మహాప్రవాహం!-2

0
12

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తూర్పు తెల్లవారుతుండగా నిద్ర లేచిన కొండారెడ్డి సూర్యుడిని ప్రార్థించి అక్కడనుంచి కదులుతాడు. కొంచెం దూరంగా ఉన్న శాల లోని పశువులను ఒళ్ళాంతా నిమిరి, వాటికి ఆహారం వేస్తాడు. ఇంతలో అతని భార్య నాగరత్నమ్మ బయటకి వచ్చి దూడని ఆవు దగ్గరకి వదలమంటుంది. దూడ పాలు తాగడం అయ్యాకా, నాగరత్నమ్మ పాలు పితుక్కుంటుంది. భర్తని మొహం కడుక్కు రమ్మని కాఫీ కలుపుతుంది. కొండారెడ్డి మొహం కడుక్కుని, ఓ గదిలో నిద్ర పోతున్న పిల్లల్ని చూసుకుని, దొడ్డి లోకి వెళ్ళి బావి దగ్గర స్నానం చేసి, ఉతికిన పంచ కట్టుకుని వంటింట్లో ఓ మూలగా ఉన్న దేవుడి పటాలకు దండం పెట్టుకుంటాడు. పడసాలలో గోడకి ఉన్న తల్లిదండ్రుల ఫోటోలకి దండం పెట్టుకుని, బయటికి వచ్చి అరుగుమీద కూర్చుంటాడు. ఇత్తడి గ్లాసులో బెల్లం కాఫీ తెచ్చిస్తుంది నాగరత్నమ్మ. కాఫీ తాగి భార్య ఇచ్చిన సద్దిమూట తీసుకుని చేనుకి బయల్దేరుతాడు. ఆరు గంటలయ్యేసరికి చేను చేరతాడు. పక్కనే ఉన్న సుంకులమ్మ దేవళంలోకి బోయి అమ్మవారికి దండం పెట్టుకుంటాడు. కొద్ది రోజుల క్రితం పెద్ద వానలు కురవడంతో నాగేటి చాళ్ళు బాగా నీళ్ళు తాగి ఆరుతాయి. ఆ రోజు గుంటకతో పాపనం చేయడానికి వచ్చాడు కొండారెడ్డి. గుంటక బ్లేడు వాడి తగ్గడంతో భూమి సరిగా తెగదు. దాంతో గుంటక మీద రాయిని తీసేసి తానే నిల్చుంటాడు. కాసేపయ్యాకా, పని ఆపి, గిత్తలను తుమ్మమాను కింద నీడలో నిలబెట్టి, తెచ్చుకున్న సద్ది తింటాడు. కాసేపు హరిశ్చంద్ర పద్యాలు పాడుకుని, మళ్ళీ పనిలో దిగుతాడు. పదకొండు దాటిందనిపించాకా, గిత్తలకి దాహం వేస్తుందని అనుకుని, వాటిని ఇంటి వైపుకి మళ్ళిస్తాడు. దారిలో వాగు వద్ద గిత్తలకి స్నానం చేయించి, మెల్లిగా ఇల్లు చేరతాడు. పశువులకు ఎండు వరిగడ్డి, బుడ్డల కట్టె కలిపి పెడతాడు. కాళ్ళు చేతులు కడుక్కుంటాడు. పిల్లలు బడి నుంచి రాగానే అన్నం తింటారందరూ. పిల్లలు మళ్ళీ బడికి వెళ్తారు, నాగరత్నమ్మ పనిలో పడుతుంది. కొండారెడ్డి అరుగు మీద కాసేపు కునుకు తీస్తాడు. ఇక చదవండి.]

[dropcap]మూ[/dropcap]డయ్యింది. కొండారెడ్డి నిద్ర లేసి ముగం కడుక్కొన్నాడు. పెండ్లాం యిచ్చిన బెల్లం కాపీ తాగినాడు.

“మ్మేవ్, నేనట్టా కమ్మరిసాల కాడికి బోయొచ్చా. గుంటక బిలేడు, నాగేటి కర్రు మొద్దుబారిండాయి. ఇయ్యాల భూమి సరిగ్గ తెగల్యా. పాపం గిత్తలకు నా బరువునంతా మొయ్యాల్సొచ్చే” అన్నాడామెతో.

“మామాలుగైతే ఇయన్నీ మందుగాలనే జూసుకుంటావుగదా? మతికి రాలేదా ఏంది?” అన్నదా ఇల్లాలు.

