మదిని దోచే గది

1
15

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘మదిని దోచే గది’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]క రోజు సోషల్ మీడియా చూస్తుండగా, ఒకతను, తను వెళ్లిన అరుకు  ప్రాంతంలో ఓ కొండ మీద ఉన్న ఓ గది గురించి చెప్పాడు. అక్కడ ఒక వారం రోజులు బస చేశానని, అక్కడ ఆ కొండ మీద ఉన్న ఆ గది, ఆ ప్రదేశం ఎంతో బాగుందని, తాను ఇప్పటికీ ఎన్నో ప్రదేశాలు చూసినప్పటికీ ఇదే అన్నిటిలో గొప్ప అనుభూతిని మిగిల్చిందని చెప్పుకొచ్చాడు. అయితే సినిమా వాళ్లు కూడా అప్పుడప్పుడూ ఆ గదిని అద్దెకి తీసుకుంటారని, అక్కడినుండి చుట్టుపక్కల ప్రకృతిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవని, మాటల్లో చెప్పాలంటే మాటలకి కొరత వస్తుందన్నాడు. పైగా చలి ప్రదేశం కనుక, కనీసం రెండు మూడు పెగ్గులు తాగి ఆ తర్వాత సిగరెట్ కాలుస్తూ తర్వాత మనకు ఇష్టమైనవి తింటూ ఆ చల్లటి ప్రదేశంలో పడుకుంటే ఆ థ్రిల్లే వేరని ఏదేదో చెప్పుకుంటూ పోయాడు. కనుక అతడు, ఒంటరిగా వెళ్లి వస్తుంటానని చెప్పుకొచ్చాడు.

ఆ వీడియో చూసినప్పటి నుండీ శేఖరంలో ఒక రకమైన ఆసక్తి మొదలైపోయింది, ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ చలి ప్రదేశంలో, ఆ గదిలో టీవీ చూస్తూ, హాయిగా స్వేచ్ఛగా మందు తాగుతూ అని ఏదేదో ఊహించేసుకుని తెగ సంబర పడిపోయాడు, ముఖ్యంగా తన భార్య లేకుండా, ఒక్కడే  వెళితే, తాగినా, తూగినా అడిగేవారుండరనే ఆలోచనే అతనికి వెయ్యి రెట్లు సంతోషం కలిగించింది. పైగా ఎప్పుడూ వెళ్లని ఆ సుందర ప్రదేశంలో గడిపి, ఆ అనుభూతులన్నీ మనసులో మూట కట్టుకుని మురిసిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. లేడికి లేచిందే పరుగు అన్నట్టు, ఆ రోజే మూడు రోజుల సెలవు కోసం లీవ్ అప్లై చేసేశాడు.

లీవ్ పెట్టేసి, ఇంట్లో భార్యకి “ఆఫీసు పని మీద హైదరాబాద్ వెళుతున్నాను” అని చెప్పేసి, బట్టలు సర్ధుకుంటున్నాడు.

“అలాగా అయితే నేను కూడా వస్తా అండీ, పెద్దమ్మ తల్లి గుడికి వెళ్దాం. ఎప్పటినుండో అడుగుతున్నాను కదా, ఈ సారి తీసుకు వెళ్ళoడీ” అడిగింది లలిత.

ఆమె వంక చూస్తూ, ‘నీకు దూరంగా వెళ్ళి, ఒక్కడినే చక్కగా మందు తాగి, ఎంజాయ్ చేద్దాం అని వెళ్తుంటే నువ్వెందుకు నాకు అడ్డు. ఇది వద్దు అది వద్దు అని అక్కడ కూడా సలహాలతో చంపడానికా’ అని మనసులో అనుకుని, “లేదు లలితా, నేను చాలా ముఖ్యమైన పనిలో మునిగిపోతాను. నిన్ను పట్టించుకోలేను. పైగా ఇక్కడికి ఒక్కరే వెళ్లాలని ఒక రూల్ కూడా ఉంది” చెప్పి, “నెక్స్ట్ టైమ్ తీసుకు వెళ్తాలే” అని చెప్పేసి వెళ్లిపోయాడు.

అరుకు చేరి, అక్కడికి దగ్గరలో ఉన్న ఆ కొండమీద గదికి బయల్దేరి వెళ్ళాడు. ఆ గదికి వెళ్ళగానే, కాళ్ళు పట్టేసి, కీళ్ళు సలపడం మొదలైంది. అక్కడున్న వాచ్‌మన్‌ని పిలిచి ఒక బామ్ తెమ్మన్నాడు. తెచ్చాక రాసుకుని, నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాచ్‌మన్‌ రూoకి వచ్చి, బామ్ తీసుకుని టీ తెమన్నాడు. టీ తాగాడు కానీ అది పరమ దరిద్రంగా ఉంది. కప్పు వేడినీళ్లలో, అర చిటికెడు టీ పొడి, చిటికెడు పంచదార వేసి కలిపి తెచ్చినట్టు ఉంది. సరే అని బలవంతంగా తాగేసి మూతి తుడుచుకున్నాడు. తర్వాత కాసేపటికి, చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు చూద్దామని ఎంతో ఆశగా బయటికి వచ్చాడు. లపక్, తపక్ అనే శభ్దo రావడంతో, తలదించుకుని కిందకి చూశాడు. రెండు కాళ్ళూ బురదలోకి దిగిపోయాయి. చేసేది లేక, ఆ బురద కొట్టుకుపోయిన కాళ్లతోనే, ఓ సారి చుట్టూ చూశాడు, ‘సినిమాల్లో చూపించినట్టే, ప్రకృతి అందాలు బాగున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు’ అని అనుకుంటుండగానే,  కాలికేదో పురుగు కుట్టడంతో “కెవ్వ్” మని అరిచి, కాలు పైకెత్తాడు. దాంతో బాలన్స్ తప్పి కింద పడిపోయాడు. దాంతో ఒంటికి మొత్తం బురద అయిపోయింది. దాంతో లబో,దిబో అంటూ లోపలికి వచ్చేసాడు.

