మహాప్రవాహం!-11

0
12

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మంగలి శరబయ్య జీవితం కూడా కాలానుగుణంగా వచ్చిన మార్పుల బారిన పడుతుంది. రెండు మూడేళ్ళుగా ఆ ఊర్లో రెండు మూడు మంగలి షాపులు వచ్చాయి. ఇది వరకులా ఎవరూ ఇంటికి పిలవడం లేదు. స్వతంత్రంగా బతికిన మనిషికి ఇంకో చోట కూలి పని చేయాలంటే కష్టమే. అయినా తప్పదు. తన దూరపు బంధువు తిక్కయ్య శాపులోన పనికి కుదురుకుంటాడు శరబయ్య. ఈ విషయం భార్య రామక్కకి చెప్తాడు. సరే చేసేదేముందని అంటుందామె. కొడుకు మాదవ లోపలికొచ్చి అమ్మతో ఏదో మెల్లిగా చెప్తాడు. ఇంతలో శరబయ్య తమ్ముడు సుంకన్న వస్తాడు. బ్యాండుమేళం వాళ్ళు వచ్చాకా, సన్నాయి మేళానికి విలువ పోయిందనీ, కూలీ పనులు కూడా దొరకటం లేదని బాధపడతాడు. మీ అన్న పరిస్థితి కూడా అలానే ఉందని అంటుంది రామక్క. కాల్వబుగ్గ రామలింగేశ్వర సామి దేవస్థానంలో సన్నాయి వాయించడానికి పని దొరికిందని, నెలకు నూట ఎనభైరూపాయల జీతము వస్తుందని చెప్తాడు సుంకన్న. తన భార్యకి దేవళంలో కసువూడ్చే పని దొరకచ్చు అంటాడు. కాసేపయ్యాకా, తనకి డబ్బు కావాలని ఇల్లు అమ్మి తన వాటా పైకం ఇచ్చినా సరే, లేకపోతే ఇల్లు ఉంచుకుని ఆ డబ్బేదే నువ్వే ఇచ్చినా సరే అని అన్నని అడుగుతాడు. ఇట్లా అడగాల్సి వచ్చినందుకు సిగ్గుగా ఉందని రోదిస్తాడు. అప్పుడు మాదవ తన ఆలోచన చెప్తాడు. వెల్దుర్తిలో తన నేస్తంతో కలిసి చెప్పుల షాపు పెట్టుకుంటానని, కొంత కాలం కష్టపడితే అందరం బాగుండవచ్చని అంటాడు. అందరూ ఆలోచించి సరే అనుకుంటారు. ఆ ఇంటిని రుక్మాంగద రెడ్డికి అమ్మేసి ఊరు విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. దావీదు మార్తమ్మ గంజి తాగి ఇంటి బయట కూర్చుంటారు. అటుగా వెళ్తున్న కృష్నదాసు వీళ్ళని చూసి పలకరిస్తాడు. ముగ్గురూ తమ జీవితాల గురించి, కాలం తెచ్చిన మార్పుల గురించి మాట్లాడుకుంటారు. కాసేపటికి వెళ్ళిపోతాడు కృష్నదాసు. వాళ్ళిద్దరూ తమ కూతురు మేరీ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో పోస్టు మాన్ వచ్చి మేరీ నుంచి వచ్చిన ఉత్తరం ఇస్తాడు. ఏం రాసిందో చదివి చెప్పమని అడిగితే, మీ బిడ్డ పరీక్షలు నెలాఖరికి అయిపోతాయట, వెంటనే బయల్దేరి ఇంటికి వస్తుందట అని చెప్తాడు పోస్ట్ మాన్. దావీదు, మార్తమ్మలు సంతోషిస్తారు. పిల్ల కోసం అన్నీ సిద్ధం చేస్తారు. మేరీ వచ్చే రోజున తల్లిదండ్రులిద్దరూ బస్టాండు దగ్గర ఎదురుచూస్తారు. పది ముక్కాలికి బస్ వస్తుంది. మేరీ దిగుతుంది. కూతురితో కబుర్లు చెబుతూ ఇంటికొస్తారు. తల్లిదండ్రులకి చిరుకానుకలు తెస్తుంది మేరీ. తనకొచ్చిన స్కాలర్‍షిప్ డబ్బులలోంచి వంద రూపాయల నోట్లు రెండు తీసి తండ్రికిస్తుంది. ఇక చదవండి.]

[dropcap]“దు[/dropcap]డ్డు నీవే పెట్టుకోమ్మా! నీకే శానా కర్చులుంటాయి” అన్నాడు దావీదు.

“నా దగ్గర ఉన్నాయిలే నాయినా” అన్నది మేరీ.

“కాపీ తాగుదువుగాని ఉండమ్మ” అని పొయ్యి మింద డికాసనుకు నీల్లు బెట్టింది మార్తమ్మ.

“ముందు స్నానం చేస్తానమ్మా” అంటూ వేరే చీర జాకెట్టు లంగా బ్యాగు లోంచి తీసుకొని ఇంటెనక ఉన్న జల్లాది (స్నానాల గది) లోకి పోయింది. దానికి పైకప్పు లేదు. చుట్టూ మనిషి కంటె ఎత్తున దడి గట్టి ఉన్నాది.