“నేను గూడ్క మన్సినే గదమ్మే” అన్నాడు నవ్వుతా.

“సర్లే పోయిరా” అని లోపలికి పోయింది.

వాండ్ల ఊరు బొమ్మిరెడ్డిపల్లె పెద్ద గ్రామమే. వెయ్యి గడప ఉంటాది. ఈ పక్క కర్నూలుకు, ఆ పక్క డోన్‌కు మజ్జన ఉంటాది. నాలుగు మైళ్ల దూరాన వెల్దుర్తి టేసను. అయిదరాబాదు – బెంగుళూరు జాతీయరాదారి బొమ్మరెడ్డిపల్లె మీన్నించే బోతాది.

కొండారెడ్డి కమ్మరిసాలకు బోయే యాలకు శానామంది ఆడ ఉండారు. వడ్లాయన రామబ్రెమ్మం, ఆ యప్ప కొడుకు వీరబ్రెమ్మం, ఆయన బార్య సిద్దమ్మ శానా కస్తిగ (బిజీ) పని జేచ్చాండారు. కొరముట్లు (వ్యవసాయ పరికరాలు) సరిపిచ్చుకోనీకె వచ్చినోల్లతో సాలంతా సందడిగా ఉండేది. కొలిమి బగ బగ మండుతూండాది. కొరముట్లను ఒగదాని తర్వాత ఇంకొకటి కొలిమిలోన ఎర్రగ కాల్చుతుండారు, పట్టకారుతో బట్టుకొని. ఇనుప గద్దె మింద బెట్టి, అంచులు పదును దేరేంత వరకు గుదె (సమ్మెట) తో బాదుతుండారు. సరిపించడం ఐనంక ఇనుము టెంపరు బోకుండా, ఒక గాబు లోని నీల్లలో అవిట్ని ముంచి, సుయ్, సుయ్ మనీ సప్పుళ్లు నిలబడిపోంగనే, రైతులకిచ్చి పంపిస్తున్నారు. రైతులు ఎంటదెచ్చుకున్న జొన్నలో, కొర్రలో, కందులో, వడ్లో కమ్మరాయన కిస్తున్నారు. ఒక మూల ఉన్న జల్లల్లో పోసిపోతున్నారు. కొందరైతే అద్దురూపాయ, ముప్పావలా, ఇట్టా దుడ్డు గూడ్క యిస్తుండారు.

వడ్లాయన ఎవుర్నీ ఏమీ అడగడంల్యా. రైతులిచ్చింది సంతోషంగ తీసుకుంటుంటాడు. అట్లని రైతులెవురూ ఆ యప్ప శ్రమను ఊరికీ తీసుకోవడంల్యా.

కొండారెడ్డిని చూడంగనే వడ్లాయన నోరంతా తెరిచి నవ్వుతా, ఆహ్వానించినాడు.

“ఏందో మా మేనల్లునికి ఇయ్యాల మా మింద దయగలిగింది. రాప్పా, కూసో యిట్ట!” అని ఒక చెక్కపెట్టెను సూపించె కొండారెడ్డికి.

“బ్రెమ్మం మామా, నీ దయ మా అందరిమీద ఉండింది కాబట్టే, మేమందరం ఎవుసాయం ఆయిగ జేసుకుంటుండా౦. శానా కస్తగ ఉండాదే యియ్యాల నీ కాడ?”

“తొలకరి అదును గదా అల్లుడా! దున్నకాలు, పాపనాలు, మా జోరుగా ఉండాయి. ఇయ్యాల మజ్జాన్నం అన్నం దిననీకె గూడ్క పురసత్తు లేకపాయ. నీకేమి, సేనికి బోయొచ్చి, మా యమ్మి బెట్టింది తిని ఆయిగ పండుకొని లేసొస్తివి!”

“అంత అయిగ ఏం లేనులే మామా” అన్నాడు కొండారెడ్డి నవ్వుతూ.

“ఏం దెస్తివి?”

“గుంటక బ్లేడు, నాగేటి కర్రు”

“కొంచెం లేటయితాది మల్ల. ఇదిగో మన సయ్యదు బావది, దేవదానం అన్నదీ అయితుండాయి. తర్వాత నీదే”

“కానీ, కానీ, నేనేం తొక్కులాడుతున్నానా ఏంది? కూసుంటాలే మామా!”

