మదింపు

    1
    4

    [box type=’note’ fontsize=’16’]మాట్లాడడం సులభం కానీ ఆచరణలో పెట్టడం అంత సులభం కాదన్న నిజాన్ని ప్రశాంతత సాధించటం కోసం తనను తాను విశ్లేషించుకునే పాత్ర ద్వారా ప్రదర్శించిన కథ “మదింపు”.[/box]

    “వెళ్ళమ్మా జాగ్రత్త, బాగావ్రాయి” అన్నాను నిధి భుజం మీద తడుతూ.
    అది గేటు దగ్గర ఉన్నవాళ్ళకి హాల్ టికెట్ చూపించి లోపలికి వెళ్ళడాన్ని గమనించి నేను కొంచెం పక్కకి వచ్చి నిలబడ్డాను. నాతో పాటే మరొకరిద్దరు ఆడవాళ్ళు కూడా వచ్చి నిలుచున్నారు.
    చిన్న ఇరుకు వీధి అది. వరుసగా షాపులు. అందరూ చిన్న చిన్న గుంపులుగా తలా ఒక షాపు ముందూ నిల్చున్నారు.
    “ఏమిటో ఈ పరీక్షలు పిల్లలకి కాదు మనకేనన్నట్లుగా వుంది” పక్కనుంచి వినబడిన మాటలకి తిరిగి చూశాను.
    నాకు దగ్గరగా నిలుచున్న ఆడవాళ్ళు ముగ్గురూ మూడు రకాలుగా వున్నారు. ఇపుడు మాట్లాడిన ఆవిడ పొట్టిగా కొంచెం బొద్దుగా వుంది. అమాయకమైన మొహం. కొంచెం హడావుడి మనిషిలా కనిపిస్తోంది.
    నాకు కుడి వైపున నిల్చున్న ఆవిడది చూడగానే ఆకర్షించే రూపం. నెమ్మదితనమూ సమర్థతా కలబోసినట్లుగా వుంది. తాను మాట్లాడటం కంటే అవతలివారి మాటలు వినడం పట్ల ఎక్కువ ఆసక్తి వున్న వ్యక్తనిపిస్తోంది.
    తాపత్రయాలు తక్కువే కానీ పరిశీలనలూ ఆలోచనలూ మాత్రం విపరీతం నాకు. వాటిని నియంత్రణలో పెట్టేందుకే నానా కష్టాలూ పడుతున్నాను. కొన్నాళ్ళుగా నా ఆలోచనలనీ మాటలనీ అదుపులో పెట్టుకునే ప్రయత్నం చాలా శ్రద్ధగా చేస్తున్నాను కానీ ఒక్కొక్కసారి విఫలమయి అనవసరపు మాటల్లోకి వాదనల్లోకి జారిపోతున్నాను. కొంత కొంత మందితో మరీనూ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో ఇపుడు ఇక్కడ ఉన్న మూడో ఆమె అచ్చంగా నన్ను అలాటి వాదనలలోకి లాగగల నేర్పరిలా వుంది. చూడగానే గుర్తుపట్టగలను నేనలాంటి వారిని.
    ఈ ముగ్గురి గురించీ నా నిశిత పరిశీలన పూర్తయ్యాక చుట్టూ పరికించాను. ఇంకా తొమ్మిది కాలేదు. పిల్లలు ఒక్కొక్కరుగా వస్తూనే వున్నారు. రకరకాల మనుషులు… హడావుడిగా పరుగులు తీస్తూ కంగారు పడుతూ వస్తున్నవాళ్ళు… ఒకపక్క గేటు మూసేసే ప్రయత్నాలు జరుగుతుంటే ఇంకా తాపీగా తాత్సారంగా మాట్లాడుకుంటున్న వాళ్ళూ.. అసలు లోపలికి వెళ్ళాల్సిన పిల్లలకీ వాళ్ళని పంపించాల్సిన అమ్మానాన్నలకీ కంగారు లేకపోయినా “అయ్యో, గేటు మూసేస్తారు యిక వెళ్ళమ్మా” అని గాభరాగా కసురుకుంటున్న మిగిలిన జనాలూ… ఈ తమాషా అంతా సరిగ్గా తొమ్మిదికి పూర్తయింది.
