మహాభారతంలో కుంతి

2
13

[శ్రీ పాలకుర్తి రామమూర్తి రచించిన ‘మహాభారతంలో కుంతి’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

[dropcap]మా[/dropcap]నవ జీవితం పలు సంఘటనల సమాహారం. మన ప్రమేయం ఉన్నా లేకున్నా కొన్ని సమయాలలో అనాలోచితంగా, అసంకల్పితంగా ఆయా సంఘటనలో మనమూ పాత్రధారులమౌతాము. ఆయా సంఘటనలలో మనమెలా ప్రవర్తిస్తామనేదే మన జీవితాన్ని మాత్రమే కాక మొత్తం సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు.. భావితరాలకు ఒక పాఠాన్నీ నేర్పవచ్చు. నిజానికి జీవితం అనేది ఒక నాటక రంగం లాంటిది. దాని దర్శకుడు చాలా సమర్థత గలిగినవాడు. ఎవరెవరికి వారి వారి సామర్థ్యాన్ని బట్టి పాత్రలను నిర్ణయిస్తాడు. సమర్థులై బాగా నటించే వారికి కష్టతరమైన పాత్రలు ఇస్తాడట.

కుంతి యదువంశానికి చెందిన శూరుడు అనే రాజు కుమార్తె. ఆమె పేరు పృథ. ఆమె వసుదేవుని సోదరి. చిన్నప్పుడే ఆమె కుంతి భోజునికి దత్తపుత్రిక అయింది. దానితో ఆమె పేరు కుంతిగా మారింది. అల్లారు ముద్దుగా, అతి గారాబంగా కుంతి భోజుని అంతఃపురంలో పెరిగినా చదువు నేర్చింది.. పెద్దల పట్ల వినయ విధేయతలు అలవరచుకున్నది. ఓర్పు, సహనం, నేర్పులను, ఎదుటి వారిని గౌరవించడం సంతరించుకున్నది.

జీవితం సాఫీగా జరిగిపోతున్న వేళ ఆమె జీవితంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. అతి కోపానికి మారుపేరైన దుర్వాస మహాముని ఒకనాడు కుంతి భోజుని వద్దకు అతిథిగా వచ్చి ఒక సంవత్సర కాలం ఉన్నాడు. ఆయనకు సపర్యలు చేసేందుకు పరిచారికలను నియమిస్తే.. దుర్వాసునికి ఆగ్రహం రావచ్చు. అందుకే దుర్వాసునికి అవసరమైన సేవలు అందించే బాధ్యతా నిర్వహణను కుంతికి అప్పగించాడు. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి కుంతికి ఆ మహర్షియొక్క ఆశీస్సులు లభిస్తాయి. రెండవది అత్యంత జాగరూకతతో నిర్వహించాల్సిన కార్యం కాబట్టి ఆమెకు ఆ సహనం, నిర్వహణా దక్షత అలవడుతాయి. అవి రేపు వివాహమయ్యాక అత్తవారింటిలో ఉపయోగపడతాయి.

కుంతి కూడా అత్యంత శ్రద్ధాసక్తులతో, భయ భక్తులతో దుర్వాసుని సేవించింది. ఆయన కూడా ఆనందించి ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. మంత్రోపదేశం వేళ ఆమెతో “నీవు ఈ మంత్రంతో ఏ దేవతను ఆహ్వానిస్తావో ఆ దేవత వల్ల పుత్రుడు జన్మిస్తాడు” అని చెప్పి వెళ్ళాడు. ఈ సంఘటనయే ఆమె జీవితాన్ని ఒక మలుపు తిప్పింది.