అనుకలగేరి కుంటి సుబ్బారెడ్డి, తెలుగోల్ల రాగవనాయుడు, పటాకుల రామానుజశెట్టి, మాదిగ గౌరి నుండి జాను, మాల ఎంకటయ్య అందురూ ఉండారా సాలలో. కొండారెడ్డిని అందురూ పలుకరిచ్చాండారు. ఎవరూ ఎవరికీ బందువులు కాకపోయినా అందరూ ఒకర్నొకరు వరుసలు బెట్టి, మామా, బావా, శిన్నాయనా, అనుకుంటూ పిల్చుకుంటుంటారు.

కుంటి సుబ్బారెడ్డి, కొండారెడ్డిని జూసి ఇట్లనినాడు.

“ఏం బావా, ఈ తూరి (సారి) సుంకులమ్మ గుడి సేనులో బుడ్డలేచ్చావా, పంట మారుచ్చావా?”

“లేదురా బావా, అది ఎర్రనేల గదా, దానికి బుడ్డలే గురువు, మజ్జన అక్కిళ్లల్లో (వరుసలు) కంది ఏసుకుంటే, అదునుకు దేవుడొంగితే (వర్షం పడితే) సమచ్చరం పొడుగునా పప్పుకు కొరతుండదు”

“నిజవే బావా, మరి అదేదో అయ్యపురెడ్డి జొన్న (హైబ్రీడ్) అని కొత్తగా వచ్చిందంట గద! శానా దిగుబడి వస్తాదని సెప్తాండారు!”

“కుంటి బావా, నేనొకటి సెప్తా యిను. అది ఏ జొన్నయినా, నల్లర్యాగడి నేలయితేనే బాగా పండుతాది. నీకు రైలు కట్టకవతల రెండెకరాలుండాది గదా! ఈ తూరి దాంట్లో ఈ కొత్త జొన్న ఎయ్యి. మజ్జలో మినుములు, పెసలు జల్లు. బాగుంటాది.”

“ఔ బావ, అట్లనే జేచ్చా.”

కొండారెడ్డి కొరముట్లను సరిపిచ్చి యిచ్చినాడు వడ్లాయన. తాను దెచ్చిన పడి (దాదాపు కిలోన్నర) కందులు ఆయనకిచ్చి, ఇంటికి పోయినాడు. నాగరత్నమ్మ కారం బొరుగులు కలిపి యిచ్చినాది. అవి తిని అరుగుల మింద గూసోని పగ్గం తాళ్లు పేనుకున్నాడు.

రేత్తిరి అందరూ జొన్న రొట్టె, నూనొంకాయతో తిన్నారు. అప్పటికి ఎనిమిదయింది. నాగరత్నమ్మకు చెప్పి, రాముల దేవళానికి పోయినాడు. అక్కడ ఆ ఊరి పురోహితుడు పద్మనాభశాస్త్రి అందరికీ నాలుగు మంచి మాటలు చెబుతూంటాడు. కొండారెడ్డి ఆయనకు నమస్కారం జేసి ఒక పక్కన కూర్చున్నాడు. స్వామి ఇట్లా చెబుతూండె.

శ్లో:

లోకవాసనయా జంతోః

శాస్త్రవాసనయాపి చ

దేహవాసనయా జ్ఞానం

యథావన్నైవ జాయతే!

“నాయనలారా! చూసినారా, ‘వివేక చూడామణి’ లో ఏమని చెబుతున్నాడో! జంతువులు అంటే ఇక్కడ మనుషులు అని అర్థం. మనుషులు మూడు రకాల వాసనల వలన జ్ఞానమును పొందలేరంట. వాసన అంటే బలీయమైన ప్రభావం అన్నమాట. అందులో మొదటిది లోకవాసన అంటే లౌకిక విషయాలకు సంబంధించినది. ధన, వనితా విషయములందనురాగము, స్వగుణప్రకటనము నందు ప్రీతి, పరగుణ విషయమున ద్వేషము.”

“అంటే స్వామి, మన మండల పెసిడెంటు సుదర్శన రెడ్డి మాదిరన్న మాట. యానాడూ తన తప్పెట గొట్టుకోడం తప్పించి, ఇంకోమాట రాదు కదా ఆ యప్ప నోట!” అన్నాడు ఈడిగ సంజన్న గౌడు.

అందరూ గొల్లున నగినారు.

పద్మనాభయ్య స్వామి కూడ నవ్వి, “ఒరేయ్ సంజన్నా, వ్యక్తిగతమైన ఉదాహరణలు వద్దురా నాయనా, మళ్లీ ఎందుకొచ్చిన కొట్లాట చెప్పు!” అన్నాడు. సంజన్న గౌడు తక్కువోడు గాదు.

