మధురమైన బాధ – గురుదత్ సినిమా 26 – కాగజ్ కే ఫూల్-3

0
13

[box type=’note’ fontsize=’16’] గురుదత్ నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘కాగజ్ కే ఫూల్’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

‘కాగజ్ కే ఫూల్’ -3

[dropcap]గు[/dropcap]రుదత్ పాటల చిత్రీకరణ గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ సందర్భంలో ఇక్కడ వచ్చే పాట ఓ గొప్ప పాఠం అవుతుంది. గురుదత్ చిత్రీకరించిన పాటలన్నిటిలోకీ ఈ పాట ఒక అద్భుతం. ఆనందాన్ని విషాదాన్ని సమపాళ్ళలో పంచే గీతం ఇది. అసలు ఈ పాటను ఇంత హృద్యంగా పాడగలగడం ఒక్క గీతా దత్‌కే సాధ్యం అవుతుంది. కళ్ళను తడపని భావంలో లోతు ఉండదు. మితిమీరిన ఆనందమైనా, కళ్ళు చిప్పిల్లకపోతే అందులో ఏదో ఒక కొరత ఉన్నట్లే. గుండె లోతుల్లోంచి వచ్చే ఏ భావమయినా కళ్లలో చెమ్మతోనే బయటపడుతుంది. ఈ పాటలో అంతులేని ఆనందం ఉంది. ఎంత అంటే ఆ స్థాయికి మనసు చేరాక ఇక మరేమీ అవసరం లేదనిపించేటంతటి నిర్వికార స్థితి అది. అంతటి ఆనందాన్ని పొందిన మనసు ఎంతగా తడిసి ముద్దవుతుందంటే ఆ స్థాయికి చేరుకున్నాక ఏవీ మనవి కావని, ఇక ఏదీ మనకు అక్కర్లేదని అ ఒక్క క్షణపు ఆనందం మాత్రమే చాలని అనిపిస్తుంది. అన్నీ అర్థరహితంగా కనపడడంలో ఓ విషాదం ఉంటుంది. అత్యుత్తమమైన అనుభవం అది. ఎండనూ వానను ఒకేసారి అనుభవిస్తున్నప్పుడు కలిగే ఓ తాదాత్మ్యత ఇది. మరొకరిని పొందడంలో ఆనందం, మనలను కోల్పోవడంలో విషాదం. ఇదేగా ప్రేమ అంటే.

ఆనందం విషాదం రెండూ కలబోసి పరిమళించే వేళ మనసు పలికే గీతం ఈ సందర్భంలో వచ్చే “వక్త్ నే కియా క్యా హసీన్  సితం, తుం రహే న తుం హం రహే న హం” అన్న పాటలా ఉంటుంది (కాలం ఎంతటి తీయటి గాయం చేసింది, నీవు నీవు కాదు, నేను నేను కాదు). ఈ ప్రేమను ఆస్వాదించాకా, సురేష్ ఇక ఆ పాత సురేష్ కాడు, శాంతి ఆ పాత శాంతి కాదు. ఇది ఓ తీయని బాధ. ఆ ఇద్దరూ ఆ క్షణం నుండి తమ గుండెల్లో ఒకరినొకరు నిలుపుకుని జీవించడం తప్ప మరో దారి తమకు లేదని తెలుసుకున్న సందర్భం అది. ఈ పాటను కొందరు విషాద గీతంగా చూస్తే కొందరు గొప్ప ప్రేమగీతంగా చూస్తారు. ఒక వైపు విషాదం, ఒకవైపు ఆనందాన్ని కలుపుకుని సాగే ఈ గీతం హిందీ సినీ గీతాలలోనే ఓ అద్భుతం. గీతా దత్ ఈ పాట కోసమే పుట్టారా అనిపిస్తుంది ఇది విన్న ప్రతి సారి కూడా.

ఇక ఈ పాట చిత్రీకరణ చూడండి. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో గురుదత్ తన సినిమాలలో పాత్రలు కథలో కనిపించే చోటునే పాటకు కాన్వాస్‌గా మార్చుకుని అద్భుతమైన గీతాలుగా తయారు చేసారు. ‘ఆర్‌పార్’లో అందమైన డ్యూయెట్లు కార్ గారేజ్‌లో, ‘బాజీ’లో అట్టపెట్టలు పడి ఉన్న స్టోర్ రూమ్‌లో, ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ లో ఓ చిన్న ఇంటి మెట్ల పైన, ‘ప్యాసా’ లో ఓ పాడు బడిన ఇంటి మేడ పైన ఇలా ఆ సీన్లు నడిచే చోటే పాటను కథకు కొనసాగింపుగా గురుదత్ చిత్రీకరించారు. చాలా భారీ బడ్జెట్ చిత్రాలలో ప్రేమ గీతం అంటే అక్కడ సీన్ కట్ చేసి మంచు కొండల్లో, కాశ్మీర్ లోయల్లో లేదా స్విట్జర్లాండ్ యూరప్‌లకో హీరో హీరోయన్లు వెళ్ళిపోతారు. అలాంటి ఆడంబరమైన చిత్రీకరణలతో కూడా చూపలేని అద్భుతమైన సౌందర్యభావాన్ని ఈ సినిమాలో ఓ ఖాళీ స్టూడియోలో, ఒక కెమెరా, ఓ పాత ఎడ్ల బండి, ఓ రెండు కుర్చీల మధ్య చూపిస్తారు గురుదత్. గురుదత్ సినిమాలలో ప్రేమలో పడ్డ పాత్రలు, లేదా వారి జీవితాలలో ఓ అద్భుత మానసిక స్థితిని అనుభవిస్తున్న పాత్రలు, అప్పటిదాకా వారు ఉన్న చోటు నుంచి ఎక్కడికో వెళ్ళిపోరు. ఇది ఓ రకమైన పలాయనవాదం. ప్రేమ నిజ జీవితాలనుండి ఎవరినీ దూరం చేయకూడదు. అది వారి ప్రస్తుత జీవితాన్ని, వారి అప్పటి క్షణాలను కాంతివంతం చేయాలి. ప్రేమ కాసేపు చేసే విహారం కాదు. అది దైనందిన జీవితంలోని నిస్సారతలోకి వెలుగును తీసుకు రావాలి. అప్పుడే ఆ ప్రేమలో ఒక లోతు ఉంటుంది. ఇది అర్థం చేసుకోకుండా ప్రేమ పాటలు చిత్రీకరిస్తారు చాలా మంది దర్శకులు. ప్రేమలో పడడం అంటే మన వాస్తవిక జీవితం నుండి ఎక్కడికో వెళ్ళడం కాదు. దాన్ని పారిపోవడం అంటారు. ఆ పాత్రల మధ్యన చూపే ఇలాంటి ప్రేమకు, వారి వాస్తవ జీవితానికి మధ్య ఎప్పుడూ ఓ దూరం ఉన్నట్లే ఉంటుంది. ఇది ప్రేమను చూపే విధానం కాదు అని నమ్మేవారు గురుదత్. అందుకే తన సినిమలో వచ్చే ఎటువంటి ప్రేమ లేదా విషాద గీతాలను కూడా కథకు దూరంగా తీసికెళ్ళలేదు. పాత్రల జీవన స్థితిగతుల నడుమ గురుదత్ చిత్రించే ప్రేమ భావన ఎప్పుడూ ఆ పాత్రల వాస్తవిక జీవితాల నుండి దూరంగా పోలేదు. ఇది గురుదత్, పాటల చిత్రీకరణలో ఆచరించిన అతి ముఖ్యమైన అంశం.