    ఇప్పటినుంచి పన్నెండింటి దాకా పరీక్ష. మా యిల్లు ఇక్కడి నుంచి పదిహేను కిలోమీటర్లు. ఇంటికి వెళ్ళడం మళ్ళీ రావడం అర్థం లేని పని. ఇక్కడే ఎక్కడో గడపాలి ఈ మూడుగంటలూ. నా కుడి పక్కన నిల్చున్నావిడని ఎక్కడినుంచి వచ్చారంటూ పలకరించాను. ఆమె పేరు ప్రమీల. ఆవిడా, పొట్టిగా వున్న మరొక ఆవిడా కూడా దూరం నుంచే వచ్చారట. రెండో ఆమె పేరు రమణి. మూడో ఆవిడ ఉష. వాళ్ళ ఇల్లు మరీ దూరం కాదు కానీ ఎందుకో ఆవిడ కూడా ఇక్కడ ఉండి పోవడానికే నిర్ణయించుకుంది.
    “మీరందరూ అంతంత దూరాల నుంచి ఎందుకు వచ్చారు? ఎగ్జాం సెంటర్లు కాలేజీలకి దగ్గరలోనే ఇచ్చారు కదా!” అని అడిగింది ఉష.
    “మా అబ్బాయి చదివే కాలేజ్ ఇక్కడికి దగ్గరే. మాయిల్లే దూరం” అంది ప్రమీల.
    “రోజూ అంత దూరం నుండి కాలేజికి వస్తారా మీ పిల్లలు!” అని ఉష ఆశ్చర్యపోయింది. “అంతంత దూరం నుంచి వస్తే ఇంక చదువుకోవడానికి ఏం ఓపిక ఉంటుంది వాళ్ళకి!” గదమాయించినట్లుగా అడిగింది.
    “మా యింటి దగ్గరలోని కాలేజీలు ఏవీ బాలేవు.” అంది రమణి.
    ఆమె చెప్తున్నదాన్ని ఉష పూర్తిగా వినిపించుకోనేలేదు. “అలాంటపుడు ఇల్లు మార్చేయాలి. మేమదే చేశాం. సొంతిల్లు వదిలేసి కాలేజీకి దగ్గరలో అద్దెకున్నాం. నేను ఉద్యోగం కూడా మానేశాను. ఈ రెండేళ్ళు పిల్లలకి చాలా ముఖ్యం” అంది.
    ఇలాంటి గొంతుని నేను బాగా గుర్తుపడతాను. అన్నీ తమకే తెలుసుననీ తాము చేసింది నూటికి నూటయాభై శాతం కరెక్టనీ నమ్మి దానిని నిరూపించ ప్రయత్నించే గొంతు యిది. అన్నిటినీ అందరినీ తమ కోణంలో నుంచే చూసి సలహాలు అభిప్రాయాలు చెప్పే గొంతు. ఇందాక ఉషని చూడగానే నేను వేసుకున్న అంచనా సరైనదేనని నాకు అర్థమయింది.
    “ఏం ఉద్యోగం చేసేవారు?” అని అడిగాను.
    “మాపాత యింటి దగ్గర స్కూల్లో మాథ్స్ చెప్పేదాన్ని, వాళ్ళు మానేయద్దు మానేయద్దు అని చాలా బ్రతిమలాడారు కానీ నేను వినిపించుకోలేదు” ఒకింత దర్పంగా చెప్పింది.
    నాకు నవ్వొచ్చింది. ఇంటి దగ్గర స్కూల్లో కాలక్షేపంగా చేసిన ఉద్యోగం కాబట్టీ, బహుశా అది లేకపోయినా జరిగే వెసులుబాటు ఉంది కాబట్టీ ఆవిడ ఉద్యోగం మానేసింది, మంచిదే. ఇల్లు మారి పిల్లవాడిని శ్రద్ధగా చదివించుకుంది, అదీ మంచిదే. కానీ తాను చేసిన పనులు సర్వులకూ ఆదర్శనీయాలు ఆచరణీయాలు అనుకోవడమే పొరపాటు. ఈ భావం నా నవ్వులో వుంది, అదృష్టమో దురదృష్టమో కానీ ఆవిడకి అది అర్థం కాలేదు.
    అయినా నేను సిగ్గుపడ్డాను.. “ఇదే కాస్త తగ్గించుకోవాలి నువ్వు, అహంకారాన్ని అజ్ఞానాన్ని చూసినంత మాత్రాన పరిహసించాలని లేదు” అంటూ నన్ను నేను మందలించుకున్నాను.
    మేము నలుగురం తప్ప మిగిలినవారందరూ దాదాపుగా వెళ్ళిపోయారు. ఒక షాపు ముందు అరుగులా వుంటే నలుగురం అక్కడ కూర్చున్నాము. కబుర్లు మొదలు పెట్టాక వాళ్ళ గురించి మరికొన్ని విషయాలు తెలిశాయి. అప్పటికే ఒక పొరపాటు చేసి నన్ను నేను మందలించుకున్నాను కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడకుండా వాళ్ళ మాటలు వింటూ ఉండిపోయాను.