“నాకేమి బయమా? ఆ యప్ప ముకం మీదే అంటా! ఏం చేచ్చాడు!”

రాజకీయంగా ఆ మండలంలో రెడ్లకూ ఈడిగలకూ వైరం.

మంగలాయన శరభయ్య అన్నాడు. “అన్నా, మీ రాజకీయాలు దేవళం లోకి ఎందుకు తెస్తావు? ఉరుకోన్నా.”

తెలుకల వలీ అన్నాడు – “సిన్నపుడు స్కూల్లో మన సుబ్రమణ్యం సారు చెప్పింది మతికొస్తాందింది. ఎనుకటి కొకాయన అన్నాడంట – ఆత్మ స్తుతి, పరనింద జేసే లంబ్డీ కొడుకులను నా ఎడంకాలి సెప్తో గొట్తా. నేను సూడండి యానాడయినా అట్ట జేసినానా?”

మళ్లీ అందరూ నవ్వినారు.

చాకలి ఎల్లప్ప “ఆ యప్ప ఒకేమాటలో ఆత్మస్తుతి, పరనింద జేసె గద!” అన్నాడు.

దూరంగా కూసున్న వీరకేశవ రెడ్డి గట్టిగా అరిచినాడు “స్వామి ఏవో మంచి మాటలు చెబ్తాంటే మజ్జన మీ అతిక ప్రెసంగం ఏందిరా? ఇనండి ముందు!”

పద్మనాభయ్య కొనసాగించినాడు “ఇంక రెండవది దేహవాసన అంటే మన ఈ శరీరమునందు రాగపూర్వకమైన పోషణాసక్తి. శరీరం మీద మనకు వ్యామోహం ఎక్కువయ్యేకొద్దీ, జ్ఞానానికి దూరమవుతాము అంటున్నాడు.”

రామానుజశెట్టి కల్పించుకున్నాడు. “సామి, మరి దేహము సక్రమంగా ఉంటేనే కదా ఏమయినా చేసేది. ఆరోగ్గెంగా ఉంటేనే మంచి పుస్తకాలు చదువుతాము, మంచి మాటలు వింటాము. మీరే కదా మొన్నెపుడో ‘శరీర మాద్యం ఖలు ధర్మ సాధనమ్’ అని చెబ్తిరి!”

“నిజమేరా శెట్టీ! కనీసావసరాలైన తిండి, గుడ్డ ఈ శరీరానికి సమకూర్చాల. అట్లని అదే పనిగా దానికి జోపానం (contribution) చేసుకుంటా పోతే, ఆఖరికి ‘శరీర మాంద్యం’ దాపురిస్తాది!” అన్నాడు పద్మనాభయ్య.

“అట్ట గడ్డి పెట్టు సామీ కోమటాయనకు. అంతా తనకు తెలిసినట్టు మాట్లాడుతూంటాడు!” అన్నాడు సంజన్నగౌడు.

“లేదులేరా, వాడు చెప్పిందాంట్లో నిజముంది. మితంగా దేహాన్ని పోషించుకొని, కాపాడుకుంటే, దాన్ని జ్ఞాన సముపార్జనకు ఉపయోగించుకొనవచ్చును.”

శెట్టి గౌడు పక్క విజయవంతంగా చూసినాడు.

పద్మనాభయ్యలో ఉండే గొప్పతనం అదే. తానే మహాపండితుడనన్నట్లు ప్రవర్తించడు. శ్రోతల్లో చర్చకు అవకాశం ఇస్తాడు. కొందరు అధిక ప్రసంగం చేసినా సహిస్తాడు. ప్రసన్నంగా ఉంటాడు. ‘శమము’ అన్న సద్గుణానికి నిలువెత్తు ఉదాహరణ ఆయన.

“ఇక మూడవది శాస్త్రవాసన అంటే పాఠానుష్టానాదులు అన్నాడు. ఇక్కడే నాకూ అర్థం కాలేదురా. శాస్త్రాధ్యయనం జ్ఞానానికి ఎట్లా అవరోధమవుతుందబ్బా!”

అందరూ ఆలోచనలో మునిగినారు. కొంచేపటికి కొండారెడ్డి అన్నాడు.

“సామీ, నాకేమనిపిస్తోందో చెబుదునా?”

“చెప్పురా కొండా, నాకీ అన్నీ తెలియాలని ఎక్కడుంది?”

