మహాకవి గురజాడ – మతం-1

0
6

[శ్రీ నవులూరి వెంకటేశ్వరరావు రచించిన ‘మహాకవి గురజాడ – మతం’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము. ఇది మొదటి భాగము.]

[dropcap]గు[/dropcap]రజాడ వేంకట అప్పారావు గురించీ, అయన సాహిత్యం గురించీ రాయడానికి ఎంతో కొంత ఎప్పటికీ మిగిలి ఉండటం కూడా అయన నమ్మకాల, అయన సాహిత్య ప్రత్యేకతలు. “కవికుల గురువు కాళిదాసైతే నవకవి గురువు గురజాడ” అన్నారు డా. దాశరథి కృష్ణమాచార్యులు. సంతాప తీర్మానంలో చెప్పినట్టు నికరమైన పాండిత్యము, విజ్ఞాన సంపత్తిగల మేధావి; సంస్కృత, ఆంధ్ర ఆంగ్ల భాష సాహిత్యాలలో, శాసన పరిశోధనలో, పురావస్తుతత్త్వ శాస్త్రంలో అపారమైన జ్ఞానం కలవారు. గతంలో మంచి కొంచెమే అని తాను భావించినా, గురజాడ కళింగ చరిత్ర రాద్దామని చాలా సమాచారాన్ని సేకరించారు. అదీ దానితోపాటు రాద్దామనుకున్న విజయనగరం రాజవంశ చరిత్రా ఇతర రచనలు స్వప్నసదృశాలయ్యాయి. ఆయన సాహిత్య ఎజెండా కన్నా ఆయువు అల్పమైనది. “రాజుల కొలువులో కుమ్మరిపురుగువలె వ్యవహరించ” వలసి రావడం, పదిహేనేండ్ల కాలం కేవలం జమీందారీ వారసత్వ వ్యాజ్యానికే ఖర్చవడం, వదలని నీడ లాంటి అనారోగ్యం వాటి వంతు అవరోధాలు అవి కలిగించాయి. ముప్పై మూడు సంవత్సరాల వయసులో ఎనభై-యెనిమిది పౌండ్ల బరువు మాత్రమే ఉన్న విగ్రహం వదిలేసి వెళ్లిన సాహిత్య అడుగుజాడలు చెరపలేనివి.

ఆయన వ్రాసిన ఐదు కథలలో ‘మతము-విమతము’, ‘మీ పేరేమిటి?’ మత విశ్వాసాలకు సంబంధించినవి. మతం ఒకనాటికి మాసిపోతుందనన్నా, “వెనక చుసిన కార్యమేమోయి? మంచి గతమున కొంచెమేనోయి” అనినా, 1636-41 సంఘటన ఆధారంగా ‘మతము-విమతము’ రాశారు మతంకన్నా మానవుడు అధికుడని. మతం ముసుగులోని మౌఢ్యం హానికరం అని హెచ్చరించే ప్రయత్నం వ్యంగ్య రసం పరిపుష్టంగా ఉన్న రెండవ కథ ‘మీ పేరేమిటి?’.

ఈ రెండు తొలినాళ్ళ ఆధునిక కథలకు చరిత్రతో పీటముడి పడుంది. కథలను విపులీకరించడం, నా దగ్గరున్న సమాచారంతో ఆయన సంక్షిప్తంగా వెల్లడించిన చారిత్రిక, ఇతర విషయాలు ఏ మేరకు వాస్తవాలు అన్నది పరిశీలించడం, ఇంతకూ అయన మతమేమిటి? అన్న ప్రశ్నకు సమాధానాన్ని వెదకడం ఈ వ్యాసం ఉద్దేశాలు.

మతము-విమతము

ఈ కథకు గురజాడ ఉపోద్ఘాతమిది: “గోలకొండ పాదుశాహి ఫర్మానుల సీలు ఇచ్చట విప్పబడుటంజేసి దీనికి సికాకోల్ లేక చికాకోల్ అను పేరు కలిగెనని ఇచ్చటి వారందురు గాని అది నిజము కాదు. ఈ పట్టణము బహు ప్రాచీనమైనది. దీని పేరు శ్రీకాకుళం. ఒకప్పుడిందు శ్రీకాకుళేశ్వరుని క్షేత్రముండెను. దానిని పడగొట్టి షేకు మహమ్మదు పెద్ద మసీదును కట్టెను, నిజమిది.”

ఒక సంధ్యాసమయంలో ఉత్తర దక్షిణ ధృవాల లాంటి గురు-శిష్యులు ముప్పైయేళ్ళ నారాయణ భట్టు, ఇరవైయేళ్ళ పుల్లాభట్టు చాలాకాలం కాశీలో గడిపి చికాకోల్, చిక్కోలు, శ్రీకాకుళం అనే ఊరు సమీపిస్తూ దూరానికి కనబడని శివాలయం గోపురం ఏమయిందా అని తర్జనభర్జన పడుతుంటారు. గుడి చోటులో మజీదుంది; మజీదు ముందు నిలబడ్డారు. దాంట్లో చిలుము పీలుస్తూన్న సాహేబును గుడి పక్కనే ఉంటూ వచ్చిన తన మేనమామల గురించీ అడిగాడు నారాయణ. సాహెబు తన చిన్న మేనమామ లక్ష్మణభట్టు అని తెలుస్తుంది. “అయ్యో! నువ్వా మావా!” అనడంతో కథ అంతం అయినట్టుగా భావించుకోవాలి. ఆ వ్యక్తి లక్ష్మణభట్టు అని, లక్ష్మణభట్టు తన మేనల్లుడిని కౌగలించుకోబోతే వద్దు వద్దంటూ నారాయణ భట్టు దూరం తొలుగుతాడు అని గురజాడ రాసి కొట్టేసిన దాంట్లో ఉందని అవసరాల సూర్యారావు పాద పీఠికలో రాశారట.

చారిత్రక నేపథ్యాన్ని తన కథకు ఉపోద్ఘాతంగా రచయిత వాడుకున్నారు కనుక నిజానిజాలను కనుగొనే ప్రయత్నం చేస్తాను ముందుగా.