    పదిన్నర అవుతుండగా షాపు తెరవడంతో మాకు అక్కడినుంచి లేవక తప్పలేదు. ఏం చేద్దాం అన్నట్లుగా చూశారు వాళ్ళు.
    “ఈపక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది వెళ్దామా!” అన్నాను నేను. అసలు ఇంట్లోంచి బయల్దేరినపుడు నా ప్లాన్ అదే. మూడు గంటలూ ఆ గుడిలో గడపాలనే. పెద్ద గుడి అది. ప్రసిద్ధమైనది కూడా. నలుగురం మెల్లగా నడుచుకుంటూ గుడి దారి పట్టాము.
    శనివారం కావడంతో గుడి బాగా రద్దీగా వుంది. దర్శనం పూర్తి చేసుకుని ప్రసాదం తీసుకునేసరికి అరగంట పైనే పట్టింది. ప్రసాదం తింటూ.. ఆగకుండా వస్తూన్న జనాన్ని గమనిస్తూ ఒక పక్కగా కూర్చున్నాం. “ఇక్కడ బావుంది. రోజూ మనం ఇక్కడికే రావచ్చు” అంది ఉష. అందరం అంగీకరించాము.
    “పదకొండున్నరయిందిగా ఇక వెళ్దాం, వెళ్ళడానికి మళ్ళీ పదినిమిషాలు పడుతుంది.” అంది మళ్ళీ తనే.
    మాట్లాడుకుంటూనే తిరిగి పరీక్షాకేంద్రం దగ్గరికి వచ్చాం. అప్పటికే తల్లిదండ్రులందరూ వచ్చి నిలబడి ఉన్నారు. వీధంతా జనసమూహంతో నిండిపోయి వుంది. బాగా ఎండగా వుంది. అయిదు నిమిషాలు నిల్చునేసరికి అందరి మొహాలూ ఎర్రగా కమిలిపోయాయి.
    “మావాడు ఈ పరీక్షలకి అసలు చదవనే లేదు” జనాంతికంగా చెప్పింది ఉష.
    “ఈ ఇంటర్ పరీక్షలని మావాడు సీరియస్ గా తీసుకోలేదు. ఐఐటి స్టార్ బేచ్ లో ఉన్నాడు కదా అందుకే కాలేజ్ వాళ్ళు ఈ పరీక్షలకి అసలు చదవనివ్వలేదు. ఈ మార్కులు ఎలాగూ కలవవని.” అంది.
    వాళ్ళబ్బాయి స్టార్ బాచ్ లో ఉన్నాడనీ ఐ ఐ టి లో సీటు ఖాయమనీ చెప్పడం ఇది అయిదోసారి. అసలే చిరచిరలాడే ఎండ వలన కలిగిన చిరాకు ఈ అతిశయపు మాటలతో ఇంకొంచెం పెరిగింది నాకు. ఉషలాంటి వ్యక్తులని ఇందుకే భరించలేను నేను.
    “మీరు ఉద్యోగం చేస్తున్నారా!” హటాత్తుగా అడిగింది ఉష.
    అప్పటికి చాలా సేపట్నుంచి మౌనంగా ఉన్న నేను నోరు తెరిచి “లేదండీ” అన్నాను.
    నామాట పూర్తవుతూ ఉండగానే “అవును ఉద్యోగం చేస్తే ఈ సమయంలో ఇక్కడికి ఎలా రాగలుగుతారు?” అంది తన ప్రశ్నని తనే అర్థం లేనిదిగా కొట్టిపారేస్తున్నట్లు.
    “దానిదేముంది లెండి, సెలవు పెట్టి రావచ్చుగా” అన్నాను నేను.
    ఆమెకసలు దేనినీ ఒప్పుకునే అలవాటు లేనట్లుంది. నా మాటల్ని ఖండిస్తూ “సెలవా? పిల్లల పరీక్షలకి సెలవిచ్చేది ఎవరు? పరీక్షలకెవరూ సెలవివ్వరు.” అని కచ్చితంగా చెప్పింది.
    “ఎందుకివ్వరు, అందరూ పెట్టుకుంటూనే ఉన్నారే!” అన్నాను నేను కొంచెం ఆశ్చర్యంగా పిల్లవాడి పరీక్షల కోసం పదిరోజులు సెలవు పెట్టిన మా చెల్లెల్ని తలచుకుంటూ.
