మహా రచయిత

1
12

[box type=’note’ fontsize=’16’] మంచి రచయిత అయ్యే లక్షణాలున్న ఓ వర్ధమాన రచయితని పొగడ్తలతో మొగ్గలోనే తుంపేసి అతన్ని ‘మహ రచయిత’ని చేసేసిన వైనాన్ని వివరిస్తున్నారు సలీం ఈ కల్పికలో. [/box]

[dropcap]ర[/dropcap]వితో నాకు నాలుగేళ్ళ క్రితం పరిచయమైంది. నా పదో కథాసంపుటి ఆవిష్కరణ సభ ముగిశాక నాకు అభినందనలు తెల్పుతూ తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. ‘నేనూ కథలు రాస్తుంటాను సార్. నా పేరు రవి” అన్నాడు. కంటికి కన్పించిన ప్రతి కథనూ చదివే అలవాటున్న నాకు అతని పేరుతో పరిచయం లేకపోవడంతో “ఎప్పట్నుంచి రాస్తున్నావు? ఎన్ని కథలు ప్రచురించబడ్డాయి?” అని అడిగాను. అతని వయసు పాతికకి దగ్గరగా ఉండటంతో వయసులో అతనికంటే పాతికేళ్ళు పెద్దవాడిగా ఏకవచన ప్రయోగంలో నా వాత్సల్యాన్ని నింపి మరీ అడిగాను. “ఈ మధ్యనే రాయడం మొదలెట్టాను సార్. రెండు మూడు రాశాను గానీ పత్రికలకు పంపడానికి ధైర్యం చాలడం లేదు. మీరు పెద్దమనసుతో వాటినోమారు చదివి తగిన సలహాలూ సూచనలూ ఇస్తే వాటికనుగుణంగా మార్పులు చేసి పత్రికలకు పంపుకుంటాను” అన్నాడు వినయం ఉట్టిపడేలా.

‘దానికేం భాగ్యం… శనాదివారాల్లో వస్తే చదివి నాకు తోచింది చెప్తాను’ అన్నాను. ఆ మాటకే ఎంత సంతోషపడిపోయాడో. నేనూ కథలు రాయడం మొదలెట్టిన కొత్తలో ఇలానేగా సీనియర్ కథకుల దగ్గర మెలకువలు నేర్చుకుంది… రవి తను రాసిన మూడు కథల వ్రాతప్రతుల్ని ఆదివారం ఉదయం నా చేతికందచేసి ‘తీరికున్నప్పుడు చదవండి సార్. వచ్చే ఆదివారం వస్తాను’ అన్నాడు. ‘మూడు కథలు చదవడం ఎంత సేపు? అరగంటకన్నా ఎక్కువ సమయం పట్టదు. కొద్దిసేపు కూచో. ఇప్పుడే చదివేస్తాను’ అన్నాను. అతని చేతిలో నా పుస్తకం ఒకటి పెట్టి ఆ మూడు కథల్ని చదివేశాను. పర్లేదు. మంచి పఠనీయత ఉంది. కథా వస్తువును ఎన్నుకోవడంలో, కథ చెప్పడంలో మరికొంత జాగ్రత్త వహిస్తే మంచి రచయితగా రాణిస్తాడనిపించింది. నాకు తోచిన రెండు మూడు సలహాలు చెప్పి పంపించాను.

ఆ తర్వాత పత్రికల్లో అడపా దడపా అతని కథలు కన్పించసాగాయి. అలా ఈ నాలుగేళ్ళలో తను రాసిన పదకొండు కథల్ని ‘రవి కిరణాలు’ పేరుతో పుస్తకంగా వేసి ఆవిష్కరణ సభ పెడ్తున్నాననీ నా చేతుల మీదుగా ఆవిష్కరణ జరగాలని కోరుకోవడంతో సభకు ముఖ్య అతిథిగా హాజరైనాను. ఆవిష్కరణ తర్వాత పుస్తకంలోని ఒకట్రెండు కథల గురించి నాలుగు మాటలు మాట్లాడి, అతన్నుంచి ఇంతకన్నా మెరుగైన కథలు ఆశిస్తున్నానని చెప్తూ ముగించాను.

పుస్తక పరిచయం చేయడానికి వచ్చిన సుబ్బారావు మైకు ముందు నిలబడి గొంతు సవరించుకున్నా డు. అతను కవిత్వమేదో రాస్తుంటాడు. రవికి స్నేహితుడు. కథల్ని పరిచయం చేయడానికి కథా రచయితే కానక్కరలేదు. నాకు తెలిసి కొంత మంది కవులు కథా సంపుటాల్ని, నవలల్ని చక్కగా విశ్లేషించి మాట్లాడటం నాకు అనుభవమే కాబట్టి అతను మాట్లాడబోయే దాన్ని శ్రద్దగా వినడానికి సన్నద్ధమైనాను.

