మహాప్రవాహం!-13

0
11

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[అరటి గెలలు తెచ్చుకోవడానికి రాంభూపాలరెడ్డి తోటకు వస్తాడు ఖాజాహుసేను. భోం చేసి వచ్చాకా, గెలలు కొట్టిపిస్తా అని చెప్పి వెళ్ళిన రెడ్డి ఎంత సేపయినా రాడు. ఖాజాకి బాగా ఆకలేస్తుంది. ఏదైనా తింటే గాని ప్రాణం నిలవదు అనిపించి, సైకిలెక్కి నర్సాపురం మెట్ట కాడ ఉన్న హోటల్‍కి చేరుతాడు. సైకిల్ తొక్కుతూ వస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పులను తలచుకుంటాడు. అన్నిటి ధరలూ పెరిగిపోవడం, మట్టి పాత్రల స్థానంలో సిల్వరు, ప్లాస్టిక్ పాత్రలు రావడం వల్ల కుమ్మరోల్లకి ఉపాధి తగ్గుతోందని అనుకుంటాడు. ముఖమూ, కాళ్ళూ చేతులు కడుక్కుని చిన్న అరుగు మీద కూర్చున్నాకా, హోటల్ యజమాని విరూపాక్ష వచ్చి పలకరిస్తాడు. ఆయన భార్య శాంతమ్మ మంచినీళ్ళు తెచ్చిచ్చి హుసేన్‍ని కుశల ప్రశ్నలు వేస్తుంది. రెండు పూరీలు తిన్నా ఆకలి తీరదు ఖాజాకు. కాసేపటికి ఓ దోసె తెచ్చి ఇస్తాడు. దాన్ని తిని, టీ తాగి మళ్లీ తోట వద్దకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఇంతలో కుమ్మరాయన అంజనప్ప ఖాళీ కుండల బండితో అక్కడికి వస్తాడు. ఖాజాని పలకరించి, అరటి తోటలకి వచ్చావా అని అడిగితే, అవునని చెప్పి, తన గ్యెలలని బండ్లో వేసుకెళ్తామా అంటే, సరేనంటాడు అంజనప్ప. ఖాజా తోటకి వెళ్ళేసరికి రాంభూపాలరెడ్డి వచ్చి ఉంటాడు. కుమ్ముకు సరిపోయేలా 18 గ్యెలలు తెంపుతున్నారనీ, వాటిని ఎలా తీస్కువెళ్తావని అడిగితే అంజనప్ప బండి వస్తుందని అంటాడు ఖాజా. ఇకపై అరటి గ్యెలలు ఇవ్వలేనని, హోల్‍సేల్‍గా కర్నూలు వ్యాపారికి అమ్మేస్తున్నానని చెప్తాడు రెడ్డి. మూడు వందలు రెడ్డి కిచ్చి మిగతా డబ్బులు తర్వాత ఇస్తానంటాడు ఖాజా. జీతగాళ్ళకు వక్కాకు డబ్బులిచ్చి, గెలలను అంజనప్ప బండికి ఎక్కిస్తాడు. తన సైకిల్‍ను కూడా ఎడ్లబండి వెనక, గెలలు పాడవకుండా పెడ్తాడు. వెల్దుర్తిలో గెలలను దింపుకుని అంజనప్పకి ఇరవై రూపాయలిచ్చి పంపుతాడు. కాసేపటికి ఓ ట్రాక్టరు వస్తుంటే ఆపి నలభై రూపాయలకి ఒప్పించి అందులో గెలలు ఎక్కించి బొమ్మిరెడ్డి పల్లికి తీస్తుకెళ్తాడు. గెలలని కొట్టిడిలో పెట్టించి ఇల్లు చేరేసరికి మొగుడి కోసం ఎదురుచూస్తుంటుంది ఫాతింబీ. ఇంత ఆలస్యమైందేంటని అడిగితే రెడ్డి భోజానానికి వెళ్ళాడు అందువల్ల ఆలస్యమైందని చెప్తాడు. మస్తాన్ చేపలు పంపించాడని చెప్తూ, వరిబియ్యం అన్నం వడ్డిస్తుంది. చేపల పులుసు చూసి సంతోషిస్తాడనుకుంటే ఖాజా మొహంలో వెలుగు లేకపోవడం చూసి – ఆ రోజు తమ పెళ్ళి రోజని గుర్తు చేస్తుందామె. అప్పుడతని మొహంలో వెలుగొస్తుంది. భార్య చేతిని తన చేతుల్లో తీసుకుని నిన్ను ఏనాడు సుఖపెట్టలేకపోయాను అంటాడు. ఆస్తి కంటే ప్రేమ ముఖ్యమని అంటుందామె. ఇక చదవండి.]

