మహాప్రవాహం!-19

0
14

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[దారిలో ఓ స్టూడియోలో ఫోటో తీయించుకుంటాడు సంజన్న. అక్కడ్నించి కార్పెంటర్ వరదాచారి వద్దకు వెళ్ళి షాపుకు కావల్సిన వుడ్ వర్క్ చేయించటం కోసం రేటు మాట్లాడి వస్తారు సంజన్న, రామగిరి. సాయంత్రం వడ్డె మేస్త్రీ ఎంకటప్పని పిలిపించి షాపు అంతా చూపిస్తారు. పందికొక్కులు నేలని బాగా తవ్వేశాయనీ, బండలన్నీ తీసేసి, కంకరపోసి, సమం చేసి, బేతంచర్ల బండలు వేసుకోవచ్చని అంటాడు ఎంకటప్ప. లేదా సలీసుగా ప్లాస్టరింగ్ చేద్దామని చెప్తాడు. గోడలకి అంగుళం మందంగా ప్లాస్టరింగ్ చేస్తే, పెయింట్ వెయ్యడానికి అనువుగా ఉంటుందనీ, వారపాగు కింద ఫ్లోరింగు కూడా పాడయిందని, దాన్ని పాడయిన చోట కొంచెం తవ్వి, సిమెంటు పూస్తే సరిపోతుందని చెప్తాడు. అతనికి అడ్వాన్సు ఇచ్చి పంపుతారు. కాసేపయ్యాకా రామగిరి హోటల్‍లో కూర్చుని తమ దగ్గర ఇంకా ఎంత డబ్బుంది, ఇంకా ఎవరెవరికి ఎంత చెల్లించాలనే లెక్కలు వేసుకుంటారు. సరుకు కొనడానికి తమ వద్ద నున్న డబ్బు సరిపోతుందో లేదో కనుక్కోడానికి గుత్తి రోడ్డులో ఉన్న ‘మద్దిలేటి సామి వైన్స్’ దగ్గరికి వెళ్ళి, యజమాని సుంకిరెడ్డిని కలిసి పరిచయం చేసుకుని వివరాలు అడుగుతారు. వ్యాపారం లోని మెళకువలు, హోల్‍సేల్ వాళ్ళ నుంచి సరుకు తెచ్చుకునే పద్ధతులు, బ్యాంకు లోను గురించి సంజన్నకి అర్థమయ్యేలా చెప్తాడు సుంకిరెడ్డి. రెండు రోజుల తర్వాత వస్తే బ్యాంకుకు వెళ్దామని చెప్తాడు. ఇక చదవండి.]

[dropcap]ఇం[/dropcap]ట్లో రామగిరితో అన్నాడు “కుటమానం డోనుకు మార్చేటప్పుడు ఆ యిల్లు గుడ్క అమ్మేస్తా చిన్నాయనా, దొంగలకిచ్చినా పన్నెండు వేలకు తక్కువ రాదు. అప్పుడు గావలిస్తే బ్యాంకు లోను దీర్చుకోవచ్చు.”

“లోను తీర్చనీకె ఏమీ తొందరల్యా. తక్కువ వడ్డీకొస్తుంది. కంతులు నెలనెలా బ్యాంకుకు కడతాంటాము. ఇలమ్మిన డబ్బు గుడ్క యాపారాని కవసరమయితాది సూస్తూండు” అన్నాడు రామగిరి.

ఎంకటప్ప పని మొదులు బెట్టినాడు. ముందల వారపాగు దెబ్బతిన్న కాడ సరిజేసినాడు. ఫ్లోరింగు అర్దడుగు తవ్వి కంకర బోసి దాని మాలు (సిమెంటు) తోని ప్లాస్టరింగ్ చేసినాడు. ప్లాస్టరింగు మింద గల్లు వచ్చేడట్టు చేసినాడు. గోడ మిందున్న శివికిన సున్నం అంతా గీకేసి నీటుగా ప్లాస్టురింగ్ చేసినాడు.

పెయింటింగ్ జేసెటాయన సాయిబు. ఆ యప్పపేరు కరీము. గోడలకు నీలంరంగు డిస్టెంపరు ఏసి దాని మింద పెయింటు ఏసినాడు. ఈలోపల గోవిందరాజులు శెట్టి కాడ అగ్రిమెంటు ఇరవై సంవత్సరాలకు రాయించుకున్నారు. ఆ యప్ప ఒక మెలిక బెట్నాడు. అదేమంటే ప్రతీ సంమచ్చరం ఇరవై రూపాయలు బాడిగ పెంచాలంట. పదైదుకు ఒప్పుకున్నాడు.