మేరీ తానం జేసి వచ్చేటప్పటికి మార్తమ్మ కాపీ చేసింది. బిడ్డ తెచ్చిన స్టీలు గ్లాసులోనే పోసి యిచ్చింది.

“ఇంత కాఫీ నాకొక్క దానికా” అంటూ ఇంకో గ్లాసులో కొంచెం పోసి, మరొక సిల్వరి గ్లాసులో కూడ పోసి ముగ్గురికి సర్దింది.

రెండు స్టీలు గ్లాసులు అమ్మకు నాయినకూ యిచ్చి, వాండ్లు వద్దన్నా యినకుండా తాను సిల్వరి గ్లాసులో తాగింది.

తర్వాత మార్తమ్మ ఉప్పమా పెట్టబోతే, దాన్ని గుడ్క ముగ్గురికీ పంచిందా పిల్ల.

“వంట చేస్తా. ఆ ఉప్పమా యామూలకొస్తాది?” అంటా మార్తమ్మ లేవబోతూంటే బలవంతంగా కూసోబెట్టింది.

“ఇంకో యాడాది ఉంటే డిగ్రీ అయిపోతుంది నాయినా. తర్వాత ఒక సమ్మత్సరం బి.యిడి జేయాలనుకుంటున్నా. బి.యిడి ఉంటే టీచరు ట్రయినింగ్ అన్న మాట. డిగ్రీ వరకు మనకు ప్రభుత్వమే ఫీజులు, హాస్టలు అన్నీ సమకూర్చినది. బియిడిలో సీటు వచ్చినా మనకు కొంత కర్చు ఉంటుంది. అందుకే నేను డిగ్రీ లో జేరినప్పటి నుండి మా వార్డెను పర్మిషను తీసుకొని, సాయంత్రం ఆరు నుండి ఎనిమిది వరకు రెండిండ్లల్లో టెంతు పిల్లలకు ఇంగ్లీషు లెక్కలు ట్యూషను చెబుతున్నాను. మొత్తం ఎనిమిదిమంది పిల్లలున్నారు. ఒక్కొక్కరు నెలకు ముపై రూపాయలిస్తారు. అంటే ఎంతయింది? రెండు వందల నలభై. ఆ డబ్బు కూడబెట్టుకుంటున్నా. ఎందుకంటే గవర్నమెంటు కాలేజీలో బి.యిడి సీటు రాకున్నా ప్రయివేటు కాలేజీలో చేరినా, శానా డబ్బు అవసరం ఐతాది. బి.యిడి అయినంక టీచరుద్యోగం వస్తే మిమ్మల్నిద్దర్నీ ఈ ఊర్నించి తీసుకుపోతాను. ఏ లోటు లేకుండా చూసుకుంటాను” అన్నది బిడ్డ. ఆ యమ్మ కండ్లు మెరుస్తాండాయి.

వాండ్లకు చదువుల మీద అంత అవగాహన లేకపోయినా, బిడ్డ చెప్పింది అర్థమయింది. తన భవిష్యత్తు కోసరం ఆ పిల్ల కస్టపడి ప్రయివేట్లు చెప్పి సంపాయించు కుంటూందని, ఆ డబ్బుతోనే తమ కోసరం అన్నీ తెచ్చిందనీ గ్రయించినారు.

పైటాలకు గోగాకు ఊరిమింది, సింతాకు పప్పు, వరన్నం చేసినాది మార్తమ్మ.

“హాస్టళ్ల రుచీపచీ లేని తిండి తిన్న నా నోటికి, నీవు చేసిన వంట అద్భుతంగా ఉందమ్మా!” అన్నది మేరీ.

రెండు రోజుల్లో ఆ పిల్లకు అర్థమయింది. తండ్రి జీతానికి వెళ్లడం లేదని. మూడో రోజు అడిగింది.

“నాయినా, సుబ్బారెడ్డి గారి వద్ద ఇప్పుడు పని చెయ్యడం లేదా?”

దావీదు తలొంచుకొని చెప్పినాడు. “అవునమ్మా, సేద్దాలు గిట్టుబాటు కావడంల్లా. ట్రాకటర్లు వచ్చింతర్వాత రైతులు జీతగాండ్లను మానిపిస్తోండారు మన రెడ్డయినా ఏం జేస్తాడు పాపం!”

“ఎన్ని దినాలయింది మానేసి?”

“మూడునెలలు పైమాటే!”

“మరి నాకు ఒక్క జాబయిన రాయించ లేదు!”

మౌనం!

“మరి ఇట్లా గడుస్తూంది?”

దావీదు అన్నాడు – “కాయకస్టం చేసెటోల్లకు లోటేముంటుందమ్మా, నేను మా యమ్మా దొరికిన రోజు కూలిపనులకు బోతండాం. మాకేం పరవాల్యా. నీ సదువు బాగ జూసుకో తల్లీ!”

మేరీ కండ్లల్లో నీళ్లు! “ఆఖరుకు కూలీలుగా మారినారా?” అన్నాది దిగులుగా.