ఒకనాడు సూర్యోదయ వేళ కుంతి ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూచి పరవశించి.. ఆ దివ్యమంత్రాన్ని ధ్యానించి సూర్యుని ఆహ్వానించింది. ఆకతాయిగా పరిణామాలను ఆలోచించకుండా ఆమె ఆహ్వానించగానే, మంత్ర ప్రభావంతో సూర్యుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమె తన తప్పిదాన్ని తెలుసుకొని వారించినా సూర్యుడు ఆమెకు కన్యాత్వం చెడని వరంతో సహా మరికొన్ని వరాలిచ్చి ఆమెను సంగమానికి ఒప్పించాడు. కుంతీ సూర్యుల సమాగమం జరిగింది. ఫలితంగా ఆమె గర్భవతి అయింది.. సహజ కవచ కుండలాలతో కుమారుడు జన్మించాడు. ఇక్కడిదాకా బాగానే ఉన్నది.. కాని ఇప్పుడేం చేయాలన్నదే సమస్య..

ప్రకృతిలో స్త్రీపురుష సమాగంలో ఇరువురూ భాగస్వాములే.. అది తప్పయినా ఒప్పయినా ఇరువురి బాధ్యతా సమమే. కాని పర్యవసానం స్త్రీకే అధికంగా ఉంటుంది. పురుషుడు తనపై మరక పడకుండా తప్పుకుంటాడు.. కాని స్త్రీకి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం సాధ్యపడదు. అంతేకాదు, తల్లిదండ్రుల పరువు ప్రతిష్ఠలు కూడా ఇందులో ఉంటాయి. ఈ స్థితిలో బాధ్యురాలయిన స్త్రీ ముందు నాలుగు మార్గాలు ఉంటాయి. ఒకటి ఆత్మహత్యను చేసుకోవడం.. రెండవది.. పుట్టిన బిడ్డను కుప్పతొట్టిలో పడవేసి చేతులు దులుపుకోవడం.. మూడు పుట్టిన శిశువును హత్య చేయడం.. నాలుగవది ఎవరేమనుకున్నా.. లోకాపవాదాన్ని పట్టించుకోకుండా ఆ బిడ్డను పెంచి పోషించడం.

ఇక్కడే ఆమెలో అంతస్సంఘర్షణ.. పసికందును పారవేయాలా? లోకాపవాదాన్ని భరించాలా? రెంటిలో ఆమె మొదటి మార్గాన్నే ఎన్నుకున్నది. పరువు ప్రతిష్ఠల కోసం ఎంతటి కష్టాన్నైనా, దుఃఖాన్నైనా చిరునవ్వుతో భరించాలి.. అన్న సూక్తిని ఆదరించింది. భవితపై ఆశతో జీవించాలి.. ఎదురయ్యే కష్టాలను.. కసితో అధిగమించాలి.. సాధన చేయాలి.. పోరాడాలి.. అంతేకాని భయపడినా, బాధపడినా ఈ ప్రపంచం మనలను దూరంగా విసిరివేస్తుంది. సూర్యుని నుండి ఆమెకు ఏ విధమైన సహాయమూ లభించదు.. తానే తన జీవితాన్ని సరిచేసుకోవాలి. తలిదండ్రుల పరువు ప్రతిష్ఠలను కాపాడాలి. అందుకే గుండెను రాయి చేసుకొని బిడ్డను మందసంలో పెట్టి గంగానదిలో వదిలింది. తన జీవితంలో పడిన మరకను పూర్తిగా కడుక్కోలేక పోయినా మరిచిపోయే ప్రయత్నం చేసింది.

కాలగతిలో ఆమె పాండురాజును వివాహమాడింది. కౌరవ వంశానికి కోడలుగా.. హస్తినలో అడుగుపెట్టింది. కొంతకాలం భర్తతో ఆనందించినా.. శల్యుని చెల్లెలైన మాద్రిని పాండురాజు పెండ్లాడంతో, సవతి రూపంలో ఆమెను మరొక అవాంతరం పలకరించింది. ఏ బంధంలోనైతే అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం ఉంటుందో ఆ బంధం అర్థవంతమౌతుంది.. చిరకాలం నిలుస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణయే.. మాద్రి పట్ల ద్వేషాన్ని పెంచుకోకుండా సోదరిగా భావించి తన జీవితంలోకి ఆహ్వానించడం.