[dropcap]ఇ[/dropcap]ద్దరూ అన్నం తినబట్నారు. “మస్తాను కోడుమూరు ఎమ్మెల్లే కాడ జీపు డ్రయివరనుకుంటా. ఎవరో ఎమ్మెల్లే సాబ్‌కు దండిగ శాపలు దెచ్చిచ్చింటారు. ఆ యప్ప మస్తాను కిచ్చింటాడు” అన్నాడు.

“బడేమియా అన్నకు మనమంటే అభిమానము!” అన్నాదామె.

తిన్నాక, బొంత పరుసుకోని పండుకున్నారు. మొగుడు యింకా పెండ్లిరోజు ‘కయాస’ లోకి రాలేదేమని బూబమ్మకు అనుమానం వచ్చినాది.

“ఏందయ్యా, వచ్చినప్పటి నుంచి సూస్తన్నా, అంత పరేశాన్ అయితుంటావు?” అనింది. ఆమె గొంతులో మార్దవానికి కరిగిపోయినాడు ఖాజా. రాంభూపాల్ రెడ్డి ఇంక మీదట అరటి గ్యెలలు ఇయ్యనీకి కాదన్నాడని, నాలుగయిదు తోటలోల్లు కలిస్తే, కర్నూలు అన్వర్ మియానే లారీ పంపిస్తానన్నాడనీ, బాడిగ గుడ్క ఆ యప్పే పెట్టుకుంటాడనీ భార్యకు చెప్పి బాదపడినాడు.

“తోటలోల్లు ఐతే పదీయిరవై గ్యెలలు ఇస్తారు. మనం అమ్ముకనీకె సాలు. డబ్బులు గుడ్క నిదానంగ యిచ్చుకుంటుంటిమి. కర్నూలు పెద్ద మండీ నుంచి తెచ్చుకోనీకె మనతోన యాడయితాది?” అన్నాడు.

పాతింబీ గుడ్క ఇది ఇని పరేశానయినాది. కాని మొగున్ని కుశీ జెయ్యనీకె, “ఏం కాదు లేయ్యా, అల్లా యాదో ఒక రాస్తా చూపిస్తాడులే” అనింది.

కుంచేపటికి మామూలయినాడు ఖాజా. “ఇయ్యాల హాసీనా జాబు రాసింది. రంజానుకు అందురూ వస్తాండారట” అనింది.

“కుశ్ కబర్ చెప్పినావు. జహంగీర్ బేటా గుడ్క వస్తాడు. వానికి రంజానుకు చుట్టీ ఇస్తారు. అయితే నేను ఈ నాలుగు దినాలు కష్టపడాల. పర్సుం దినం సుంకులమ్మ తల్లి తిర్నాల. మొన్నటి గ్యెలలు కుమ్ములోంచి దీసి, పనలు యిడిపించాల. శానామంది వస్తారు తిర్నాలకు. నీవు గుడ్క రా. అరటిపండ్ల అంగడి పెట్టుకుందాము. రేపే పోయి అంగడికి లైసెన్సీ కట్టీస్తా. పిల్లోండ్లు వచ్చే యాలకు ఎయ్యి రూపాయలన్నా కమాయించాల. అల్లునికి మటన్ ద్యావాల. ఇద్దరికీ బట్టలు పెట్టాల. జహంగర్ బేటాకు భీ బట్టలు శింపించాల. నీవు ఒక చీర కొనుక్కో.” అన్నాడు.

“మరి నీవు పైజమా కుర్తా కుట్టించుకోవా?”

“నా కెందుకు, మొన్న మొహరంకు శింపిచ్చినవుండ్ల్యా”

“అట్టా ఏం కుదరదు. ఇంటికి మాలిక్‌వి నివ్వు. మన బాదలు ఎప్పుడుండేవే.. అందురం తీసుకుందామయ్యా”

“సరేలే.”

***

సుంకులమ్మ తిర్నాల శానా బాగా జరిగింది. సుమారు పద్నాలుగు గ్యెలలు బాగా మాగి, అమ్మకానికి రడీ అయినాయి. గుడి కాడ తాత్కాలికంగా నాలుగు కత్తెలు పాతి, పైన గోనె పట్టాలు కట్టి అంగడి పెట్నాడు ఖాజా. ఆ ఒక్క రోజుకు గ్రామపంచాయితీకి పదిరూపాయలు కట్టాల. గాజులు, మసాలా దినుసలు, బొమ్మలు, మిటాయి, కారాలు, బెండ్లు, బత్తాసాలు, అన్ని అంగల్లు పెడతారు. శెరుకులు, సిల్వరి, టీలు, పిలేస్టిక్ వస్తువులు వస్తాయి. గుడుగుడాట జోరుగా నడుస్తాది.