“శాస్త్రాలను బాగా చదువుకున్నా, ఏమాత్రం దొమ్మపొగురు (అహంకారం) ల్యాకుండా ఇనయ ఇధేయతలతో ఉండాల. ల్యాకపోతే ఆ జ్ఞానం ఎందుకూ పనికిరాదనేమో?”

“ఎంత బాగా చెప్పినావురా కొండా! నా మనసులో కూడ ఇదే వుండింది. శాస్త్రవాసనను తప్పించుకోవాలంటే తాను సకల శాస్త్రకోవిదుడిని అనే అహంకారమును విడనాడడం అన్నమాట! సెబాస్ రా నాయనా!”

అందరూ కొండారెడ్డి పక్క మెచ్చికుంటూ బూసినారు.

వలీ అన్నాడు “మా కొండారెడ్డి సిన్నాయన ఏం తెలియనట్టుంటాడు గాని, మా సెడ్డ గ్యాని!”

మళ్లీ అందరూ నవ్వినారు.

పద్మనాభయ్య రాములవారికి హారతిచ్చినాడు. అందరూ కళ్లకద్దుకుని ఆయనకు మొక్కి ఇండ్లకు బోయినారు.

***

సంజన్న గౌడ్ ఇంటికి బోయినంక కుంచేపు వాండ్ల నాయిన దగ్గర కూచుండాడు. ముసలోనికి ఎనబై ఏండ్లు దాటిండాయి. ఐదారేండ్ల కాడ్నించి మెత్తబడ్నాడు. కాని, ఎవ్వురి మీద ఆదారపడకుండ, కర్ర పోటేసుకుంట, తన పని తాను చేసుకుంటాంటాడు.

“అన్నం దింటివా, నాయినా? దగ్గు బుసకు మందేసుకుంటివా?’’ అనడిగినాడు తండ్రిని. ఆయన పేరు కేశవన్న గౌడు.

“తిన్నాలేరా అబ్బీ, కోడలు ఇప్పుడే మందిచ్చిపాయె. దేవుళం కాడ్నించా?” అనడిగినాడు కొడుకును.

“ఔ. ఏదో పద్మనాబయ్య సామి నాలుగు మంచి మాటలు సెప్తాంటే సెవినేనుకొని వస్తోండా.”

“మంచిపని చేసినావులే. సర్లేగాని, రేపు మొరుసు సేను దాపున తాటితోపులో కల్లు దింపిచ్చాండావా లేదా?”

“మన అబిమన్యు గాన్ని, వాని పెండ్లాం రమణమ్మను రమ్మన్నానులే నాయినా, అయన్నీ నేను జూసుగుంటా గద! నీవు నిమ్మలంగుండు.”

“కల్లు లెక్క (డబ్బు) సేతికందినంక, కోడుమూరులో నాకు బ్రాంది కొనుక్కుని రారా! నోరంత సప్పగయినాది. మన కల్లు ఏ మాత్రం అర్రుకొనడంలా!!” అని కొడుకు చేయి పట్టుకోని, అడిగినాడు తండ్రి.

నరాలు తేలిన నాయిన చేయి నిమురుతూ, నవ్వి అన్నాడు సంజన్న “తెచ్చాలే! కానీ రొంత రొంత దాగాల నువ్వు. వారం దినాలన్నా తీసిపెట్టుకొని! పండుకో యింక!”

సంజన్న బార్య ఇమలమ్మ మొగున్ని జూసి నగినాది.

“మామకు బ్రాంది గావాలంటనా?” అని అడిగింది.

“ఆ. పోన్లే పాపం శివరి దినాలు. ఆ యప్ప కోరిక దీరిస్తే నాకూ ఆయిగుంటాదీ పానానికి.”

“రేపు కల్లు దింపనీకి నేనూ వచ్చాలే!”

“ఒద్దమ్మే! నాయనను జూసుకో నీవు. మన అబిమన్యు వాండ్లుంటారు గద! మేం జూసుకుంటాము లే. పిల్లడు పండుకున్నాడా?”

“ఆ. ఇంచేపు నీ కోసరం జూశ. ఇప్పుడే పండుకొనె.”

సంజన్న గౌడుకు మొరుసు సేను మూడెకరాలుండాది. దాంట్లో జొన్న, సజ్జ పండుతాది. దాని నానుకొని రెండకరాలు తాటివనం ఉండాది. కుల వృత్తి వాండ్లది వదలలేదు సంజన్న. కల్లుగీతలోల్లను కర్నూలు జిల్లాలో ఈడిగోల్లంటారు.