జీవితం నిజానికి ప్రవాహం లాంటిది. ఎక్కడా స్థిరంగా ఉండదు. అలాగే.. కుంతి జీవితంలో మరొక తుఫాను పలకరించింది. పాండురాజు శాపగ్రస్తుడయ్యాడు. స్త్రీ సంగమం వల్ల మృత్యువు మ్రింగేస్తుందని ముని శాపం. రాజ్యభోగాలు, యౌవన సుఖాలతో సాఫీగా సాగే జీవితాన్ని ముని శాపం కుదిపివేసింది. అటు కుంతి గాని మాద్రి గాని అప్పటికి సంతానవతులు కాలేదు. శాపకారణంగా వారు శతశృంగ పర్వతానికి వెళ్ళి ముని వృత్తిలో బ్రతకసాగారు.

ఇప్పుడు పాండురాజులో మరొక కోరిక.. తనకు సంతానం కావాలని.. భర్త కోరిక మేరకు.. తనకు దుర్వాసుడు అనుగ్రహించిన మంత్రాన్ని తిరిగి ధ్యానించి.. ధర్మజ, భీమార్జునులను సంతానంగా పొందింది. అలాగే మాద్రికి ఆ మంత్రాన్ని ఉపదేశించి ఆమె కూడా సంతానాన్ని పొందేందుకు సహకరించింది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. కారణాలేవయినా.. కుంతి తాను వివాహానికి పూర్వమే ఆ మంత్ర పభావంతో కర్ణుడిని ప్రసవించిన విషయాన్ని పాండురాజుకు చెప్పలేదు..

ఆ సమయంలో మరొక ప్రమాదం వారిని చుట్టింది. ఒకనాడు పాండురాజు ఆపుకోలేని తమకంతో మాద్రితో సంగమించి.. మరణించాడు. భర్త మరణానికి తానే బాధ్యురాలననే భావనతో మాద్రి సహగమనం చేసింది. అయిదుగురు పిల్లలను పెంచే బాధ్యతతో, కుంతి ఒంటరిగా శతశృంగంలో మిగిలిపోయింది. ఆ సమయంలో ఏం చేయాలి? ఎక్కడికి పోవాలి? అయోమయ స్థితిలో పడిన ఆమె ముందు మూడు మార్గాలు ఉన్నాయి. ఒకటి పిల్లలను తీసుకొని తన పుట్టింటికి వెళ్ళాలి.. వెళితే వారు ఆదరిస్తారేమో కాని.. వారక్కడ పాండురాజు వారసులుగా పెరగరు కదా.. ఒకరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడి.. బ్రతకాలి. ఇది ఆమెకు ఇష్టం కానిది.. ఇక రెండవ మార్గం.. శతశృంగంపైననే మునుల సాహచర్యంలో ఉండిపోవడం.. దాని వల్ల ప్రయోజనం? తన సంతానం అనామకులుగా మౌనులుగా జీవించడం.. రాచబిడ్డలు అనామకులుగా ఉండడం ఆమె సహించదు.. మరి మూడవ మార్గం.. హస్తినకు వెళ్ళడం.. అది తమ రాజ్యం.. అక్కడ రాజకుమారులుగా తన సంతానం.. రాజ విద్యలు నేర్వడం జరుగుతుంది. వారి జీవితానికి సార్థకత కలుగుతుంది.. తన జీవితమూ చరితార్థమౌతుంది. అక్కడికి వెళితే ఏం జరుగుతుందో ఏమో అనే భయంకన్నా.. అక్కడ ఏం జరిగినా అప్పుడు చూసుకుందాము.. అనే ధైర్యమే తెగువ నిస్తుంది. ఆ సాహసమే.. విజయాన్నిస్తుంది. రేపు సాధించాల్సిన విజయానికి ఈ రోజు ప్రాతిపదిక కావాలి. అందుకే లోతుగా ఆలోచించి.. హస్తినకు వెళ్ళేందుకే నిర్ణయించింది.

