మహాప్రవాహం!-20

0
15

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[డోన్‍కు కుటుంబాన్ని మార్చేటప్పుడు ఊర్లోని ఇల్లు అమ్మేసి వస్తానని అంటాడు సంజన్న రామగిరితో. ఆ డబ్బుతో బ్యాంకు లోను తీర్చేయచ్చని అంటే, లోను తీర్చడానికి తొందరేమీ లేదని అంటాడు రామగిరి. ఎంకటప్ప గచ్చుకీ, గోడలకీ ప్లాస్టరింగ్ పని పూర్తి చేస్తాడు. కరీమ్ అనే పెయింటర్ మాళిగకు రంగులు వేస్తాడు. గోవిందరాజులు శెట్టితో ఇరవై సంవత్సారాలకు అగ్రిమెంటు చేసుకుంటాడు సంజన్న. షాపుకు కొడుకు పేరు పెడతాడు. వరదాచారి వచ్చి ఉడ్ వర్క్ చేయిస్తాడు. ఎలక్ట్రీషియన్ శేషన్న కరెంటు పనులు పూర్తి చేస్తాడు. మొత్తానికి షాపు సర్వాంగ సుందరంగా తయారవుతుంది. సుంకిరెడ్డి తనదగ్గర పనిచేసే డేవిడ్‍ని సంజన్న వెంట కర్నూలు వన్ టౌనులోని గోడవునుకు పంపుతాడు. హోల్‍సేల్ డీలర్ శ్రీశైల గౌడ మంచిగా మాట్లాడి సరుకిచ్చి, లారీలో పంపుతాడు. మూడో రోజుకు సరుకు దిగుతుంది. జాగ్రత్తగా షాపులోని అరల్లో సర్దుకుంటారు. ఓ మంచి ముహూర్తంలో  స్థానికి సమితి ప్రెసిడెంటు హరనాథరెడ్డితో ప్రారంభం చేయిస్తాడు. బోణీ ఆయనతోనే చేయిస్తాడు సంజన్న. వచ్చిన వాళ్ళందరికీ టీ, స్వీట్లు, మిక్సర్ తెప్పించి ఇస్తాడు. రెండు రోజులయ్యాకా, సుంకిరెడ్డి, రామగిరితో కలిసి బ్యాంకు వెళ్ళి మేనేజర్‍ని కలిసి లోన్ గురించి మాట్లాడుతాడు సుంకన్న. రామగిరి మూడేండ్ల పాటు లోనుకు గ్యారంటీ ఉంటానంటాడు. అన్ని పత్రాలు సబ్‍మిట్ చేసి వస్తారు. బొమ్మిరెడ్డిపల్లి నుంచి తిరుపాలు, రాజమ్మ వస్తారు. వాళ్ళకి ఓ తోపుడుబండి చేయించి ఇస్తాడు సంజన్న. దాని మీద ఉదయం సాయంత్రం వాళ్ళు రకరకాల తినుబండారాలు అమ్ముకుంటూ కాస్త కుదుటపడతారు. వ్యాపారం పుంజుకుంటుంది. కట్టాల్సిన వాయిదాలన్నీ సకాలంలో కడుతున్నాడు సంజన్న. ఊర్లో కొడుకు ప్రదీప్‍ది ఏడో తరగతి పూర్తవుతుంది. కొడగెనహళ్లి రెసిడెన్సియల్ స్కూలు ఎంట్రన్స్‌కు పార్వతీశం సారు ఇచ్చే శిక్షణ కూడా ముగుస్తుంది. కుటుంబాన్ని డోనుకు తరలిస్తాడు సంజన్న. కొడుకుకి కొడగెనహళ్లి రెసిడెన్సియల్ స్కూలులో సీటు వస్తుంది. పార్వతీశం దంపతులని తమ ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి కొత్తబట్టలు పెట్టి, సారుకు బంగారు ఉంగరం పెడతారు. ఆయన, సంజన్న వెళ్ళి పిల్లాడిని కొడగెనహళ్లి రెసిడెన్సియల్ స్కూలులో చేర్పించి వస్తారు. ఇక చదవండి.]