తాటివనంలో సుమారు రెండువందల తాటి చెట్లుండాయి. సంజన్న కాడ పనిజేయనీకి ఉప్పరి అబిమన్యు, వాని పెండ్లాం ఉండారు. తాటిమాను ఎక్కడం సంజన్నకు కూడా వచ్చు. చెట్టు పై బాగంలో ఒడుపుగా కొడవలితో చిన్న గీత గీస్తారు, అరంగుళం కంటె తక్కువ లోతున. కింద తాళ్లను ఒక లొట్టి (చిన్న కుండ) గొంతుకు చుట్టి, చెట్తు వెనక్కు ముడేస్తారు. కల్లు బొట్లు బొట్లుగా లొట్టిలో పడతాది.

ఒక్కో లొట్టిలో, రెండు నుండి మూడు లీటర్ల కల్లు పడుతుంది. వారానికో తూరి దింపుతే ఇరవై ముప్ఫై ముంతలు దిగుతాయి. అవి ఎద్దులబండిలో ఏస్కోని, వెల్దుర్తి – కోడుమూరు రోడ్డులో లద్దగిరి, గోరంట్ల సెంటర్లలో పెట్టుకుంటారు. గ్లాసు రెండు రూపాయలకమ్ముతారు. అభిమన్యు పెండ్లాం కారం బొరుగులు, మిరపకాయ బజ్జీలు, అలచంద వడలు దండిగా జేస్కొని రెండు గంపలనిండా పెట్టుకోని అమ్ముతాది. కల్లు తోని నంచుకోడానికి శానా రుసిగా ఉంటాయవి.

ఇంతకు ముందు ఆ తోవ బండ్ల బాటగా ఉండె. గవర్మెంటు రెండేండ్ల కిందట పక్కా తార్రోడ్డు ఏపిచ్చింది. వెల్దుర్తి నుంచి కోడుమూరుకు ఆర్టీసీ షటిల్ బస్సులు తిరుగుతాయి. కోడుమూరు మల్లా కర్నూలు – ఎమ్మిగనూరు మెయిన్ రోడ్డులో ఉంటాది. ఎమ్మిగనూరికి ఆదోని, మంత్రాలయం దగ్గర. నంద్యాల, డోన్ నుంచి మంత్రాలయానికి ఈ రోడ్డు మీదుగా బస్సు పడింది. బైకులు, స్కూటర్ల మీద పోయేటోల్లు కూడ వీండ్ల కాడ ఆపి కల్లు దాగిపోతారు.

బస్సులోల్లు కూడ ఆపుతారు. డ్రయివరుకు కండక్టరుకు ఫ్రీగా ఒక గ్లాసు పోస్తారు. కల్లులో ఉన్న ఇశేషమేమంటే, పూర్తిగా పులిస్తే తప్ప, మత్తు ఎక్కదు. కల్లు పాకలో పూర్తిగ పులియబెట్టి, దాంట్లో ఇంకా ఏవేవో కలుపి అమ్ముతారు.

సంజన్న గౌడు కల్లు తాజాగా ఉంటాది. తియ్యగా ఉంటాది. మత్తు రాదు. కడుపులో సల్లగా ఉంటాది. ఆరోగ్యానికి శానా మంచిదని గూడా అంటారు మరి. ఏదయినా మితంగా తిన్నా, తాగినా మంచిదే గద!

సాయంత్రానికి మొత్తం కల్లు అమ్ముడైనాది. ఐదారువందలు లెక్కదేలినాది. సంజన్న తన సైకిలు మిందే కోడుమూరికి బోయి, ‘శ్రీవల్లెలాంబా వైన్స్’ లో ఒక క్వార్టరు సీసా బ్రాందీ కొనుక్కున్నాడు తండ్రి కోసరం. ఆరేండ్ల కొడుకు ప్రదీపు కోసరం ఒక ప్లాస్టిక్ ట్రాక్టరు బొమ్మ, న్యూట్రిన్ చాకొలెట్లు, ఉప్పు బిస్కెట్లు కొనుక్కున్నాడు. పెండ్లానికి దవనం, మల్లెపూలదండ ఒక మూర, బెల్లం జిలేబి చుట్టలు పావు కేజీ తీసుకున్నాడు. తాను కూడా కోడుమూరు బస్టాండు కాడ బండి మీన గుడ్డు దోస తిని, సైకిలెక్కినాడు. అక్కడినుంచి బొమ్మరెడ్డిపల్లె ఇరవై కిలోమీటర్లుంటాది. గంటన్నరలో ఊరు చేరుకున్నాడు.