హస్తినకు వెళితే.. బావగారయిన ధృతరాష్ట్రుడు.. ఆదరిస్తాడా? పాండురాజు శాపగ్రస్తుడయ్యాడనే విషయం వారికి తెలుసు.. ఇప్పుడు అయిదుగురు పిలలతో వెళితే.. వీరంతా వరప్రసాదంగా పాండురాజు కుమారులేనని చెపితే ప్రజలు నమ్ముతారా? సేవకులు, బంధువులను తానెలా నమ్మించగలదు? పాండురాజు జీవించి ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది.. తనను తన సంతానాన్ని కౌరవులు, బంధుమిత్రులు చులకనగా చూస్తారా? ఇవన్నీ ప్రశ్నలే. జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనే విచికిత్స ముఖ్యమైనది కాదు.. సరైన దారిలో గమ్యంవైపు మన ప్రయాణం సాగుతున్నదా లేదా అనేదే ముఖ్యమైనది. గెలుపు అనేది ఒక సంఘటన మాత్రమే కాని ప్రయత్నం అనేది ఒక ఉత్సవం.. ప్రయత్నాన్ని ఆస్వాదించడంలోనే ఆనందం ఉన్నది. ఫలితం ముఖ్యమే అయినా ప్రక్రియ దానికన్నా విలువైనది. అందుకే శతశృంగంలో ఉండే పలువురు మునులను వెంట తీసుకొని హస్తినకు కుమారులతో సహా వెళ్ళింది.

ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. హస్తినకు వెళ్ళడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజానాలు ఉన్నాయి. తామక్కడ ఉంటే.. రాజ్యంపై తమ హక్కును అనుక్షణం పెద్దలకు, ప్రజలకు గుర్తుచేసినట్లవుతుంది. పాండురాజు ప్రజారంజకంగా పాలించాడు. వారంతా తమను ఆదరించే అవకాశం ఉన్నది. భీష్ముడు, విదురుడు లోకజ్ఞులు, ధర్మం తెలిసినవారు. ధృతరాష్ట్ర, పాండురాజుల నైజం తెలిసినవారు. వారి సానుభూతిని సంపాదించవచ్చు. వారి వల్ల న్యాయం జరిగే అవకాశం ఉన్నది. పాండవుల భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండాలి అంటే తాము హస్తినలోనే ఉండాలి.. అది కష్టమైనా.. ఇష్టమైనా.. భరించాల్సిందే. అందుకే అంటారు.. వ్యక్తి తాను ఎక్కడ ఉండాలనేది వివేకం చెపుతుందట.. ఎలా ఉండాలి అనేది అనుభవం చెపుతుందట.. ఎందుకు అక్కడ ఉండాలి అనేది అవసరం చెపుతుందట.

జీవితం ఎప్పుడూ ఊహించని పరిణామాలను అందిస్తుంది. అవి మనకంగీకారం కావచ్చు, కాకపోనూ వచ్చు. ఏం జరిగినా.. దానిని ఆమోదించడం, దానిని ఆనందించడం ఉత్తమం. అంతేకాదు, నమ్మిన మార్గం మనకు విజయాన్ని ప్రసాదిస్తుందనే బలమైన విశ్వాసం కూడా పెంచుకోవడం అవసరమే. అదే మన ప్రయాణాన్ని సౌకర్యవంతం చేస్తుంది. గమ్యానికి చేరుస్తుంది. ఒకవేళ ఆ ప్రయత్నంలో తాను ఓడిపోతే.. ఓటమి ఎదురైంది అంటే.. ప్రక్రియలో ఏమైనా లొసగులు కనిపిస్తే సరిచేసుకొని ప్రయత్నాన్ని మరింత శ్రద్ధగా.. పట్టుదలగా చేయమనే కాని దానిని విడిచిపెట్టమని కాదు.