[dropcap]మం[/dropcap]గలి శరబయ్య తిక్కయ్య శాపులో పనిచేయ బట్నాడు. పెద్దోడని తిక్కయ్య గుడ్క ఆ యప్పను మరేదగ జూస్తున్నాడు. శరబయ్యకు గుడ్క దిన రోజు పది పన్నెండు రూపాయలు గిట్టుబాటు అయితుండాది. తమ్ముడు సుంకన్న మల్లా వచ్చి ఇంటి సంగతి ఏం జేసినావని అడిగినాడు.

ఒక దినం అన్నదమ్ములిద్దరూ రుక్మాంగద రెడ్డి కాడికి బోయినారు. “ఏందిరా శరబయ్యా, ఏం పని మీద వస్తిరి” అనడిగినాడు రెడ్డి. కొడుకు వెల్దుర్తిలో చెప్పుల శాపు పెట్టుకోవాలను కుంటుండాడనీ, తమ్మునికి కాల్వబుగ్గ దేవస్తానములోని డోలు వాయించే పని దొరికిందనీ, ఇల్లమ్ముకోని, దుడ్డు సంతరిచ్చుకోవాలనీ ఆ యప్పకు చెప్పినాడు శరబయ్య.

పెద్దరెడ్డి పకపకా నగినాడు. “ఒరేయ్ మంగలాయనా, ఆకులు తినేటోడు బోయి మ్యాకలు దినేటోన్ని అడిగినాడనీ, నేనే సేద్దాలు తగ్గించుకొని, కర్నూల్లో యాపారం బెడదాము, మా అన్న కొడుకుతో గలిసి అని చూస్తాండా. మా కోసం పానాచ్చిన పోటుగాండ్ల కుటుమానాలను సాకనీకెనే సరిపోతుండాది మాకు. నీ యిల్లు కొనుక్కోని నేనేం వేసుకుంటాను రా?” అన్నాడు.

“నాయినా, నీవే యాదన్న దావ సూడాల మరి” అన్నాడు సుంకన్న.

కుంచేపు ఆలోచించినాడు రెడ్డి. “ఆమద్య మన గొల్ల మద్దిలేటి ఎనుముల పోశన మానుకోవాలనీ, పిండి గిర్ని పెట్టాలనుకుంటాన్నానీ జెప్పిండే. మ్యాతలు పిరియమై, రెండెనుములు వాతం రోగమొచ్చి సచ్చిపోయి నాయంట. ఆ యప్పకు సొంత యిల్లు గుడ్క లేదు గదా! మీ యిల్లు కొనుక్కుంటాడేమో అడుగుదాము. బాగు జేపిచ్చుకుంటీ గిర్ని పెట్టుకోవచ్చు, వాండ్లు గుడ్క ఒక మూలన ఉండొచ్చు” అని, చెట్టుకింద టాకటరు కడుగుతున్న డ్రైవరు నబీని బలిచి, “నబీ, నేను రమ్మన్నానని జెప్పి, గొల్లమద్దిలేటినీ, వాని పెండ్లిము శేషమ్మను పిల్చుకురా పో” అని చెప్పినాడు.

పది నిమిసాల్లో ఇద్దరూ వచ్చి రెడ్డికి మొక్కి కింద కూసున్నారు.

“పిండిగిర్ని పెడతానంటివి గదరా, ఆ మధ్యన! ఏమాయ?” అని అడిగినాడు రెడ్డి.

“రెండు ఎనుములు సచ్చిపాయ నాయినా, ఇంకొకటి ఉండాది. పాల వర్తనలు గుడ్క తగ్గిపాయ. పిండిగిర్ని పెట్టనీకె దుడ్డు కావాల గదా. మా యింటి దాని పుట్టింటోల్లు దానికి వాండ్ల ఊరు బింగిదొడ్డిలో తొంబై సెంట్లు కొని యిచ్చినారు. ఇంతవరకు మా బావ దాన్ని సాగు చేసి ఎంతో కొంత యిస్తాండె. పోయినేడు ఆ యప్పగుడు సచ్చిపాయ. అందుకే బింగిదొడ్డి సర్పంచు రామ్ముని రెడ్డికే ఆ శేను అమ్మితిమి ముప్పైనిమిదివేలకు. అంద్రీలో నీల్లోస్తే ఒక కారు వరి గుడ్క పండుతాది. మాకు ఈడ యిల్లు గుడ్క లేదు. యాదయినా యిల్లు దొరికితే గిర్ని బెట్టుకోని, మేము గుడ్క సర్దుకోవచ్చునని జూస్తాండాము” అన్నాడు గొల్ల మద్దిలేటి.

