఈ కథ రాసుకున్నారు అడిలా రాగర్స్ సెంట్ జాన్స్. అలాగే, టామ్ ఫార్మాన్ అనే మరో దర్శకుడి జీవితం, మరణం ప్రభావం కూడా ఈ సినిమా కథలో కనిపిస్తుంది. కేవలం ముప్పై మూడేళ్ళ వయసులో నెర్వస్ బ్రేక్‌డౌన్‌తో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నారు టామ్. వీరు జీవితంలో భరించిన ఆ ఒంటరితనం, వ్యసనాన్నిజయించలేని బలహీనతే ఈ కథకు ఆధారం. ఆ తరువాత ఈ కథతోనే “ఏ స్టార్ ఈజ్ బార్న్” సినిమా మరో ఐదు సంవత్సరాల తరువాత వచ్చి బక్సాఫీప్ రికార్డులను బద్దలు కోట్టింది. అందువలన అదే సినిమా జనానికి బాగా గుర్తుండిపోయింది. ఈ కథతో మన దేశంలో సినిమాను 2013 దాకా తీయలేకపోయారు. కారణం బలహీన మనస్కుడు, లేదా వ్యసనపరుడుగా ఉండిపోవడానికి నిర్ణయించుకున్న వ్యక్తిని హీరోగా మన ప్రేక్షకులు చూడలేకపోవడమే.

‘కాగజ్ కే ఫూల్’లో ఇప్పుడు చూస్తే పూర్తిగా “ఎ స్టార్ ఈజ్ బార్న్” ప్రభావం కనిపిస్తుంది. సురేష్ జీవితంలో అన్ని మెట్లు దిగిపోతూ ఉంటే శాంతి నటిగా స్థిరపడుతూ ఉంటుంది. తన పేరుని, ప్రతిష్ఠను వదిలేసి సురేష్‌ని చేరుకోవాలని ఆమె ఎంత ప్రయత్నించినా సురేష్ ఆమెకు ఆ అవకాశం ఇవ్వడు. ఇది పూర్తిగా “ఏ స్టార్ ఈజ్ బార్న్” కథనే పోలి ఉన్న కథ. కాని ఈ ఇతివృత్తం అప్పటి భారతీయులు మెచ్చే పరిస్థితిలో లేరు. వ్యసనపరుడిని హీరోగా భారతీయిలు ఆదరించిన ఒకే ఒక పాత్ర దేవదాసు. ఇది అంతగా జనాన్ని మెప్పించడానికి ఇద్దరు స్త్రీలకు దేవదాసు పై ఉన్న అమర ప్రేమ, ఇద్దరి పట్ల కూడా దేవదాసుకున్న అనుబంధం ముఖ్య కారణం. కాని ‘కాగజ్ కే ఫూల్’లో సురేష్‌కి అతని భార్యకు  మధ్య అహం తప్ప ప్రేమ కనిపించదు. శాంతితో సురేష్ కున్న ప్రేమలో బంధం లేదు. ఇన్ని వైరుధ్యాల మధ్య సురేష్‌ని భారతీయ ప్రేక్షకులు ఇష్టపడలేదు. ఇప్పుడు ఆలోచనలలో చాలా మార్పు, కొంత సామాజిక పరిపక్వతతో పాటు శరీరానికు కావల్సిన ప్రాథమిక అవసరాలతో పాటుగా మనసుకు కావల్సిన అవసరాలు గుర్తించే దిశగా భారతీయ వ్యవస్థ ఆర్థికంగానూ సామాజికంగానూ కొంత ఎదిగిన కారణంగా ఆ నాటి హీరో చట్రం నుంచి భిన్నంగా జీవిస్తున్న వ్యక్తులను కూడా ప్రధాన పాత్రలలో జనం ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. కాని 1959లో ఇది పూర్తిగా అసాధ్యమైన సంగతి.