గంజాం కలెక్టర్ ప్రిన్సిపాల్ అసిస్టెంట్ F.W. Grahame తన 22-02-1871 తేదీ నివేదికను The Indian Antiquary-I లో ప్రచురించారు: “చాలా పాత శాసనాలు ఈ జిల్లా విభాగంలో ఉన్నాయని నాకు తెలియజేశారు. వాటిలో ఒకటి చికాకోలు లోని ఒక మజీదు వెనుక రాతిమీద వున్నది. నేను దాన్ని చూశాను, నెల పాటు కురిసిన వర్షాల వలన చికాకోల్‌లో నేను కొంతకాలం ఉండకపోవడం వలన ఆ శాసనం నకలు తీసుకోలేకపోయాను. మజీదును హిజ్రా 1051 లో, అంటే 230 సంవత్సరాల క్రితం [1641] కట్టారు. దాని స్థానంలో ఇంతకు ముందు ఒక హిందూ దేవాలయం ఉండేది. దేవాలయాన్ని షేర్ మొహమ్మద్ కూల్చి ఆ సరుకుతో మజీదును నిర్మించాడు.” ఈ సమాచారాన్ని Robert Sewell తన Antiquarian Remains in Madras Presidency లో చేర్చాడు.

అక్కడ గోల్కొండ ఫర్మానా సీళ్లు విప్పడం వలన ఆ పేరు వచ్చిందని గురజాడ పేర్కొన్న అర్థమే కాక, షికా ఖోల్ అంటే గుడ్డతిత్తి (షికా) ఖోల్ (విప్పు) డబ్బు చెల్లించు అని రైతులను అడిగే అర్థమూ ఉంది. మజీదును 18 ఎకరాల స్థలంలో కొంతమేరకు కట్టి చుట్టూ గులాబీ తోటను పెంచి చికాకోల్‌కు గుల్షనాబాద్ అని నామకరణం చేశాడు ఖాన్. దానికి కుతుబ్ షాహీ పాలన ముందు ఏ పేరుండేదో, తెలుసుకోడానికి నాకు ఎలాంటి చారిత్రక ఆధారం దొరకలేదు. ఆంగ్లేయులు సేకరించి ప్రచురించిన ఏ శాసనంలోనూ మరో చారిత్రిక సందర్భంలోను ఆ పేరు నాకు కనబడదు. చిక్కోలు అని, శిక్కోలు అనీ [నిడదవోలు, ఒంగోలు లాగా] సామాన్యులు పిలిచిన పేరే పాత పేరేమో! కనీసం పదిహేడో శతాబ్దం ఆరంభం నుంచి చికాకోల్ అన్న పేరుంది. 1930లో వచ్చిన మహామహుల వ్యాస సంకలనం ‘కళింగదేశ చరిత్ర’లో శ్రీకాకుళ గత ముచ్చట లేదు. ముందు పేర్కొన్న ఆంగ్లేయ అధికారి, గతంలో కూల్చివేసిన గుడికి సంబంధించిన శాసనాన్ని కాపీ చేసి ప్రకటించుంటే మరికొంత సత్యం బట్టబయలయ్యేది. ఖాన్ మజీదులో ఉంచిన తన సుదీర్ఘమైన పారశీక శాసనం మాత్రం అతని గొప్పదనాలను వెల్లడించేది అని సంక్షిప్త శాసనాల సంకలనాలలో చెప్పారుగాని పూర్తి పాఠాన్ని ఇవ్వలేదు. ఆ పారశీక శాసనంలో అరసవల్లి లాంటి ప్రముఖ, చారిత్రక దేవాలయాలనూ పగులగొట్టి మజీదు నిర్మాణంలో వాడారని ఉందని Census of India 1961 వారు 1964-66 లో ప్రచురించిన Fairs and Festivals, Srikakulam District లో చెప్పారు. కృష్ణాజిల్లాలో శ్రీకాకుళేశ్వరుడు ఉండటం చేత ఆ క్షేత్రానికి ఆ పేరొచ్చింది. ఇక్కడ దానినే అనుకరించారు. ఖాన్ కూలగొట్టిన గుడి శ్రీకాకుళేశ్వరుడిదేనని చాలామందితోబాటు గురజాడకూ కలిగిన భావన కథా నేపథ్యానికి చారిత్రక సత్యంగా వాడుకున్నారు.

అటు శాలిహుండం ఇటు రామతీర్థం మధ్యగా, చేరువలో శ్రీకాకుళం ప్రాంతముంది. పాతికమైళ్ల దూరంలోని శ్రీముఖలింగం గుడి మీద భీకరమైన బౌద్ధ శక్తి శిల్పాలున్నాయి. అంతా బౌద్ధమతపు వజ్రయాన శాఖ ప్రాబల్యమున్న సీమిది. ఈ ఊరికి బౌద్ధ మూలాలున్న పేరుంటే తార్కిక విషయమూ అవుతుంది. బౌద్ధంలోని శాక్తేయం ఆశ్రయమిచ్చిన ఏ శక్తి పేరుతోనో ఉండేదేమో. పద్దెనిమిదెకరాల స్థలం అక్కడుందంటే అది ఒకనాడు బౌద్ధ ఆరామమేమో. ఊరు చిక్కోలుగా లేక శిక్కోలుగా మారి నవాబుల నోళ్ల నుంచీ చికాకోల్‌గా వెలువడుంటుంది. ఆమె ఆలయం కాలంకాటుకు కూలి దాని మీద ఏదో శివాలయం మొలిచుండొచ్చు, గంగావంశజుల తొలి మతం శైవము గనుక. దాన్ని కూలదోసి ఖాన్ మజీదు కట్టాడని భావిస్తే సత్యదూరం కాదు.