ఖాజా, ఫాతింబీ కలిసి అంబటి పొద్దు నుంచి, శీకటిపడేంత వరకు అరటిపండ్లు అమ్మినారు. అమ్మవారి నైవేద్యానికి, ఇండ్లకు తీస్కపోవడానికి జనం బాగా అరటిపండ్లు కొన్నారు. పద్మూడు నూర్లు వచ్చినాది. రంజాను పండగ కర్చులు ఎల్లగొట్టుకోవచ్చులే అని సంబరపడినారు మొగుడు పెండ్లాము.

పండగకు రెండ్రోజులు ముందే బిడ్డ, అల్లుడు దిగినారు. అల్లుడు మామకు క్వార్టరు బ్రాందీ సీసా తెచ్చినాడు. హసీనా బెల్లం, పుట్నాల పొడి లోపలబెట్టి కర్జికాయలు చేసుకొని వచ్చినాది. వాండ్లకు యింకా కడుపు పండల్యా. రాయచూరు మాసుం బాషా దర్గాకు పోయి మొక్కుకుంటే పిల్లలు పుడతారని శానామంది చెప్పినారంట. గద్వాలకు రాయచూరు దగ్గరే. గంటన్నర ప్రయానం. ఈ పండగ బోయినంక పోయిరావాలని అనుకుంటుండారు.

ముందుదినం జహంగీరు వచ్చినాడు. వాడు నంద్యాలలో ఐ.టి.ఐ, ఎలక్ట్రిషియన్ కోర్సు చదువుతుంటాడు. ఈ ఎండాకాలం అయిపోతాంది. దాని తర్వాత యాదయినా అప్రెంటీసు జెయ్యాలంట. జహంగరు వాండ్లమ్మ మాదిరుంటాడు, తెల్లగా, అందంగా. ప్యాంటు, షర్టు వేసుకొని శానా బాగోన్నాడు. వస్తూనే.. అమ్మా, అబ్బాలకు కాళ్లకు దండం బెట్టినాడు. హసీనా వాన్ని దగ్గరకు తీసుకొనింది.

పండగనాడు అరకేజీ మటన్ కొట్టించుకొచ్చినాడు ఖాజా. ఫాతింబీ మటన్ కుర్మాతో బాటు పూరీలు, సేమ్యా ఖీర్. ఉద్దివడలు చేసింది. వరన్నంసా. వాము కారాలు చేసింది. జహంగీరు కోవాబిల్లలు అరకేజీ తెచ్చినాడు నంద్యాల నుంచి,

అందరూ అయిగా పండగజేస్కున్నారు. తాము తెచ్చిన బట్టలు బిడ్డకు అల్లునికి పెట్టినారు. జహంగరు కొత్తపాంటు షర్టూ నంద్యాలలోనే కుట్టించుకోని వచ్చినాడు. ఫాతింబీ, ఖాజ గుడ్క కొత్తగుడ్డలు కట్టుకున్నారు. అంతా సంతోషంగా ఉన్నా, యాపారం ఏమయితాదో నన్న దిగులు ఖాజాను తొలుస్తునే ఉంది. అది కనిపెట్నాడు అల్లుడు.

రేత్రి అందరూ బోజనాలు చేసి మాట్లాడుకుంటున్నారు.

“మా మామ ఎందుకో ఉండాల్సినంత కుశీగ లేడు? ఏం మామా? ఏదైన పరేశాన్ ఉందా?” అనడిగినాడు.

పాతింబీ ఇసయమంతా అల్లునితో చెప్పినాది. జహంగీర్ గుడ్క విన్నాడు.

ఖాదర్ అన్నాడు –  “నువ్వేం ఫికరు గావద్దు మామా! దునియాల కేలా యాపార మొక్కటేనా ఉండేది? ఈ బస్టాండ్లలో, సంతల్లో, తిర్నాల్లల్లో ఎన్ని దినాలు కష్టపడతావు. నా మాటిని ఏదయినా టౌను జేరండి. జహంగీర్‌కు అప్రెంటిస్ అయినంక జాబు వస్తాదని గ్యారంటీ లేదు. తురకోల్లను ఓ.సి.లు జేసింది గద సర్కారు! నన్నడిగితే ఈ యిల్లమ్మేసి, గద్దువాల కొచ్చేయుంది. అందరం ఒకసాట ఉందాము. జహంగీరు ఆడ ఎలక్ట్రీశను పని చేసుకోవచు. నీవు గుడ్క యాదయిన నీడ పట్న గూసోనే యాపారం తీసుకోవచ్చు. గద్దువాలలో పండ్లంగడి పెట్టుకోవచ్చు. ఆ వూరికి కర్నూలయినా రాయిచూరయినా ఒకే దూరం. ఓల్‍సేల్‌లో అంటి పండ్లే గాకుండా, సేపు (ఆపిల్) మోసంబీ (బత్తాయి), అంగూరు (ద్రాక్ష) ఇయన్నీ కొనుక్కోని యాడయినా సెంటరులో అంగడి పెట్కుంటే తిరుగుండదు. పక్కా యళిగె గుడ్క జరూరత్ ల్యా, నాలుగు దూలాల మీద శెక్కలు గొట్టించి దాని మంద పండ్ల బుట్టలు పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఈ ఉమర్ల నీవు సైకిలు తొక్కలేవు. తోట లెంబట పోలేవు. ఆ రెడ్డి ఎవరో మాల్ ఇయ్యననడం మనకే మంచికే అయినాది. ఏమంటావు మామా?”