‘చూసినారా ఎంత కరక్టుగా ఆలోశన జేసినానో’ అన్నట్టుగా శరబయ్య దిక్కు జూసినాడు పెద్దరెడ్డి. మద్దిలేటితో అన్నాడు.

“ఒరేయ్ మద్దిలేటి, రోగీ పాలు కావలనుకునె, వైద్యుడూ పాలే పత్యం పెట్టినని, ఈ మంగలాయనకూ నీకూ సరిగ్గా సరిపోయింది. ఈ యప్ప తన యిల్లు అమ్ముతాడంట సూడు. నీవు గిర్ని పెట్టుకొనికె, ఉండనీకె గుడ్క సరిపోతాది.”

గొల్లాయన ఆలొచించినాడు. “నిజివే నాయినా, ఎంత సెపుతుండాడో మంగలాయన?”

శరబయ్య సేతులు జోడించుకోని అన్నాడు “పెద్దరెడ్డి జెప్పిన మాట మీరి యానాడయిన బోయినామా? ఆ యప్ప ఎట్ట చెపితే అట్ట.”

“అంతే గద! నాయినకు తెలియనిది ఏముండాది” అన్నాడు మద్దిలేటి.

“బాగుంది రోయ్, అమ్మేది వాడు, కొనుక్కునేది నీవు. మద్యన నా కెందుకు?” అన్నాడు రుక్మాంగద రెడ్డి. అన్నాడు కాని ఊర్లో తనకింకా మరేద ఉన్నందుకు, తన మాటకు వాండ్లు ఇలవ యిస్తూన్నందుకు ఆ యప్ప మొగంలో కుశాల కనపడినాది.

“సరేరా, మొన్ననే వడ్లాయిన రామబ్రెమ్మం తన యింటిని రామానుజశెట్టి కమ్మినాడు గదా! అది మూడున్నరంకనాలుంటాది. ఇరవై ఎనిమిదివేలకు యిచ్చినాడు. మీది ఎంత వుంటాదిరా ఇస్తీర్ణము?”

“మాది మూడంకనాలుంటాది రెడ్డి” అన్నాడు శరబయ్య.་་

కుంచేపు మనసులో లెక్కీసినాడు పెదరెడ్డి.”ఇరవై నాలుగు కయితే ఇద్దరికీ నష్టముండదు” అన్నాడు.

“నివ్వే కుంచిం దయ సూడాల మరి!” అన్నాడు గొల్లాయన.

“ఏమిరా శరబయ్యా, ఏమంటావు?”

“నీ వెట్టా ఫయిసలు జేసినా మాకు సమ్మతమే నాయినా, ఏమిరా సుంకన్నా” అని తమ్మున్ని అడిగినాడు.

“పెదరెడ్డి మాటే ఆకరు” అన్నాడు సుంకన్న.

“సరే, రెండువేలు తగ్గించి, ఇరవైరెండుకు కాయం చేస్తాన్నా” అన్నాడు పెదరెడ్డి.

“అట్నే నాయినా” అని అందరూ తలలూపినారు.

ఇట్టాంటి వ్యవహారాలన్నీ ఊర్లో పెద్దరెడ్డి తెంపుతాడు. అందులో ఆ యప్పకు స్వార్తముండదు. రెండుపక్కలా న్యాయం జేస్తాడు. రేపు పొద్దున్న దుడ్డు విషయంగాని, – ఇంకేదైనా గాని తగువొస్తే, పెదరెడ్డి కూచోబెట్టి తీరుస్తాడు. అందుకే అందరూ ఆ యప్ప కాడ తేల్చుకుంటారు.

పదిదినాలలో మద్దిలేటి శరబయ్యకు దుడ్డు ఇచ్చేసినాడు. రెడ్డి ఎదురుగా ఒక కాయితం రాసుకొన్నారు. సాచ్చి సంతకం పెద్దరెడ్డే చేసినాడు. ఇంక రిజస్ట్రేషన్ గుడ్క పనిల్యా.