    “గవర్నమెంట్ జాబుల వాళ్ల గురించి చెప్తున్నారేమో మీరు! ప్రైవేట్ జాబుల వాళ్లకి ఇవ్వరు. సాఫ్ట్ వేర్ కంపెనీలలో అయితే అసలివ్వరు.” మరొకసారి ఖండన ఎదురయింది నాకు.
    “అదేం లేదు, ముందు నుంచీ ప్లాన్ చేసుకుంటే సాఫ్ట్ వేర్ కంపెనీలలోనూ ఇస్తారు.” అన్నాను. ఆమాట అంటూ ఉండగానే వలలో చిక్కుకున్నానని అర్థమయింది నాకు. సెలవుల గురించి నేను చెప్పేది నిజమే కావచ్చు, ప్రస్తుతం ఉద్యోగం చేయకపోయినా సంవత్సరం క్రితం వరకూ నేనూ సాఫ్ట్ వేర్ జాబే చేశాను కనుక నాకు ఆ విషయంలో అనుభవం ఉండనూ వచ్చు. అయితే అదంతా ఇప్పుడు ఈ ఉషతో చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఏమి చెప్పినా ఆమె కాదని ఖండిస్తుందనీ వాదన పెంచుతుందనీ అది ఆమె తత్త్వమనీ ఆమెని చూసీ చూడటంతోనే గ్రహించి కూడా నేను ఈ వాదనలో ఎందుకు ఇరుక్కునట్లు! ఒక్కసారిగా నామీద నాకే చిరాకు కలిగింది.
    “లేదు, ఇవ్వరు, సాఫ్ట్ వేర్ కంపెనీలలో అసలు సెలవులివ్వరు నాకుతెలుసు.” చివరిమాట తనదే కావాలన్నట్లుగా నొక్కి చెప్పింది ఉష.
    సరిగా అప్పుడే గేటు దగ్గర పిల్లల మధ్యలో నిధి కనిపించింది. మళ్ళీ ఆ గుంపులో అది ఎక్కడ కనబడకుండా పోతుందోనని నేను వడివడిగా దాని దగ్గరికి వెళ్లాను.
    ఇవతలికి వచ్చి ఆటో మాట్లాడుకుని ఎక్కగానే “ఎలా వ్రాశావు పరీక్ష?” అన్నాను.
    “ఏదో వ్రాశాలే” అంది అది చిరాకుగా.
    “ఏమయిందమ్మా బాగా వ్రాయలేదా?” అన్నాను.
    “తెలిసిన ప్రశ్నే కొంచెం తప్పు వ్రాశా…” అంది అదే మళ్ళీ కొంచెం సర్దుకుని.
    “పోన్లే” అన్నాను నేను దాని భుజం మీద తడుతూ “ఒక్క ప్రశ్న తప్పు వ్రాస్తే ఏం కాదులే”.
    “అదికాదమ్మా అసలు తెలియకపోతే వేరు కానీ తెలిసినది తప్పు వ్రాస్తే బాధగా ఉంటుంది” అంది.
    “అవునమ్మా అది నిజమే, కానీ అయిపోయినదానికి ఏం చేస్తాం! ఇకముందు జాగ్రత్తగా ఉండాలి, అంతే” అని పైకి దానినీ మనసులో నన్నూ ఓదార్చుకున్నాను.
    మొదటి పరీక్ష అలా ముగిసింది. రెండ్రోజుల తర్వాత రెండో పరీక్షకు తీసుకెళ్ళాను నిధిని.
    ఆరోజు పిల్లలు లోపలికి వెళ్ళిన వెంటనే గుడికి వెళ్ళిపోయాము నలుగురమూ. నేను అర్థం పర్థం లేని వాదనలలోకి దిగే పొరపాటు అస్సలు చేయకూడదనుకున్నాను. దర్శనం కాగానే ఒక పక్కగా ఎవరికీ అడ్డం లేని చోట కూర్చున్నాం.
    స్వామివారి అలంకరణ, నగలు, తిరుమల ప్రసాదాలు వాటి రుచులు, కొండ మీద జరిగే రకరకాల సేవలు.. సమయమే తెలియకుండా మాటలు సాగాయి. వాళ్ళు దాదాపుగా ప్రతి యేడూ తిరుమల వెళ్తారట. తిరుమల గురించి వాళ్లకి తెలిసిన విషయాల్లో చాలా భాగం నాకు తెలియదు. అందుకే వాళ్ళు ముగ్గురూ మాట్లాడుతుంటే నేను ఆసక్తిగా వింటూ కూర్చున్నాను.