నేను పిల్లలు గలవాణ్ణి అని చెప్పినపుడు నాకు తెలుసు అని జవాబిచ్చిన శాంతికి దగ్గరగా వస్తాడు సురేష్. ఆమెను పరీక్షగా చూసే ఏమీ చెప్పలేక వెనుదిరుగుతాడు. ఈ షాట్లో ఆ ఇద్దరూ కూడా స్టూడియో బైట నుండి లోపలికి పడుతున్న ఓ వెలుగు ధార మధ్యలో ఉంటారు. వెలుగులో ఉన్న శాంతి దగ్గరకు వచ్చిన తరువాత సురేష్‌కి బహుశా తన స్థితి గుర్తుకు వచ్చి కాబోలు వెనక్కు తిరిగి చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అతని వైపుకి మౌనంగా చూస్తూ ఉంటుంది శాంతి. ఆ రెండు పాత్రల వ్యక్తిత్వాలను చూపించే షాట్ ఇది. వారి భవిష్యత్తుని పరిచయం చేసే షాట్ కూడా. అతని వైపుకు కళ్ళెత్తి నిస్సహాయంగా చూస్తున్న వహీదాపై క్లోజప్ షాట్‌తో “వక్త్ నే కియా” అన్న పాట మొదలవుతుంది. ఆమె కళ్లలో ఒక అమాయకమైన నిస్సహయత కనిపిస్తుంది. “క్యా హసీన్  సితం” అన్న దగ్గర వహీదా కళ్ళలో కదలాడే విషాదం మనసును పిండేస్తుంది. ఆమెకు అర్థమవుతుంది సురేష్ ఎప్పటికీ తనవాడు కాలేడని. ఇక తరువాత వచ్చే “తుమ్ రహే న తుమ్ హమ్ రహే న హమ్” అన్న దగ్గర ఆమె పెదవులు విషాదంతోనూ ప్రేమను పొందిన ఆనందంతోనూ కదులుతాయి. కెమెరా ఆమె ముఖం నుండి జరిగి గురుదత్ వైపుకు వస్తుంది. అతని ముఖంలోని భావాలను పట్టుకునేలోపు గురుదత్ అటువైపు వహీదాను చూడడానికి తిరుగుతాడు. అతని మనసులోని సంఘర్షణను చూపాలని కెమెరా విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇక లాంగ్ షాట్‌లో వారిద్దరి వెనుక నుండి మళ్ళీ కెమెరా షూట్ చేస్తూ వారి చుట్టూ తిరుగుతుంది. ఈ సీన్‌లో ఆ ఇద్దరి మద్య ఉన్న దూరాన్ని చూపడం దర్శకుని ఉద్దేశం. అప్పుడు స్టూడియో కప్పు నుండి వెలుగు ధారగా క్రింద పడి ఆ ఇద్దరి మధ్య ప్రసరిస్తుంది. భారతీయ పాటల చిత్రీకరణలో ఎవరూ తీయలేని అద్భుతమైన షాట్ ఇది. ఈ షాట్ ఇలా కావాలని గురుదత్ వీ.కే. మూర్తిని అడిగితే ఆయన పెద్ద అద్దాల సహాయంతో చాలా కష్టపడి ఈ షాట్‌ని తీసి చూపించారట. ఈ కెమెరా మాజిక్, లాంగ్ షాట్లో చీకట్లో గురుదత్, కాస్త వెలుగులో వహీదా వీరిద్దరి నడుమ వచ్చి ఒకేసారి పడిన ఆ వెలుగు వెనుక గీతా దత్ గొంతులో వచ్చే ఈ గీతం ఇవి చాలు ఈ సినిమాను మాస్టర్‌పీస్ అనడానికి.

ఇప్పుడు గురుదత్ వైపుకు కెమెరా మళ్ళిస్తూ ఉంటే బాక్‌గ్రౌండ్‌లో గీతా దత్ “బేకరార్ దిల్ ఇస్ తరహ్ మిలే జిస్ తరహ్ కభీ హమ్ జుదా న థే…” అన్న వాక్యాన్ని ఆలాపిస్తుంది (ఒకరినొకరు కోరుకున్న మనసులు ఇంతకు ముందెప్పుడు దూరంగా ఉండనట్లుగా కలుసుకున్నాయి). ఈ వాక్యం రిపీట్ అయి మళ్ళీ వహీదా వైపు క్లోజప్ వచ్చినప్పుడు ఆమె దుఃఖాన్ని దిగమింగుతున్నట్లు గొంతులో చిన్న గుటక వేస్తుంది. గొంతు దాటి వచ్చే పదాలను గొంతులోనే ఆపుకుంటున్న ఆమె ఆ చిన్న చర్యను కూడా వీ.కే మూర్తి కెమెరా పట్టుకుంటుంది. ఎంత ఇన్వాల్మెంట్ ఉన్న నటనను గురుదత్ రాబట్టుకుంటారో చూడండి. గొంతులో ఓ చిన్న గుటక వేస్తూ ఆ సన్నివేశాన్ని ఆమె అనుభవించడం అక్కడ నటన అనిపించదు. గీతా దత్ గొంతు “తుం భీ ఖో గయే” (నిన్ను నీవు వీడిపోయావు) అంటున్నప్పుడు గురుదత్‌పై క్లోజప్ షాట్ చూపిస్తూ “హం భీ ఖో గయే” (నన్ను నేను వీడిపోయాను) అంటూ వహీదా ముఖాన్ని క్లోజప్‌లో చూపిస్తారు గురుదత్. పై షాట్‌లో సురేష్ తల ఎత్తి శాంతి ముఖాన్ని పరిశీలనగా చూస్తాడు. ఆమెలో తనను తాను వెతుకుంటున్నట్లు. ఇక వహిదాపై క్లోజప్ షాట్‌లో ఆమె ఓ క్షణం తన మనసులో దాచుకున్న మనిషిని కళ్ళు మూసుకుని తనలో నిలుపుకుంటునట్లుగా చూస్తుంది. స్త్రీ పురుషుల ప్రేమని అనుభవించడం లోని ఈ తేడాని ఎంత గొప్పగా చూపించారో గురుదత్ ఈ వాక్యం దగ్గర. తరువాత “ఎక్ రాహ్ పర్ చల్ కే దో కదం” (ఒకే దారిలో రెండు అడుగులు నడిచి) అని వచ్చే వాక్యం దగ్గర వీరిలోనుండి విడివడిన అత్మలు ఆ ఇద్దరి మధ్యలో పడిన వెలుగు దగ్గరకు నడుచుకుంటూ వచ్చి కలుసుకున్నట్లు చూపడం ఈ పాటకే నిండుతనాన్ని తీసుకొచ్చింది.

ఈ పాట కోసం ఏ సీన్ కూడా సినిమా స్క్రిప్ట్‌లో లేదు. గురుదత్ ఈ పాటను చిత్రీకరించేదాక అసలు ఈ పాట ఈ సినిమాకు సరిపోతుందని, పాత్రల చిత్రీకరణకు ఉపయోగపడుతుందని కూడా ఎవరూ అనుకోలేదు. ఇది కేవలం గురుదత్ మదిలో మెదిలిన ఒక అంశం. ఎస్.డీ. బర్మన్ తయారు చేసుకున్న ఈ ట్యూన్ ఆయనకు చాలా నచ్చి కైఫీ అజ్మీతో ఎన్నో సార్లు పదాలు రాయించుకున్నారు. ఈ పాట రాయడం కూడా కైఫీకి చాలా కష్టం అయిందట. దానికి కారణం సినిమాలో ఈ పాట వచ్చే సన్నివేశాన్ని గురుదత్ స్పష్టంగా అతనికి చెప్పలేకపోవడం. చాలా ప్రయత్నాల తరువాత ఈ పల్లవి వినిపించినప్పుడే ఈ పాట చిత్రీకరించవలసిన విధానం గురుదత్ మనసులో మదిలింది. అలా తయారయింది ఈ అద్భుత గీతం.

ఈ పాటను ఎంత గొప్పగా కథకు అనుకూలంగా మలచుకుని గురుదత్ చిత్రీకరించారంటే, ఈ పాట ఈ చిత్రానికి జీవం పోస్తుంది. సురేష్ శాంతిల వ్యక్తిత్వాలకు, వారి మనసుల్లో పైకి చెప్పుకోలేని ఓ బాధను ఇది వ్యక్తీకరిస్తుంది. ఇది పూర్తిగా బాక్‌గ్రౌండ్ సాంగ్. గురుదత్ ఇతర సినిమాలలో హీరో హీరోయిన్ల మధ్య నడిచే సన్నివేశాలలో వారితో పాట పాడించకూడదనుకున్నప్పుడు వారి పక్కన ఎవరో వీధి పాటగాళ్ళు లేదా రోడ్డు మీద వెళుతున్న వారిని ఇంట్రడ్యూస్ చేసి పాటను చిత్రించేవారు. ఆ పాటకు అనుగుణంగా నటుల స్పందనను చూపించేవారు. కాని ఈ సినిమాలో ఆయన బాక్‌గ్రౌండ్‌పై చాలా ఆధారపడ్డారు. ఈ సినిమాలో ఇది రెండవ బాక్‌గ్రౌండ్ పాట. భారతీయ సినిమాను పాటలు ఎంత ఉన్నత స్థాయిలో ఉంచగలవో చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు. పాటలను గ్రూపు డాన్సులుగా మార్చేసిన తరువాతి దర్శకులు ఎంతగా అది ట్రెండ్ అని చెప్పుకుంటున్నా ఈ స్థాయిలో పాటల చిత్రీకరణ ఆ తరువాత ఎవరూ ప్రయత్నించలేదు. గురుదత్ దగ్గర శిష్యరికం చేసిన రాజ్ ఖోస్లా ఒక్కడే కాస్త ఆ స్టైల్‌ని పట్టుకోగలిగారు. పూర్తిగా మాత్రం కాదు.

సురేష్, శాంతిల శరీరాలు ప్రపంచపు బంధాల నడుమ, అంక్షల నడుమ, ఒకరినొకరు కలవలేని స్థితిలో ఉంటే వాటిని దాటుకుని వారి ఆత్మలు ఒకరితో ఒకరు కలవడం ఈ పాటలో చూస్తాం. ప్రేమ గురించి గ్రంథాలు రాసిన వాళ్ళు కూడా ఈ పాటలో గురుదత్ చూపిన ప్రేమికుల కలయిక ముందు తల వంచవలసిందే.

(వీ.కే మూర్తి సృష్టించిన వెలుగు)

తరువాత మళ్ళీ ఆ పాట పల్లవి రిపీట్ అయినపుడు కెమెరా మొత్తం కూడా వహీదా మీద ఫోకస్ అయి ఉంటుంది. ఆమె ముఖాన కొన్ని నీడలు కదలాడి చివరకు ఆమె ముఖం వెలుగులోకి మారేటప్పుడు ఆమె ముఖంపై ఒక నిశ్చయం కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె మొహంలో ఇంతకు ముందున్న వేదన, బాధ బదులు ఒక ప్రశాంతత కనిపిస్తుంది. తన భవిష్యత్తును తాను నిర్ణయించుకున్న తరువాత కనిపించే ప్రశాంతత. ప్రేమ అనే తుఫానులోంచి ఒక నిశ్చయం వైపుకు చేరిన తరువాత వచ్చే ప్రశాంతత అది.