దావీదు బిడ్డ తల నిమిరినాడు. “నిజమే! ఒక రైతు దగ్గర జీతగాడంటే ఆ స్తాయి వేరు. మొత్తం ఆ యప్ప సేద్దెమంతా జూసుకోవాల. సాలుకు జీతం, దాన్యం, గుడ్డలు, చెప్పులు, తిండీ, తిప్పలు అన్నీ చూసుకొనేవాడు రైతు. మన సుబ్బారెడ్డి, రెడ్డమ్మ నన్ను యింటి మనిసి మాదిరి జూసుకునిరి. కానీ తప్పదు మరి! కాలం అట్ల వచ్చింది. అందరితోపాటు మనమూ”

“ఒక్క సంవత్సరం, కాదు, రెండు సంవత్సరాలు తాళండి నాయినా, నేను బియిడి చేసి టీచరునయితా. మన కష్టాలు గట్టెక్కుతాయి. కానీ నా మాట కాదనకూడదు. ఈ రెండేండ్లూ నేను ఎంతో కొంత, అరవయ్యో, ఎనభయ్యా, నూరో, అది ఎంత అని చెప్పలేను. మనియార్డరు పంపిస్తా. దాంతోనే మీ జీవితం గడవదు కాని కొంత పైకర్చుల కన్నా వస్తుంది.” అనింది మేరీ. దావీదు మనసు విలవిలలాడినాది!

“తల్లీ! కలిగితే అడబిడ్డకు యింత పెట్టాలగానీ, ఆడబిడ్డ సొమ్ము తినేంత నీచానికి..”

నాయిన నోరు మూసింది బిడ్డ. “నాయినా, నీకు బిడ్డయినా, కొడుకైనా నేనే! ఈ రోజు నేను ఇట్లా సదువు కుంటున్నానంటే మీరు కదా నా ఎనకాల ఉన్నది? అట్టాంటిదేమీ మనసులో పెట్టుకోమాకండి! రెండేండ్లు కష్టపడదాము!”

దావీదు, మార్తమ్మ బిడ్డను కరుసుకుని కండ్ల నీళ్లు గార్చినారు.

నాల్రోజులుండి మేరీ వెళ్లిపోయింది.

***

పద్మనాబయ్య యింటి ముందు అరుగు మింద గూసున్నాడు. అప్పుడే ఆయన దేవతార్చన ముగించుకొని, కాపీ తాగి బయటకు వచ్చినాడు. మంచిరోజులు, ముహూర్తాలు చెప్పించుకొనీకె వచ్చెటోల్లతో నిండి పోవాల్సిన ముందరుగులు బోసిపోయినాయి. ఈ పదేండ్లు కాలం పద్మనాబయ్య సామి కుటుంబాన్ని గుడ్క అతలాకుతలం సేసినాది.

సేద్దాలు గిట్టుబాటు గాక సిన్నాసితకా రైతులు, కూలోండ్లు, బతకనీకె పొట్ట పట్టుకోని పట్నాలకు బోయినారు. రెండు మూడేండ్ల కిందట వరుకు రోజూ తాంబూలాల్లో పది పన్నెండు రూపాయలు, కూరగాయలు, దాన్యం, కందులు, ఇట్టా ఏదో ఒకటి ఆయనకు వచ్చేటివి. అవి బాగా తగ్గిపాయ.

సుంకులమ్మ గుడి కాడ ఆయనకున్న మూడెకరాల ఎర్రన్యాల వర్సగా వర్షాలు ల్యాక ఒక ఏడు పండితే ఒకడు ఎండతాండాది. దానికి ఎరువు, ఇత్తనాలు, ఇట్టా సాకి సంతరించనీకె గూడ్క ఆయనకు శాతగావడంల్యా.

ఎంతో కొంత శాస్త్రజ్ఞానం కలిగి, వేదాంతం ఎరుక ఉన్నవాడు పద్మనాబయ్య. యానాడు ముందు కాలం ఎట్టంటాదో యేమో అనే యెదారు లేనే లేదాయప్పకు.

వీదిలో ఎవరో వస్తున్నట్టనిపించి, కండ్లకు చేయడ్డం పెట్టుకోని సూసినాడు. కొండారెడ్డి వచ్చి సామి కాల్లకు మొక్కినాడు.

“ఏమిరా కొండా, ఇట్లా వస్తివి? ఇంటికాడ అందరు బాగుండారా నాయనా?” అని ఇశారిచ్చినాడు సామి.

కొండారెడ్డి ముగం ఎందుకో మబ్బుగా ఉన్నాది. “అదే బాగు సామి! నీకు తెలియని బాగా?” అని, “లోపలికి పోదాం పా సామి!” అన్నాడు.

ఇద్దరూ పడసాలలోకి బోయి కూసున్నారు. మీనాక్షమ్మ కొండారెడ్డి గొంతు విని వంటింట్లో నుంచి బయటకు వచ్చినాది. వయసు మల్లుతున్నందుకో ఏమో ఆ యమ్మ ముగం గుడ్క వాడుపట్టినాది. మునుపటి కల లేదు. సామి మాత్రం మామూలుగానే ఉన్నాడు.

“మంచినీల్లు తాగుతావా నాయినా!’ అనిందాయమ్మ.

“వద్దు అమ్మయ్యా!” అని, ఆమెకు దండం బెట్టినాడు కొండారెడ్డి. బనీను పక్కజేబులోంచి పద్దెనిమిది నూర్రూపాయల కాయితాలు తీసి, సామి సేతిలో బెట్టినాడు.

“బుడ్డలు దర తెంపితివా?” అని అడిగినాడు సామి.