    మొదట మంచి విషయాల గురించి మొదలైన వాళ్ళ మాటలు మెల్లగా తిరుపతిలో జరిగే అక్రమాలవైపు, అవినీతుల వైపు మళ్ళాయి. ఉష వాటన్నిటినీ కొంచెం గట్టిగానే విమర్శించింది. పుణ్యక్షేత్రాలలో కూడా అలాంటివి జరగడం దారుణమంది.
    అంతలో రమణి తన అమాయకతనీ హడావుడినీ కలగలిపి స్వామివారి సేవలకు టిక్కెట్లు సంపాదించే మార్గాల గురించీ, ఆ ఏర్పాట్లు చేసిపెట్టే వ్యక్తుల గురించీ తనకు తెలిసిన సమాచారమంతా వరుసగా చెప్పడం మొదలుపెట్టింది. “మీకు కావాలంటే వాళ్ళ ఫోన్ నంబర్ ఇస్తాను” అని రమణి అనగానే అప్పటివరకు వాటన్నిటినీ ఖండిస్తున్న ఉష “ఇవ్వండి, బాబు పరీక్షలయ్యాక వెళ్దామనుకుంటున్నాం” అనేసింది తడుముకోకుండా. వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చి పుచ్చుకుంటుంటే నేను ఇక వెళ్దామా అంటూ లేచి నిలబడ్డాను.
    అప్పటివరకూ తీయగా వున్న మనసు ఒక్కసారిగా చేదుగా అయిపోయింది. మనుషుల మాటల్లోనూ చేతల్లోనూ కనిపించే వైరుధ్యాలనీ అవకాశవాదాలనీ గుర్తించినపుడల్లా ఇలాగే అవుతుంది నాకు.
    లేచి యివతలికి వస్తుంటే అప్పుడే పెద్ద గిన్నెలో పట్టుకొచ్చిన వేడి వేడి ప్రసాదాన్ని పంచడం కనిపించింది. మేము రాగానే మా నలుగురి చేతుల్లో కూడా టకటకా ప్రసాదం దొప్పలు పెట్టేశారు అర్చకులు. మేమది తినడం పూర్తి చేసి ఆ దొప్పల్ని దూరంగా వున్న చెత్తబుట్టలో పడేసి పంపు దగ్గర చేతులు కడుక్కుని బయటకి వచ్చాం. ఇదంతా అయ్యేసరికి దగ్గర దగ్గర పదినిమిషాలు. అయ్యో పిల్లలు వచ్చేస్తారేమో అంటూ కంగారుగా బయటకు నడుస్తుంటే గుడి ప్రధానద్వారం దగ్గర చిందరవందరగా పడేసిన దొప్పలు కనిపించాయి. వేగంగా నడిచి సరిగ్గా పన్నెండుకి ఒక నిమిషం ఉందనగా పరీక్షా కేంద్రం దగ్గరికి చేరాం.
    “ప్రసాదం తిన్నాక మనం పద్దతిగా ఆ ఆకులన్నీ గుడి వెనకాల వున్న చెత్తబుట్టలో పడేసి వచ్చాం. అందుకే మనకి ఆలస్యమయింది. అందరూ తిన్నచోటే పడేసి పోయారు. అక్కడ పడేసినా ఏమీ అనరని ముందే తెలిసుంటే మనమూ అక్కడే పడేసేవాళ్ళం కదా!” అంది రమణి తన అమాయకపు ధోరణిలో.
    “ఎందుకు పడేస్తాం!” అన్నాను నేను. నాగొంతులో స్పష్టంగా వినబడిన చురుకుదనానికి కావచ్చు ముగ్గురూ ఒక్కసారిగా నామొహం వైపు చూశారు. నేను కొంచెం సర్డుకున్నట్లుగా చూసి “వాళ్ళందరూ పడేస్తున్నారని తెలిస్తే మాత్రం మనమెందుకు పడేస్తాం? వాళ్ళు చేసిన తప్పు మనమెందుకు చేస్తాం!” అన్నాను.
    వాళ్ళు కొంచెం నివ్వెరపోయినట్టు చూశారు. నామాటకి సమాధానం చెప్పలేదు. ఈలోపల పిల్లలు వచ్చేశారు. నేను నిధి చేయి పట్టుకుని వెళ్ళొస్తానన్నట్లు తలవూపి ఆటోలున్న వైపు నడిచాను.