ఇక్కడ మరో చరణం మొదలయేటప్పుడు వీరిద్దరూ ఎదురెదురుగా ఉంటారు. ఇప్పుడు వహీదా వడివడిగా వెనక్కు నడుచుకుంటూ వెళుతుంది. గురుదత్ అక్కడ చీకటిలో ఉన్న ఓ బండిపై ఆలోచిస్తూ కూర్చుండిపోతాడు. వహీదా మాత్రం ఇప్పటి దాకా ఖాళీగా ఉన్న కుర్చీ వైపుకు వెళుతుంది. అక్కడ మళ్ళీ ఆమె వెలుగువైపుకే నడుస్తుంది. కాని గురుదత్ చీకట్లోనే ఉండిపోతాడు. అతనిలోని అలజడి కనిపిస్తూ ఉండగానే వెనుక నుండి “జాయేంగే కహా సూజతా నహీ చల్ పడే మగర్ రాస్తా నహీ” (ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, దారే కానరాని చోటునుండి ప్రయాణం మొదలయింది) అంటూ గీతా దత్ గానం ముందుకు సాగుతుంది. ఇదే వాక్యం తిరిగి వహిదాపై క్లోజప్ షాట్‌లో తిరిగి వస్తుంది. వహీదా కంటిలో తడి, కనురెప్పలను మూసుకుంటూ ఆమె చూపించే నిస్సహాయత, మళ్ళీ ఆమె పైనే కెమెరా ఉండగా “క్యా తలాష్ హై కుచ్ పతా నహీ బున్ రహే హై దిల్ ఖాబ్ దమ్ బ దమ్” (ఏమి వెతుక్కోవాలో అర్థం కావట్లేదు కాని మనసు ప్రతి నిముషం కలలను అల్లుకుంటుంది) అంటూ ఆమె తిరిగి తాను వదిలి పెట్టిన స్వెట్టర్‌ను చేతిలోకి తీసుకుని మళ్ళీ అది అల్లుకుంటూ కూర్చుండిపోతుంది. ఆమె కూడా ఇప్పుడు చీకట్లో ఉంటుంది. గురుదత్ ఇటు పక్కన చీకట్లోఉంటాడు వారిద్దరి నడుమ ప్రసరిస్తున్న వెలుగు…. సూపర్ షాట్ ఇది.

పాటకు ముందు స్వెటర్ అల్లుకుంటూ కూర్చుంటుంది శాంతి. నడుమ కాసేపు వచ్చిపోయే ఆలోచనలే ఈ పాటగా సాగుతాయి. తరువాత ఆమె మళ్ళీ తన పనిలో నిమగ్నమవుతుంది. జీవితంలో అతి గొప్ప అనుభవాలు రోజువారి పనుల మధ్య హఠాత్తుగా వచ్చి మనల్ని పలకరించిపోతాయి. తరువాత జీవితం మామూలే. ప్రేమ అయినా ఇలాగే కలుగుతుంది. అంతే కానీ హఠాత్తుగా మనం కాశ్మీర్ లోయల్లో స్టెప్పులు వేయడానికి వెళ్ళిపోం. అన్ని రకాల బాధ్యతల మధ్య గొడవల మధ్య ఇద్దరు మనుష్యులు ఒకరికొకరు హఠాత్తుగా దగ్గరకు రావడం, ఒకరికొకరుగా అనిపించడం, ఇదే నా గమ్యం అనిపించడమే ప్రేమ, ఆ ఒక్క క్షణం ఇరువురి జీవితాలనే మార్చి వేస్తుంది. జీవితం పట్ల వారి ఆలోచనను జీవన గమనాన్నే మార్చేస్తుంది. ఆ ఒక్క చిన్న క్షణాన్ని గురుదత్ ఎంత లోతుగా తన చిత్రాలలో చూపించారంటే, ఆ ఇంటెన్సిటీ మరే దర్శకుడికీ సాధ్యం కాదేమో. ఆ సమయంలో ఆయన సినిమాలలో భాష, సంస్కృతులు ఎవరికీ గుర్తుకు రావు. ప్రతి ఒక్కరు ఆ ముఖంలో పలికే భావాలకు కనెక్ట్ అవుతారు. హిందీ గీతం వెనుక వస్తున్నా, భారతీయ వాతావరణం చుట్టూ ఉన్నా ఆయన చిత్రీకరించిన పాటలు భాషరాని వారి మనసుకు కూడా చేరతాయి. అదీ చిత్రీకరణ అంటే. అందుకే గురుదత్ విదేశీయులకు సైతం అంత దగ్గర కాగలిగారు. ముఖ్యంగా ప్రేమను ప్రేమించే ఫ్రెంచ్ సినీ విశ్లేషకులకు. గురుదత్ సినిమాలలో ప్రతి ప్రేం ఓ ఛాయాచిత్రం. వాటికి మనం మాట్లాడే భాషకన్నా మరో ప్రాపంచిక భాష ఉంది. అది మానవ భావోద్వేగాలకు సంబంధించినది. మనసు నుండి మనసుకు పాకేది. ‘కాగజ్ కే ఫూల్’ అటువంటి భావోద్వేగాలను కదిలించే దృశ్య కావ్యం.

ఈ పాట తరువాత సీన్ బీ.బీ. వర్మ ఇంటికి మారుతుంది. బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ వద్ద ఆ దంపతులు పేపర్ చదువుతూ ఉంటారు. పేపర్‌లో రాకీ సినీ హీరోయిన్లతో కలిసి ఉన్న ఫోటో వస్తుంది. అది తల్లి తండ్రులు చూడకూడదని తన మొఖానికి పెన్సిల్‌తో గడ్దం గీస్తాడు రాకీ. అతని చెల్లెలు బీనా వచ్చి తల్లి తండ్రులకు ఇది చూపించి రాకీ కూడా ఇంటి పరువు మరచి సినిమా వారితో తిరుగుతున్నాడని చెబుతుంది. వీరి మధ్య జరిగే సంభాషణలో రాకీ ఆ ఇంటిలోని వ్యక్తులకు భిన్నం అని వారికున్న అహంకారం అతనికి లేదని తెలుపుతుంది. కాని ఈ సీన్ ఇక్కడ ఉండకపోతే బావుండేదేమో అని కూడా అనిపిస్తుంది. అంత గొప్ప పాట తరువాత వచ్చే ఈ సీన్ సినిమా మూడ్‌ని దెబ్బ తీసిందనిపిస్తుంది.

ఇప్పుడు సీన్ శాంతి ఇంటికి మారుతుంది. సురేష్ కూతురు పమ్మి సూట్‌కేస్ తీసుకుని శాంతి ఇంటికి వస్తుంది. అక్కడ గోడమీద తన తండ్రి ఫోటో తగిలించి ఉండడం చూస్తుంది. చప్పుడు విని శాంతి బైటకు వస్తుంది. అక్కడ పమ్మిని చూసి ఆశ్చర్యపోతుంది. నువ్వెవరు అని అడిగినదానికి పమ్మి గోడపై నున్న సురేష్ ఫోటో చూపించి ఆయన మా నాన్న అని చెబుతుంది. శాంతి ఆశ్చర్యంగా చూస్తుండగా ఇక్కడ ఒక్క మా నాన్నగారి ఫోటోనే ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతుంది. పమ్మి గొంతు కొంత కఠినంగా మారుతుంది. శాంతి నాకెవరూ లేరు ఇంకెవరి ఫోటో పెట్టుకోగలను అని బదులిస్తుంది. అంటే నీ ప్రపంచంలో మా నాన్న ఒక్కరే ఉన్నారా అని కోపంగా అడుగుతుంది పమ్మి. పమ్మితో ప్రేమగా మాట్లాడాలని ప్రయత్నిస్తుంది శాంతి. కాని పమ్మి శాంతిని అసహ్యంగా చూస్తుంది. తన తల్లితండ్రుల మధ్య దూరం పెరగడానికి ఆమే కారణం అనే అర్థంతో శాంతితో వాదన పెట్టుకుంటుంది. నేను రాకముందే మీ అమ్మ నాన్నలు దూరంగా ఉంటున్నారు అని శాంతి అన్నదానికి పమ్మి అది నాకు ఊహ తెలియనప్పటి సంగతి. ఇప్పుడు నేను పెద్దదానయ్యాను. వారిద్దరిని కలుపుతాను. కాని మధ్యలో నీవుంటే అది సాధ్యం కాదు అని బదులిస్తుంది. శాంతి పమ్మికి నచ్చజెప్పాలనుకున్నా అది సాధ్యం కాదు. పైగా నీకు తల్లి తండ్రులు లేరు. నాకున్నారు. అమ్మా నాన్న వేరు వేరు ఇళ్లల్లో ఉంటారు. నేను హాస్టల్లో ఉంటున్నాను. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాలని నేను ప్రయత్నిస్తున్నాను. కాని నీవుంటే అది సాధ్యం కాదు అంటూ శాంతి భుజంపై తల పెట్టుకుని ఏడుస్తుంది పమ్మి.