షాపు ముందు గోడలకు రెండు పక్కలా బ్రాందీ కంపినీల పేర్లు, మందు సీసాల బొమ్మలు పెయింటింగు చేసినాడు కరీము. తలుపుల మింద 10 X 2 కొలతతో ఒక దిమ్మ మాదిరి చేయించినారు ఎంకటప్పతో. దాని మింద శాపు పేరు రాయించినారు ఇంగ్లీషులో తెలుగులో. కొడుకు పేరే పెట్టినాడు శాపుకు.

‘ప్రదీప్ వైన్స్, కొండపేట, డోన్. పాపుయిటర్. కె. సంజన్న గౌడ్’

పసుపుపచ్చరంగు బ్యాక్‌గ్రవుండు మింద ముదురు నీలం రంగు అచ్చరాలు మెరుస్తోండాయి. మద్యలో ఒక లైటు బిగించాల.

వరదాచారి మనిసి వచ్చి కొలతలు తీసుకోని బోయినాడు. పని మొదలయినాది. రెండ్రోజులకు ఆ యప్ప వచ్చి పలకల తలుపులు జూసి. “ఛా, ఇవేం బాగుండాయి గౌడు గారో, పాత కాలం కిరానా శాపు ఆల్లు చేయించుకొనేటోల్లు. ఇవిటి చెక్క టేకుదీ. తాపడా పట్టించితే కొత్తగ కనబడ్తాయి. రెండు బాగాలుగా ఇవిట్ని దిగ్గొట్టి, పెద్దవి రెండు తలుపులు తీసుకుందాము. నీటుగ గడియ జేయించుకోని, పైన కింద బోల్టులు పెట్టుకుంటే బాగుంటాది. ఇప్పుడు తొందరలేదు గాని, తర్వాత కింద గాడి కొట్టించి, గాన్ల మీద రెండుపక్కల జరుపుకునే గ్రిల్సు చేయించుకోండి” అన్నాడు.

రామగిరి గుడ్క నిజమే అన్నాడు పలకల వాకిండ్లు, ఇంత సోకు జేయించిన శాపుకు కంటికి ఆనవన్నాడు.

మొత్తం వుడ్ వర్కు పదిరోజులపైనే పట్టినాది. అరలన్నీ నీటుగా కుదురుకున్నాయి. గోడలకు రూఫింగు ప్లయివుడితో చేసినాడు వరదాచారి. దాంట్లోనే బల్బులు బెట్టెనీకె ఏర్పాటు చేసినాడు.

కొత్త బోర్డు ఏసినాడు. రూపులో అరు బల్లులు వచ్చినాయి. గోడలకు రెండు. ఎలక్ట్రీషియను శేషన్న వచ్చి వైరింగు అంతా మార్చినాడు. పక్కల బారు లైట్లు, బయట బోర్డు మద్యన ఒక లైటు, వారపాగులో ఒక లైటు వేసినారు.

శాపు మెరిసి పోతాండాది. దాన్ని సూస్తాంటే కడుపు నిండిపోతా ఉంది సంజన్నకు. తాను కూసునే కౌంటరు వెనక గోడకి ఎంకటేసుల పటాన్ని టేకు రీపరు మింద బిగించినారు. ఊదికడ్డీ స్టాండు, కుంకుమ గిన్నె ఇట్టాంటివి ఆ రీపరు మింద పెట్టుకోవచ్చు. ముందు సోకేసు మాదిరి అద్దాలతో ఒక కౌంటరు వచ్చినాది. అనుకున్న దానికన్న ఆరునూర్లు ఎక్కువైనాది వుడ్ వర్కుకు. కార్పెంటరు మజూరి తగ్గించకపోగా రెండు నూర్లు ఎక్కువ తీసుకున్నాడు.

రూఫింగుకు, అరలకు గుడ్క కరీముతో పెయింటింగు చేయించినారు.

టేసను రోడ్డులో ‘సదాశివశర్మ’ అనే పురోహితుని దగ్గరకు బోయి శాపు ఓపనింగుకు మంచి రోజు చూపిచ్చుకున్నారు. రమేసు గాని నేస్తుడే బాలక్రిస్న అనే పొట్టిగాన్ని శాపులో పని చెయ్యనీకె మాట్లాడుకున్నారు. వానికి నెలకు నూటిరవై.