‘కాగజ్ కే ఫూల్’ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు గురుదత్ చాప్లిన్ తీసిన “లైమ్లైట్” సినిమా ప్రభావంలో ఉన్నారు. “లైమ్లైట్” కథ కుడా కొంచెం ఇదే పద్దతిలో ఉంటుంది. ఇందులో హీరో హీరోయిన్ కన్నా వయసులో చాలా పెద్దవాడు. బహుశా ఆ ప్రభావంతోనే తన వయసుకన్నా పది సంవత్సరాలు పెద్ద వానిగా తెల్లబడుతున్న జుట్టుతో సినిమా ప్రథమార్ధం నుండీ కనిపిస్తారు గురుదత్. హీరోను అంత పెద్ద వయసువానిగా సినిమా మొదటి నుండి చూడడం కూడా మన భారతీయ సినీ ప్రేక్షకులకు ఇదే మొదటి అనుభవం. “లైమ్లైట్” చిత్రంలో చాప్లిన్ కమ్యునిజం పట్ల చూపిన ఆదరణను జీర్ణించుకోలేక కొన్ని వర్గాలు ఈ సినిమాను బాన్ చేసాయి. ఈ సినిమా కూడా అప్పట్లో చాలా మందికి చేరువ కాలేకపోయింది కాని సినీ మేధావి వర్గం ఈ సినిమాకు  నీరాజనాలు పలికారు. గురుదత్ అన్ని ప్రయోగాలు చేస్తూ ఈ సినిమాతో ప్రభావితమయి స్క్రిప్ట్ లో మార్పులు చేయడం కొంత ఒరిజినల్‌గా ఆయన రాసుకున్న కథను దెబ్బతీసింది అని కొందరు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ సినిమాను స్విట్జర్‌లాండ్ వెళ్ళి చాప్లిన్‌ని కలిసినప్పుడు గురుదత్ చూసారట. ఇదే సినిమాను నటుని నేపథ్యంలో తీస్తే ప్రేక్షకులు స్వీకరించేవారేమో కాని దర్శకుడిని హీరోగా అంగీకరించలేకపొయారు అని గురుదత్ సోదరుడు దేవి దత్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా అపజయం పట్ల తన అభిప్రాయంగా చెప్పారు. అయితే ప్రేక్షకులు తిరస్కరించిన ఈ సినిమాకు 16 అవార్డులు వివిధ సందర్భాలలో వచ్చాయని దేవి దత్ చెబుతారు. కాని ఏ అవార్డును కూడా గురుదత్ స్వయంగా వెళ్ళి స్వీకరించలేదట.

(లైమ్లైట్ లో  చార్లీ చాప్లిన్, కాగజ్ కే ఫూల్ లో గురుదత్)

ఫెడెరికో ఫిల్లిని “8 ½” సినిమాను ఎంతమంది మన భారతీయిలు అర్థం చేసుకోగలరు? 1963లో వచ్చిన ఈ సర్రలిస్టిక్ ట్రాజెడి ఇటాలియన్ భాషలో తీసారు. ఇది కూడ ఒక సినిమా దర్శకుని  కథే. తన మనసులోని కన్ప్యూషన్‌కి జవాబులు వెతుక్కోవడానికి తాను ఒక సినిమా తీసి ఎవరికో సహాయపడుతున్నానని, ఇది తప్పని తన జీవితాన్ని యథాతథంగా అంగీకరించాలని ఈ సినిమాలో చివరకు దర్శకుడు తెలుసుకుంటాడు. ఈ పద్ధతిలో తీసిన సినిమాను చూడడం చాలా కష్టం కాని ఇందులో ఎన్నో విషయాలను చర్చించే స్కోప్ ఉంది. మానవ జీవితాన్ని, ఆలోచనలను, సమాజ నియంత్రణను సామాజిక జీవనాన్ని విశ్లేషించడానికి సహాయపడే సినిమా ఇది. ఇంత క్లిష్టమైన సినిమాను ప్రపంచ స్థాయిలో గొప్ప సినిమాగా ఆనాడే పాశ్చాత్య దేశాలు గుర్తించాయి. వారి ప్రశంసలు విని ఈ సినిమాను భరించి ఇప్పటికీ చూస్తారు చాలా మంది భారతీయ సినీ విశ్లేషకులు.