జహంగీర్ అన్నాడు – “అబ్బా, బావ చెప్పింది కరెక్టు. ఎన్ని రోజులు కష్టపడతావు? అమ్మా గుడ్క వడిలి పోయినాది. నాకు అప్రెంటిస్ అయి ఉద్యోగం వస్తే మంచిది. ల్యాకపోతే నా శేతితోనే పని ఉండాది. అసులు ఐ.టి.ఐ సదువే అట్టాంటిది. బావ మాటిని ఆ పని చేద్దాము”

ఫాతింబీ అనింది “పిల్లలందరు చెప్పేది బాగుందయ్యో, మనం గుడ్క గద్దువాల బోదాము. నువ్వేమి సోచాయించకు. అల్లా మనకు భలాయీ చేస్తాడు!”

ఖాజాహుసేను నవ్వినాడు. ఆ యప్పకు పెద్ద ఎదారు తీరినట్లయింది! “సరే! మీరందరు అంతగా సెప్తాంటే కాదననీకె నోరు రావడం ల్యా. పోదాం పాండి!”

***

రుక్మాంగద రెడ్డి మాడీ (భవనం). ఆ యప్ప అరుగుల మింద గూసొని ఉన్నాడు. పైటాల బోంచేసి కుంచేపు నిద్రబోయి లేచినాడు. రెడ్డెమ్మ ఎండి గలాసుతోన కాపీ తెచ్చిచ్చినది. తాగుతా ఉంటే బయట గేటు ముందల అంబాసిడర్ కారు వచ్చి నిలబడినాది.

దాంట్లోంచి రుక్మాంగద రెడ్డి కొడుకు నరసింహ రెడ్డి దిగినాడు. డ్రయివరు కారు దీసుకుచేయి సింత సెట్టు కింద నిలబెట్నాడు. కొడుకును జూసి పెద్దరెడ్డి ముకం ఇచ్చుకున్నాది. లేచి అరుగు దిగిపోయి ఎదురు బోయినాడు.

“ఏమిరా నరసింహా, నిన్ననే వస్తానని పోను జేస్తివి రాలేదేమి? అయిదరాబాదులో పిన్నమ్మోండ్లు బాగున్నారా? వాండ్లను గుడ్క పండక్కు రమ్మని పోన్ చేసింటి గద” అన్నాడు.

“వాండ్లు రేపొస్తారు నాయినా. రుక్మిణికి రేపట్నించి సెలవులంట. మాకేమో నిన్నట్నుంచీ ఇచ్చిరి” అన్నాడు కొడుకు.

“మ్మేవ్! నర్సింహుడొచ్చినాడు!” అని అరిసినాడు పెద్దరెడ్డి లోపల రెడ్డెమ్మకు యినపడేట్టు.

రెడ్డెమ్మ బయటికి ఉరికొచ్చినాది. కొడుకును జూసి ఆ యమ్మ కండ్లల్లో ఎలుగు. శేయెత్తు మనిషి అమ్మ కాడికిబోయి అక్కున చేరుకున్నాడు ముగ్గురూ లోపలకు పోయినారు. వంటాయమ్మ బయటికి వచ్చి “సిన్న్రెడ్డీ! ఇదేనా రావడము? బాగుండావా నాయినా?” అని అడిగినాది.

“బాగుండా సునందమ్మా! నీవు బాగుంటావా?” అనడిగినాడు సిన్రెడ్డి. ముగ్గురూ రూము లోనకు బోయినారు. వంటాయమ్మ టీ తెచ్చిచ్చినాది ఆ యప్పకు. పింగాణీ కప్పు, సాసరులో పెట్టుకోని వచ్చినది. సిన్రెడ్డి కాపీ తాగడు. అయిదరాబాదులో సదువుకొనేదానికి బోయిన కాడ్నించి, ఆ యప్పకు టీ అలవాటయినాది. ఎండి గ్లాసు కూడ వద్దంటాడు, చెయ్యి కాలతాదంటాడు. ఇయన్నీ వంటాయమ్మకు తెలిసినవే.