ఓల్‌సేల్ శాపుకు, తొలిసారని, సుంకిరెడ్డి తన కాడ పని చేసే డేవిడ్ అనే ఆయప్పను కర్నూలుకు పంపించినాడు, సంజన్న తోని. వన్ టౌనులో ఓల్‍సేల్ డీలరోడి పెద్ద గోడౌను. ముందల ఆపీసుండాది. ‘శ్రీశైల గౌడ’ మనిసి బారుగా, సన్నగా, తెల్లగా ఉండాడు. జుట్టు మద్య పాపిడి దీసినాడు. తెల్లని పైజామా, తెల్లని జుబ్బా ఏసుకున్నాడు. రెండు చేతులకు ఎనిమిది బంగారు ఉంగరాలుండాయి. మెల్లో పులిగోరు చెయినుండాది. ఆ యప్ప తెలుగు అదో మాదిరి ఉండేది. రాయిచూరోల్లు గదా అనుకున్నాడు సంజన్న.

“సుంకిరెడ్డి నాకు బాగా తెలుసును. జాస్తి మంచివాడు. వీడుండాడే, డేవిడు, వీడు సైతము నాకు ఎరుక. నీవు తొలిగా ఎంత పెడుతుంటివి?” అన్నాడు శ్రీశైల గౌడ.

“నా కాడ ఏడు వేలు ఉండాయి సావుకారీ!” అన్నాడు సంజన్న.

“అయితే ఇంకో మూడు వేలకు అరువు ఇస్తా, మొత్తం పదివేల సరుకు తీసుకోని పోప్పా. అన్ని రకాలు కవరు జేస్తా. సరిగ్గా నెల తర్వాత, ఆరు నెలల పాట నెలకు ఐదు నూర్లు కట్టుకో. అది తీరిన అనంతరము ఇంకా ఇస్తాను” అన్నాడా యప్ప.

“కొత్త యాపారం. నిలదొక్కుకొనేంతవరకు నీవే దయ సూడాల సావుకారీ’!’ అన్నాడు సంజన్న.

“నన్ను ‘సావుకారీ’ అని పిలగాకు. మనిద్దరిది ఒకే కులం. కానీ మా కన్నడ దేశంలో మేము కల్లుగీత పని యిడిసిపెట్టి శానా కాలమాయ. ‘గౌడా’ అను చాలు” అన్నాడు.

పదివేలకు కలిసి పన్నెండు అట్టపెట్టెలు వచ్చినాయి. రిటైలులో ఏది ఎంత కమ్మాల ఒక పట్టీ ఇచ్చినాడు. “ఇవన్నీ ఎట్టుతీసుకుపోతావు?” అని అడిగి “మా లారీ ఎల్లుండి అదే రూట్లో వస్తాది. సరుకు నీ శాపు దగ్గర దింపుతాము లే. మొదుటిసారి కాబట్టి ట్రాన్సుపోర్టు కేమీ తీసుకోను. నీ పెట్టెల మీద మా చిన్నోని తోని నీ శాపు పేరు రాయించుకోపోప్పా. అన్‍లోడింగు జేసేటోల్లకు సులువయితాది” అన్నాడు.

“చిన్నా, ఈన పెట్టెల మింద శాపు పేరు రాయి” అని ఆర్డరేసినాడు. ఆ యప్పకు నమస్కారం చేసి, ఇద్దరూ డోన్ చేరినారు.

మూడో రోజు సరుకు దిగింది. అన్‍లోడ్ జేసినోల్లు టీ డబ్బు లడిగితే ముఫై రూపాయలిచ్చినాడు సంజన్న. సరుకంతా అరలలో సర్దుకున్నారు. శాపు ప్రారంబోత్సవం రెండు రోజులే ఉంది. సమితి ప్రెసిడెంటు హరనాథరెడ్డిని ప్రారంబం చెయ్యనీకె పిలిసినారు. ఆయన వస్తానన్నాడు. ఊరికి బోయి ఇమలమ్మను ప్రదీపును పిల్చుకోని వచ్చినాడు.