కొందరు రెడ్డి కాడికి రాకుండా వాండ్లలో వాండ్లే చూసుకుంటారు. అట్లని పెద్దరెడ్డికి వాండ్ల మింద కోపమేమి ఉండదు.

తమ్ముడు సుంకున్నకు పదకొండు వేలు ఇచ్చేసినాడు శరబయ్య. వెయ్యి రూపాయలు కర్చులకు పెట్టుకోని, పదివేలు కొడుకు మాదవ కిచ్చినాడు. తిక్కయ్య ఇంటి పక్కన చిన్న మట్టిమద్దె, ఒకటిన్నర అంకనం ఉంటాది, దాన్ని బాడిక్కి తీసుకోని, దాంట్లోకి మారిపోయినారు ఆలూ, మొగుడు. దానికి బాడిగె ముపై రూపాయలు!

సుంకన్న ముందు బోయి కాల్వబుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జేరినాడు, డోలు వాయిద్దెకాడుగా. కర్నూలు – నంద్యాల అయివే మిందనే ఉంటాదా దేవస్థానం. శానా పెద్దది. దానికి దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆపీసరుంటాడు. రోడ్డు మిందకి సామివారిని తిర్నాలలో ఊరేగించే రతం కనబడతాది. శివరాత్రికి సుట్టు పక్కల ఊల్ల నుండి జనం ఇపరీతంగా వస్తారు. జాగరన చేస్తారు. హరికథలు, పురానాలు చెబుతారు. రకరకాల అంగల్లు పెడతారు. మొత్తం మూడు రోజుల తిర్నాల రతోత్సవంతో ముగుస్తాది.

దేవలం సుట్టూ ఎత్తుగా పాకారం ఉంటాది. దొజస్తంబం గుడ్క రోడ్డు మీదకి కనపడతాది . లోపల పెద్ద కోనేరు, దాని మధ్యన నాలుగు స్తంబాల మంటపం ఉంటాయి. కోనేట్లో అన్ని కాలాల్లో నీల్లుంటాయి. దేవలంతో పెండ్లిండ్ల సీజనులో శానా పెండ్లిండ్లు జరుగుతాయి.

గుల్లో సన్నాయి మ్యాలం పాండ్లకు వంశపారంపర్యంగా ఉద్యోగముంటది. మొన్న సచ్చిపోయిన డోలాయినకు వారుసులు లేరు. సుంకన్న పెండ్లానికి పెద్ద సన్నాయి మాస్టరు మామయితాడు. ఆ యప్పనే యి.ఓ.గారి చెప్పి సుంకన్నను జేర్పించినాడు. సుంకన్న సచ్చిపోయిన ఆయనకు తమ్ముడని రాయించినారు.

కర్నూలుకు నంద్యాలకు సుమారు మద్యనే ఉంటాది కాల్వబుగ్గ. దేవలానికి కొంచెం ముందే పెద్ద కాలవ పారతాంటాది. అరటితోటలు మామిడి తోటలు ఎక్కువ. లోపల కోనేరులో పెద్ద నీటి బుగ్గ ఉంటాది. ఈ రెండిటి మూలంగా ‘కాల్వబుగ్గ’ అనే పేరొచ్చినాదేమో.

ఓర్వకల్లు దాటినంక కాల్వబుగ్గ వస్తాది. నంద్యాల, కడప, తిరుపతి, మద్రాసు బోయే ఎక్స్‌ప్రెస్సులు కాల్వబుగ్గలో నిలబడవు. కర్నూలు- నంద్యాల ప్యాసింజరు బస్సులు మాత్రము ఆడ ఆపుతారు.

పొద్దున్న ఐదు గంటలకే సన్నాయోల్లు సామికి మేలుకొలుపు పాడాల. తర్వాత అభిషేకం అయ్యేంతవరకు పని ఉండదు. తర్వాత కుంచేపు వాయించాల. సాయంత్రం శానాసేవు వాయిస్తారు. రాత్రి పవలింపు సేవ అప్పుడు వాయిస్తారు.