“ఔ సామి – వారం దినాలముందు కింటం నూట పది రూపాయలుండె. మన రామానుజశెట్టి గోడోను లోనే గద పెట్టుకున్నాము. మూడం పోయినంక పెరుగుతాదేమోరా దర అంటాండె శెట్టి. నిన్న మాపటేలకు బోయి కనుక్కుంటే తొంబై కొచ్చినాది, మల్ల యాపురుగో పట్టినాదంటే సస్తామని తొంబైకి తెంపినాను. మనవి మొత్తం యాభై మూడు కింటాల్లు ఐదువేలకు మూడునూర్లు తక్కువ వచ్చినాది సామి. కాటా ఏసిండానికి, అమాలీలకు రెండునూర్లు పట్టుకున్నాడు (తగ్గించినాడు)” అని ఊపిరి తిప్పుకునేకె నిలబడినాడు కొండారెడ్డి.

పద్మనాబయ్య చెప్పమన్నట్లు ఆ యప్ప పక్కసూసినాడు

“ఆ యప్ప కాడనే గ్రోమోర్ సంచులు తీసుకున్నాము. దానికి ఎనిమిది నూర్లు మనవే ఆ శెట్టి కియ్యాల. బుడ్డీలు యిడిపించే కూలీ డబ్బులు నేనే పెట్టుకున్నా సామి. అది నూటిరవై. బుడ్డల ఎందుకట్టె, ఎద్దుల మ్యాత కోసరం నేను తీసుకున్నా అది రెండు నూర్లు ఏసినా.”

“ఒరే కొండా, యానాడయినా బుడ్డల కట్టకు, నోరు లేని ప్రాణుల తిండికీ పనికొచ్చేదానికి, నేను డబ్బులు అడిగినానారా? ఈసారి కొత్తగా దానికి లెక్క చెబుతున్నావు?”

తల వంచుకొని ఉన్నాడు కొండారెడ్డి. “లేదులే సామి, ఇప్పటివరకూ ఏరు”

“అట్లేం వద్దు. మ్యాత నీ పసరాలకే. బూమి నాదనే మాట తప్ప, నేను చేస్తున్నదేమి నాయనా! మీ కుటుంబం అంతా రెక్కల కష్టం చేసి కదా పంట పండిస్తాండారు?”

సామికి సేతులెత్తి మొక్కనాడు కొండారెడ్డి. “పెద్ద మనసు నీది సామీ. ఇయన్నీ పోను మూడేల ఆరునూర్లు వచ్చినాది. నీ భాగం నీకిచ్చినా” అన్నాడు.

“సరేగాని, ఈ లెక్కలన్నీ యానాడయిన నిన్ను అడిగినానా, ఎందుకు ఇంత వివరంగా సెపుతున్నావురా?”

కొండారెడ్డి బోరున ఏడుస్తూ సామి కాల్ల మింద పడిపోయినాడు. ఎక్కిల్లు పెడుతున్నాడు.

“అయ్యో, ఎందుకురా నాయనా, ఏమయిందిరా” అంటూ పద్మనాబయ్య సామి ఆ యప్పను బుజాలు పట్టుకొని పైకెత్తినాడు.

తువ్వాలతో కండ్లు తుడుచుకున్నాడు కొండారెడ్డి.

“సామీ నిన్ను సెమించు” అన్నాడు.  ఆ యప్ప గొంతులో దుక్కం గరగరమంటున్నాది. మీనాక్షమ్మ కూడ వచ్చి నిలబడినాది. “అమ్మయ్యా, నన్ను సెమించు” అని కింద కూలబడి పోయినాడు.

“ఈ ఏటి నుంచి మీ సేను సరికోరు నేను చేయలేను. నా సేనులో బోరు ఏపించుకోని మోటారు పెట్టించుకున్న కాడ్నించి కర్చులు పెరిగినాయి. బ్యాంకు లోను కట్టుకోవాల. ‘పిల్లోండ్లకు ఈ సేద్దాలు వద్దయ్యా’ అంటాది మీ నాగరత్నమ్మ. వాండ్లందరూ పై చదువుల కొచ్చిండారు. ఏమనుకోగాకు సామీ, నన్ను సెమించు.”

పద్మనాబయ్య, మానాక్షమ్మల మింద పిడుగుపడినట్లయింది. ఇంతవరకు సేనును కొండారెడ్డి సేతిలో పెట్టి ఏయదారు ల్యాకుండా ఉండిరి. దుక్కి దున్నడం కాడ్నించి, ఇత్తనం ఎయ్యటం, కాయ వలిపించడం, ఆరబెట్టడం, గోడౌనులో పెట్టి, మంచి దర వచ్చేంతవరకు ఉంచి అమ్మి డబ్బు యింటికి తెచ్చిచ్చేంత వరకు కొండారెడ్డి చూసుకునేవాడు. బుడ్డల పంట మద్యన కంది అక్కిళ్లు ఏసేవాడు. ప్రతిఏటా మూడు కింటంల కందులు పండేవి. వాటిని వేడి నీల్లు తడిపి, అరబెట్టి, ఇసుర్రాయిలో ఇసిరి, శాటలతో పొట్టంతా శెరిగి, కంది బ్యాడలు కూడ యింటికే తెచ్చిచ్చేవాడు. గట్టు మింద వేసిన మీటక్కాయలు (గోరుచిక్కుడు), బుడంకాయలు (పుల్లదోస) అన్నీ సామోల్లకీ సంతోసంగ తెచ్చిచ్చేవాడు.