    ఈరోజు నన్నెవరూ ఖండించకపోయినా, చివరి మాట నాదే అయినా, నాకేమీ తృప్తిగా అనిపించలేదు. పొద్దున్నుంచీ మౌనంగా ఉన్నదాన్ని వస్తూ వస్తూ ఆమాట నేనెందుకన్నట్లు! అనకుండా ఉంటే బాగుండేది కదా అనిపించింది.
    కానీ నేనన్నది తప్పేమీ కాదు. అలా ఎవరో ఒకరు చెప్పడం అవసరం కూడా. కానీ ఎందుకో నేనలా అని ఉండకూడదేమోననిపిస్తోంది, ఎందుకని? నేను చేసింది కరెక్టా తప్పా!
    ఆటో ఎక్కగానే పుస్తకం తీసి గబగబా ఏదో వెతకడం మొదలుపెట్టింది నిధి. “ఒక ప్రశ్నకి నేను వ్రాసిన సమాధానం కరెక్టో తప్పో తెలియడం లేదమ్మా, టెక్స్ట్ బుక్ లో చూసినా అర్థం కావడం లేదు!” అంది.
    నేను చిన్నగా నిట్టూర్చి “పోన్లే, ఎవర్నైనా అడిగి తెలుసుకోవచ్చులే తర్వాత” అన్నాను.
    నిధి విషయం ఏమో కానీ నాకు మాత్రం ఉషా వాళ్ళ ముందు నేను అలా తీవ్రంగా ‘మనమెందుకు చేస్తాం!’ అని అడగడం కరెక్టా తప్పా అన్న విషయంలో స్పష్టత మూడో పరీక్ష రోజున వచ్చింది.
    ఆరోజు నేను మరింత జాగ్రత్తగా వుండాలని నిర్ణయించుకున్నాను. అందుకే వాళ్ళు ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటుంటే నేనొక పుస్తకం తీసి చదువుకోవడం మొదలుపెట్టాను. వాళ్ళ మాటలు వినబడుతూనే ఉన్నాయి.
    ఎప్పటిలానే ఎక్కువ భాగం ఉషే మాట్లాడింది. మిగిలిన యిద్దరు శ్రోతలు. మాటల మధ్యలో ప్రభుత్వాలు ఎంతసేపు ఆడపిల్లలకే ప్రాముఖ్యమిస్తున్నాయనీ, ఆడపిల్లలకి రిజర్వేషన్లు యిచ్చి మగపిల్లల అవకాశాలన్నీ పోగొడుతున్నారనీ ఇలా అయితే ముందు ముందు మగపిల్లలు ఎలా బ్రతుకుతారో అర్థం కావడం లేదనీ వాపోయింది ఉష. “ఒళ్ళు మండిపోతోంది అసలు ఆడపిల్లలని చూస్తుంటే” అంది ఒకింత కక్షగా.
    నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ ఆడపిల్లల తల్లులం కూడా ఉన్నామని తెలిసీ అలా అనడం బాగుండదని ఆమెకి తెలియలేదా లేక ఆవేశంలో గమనించుకోలేదా! అనిపించింది.
    రమణీ ప్రమీలా “ఇపుడే కదా అమ్మాయిలు కూడా అన్ని రకాల చదువులకీ ఉద్యోగాలకీ వెళ్ళగలుగుతున్నారు!” లాంటి మాటలేవో లోగొంతుకలతో అన్నారు కానీ వాళ్ళ మాటల్ని ఉష ఒక్క దెబ్బతో కొట్టి పారేసింది.
    “చేస్తే చేయచ్చండీ అమ్మాయిలు అన్ని రకాల ఉద్యోగాలూ చేస్తే చేయచ్చు కానీ అందుకోసం అబ్బాయిలు ఎందుకు ఇబ్బంది పడాలి? వాళ్ళెందుకు సర్దుకు పోవాలి? ఎవరి బాధ వాళ్ళది కదా!” అంది.
    వాళ్ళిద్దరూ సమాధానం చెప్పలేనట్లు చూసి ఊరుకున్నారు. అలా ఆ విషయం మీద అంత చర్చ జరిగినా నేనేమీ మాట్లాడలేదు. పన్నెండింటికి తిరిగి పరీక్షా కేంద్రానికి వచ్చేవరకు నా మౌనదీక్షని బాగానే నిలుపుకున్నాను. తీరా అక్కడకి వచ్చి పిల్లల కోసం ఎదురుచూస్తున్న పది నిమిషాలలో వ్రతభంగమయింది.