టీ తాగుకుంట సిన్రెడ్డి నాయిన నడిగినాడు “తొగర్చేట్లో పెద్దనాయినోల్లు, కేశవ రెడ్డి అన్నోల్లు బాగుంటారు గదా నాయినా?”

“పెద్దనాయిన మెత్తబడినాడురా! పోయినేడు పచ్చవాతం వచ్చిన కాడ్నించి, బయటకి రావడంల్యా. కేశవ రెడ్డన్నను, వాని పెండ్లాన్ని, పిల్లలను గుడ్క పండక్కు రమ్మని పోన్ జేసినా. రేపో ఎల్లుండో వస్తారు.”

ఇంటిముందల చీకటి బడినాది. మాడీ అంతా లైట్లేసినారు. గాడిపాడ్లలో ఎద్దులు, ఎనుములు, బాగా తగ్గిపోయినాయి. సింత సెట్టు కింద ఎర్రరంగు ట్రాకటరు నిలబెట్టి ఉన్నాది. దాని తొట్టిని ఇడదీసి గోడవారన బెట్టినారు.

బయట నుండి బోయ శెన్నప్ప అరిసినాడు. మాడీ ముందు కావిలి ఉండీ పయిల్మాన్లు ఎవరూ తీరు. ఈడొక్కడే మిగిలినాడు. “రొడ్డీ! మాదిగ మద్దిలేటి పెండ్లాము వచ్చినది నీతోనే మాట్టాడనీకె.” రెడ్డి లేచి బయటకి అరుగు మిందకు బోయినాడు. ఆడ కుర్సీలో కూసున్నాడు. మద్దిలేటి పెండ్లాము అరుగుల కింద నిలబడి ఉన్నాది. రెండు చేతులెత్తి రెడ్డికి మొక్కినాది.

“ఏమ్మే, ఏం గావాల?” అనడిగినాడు పెద్ద రెడ్డి.

“నాయినా, పిల్లోనికి పీజు గట్టాల. పండగ కర్సులు. నీ కన్న మాకెవరుండారు? ఆ యప్ప సచ్చిపోయిన కాడ్నించి..” ఆ యమ్మ గొంతులో దుక్కం.

“సరె, సరె, మాపటేల ఇప్పుడే దీపాలు పెట్టినాము. ఏడ్యగాకు. ఎంతగావాల?”

“మూడు నూర్లన్నా యిప్పించు నాయినా”

రెడ్డి ముకమంతా సిట్లించుకున్నాడు. శెన్నప్పను పిలిచి ఏదో సెప్పినాడు. వాడు లోనకు బోయి రెడ్డమ్మ నడిగి రెండు నూర్రూపాయల కాయితాలు దెచ్చి మాదిగామెకిచ్చినాడు. ఆ యమ్మ మల్లా రెడ్దికి మొక్కి వెళ్ళిపోయింది.

కొడుకు వచ్చినాడని రెడ్డెమ్మ కోడి పలావు జేయించినాది.. నంచుకునీకె వామాకు బజ్జీలు చేయించినది. ఆ యప్ప కిష్టమని మిరియాల శారు, నూలపొడి గుడ్క.

రుక్మాంగద రెడ్డికి గుడ్క అరవై దాటినాయి. మీసాలు, కనుబొమ్మలు గుడ్క తెల్లబడినాయి. రెడ్డెమ్మకు గుడ్క మునుపటి న్యావలం లేదు. కాలమా, దానమ్మ మొగుడా? ఎవురయినా దాని దెబ్బకు మారవలసిందే మల్ల!

నరసింహారెడ్డి అయిదరాబాదులో ఉస్మానియా మెడికల్ కాలేజీలో డాక్టరు కోర్సు చదువుతూంటాడు. సిన్నాయన రమణారెడ్డి మర్డరయి పోయినంక ఆయన భార్య సుజాతమ్మ బొమ్మిరెడ్డి పల్లెలో ఉండనీకె ఒప్పుకోలేదు. ఆ యమ్మకు ఒక బిడ్డ. రుక్మిణి. ఆ యమ్మిని సదివించుకుంటాను అయిదరాబాదులో అని బావనడిగినాది. మొగుడు సచ్చిపోయినం ఆ యమ్మకు ఈ ఫాక్సను కొట్లాటలు, సంపుకోడాలంటే ఇరక్తి వచ్చినాది. పెద్ద రెడ్డి ఆ యమ్మ బాగం ఆ యమ్మకు పంచియిచ్చినాడు. ఆమె బాగానికొచ్చిన భూములు గుడ్క ఆ యప్పే సాగు జేయిస్తాడు. అయిదరాబాదుతో మెయిదీపట్నం లోన ఒక యిల్లు గొనిచ్చినాడు. పనీపాట, వంట జెయ్యనీకె సుంకరి మద్దయ్య పెండ్లామును ఆడ బెట్టినారు.