కథకు అవసరమైన మరికొన్ని ఆసక్తికర చారిత్రిక విషయాలను అవలోకిద్దాం. శ్రీకుర్మాన్ని ఖులీ కుతుబ్ షాహీ సేనాని ఒకడు 1599లో ధ్వంసం చేసి లోపల మజీదు కట్టినట్టు ఒక శిలా శాసనాన్ని ఆ గుడి గోడమీద నేటికీ ఉండేట్టు చెక్కించాడు. 1604లో ఆ రాజు మరో సేనాని పద్మనాయక వంశ సర్వప్ప అశ్వారాయడు, అక్కడి వైష్ణవులతో మాట్లాడి వాళ్లకు కానుకలిచ్చి దేవాలయాన్ని పునరుద్ధరించి, నేటికీ ఉండేట్టు శాసనం చెక్కించాడు. వెళుతూ దారిలో మహమ్మదీయ సేనాని శ్రీకూర్మంతో పాటు పాడుచేసిన సింహాచలాన్ని ఇరవై రోజుల పాటుండి బాగు చేయించాడు. అందుమూలంగా చెబుతున్న మరో విషయం ఏమిటంటే ఆ ప్రాంతంలో, 160 ఏళ్ళ కుతుబ్‌షాహీ, నిజాం పరిపాలనాలలో అరాచకం చోటు చేసుకుంది. జరిగిన అరాచకం, అన్యాయం గోగులపాటి కూర్మనాథ [1720-1790] గ్రహించాడు; కొంతలో కొంతమేరకన్నా కవిగా చూసుంటాడు. అందరిలా భరించే శక్తిలేక, ‘సింహాద్రి నారసింహ శతకం’ అనే అధిక్షేప శతకం రాస్తూ, రాసి – గగ్గోలు పెట్టాడు.

కూర్మనాథుడు విజయనగర సంస్థాన కవి. సింహాచలం, రామతీర్థం వగైరా దేవాలయాలలో ఉద్యోగాలు చేశాడు. విజయనగర పెద్ద విజయరామరాజు, మొదటి ఆనంద గజపతి సన్మానించారు. ఆ సంస్థానానికి మలిరోజుల్లో గురజాడ ముద్దుబిడ్డ. గోగులపాటి రామతీర్థంలో పుట్టాడు. గురజాడ కుటుంబానికి రామతీర్థంలో కాస్త పొలముండేది. ఈ కథ రెండు పాత్రలు నారాయణ భట్టు, పుల్లాభట్టులకు కూర్మనాథకవి సోదరులు వెంకన్న, కామన్న నమూనాలుగా ఉపయోగపడి ఉండవచ్చు. వాళ్ళు కాశీరామేశ్వరాల మజిలీలు చేస్తూ ఇతర సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉండేవారు. విజయనగరం సంస్థానాధీశుడి వద్ద తర్వాత కాలంలో పనిచేసిన గురజాడకు కూర్మనాథుడి గురించి అతని సోదరుల గురించీ తెలిసే ఉంటుంది. ఆ శతకం గురజాడ చదివి నవ్వుకుని ఉండటానికి మతము-విమతము రాయడము కాస్త రుజువు కూడా. గుడులకు గోపురాలకు ఏ హాని జరుగుతుందో అని శతకరచన చేయడం, అతని సోదరులు ప్రతి పుణ్యక్షేత్రము సందర్శించి వస్తుండటం తన మనసులో చోటుచేసుకున్నాయేమో.

నారాయణ, పుల్లా కాశీకి పోయి ఐదేళ్లకు తక్కువ కాకుండా అక్కడ గడిపి వస్తున్నారు. పుల్లా అడుగడుగునా గురువుగారిని కూలిన గోపురం విషయంలో హేళన చేశాడు. ఆ పాత్రలోకి గురజాడ కబీరును పరకాయప్రవేశం చేయుంచుంటే ఆశ్చర్యపడక్కరలేదు. కూర్మనాథుడికి ప్రతినిధిగా కూడా గురజాడ నారాయణను మలిచుంటారు.

కాశీ యాత్రకు వెళ్లిన పిదప గుడిని పడగొట్టడం, మజీదును నిర్మించడం ఐదేళ్లు పట్టుంటుందని భావిస్తే 1641 తరువాత వాళ్ళు ఊరు చేరుతున్నట్టు తెలుసుకోవచ్చు. ఆ సాయంసంధ్యవేళ గురుశిష్యులు తూర్పు దిక్కునుంచీ పడమటి దిక్కుకు పయనిస్తున్నారు. హిందువులకు తూర్పు పవిత్రమైన దిక్కు, మక్కా వున్న పశ్చిమం ముస్లిములకు లాగానే. ఇపుడు తూర్పు అభిముఖంగా ఈశ్వరకోవిల ఉండటానికి బదులు పశ్చిమాభిముఖంగా [వీలయితే] మజీదు ఉంటే ఆశ్చర్య పడక్కరలేదు. అది కార్తీకమాసం, శుక్లపక్ష దశమి సాయంత్రం. చంద్రోదయం కాబోతుండవచ్చు. శివుడికి ఇష్టమైన మాసం. కానీ అక్కడ శివుడు లేడు. రంజాన్ నాడు చంద్రుడిని చూస్తారు సోదరమతం వారు. చంద్రుడు శివుడి శిరాన్ని అలంకరిస్తాడు. వారం శుక్రవారం – ముస్లిములకు పవిత్రమయినది; ప్రార్థనలు జరుగుతాయి. కేవలం దిక్కులను, తిథివార నక్షత్రాలను గురజాడ పేర్కొన్నారు మిగతా విషయాలను మనం ఊహించగలం అనెరిగి. ప్రియురాలిని చూడటానికి విరహ వేదనతో సంవత్సరానంతరం అలకాపురికి వస్తున్న యక్షుడిలా ఉన్నాడు నారాయణభట్టు అని మనం అనుకోవచ్చు, గురజాడ అలా అనకపోయినా. అతని మొహం ‘వికసితమై’ ఉంది [ప్రియురాలితో కలయిక జరగబోతున్నట్టు].

“పుల్లా మా వూరొచ్చాంరా. యిట్టి వూరు భూప్రపంచంలో వుండబోదురా. కాళిదాసు అవంతిని ఉద్దేశించి చెప్పిన మాటలు దీనియందు వర్తిస్తున్నాయిరా, ఏమి నది, ఏమి వూరు,” అన్నాడు నారాయణ. నది నాగావళి వయ్యారి.