సరే రాత్రి అయింది రెండు పెగ్గులు తాగాడు కానీ ఎందుకో చలి మాత్రం ఆగలేదు. ఇంతలో వాచ్‌మన్‌ క్యారేజీ తెచ్చి ఇచ్చాడు. విప్పి తిన్నాడు. నీళ్ళ లాంటి సాంబారు, వేగి, వేగని కూర. భోజనం కూడా అంత సంతృప్తికరంగా అనిపించలేదు.

“భోజనం ఎలా ఉంది సార్” అని అడగగానే, నీ మొహంలా ఉంది అని అతని మొహాన చెప్పలేక “పర్వాలేదు” అంటూ మొక్కుబడిగా సమాధానం చెప్పాడు. చెప్పి ఆ క్యారేజ్‌ని సగం తిని అక్కడ పెట్టేసాడు. తర్వాత కొద్ది సేపటికి దోమలు కుట్టడం మొదలైంది, వెంటనే వాచ్‌మన్‌ని  పిలిచి “ఏమిటి దోమలు ఉన్నాయా” అని అడిగాడు.

“దోమలు ఉన్నాయండి, ఎందుకంటే కొంచెం మొక్కలు, చెట్లు, చుట్టూ ఉంటాయి కదా, కొంచెం దోమలు అవి వస్తూ ఉంటాయి, మనం ఎంత శుభ్రం చేసినా ఎక్కడో దగ్గర్నుంచి వస్తుoటాయి. నీళ్లు మురిగిపోతే వాటిలో నుంచి కూడా దోమలు వస్తాయి కదా” అంటూ చెప్పుకొచ్చాడు, వస్తోన్న కోపాన్ని అణుచుకుని, ‘గొడవ వద్దు’ అని మనసులో అనుకుంటూ “సరే దోమల మందేమైనా ఉందా”  అడిగాడు.

“దోమల మందు” అని అతను క్షణం ఆలోచించి, “సరే తెస్తాను” అంటూ ఇలా వెళ్ళి అలా తెచ్చాడు.

అది వెలిగించి పెట్టుకోగానే, గదంతా ఒకటే పొగ, ఎక్కువగా పైగా ఫ్యాన్ గాలి,  మొత్తం క్లోజ్ చేశాడేమో, ఊపిరి ఆడలేదు దాంతో ఇంక చేసేదిలేక, దోమలు తగ్గి, తగ్గగానే వెంటనే ఆ దోమల చక్రంని ఆపేసాడు.

తెల్లవారింది మూడు రోజులు ఉండి మొత్తం చూద్దాం అనుకున్న వాడల్లా, “వస్తానయ్యా మంచి సాయం చేశావ్” అని అతని రూమ్‌లో ఓ మూల ఉన్న ఫోటో చూశాడు. దాని వంక చూస్తూనే, “ఈ ఫోటో” అడిగాడు సందేహంగా.

“ఇందులో ఉన్నది మా ఓనర్ గారేనండీ, ఆ పక్కన ఉన్నది అతని స్నేహితుడు. సోషల్ మీడియాలో ఈ గది గురించి తెగ ఊదర గొడతాడు. అలా ఆయన దీని గురించి సోషల్ మీడియాలో పెట్టాకే ఈ కొండ మీద ఈ గదికి సందర్శకులు రావడం పెరిగింది. అంతకు ముందు ఎవరూ వచ్చేవారు కాదు. అయినా ఇంత కొండ మీదకి ఎవరొస్తారండీ. ఏదో ఇతని ఊక దంపుడు మాటలు విని, వెర్రి వెంగళప్పల్లా నమ్మి వచ్చి పోతున్నారు” అని క్షణం ఆగి “మీరు కూడా అలానే వచ్చారా” అడిగాడు ఆ వాచ్‌మన్‌ కాస్త భయంగా చూస్తూ.

‘సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని, ఎంత పని చేశావ్‌రా దరిద్రుడా, కొండ మీద ఉన్న ఓ బోడి గదిని పట్టుకుని, మదిని దోచే గదని చెప్పి, నన్ను వెంగళాయ్‌ని చేశావ్ కదరా’ అని మనసులో అనుకుని “కాదయ్యా నేను అనుకోకుండా వచ్చాను” ఆవదం మొహంతో చెప్పి, ఆ గదికి ఒక రోజు అద్దె డబ్బు ఇచ్చిముందుకు కదిలాడు శేఖరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here