(తన తండ్రి జీవితంలోనించి తప్పుకొమ్మని శాంతిని అడుగుతున్నపమ్మి)

తరువాతి సీన్‌లో సురేష్ ఇంటినుండి బైటకు వస్తూ ఉన్నప్పుడు పమ్మి అతని దగ్గరకు పరుగెత్తుకు వస్తుంది. కూతురు స్కూలు నుండి తనకోసమే పారిపోయి వచ్చిందని అనుకుంటాడు సురేష్. కొంత కాలం ఆమెను తన దగ్గర ఉంచుకుంటానని, ఆ రోజు సాయంత్రం తన కొత్త సినిమా ప్రీమియర్ షోకు పమ్మిని తీసుకువెళతానని అంటాడు.

ప్రీమియర్ షో థియేటర్లో ప్రదర్శించిన తరువాత టెన్షన్‌తో సురేష్ ఆడియన్స్‌ని చూస్తూ ఉంటాడు. ఒక్క క్షణం నిశబ్దం తరువాత అందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొడతారు. అది చూసి శాంతి కూడా సంతోషిస్తుంది. సురేష్‌ని జనం చుట్టుముడతారు. శాంతి ముఖాన నీలి నీడలు ముసురుకుంటాయి. కన్నీళ్ళతో ఆమె తన సీట్ నుంచి లేచి వెళ్ళిపోబోతుంది. ఫాన్స్ ఆమెను చుట్టుముడతారు. ఫోటోగ్రాఫర్లు ఆమెను ప్రొడ్యూసర్ సేత్‌తో కలిపి ఫోటో తీస్తారు. సురేష్ పమ్మి కూడా వారి దగ్గరకు వస్తారు. ఫోటోగ్రాఫర్లు అడిగారని సురేష్ శాంతి పక్కన ఫోటో కోసం నిలబడతాడు. శాంతి పమ్మిని తమ మధ్యకు లాగుతుంది. పమ్మి శాంతిని చూసి ఇచ్చిన మాట మర్చిపోవు కదా అని అడుగుతుంది. సురేష్ ఇది గమనిస్తాడు.

(సినిమా ప్రీమియర్‌లో ఇచ్చిన మాట నిలుపుకొమ్మని శాంతిని అడిగి తండ్రిని గమనిస్తున్న పమ్మి)

మరుసటి రోజు సేత్ ఆఫీసులో అతనితో శాంతి తానింక సినిమాలలో పని చేయనని చెబుతుంది. సేత్ ఆమెను ఆ పని చేయవద్దని మొదటి సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చిందని, ఇక ఆమెకు సినీ రంగంలో మంచి భవిష్యత్తు ఉందని దాన్ని వదులుకోవద్దని నచ్చచెప్పాలని ప్రయత్నిస్తాడు. శాంతి ఇవేవి వినదు. తానిక సినిమాలలో చేయనని తెగేసి చెబుతుంది. సేత్‌కి చాలా కోపం వస్తుంది. “నీవు నాతో ఏడు సంవత్సరాలకు కాంట్రాక్టుకి ఒప్పందం కుదుర్చుకున్నావు. నేను కోర్టుకు వెళతాను. నీవు నాతో పని చేయవలసిందే” అని గట్టిగా అంటాడు. పైగా జీతం రెండింతలు చేస్తాననీ చెబుతాడు. నాలుగింతలు చేస్తానన్నా శాంతి ఒప్పుకోదు. అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

గార్డెన్‌లో కూతురితో ఉన్న సురేష్‌కి ఫోన్ వస్తుంది. శాంతి బొంబాయి వదిలి వెళ్ళిపోతుందని తెలుస్తుంది. ఇందులో తన కూతురు పాత్ర ఉందని అతనికి అర్థం అవుతుంది. ఆమెను నిలదీస్తాడు. శాంతిని ఎప్పుడు కలిసావని అడుగుతాడు. పైగా నిన్న శాంతితో ఏదో మాట గురించి అడుగుతున్నావు. అసలేం జరిగిందని ప్రశ్నిస్తాడు. పమ్మి వారిద్దరి గురించి వస్తున్న పుకార్లతో తానెంత బాధపడుతుందో చెప్పబోతుంది. కాని సురేష్ ఆమెని మందలిస్తాడు. పమ్మి కన్నీళ్ళతో మొదటిసారి శాంతి కోసం తండ్రి తనని మందలించాడని అతనికి గుర్తు చేసి ఇంట్లోకి వెళ్లిపోతుంది.

శాంతి ఇంట్లో సామాన్లు సర్దుకుంటూ ఉంటుంది. సురేష్ మొదటిసారి ఆమెను వెతుక్కుంటూ ఆమె ఇంటికి వస్తాడు. అమె సూట్‌కేస్‌లో పెట్టుకుంటున్న తన ఫోటో చూస్తాడు. సంభాషణను కొనసాగించడానికి నేను మీతో చెప్పి వెళదాం అనుకున్నాను అని అనబోతున్న శాంతితో నువ్వెందుకు వెళుతున్నావో నేను అర్థం చేసుకోగలను అని బదులిస్తాడు సురేష్. మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు అంటుంది శాంతి. విషాదం నిండిన చిరునవ్వుతో మనం ఒకరినొకరం ఎప్పుడూ అర్థం చేసుకున్నాం. కాని ఇంతలా ఎందుకు మనుష్యులు ఒకరికొకరు అర్థం అవుతారు అని నిట్టూరుస్తాడు సురేష్. తిరిగి వెళ్ళబోతున్న సురేష్‌ని పిలిచి షూటింగ్‌లో ఇన్నిరోజులు తాను అల్లిన స్వెటర్ అతనికి ఇస్తుంది శాంతి. సురేష్ శాంతిల మధ్య జరిగే ఈ సంభాషణలో ఇద్దరు వ్యక్తులు విడిపోతున్నప్పుడు మనసులో ఉన్న అనురాగాన్ని చెప్పుకోలేక, ఏవో అనవసర విషయాలను చర్చించుకుంటూ ఒకరి నుండి మరొకరు వీడ్కోలు తీసుకోవడం చూస్తాం. కొన్ని భావాలు మనసు దాటి బైటకు రావు. కాని అవి అర్థం అవుతూనే ఉంటాయి. ఏవో అసందర్భ సంభాషణల మధ్య కూడా రెండు మనసులు చేసుకునే సంభాషణ ఇరువురికి తెలుస్తూనే ఉంటుంది. అతి సాధారణ ప్రసంగాల వెనుక వారి మధ్య ఉన్న ప్రేమ వ్యక్తమవుతూనే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మలచిన సీన్ ఇది. మనిషి అన్నిటినుండి పారిపోగలడు కాని తన అదృష్టం నుంచి పారిపోలేడు కదా అన్న మాటతో ఆ సంభాషణకు ముగింపు పలుకుతుంది శాంతి.

(మనుషులు ఒకరినొకరు ఇంతగా ఎందుకు అర్థం చేసుకుంటారు అంటూ ప్రశ్నిస్తున్న సురేష్ సిన్హా)

ఆ స్వెటర్ తీసుకుని ఇంటికి వచ్చిన సురేష్‌కి ఇంట్లో పమ్మి ఏడుస్తూ కనిపిస్తుంది. ఆమె తాత బీ.బీ. వర్మ ఆమెను తీసుకువెళడానికి వస్తాడు. పమ్మిని తీసుకువెళడానికి వచ్చిన వర్మను తన కూతురిని తనకు దూరంగా పంపనని చెప్తాడు సురేష్, వర్మ కోర్టుకు వెళతానని సురేష్‌ని బెదిరించి వెళ్ళిపోతాడు.

కోర్టులో జడ్జి తీర్పు వినిపిస్తాడు. షూటింగ్ లతో బిజీగా ఉండే సురేష్ కూతురిని చూసుకోలేడని. ఆమె భవిష్యత్తు కోసం ఆమె తల్లి దగ్గర ఉండడమే కరెక్ట్ అని చెప్పి కలిసి ఉండడానికి సురేష్ భార్య ఇష్టపడట్లేదు కాబట్టి పమ్మిని తల్లి సంరక్షణలోనే ఉంచడం సబబని తీర్పు చెబుతాడు. సురేష్ తాను కూతురు లేక ఎంత ఒంటరిగా జీవిస్తున్నాడో చెప్పాలనుకున్నా కోర్టు వినదు. పమ్మి ఏడుస్తూ తల్లితో వెళ్ళిపోవడం మౌనంగా చూస్తూ ఉంటాడు సురేష్.

ఇంటికి తిరిగి వచ్చిన సురేష్ అలమార దగ్గరకు వెళ్ళి పమ్మి బొమ్మ, శాంతి స్వెటర్‌ను ఒకసారి చూసి తలుపు మూసేస్తాడు. ఆవేశంతో పనివాన్ని పిలిచి విస్కీ తెమ్మని పిలుస్తాడు. ఇక అప్పటి నుండి సురేష్ జీవితంలో తాగుడు ఒక ముఖ్య భాగం అయిపోయిందని స్క్రీన్‌పై నిండిన గ్లాసులతో ప్రేక్షకులకు అర్థం అవుతుంది.