ఎంత ఒత్తిడి పడుతున్నాడో పాపం. తాను చేయలేనని చెప్పనీకె రాక ఏడుస్తాన్నాడు.

కొంచేపటికి తేరుకొని సామి అన్నాడు. “మరి ఏం చేద్దామురా సేనును?”

“ఎవరికయినా గుత్త కిస్తే మంచిది సామి. కాని గుత్తలకు దీసుకునే టోల్లు గుడ్క తగ్గిపోతుండారు. ఒకేల తీసుకున్నా, యదో ఒక సొడ్డు సెప్పి గుత్త డబ్బులు ఎగనుకనీకె సూస్తారు. సేని శాదానం గుడ్క శ్రద్దగ సెయ్యరు.”

“సరే నీవే ఎవరికయినా చెప్పు మంచి వాళ్లకు”

“అట్టనే సామి. పోయొస్తా అమ్మయ్యా!” అని మల్లా ఇద్దరి కాల్లు మొక్కి ఎలబారిపోయినాడు కొండారెడ్డి. ఆ యప్ప మొగం తేటగా అయినాది. ఒక బరువు తగ్గినాది కదా!

“ఏమిటండీ, కొండారెడ్డి యిట్ల జేసె!” అన్నది మీనాక్షమ్మ. ఆమె గొంతు దిగులుతో వనికినాది.

“వాడయినా ఏం జేస్తాడే పాపం! వాండ్ల నాయిన లింగారెడ్డి, మా నాయిన వరాహమూర్తి కాలం నుండి వాండ్లే మన సేను చేస్తన్నారు. ఇన్నేండ్లకు వాండ్లతో మనకు రుణం తీరిపాయ. ఏం జేస్తాం. ‘విధిస్తు బతాయః’ అన్నారు ప్రాజ్ఞులు. సేను బీడు పెట్టలేం కద! గుత్తకు ఎవర్నయినా చూద్దాము. వచ్చినంత వస్తుంది.” అన్నాడా బ్రాహ్మడు.

“పోనీ మనమూ బోరు వేయించి, మోటారు పెట్టించుకుంటే?” అన్నది మానాక్షమ్మ.

“ఈ వయసులో అంత భారం మొయ్యలేము. నీవు చెప్పుతున్నది చిన్నా మొన్నా విషయం కాదు. శానా పెట్టుబడి కావాల. బ్యాంకులో లోన్లు దీయాల. మన శక్తి చాలదు మీనాక్షీ!”  అన్నాడాయన.

“కేదారు ఈ మధ్య జాబు వ్రాయలేదు! ఎట్లున్నాడో ఏమో పిల్లవాడు” అనింది తల్లి.

“బాగానే ఉంటాడులే. ఈ ఎండాకాలంలో మూడో సంవత్సరం పరీక్షలు రాస్తే, డిగ్రీ పూర్తయితుంది. ఏదైనా గవర్నమెంటు ఉద్యోగం వచ్చిందంటే వానికి తిరుగుండదు” అన్నాడు తండ్రి.

కేదార అనంతపురంలో సత్యసాయి కాలేజీలో బి.ఎస్.సి. మూడవ సంవత్సరం చదువుతున్నాడు. పద్మనాబయ్య పిన్నమ్మ కొడుకు అనంతపురంలోనే పౌరాహిత్యం చేస్తున్నాడు. టౌను కాబట్టి ఆయనకు ఆదాయం బాగానే ఉంటుంది. తన యింట్లోనే కేదారను పెట్టుకుంటానన్నాడు ఆయన. ఆయన పేరు పుండరీకాక్ష శర్మ. కానీ, ఒక్క రోజు కాదు ఒక్క నెల కాదు, ఎవరికైనా కష్టమే కదా అని పక్కన పెట్టినాడు కొడుకును.

అనంతపురం పాత ఊరులో ఒక రూం తీసుకుని ఇద్దరు నేస్తులతో పాటు ఉంటున్నాడు కేదార. ముగ్గురూ బి.ఎస్.సి. వాళ్లే. ఒక పిల్లవానిది మడకశిర, ఇంకొక పిల్లవానిది పత్తికొండ. ముగ్గురూ వంట చేసుకుంటారు. రెండు కిరసిస్ స్టవ్వులు, గిన్నెలు, గరిటెలు అన్నీ ఉన్నాయి. ఇంటి దగ్గర్నుంచి పొడులు, పచ్చళ్లు తెచ్చుకుంటారు. వంట చేసుకోవడానికి ఓపిక లేనపుడు, ఉడిపి హోటల్లో సాంబారు, పెరుగు తెచ్చుకుని, అన్నం మాత్రం చేసుకుంటారు.

తల్లిదండ్రుల ప్రాణాలన్నీ ఆ పిల్లవాని మీదే ఉంటాయి. తనతోపాటు ఉన్నవాండ్లు బ్రాహ్మలు కాదని కేదారూ చెప్పలేదు, వీండ్లూ అడగలేదు. టౌనులో పెద్ద చదువు చదవాలంటే ఇవన్నీ తప్పవని పద్మనాబయ్యకు తెలుసు. నెల రోజులకు సేను గుత్తకు జేయడానికి ఉప్పరి రామాంజులును మాట్లాడినాడు కొండారెడ్డి. సమత్సరానికి పన్నెండు కింటాల్ల బుడ్డలు గుత్త యియ్యనికి ఒప్పుకున్నాడు రామాంజులు.