ఆనాడు సంజీవ రెడ్డిని సంపనీకె సుంకరి మద్దయ్య, మాదిగ మద్దిలేటి, ఉప్పరి రాజలింగం, వంకలోన గాసుకోని ఉన్నారు, ఎరుకల కొడవండ్లతోని. సంజీవరెడ్డికి తన మీద దాడి జరుగుతోందని ఉప్పందినాది. జీపు వంకలోకి రాంగానే ఇసుకలో స్లో అయినది. వీండ్లు ముగ్గురూ “అశ్శరభ” అని పెడబొబ్బలు ఏస్తూ జీపు మిందికి దుంకినారు. సంజీవరెడ్డి జీతగాడు వాండ్ల మీదకి రెండు నాటుబాంబులు ఏసినాడు. ఇంకా పగ్గం పట్టున ఉండంగనే వాండ్ల మింద బాంబులు పడినాయి. ఉప్పరి రాజలింగానికి మటుకు ఎడం సెయ్యి తెగిపోయినాది. మద్దయ్య మద్దిలేటి ఆడనే ఎగిరిపడి సచ్చినారు. తన కోసరం పానాలిచ్చినారని వాండ్ల కుటుమానాలను ఆనాటి నుండి సాకుతుండాడు పెద్దరెడ్డి. మద్దిలేటి కొడుకు డోనులో ఇంటరు చదువుతుండాడు. మద్దయ్యకు పిల్లలు లేరు. ముండమోసిన ఆ యప్ప పెండ్లానికి దావ జూపనీకె ఆ యమ్మను అయిదరాబాదులో సుజాతమ్మ కాడ పెట్టినారు.

మర్సటిదినం కారు మాట్టాడుకోని సుజాతమ్మ, రుక్ష్మిని వచ్చినారు. సుంకరి మద్దయ్య పెండ్లాము లచ్చమ్మ అయిదరాబాదులోనే ఇల్లు సూసుకోనీకె ఉండిపోయినాది. రుక్మిణి నిజాం కాలేజీలో ఇంటరు చదివి పాసై, ఆ సమచ్చరమే జె.న్.టి.యు.లో ఇంజనీరింగ్‌లో చేరింది. మెకానికల్ గ్రూపు.

సుజాతమ్మను, రుక్మిణిని శానా అభిమానంగ దింపుకున్నారు పెద్ద రెడ్డి, రెడ్డమ్మ. రుక్మాంగద రెడ్డికి సచ్చిపోయిన తమ్ముడు రమణారెడ్డంటే శానా  ప్రేమ. మొగుడ్ని పోగొట్టుకున్న మరదలు సుజాతమ్మను జూస్తే పెద్ద రెడ్డికి కడుపు లోన దేవినట్టుంటాది. పెద్దదయినా ఆయన భార్య యశోదమ్మకున్న కల సుజాతమ్మకుండదు. ఆడోండ్లకు నుదుటన కుంకుమ మాత్యం అది!

బావకు-అక్కకు కాల్లకు మొక్కినాదీ సుజాతమ్మ. బిడ్డతో గుడ్క మొక్కిచ్చినది. రుక్మిణిని సందిట్లోకి దీస్కోని పెద్ద రెడ్డి కండ్ల నీల్లు బెట్టుకున్నాడు. ‘అంతా వాని మాదిరే పుట్టినాది బంగారు తల్లి!’ అనుకున్నాడు. “బాగా సదువుతూండావా తల్లీ!” అని అడిగినాడు.

“ఓ పెదనాయినా” అనింది ఆ పిల్ల. తెల్లగా బారుగా ఉండాది. పెద్ద పెద్ద కండ్లు. పెద్ద జడ. ఉత్తరాదోల్ల మాదిరి సల్వార్ కమీజ్ ఏసుకున్నాది. నీలం రంగు లోని ఆ గుడ్డల్లో సుట్టిన మానిక్యం మాదిరి మెరిసిపోతాందాది రుక్మిణి. అయిదరాబాదులో ఇంటర్ చదువుతోంది. “పిల్లకు దిట్టి తియ్యమ్మే! నా దిట్టే తగిలేట్టుండాది” అన్నాడు పెద్దనాయిన. ఆడోండ్లు ముగ్గురు లోపలికి బోయినారు.