స్టూడియోలో పదకొండు దాటినా సురేష్ రాడు. అప్పటి దాకా అతని ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని చూసిన ఉద్యోగస్థులు అతనిలో వచ్చిన ఈ మార్పు గురించి చెప్పుకుంటూ ఉంటారు. సౌండ్ రూం లో, రికార్డింగ్ రూం లో, సెట్స్ పైన అందరూ సురేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సురేష్ జీవితంలో పని వెనుకబడిందని. అతని జీవితంలో ఎక్కువ భాగం తాగుడనే వ్యసనం ఆక్రమించుకుందని అర్థం అవుతుంది.

రాకీని ప్రేమించిన జూలియట్ అతని నోట పెళ్ళి మాట వినాలని కోరుకుంటుంది. కాని రాకీ ఆమెకు చిక్కడు. ఈ సందర్భంలో ఇక్కడ క్లబ్‌లో రాకీ పై ఒక పాట ఉంటుంది. “హమ్ తుమ్ జిసె కెహతా హై షాదీ” అంటూ మొదలయ్యే ఈ పాట పెళ్లి చాలా పెద్ద ముప్పు అనే భావంతో రాకీపై చిత్రించిన గీతం. ఇదే స్టైల్‌లో తెలుగులో తరువాత “భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు” అన్న పాటను 1993లో ‘మనీ’ సినిమాలో కోట శ్రీనివాసరావుపై చిత్రించారు. అలాగే ‘కాగజ్ కే ఫూల్’ సినిమాను చూస్తున్నంత సేపు కూడా ఎక్కడో ‘సాగరసంగమం’లో కమల్ పాత్ర ఈ పాత్రను పోలి ఉన్నటుగా కూడా అనిపిస్తుంది. ప్రేమించిన స్త్రీ, తల్లి ఇద్దరూ దూరమయితే మందుకు బానిస అవుతాడు అందులో కమల్. ఆ పాత్రకు సురేష్ సిన్హా పాత్రని కూడా నిశితంగా పరిశీలిస్తే చాలా పోలిక కనిపిస్తుంది. రెండూ కూడా సెల్ఫ్-డెస్ట్రక్షన్ దిశగా ప్రయాణించిన పాత్రలే.

షూటింగ్ సమయంలో సెట్‌కి తాగి వస్తాడు సురేష్. ఆ రోజు ఓ పాట చిత్రీకరించాలని గుర్తు చేస్తారు అసిస్టెంట్లు. ఆ పాటలో నటిస్తున్న నటిలో సురేష్‌కి శాంతి కనిపిస్తుంది. మత్తులో ఆమె దగ్గరకు వెళ్ళడం వలన షాట్ పాడవుతుంది. షాక్‌కు లోనవుతాడు సురేష్. సెట్లో తన అసిస్టెంట్లనే చూసి భయపడతాడు. పాక్ కప్ చెబుతాడు. ఈ స్థితిలో అతను డైరెక్ట్ చేసిన సినిమా ఘోరంగా ఫ్లాప్ అవుతుంది. హాలులో కోపంతో ఆడియన్స్ గోల చేస్తూ ఉంటారు. గోల విని థియేటర్లోకి వెళ్ళిన సురేష్ ఆ గొడవ చూసి భరించలేకపోతాడు. కుర్చీలను పగులగొడతారు క్రింది టికెట్ వాళ్ళు. కొందరు సురేష్‌ని గుర్తు పడతారు. ఈ చెత్త సినిమా తీసింది ఇతనే అంటూ అతనిపై రాళ్ళు విసురుతారు. చెప్పులు విసురుతారు. బాల్కనీలో సినిమా చూస్తున్న వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. సురేష్ మనసు విరిగిపోతుంది. ముఖాన్ని చేతుల్లో దాచుకుని అక్కడే కూలిపోతాడు.

‘కాగజ్ కే ఫూల్’ సినిమా గురించి చెబుతూ గురుదత్ చెల్లెలు లలితా లాజ్మి గురుదత్ ఈ సినిమాతో తన భవిష్యత్తుని ఊహించుకుని ముందే ప్రకటించుకున్నారనిపించింది అని ఓ ఇంటర్వ్యూలో చేప్పారు. ఈ సినిమాలో సురేష్ సిన్హాపై ఎలా చెప్పుల వర్షం కురిసిందో, ‘కాగజ్ కే ఫూల్’ సినిమా ప్రీమియర్‌లో గురుదత్‌కు అలాంటి అవమానమే జరిగిందట. ఈ సినిమా పరాజయంతో ఇందులో గురుదత్ చిత్రించిన సురేష్ సిన్హా పాత్రలాగానే గురుదత్ పూర్తిగా నాశనం వైపుకే ప్రయాణం చేసారు. తన భవిష్యత్తుని కొంతవరకు ఆయన ముందే ఊహించుకుని ఈ సినిమా తీసారని ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్ళు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌తో గురుదత్ మానసికంగా చాలా కనెక్ట్ అయ్యారు. చాలా సందర్భాలలో నిజ జీవితంలో గురుదత్, సినిమాలో సురేష్ సిన్హా ఒకటిగా కలిసిపోయారు. అందుకే ఈ సినిమా పరాజయం తరువాత గురుదత్ పేరు మళ్ళీ దర్శకుడిగా ఏ సినిమాకు పడలేదు.

శాంతి దూరంగా ఓ చిన్న ఊరిలో ఓ వీధి బడిలో టీచర్‌గా పని చేస్తూ కనిపిస్తుంది. ఒకటి రెండు అంటూ నంబర్లను నేర్పిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో శాంతి హిందీ అంకెలను దేవనాగరీ లిపిలో రాస్తుంది. ఆ తరువాత ఏ సినిమాలోనూ అంకెలు ఈ లిపిలో కనిపించవు. ఇప్పుడు రోమన్ సంఖ్యలను అన్ని భాషలు ఉపయోగిస్తున్నాయి కాని ప్రతి భాషకు తమ లిపిలో ప్రత్యేకమైన నంబర్లు ఉండేవి. హిందీకి చెందిన నాగరీ లిపిలో ఒకటి నుంచి పది దాకా అంకెలు ఈ సినిమాలో టీచర్‌గా పిల్లలకు బోధిస్తూ శాంతి బోర్డుపై రాస్తుంది. ఇప్పటి తరానికి ఇది ఓ కొత్త విషయం.

(పిల్లల మధ్య టీచర్‌గా శాంతి, వెనుక బోర్డు పై నాగరీ లిపిలో అంకెలు)

ఆ అంకెలను పాట రూపంలో పిల్లలు బోధపరుస్తూ సురేష్‌కు దూరమైన తన వ్యథకు లోలోన కృంగిపోతూ ఆమె కనిపిస్తుంది. కలిసి తమ ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలనుకున్న ఇద్దరిని ప్రపంచం ఎలా దూరం చేసిందో ఆమె ఈ పాట ద్వారా పిల్లలకు అంకెలు బోధిస్తూ చెబుతుంది.

సేత్ ఆఫీసులో మీటింగ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడూ ఖరీదైన సూట్లతో వచ్చే సురేష్ అక్కడ కుర్తా పైజామాతో కనిపిస్తాడు. అతని సినిమా ఫెయిల్ అయిందని సేత్ సురేష్‌ని మందలిస్తాడు. తనలోని అలజడి బైటపడకుండా ఉండాలని సురేష్ ప్రయత్నిస్తాడు. ఐదు నుండి ఏడు లక్షల దాకా సేత్‌కు నష్టం వచ్చిందని తనకు తెలుసని మళ్ళీ మరో సినిమాతో దాన్ని పూడుస్తానని చెబుతాడు సురేష్. మరో సినిమాకు నేను సిద్ధంగా ఉన్నానంటాడు సేత్. నాకు కథ చెప్పలేదు అని అడిగిన సురేష్‌తో నీకు మేం కథ చెప్పవలసిన అవసరం లేదు. మేము ఎలా రాసుకుంటే నీవు అలా ఆ సినిమా డైరెక్ట్ చేయాలి అంతే అంటాడు సేత్. “నన్నిలా అవమానించడం బాలేదు. అలా గయితే మీరు మరొకరితో సినిమా డైరెక్ట్ చేయించుకోండి” అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు సురేష్. అతని స్థితిలో తిరోగమనం మొదలయిందనే సూచనతో బాక్‌గ్రౌండ్ పాట మళ్ళీ మొదలవుతుంది. సేత్ దానికి “మా సినిమాకు దర్శకత్వం వహించే అర్హత నీకు లేదు” అని గట్టిగా అంటాడు. వెళ్ళబోతున్న సురేష్ ఒక్క నిముషం ఆగుతాడు. “నేను చేసిన సినిమాలతో లక్షలు సంపాదించారు మీరు. ఇప్పుడు నాకు సినిమాకు దర్శకత్వం వహించే అర్హత లేదంటారా” అని తిరిగి అడుగుతాడు సురేష్. “నువ్వు ఒకప్పుడు విజయం సాధించావు. ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. ఇది సినిమా ప్రపంచం సురేష్. నీ కోసం నేను నా కంపెనీలో ఉన్న ఐదు వందల మందికి అన్యాయం చేయలేను. నువ్వు మానసికంగా చచ్చిపోయావు. ఇక ఎప్పటికీ విజయవంతమైన సినిమా తీయలేవు” అంటాడు సేత్.