***

సంజన్న గౌడుకు రాజకీయాలంటే శానా యిష్టము. తాను సదువుకొని పెద్ద ఉద్యోగం జేయలేక పోయినాడు. రాజకీయాలతో రానించాలంటే సదువుతో అగత్యం లేదు కద!

వాండ్ల పెద్దనాయన కొడుకు అంకప్ప గౌడు నాగపూరులో లాయరు చదివి కర్నూల్లో ప్రాక్టీసు జేస్తోండాడు. వాండ్ల మేనమామ మొదుట్నుంచి రాజకీయాలలో తిరుగుతాండాడు. లద్దగిరి విజయరామిరెడ్డికి ఆ యప్ప శానా నమ్మిన బంటు. బాగా సంపాదిచ్చినాడు. ఆ యప్ప మాదిరి తాను గూడ్క కావాలని సంజన్న ఆరాటము.

బొమ్మిరెడ్డిపల్లెలో రాజకీయాలు అంతగా లేవు – సర్పంచును గూడ్క అందరూ కూచొని ఒక మాట అనుకొని ఏకగ్రీవం చేస్తారు. యా నాటికయినా డోనుకో, కోడుమూరుకో జేరి, ఒక నాయకుని ప్రాపు సంపాదిచ్చి, ఒక ఎలుగు ఎలగాలని సంజన్న శానా ఆశపడుతున్నాడు. వాండ్ల నాయిన కిస్టం లేదు – “కల్పవృచ్చం మాదిరి తాటి వనముండాది. అది సూసుకుంటా ఆయిగా ఉండక ఎందుకొచ్చిన రాజకీయాలు!” అంటాడాయప్ప.

సంజన్న కొడుకు ప్రదీపు ఆరేండ్లవాడు. ఎలిమెంటరీ స్కూల్లో రెండు సదువుతూండాడు. వాన్ని మంచి కాన్వెంటులో చేర్చాలంటే కర్నూలు కన్నా బోవాల, లేదా డోను కన్నా బోవాల. అప్పటికి వెలుదుర్తిలో గాని, కోడుమూరులో గాని, ఉళింద కొండలో గాని కాన్వెంటులు లేవు. సంజన్న ఉళింద కొండ జడ్.పి. హైస్కూలులో ఎనిమిది వరకు జదివినాడు. ఇమలమ్మ కూడ ఐదు పాసయినాది.

***

దేవళం కాడ్నించి పద్మనాభయ్య స్వామి యింటికి బోయినాడు. ఆయన యిల్లు కొండారెడ్డి యింటికి ఆరిండ్ల అవతల ఉంటాది. యింటి ముందు రెండరుగులుంటాయి. వాటి మీద వారపాగు దింపినారు.

ఆయన దగ్గర పంచాంగం చెప్పించుకోనీకె, మంచిరోజులు చూపించుకోనీకె వచ్చే జనమంతా అరుగుల మీదనే కూసుంటారు. ఆయన మాత్రం ఒక చేతులు లేని చెక్క కుర్చీలో కూసుంటాడు. వచ్చినొండ్లకు సిరిసాపలుంటాయి. అవి అరుగుల మీదే ఒక మూలన సుట్టి పెట్టి ఉంటాయి. సామి దగ్గర కొచ్చెటోల్లు సాప పరుసుకొని కూసుని, పనయిన తర్వాత మళ్లీ సుట్టిపెట్టిపోతారు. దచ్చిన పావలా కాన్నించి రూపాయ వరకు తమలపాకులు వక్కలతో బాటు పెడతారు. బొరుగులు, గుల్లపప్పులు, బెల్లం కలిపిన ‘పలారం’ గూడ్క సామి కోసరం తెస్తారు.

ఆయనను జూసి ఆయన భార్య మీనాక్షమ్మ చెంబుతో నీళ్లు, ఎర్రని కాశీ సన్నపంచ తీసుకొచ్చినాది. ఆయన కాలు సేతులు కడుక్కొని, నోరు పుక్కిలించి, ముకం కూడ కడుక్కుని, సన్నపంచతో సుభ్రంగా తుడుచుకున్నాడు. అరుగుల మజ్బన ముక ద్వారం. దాన్ని దాటంగనే ఒక అంకనం కాలీ స్తలం. దాన్ని దాటినంక పడసాల, పడసాలకు కుడి వైపున ఒక గది, ఎడంవైపున వంటిల్లు, దాంట్లోనే దేవుండ్లను పెట్టుకొనే ‘మందహాసం’ (చుట్టూ నాలుగు చెక్క నగిషీ స్తంభాలు, పైన గోపురం, క్రింద పీఠం గల పూజామందిరం). ఎనక చిన్నదొడ్డి. దాంట్లో బోరింగు, మూలన కక్కుసు దొడ్డి. ఇదీ పద్మనాభమయ్య యింటి సమాచారం.