కాళిదాసు మేఘదూతంలో ప్రేమతో, శృంగారభావనతో తలచుకున్న ఉజ్జయిని తూర్పువైపు శీప్రా నది పారుతుంది. ఊరిపై తన ప్రేమను చాటుకోడానికి మేఘుడు వెళ్లే దారిలో అది లేకపోయినా దానిమీది నుంచీ వెళ్ళమన్నాడు యక్షుడు. అవంతి ఊరు కాదు రాజ్యం. దానికి ఉజ్జయిని రాజధాని. ఉజ్జయినికి అవంతి అన్న పేరు కూడా ఉంటే అది ఏమో! Homer కునికినట్టే నారాయణ తన పారవశ్యంలో కునికుంటాడు.

ఆకాశానికి నెత్తుటిన ఉండవలసిన శ్రీకాకుళేశ్వరుడి మహాగోపురం కనబడక గురువు ఉన్నట్టుండి నిశ్చేష్టుడై నేలపై కూలబడెను. అది గురజాడ కోవెల గోపురం నేలకూలడంగా చెప్పారో, నారాయణ ఆ గోపురంలా కూలాడని చెప్పడంగా భావించుకోవచ్చో! మాట్లాడకపోవడంతో, శిష్యుడు “ఏమి స్వామీ? ఏమి స్వామీ?” అన్నాడు. గురువు కారణం చెప్పాడు. కాశీకి తిరిగి పోదాం, ఈ పట్నానికి మనకు రుణస్య తీరిపోయింది అంటాడు [యక్షిణి లేని అలకాపురితో తనకు పనిలేదు అని యక్షుడు అంటున్నట్టు]. గోపురం కోసమా ఇంత ప్రయాసకోర్చి వచ్చింది, గోపురం సిగ్గోసిరి, మీకు గోపురమే కావలిస్తే మా వూరు రండి అని ఔదార్యాన్ని ప్రదర్శించాడు శిష్యుడు గురువు బాధను పక్షిఈకంత తెలీకగా తీసుకుంటూ. మీ గోపురాన్నీ మ్లేచ్చులు పడగొట్టి ఉంటార్రా; మా గోపురం మీదే ఉండేవాడిని నా బాల్యంలో [అని గోపురం తన తల్లి ఒడి అన్నట్లు] అన్నాడు గురువు. ఎవడి పుండు నెప్పి వాడికేగా తెలిసేది?

పడమటాకాశంలోని మజీదు చూసే గుడి పడగొట్టి మజీదు కట్టారు అని నిర్ధారణగా చెప్పాడు గురువు. “దేవుడెందు కూరుకున్నాడు, స్వామీ?” అడిగాడు లఘువు. దొరికిపోయినట్లుగా, “ఆ మాట ఏ శాస్త్రంలోనూ కనబడదురా, పుల్లా,” అన్నాడు. అది గురజాడవారి అవహేళన. గురువుకు తెలియని విషయాలుంటాయి. అలాంటివడిగితే నిజానికి ఏ గురువుకైనా మండాలి – అందరి గురువుల లాంటివాడు కాదేమో నారాయణ. ఈ ప్రశ్నను గురజాడవారు గోగులపాటి వారికి ఆయన రాసిన శతకానికి సమాధానంగా వేసిన ప్రశ్నగా తీసుకోవచ్చు.

కానీ సింహాచలేశుడు కూర్మనాథుడి మొర విన్నట్టున్నాడు; తన విగ్రహం, తన గుడి పోతాయన్న స్వార్థచింతనతో కాకపోయినా ఆ భక్తవత్సలుడు కరుణించాడు. మూడొంతులు నిందాస్తుతిగా సాగిన శతకం నాలుగో వంతు నుంచి పొగడ్తలతో ముంచెత్తింది. కారణం? చికాకోల్ ఫవుజ్దార్ జాఫర్ అలీ, మరాఠా సైన్యాలు సింహాచలం మీదుగా వెళుతున్నా దాని జోలికి వెళ్ళలేదు. వాళ్ళు వైజాగపటంలో దూరి సముద్రపు ఒడ్డుదాకా విస్తరించివుండే కైలాసగిరి సముద్రపు వైపు చివర మీదుగా, తమ పని మీద వెళ్ళిపోయారు. అంటే శతకము రాసిన తరువాత, జరగవలసిన దాడి జరగలేదు. Diary and Consultations of East India Company, Vizagapatam, ద్వారా ఆ విషయాలను తెలుసుకోవచ్చు. దేవుడి మహిమ అని ఆంగ్లేయులు రాయలేదు, గోగులపాటి వారి శతకం గురించీ వారెరుగరు. అది మహిమ వలన కానీ మరోలా గాని జరిగిందని కాని వాళ్ళు, నేను, గోగులపాటి కూడా ఇంతకన్నా రుజువు చెయ్యడం కష్టం. అన్నట్లు ఆ ప్రాంతంలో గోపురాలు కూలడం గోగులపాటి శతకం రాసిన వెంటనే ఆగిపోయింది. ఈ ప్రాంతం ముందు ఫ్రెంచివాళ్ళ చేతిలోకి 1757లో, తదుపరి ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళిపోయి నవాబుల పాలన అంతమైంది. దైవికం [ఆస్తికుల భాషలో]! కాకతాళీయం [నాస్తికుల భాషలో]!

దేముడు తన గుడిని రక్షించుకోవాలని చూసే సంకుచిత స్వభావుడైతే దేవుడు కాదు. గుడిని మనం కట్టి దాన్ని దేముడే రక్షించుకోవాలి అనడం పుల్లాబొట్ల తర్కం అవుతుంది. దేవుడు ఒకడే – హిందువులకు, ముస్లిములకు, వాళ్ళు అంగీకరించకపోయినా నాస్తికులకు, ఇతరులకు. హిందువులు, ముస్లిములు సిగపట్లకు దిగితే వాళ్ళ అగచాట్లు వాళ్ళు పడాలి; “వాళ్ళ సిగ్గోసిరి” అని వదిలేస్తాడేమో! ఎవరి పక్షం వహించినా నీవు హిందూ పక్షపాతివి అని లేక ముస్లిం పక్షపాతివి అని నిందింపబడే అవకాశము కలదు – ఆయన లేక ఆమె లేక అది నిందను ఖాతరు చెయ్యకపోయినా.