సురేష్ దీనికి గట్టిగా “నేను మరణించలేదు. నేను అలసిపోయాను అంతే” అని నిర్వేదంతో బదులిస్తాడు. తనలో తను మాట్లాడుకోవడం మొదలెడతాడు. “ఈ సంఘర్షణ, ఈ అలజడి, ఈ దుఃఖం ఎంతవరకు భరించగలను, ఎన్నాళ్ళు వీటి మధ్య నన్ను నేను స్థిరంగా నిలిపి ఉంచుకోగలను” అంటూ కూలబడిపోతాడు.

తరువాతి సీన్‌లో సురేష్ ఇల్లు వేలం వేయబడుతుంది. వీటన్నిటి మధ్యన సీసా నుండి నేరుగా తాగుతూ ఉంటాడు సురేష్. వెనుక నుండి బాక్‌గ్రౌండ్‌లో ముందు సినిమా ప్రారంభంలో వినిపించిన కథకుని గొంతు మళ్ళీ వినిపిస్తుంది. రెండు సంవత్సరాలుగా సురేష్‌కు సినిమాలు లేవు, చివరకు అతనికున్నవన్నీవేలం వేయబడ్డాయి. ఈ రెండు సంవత్సరాలలో ఎన్నో విధాలుగా పని కోసం సురేష్ ప్రయత్నించాడు, కాని పరాజయం పాలైన దర్శకుడిని ఫిలిం ఇండస్ట్రీ మళ్ళీ దరి చేరనివ్వదు. అతన్ని ఎవరూ పట్టించుకోరు. అతని సినిమాలను ఒకప్పుడు ఇష్టపడిన ప్రేక్షకులు అతనితో పని చేయించుకున్న ఇతర ఆర్టిస్టులు ఎవరూ అతని మొహం తిరిగి చూడరు. ప్రేక్షకులు అతన్ని మర్చిపోయారు. ఫిలిం ఇండస్ట్రీ అతన్ని మర్చిపోయింది. ఫిలిం ప్రపంచం ఇలాగే ఉంటుంది. పేరు రావడం చాలా ఆలస్యంగా వస్తుంది కాని పరిస్థితి దిగజారడం ఒక్క అపజయంతో మొదలయి ఇక ఎక్కడా ఆగకుండా మనిషిని క్రిందకు ఈడ్చి పడేస్తుంది. సురేష్ ఆ ఇంటి నుండి ఓ చిన్న సూట్‌కేస్‌తో బైటకు వెళ్ళిపోతాడు.

రేస్ కోర్స్‌లో రాకీ డబ్బులు గెలుచుకున్న ఆనందంలో కనిపిస్తాడు. సేత్ దయారాం రాకీని అక్కడ కలుస్తాడు. రెండు సంవత్సరాలుగా శాంతిపై కోర్టులో వేసిన కేసు ఈ రోజు ఓ కొలిక్కి వచ్చిందని, శాంతి తిరిగి బొంబాయి వచ్చి సినిమాలు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందని చెబుతాడు. తరువాతి సీన్లో శాంతిని వెతుక్కుంటూ ఆమె ఊరు వెళతాడు రాకీ. అతన్ని చూసి బాగోగులు విచారిస్తున్న శాంతికి తనిష్టపడే గుర్రం చనిపోయిందని రాకీ చెబుతాడు. యజమానికి ఇన్నాళ్ళు డబ్బు సంపాదించి పెట్టిన గుర్రం పరుగెత్తలేకపోతే దాన్ని చంపివేయడం సాధారణమని రాకీ చేత చెప్పిస్తూ, సినీరంగంలోని ఆర్టిస్టుల జీవితాలను ఈ రేసు గుర్రాలతో పోలుస్తూ చూపిస్తారు దర్శకులు.

అసలు తనను వెతుక్కుంటూ రాకీ ఎందుకు వచ్చాడో చెప్పమని నిలదీస్తుంది శాంతి. సురేష్ పరిస్థితి అప్పుడు శాంతికి వివరిస్తాడు రాకీ. నీవు సేత్ సినిమాలలో పని చేయడానికి ఒప్పుకుంటే సేత్ సురేష్‌కి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని చెబుతాడు. శాంతి దుఃఖంతో జవాబివ్వలేకపోతుంది.

సురేష్ ఒక చీప్ బార్‌లో తాగుతూ ఉంటాడు. మొదట తాగుడు మొదలుపెట్టినప్పటి నుండి అతని దిగజారుతున్న పరిస్థితిని సురేష్ మందు బాటిల్‌ల బ్రాండ్లు, అతను మందు తాగే బార్ల స్థితి ద్వారా చూపిస్తారు దర్శకులు. అతి ఖరీదైన మధ్యాన్ని సినిమా ప్రీమియర్ సమయంలో తాగుతూ ఉంటాడు సురేష్. సేత్ అతన్ని అవమానిస్తున్నప్పుడు అతని సూటు మాయమై సాధారణ బట్టలలోకి వస్తాడు. ఇప్పుడు ఒక చిన్న మారుమూల బార్‌లో చిరిగిన బట్టల్తో కనిపిస్తాడు సురేష్. సేత్ దయారాం మనుష్యులు అతన్ని అక్కడి నుండి స్టూడియోకి తీసుకువెళ్ళడానికి వస్తారు. సేత్ తనని రమ్మన్నాడని తెలిసి, చివరకు నా అవసరం సేత్‌కి కలిగిందని సంతోషిస్తాడు సురేష్. కాని ఇంతలో ఆ సినిమాలో హీరోయిన్ శాంతి అని తెలుస్తుంది సురేష్‌కి. ఆమె తిరిగి ఎందుకు వచ్చిందని అడుగుతాడు సురేష్. ఆమె తనకు మళ్ళీ అవకాశాలు ఇప్పించడానికే తిరిగి వచ్చిందని అతనికి అర్థం అవుతుంది. తన పనికి సినీరంగంలో విలువ లేదని, కేవలం శాంతి ప్రతిపాదిక మీద తనను దర్శకుడిగా తీసుకోవడానికి సేత్ ఒప్పుకున్నాడని తెలుసుకున్నాక సురేష్ ఆత్మాభిమానం గాయపడుతుంది. వాళ్ళని కసిరి పంపించేస్తాడు. జేబులో ఉన్న చిల్లరంతా బిల్లు రూపంలో కట్టి అక్కడి నుండి బైటపడతాడు.

సేత్ ఆఫీసులో సురేష్ కోసం శాంతి ఎదురు చూస్తూ ఉంటుంది. సురేష్ రానన్నాడని సేత్ మనుష్యులు వచ్చి చెబుతారు. శాంతి మౌనంగా అంతా వింటూ ఉంటుంది. ఆమె సురేష్‌ని వెతుక్కుంటూ అతనుంటున్న చిన్న గదికి వెళూతుంది. నేల మీద కూర్చుని తెగిన చెప్పు కుట్టుకుంటూ ఉంటాడు సురేష్. పక్కనే ఓ బాటిల్లో మందు ఉంటుంది. తలుపు దగ్గర నుంచుని శాంతి అతన్ని బాధగా చూస్తూ ఉంటుంది. ఆమెను చూసి పైకి లేచిన సురేష్‌ని చూసి చిన్ననవ్వు నవ్వుతుంది. సురేష్ ఆమెను ఇంటిలోకి పిలుస్తాడు. ఆమె కూర్చోడానికి ఇంట్లో కుర్చీకూడా లేకపోతే ఓ చిన్న బకెట్ తీసుకునివచ్చి దాన్ని పై తన దగ్గర ఉన్న బట్టలన్నీ వేస్తాడు. ఆ బట్టల మధ్య ఒకప్పుడు శాంతి అల్లిన స్వెటర్ కూడా ఉంటుంది. శాంతి దాన్ని చేతుల్లోకి తీసుకుంటుంది. సురేష్ ఆ స్వెటర్ తీసుకుని తీగపై వేస్తాడు. ఇంకా స్వెటర్లు అల్లుతున్నావా అని ఆమెను అడుగుతాడు. అదే నేను అల్లిన అఖరి స్వెటర్ అంటుంది శాంతి. కాని మళ్ళీ అల్లుతాను అని చెబుతుంది. ఆమె ముందే మందు తాగుతున్న అతన్ని ఆమె ఆపాలని ప్రయత్నిస్తుంది. ఇది కేవలం మందు మాత్రమే. పేరు, విజయాలు, డబ్బు, ప్రేమ జీవితంలో చేజారిన వాళ్ళు ఆసరా కోసం దీన్ని తాగుతారని సురేష్ ఆమెకు బదులిస్తాడు.

సేత్ జీ కి ఓ సినిమా దర్శకత్వానికి మీ అవసరం వచ్చింది అని సురేష్‌తో చెబుతుంది శాంతి. సేత్ జీకి నాతో అవసరమా నీతో అవసరమా అని వ్యంగ్యంగా ఆమెను అడుగుతాడు సురేష్. అతనికి నా కన్నా మీ అవసరమే ఎక్కువ అంటుంది శాంతి. దానికి సురేష్ “శాంతి మనం ఎప్పుడు ఒకరినొకరం అర్దం చేసుకుంటూనే ఉన్నాం. నీవు పని చేయడానికి వచ్చింది నాకు పని ఇప్పించడానికని నాకు తెలుసు” అంటాడు. శాంతి తిరిగి నవ్వుతూ “నేను మీ కోసం ఎందుకు వచ్చాను డబ్బు పేరు కోసం వచ్చాను కాని” అంటుంది. సురేష్ ఆమెను చూస్తూ “నువ్వు మంచి నటివే కాని నేనూ సత్తా ఉన్న డైరక్టర్‌నే కదా”. అంటాడు. దానికి శాంతి “అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. మీ దగ్గర పని చేసినట్లు నేను ఏ ఇతర డైరెక్టర్ దగ్గర పని చేయలేను. అందుకే మీరు వచ్చి పని చేయాలని నేను కోరుకుంటున్నాను” అంటుంది.