ఉన్నతమైన కార్యాన్ని సాధించాలి అంటే.. భూతకాలాన్ని పట్టుకొని వ్రేలాడ కూడదు. నిన్నటి భయాలను పట్టించుకుంటే ఈ రోజు పోరాడలేము. ఈ రోజు పోరాడకుంటే రేపు విజయాన్ని సాధించలేము. భయపడుతూ చేసే పోరాటం అపజయాన్నిస్తుంది. గెలవాలంటే ఓటమి భయాన్ని వదలి ప్రయత్నించాలి.

ఆనందం ఎవరూ అమ్మేదీ కాదు.. కష్టం ఎవరూ కొనేదీ కాదు.. జీవిత గమనంలో ఎదురయ్యే అనుభవాలే కష్ట సుఖాలు. దానిని నమ్మినది కాబట్టే ధీర గంభీర మూర్తియై కొడుకులతో కూడా హస్తినలో చేరింది. తన కుమారుల బాగోగులను తీర్చిదిద్దే బాధ్యతను అక్కడి పెద్దల చేతులలో సవినయంగా పెట్టింది. కౌరవుల అసూయాద్వేషాలు అవగాహన చేసుకున్నది. అంతేకాదు, తన సంతానం యొక్క శక్తిసామర్థ్యాలు, గుణగణాలు తనకు తెలుసు.. పాండురాజు పట్ల ప్రజల కున్న ఆదరణ కూడా తానెరుంగును.. అయినా.. తాము అప్రమత్తంగా ఉండాలని భావించింది. త్వరలోనే పాండవులు కూడా తమ విద్యాబుద్ధులతో, సత్ప్రర్తనతో అందిరి మన్ననలను పొందారు.

కుమారాస్త్ర విద్యాప్రదర్శన జరుగుతున్న సమయంలో.. కర్ణుని ప్రవేశం.. ఆమె జీవితాన్ని మరొక్కమారు కుదిపివేసింది. పాత గాయం కెలికినట్లయింది. అర్జునుని విలువిద్యా నైపుణ్యాన్ని ప్రేక్షకులు పొగుడుతూ ఉంటే ఆనందించింది.. అదే సమయంలో కర్ణుని ప్రవేశాన్ని చూచి అతనిని గుర్తించిన ఆమెలో సంఘర్షణ. మనసు అల్లకల్లోలమైంది.. పైకి చెప్పుకోలేదు.. ద్రిగమింగుకోనూలేదు.

జూదంలో ఓడిన పాండవులు అడవికి వెళుతూ.. తనకు నమస్కరించిన సమయంలో.. “దుర్వ్యసనశీలురైన మిమ్మల్ని చూడక ముందే మీ తండ్రి స్వర్గానికి వెళ్ళాడు” అంటూ తన అసహనాన్ని వెళ్ళగ్రక్కింది. అంతేకాదు, వారితో పాటుగా తానూ అరణ్యానికి వెళితే హస్తినలో వారిని జ్ఞాపకం చేసేవారు ఎవరూ ఉండరనే ఉద్దేశంతోనే విదురుని ఇంట్లో ఉండిపోయింది. మనం నేతగా ఉండాలి అంటే ఎప్పుడూ మన పేరు జనాల నాలుకలపై నానుతూనే ఉండాలి. పొలంలో పంటను వేస్తాము. ఆ పంట వెంట కొన్ని కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. ఆ కలుపు మొక్కలను ఏరివేసి పంటను రక్షించుకుంటామే కాని పొలాన్ని వదిలి వెళ్ళిపోతామా? అదే కుంతి మానసిక పరిణతి. తమ జీవితంలో సమస్యలు వస్తున్నాయి. వాటిని అధిగమిస్తూ వెళ్ళాలే కాని హస్తినను వదిలి వెళ్ళడం సమంజసం కాదు.