కొండారెడ్డి యిచ్చిన పద్దెనిమిది నూర్లల్లో, మూడు నూర్లు కొడుక్కు మనీ యార్డరు చేసినాడు పద్మనాబయ్య. ఈ మొత్తం ఇంకా నాలుగు నెల్లు కొడుకు చదువుకు పనికొస్తాది. అరుగుల మీద సంపాదన బొటాబొటీగ వీండ్ల తిండికీ సరిపోతాది. పోను పోను ఎట్లా గడుస్తాదో అని తాను గూడ్క ఎదారు పడబట్నాడు పద్మనాబయ్య.

అనంతపురంలో పుండరీకాక్షయ్య షష్టిపూర్తికి, పద్మనాబయ్య దంపతులను రమ్మనమని, హోమాలు, వైదిక తంతుల్లో పెద్దవాడు ఆయన ఉంటే బాగుంటుందనీ, జాబు వచ్చింది. బంధుత్వమే గాక, అక్కడ పిల్లవానికి ముక్కునొచ్చినా, మొగలనొచ్చినా, చూసుకునే వాడు తమ్ముడే గనుక, కేదారను కూడ చూసినట్టు ఉంటుందని, భార్యాభర్తలిద్దరూ బయలుదేరినారు.

వెల్దుర్తికి బోయి, కర్నూలు – అనంతపురము బస్సు ఎక్కినారు. పుండరీకాక్షయ్య యిల్లు ‘తపోవనము’ అనే ప్రాంతంలో ఉంది. కొత్త చోటని, అమ్మ, నాయినా కనుక్కోలేరని, కేదార బస్టాండుకు వచ్చినాడు. బస్సు దిగం గానే ఇద్దర్నీ చేతులతో కరుచుకున్నాడు.

తమకంటె ఎత్తుగా ఎదిగిన కొడుకను కండ్లార జూసుకున్నారు. నీలం రంగు పాంటు లోకి, గోదుమరంగు నిండు చేతుల అంగీని దోపుకోని బెల్టు పెట్టుకున్నాడు కేదారు. టౌనులో చదువుకుంటున్న పిల్లవాడు ఎట్లా ఉండాల్నో అట్లే ఉన్నాడు.

“ఏమి నాయినా, ఇట్లా చిక్కిపోయినావేమి రా?” అన్నది తల్లి కొడుకు చెంపలు నిమురుతూ.

కేదార నవ్వినాడు. “బాగానే ఉన్నానమ్మా! నీవెప్పుడు చూసినా ఇట్లానే అంటావు” అన్నాడు.

“బాగా చదువుతున్నావేమిరా? పరీక్షలు దగ్గర కొస్తుండ్ల్యా?” అన్నాడు. తండ్రి. అది అమ్మకూ నాయినకూ తేడా!

“బాగా చదువుతున్నా నాయినా!” అన్నాడు.

రిక్షా మాట్లాడినాడు కేదారు. అమ్మను నాయినను సీటులో కూర్చొబెట్టి, తాను ఎదురుగ్గా ఉన్న చెక్క పలక మింద కూర్చున్నాడు

వీండ్లు చేరేటప్పటికి భోజనాల టయిమయ్యింది. పుండరీకాక్షయ్య, ఆయన భార్య అఖిలాండేశ్వరి వీండ్లను సాదరముగా దింపుకున్నారు. పుండరీకాక్షయ్య యిల్లు సొంతముదే. రెండు ముప్పావు సెంట్లలో కట్టుకున్నారు. ముందు చిన్న ఇనుప గేటు, దాటినంక చిన్నవరండా. దాంట్లో వెస్పా స్కూటరు నిలబెట్టి ఉంది. ముందు గదికి కటాంజనం (గ్రిల్స్) ఉంది. అది పుండరీకాక్షయ్య తన కోసరం వచ్చేవారి కోసరం వాడుకుంటాడు. గోడలకు శంకరాచార్యులు, గాయత్రీదేవి, పెన్న అహోబిలం నరసింహస్వామి, ఫోటోప్రేములలో కొలువు తీరి ఉన్నారు.

కటాంజనం గది దాటినంక పడిసాల. దానికి రెండు వైపులా రెండు పడక గదులున్నాయి. పడసాలలో నాలుగు గాద్రెజ్ కుర్చీలు, ఒక బల్ల ఉన్నాయి. పడసాల వెనక వంటిల్లు. వెనక చిన్న దొడ్డి, దాంట్లో స్నానాలగది ఒక వైపు, ఒక మూలన లెటన్ ఉన్నాయి. దొడ్డి అంతా గచ్చు చేసి ఉంది. మొక్కలు ఏవీ లేవు.

బందువులు భోజనాలకు మిద్దె మీద షామియానా వేయించినారు. షష్టిపూర్తి ‘తర్దు రోడ్డు’ లోని రామాలయంలో జరుపుతుందంట. అప్పటికీ శానామంది దగ్గరి బందువులు వచ్చిఉండారు. వంటామెను పెట్టుకున్నారు.

అందరికీ పడసాలలో విస్తర్లు వేసి వడ్డించినారు. బుడంకాయ పప్పు, చుక్కకూర పచ్చడి, మునక్కాయలు వేసిన చారు, మటిక్కాయ (గోరుచిక్కుడు) మిరపపొడి చేసినారు. చిక్కని మజ్జిగ తోసా.