2013కి కాని ప్రజలకు అర్థం కాని ఇతివృత్తాన్ని తీసుకుని 1959లో సినిమా తీసిన గురుదత్ తన కాలం కంటే ఎంత ముందున్నారో చూడండి. ఇప్పుడు ప్రత్యేకంగా ‘కాగజ్ కే ఫూల్’ని క్లాసిక్‌గా ప్రస్తావించే మేధావి వర్గాన్ని చూస్తుంటే, ఆనాడు గురుదత్‌ను చేరుకోలేకపోవడం భారతీయ ప్రేక్షకుల లోపం తప్ప గురుదత్‌ది కాదు అనిపిస్తుంది. పైన అన్ని పాశ్చాత్య సినిమాలను ప్రస్తావించడానికి కారణం వాటన్నిటితో పాటు ఇప్పుడు ‘కాగజ్ కే ఫూల్’ సినిమాను చూస్తే తప్ప ఈ సినిమాకు ఆనాడు ప్రేక్షకుల స్థాయిలో జరిగిన అన్యాయం అర్థం కాదు.

గురుదత్ కొన్ని తన వ్యక్తిగత జీవితంలోని ఆలోచనలను తీసుకుని కథ నిర్మించుకుంటే ఆయనకు గురువయిన జ్ఞాన్ ముఖర్జీ జీవితంలోని కొన్ని సంఘటనలను కూడా ఈ సినిమాలో ఆయన చేర్చి ఈ కథను రాసుకున్నారంటారు అతని మిత్రులు. సురేష్ సిన్హాలోని ఆ డిప్రెషన్ గురుదత్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంది కాబట్టే ఆయన ఈ సినిమాతో అంతగా కనెక్ట్ అయ్యారు. సురేష్ సిన్హాలో ఎక్కడా కూడా ప్రాక్టికాలిటి కనిపించదు. గురుదత్ జీవితంలో కూడా ఈ లోటు కనిపిస్తుంది. చాలా మంది ఈ సినిమాలో చూపించిన భార్యాభర్తల బంధం గురుదత్ వ్యక్తిగత జీవితంలోనిది అని అంటారు. కాని ‘కాగజ్ కే ఫూల్’ కథను ఆయన ఈ సినిమా తీయడానికి ఐదు సంవర్సరాల ముందే అంటే “ఆర్ పార్” తీస్తున్నప్పుడే రాసుకున్నారట. ఫేమస్ స్టూడియో మెట్ల పై కూర్చుని ఈ కథను ఆయన తన మిత్రులయిన షమ్మీ కపూర్, గీతా బాలీ దంపతులకు 1950’ల కాలంలోనే చెప్పారట. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అరుణ్ దత్ ఓ ఇంటర్వ్యూలో దృవీకరిస్తారు. అయితే ‘కాగజ్ కే ఫూల్’ అపజయం వెనుక కొన్ని దర్శకత్వ లోపాలూ కనిపిస్తాయి. ముఖ్యంగా జానీ వాకర్ పాత్ర. జానీ వాకర్ సామాన్య జనాలు ఆదరించిన కమెడియన్. ఈయనకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. పేదవానిగా, మామూలు పనివానిగా, ఈయన్ని చూడడానికి ఇష్టపడిన జనం ఈ సినిమాలో ప్లే బాయ్ రాకీగా జానీని చూడలేకపోయారు. ఈ పాత్రను ఎంత ప్రయత్నించినా ప్రధాన కథతో గురుదత్ జోడించలేకపోవడం ఓ పెద్ద తప్పిదం. ఇది ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్న విషయమే. జాని వాకర్ పాత్ర అప్రస్తుతం అని అబ్రర్ అల్వీ లాంటి వారెంత చెప్పినా గురుదత్ వినలేదని తెలుస్తుంది.

(ప్లే బాయ్ రాకీగా జానీ వాకర్‌ని ప్రజలు స్వీకరించలేకపోయారు)