మజీదు చేరారిరువురు – ఒకళ్ళు ఆకలివల్ల కాలీడ్చుచు, మరొకరు కాలుకు సత్తువ తెచ్చుకుని. యాభై ఏళ్ళ గడ్డపాయనను, చిలుము కూడా పీలుస్తున్నాయనను గురువు అడిగాడు: “భాయీ! ఇక్కడే కదా పూర్వం శివాలయం వుంటూ వచ్చిందీ?” భాయీ అని గౌరవ సూచికంగా అన్నాడో, నిజంగానే సాటి మానవుడిని సోదరుడిగా భావించవలెను అని నమ్మడం చేతనో తెలియదు. “హా సైతాన్కా ఘర్!” అని ఉత్తరమిచ్చాడు పుల్ల విరిచినట్టు. “ఏం పాట్లొచ్చాయి దేవుళ్ళకి” అని గురువు జాలిపడ్డాడు. దేవుళ్ళవి కావు పాట్లు, దేవుళ్లను నమ్ముకున్నవాళ్ళవి అని మనం గ్రహించగలం. “సాయిబు గారు! ఈ వూళ్ళో చేబ్రోలు వారుండాలి; ఉన్నారా? ఈ దేవాలయం దగ్గిరే [సైతాన్కా ఘర్ చెంతనే అనో ‘మన’ మజీదు దగ్గిరే అనో అనవలసింది.] వారి బస వుండేది, అనగా ఇప్పుడు మీ మసీదు దగ్గరే!” అని గురువు ఆత్రుతతో అడిగాడు. గురువు ఇంటి పేరు చేబ్రోలు కాదు. “లేదు” అన్నాడు చిలుము మనిషి అచ్చ తెలుగులో [బహుశా యాస లేకుండా, బ్రాహ్మణ ఉచ్ఛారణతో].

చేబ్రోలును కథలోకి ఊరికే చొప్పించలేదు గురజాడ. దాన్ని చిన్న కాశీ అని పిలిచేవారు. దానిలోని భీమారామం ఆంధ్రదేశ ఐదు ‘ఆరామ’క్షేతాలలో ఒకటి. పురాతనకాలం నుంచీ అవి ప్రధానంగా ముందరి చారిత్రకకాలంలో శివక్షేత్రాలే అయినా వాటి బౌద్ధ మూలాలు అంతకన్నా ముందరివి అని చరిత్రకారుడు ఇంగువ కార్తికేయ శర్మ అన్నారు [Buddhist Vestiges of Andhradesa, Triveni, July-September, 1994}. బౌద్ధ స్తూప స్తంభాలను అమరావతి, ద్రాక్షారామంలో శివలింగాలుగా ఎలా పరిగణించారో మరో పుస్తకంలో చెప్పారు. పదేళ్ల క్రితం పురావస్తు తవ్వకాలలో కూడా బౌద్ధ అవశేషాలు చేబ్రోలు భీమేశ్వరాలయాన్ని ఆనుకుని వెలువడ్డాయి, ఆ తరువాత తవ్వకాలను ఆపుచేశారు. కథలోని శ్రీకాకుళాక్షేత్ర విధ్వంసానికి విలపించే నారాయణకు చేబ్రోలు ఉదంతాన్ని ఎత్తిపొడుపుగా, ఊరటగా గురజాడ ప్రస్తావించుంటే ఆశ్చర్యపడక్కరలేదు.

ఓ హేన్రి మలుపు: రామావధాన్లు, లక్ష్మణభొట్లు గురించీ అడగగానే విద్యుద్ఘాతం తగిలింది కొత్త సాహెబుకి. చేతి నుండి చిలుము నేలరాలి ముక్కలై నిప్పులు నాలు దిసెలా చెదరా, “నారాయణా!” అని సఖేదముగా పిలిచెను. “మావా! నువ్వా!” నారాయణ భట్టు ప్రతిస్పందించను.

చాలా ప్రశ్నలు తలలెత్తుతున్నాయి. కేవలం మేనమామల గురించో, [పుల్లా అన్నట్టు] గోపురం గురించో కాశీ నుంచీ పనిగట్టుకుని వచ్చాడా? శిష్యుడికి ఏ విధంగా గురువు? భగవంతుడిని గురువుగా, తనను తాను శిష్యుడిగా భావించాడు కబీర్. పుల్లాభొట్లను దేవుడిగా భావిస్తే ఆయన తన శిష్యుడు నారాయణకు హితబోధ చేస్తున్నట్లుంది. ఈ ఊళ్ళో శిష్యుడిగా ఎవరు దొరకలేదా మరో ఊరి పుల్లను స్వీకరించాడు? కూడదనేమీ లేదు. ఒకడే ఉన్నట్టున్నాడు శిష్యుడు!? చినమామ లక్ష్మణభట్టు మాత్రమే మిగిలాడు, మరి పెద్దమామ ఏమైనట్టు? చంపెయ్యలేదుకదా మజీదు ఏర్పడుతున్న సందర్భంలో? చిన్న మామ తానంతట తానే మతం స్వీకరించాడా ఊరు ఒదిలిపోవడంకన్నా మతం మార్చుకోడం మేల్ అని; బలవంతపు బ్రాహ్మణార్థమా? మతం పుచ్చుకున్నాడు బాగానే వుంది; హిందువులకు తావళంలా సాయెబుకు చిలుము అవసరమా, అది ఏదన్నా ఒక అంశాన్ని చెప్పడానికి, హాస్యానికి కథకుడు వాడుకున్న ఒక సాధనమా? కామ్రేడులలా మతం మత్తుమందు అని సూచించడము కాదు అనలేము. తీర్చలేని కష్టం దాపురించి సమాధానపడుతున్న వేళ ఒక ఆత్మీయుడిని చూసినట్టు లక్ష్మణభట్టు పిలుపులో ఖేదం ధ్వనించిందా? లేక చూసి చిరకాలమైందనా? నారాయణ తన చినమామను గుర్తు పట్టలేక పొతే [గడ్డం, చిలుముతో మజీదులో కాపురమువున్నందుకు] అర్థం కలదు. నారాయణను అంతలా ఎందుకు గుర్తు పట్టలేకపోయినాడు? చిలుము నేల రాలేంత తత్తరపాటు లక్ష్మణభట్టులో ఎందుకు కలిగింది? కలిగిన ఓర్చుకోలేని బాధవల్ల కావచ్చు, మతం మారినందుకు అపరాధభావం వల్ల కావచ్చు. మతమార్పిడి వల్ల వాళ్ళ బంధుత్వం పోయింది; అనురాగం ఎంతవరకు నిలిచి ఉంటుందో తెలియదు. చేబ్రోలు వారికీ దేవాలయ పౌరోహత్యం బతుకుతెరువయ్యుంటుంది. యేపాటుకన్నా సాపాటుమిన్న.