ఆయాల శుక్రవారం, దశిమి. సదాశివశర్మగారి దగ్గర శిష్యుడు కార్తికేయశర్మ వచ్చి పూజ చేయించినాడు. హరనాథరెడ్డి గారితో తొలి బ్యారం చేసుకున్నారు. ఆ యప్ప క్వాటరు బ్రాందీ కొనుక్కుని నూర్రూపాయ లిచ్చినాడు. చిల్లరిస్తే తీసుకోల్యా. ఆ యప్పకు ఒక శాలువ కప్పి, చెండుపూల దండ ఏసినారు.

సంజన్న కుటుంబము, రామగిరి అనంతమ్మ, రమేసు గాడు, శాపులో పనిజేసీ బాలక్రిస్న, సుంకిరెడ్డి, డేవిడు, వరదాచారి, కరీము, ఎంకటప్ప, ఇంకా సుట్టుపక్కల శాపులోల్లు ఐదారు మంది వచ్చినారు. ఇమలమ్మ టెంకాయ కొట్టి లోపలికి బోయినాది. తన పేరు అంత బాగా షాపు మింద రాసినందుకు ప్రదీపు గాని సంతోశం పట్ట తరం గావడంల్యా. అందరికీ ‘మలబార్ స్వీట్సు’ నుండి మైసూరుపాకు, మిక్చరు తెప్పించి ఇచ్చినారు. టీ లు గుడ్క.

“రెండ్రోజులు తాళి బ్యాంకుకు పోదాము” అన్నాడు సుంకిరెడ్డి. “లైసెన్సులు, సర్టిపికెట్లు అన్నీ వచ్చేసినాయి గదా”

పది రోజుల కిందటే ఏసురాజు అన్నీ తెచ్చిచ్చినాడు. ప్రారంబోత్సవానికి ఎందుకో ఆ యప్ప రాల్యా. మునిసామి మాత్రం వచ్చి కుంచేపుండి ఎల్లిపోయినాడు.

వ్యాపారం మొదులయింది. ఇమలమ్మ, ప్రదీపు బొమ్మిరెడ్దిపల్లెకు ఎల్లిపోయినారు. నాల్రోజులు రామగిరి గుడ్క సాయంగా ఉన్నాడు. బాలక్రిస్న గాడు సురుకైనాడే. తొందరగానే బ్రాండును బట్టి సీసాలు తీసియ్యడం నేర్చుకున్నాడు.

కొందరు కస్టమర్లు, “ఈ రొంత దానికి యింటికేం మోస్కపోతాము. ఈడనే నాలుగు గ్లాసులు పెట్టించు గౌడు! తాగేసి పోతే ఒక పనయిపోతాది” అని సలా ఇచ్చినారు.

సుంకిరెడ్డి నడిగితే – తప్పులేదనీ, తాగి ఎల్లిపోవాలనీ, ఆ బ్యారాలు గుడ్క ముక్యమేననీ, పోలీసోల్లు వచ్చి ఇదేందంటే వాండ్లకు ఐదో పదో ఇస్తే గమ్మునుంటారనీ చెప్పినాడు.

సిండికేటు బ్యాంకు కర్నూలు రోడ్డులో జూనియర్ కాలేజి ఎదురుగ్గా ఉంది. మేనేజరు బాపనాయిన. పాంటు షర్టు ఇన్‍షర్టు చేసినాడు. కాని ఎనక చిన్న పిలక జుట్టుండాది. నుదుట్న విబూది రేకలు, గంధం, కుంకుమ బొట్టు పెట్టుకున్నాడు. పొద్దున్నే బ్యాంకుకు బోంచేసి వస్తాడేమో, తాంబూల మేసుకున్న ఆ యప్ప నోరు ఎర్రగా ఉండాది.

“సుంకిరెడ్డి, లోను ఎనిమిదివేలొస్తాది. సరుకు మాకు ప్లెడ్జ్ చెయ్యాల. నెలకు రెండు నూర్ల యాభై ప్రకారము కంతులు గట్టాల. మూడేండ్ల పాటు లోనుకు గ్యారంటీ నీవుంటావా?”

“నేనుంటాను సామీ!” అన్నాడు రామగిరి. “నాకు శేగు టాకీసు కాడ ఓటలుండాది సారు. ఈ సంజన్నది మా ఊరే.”

“సరె సరె, ఎవరైతే ఏంది గాని, కంతులు కట్టలేకపోతే, సరుకు సీజ్ చేసి యాలం ఏస్తాము రికవరీకి, తెలుసుగదా!”