శ్రీ కృష్ణుడు రాయబారిగా వచ్చి వెళ్ళే సమయంలో.. కుంతి తన కుమారులకు చెప్పమంటూ.. “రాజకుమారులు ఎప్పుడూ నిప్పులుగా ఉండాలే కాని బొగ్గులుగా మారకూడదు” అంటుంది. అది ఆమె లోని వీరమాతను జాగృతపరచే కోణం.

ఆమె జీవితంలో ఎదురైన మరొక బాధాకరమైన సన్నివేశం.. కర్ణుని వద్దకు వెళ్ళి తాను కర్ణుని తల్లిని అని చెప్పుకోవడం. ఏ తల్లికైనా తన కుమారుని వద్దకు వెళ్ళి నేను నీ తల్లిని అని చెప్పుకోవడం కన్నా ఘోరమైన శిక్ష ఉంటుందా? ఎంతో మానసిక సంఘర్షణను అనుభవించిన కుంతి కర్ణుడుని పాండవ పక్షంలో చేరమని చెప్పడం జరుగుతుంది. కర్ణ – అర్జునులలో ఒక్కరే ఉంటారని కర్ణుడు చెప్పినప్పుడు తాననుభవించిన బాధ అపరిమితం.

మహాభారత యుద్ధం ఆమెకు రెండు విధాలయిన అనుభూతులను మిగిల్చింది. ఒకవైపు.. పాండవుల విజయం పట్ల ఆనందం.. మరొకవైపు కర్ణుని మృతిపట్ల విషాదం.. అంతే కాదు.. కర్ణుడు తన పెద్ద కుమారుడని ధర్మరాజుకు చెప్పే సమయంలో ఆమె లోని వ్యథ వర్ణనాతీతం. ఆ బాధలోనే ఆమె రాజమాతగా రాజభోగాలను కూడా విసర్జించి ధృతరాష్ట్రాదులతో అరణ్యానికి వెళ్ళింది.

ఈ నేపథ్యంలో కుంతి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే.. ఒక వెలుగుతున్న దీపంతో ఆమె వ్యక్తిత్వాన్ని పోల్చవచ్చు. ఆమె కష్టాలనే గుడిసెలో ఉన్నా.. సుఖాలనే భవంతిలో ఉన్నా ఒకే విధమైన వెలుగుతో ప్రకాశించింది. ఆమె జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు, ఎన్నో మలుపులు, వ్యథలు.. సుఖాలకన్నా బాధలే ఆమె జీవితంలో చుట్టాలయ్యాయి. అయినా గాంభీర్యాన్ని విడనాడలేదు. ధైర్యాన్ని కోల్పోలేదు.

శత్రువు బాధపడాలి అంటే నీవు ఆనందంగా ఉండాలి అంటారు.. నొప్పితో పోరాడిన స్త్రీ మాత్రమే తల్లి అవుతుంది. చీకటితో పోరాడితేనే ప్రకాశం, వెలుగు చూస్తుంది. ఎంతో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోక చిలుక అవుతుంది. మట్టితో పోరాడితేనే విత్తనం మొక్కగా ఎదుగుతుంది. అలాగే కష్టాల నెదిరించి పోరాడిన వారికే విజయం బానిస అవుతుంది. కుంతి జీవితమూ అలాంటిదే.. తాను సుఖపడినదానికన్నా కష్టపడిన కాలమే ఎక్కువ. అయినా కష్టాలకు తలవంచకుండా తన శక్తిమేరకు ఎదిరించి తన కంటూ చరిత్రలో ఒక పుటను ఏర్పరుచుకున్నది. ఆ స్పూర్తిని ప్రతి వ్యక్రీ పొందాలని ఆశిస్తూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here