మతాలూ మారినా, గుళ్ళు గోపురాలు కూలినా మాతాతీత మానవత్వం గుబాళిస్తుండాలి అని గురజాడ భావననుకుందాం. మానవత్వమే ఒక మతంగా మారాలన్న అభిప్రాయం గురజాడకుంది, ‘మానవత్వ మతం’ పెట్టిన Aguste Comte తో కొన్ని విషయాల్లో ఏకీభవించలేకపోయినా. Comte మనిషినే సబ్జెక్టుగా, ఆబ్జెక్టుగా భావించాడు తన కొత్త మతంలో. మామా అల్లుళ్ళు ఒకరినొకరు ఆత్మీయంగా గుర్తుపట్టి పిలుచుకోడం ఆ మానవత్వ భావనను సూచిస్తుంది. మతం మార్చుకున్నవాడికి, మార్చుకోనివాడికీ ఉన్న బంధుత్వ నామధేయాలు మారలేదు. ఇప్పుడు వేరువేరు మతాల వారైనా బంధుత్వం కొనసాగాలన్న ఆకాంక్ష ఇరువురిలో ఉందో లేదో. దేవుళ్ళు [ఆకాశవాణి లేక అశరీరవాణి ద్వారానన్నా, నూతి నుంచన్నా] సమాధానాలిస్తారన్న నమ్మకం మనకుండాల. గుడిని కూల్చి మజీదును కట్టటంలోని దుర్మార్గం గురించీ లేదు. కేవలం పేకమేడ కూలినట్లు సాగింది కథ. గోపురం సిగ్గోసిరి; కడుపే కైలాసం అని మరో సందేశం.

ఆ రెండు మతాలు పరస్పర విమతాలు. గురజాడకు రెండూ విమతాలే. ఆచరించకపోయినా బౌద్ధం ఆదరణీయమే. తూర్పు దిక్కుకు ప్రాధాన్యత, వేషభాషలు, దేముడిని కొలిచే విధానము, విగ్రహారాధన, పఠించే గ్రంథాలు, తిండి, ఆచారాలు ఆలయనిర్మాణ విధానం ఒక మతానికి ఒకలా; ఏ విగ్రహానికి తావులేని మజీదు, ప్రార్థనా విధానము, ప్రార్థనకు వెళ్ళబోయేముందు చేసుకునే శుభ్రతా చర్యలు, ప్రార్థనలో వాడే భాషా, పవిత్ర గ్రంథం, ప్రవక్త ఒక మతం సొంతం – విగ్రహం ఆ మతం శత్రువు, గుడి సైతాన్కా ఘర్. దీపారాధన, హోమం చేసి అగ్నిని ఒక మతం పూజిస్తే చిలుములోకి దాన్ని మరో మతం వాడుకుంటుంది.

మతము-విమతము అన్న కథను రెండు దృక్కోణాల నుంచీ చూడాలి – ఒకటి సామాన్య మానవుడిది, మరొకటి కబీర్ లాంటి తత్త్వవేత్తది. గురజాడ కబీర్ దృష్టికోణం నుంచే రాశారు. అల్లా మజీదులోను, రాముడు నీవు యాత్రకువెళ్లి చూసే విగ్రహంలోనూ ఉంటే బైటి ప్రపంచం ఎవరిది, అక్కడ జరిగేవి వాళ్లకు ఎలా తెలుస్తాయి? అన్నది కబీర్ తత్త్వం.

అలా అని సముద్రపు ఒడ్డున మనం పాదంపెట్టి కట్టుకుకున్న ఇసుకగూడును కెరటం వచ్చి సమం చేసినా అయ్యో అన్న పదాన్ని పెదవులు విడవకుండా వుండవు. ఆ గుడి ఒక సృష్టి, ఒక కళ, ఒక వారసత్వ సంపద, లక్షలాది జన నమ్మకం. ఆత్మగౌరవానికి విసిరే సవాలు. అవేమీ కాదు అని అనుకోగలిగితే అనుకోవచ్చు – సాధ్యపడాలి! కనీసం ఒక కుటుంబంపై దాని ప్రభావాన్ని మానవతా దృష్టితో చూడవలసిన పని లేదేమో, ఒక చెంప మౌలిక మానవసంబంధానికి ఆకాశమెత్తు పీట వేస్తున్నపుడు, హృదయానికి తావివ్వని మానవమతానికి మనుగడ కలదా? లేదని అర్థం!

అవసరాల సూర్యారావు అది పూర్తి కథ అవునా కదా అన్న విషయంలో సందిగ్ధతను వ్యక్తం చేశారు. కొందరు ఇది అసంపూర్తి కథన్నారు. సెట్టి ఈశ్వరరావు నార్ల ఏమన్నారో చెప్పి మిన్నకున్నారు. ఇది అర కతా, పావు కతా, ముప్పావు కతా అన్నది కొలిచిచూడటం అసాధ్యం. ఈ విషయమై నార్ల వెంకటేశ్వరరావు: “ఇది అసంపూర్తి కథ అనడం వెర్రితనం కాదా? అంతే కాదు గురజాడ పరిణిత నైపుణ్యానికి [అలా అనడం] అపచారం కాదా?” గురజాడ ఆ కథ ద్వారా అసలు ఏమి చెప్పదలచుకుని చెప్పలేదో తెలిసినపుడు అది పూర్తి కథ అవునా కాదా అన్నది తెలుస్తుంది. లేనపుడు మనకు దక్కినదానిని పూర్తికథగా భావించదానికి వీలుంటే ఆలా భావించి తీర్పు ఇవ్వాలి. దాన్ని అంతటితో ముగిద్దామని రచయితా ఆ పనిచేసినట్టు భావించినా – అది ఎన్నో విషయాల జోలికి పోలేదు; అంచేత అసంపూర్తి కథ అనగలమా? భగవానుడు నీ చెంతనే వున్నాడు, గుడిలో మజీదులో లేడు మానవత్వ సంబంధానికి అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండనే కబీరు తత్త్వం, “దేవుళ్ళ” సంగతి “దేవుళ్ళకు” వదిలేయండి అనే అసలు విషయాన్నీవాకృచ్చిన పిదప, మిగతా విషయాలు అధికప్రసంగం అని అనుకోమనవచ్చు. మనిషి దేవుడి సృష్టి అవునో కాదో తేల్చి చెప్పటం కష్ట; దేవుడు మనిషి సృష్టి అనడం తేలిక, ఎక్కువ నిజం.