“అంతదూరం రానియ్యము లెండి సారూ!” అన్నాడు సుంకిరెడ్డి. కావలసిన పత్రాలన్నీ సబ్మిట్ చేసి వచ్చేసినారు.

ఫీల్డాపసరు వచ్చి చెక్ చేసుకున్నంక లోను శాంక్షనయింది.

బొమ్మిరెడ్డిపల్లె నుంచి తిరుపాలు, రాజమ్మ వచ్చినారు. వాండ్ల కొట్టము, జాగా, కంబగిరిరెడ్డి కొనుక్కున్నాడంట. అరు వేలు వచ్చిందంట. ఒకటిన్నర సెంటు. కొట్టానికేమొస్తది?

రామగిరి యింటి కాడ ఒక రేకుల యిల్లు చూసినారు వాండ్లకు. బాడిగ యాభై రూపాయలు. వరదాచారితో చెప్పి ఒక తోపుడు బండి చేయించినాడు సంజన్న. అదీ మూడు నూర్లయింది. ఒక పంపు స్టవ్వు, ఒక పెద్ద ఇనప బానలి, సరుకు ఏసుకోనీకె స్టీలు బేసిన్లు. దుమ్ముపడకుండా ఈగలు వాలకుండా అద్దాలపెట్టి, అన్నీ రడీ చేసుకున్నారు. పది కిలోల శనగబ్యాడలు గిర్ని మెత్తగా ఆడించి శనగపిండి చేసుకున్నారు. బుడ్డల మిల్లు కాడ పది కిలోల బుడ్డల నూనె డబ్బా, ఉల్లిగడ్డల గోనె సంచి, వేయించుకున్నారు.

పొద్దున్న ఉగ్గాని బుజ్జి, ఉద్ది దోసె, ఉద్ది వడ చేస్తారు. మెల్లగా ఒక కరెంటు రోలు మిసిను కొనుక్కోవాల. పదకొండు వరకు ఉంటాది. ఇంకో కిరోసిన్ స్టవ్ మీద టీ చేస్తారు. ఇప్పుడు మాత్రం పిండి బయట రుబ్బించుకుంటాండారు.

ఇంటికి పోయి ఇంత వండుకోని తిని, మల్లా మూడు మూడున్నరకు వస్తారు. మిరపకాయ బజ్జి, ఉర్లగడ్డ బజ్జీ, పుగ్యాలు (మెత్తని పకోడీ), మసాలా వడ, ఉర్లగడ్డ బోండా చేస్తారు.

వైన్ శాపు కస్టమర్లే కాకుండా, చుట్టుపక్కలోండ్లు కూడా కొనుక్కుంటారు. పన్నెండేండ్ల పొట్టిగాడు ఒకన్ని కుదిర్చినాడు సంజన్న. వాని పేరు మల్లికార్జున. వాడు సాయంగా ఉంటాడు. గేటు పడినపుడు చేసిన అన్ని రకాలు కొంచెం కొంచెం పెట్టుకొని, బస్సులు, లారీలెంబడి అరుచుకుంటూ తిరిగి అమ్ముకొస్తాడు, “బోండా, వడా, బజ్జీ ఏడి ఏడిగ” అని. తోపుడు బండికి పర్మిషన్ లేదీని దబాయించి పోలీసోల్లు, శానిటరీ వోల్లు రెండూ మూడూ తీసుకుపోతుంటారు. చేతికందిన సరుకు నోట్లో ఏసుకుంటారు కూడా.

మెల్లగా సంజన్న యాపారం పుంజుకున్నాది. రోజుకు ఐదువందల రూపాయలు అమ్మకమైతున్నాది. శ్రీశైల గౌడది, బ్యాంకుదీ కంతులు సులబంగ కట్టొచ్చిననుకున్నాడు. మెతక మనిశని పేరొచ్చినాది. ఎవరయినా కస్టమర్లు కొట్లాట కొచ్చినా రెండు సేతులెత్తి మొక్కేటోడు. అంతగా అలవిగాక పోతే టేసనుకు మామూళ్లిస్తాడు గదా, బాలక్రిస్నను పంపిస్తే, ఎవరయినా కానిస్టేబులు వచ్చి అదుపు జేసేవాడు.

తిరుపాలు యాపారం గుడ్క బాగానే ఉంది. తెచ్చుకున్న డబ్బులు అయిపోకముందే అమ్మకం పుంజుకుంది. పొద్దున సాయంత్రం కలిసి నూట యాభై వరకు వస్తూంది. రోజూ సంజన్నను మెచ్చుకోవడమే.