సురేష్ దానికి “చాలా రోజుల తరువాత నా పని పట్ల మెచ్చుకోలు విన్నాను” అంటాడు. మళ్ళీ తాగబోతున్న సురేష్‌ని శాంతి ఆపాలని ప్రయత్నిస్తుంది. “నన్నెందుకు నువ్వు ఆపాలనుకుంటున్నావు. నేను నీకు ఏం అవుతానని నా కోసం తపన పడుతునావు” అని అడుగుతాడు. బదులుగా అతని ఎదపై తన తలను వాలుస్తుంది శాంతి. సురేష్ మాత్రం ఆమెను దగ్గరకు తీసుకోడు. శాంతికి దూరంగా ఉండడానికి తనను తాను సన్నద్ధం చేసుకున్నాడు సురేష్ అన్నది ఈ సీన్‌లో స్పష్టపరుస్తారు దర్శకులు.

(తనపై వాలిన శాంతిని దగ్గరకు తీసుకోకుండా శిలలా ఉండిపోయిన సురేష్)

ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ చాలా మంది ప్రేక్షకులు కోరి వచ్చిన స్త్రీని, భవిష్యత్తు నిర్మించుకోవడానికి వచ్చిన అవకాశాన్ని, జీవితానికి దారి చూపుతున్న స్త్రీని అహంతో సురేష్ దగ్గరకు తీయకుండా అనసరంగా విషాదాన్ని కౌగలించుకున్నాడని అంటారు. ఇక్కడ పురుషుడిననే అహం కూడా సురేష్ పాత్రలో ఉందని కూడా ప్రస్తావిస్తారు. ఇదే ఇతివృత్తంపై వచ్చిన ప్రతి సినిమాలోనూ అంటే ‘ఏ స్టార్ ఈజ్ బార్న్’, ‘లైంలైట్’ లలో కూడా ఓ స్త్రీ అండతో తిరిగి జీవితాన్ని మొదలుపెట్టడానికి సిద్ధపడరు హీరోలు. అది పురుషాహంకారానికి సంబంధించిన విషయంగా అందువలన అనిపిస్తుంది. ప్రెంచ్ సినిమా ‘ది ఆర్టిస్ట్’లో మాత్రం దీనికి విరుద్ధమైన సీన్ కనపడుతుంది. హీరో హీరోయిన్ అండతో తిరిగి తన సత్తా చాటుకుంటాడు. కాని ఈ సినిమాలో సురేష్ సిన్హా పాత్రను దర్శకుడు మలచిన విధానాన్ని గమనిస్తే శాంతి బదులుగా మిత్రుని రూపంలో మరో పురుషుడు వచ్చినా బహుశా అతని జవాబు అదే ఉంటుందేమో. సేత్‌కి శాంతి కావలి, శాంతికి సురేష్ కావాలి. కాని సురేష్ ఒకప్పుడు వీరందరికీ అవసరం అయినవాడు. ఒక్క అపజయంతో అతనిపై ప్రేమ చనిపోయింది సినీ ప్రపంచానికి. అతన్ని మర్చిపోయారు అతని సినిమాలు చూసి అభిమానించిన ప్రేక్షకులు. ఇప్పుడు కూడా కేవలం శాంతి కోసం సురేష్‌ని సినీ రంగం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. అంటే సురేష్‌కి ఒకప్పటి గౌరవం, గుర్తింపు అక్కడుండవు. మనసు చంపుకుని వారిని భరిస్తూ అక్కడ పని చేయాలి సురేష్. అది అతనికి ఇష్టం లేదు. పైగా ఎవరికోసమో సంపాదించాల్సిన అవసరం అతనికి లేదు. అతన్ని కావాలనుకునే కుటుంబం లేదు. శాంతితో ఒకప్పుడు ఉన్న అనుబంధం ఇప్పుడు ఓటమితో కొట్టుకుంటున్న స్థితిలో సురేష్ మళ్ళీ అనుభవించలేడు. అతను ఒకప్పటి సురేష్ కాదు. శాంతి అతన్ని నిస్వార్థంగా ప్రేమించినా సురేష్ సిన్హాగా శాంతిని ప్రేమించిన అతను ఇప్పుడు ఆమెపై ఆధారపడుతూ ఆమెకు సమస్యగా మారలేడు. అందుకే అతను శాంతితో ఇలా అంటాడు. “మనం ఒకరినొకరం ఎప్పుడూ అపార్ధం చేసుకోలేం శాంతి. నీకు తెలుసు నేను అన్నీ పోగొట్టుకున్నాను ఒక ఆత్మగౌరవం తప్ప. దాన్ని నీకు అందిస్తున్నాను. ఇప్పుడు నీవు కోరుకుంటే నన్ను సేత్ దగ్గరకు తీసుకు వెళ్ళు”

సురేష్ పాత్ర వ్యక్తిత్వాన్ని చూపే గొప్ప సంభాషణ ఇది. చాలా ఆలోచించి రాసిన సంభాషణ ఇది. తనకోసం ఇంత దూరం వచ్చిన శాంతి ప్రతిపాదనను అహంకారంతో సురేష్ కాదనడు. నిర్ణయాన్ని ఆమెకే వదిలేస్తాడు. సురేష్ పట్ల సినీ రంగంలో ఎవరికీ గౌరవం లేదని, ఆ పరిస్థితుల మధ్య సురేష్ మనసు చంపుకుని ఉండలేడని శాంతికి కూడా తెలుసు. అక్కడ అతని మనసుకు గాయం అవకుండా తాను కాపాడలేననీ తెలుసు. అందుకే “ఏం నిర్ణయించుకున్నావు. నన్ను తీసుకువెళతావా” అన్న సురేష్ ప్రశ్నకు తల అడ్డంగా తిప్పి, శాంతి తిరిగి వెళ్ళిపోతుంది.

బీబీ వర్మ ఇంట్లోకి పమ్మికి కాబోయే వరుడు జగదీశ్ ప్రవేశిస్తాడు. ఆ ఇంటి వ్యక్తులలో ఎవరిలోనూ పెద్దగా మార్పు రాలేదని అర్థం అవుతుంది. మిసెస్ వర్మ వీల్ చైర్లో కనిపిస్తుంది. పమ్మి పెళ్ళికి వచ్చే అతిథుల గురించి ప్రస్తావిస్తూ వర్మ ఆ పెళ్ళికి వైస్రాయ్ వస్తున్నాడని గర్వంగా చెబుతాడు. కాని ఎవరికీ పమ్మి తండ్రి సురేష్‌ని పిలవాలని గుర్తుకు రాదు. పమ్మి ప్రొద్దున్నే బైటికి వెళ్ళిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు.

సురేష్ ఒకప్పుడు తన దగ్గర పని చేసిన కారు డ్రైవర్ అన్వర్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తూ ఆ గారేజ్ లోనే ఉంటూ ఉంటాడు. చాలా పెద్దవాడయి కనిపిస్తాడు. ఇంతలో కారు రిపేర్ చేయించుకోవడానికి అక్కడకు పమ్మి జూలియట్‌తో వస్తుంది. అన్వర్ ఆమెను గుర్తు పడతాడు. సురేష్ మాత్రం తాను అక్కడున్నానని పమ్మికి చెప్పవద్దని బ్రతిమాలుకుంటాడు. అన్వర్‌ని గుర్తు పట్టి పమ్మి తన వివాహం నిశ్చయమయిందని అతనికి చెబుతుంది. ఆమె వెళ్ళిపోయిన తరువాత ఈ సంగతి అన్వర్ సురేష్‌కి చెబుతాడు. సురేష్ కళ్ళనుండి కన్నీరు కారుతుంది.

శాంతి ఒక్కతే కూర్చుని స్వెటర్లు అల్లుకుంటూ ఉంటుంది. ఆమె ఉంటున్నది ఒకప్పుడు సురేష్ ఇల్లు. శాంతి ఆ ఇల్లు కొనుక్కుంటుంది. పమ్మీ ఆమె దగ్గరకు వస్తుంది. పమ్మీని గుర్తు పట్టి “ఇంకా నా దగ్గర ఏం ఉందని వచ్చావు” అని అడుగుతుంది శాంతి. “మీ నాన్న ఇల్లు కొనుక్కున్నాను. నీకు కావాలంటే…” అని ఏదో చెప్పబోతున్న శాంతిని ఆపి పమ్మి “నాన్నగారి గురించి మీకేమయినా తెలుసా కనుక్కుందామని వచ్చానంటుంది”. కనీసం చివర్లో ఎప్పుడు సురేష్‌ని శాంతి కలిసిందో చెప్పమంటుంది. శాంతికి రోజులు సంవత్సరాలు ఏమీ గుర్తుండవు. ఆమె పక్కనున్న అల్మారాలో సంవత్సరాలుగా సురేష్ కోసం ఆమె అల్లిన స్వెటర్ల దొంతర కనిపిస్తూ ఉంటుంది. పమ్మి కన్నీళ్ళతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

ఒక కల్లు దుకాణంలో సురేష్ నేలపై కూర్చుని తాగుతూ ఉంటాడు. అతని స్థితి ఇంకా ఘోరంగా మారిందని అర్థం అవుతుంది. ఒకప్పుడు సురేష్ సినిమాలకు ఎక్స్‌ట్రాలను సప్లై చేసే మూసా అక్కడే ఉంటాడు అతన్ని ఒక చిన్న పాత్ర ఇప్పించమని తన కూతురు పెళ్ళికి ఓ కానుక కొనాలనుకుంటున్నానని బ్రతిమిలాడుతాడు సురేష్. మూసా ఒప్పుకుంటాడు. కాని ఇంతలో ఇంకొకరితో అతనికి గొడవ అవుతుంది. గొడవ పెరిగితే పోలీసులను పిలవాల్సి వస్తుంది. అందరితో పాటు సురేష్‌ని కూడా బైటికి లాక్కువస్తాడు ఓ పోలీసు. అతను సురేష్‌ని గుర్తుపడతాడు. అతని హీనమైన స్థితికి బాధపడతాడు. ఇంటికి వెళ్ళిపొమ్మని వదిలేస్తాడు. అక్కడే చెత్తకుప్పపై పడి స్పృహ కోల్పోతాడు సురేష్.