గురజాడ కథనరీతి ననుసరించి కథ రాసేటప్పుడు అన్నివేళలా అక్షరాలను వరుసపెట్టక్కరలేదని, వదిలేసే ఖాళీలు మనం చదవగలగాలే కానీ అక్షరాలను పఠించినదానికన్నా దివ్యంగా అర్థం చేసుకోవచ్చని తెలుసుకుంటాం. ఇంత క్లుప్తంగా, పదాలు వజ్రాలన్నట్టు, అర్థాలనూ అనర్థాలనూ మీరే వెదుక్కోండని; ఇలా అడుగడుగునా ప్రవహ్లికలతోటీ రాసిన మరో తెలుగు కథను నేను చదవలేదు. నేను చదివింది తక్కువ!

మీ పేరేమిటి?

ఈ కథను రామతీర్థం బౌద్ధ పురావస్తు త్రవ్వకాల నేపథ్యంగా రాసినది. Alexander Rea [1858-1924] పురావస్తు శాఖ దక్షిణ కేంద్ర అధికారిగా త్రవ్వకాలను పర్యవేక్షించారు. 1908 -09 సంవత్సరం పంపిన నివేదిక ప్రకారం ఆ పని ఆ సంవత్సరం మొదలయింది. ఈ కథ 1910లో ‘ఆంధ్ర భారతి’ ఏప్రిల్, మే, జూన్ సంచికలలో ప్రచురితమయింది. ఆ చారిత్రక సత్యాలతో తు.చ. తప్పకుండ కథను రాయవలసిన అవసరంలేదని గురజాడ భావించినట్టు గమనించవచ్చు. ఆ ఊరికి మారుపేరు కూడా పెట్టారు. కథలోని విషయాలు ఎక్కువభాగం కల్పితాలు అయుంటాయి. పాత్రలను నిజజీవితంలోని కొందరు వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని చాలావరకు కల్పించి వుంటారు.

ఒక శిష్యుడు ప్రథమ పురుషలో కథను ఆరంభించగా, అసలు కథను గురజాడ ముఖ్యబాకాగా భావించదగిన శాయన్న భుక్త వినిపిస్తాడు.

పురాణాల గురించీ శిష్యులు శంకలు వేస్తే గురువు శాస్తుర్లు వాళ్ళను బౌద్ధులు అని తిట్టేవాడు. “బౌద్ధులు యెషువంటివారు శాస్తుర్లు గారు?” ఒక శిష్యుడు కొంటెగా అడిగాడు. గురువు పరిజ్ఞానం మీద అతగాడికి పూర్తి నమ్మకం లేదనుకోవాలి. పైగా తన గురువును పేరుపెట్టి పిలవడము అసాధారణం. వచ్చే ఆదివారం పువ్వుల తోటలో ఉపన్యాసం ఇస్తానన్నాడాయన. ఆ తోట విజయనగరంలో ఉందని అవసరాల సూర్యారావు అన్నారు. ఒక డైరీలో గురజాడ రాసుకున్నదానినిబట్టి ఆ పెద్ద పూలతోట ఆ ఊరి అప్పయ్య గారిది. అందులో గురజాడ పచార్లు చేసేవారు.

అనుకున్నట్లు రెండో చోట సాయంత్రం నాలుగు గంటలకు కలిశారు. పది నిమిషాల ఉపన్యాసం అయిందో లేదో ఒక శిష్యుడు దొంగను పట్టుకున్నట్లు “మీరు చెబుతున్నది సర్వ దర్శన సంగ్రహము లోది కదండీ?” అన్నాడు. చదివి నేర్చుకోడం, ఆలా నేర్చుకున్నది శిష్యులకు చెప్పడం ఏ గురువైన చేసేదే కదా! ఆ ప్రసిద్ధ గ్రంథం మాధవ ఆచార్య రాశాడని కొందరు కాదని కొందరు అంటారు. అయన వివరాలు అనేక విధాలుగా ఉన్నాయి. అలాంటి కొన్ని: ఓరుగల్లుకు చెందిన ఒక నియోగి [తరువాత విజయనగర సామ్రాజ్యస్థాపనలో హస్తమున్న విద్యారణ్య స్వామి] సంస్కృతంలో రాసింది. ఆయన ఒకప్పుడు శృంగేరి శారదా పీఠాధిపతి అని గూడా అంటారు. ఆ మాధవ ఆచార్య 14వ శతాబ్దంలో 16 దర్శనాల గురించి రాశాడు బౌద్ధ, నాస్తికాలతో సహా. అందుచేతే బౌద్ధ, జైనాలు కొందరు అనుకునేట్టు మతాలుగా కాక దర్శనాలుగా గ్రంథస్థమయ్యాయి. అప్పటికే దేశంలో ఇస్లాం బాగా వ్యాపించి హిందువులు దానిని సమస్యగా భావిస్తున్నా, ఆ కారణంగానే విజయనగర సామ్రాజ్యానికి అంకురార్పణ జరిగినా దాన్ని చేర్చలేదు.