    పిల్లలు పరీక్ష వ్రాస్తున్న భవనానికి సరిగ్గా ఎదురు భవనంలో ఏదో వృద్ధుల ఆశ్రమం వుంది. గేట్లో నుంచి దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్ కీ గేటుకీ మధ్యలో చాలా పెద్ద ఖాళీస్థలం వుంది. అందులో బోలెడన్ని పెద్ద పెద్ద చెట్లూ వాటి చుట్టూ అరుగులూ ఉన్నాయి. “రండి వచ్చి ఇలా మా చల్లటి నీడలో కూర్చోండి” అని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటాయవి.
    మొట్టమొదటి రోజునే పిల్లల కోసం నిరీక్షించే తల్లిదండ్రులు మెల్లగా ఆ గేటు తెరిచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ బిల్డింగ్ బయట కూర్చున్న ఒక ముసలాయన పెద్దగా అరిచి వాళ్ళని గేటు దగ్గరే ఆపేశాడు. వాళ్ళు అక్కడే నిలబడి ఎన్ని విన్నపాలు చేసినా వెళ్ళండి వెళ్ళండి అన్నట్లు చేయి ఊపుతూ అందర్నీ తరిమేశాడు.
    ఈరోజు ఎండ మరీ భరించలేనంతగా ఉండడంతో అందరి దృష్టీ మళ్ళీ అటువైపు మళ్ళింది. అల్లంత దూరంలో స్వర్గంలాటి చోటున్నా అక్కడ కూర్చునే అవకాశం దొరకడం లేదన్న బాధతో అందరూ తలా ఒక రకంగా వ్యాఖ్యానిస్తున్నారు. “ఎంత పంతమో ఈ ముసలాయనకి! కాసేపు కూర్చోనిస్తే ఏమవుతుంది? ఇక్కడ మనం ఎండలో ఎంత మాడిపోతున్నాం!” అంది ఉష.
    “మాడిపోతే మాడిపోతామండీ. మనకోసం ఆ ముసలాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి? వాళ్ళెందుకు సర్దుకు పోవాలి? ఎవరి బాధ వాళ్ళది కదా!” అన్నాను నేను టకీమని.
    సరిగ్గా అప్పుడే గణగణా గంట మోగింది. ఉషకి నామాటలు వినిపించాయో లేదో అర్థం కాలేదు. ఒకవేళ వినబడినా అరగంట క్రితం ఆమె మాట్లాడిన మాటల్ని నేనిపుడు తిరిగి అప్పచెప్పానని గ్రహించిందో లేదో తెలియలేదు.
    కానీ నాకే ‘ఏమిటిది! ఇంత నిగ్రహం లేకుండా అయిపోయానేమిటి నేను!’ అని సిగ్గుగా అనిపించింది. ఎవరైనా నన్ను ఆక్షేపించినా ఖండించినా తిరిగి వాళ్ళని ఏదో ఒకటి అనేదాకా నా నోరు ఊరుకోవడం లేదు కదా! గట్టి ప్రయత్నంతో నోటినీ మాటలనీ కాసేపు నియంత్రించినా ఆ నిగ్రహాన్ని ఎక్కువసేపు నిలబెట్టుకోలేకపోతున్నాను. మనసుకు సర్దిచేప్పుకోలేకపోతున్నాను. అవును, తప్పు నోరుది కాదు, దాని వెనుకనున్న మనసుది.
    మనసుకు చిరాకు కలిగితే అప్పటికప్పుడు ఆవేశంగా నోరుజారడం లేదు నిజమే, కానీ ఎప్పటికో ఒకప్పటికి దానికి ప్రతిస్పందించి కానీ స్థిమితపడడం లేదు నేను! అదీ విషయం.
    శమదమాదుల గురించి చాలా చదివాను నేను. శమాన్ని సాధించిన వారికి దమాన్ని సాధించడం కష్టం కాదు. అది వారికి సహజంగా సిద్ధిస్తుంది. కానీ ఒకవేళ కొన్ని సందర్భాలలో శమాన్ని నిలుపుకోలేకపోయినా కనీసం దమాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించాలి.
    ఒక సిద్ధాంతంగా ఇదంతా బాగానే తెలుసు, కానీ ఆచరణలో ఉండే కష్టమేమిటో ఇపుడు తెలుస్తోంది. ఇంద్రియాలను నిగ్రహించడం ఒక మెట్టు. మనసును నిగ్రహించడం మరొక మెట్టు.