కేదార తాను చదువుకోవాలని, భోజనం చేసి వెళ్ళిపోయినాడు.

“ఈ మూడు రోజులూ ఇక్కడికే రారా భోజనానికి” అని అఖిలమ్మ వాడిని పిలిచింది.

“సరే పిన్నమ్మా!” అని చెప్పి పోయినాడు వాడు.

షష్టిపూర్తి ఉత్సవము మూడు రోజులు జరిగినది. ఆయుష్య హోమము, ఏకాదశ రుద్రాభిషేకము గ్రహశాంతులు శాస్త్రోక్తంగా జరిగినాయి. పద్మనాబయ్య ప్రతి దాంట్లో తన గొంతుక లిపినాడు. ఆయనకు అన్నీ వచ్చు గాని బొమ్మిరెడ్డిపల్లెలో ఆయన విద్వత్తుతో అంత అవసరము లేదు.

బంధువులందరికీ కొత్త బట్టలు పెట్టినారు పుండరీకాక్షయ్య దంపతులు. వాండ్లు కూడ వీండ్లకు బట్టలు పెట్టినారు.

ఈ మూడు రోజులూ కేదార ఉదయం పదకొండు గంటల కల్లావచ్చి, యాజ్ఞీకం చూసి, భోజనం చేసి వెళ్లినాడు. మర్సటి రోజే అమ్మా నాయిన ఊరికి పోయేది.

ఆరోజు రాత్రి గూడ్క కేదార ఉండిపోయినాడు, పొద్దున్న అమ్మనూ నాయిననూ బస్సు ఎక్కించి పోవాలని. రాత్రి అందరికీ బన్సీ రవ్వ ఉప్మా, చట్నీ పొడి చేయించినారు. ఏడెనిమిది మంది తప్ప అందరూ వెళ్లిపోయినారు.

రాత్రి మిద్దె మింద జంపఖానాలు వేయించినారు. దిండ్లు పెట్టినారు. మార్చినెల. అందునా అనంతపురం గాబట్టి చల్లగానే ఉంది. అదీ కర్నూల్లో అయితే ఎండలు వాంచి కొడతాయి.

అందరూ సావకాశంగా మిద్దె మీద కూర్చున్నారు. పుండరీకాక్షయ్యకు ఇద్దరూ బిడ్డలే. ఇద్దరికీ చిన్న వయసులనే పెండ్లిండ్లు చేసినారు.

పెద్దల్లుడు హిందూపురం ఎయిడెడ్ స్కూల్లో తెలుగు పండితుడు. చిన్నల్లుడు బెంగుళూరు లోని కిర్లోస్కర్ కంపెనీలో పనిచేస్తాడు. పిల్లల ఎదారు లేదు వాండ్లకు. ఆయన స్వగ్రామం కదిరి దగ్గర పల్లెటూరు. ఏడెనిమిదేండ్ల కిందట్నే పిత్రార్జితం భూమిని అమ్ముకొని అనంతపురం జేరినాడు.

పుండరీకాక్షయ్య రెండు చేతులకూ నాలుగా ఉంగరాలు, మెడలో బంగారు చుట్టిచ్చిన రుద్రాక్షల దండ, అఖిలమ్మ చేతులకు బంగారు గాజులు, మామిడి పిందెల బంగారు గొలుసు, వాండ్లు ఆర్థికంగా శానా బాగుంటారని చెప్తాన్నాయి.

‘పద్మన్నయ్యా! రేపే పోకపోతే ఏమప్పా, ల్యాకల్యాక తమ్మునింటికి వస్తరి. నాల్రోజులుండి పోతే మాకూ సంతోషంగ ఉంటుంది” అన్నాడు తమ్ముడు.

“అవును అక్కయ్య, ఈ షష్టిపూర్తి గడబిడలో మీతో సరిగ్గా మాట్లాడేకి గూడ కుదరల్యా. నాల్రోజులుండండి” అన్నది అఖిలమ్మ.

వాండ్ల అభిమానానికి వీండ్ల కండ్లు సెమర్చుకున్నాయి..

“యింకో తూరి వస్తాము లేరా పుండరీ! “ అన్నాడు పద్మనాబయ్య.

కేదార కూడ అక్కడనే ఉన్నాడు.

“అయితే వీని చదువు వచ్చే నెలలో అయిపోతోంది. తర్వాత ఏం జేస్తామనుకుంటాన్నావురా కేదారూ?” అనడిగినాడు చిన్నాయన

“తిరుపతి యస్.వి. యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేయాలని అనుకుంటున్నా చిన్నాయనా!” అన్నాడు కేదారు తండ్రి వైపు భయంగా చూస్తూ.

“ఇంకా చదివిచ్చాల్లంటే నావల్ల గాదులే పుండరీ! మా ఊర్లో పరిస్తితి శానా ఘోరంగా ఉంది. ఉన్న మూడెకరాల సేను సాగు చేసే నాధుడు లేడు. పూసాటి అగ్గవకు గుత్త కిస్తిమి మొన్ననే. మన కులవృత్తికి కూడ అవకాశం బాగా తగ్గిపాయె. ఇంతవరకు వీన్ని ఇగ్గుకు రావడమే నా శక్తికి మించిన పని. ఈ డిగ్రీ అయింతర్వాత ఏదైనా ఉద్యోగంలో కుదురుకుంటే, నా నెత్తిన పాలుపోసినట్లయితాది.” అన్నాడు పద్మనాబయ్య.