‘కాగజ్ కే ఫూల్’ సినిమాలో ముఖ్య ఇతివృత్తం ఒంటరితనం. దీన్ని అర్థం చేసుకునే తీరు ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండదు. సమాజం నుండి తమకు ఆశించిన స్థాయిలో చేయూత దొరకనప్పుడు మనిషి ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. అయితే  ఈ ఆశించే విధానంలో ప్రతి ఒక్కరూ ఒకో రకమైన కోరికను ప్రకటిస్తారు. అర్థవంతమైన సంబంధాలు దొరకనప్పుడు మనిషి ఒంటరి అవుతాడు. మరి ఈ అర్థవంతం అన్నది కూడా వ్యక్తికి వ్యక్తికి ఒకే విధంగా అర్థం కాదు. ఈ ఒంటరితనం కూడా రెండు రకాలుగా ఉంటుందని సైకాలజిస్టులు చెబుతారు. మొదటిది తాత్కాలిక ఒంటరితనం. ఓ విధంగా చూస్తే ఇది  మనిషికి కొంత మేలు చేస్తుంది. తనలోకి తాను చూసుకోవడానికి, కొన్ని అనవసర ప్రభావాల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక ఒంటరితనం మాత్రం మనిషికి చాలా చేటు తెస్తుంది. గురుదత్  వ్యక్తిగతంగా అనుభవించిందీ, ఈ సినిమాలో సురేష్ పాత్రలో చూపినది కూడా ఈ దీర్ఘకాలిక ఒంటరితనమే. దీన్ని సురేష్ కోరి స్వీకరించడానికి కారణం తన చూట్టూ ఉన్న వారి పట్ల సహేతుకమైన సంబంధాలను అతను ఏర్పరుచుకోలేకపోవడం. దీనికి సామాజిక కారణాలు ఎన్ని ఉన్నా వాటిలో వ్యక్తిగత పాత్ర కూడా అధికం. సినిమా అంతా కూడా ఈ వ్యక్తిగత కోణంలోనే నడుస్తుంది. అందుకే ‘కాగజ్ కే ఫూల్’లో సురేష్ అనుభవిస్తున్న ఒంటరితనాన్ని ‘ప్యాసా’లో విజయ్ ఒంటరితనంలా సామాజిక కోణంలో  చూడలేరు ప్రేక్షకులు. 1959లో ఈ సినిమా వచ్చినప్పటికి ఈ 2022కి దీర్ఘకాలిక ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది కూడా ఇప్పుడు ఈ సినిమాను అర్థం చేసుకునే వారి సంఖ్య పెరగడానికి మరో కారణం అనిపిస్తుంది. థామస్ వోల్ప్ అనే అమెరికన్ రచయిత ఒంటరితనం గురించి చెబుతూ “ ఒంటరితనం అనేది ఇప్పుడు అరుదైన, ఆసక్తికరమైన విషయం మాత్రమే కాదు. మానవ ఉనికి యొక్క అనివార్య వాస్తవం కూడా” అంటారు దీన్ని అంగీకరించిన వారే ‘కాగజ్ కే ఫూల్’ సినిమాలో సురేష్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలరు. ఒంటరితనంలోని వాస్తవిక కోణాన్ని విశ్లేషించగల వ్యక్తులకే సురేష్ పాత్రలోని ఆ స్వీయ విధ్వంసంలోని విషాదం అర్థం అవుతుంది.

ఈ సినిమా సినిమా స్కోప్‌లో తీయడానికి కూడా గురుదత్ చాలా కష్టపడ్డారు. సినీ నిర్మాణం పట్ల అంత పాషన్ లేకపోతే ఈ పని అప్పట్లో సాధ్యమయేది కాదు. ఈ సినిమా స్కోప్ లెన్స్ అప్పట్లో 20th Century Fox ప్రెసిడేంట్ తయారు చేసినదట. దీని కోసం గురుదత్ పారిస్ దాకా వెళ్లారు. తరువాత ఆ లెన్స్ వాడకాన్ని నేర్చుకున్నారు. అప్పట్లో ఈ సినిమా స్కోప్‌ని ప్రదర్శించే ధియేటర్లు ఒక్క బాంబే, డిల్లీ నగరాలలో ఒకటీ అరా మాత్రమే ఉన్నందున దీన్న రెండు సార్లు షూట్ చేసి రెండు రకాల థియేటర్లకు అందుబాటులో ఉండగలిగేలా జాగ్రత్త పడ్డారు. దీనికి ఎంతో ఖర్చు భరించవలసి వచ్చినా గురుదత్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అయితే ఈ లెన్స్‌తో ప్రయోగాత్మకంగా కొన్ని షాట్లను గీతా దత్ మీద ముందు చిత్రించారు గురుదత్. అలా ఈ లెన్స్ వాడకాన్ని మూర్తి గురుదత్ ఇద్దరూ చూసుకున్నాక ఈ సినిమా మొదలుపెట్టారట. ఇంత కష్టపడి తీసిన ఈ సినిమా స్క్రీన్ పై చెప్పుల వర్షం కురిసిన తరువాత, అది ఎవరో ప్రత్యర్ధుల పని అని తెలిసి జీవితంలో మొదటిసారి ఆ తిరస్కారాన్ని చూసి బిగ్గరగా ఏడ్చానని వీ.కే మూర్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన పరిస్థితే ఆ విధంగా ఉంటే ప్రతి దానికి తీవ్రంగా చలించిపోయే మనస్తత్వం ఉన్న గురుదత్ ఈ చెప్పుల వానను చూసి ఎంత విరక్తి చెంది ఉంటారో అర్థం చేసుకుంటే ఇక జీవితంలో మళ్ళీ ఎప్పుడూ దర్శకత్వం చేయనన్న ఆయన నిర్ణయం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా అపజయంతో స్టూడియోని నడపలేని పరిస్థితిలో మొదటిసారి దక్షిణాది సినిమాలలో నటించడానికి గురుదత్ ఒప్పుకోవలసి వచ్చిందట.