దానిని ఆంగ్లంలోకి తర్జుమాచేసిన E.W. Cowell, A.E. Gough అసలు మూలాల మీద కాక బ్రాహ్మణ వాదనల మీద ఆధారపడి బౌద్ధం గురించీ రాసినట్టు తోస్తోందన్నారు. అందులో బుద్ధుడి గురించి ఏమీ రాయలేదు; కాస్తో కూస్తో అతని తత్త్వం గురించేగాని. అయినా అది చదవటంవల్ల శాస్తుర్లుకు బుద్ధుడు నాస్తికుడు కాదు అన్న నమ్మకం కలిగింది. శిష్యులు వేసే ప్రశ్నలు కారణంగా, బౌద్ధం నాస్తికమనే స్థిరాభిప్రాయం వల్ల గురువు అలా అనుంటాడు. ఆచార్య ఆ రెండింటికీ సమాధానాన్ని ఇవ్వలేదు గ్రంథంలో. బౌద్ధం నాస్తికమే కాదు పిసరంత కూడా అని చెప్పడానికి వీలు లేదు. ముందునుంచీ చాలాకాలంగా వున్న చార్వాకం నీడ బౌద్ధం మీదుంది. దేవుని ఉనికి గురించీ అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని బుద్ధుడు దాట వేస్తూ వచ్చాడు. ఆ విషయాన్ని తాను పట్టించుకో దలచలేదని సమాధానం ఇచ్చాడు. కార్యకారణ సంబంధాన్ని మాత్రం నమ్మాడు.

బౌద్ధం గురించీ గురువుకు శంక ఉన్నట్టే, శిష్యులకు పురాణాల గురించీ శంకలున్నాయి. “వెర్రి పురాణగాథలు” అని స్వయంగా గురజాడ మరోచోట ఈసడించారు – “అన్నీ వేదాల్లోనే వున్నాయిష” అని వ్యంగ్యంగా కన్యాశుల్కంలో అనిపించినట్లు.

పురాణం అంటే ఐదు లక్షణాలుగల చరిత్ర అని ఒక అభిప్రాయముంది. దేశీ, విదేశీ చరిత్రకారులు వీలయిన చోట, అవసరమయిన చోట పురాణాలలోని విషయాలను ముడిసరుకుగా వాడుకున్నారు తూకం వేసుకుని, గీటురాయిని ఉపయోగించీ. అవి కొంతమేరకు అభూతకల్పనలనిపిస్తాయి. అవి పూర్తిగా వెఱ్ఱివని అనుకోకపోబట్టి H.H. Wilson, Eden Pargitor లాంటి ఓరియెంటలిస్టులు కొన్ని పురాణాలను ఆంగ్లంలోకి అనువదించారు.

సంస్కృతంలోని ‘బుద్ధచరితను’ ఒక శిష్యపరమాణువు నుంచీ తీసుకుని తరువాత గురువు చదివాడు. కాళిదాసు కన్నా ఐదారు శతాబ్దాల ముందున్న బౌద్ధభిక్షువు అశ్వఘోషుడు అన్న మారుపేరుతో ఆ కావ్యాన్ని సనాతన సంస్కృతంలో కరుణాత్మకంగానూ, అంతా కంటితో చూసినట్టుగానూ రాశాడు. బుద్ధుడు మరణించి [మరణం క్రీ.పూ. 477 లో] అప్పటికి ఐదొందలేళ్ళ కాలం ఫైన గడిచింది. రాసింది బౌద్ధ భిక్షువు కనుకను, బుద్ధుడి మరణం తరువాత 500 ఏళ్లకు సంభవించడం వలననూ అందులో చారిత్రక సత్యం ఎంతో చెప్పలేము – కంటితో చూసినవాటినే అబద్దాలపుట్టగా సృష్టిద్దామన్న బలమైన కోరికతో మనిషి వేధించబడుతున్నపుడు. అందులో ఏనుగు యశోధర గర్భంలోకి ప్రవేశించడం లాంటి అద్భుతాలున్నాయి. రచనపై రామాయణ ప్రభావముంది.

కథ తృతీయ స్థలి క్లాసులోకి మారింది. అప్పటికి ‘బుద్ధచరిత’ చదివున్న శాస్తుర్లు బుద్ధుడు శ్రీమహావిష్ణు అవతారమే అని ధ్రువీకరించాడు. మూడు/నాలుగవ శతాబ్దపు మత్స్య పురాణం నాటికే బుద్ధుడు తొమ్మిదో అవతారం అవడం మిగతా పురాణాలు అలా పరిగణించడం జరిగింది; బౌద్ధులు శ్రీమహావిష్ణుగా భావించడమూ జరగకపోలేదు. అయినా పండితుడైన శాస్తుర్లుకు అంత ఆలస్యంగానూ, ‘బుద్ధ చరిత’ చదివే దాకానూ నమ్మకం కలగలేదేమో!

శాస్తుర్లు అజ్ఞానా? కాదు. ‘నేను’ అంటాడు – శాస్తుర్లు వంటి గురువులు లోకంలోనే లేరు; కాశీవాసం చేశాడు, అక్కడ తర్క శాస్త్రం అభ్యసించాడు; దేశంలోనే అంతటి తార్కికుడు లేడని ప్రతీతి; కావ్యాలలో మహారసగ్రాహి [కానీ బౌద్ధం గురించీ తెలియదు! మహాకావ్యం బుద్ధచరిత చదవలేదు!] సత్యకాలపు మనిషి [అంటే అమాయకుడా, లోకజ్ఞానం లేనివాడా?] పాండిత్యం, సత్యకాలం ఆ బుర్రలో ఎలా ఇమిడాయో అని ‘‘నేను” ఆశ్చర్యపడుతుంటాడు.

ఒక శిష్యుడు వ్యంగ్యంగా క్రీస్తును పదకొండవ అవతారంగా చెయ్యడం సాధ్యంకాక వడబడి ఊరుకున్నాం అన్నాడు. క్రీస్తు పదకొండో అవతారమయితే పెనుప్రమాదం ఉండదు. దివ్యజ్ఞానసమాజం వారు క్రీస్తు కృష్ణుడి అవతారంగా భావిస్తారు. మైత్రేయ మహర్షి క్రీస్తే అని నమ్ముతారు. గురువు గారికీ ఆ విషయాలు తెలియకపోవడం వలననెమో, ఆ పుస్తకం చదివే వరకు శిష్యులను బౌద్ధులు అని “తిట్టటమే” గాక కిరస్తానీలు అని కూడా ఆశీర్వదిస్తుంటాడు. బైబుల్ చదివితే కిరస్తానీలు అన్నపదాన్నీ తిట్టుగా ఉపయోగించుకోవడం మానుండేవాడేమో.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here