మర్సటి రోజే ఉగాది పండగ. ముందు రోజు తొగర్చేటి నుండి జీపుల కేశవ రెడ్డి, ఆయన పెండ్లము దమయంతి, కొడుకు నిరంజన్ రెడ్డి వచ్చినారు. కేశవ రెడ్డి నాయిన నాగశయనారెడ్డి, రుక్మాంగద రెడ్డి, సిన్నాయన పెద్ద నాయన పిల్లలు. నాగశయనా రెడ్డి పెద్దోడు. వయిసులో ఉన్నప్పుడు పాక్సన్ రాజకీయం నడిపినాడు. ఆ యప్ప అంటే ఆ సుట్టు పక్కల ఏడెనిమిదూళ్లతో అడల్. ఏ పార్టీ అధికారంలోనికి రావాలన్నా ఈ అన్నదమ్ము లిద్దరి సపోటు ల్యాకుండా కుదరదు. నాగశయనా రెడ్డి మెత్తబడినాడు. రుక్మాంగద రెడ్డి గుడ్క పాక్సన్ గొడవలు తగ్గించుకున్నాడు.

పండగనాడు బక్ష్యాలు చేయించింది రెడ్డెమ్మ. అలసంద వడలు, శనగబ్యాడల పరమాన్నం, చిత్రాన్నం చేయించింది. పండగనాడు నీసు దినరెవరూ మర్సటి దినం సద్దిపండగ నాడు తింటారు.

సద్దిపండగ బోయిన రెండో దినం అందరూ ఎవరి ఉల్లకు వాండ్లు ఎల బారాల. పొద్దున్నే టిఫిన్ జొన్నరొట్టెలు, నూనాంకాయతో దిని పడసాలలో అందరూ గూసొని మాటాడుకోబట్నారు.

పెద్ద రెడ్డి, మరదలికి ఒక కవరులో డబ్బులు పెట్టి యిచ్చినాడు. “ఈ ఏటి అయివేజు డబ్బులమ్మా. ఇరవై వెయ్యిలుంటాది”

“అట్నే బావా!” అన్నాది ఆ యమ్మ. “నాకు అమ్మనాయిన లేక పోయినా, ఆ లోటు దీరుస్తాందారు నాకు నీవూ, యశోదక్కా” ఆమె గొంతు దుక్కంతో వనికినాది.

“జాగ్రత్తమ్మా, పోన్లు జేస్తుండండి” అన్నది యశోదమ్మ, రుక్మిణి బోయి పెద్దమ్మ ఒళ్లో తల చెట్టుకోని పడుకున్నాది.

కేశవ రెడ్డిదీ సుజాతమ్మ ఈడే. అందుకే ‘కేశవా’ అని బిలుస్తాదాయమ్మ. ఆ యప్ప గుడ్క ‘సుజాత’ అని పిలుస్తాడు.

“సేద్దాలెడ్డుండాయిరా కేశవా?” అనడిగినాడు పెద్ద రెడ్డి.

“నీకు తెలియనిదేముండాది సిన్నాయనా! ట్రాకటరు దెచ్చినప్పటి నుంచి పని సులువయినట్లుందిగాని, దానికి యాదో ఒక రిపేరు వస్తాంటాది. సమయానికి డ్రయివరు నా కొడుకలు ఎగ్గొడతారు. కర్నూలు ఎం.జి. బ్రదర్సు సర్వీసు సెంటరులోన యిస్తే వాండ్లకు మన మాదిరి శానా ట్రాక్టర్లుంటాయి రిపేరుకు. వారం దినాల తర్వాత రమ్మంటారు. ఈ లోపల కూలోండ్లు దొరకరు. ఈ మద్యన ఉలిందకొండకు బోయి ప్యాసింజరు ఎక్కి కర్నూలుకు బోతండారు. ఆడ బిల్డింగుల కాడ పనో, రిచ్చా తొక్కడమో చేసుకుంటుంటారు. సన్నామొన్నా రైతులు భూములమ్ముకోని పట్నాలకు బోయి బతకతాండారు. మా నాయిన మూల్నబడినాడు. ఆ యప్పను యిడిసి పెట్టి యాడికి పోనీకె ల్యా. కర్నూల్లో ఏదైన యాపారం జేద్దాము; ఈ సేద్దం ఇడిసిపెట్టి అని అనుకుంటుండా. మాయమ్మవైపు బందువొకడు మొన్న గలిసినాడు. వాండ్లది గోనెగండ్ల. వాండ్ల పరిస్తితీ యిట్లనే ఉండాదంట. వాడు నేను కలిసి సిమెంటు, యూరియా డీలరుషిప్పు మన జిల్లాలో దీసుకుందామనుకుంటుండాము. సుమారు రెండు లచ్చలతో పని. యావయినా సేన్లు అమ్ముదామంటే కొంటే కొరివి అమ్మితే అడివి అన్నట్టుండాది.”