గురుదత్ తన సినిమాలలో వెలుగు నీడలతో ఆడే ఆటలు గురించి ఇంతకు ముందు ‘ప్యాసా’ లో చాలా చెప్పుకున్నాం. కాని ‘కాగజ్ కే ఫూల్’లో ఈ ఫోటోగ్రఫీ అల్టిమేట్ అనిపిస్తుంది. దీని గురించి సినిమాటోగ్రాఫర్ వీ.కే మూర్తి చెబుతూ పాత్రల మధ్య సంభాషణలు లేనప్పుడు పక్కనుండి ఒక సాప్ట్ లైట్‌ను లో-యాంగిల్ లో వెలిగించి వారి ముఖంలోని విషాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేసానని చెప్తారు. పాత్రలు అనుభవిస్తున్న ఓటమిని, నిరాశని చూపించడానికి నీడలను ఎక్కువగా వాడుకున్నానని. ఒకే సందర్భంలో వచ్చే ఒకే విధమయిన సీన్లను ఒకే ఆర్టిస్టుపై చిత్రిస్తున్నప్పుడు వెలుగులో షూట్ చేసిన షాట్ విజయానికి చిహ్నం అయితే చీకటిలో చిత్రించిన షాట్ విషాదానికి చిహ్నంగా ఒకేసారి తీశానని చెప్పుకున్నారు. టెక్నికల్‌గా చూస్తే ‘కాగజ్ కే ఫూల్’ గురుదత్ తీసిన సినిమాలన్నిటిలో ప్రధమ స్థానంలో ఉంటుంది. స్క్రిప్ట్‌లో కొన్ని అతుకులు కనిపించే మాట మాత్రం వాస్తవం.

(వీ.కే మూర్తి పనితనాన్ని సూచించే అద్భుతమైన షాట్ ఇది)

మన భారతీయ సినిమాలో ఎన్నో మానవ సహజ లక్షణాలతో అసహజ లక్షణాలతో కల్పన ఆధారంగా తయారు చేసుకున్న హీరోలున్నారు. కాని పూర్తి మెలన్కోలియా నేపధ్యంలో హీరో పాత్రను చిత్రించింది మాత్రం గురుదత్ ఒక్కరే. ఇప్పుడు చాలా ఏళ్ళ తరువాత ఈ పద్ధతిలో మన దేశంలో కొందరు సినిమాలు తీస్తున్నారు. మెలన్కోలియాకు తెలుగు పదం లేదు. ఒక తీవ్ర విషాదన్ని సూచించే పదం ఇది. ఈ విషయం వివరిస్తూ ప్రాయిడ్ “మోర్నింగ్ అండ్ మెలంకొలియా” అని 1917లో ఒక పుస్తకం రాసారు. మోర్నింగ్ అంటే సంతాపం అనవచ్చేమో కాని ఆ తీవ్రత తెలుగులో రప్పించడం కష్టం. ఇక మెలంకోలియా కు అతి దగ్గరగా ఉన్న పదం విచారం. కాని ఇందులో కూడా ఆ తీవ్రత తీసుకురాలేం. ప్రాయిడ్ సిద్ధాంతాలు ఇప్పుడు చాలా మంది అంగీకరించకపోయినా ఆయన ఈ రెండు స్థితుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా సరళంగా చెప్పారనిపిస్తుంది. “సంతాపం మరియు విచారం ఒకేలా ఉంటాయి కాని జరిగిన నష్టానికి ఇవి రెండు భిన్నమైన ప్రతిస్పందనలు. శోకం వ్యక్తి తనకు ప్రియమైన వస్తువుని కాని వ్యక్తినిగానీ కోల్పోయిన దుఃఖంలో అనుభవిస్తాడు. ఇది వ్యక్తి చేతనంలో జరిగే ప్రక్రియ (Conscious Mind).  మెలంకోలియాలో ఒక వ్యక్తి తనను పూర్తిగా అర్థం చేసుకోలేని, గుర్తించలేని విషయాల గురించి బాధపడతాడు. ఇది అపస్మారకంగా వ్యక్తి మనసులో జరుగుతూ ఉంటుంది. (Unconscious mind). దుఃఖం, శోకం, ఆరోగ్యకరమైన, సహజమైన ప్రక్రియలు. కాని మెలంకోలియా వ్యాధిగా మారుతుంది.