అదే స్టూడియోలో జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఉంటాడు సురేష్. ఒక అసిస్టెంట్ అతన్ని ఓ పాత్రకు ఎన్నుకుని మేకప్ వేసుకుని రమ్మని పంపుతాడు. సీన్‌కి సిద్ధం అయిన సురేష్ దగ్గరకు ఆ సినిమాలో హీరోయిన్ శాంతి వస్తుంది. ఆమె ముందు డైలాగ్ చెప్పలేకపోతాడు సురేష్. అతన్ని అక్కడి నుండి వెళ్ళిపొమ్మని అరుస్తాడు డైరెక్టర్. శాంతి ఆ మేకప్ మధ్య నుండి సురేష్ కళ్లను గుర్తుపడుతుంది. స్టూడియో ఇచ్చిన షాల్‌ను కప్పుకుని వెళ్లిపోతున్నాడని అతను వేసుకున్న షాల్‌ను లాగి పారేస్తాడు ఓ అసిస్టెంట్. ఆ షాల్ క్రింద చిరుగులతో ఉన్న స్వెటర్ చూసి అతన్నిసురేష్ అని పోల్చుకుంటుంది శాంతి. అతని వెనుక పరుగెడుతుంది.

సినిమా ప్రారంభంలో వచ్చే బాక్‌గ్రౌండ్ పాట మళ్ళీ ఇక్కడ మొదలవుతుంది. సురేష్ స్టూడియో బైటికి పరిగెడతాడు. శాంతి అతన్ని వెంబడించాలని ప్రయత్నిస్తుంది. కాని ఆమెను బైట చూసిన ఫాన్స్ ఆమెను చుట్టుముడతారు. ఆ గుంపుని దాటి ఆమె సురేష్‌ను చేరుకోలేకపోతుంది. నిస్సహాయంగా మిగిలిపోతుంది. చివరి సారి ఆమెను ఒకసారి చూసుకుంటాడు సురేష్ సిన్హా.

ఇదే విషాద గీతం బాక్‌గ్రౌండ్‌లో వస్తుండగా ఫ్లాష్‌బాక్ ముగుస్తుంది. సురేష్ కన్నీళ్ళను తుడుచుకుంటూ మెల్లిగా నడుస్తూ సెట్ పైకి వస్తాడు. డైరెక్టర్ అని రాసి ఉన్న కుర్చీ దగ్గరకు వస్తాడు. పక్కన ఉన్న కెమెరాను ప్రేమగా నిమిరి ఆ కుర్చీలో కూలబడతాడు.

ఆ స్టూడియోకి సంబంధించిన వారంతా సెట్ పైకి తమ పని మొదలు పెట్టడానికి వస్తారు. అక్కడ కుర్చీలో సురేష్ వారికి కనిపిస్తాడు. లంచ్ బ్రేక్‌కు తామంతా బయటకు తలుపు వేసి వెళితే ఇతను ఎలా లోపలికి వచ్చాడని వారు ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ ఉన్న సమయంలో స్టూడియో ప్యూన్ సురేష్‌ని గుర్తు పడతాడు. సిన్హా సాబ్ అని అతన్ని పిలుస్తాడు. సురేష్ పక్కన కూర్చుని అతన్ని తట్టి లేపాలని చూస్తాడు. కుర్చీలో మరణించిన సురేష్ చేయి పక్కకు వాలిపోతుంది.

స్టూడియో మేనేజర్ అక్కడకు వస్తాడు. ఇంత మంది ఏం చూస్తున్నారు. అతన్ని అక్కడి నుండీ తీసుకెళ్ళండి. హీరోయిన్ ఇవాళ ఒక్క రోజే మనకు డేట్స్ ఇచ్చింది. సినిమా ఆరున్నర లోగా పూర్తి చేయాలి అంటూ అరుస్తాడు. అతనివైపు చూస్తున్న వారిని “ఎవరి శవం ఇప్పటి దాకా చూడలేదా.. తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి” అని ఆజ్ఞాపిస్తాడు. లైట్స్ ఆన్ అవుతాయి. స్టూడియోలో లైట్లన్నీ మరో సినిమా కోసం వెలుగుతయి. మరో షూటింగ్ మొదలవుతుంది.

(డైరక్టర్ కుర్చీలో చివరి శ్వాస విడిచిన సురేష్)

‘కాగజ్ కే ఫూల్’ సినిమా గురించి మాట్లాడుతూ గురుదత్ రెండవ కుమారుడు అరుణ్ దత్ విషాదాన్ని కౌగలించుకున్న సురేష్ సిన్హా పాత్ర తన తండ్రి వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సురేష్ సిన్హా ప్రాక్టికల్ మనిషి కాదు కాబట్టే శాంతితో కలిసి పని చేయడాన్ని తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవడంలా భావించాడని, అదే తన తండ్రి నిజ వ్యక్తిత్వం కూడా అని చెప్పారు. తన కుటుంబీకులు తనకు చెప్పినదాని బట్టి, ప్రతి చిన్న దానికి అతిగా స్పందించి, మనసును బాధపెట్టుకునే తత్వం తన తండ్రిదని, తాను అనుభవించిన అటువంటి బాధను, విషాదాన్ని తన పాత్రలలో ఆయన చూపేవారని అరుణ్ దత్ అన్నారు. జీవితంలో ఏ సంఘటననూ మరచిపోలేని మరో గుణం కూడా తన తండ్రి విషాదానికి కారణం అని, సురేష్ సిన్హా లాగానే ‘కాగజ్ కే ఫూల్’ సినిమా పరాజయాన్ని తన తండ్రి స్వీకరించలేకపోయారని చెబుతారు.

ఇప్పటికీ ఈ సినిమాకు స్పందన ఒకో రకంగా ఉంటుంది. సినిమా రంగానికి చెందిన ప్రముఖులతో పాటు కొందరు క్రిటిక్స్ దీన్ని ఒక గొప్ప మాస్టర్‌పీస్ అంటారు. మరి కొంతమంది అనవసరమైన విషాదాన్ని చూపిన సినిమా అంటారు. అయితే ఈ భిన్న అభిప్రాయాలు కథాపరంగా లేదా సురేష్ సిన్హా పాత్ర పరంగా ఉంటాయి కాని, సినిమా దర్శకత్వం, ఫోటోగ్రఫీ విషయంలో ప్రతి ఒక్కరూ ఈ సినిమాని కొనియాడతారు. ఒక్కో సీన్‌ని ఓ పెయింటింగ్‌లా చూపిన గురుదత్ ప్రతిభను ఈ సినిమా ప్రస్తావిస్తూ అందరూ ఉదహరిస్తారు. ముఖ్యంగా పాశ్చాత్య సినిమాలను విరివిగా చూసే ఆధునిక తరం ఈ సినిమాను చూసి అబ్బురపడకుండా ఉండరు. అందుకే ఫిలిం స్కూల్‌లో ‘కాగజ్ కే ఫూల్’ సినిమాను విద్యార్థులకు బోధించడం జరుగుతుంది. అందులో గురుదత్ ఫిలిం మేకింగ్‌లో చూపిన అతి చిన్న జాగరూకతలను విద్యార్థులు ప్రశంసించకుండా ఉండలేరు. సినిమాను ఇంత ప్రేమగా, ఇంత కోరికతో తీసే ఫిలిం మేకర్లు మన దేశంలో గురుదత్ తరువాతే అన్నది అందరూ ఒప్పుకునే విషయం. దర్శకుడిగా గురుదత్ ఈ సినిమాతో శిఖరాగ్రం చేరుకున్నారు. ఈ సినిమా పరాజయంతో అంతటి దర్శకుడు మరే సినిమాకు దర్శకత్వం వహించలేదు. క్రెడిట్స్‌లో పేరు వేయించుకోలేదు. తన ఆత్మను ఈ సినిమాగా మార్చి తన నూరు శాతం మేధస్సుని ఈ సినిమాకు ఇచ్చి దీని అపజయాన్ని తన జీవితపు అపజయంగా స్వీకరించి విషాదంలోకి కూరుకుపోయారు గురుదత్.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here