సుజాతమ్మ అన్నాది. “కేశవా, నీ కొడుకు ఇప్పుడు ఏమి సదువుతూంటాడు?”

“ఈ సంవచ్చరం పది కొచ్చినాడు సుజాతా!”

“కోడుమూరు లోనే గదా?”

“ఔ! పొద్దున్న డ్రైవరు జీపులోన దీస్కబోయి, సాయంత్రం తీసుకొస్తాడు.”

“జాగ్రత్తరా నాయినా!” అన్నాడు పెద్దరెడ్డి. “ఆ సంజీవ రెడ్డిగాడు పగదీరని పాము. మనం సల్లుకున్నా. వాడు అగాయిత్యం చెయ్యడని గ్యారంటీ లేదు.”

కేశవరెడ్డి నవ్వి అన్నాడు “లేదులే పెద్దనాయినా, ఆ యప్ప గూడ్క సల్లబడినాడు. పోటుగాండ్లను మేపనీకె ఆస్తులన్నీ బోతున్నాయి. ఆ యప్ప కొడుకు గూడా బెంగుళూరులో లాయరు సదువుతాండాడు”

“మూడేండ్లు గాల్యా ఆ నా కొడుకు నామింద డోను రైల్వే టేసను కాడ దాడి చేయించి, చనంతో తప్పింది. మన చెన్నయ్య మెరుపు మాదిరి వాండ్ల మీదికి బాయె గదా యాట కొడవలెత్తుకోని?”

“ఔ సిన్నాయనా! తర్వాత నేను కిందటేడు ఆ నా కొడుకును ఎలక్షన్ టైముల చెరుకులపాడు పోటుగాండ్లను పిలిపించి ఏపిద్దామంటే నీవు వద్దంటివి.”

“మన సుజాతమ్మే గదరా అప్పుడు మనల్ను వద్దనింది. ‘బావా! యింగ సాలు. ఆ యప్ప నిన్ను సంపనీకె జూసినాడు. మా అదృష్టము. నీవు బతికి బయటపడినావు. మనం గమ్మునుంటే రెండు కుటుంబాలు బాగుంటాయి’ అనింది. తన బర్తను సంపినోడిని గూడ్క ఏమీ సెయ్యొద్దని ఆ యమ్మ సెప్పేటప్పటికి నాకూ కరెక్టే అనిపించినది. ఏం సాదించినామురా కేశవా? మన కోసరం పానాలిచ్చిన మన వాండ్ల కుటుమానాలను సాకనీకెనే సరిపోతుంది.”

“మన నరసింహను, రుక్మిణిని తన కాడ పెట్టుకోని సదివిస్తున్నాది నా తల్లి! గోనెగండ్లోనితో ఎందుకు గానీ, ఆ డీలరుసిప్పేదో సూడు. నేను గుడ్క నీతో కలుస్తా. మన మింద ఆధారపడినోండ్లకు యాదో పరమనెంటు సెటిలుమెంటు జేస్తా. భూములు వచ్చి చూసుకొనిపోతా ఉందాము. పోయి కర్నూలు జేరుకుందాము. పిల్లోండ్లు అయిదరాబాదు నుంచి రానీకి పోనికె గుడ్క సులభము!” అన్నాడు పెద్దాయన.

“మరి నా సంగతేంది రెడ్డెమ్మా” అన్నాది వంటాయమ్మ సునందమ్మ.

“మాతో బాటే నివ్వు!” అన్నది రెడ్డెమ్మ నవ్వుతా.

సుజాతమ్మ అనింది, “కేశవా! నీవేమి అనుకోకపోతే ఒక మాట. మన నిరంజనను టెంతు తర్వాత మా దగ్గరికి పంపియ్యి, ఇంటరు ఆడ జేర్పిద్దాము.”

“శానా మంచి మాట జెప్పినావు తల్లీ!” అన్నాడు రుక్మాంగద రెడ్డి.

“అంతకంటేనా సుజాతా!” అన్నాడు కేశవరెడ్డి. “పిల్లోడు నీ కాడ ఉంటే నాకు ఎదారుండదు. అట్లే జేస్తాము లేమ్మా.”

నరసింహరెడ్డి అన్నాడు “ఏమిరా నిరంజనా, వస్తావా అయిదరాబాదుకు?”

“ఎందుకు రానన్నా నీవు, రుక్మిణక్క ఉంటారుగా” అన్నాడు వాడు.

అందరూ ఎలబారిపోయినారు. కాలం ఇంకో రెండు కుటుంబాల దృక్పథాల్లో మార్పు తెచ్చి, వాండ్లను తనతో పాటు తీసుకుపోబట్నాది! దానెంట మనం బోవల్సందేగాని, మనెంట అది రాదు గదా!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here