మారుతున్న జీవన పరిస్థితుల దృష్టా జీవితంలో వేగం, వ్యక్తిగత ఆదర్శాలలో త్వరత్వరగా వచ్చే మార్పులు, పెరుగుతున్న భౌతిక ఆనందాల పట్ల ప్రాముఖ్యత కారణంగా కూడా మొదలయిన విచారం  మనిషి జీవితంలో మెలంకోలియా అనే స్థితికి చేరుకుంటుంది. చాలా మంది మేధావులలో ఈ స్థితిని గమనించవచ్చు. ‘కాగజ్ కే ఫూల్’ లో సురేష్ స్థితి ఈ మెలంకోలియాకు అతి దగ్గరగా ఉంది. గురుదత్ జీవితంలో ఈ స్థితి లక్షణాలు 1952 నుండే మొదలయ్యాయని అతని కుమారుడు అరుణ్ దత్ చెబుతారు. మెలంకొలియా అన్న స్థితి సమాజంలో కొన్ని వర్గాలలో విలువలు, అభిప్రాయాల మధ్య జరిగే నిరంతర ఘర్షణ కారణంగా కూడా కనిపిస్తుంది. భారతీయ సినీ చరిత్రలో మెలంకోలియాతో నిండి ఉన్న వ్యక్తుల నేపథ్యంలో సినిమాలు తీసినది గురుదత్ మాత్రమే. తరువాత అతన్ని అర్థం చేసుకున్న దర్శకులు ఎంత స్టడీ చేసినా ఈ అతి విషాద స్థితిని తెరపై చూపడంలో గురుదత్ స్థాయికి చేరలేకపోయారన్నది నిజం. ‘ప్యాసా’లో విజయ్, ‘కాగజ్ కే ఫూల్’ లో సురేష్ ఇద్దరూ కూడా మెలంకోలియా స్థితికి చేరిన వారే. అయితే విజయ్ సమస్యలో సామాజిక సారూప్యత, అతని పేద స్థితి, అందులో ఉద్భవించే ఘర్షణ ప్రజలకు చేరువ అవగలిగింది. కాని ఆర్ధికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న సురేష్‌లో అదే స్థితి ప్రేక్షకుల సానుభూతిని సంపాదించలేకపోయింది.