    శమాన్ని సాధించలేక పోవడమే నా సమస్య. అది లేనంతవరకూ మంచి మాటలూ మంచి ఆలోచనలూ కూడా పూర్తి ఆనందాన్ని ఇవ్వవు. నిజానికి మొన్న నేను చెప్పింది మంచి మాటే. ఇంకెవరో పడేశారు కదా అని మనం కూడా చెత్త ఎక్కడంటే అక్కడ పడేయకూడదు అని చెప్పడం… మంచి విషయమే. కానీ అది చెప్పేటపుడు నా మనసులో పూర్తి ప్రశాంతత లేదు. అందుకే నేను చేసిన పని నాకు తృప్తిగా ఆనందంగా అనిపించలేదు.
    నా దోషం ఏమిటో అర్థమవగానే ‘ఈ విషయం నేర్పడానికే కాబోలు ఈ మూడు రోజులూ నిధితో పాటు నాకు కూడా పరీక్షలు పెట్టాడు భగవంతుడు!’ అనుకుని నవ్వుకున్నాను.
    లోపమేమిటో తెలిసింది కనుక ఇక దానిని సరిదిద్దుకోవాలని సంకల్పించుకున్నాను. సహాయం చేయమంటూ భగవంతుడికి నమస్కారమూ చేసుకున్నాను.
    నాలుగో పరీక్షరోజునా ఆతర్వాత పరీక్ష రోజునా కూడా నిధి వాళ్ళ నాన్న యేవో పనులకోసం ఆఫీసుకి సెలవు పెట్టడంతో నాకు నిధిని తీసుకువెళ్ళాల్సిన పని తప్పిపోయింది. ఆయనే నిధిని పరీక్ష దగ్గర దింపి తన పనులు చూసుకుని మళ్ళీ వచ్చేటపుడు దానిని తీసుకు వచ్చారు.
    చివరి పరీక్ష రోజు వచ్చేసింది.
    ఎప్పటిలాగే పిల్లల్ని పరీక్ష హాల్లోకి పంపి నలుగురమూ గుడికి వెళ్లాం. ఉషా రమణీ నేరుగా గర్భగుడి లోకి వెళ్ళిపోయారు. ప్రమీలా నేనూ ప్రదక్షిణాలు చేసి అప్పుడు లోపలికి వెళ్లాం.
    ఉష పరిహాసంగా నవ్వుతూ “ఏమిటి ప్రదక్షిణాలు చేసొస్తున్నారు! ఎక్కువ పుణ్యం సంపాదించడానికా!” అంది.
    “పాపం పోగొట్టుకోడానికి” నానోట్లో నుంచి అప్రయత్నంగా సమాధానం వచ్చింది.
    “అదేలెండి, నేను పాజిటివ్ గా మాట్లాడుతున్నాను, మీరు నెగటివ్ గా మాట్లాడుతున్నారు.” తన సహజ ధోరణిలో నా మాటలని ఖండించింది ఉష.
    నాకు నవ్వొచ్చింది. కానీ “కాదమ్మా ఇది పాజిటివ్ థింకింగ్‌కీ నెగిటివ్ థింకింగ్‌కీ సంబంధించిన వ్యవహారం కాదు, ప్రదక్షిణ పాపపరిహారం కోసమే చేస్తారు” అని వివరించి చెప్పాలనిపించలేదు. అంతేకాదు.. తెలిసీ తెలియని మాటలతో ఉష నన్ను ఖండించినందుకు ఈరోజు నా మనసులో కొంచెం కూడా చిరాకు కలగలేదు.
    తర్వాత దాదాపు రెండు గంటల సేపు గుడిలో కూర్చున్నాము. ప్రశాంతత దూరం కాలేదు. వాళ్ళ మాటలన్నీ వినబడుతూనే ఉన్నాయి, విషయాలు అర్థమవుతూనే ఉన్నాయి. కానీ నా మనసులో ఏ రకమైన వికారమూ కలగలేదు. రాగమూ ద్వేషమూ కూడా.
    పన్నెండింటికి యదావిధిగా నిధిని తీసుకుని ఆటో ఎక్కాను. అలవాటుగా “ఎలా వ్రాశావు” అన్నాను. అది నా భుజం మీద తల ఆన్చి సంతోషంగా నా వైపు చూస్తూ “చాలా బాగావ్రాశాననిపిస్తోంది, ఫుల్ మార్క్స్ వస్తాయనిపిస్తోంది.” అంది.
    నేను నవ్వుతూ దాన్ని మరింత దగ్గరికి పొదువుకున్నాను. “అవును, నాక్కూడా అలాగే అనిపిస్తోంది” అన్నాను.

    *****

    – టి. శ్రీవల్లీ రాధిక

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here