నాలుగు నెలలో ఐదారు వేలు లాభం తేలింది సంజన్నకు. సరుకు పెంచినాడు. అరల మీద అటకల మీద గూడ్క సరుకు దింపినాడు. శ్రీశైల గౌడ పదివేల వరకు సరుకు యిస్తున్నాడు. ఆ యప్పకు నెలకు వెయ్యి, రెండువేలు కడుతున్నాడు. రోజూ వెయ్యి రూపాయలకు పైనే అమ్ముతున్నాడు.

ప్రదీపు ఏడవ తరగతి పెద్ద పరీక్షలు అయిపోయినాయి. పార్వతీశం సారు కొడగెనహళ్లి రెసిడెన్సియల్ స్కూలు ఎంట్రన్స్‌కు కోచింగు ఇస్తున్నాడు. ఆ పిల్లోడు శక్తివంచన లేకుండా చదువుతున్నాడు. అనుకున్నట్టే ఏడవ తరగతిలో స్కూలు కంతా సెకండు వచ్చినాడు ప్రదీపు. ఫస్టు వచ్చినోనికి, వీనికి టోటల్ మింద పదిమార్కులే వార.

కోచింగ్ పూర్తయినాది. సంజన్న గౌడు రాజా టాకీసు ఎనక ఒక యిల్లు తీసుకున్నాడు బాడిక్కు. దానికి నూట యాభై రూపాయలు. ముందు వారపాగు, పడసాల, ఎనక వంటిల్లు, చిన్న దొడ్డి ఉండాది. మంచినీల్ల కొలాయి ఉండాది. లెటిన్ దొడ్లో ఒకమూల. ఇల్లు శానా బాగుండాది.

మంచిరోజు చూసి యిమలమ్మను, ప్రదీపును తీసుకొచ్చినాడు. కొంత సామాను తెచ్చుకున్నారు. ఇంటిని మానుకింది మద్దయ్య కొనుక్కున్నాడు పదకొండు వేలకు. మొరుసు సేను తప్ప బొమ్మిరెడ్డిపల్లెతో ఇంకే బందము లేదు.

ఇసేసమేమంటే, సంజన్న గాని, తిరుపాలు గాని, రామగిరి గాని, అంత అందుబాటులో ఉన్నా మందు ముట్టరు!

ప్రదీపు ఎంట్రన్సు రాసినాడు. ఎంకటేసుల దయతో, వాడు చేసిన కృషితో, వానికి కొడిగెన హళ్లిలో సీటు వచ్చినాది. సంజన్న ఇమలమ్మల సంతోషం చెప్పడానికి కుదరదు. పార్వతీశం సారును, ఆయన భార్యను డోనుకు పిలిపించుకుని, వాండ్లకు కొత్తబట్టలు పెట్టినారు. సారుకు అరతులం బంగారు ఉంగరం చేతికి వేలికి తొడిగినారు.

“ఏంది సంజన్నా, శానా ఇబ్బంది పెడుతున్నావు!” అన్నాడు సారు.

“కొండంత దేవునివి నీవు! కొండంత పత్రి పెట్టలేము. ఏదో శిన్నది. మా సంతోషము. మీరు వద్దంటే శానా బాదపడతాము” అన్నారు.

“సకల శుభమస్తు!” అన్నాడు పార్వతీశం సారు. సంజన్నను ప్రదీపును తీసుకొని కొడిగెన హళ్లికి పోయి స్వయంగా అడ్మిషను చేయించినాడు. ఆ స్కూలు, ఆస్టలు, వసతులు చూసి సంజన్న నోరెళ్ల బెట్టినాడు. సారుకూ, నాయినకూ కాళ్ళకు మొక్కినాడు ప్రదీపు. అమ్మానాయినలను ఇడిసిపెట్టి ఉండాలన్న ఎదారు కంటే, కొత్తది, శానా మంచిస్కూలు లోన చదువుకోబోతున్నాననే సంతోషం ఆ పిల్లోని ముకంలో కనబడినాది.

అట్లా, కాలం రెండు కుటుంబాల గతిని మార్చి తనతో బాటు ఇగ్గుకొచ్చినాది. అది యిక్కడి తోని నిలబడదు. ఇంకా పోతానే ఉంటాది మరి!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here