‘ప్యాసా’లో విజయ్ లోని ఆ విషాదాన్ని కన్వివిన్సింగ్‌గా సామాజికం చేయగలిగిన సాహిర్ రచనలలోని లోతు ‘కాగజ్ కే ఫూల్’ లో కనిపించకపోవడం ఒక అతి పెద్ద లోటు. ‘ప్యాసా’ సినిమా విజయం వెనుక గురుదత్, అబ్రర్ అల్వీ, ఎస్. డీ బర్మన్, వీ.కే మూర్తి. సాహిర్ లుధియాన్విలూ ఉన్నారని చెప్పుకున్నాం. ‘కాగజ్ కే ఫూల్’ కి వచ్చేసరికి వీరిలో సాహిర్ ఎస్.డీ బర్మన్‌తో ఉన్న గొడవల కారణంగా వారితో పని చేయనని తప్పుకున్నారు. అందుకని ఈ సినిమాకు కైఫీ ఆజ్మీ పాటలు రాసారు. సామాజిక అంశాన్ని వ్యక్తిగత విషాదానికి జోడించేలా కైఫీ ఆజ్మీ పాటలు రాయలేకపోయారన్నది నిజం. కైఫీ అజ్మీ కూడా కమ్యునిస్ట్ భావజాలంలో, ప్రొగ్రెసివ్ రచయితల నేపథ్యంలో నించి ఉద్భవించిన కవే. కాని ఈ సినిమాలోని వ్యక్తిగత దుఃఖాన్ని ఆయన సామాజికం చేయలేకపోయారు. ఆ పని కేవలం సినీ చరిత్రలో ఒక్క సాహిర్ లుధియాన్వి మాత్రమే చేయగలరు. చాలా సందర్భాలలో చేసి చూపించారు కూడా.  ఒక చిన్న హాస్య పాట రాయమన్నా అందులో ఒక గాంభీర్యాన్ని ఆలోచనను, సోషలిజాన్ని కలగలిపి రాయగల సాహిర్ ఈ సినిమాకు ఉంటే గురుదత్‌కి చాలా ఉపయోగపడేవారనిపిస్తుంది. ‘ప్యాసా’ టీం నుంచి వైదొలగిన సాహిర్ లేని లోటు ‘కాగజ్ కే ఫూల్’ పరాజయానికి కారణం అని చెప్పలేం కాని ఆయన ఉంటే, ఆయన సాహిత్యం చాలా వరకు ‘కాగజ్ కే ఫూల్’ లోని ఆ విషాదానికి సామాజిన ఆమోదాన్ని ఇవ్వడానికి తోడ్పడి ఉండేది అని అనిపిస్తుంది. ముఖ్యంగా సాహిర్ ఇతర పాటలన్నిటినీ ఓ మారు స్టడీ చేస్తే వారు ఈ సినిమాకు రాసి ఉంటే తనదైన ఓ ప్రత్యేకత జోడించి ఉండేవారని అనిపించి తీరుతుంది.

‘కాగజ్ కే ఫూల్’ని స్టడీ చేస్తున్న ఫిలిం క్రిటిక్స్ మరికొందరు భారతదేశం నుండి నిర్మించిన మొదటి (కొందరి దృష్టిలో ఏకైక) సెల్ప్ రెఫ్లెక్సివ్ సినిమా ఇది ఒక్కటే అని చెబుతారు. మనం తెరపై చూస్తున్నది నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తారు సాధారణ సినిమా దర్శకులు. కాని ఈ సెల్ప్ రెఫ్లెక్సివ్ దర్శకులు మాత్రం ఈ సాంప్రదాయ చిత్రాలకు భిన్నంగా ఆ సినిమానే ఒక భ్రమ నేనే నిజం అనే పద్ధతిలో సినిమా తీస్తారు. ‘ప్యాసా’ లో విజయ్ భ్రమ, గురుదత్ మాత్రమే నిజం, ‘కాగజ్ కే ఫూల్’ లో పూర్తిగా సురేష్ భ్రమ కాని గురుదత్ ఒక్కడే నిజం. ఆ సినిమా చూస్తున్నంత సేపు మన ప్రతిస్పందన సురేష్ పైన కాకుండా గురుదత్ పైనే ఉంటుంది. గురుదత్తే సురేష్‌గా ఎప్పుడు మారాడు, లేదా సురేష్ గురుదత్‌లా మారిపోయాడన్నంతగా అల్లుకుపోయే చిత్రీకరణ అది. సినిమా ఆడదని కొన్ని సంఘటనలను సన్నివేశాలను ముఖ్యంగా సినిమా ముగింపుని గురుదత్ ‘ప్యాసా’లో  మార్చినా, ఎవరి మాట వినకుండా ఏ ప్రలోభాలకి లొంగకుండా తాననుకున్న విషయాన్ని అదే స్థాయిలో గురుదత్ తీసిన ఒకే ఒక సినిమా కూడా ‘కాగజ్ కే ఫూల్’ మాత్రమే. అయితే ఇది ఇతరులకు సంపూర్ణంగా నచ్చుతుంది అని అతను అనుకోవడమే ఆ తరువాత దర్శకుడిగా ఆయన మరుగున పడి పోవడానికి కారణం అయ్యింది.