తండ్రి వైపు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినాడు కేదార.

“తెలివైన పిల్లోన్ని చదువుకుంటానంటే వద్దంటావేమన్నయ్యా! ఒక్కగానొక్క కొడుకు. ఈ కాలంలో ఉత్త డిగ్రీతో ఏం ఉద్యోగాలు వస్తాయి. ఏ బ్యాంకు పరీక్షలో, రైల్వే సర్వీసు కమిషన్ పరీక్షలో రాయల. మనకా పేరు గొప్ప ఊరు దిబ్బ అని రిజర్వీషన్లు లేవు. తర్వాత బి.యిడి అన్నా చేస్తే టీచరుద్యోగం రావచ్చును. వీడన్నట్లు ఎమ్.యస్.సి. చేస్తే కాలేజీ లెక్చరర్ కావచ్చును. సరేగాని ఏ సబ్జెక్టులో చేద్దామనిరా పి.జి కోర్సు?”

చిన్నయిన మాటలతో కేదార మనసుతో ఆశలు చిగుర్లు వేసినాయి.

“కెమిస్ట్రీలో చేద్దామని చిన్నాయనా! అదైతే లెక్చరరు పోస్టు రాకున్నా కెమికల్ ఫాక్టరీలతో కెమిస్టుగా శానా – అవకాశాలుంటాయి. ఇంటరు నుంచి నా కెందుకో కెమిస్ట్రీ – అంటే ఇష్టము” అన్నాడా పిల్లవాడు.

“అన్నీ ఉన్నాయి గాని, అయిదోతనమే లేదని, నా పరిస్తితిని అర్థం చేసుకోకుండా ఆకాశానికి నిచ్చెన్లు వేస్తాండారు మీరిద్దరూ!” అన్నాడు తండ్రి.

పుండరీకాక్షయ్య కొంచేపు ఆలోశన జేస్తూ ఉండిపోయినాడు. తర్వాత పద్మనాబయ్యతో అన్నాడు.

“అన్నయ్యా, వదినే, నేను చెప్పేది నిదానంగ ఇనల్ల. ఆ పల్లెటూర్లో యింక చాలీ చాలని బతుకు వద్దంటాను. నీకున్న పాండిత్యానికి, జ్ఞానానికి, అనంతపురమే మంచిది. సేను గుత్తకిచ్చేసినారు గదా! ఆ పాత యిల్లు బాడిక్కి గూడ్క ఎవరూ రారేమో ఆ ఊర్లో! అది అమ్మేయండి. ఆ డబ్బు పిల్లోని పి.జి. చదువుకు పనికొస్తుంది.

మీ ఇద్దరూ ఇక్కడి కొచ్చేయల్ల. ఒక యిల్లు చూస్తాము. ఒక ఆరునెల్లు నీ సంగతి తెలుస్తే జనం నీకు బ్రహ్మరథం పడతారు. నీ అంత వాక్సుద్ధి లేని నేనే ఈ అనంతపురంలో బాగా నిలదొక్కుకున్నాను. విద్వత్తుతో బాటు కొంత లౌక్యం గూడ గావల్ల. అది నీకు నేను నేర్పుతాలే!”

“అసలు నేను ఎవర్నని రా ఈ మహపట్నంలో?” అన్నాడు పద్మనాభయ్య. ఆయన గొంతులో ఒక జంకు.

“నీ కెందుకు నేను చూసుకుంటాం గదా! డొక్క శుద్ధి లేని వాళ్లంతా వచ్చి సంపాదించుకుంటాంటే నీకేం తక్కువ. ఒక సత్యనారాయణ వ్రతం చేస్తే నూటపదార్లు! ఏకవార రుద్రాభిషేకం చేయిస్తే మున్నూట పదార్లు. ఇంక గ్రహశాంతులు, నీకు రానిదేముంది పద్మన్నయ్యా!”

మీనాక్షమ్మ అన్నది “ఈయనకు జ్యోతిష్యం, వాస్తులో కూడ ప్రవేశముందయ్యా మరిదీ”

“నాకు తెలియదా వదినీ, గ్రహచారం బాగులేక గ్రహణం పట్టిన సూర్యుడి మాదిరి ఆ బొమ్మిరెడ్డిపల్లెలో ఉండిపోయినాడు మా అన్నయ్య! ఇంక మీరు ఏమీ ఆలోచించాల్సిన పని లేదు మంచిరోజు చూసుకొని వచ్చేయండి. పది రోజుల్లో మీకు ఒక యిల్లు బాడెక్కు చూసి పెడతాము. ఇల్లు అమ్మేసి, వచ్చిన డబ్బు పట్టుకోని రాండి. మీకు బాగా జరుగుతుందని నేను హామీ!” అన్నాడు తమ్ముడు.

పద్మనాభయ్య మొగం మెల్లగా విచ్చుకుంది. “మా కేదార భవిష్యత్తు కంటే మాకు కావలసింది ఏముందిరా పుండరీ! నీవు అంత ఇదిగా చెబుతున్నాక రాకుండా ఉండడంలో అర్థం లేదు. సరే! అన్నింటికే ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు” అన్నాడు.

కేదార తల్లిదండ్రులను సంతోషంగా కౌగిలించుకున్నాడు!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here