ఆ రోజు శనివారం. రాత్రి అందరూ ఫలహారమే. తండ్రి వచ్చిన అలికిడి యిని కొడుకు కేదారనాథశర్మ గదిలోనుంచి బయటకు వచ్చినాడు.

“చదువుకోవడం అయ్యిందా కేదారా?” అనడిగినాడు తండ్రి .

“ఔన్నాయనా, ఇప్పుడే అయిపాయ – ఇంగ్లీషు లెక్కలు సారిచ్చిన వర్కు చేసుకున్నా. నాయినా, మనుచరిత్రలో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యములు రాసుకుని రమ్మని తెలుగు సారు నరసింహయ్య చెప్పినాడు. అది కొంచెం నీవు జెప్పాల” అన్నాడు కేదార.

“చెబ్తాలే నాయనా, దానిదేముంది? నీవు అన్నం తిన్నావా?”

“లేదు నాయనా, ఈ రోజు మీతో బాటు పలారం జేద్దామని ఉన్నా”

ముగ్గురూ వంటింట్లో కింద కూచున్నారు. మీనాక్షమ్మ మూడు ఇస్తర్లను నీల్లు జల్లి తుడిచి పెట్టింది. కంచు గిన్నెను తెచ్చి మధ్యలో పెట్టింది – నెయ్యి పావును ముందే బొగ్గుల పొయ్యి కింద గూడులో పెట్టడం వలన అది చక్కగా కరిగి ఉంది.

గిన్నె లోంచి ఒక ఇత్తడి హస్తముతో ఉప్పుడు పిండిని తీసి ముగ్గురికీ వడ్డించిందామె. అది పొగలు కక్కుతా ఉంది. దాని మీద పుట్నాల పొడి వేసి నెయ్యి పోసింది. ముగ్గురూ కలుపు కొని తినబట్టిరి. మల్లొమారు వడ్డించుకొని దాంట్లో మజ్జిగ బోసుకుని, చింతకాయ తొక్కుతో తినిరి.

పడసాలలో తండ్రీ కొడుకులు చాప వేసుకుని కూర్చొన్నారు. మీనాక్షమ్మ దొడ్లో గిన్నెలు కడుక్కుంటూన్నది. పద్మనాభయ్య కొడుకుతో అన్నాడు.

“ఏదీ ఏదో పద్యమన్నావు? తియ్యి!”

కేదార తెలుగు వాచకం తీసినాడు. ఎనిమిదవ తరగతి దది. దాంట్లోని పద్యం తండ్రికి చూపినాడు. ఆయన మొదట రెండు పదాలు చూస్తూనే, “ఇదా” అని రాగయుక్తంగా పద్యాన్ని చదివినాడు.

‘అతని నుతింప శక్యమె? జయంతుని తమ్ముడు సోయగంబునన్..’

కేదార నాయన వైపు అబ్బురంగా జూసినాడు. తర్వాత ఆయన చెబుతుంటే పద్యానికి ప్రతిపదార్థం రాసుకున్నాడు. తాత్పర్యంతో పనిలేదన్నాడు. ప్రతిపదార్థాన్ని బట్టి తాను రాసుకోగలనన్నాడు.

పడసాలకు ఒక మూల గోడ నానించి ఒక నవారు మంచం ఉన్నది. దాని మీద ఒక బొంత, దిండు ఉన్నాయి. పద్మనాబయ్య పోయి దానిమీద నడుం వాల్చినాడు. కేదార కుంచేపు తండ్రికి కాళ్లు పిసికినాడు. వేళ్లు చప్పుడయ్యేటట్టు యిరిసినాడు.

“ఇంగబోయి పడుకోపో నాయనా” అని తండ్రి చెప్పిన తర్వాత కేదార తన గదిలోకి బోయి పండుకున్నాడు. మీనాక్షమ్మ కూడ లైట్లు ఆర్పి, కొడుకు పక్కన మేను వాల్చినాది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here