“ఈ పుస్తకంలోని పదకొండు కథలు పదకొండు ఆణిముత్యాలు” అంటూ మొదలెట్టాడు. “రవి మామూలు రచయిత కాదు మహా రచయిత అని ఈ కథలు చదివాక ఎవ్వరైనా ఒప్పుకోవల్సిందే. ఒప్పుకోకపోతే వాళ్ళకు కథలు చదవడం రాదని అర్థం. కథల్ని బేరీజు వేయడం చాతకాదని అర్థం” అన్నాడు. ఆ మాటలు నా గురించే అన్నట్టనిపించాయి. “ఇందులో ఫలానా కథ అద్భుతమైన కథ. అంతర్జాతీయ కథల పోటీలు పెడితే తప్పకుండా మొదటి బహుమతి గెల్చుకునే సత్తా ఉన్న కథ. రవి రాసిన మరో కథ చూడండి. ఇది మహాద్భుతమైన కథ” అన్నాడు. మూడో కథ గురించి చెప్పేటప్పుడు పరమాద్భుతమైన కథ అంటాడేమో…

నాకు డిగ్రీలో ఇంగ్లీష్ పాఠాలు బోధించిన దౌలా మాస్టారి మాటలు గుర్తొచ్చాయి. పొరపాటున కూడా సూపర్లేటివ్ డిగ్రీ వాడకూడదని చెప్పేవారు. ఓ అమ్మాయి సౌందర్యాన్ని వర్ణిస్తూ ‘మోస్ట్ బ్యూటిఫుల్’ అనేశాక, అంతకన్నా అందమైన అమ్మాయి కన్పిస్తే వర్ణించడానికి పదమే దొరకని సంక్లిష్ట స్థితి ఎదురౌతుందని హెచ్చరించేవారాయన. అందుకే కంపేరిటివ్ డిగ్రీ దాటి ఎవ్వర్నీ పొగడకూడదని నాకు ఆ రోజుల్లోనే అవగతమైంది.

సుబ్బారావు రెచ్చిపోయి అతిశయోక్తుల్ని ఉదారంగా సభికుల మీద కుమ్మరిస్తున్నాడు. “ఈ కథా సంపుటి కొతగా కథలు రాసేవాళ్ళకి ఓ గైడ్ లాంటిది” అన్నాడు. పదకొండు కథలు రాయగానే రవి సీనియర్ కథా రచయిత అయిపోయాడన్నమాట. మరి వందల కథలు రాసినవాళ్ళూ, మూడు నాలుగు దశాబ్దాలుగా కథలు రాస్తున్న వాళ్ళని ఏమనాలి? మహా సీనియర్ రచయితలనాలా?

“ఈ కథా సంపుటికి సాహిత్య అకాడమీ అవార్డు ఖాయం” అన్నాడు ముక్తాయింపుగా. జ్ఞానపీఠ, నోబుల్ పురస్కారాలు బహుశా గుర్తొచ్చి ఉండవు. అందుకే వాటి గురించి ప్రస్తావించకుండా వదిలేసి ఉంటాడు. అందరూ చప్పట్లు బాగా కొట్టారు. తర్వాత రవి తన స్పందన తెలియచేయడానికి ఉద్యుక్తుడైనాడు. ఎక్కడా నా దగ్గరికి రావడం గురించి గానీ నా సలహాలు స్వీకరించడం గురించి గానీ చెప్పలేదు. తన ప్రతి కథా మేధో మథనం లోంచి పుట్టినదేనట. నెలల తరబడి మనసులో నలిగిన కథలు కాబట్టే అవంత గొప్పగా వచ్చాయట. ఆ పదకొండు కథల్నీ ఆంగ్ల భాషలో అనువదించి ప్రచురించాలనే ఉద్దేశం ఉన్నదట. దాని వల్ల జాతీయ అంతర్జాతీయ పాఠకులకు తెలుగు రచయితల సత్తా ఏమిటో తెలియాలనేదే తన ఆశయమట. సుబ్బారావు పొగడ్తలు అతని తలకు బాగా ఎక్కినాయనిపించింది.

నిర్వాహకులు రవిని శాలువాతో పూలదండల్తో ఘనంగా సత్కరించారు. సభ ముగిశాక రవి నా గురించి పట్టించుకోలేదు. మంచి రచయిత అయ్యే లక్షణాలున్న రవిని మొగ్గలోనే తమ పొగడ్తలతో తుంపేసినందుకు బాధపడూ యింటికి చేరుకున్నాను. మరునాడు వార్తా పత్రికల్లో ‘ప్రముఖ కథా రచయిత రవికి ఘన సన్మానం’ అని ఫోటోతో సహా వార్త ప్రచురించబడింది. పదకొండు కథలకే ‘ప్రముఖ కథా రచయిత’ అయిపోవచ్చని నాకర్థమైంది.

నాలుగైదు నెలల తర్వాత మరో వార్త ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమైంది. రవి రాసిన కథా సంపుటి ‘రవికిరణాల’కి పాతతరం లోని ఓ ప్రముఖ కథా రచయిత పేరుతో నెలకొల్పిన పురస్కారం ప్రకటించినట్టు దాని సారాంశం. పురస్కార ప్రదాతలెవ్వరికీ ఆ ప్రముఖ రచయితతో సంబంధమో అనుబంధమో లేదు. అతని అనువంశీకులు కూడా కాదు. ఓ పాతతరం రచయిత పేరుతో ఎవ్వరంటే వాళ్ళు పురస్కారాలు ప్రకటించడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఒకప్పుడు ఓ గొప్ప రచయిత పేరుతో పురస్కారం ప్రకటిస్తే దానికి గొప్ప విలువుండేది. వీటిక్కూడా పేటెంట్ హక్కులుంటే బావుండుననిపిస్తుంది. గతించిన గొప్ప రచయితల గౌరవమైనా నిలబడుంది.

ఇప్పుడు రవి నాతో మాట్లాడటం మానేశాడు. నా సభలకు రావడం మానేశాడు. ఎక్కడైనా ఎదురు పడినా పలకరించకుండా తల తిప్పుకుని వెళ్ళిపోతున్నాడు. అతనిప్పుడు మహా రచయిత కదా. అతని కళ్ళకు సీనియర్ రచయితలందరూ మరుగుజ్జులుగా కన్పించడంలో ఆశ్చర్యం ఏముంది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here