ఒక ఆర్టిస్ట్ తనని పూర్తిగా తన చిత్రీకరణలో స్వవ్యక్తీకరించుకోవడానికి సెల్ప్ రిప్లెక్షన్ అనుకోవచ్చు. సాధారణంగా ప్రతి ఆర్టిస్ట్ తననే తన కళ ద్వారా వ్యక్తీకరిచుకుంటాడు కాని ఇందులో కొన్ని ప్రలోభాలుంటాయి, కొంత కల్పన ఉంటుంది, కొన్ని సమర్థింపు చర్యలుంటాయి. అవి ఏవీ లేకుండా తనను తాను ఎక్కడా డీవియేట్ అవకుండా ఏ ప్రలోభాలకు లోంగకుండా ఒక ఫిలిం మేకర్ సినిమా తీయడం చాలా కష్టం. మన దేశంలో ఎవ్వరూ సినిమా నిర్మాణంలో చేయని ప్రయోగం అది. దీన్ని ఆచరించింది మన దేశంలో మొట్టమొదట గురుదత్ మాత్రమే. సెల్ఫ్ రెఫ్లెక్సివ్ పద్ధతిని అర్థం చేసుకోవాలంటే స్పానిష్ భాషలో పదహారవ శతాబ్దంలో వచ్చిన డాన్ క్విక్సోట్ నవలను ఉదహరించవచ్చు. షేక్స్పియర్ “ఏ మిడ్ సమ్మర్ నైట్శ్ డ్రీం”, “ట్వెల్ఫ్త్ నైట్” కూడా ఇదే వర్గంలోకి చేరుతాయి. రష్యన్ రచయిత నికోలాయ్ గోగొల్ ఈ వర్గానికి చెందిన రచయిత. ఇక సినిమాల విషయానికి వస్తే పైన ప్రస్తావించిన ఫెడిరికో ఫెలినీ ఇటాలియన్ సినిమా “8 ½” ముందు వరుసలో నిలుస్తుంది. ఇంగ్రిడ్ బర్గ్మెన్ “పర్సోనా” రష్యన్ దర్శకుడు డ్జీగా వర్తోవ్ తీసిన డాక్యుమెంటరీ “ది మాన్ విత్ ఏ మోవీ కేమెరా” కూడా ఈ కోవలోకే వస్తాయి. ఈ దిశగా నిర్మించిన సినిమాలలో మన దేశంలో చెప్పుకోవాలంటే మన ముందు ఉన్నది ‘కాగజ్ కే ఫూల్’ మాత్రమే.

అందుకే 2002లో  సైట్ అండ్ సౌండ్ ‘కాగజ్ కే ఫూల్’ ని ఆల్ టైం గ్రేటిస్ట్ హిట్శ్ లో చేర్చింది. బ్రిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ టాప్ 20 భారతీయ సినిమాల లిస్ట్‌లో దీన్ని చేర్చింది. ఇలా చాలా సందర్భాలలో ఈ క్లాసిక్ సినిమా ప్రసక్తి వస్తుంది. ‘కాగజ్ కే ఫూల్’ సినిమా సీన్ టూ సీన్ విశ్లేషణ వచ్చే వారం నుండి చూద్దాం. ఆ క్రమంలో గురుదత్‌ను ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకులు ఆర్సన్ వెల్లెస్‌తో పోల్చడం ఎంత వరకు సబబు, ‘కాగజ్ కే ఫూల్’ సినిమాకి ఆర్సన్ వెల్లెస్ “సిటిజెన్ కేన్”కి  మధ్య ఉన్న సారూప్యాలు ఏంటి అన్నవి కూడా గమనించవచ్చు. కొందరు ఫిలిం క్రిటీక్స్ ఈ సినిమా తరువాత గురుదత్‌ని భారతీయ ఆర్సన్ వెల్లిస్‌గా ప్రస్తావించారన్న దిశగా కూడ ఈ సినిమాను స్టడీ చేద్దాం.

(ఆర్సన్ వెల్లిస్ సినిమా ‘సిటిజెన్ కేన్” తో పోలిన లాంగ్ షాట్లను ప్రయోగించిన మొదటి భారతీయ చిత్రం ‘కాగజ్ కే ఫూల్’)

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here