ప్రెత్యేకమైన పండగ దినాల్లో, కార్తీకమాసంలో మ్యాలగాండ్లక పనెక్కువ ఉంటాది.

వారం దినాలు ఇ.ఓ. గారి నడిగి దేవలం లోనే పండుకున్నాడు సుంకన్న. గుడి ముందు ఒక కొట్టం ఓటలుండాది. నన్నూరాయన పెట్టినాడు. కోమటోల్లు. ఆ యప్ప పేరు రత్నంశెట్టి. పొద్దున్న ఇడ్లీ, పూరి, ఉగ్గాని బజ్జీ చేస్తాడు. టీ ఉంటాది. మద్యానం బోజనం గుడ్క పెడతాడు. ఐదు రూపాయలు. అన్నం, యాదయినా ఆకుకూర పప్పు పల్సగ జేస్తాడు. కూర ఏమీ ఉండదు. మజ్జిగ బోస్తాడు.

సోమయాజులపల్లె కాల్వబుగ్గకు ఐదు మైల్లుంటాది. సుంకన్న తన పెండ్లాన్ని బిడ్డను దీసుకచ్చి అడ కాపురం బెడ్తామనుకున్నాడు. అదే మాట రత్నంశెట్టితో జెపితే, ఆ యప్ప – “నీవేం తిక్కోని మాదిరుండావే, మంగలాయనా. సోమయాజులపల్లెలో ఏముండాది? శానా సిన్నపల్లె, బడి గుడ్క ఉందో లేదో! నీ బిడ్డ రెండు చదువుతుండాదని అన్నావు. నా మాటిని నన్నూరుకు రాండి. మాది పెద్ద ఊరు. హైస్కూలుండాది. మీ పాపకు టెంతు వరకు ఎదారుండదు. మనకు నన్నూరు ఎనిమిది తొమ్మిది మైల్లోస్తాది. అయితే ఏమి? సోమయాజులపల్లెలో నీకు ఉండనీకి బాడెక్కు యిల్లు గుడ్క దొరకదు. దగ్గరని పేరేగాని దండగ.

నన్నూరులో మా యింటికాడనే శిన్నమట్టిమిద్దె ఉండాది. మా షడ్డకునిదే లే. ఒక దూదేకులాయన ఉండేటోడు. మొన్న కాలీ జేసినాడు. బాడిగ గుడ్క ముపై రూపాయిలే. నీ పెండ్లానికి దేవస్తానములో పని యియ్యనీకె కుదరదని ఇ.వో. గారు చెప్పినారంటివి. మీ కబ్యంతరం లేకపోతే మా ఓటల్లో ఆయమ్మిని పని చెయ్యమను. గిన్నెలు తోమాల, బెంచీలు కడగాల, లోన కసువు జిమ్మాల. కూరగాయలు దరగాల. మొన్నటివరకు మా వాండ్లే (భార్య) చేస్తాండె.  ఒక పొట్టెగాడున్నాడు పైపనికి. మా వాండ్లకు ఈ మద్యన పానం బాగలేక రావడంల్యా. సాయంత్రం ఆరు తర్వాత పనేముండదు. అందురం నన్నూరుకు బోయేటోల్లమే.”

“ఎంతిస్తావు శెట్టిగారా!” అనడిగినాడు సుంకన్న.

“టిపను, భోజనం బెట్టి ఎనబై రూపాయలిస్తా.”

బాగానే ఉందనుకున్నాడు సుంకన్న. ఊరికి బోయి ఆ యమ్మితో చెబితే సరేననింది.

నాలుగు రోజుల్లో నన్నూరు చేరింది సుంకన్న కుటుంబం. పాపని ఎలిమెంటరీ స్కూలుతో జేర్చినారు. సుంకన్న ఒక సైకిలు కొనుక్కున్నాడు. తెల్లవారి జామున దానిమింద కాల్వబుగ్గకు వచ్చేస్తున్నాడు. సుంకన్న బార్య శెట్టిగారితోబాటు పస్టు బస్సుకు ఆరుకల్లా వస్తోంది. సుంకన్న గుడిలో ప్రసాదం తింటాడు. పొద్దున శెట్టి ఓటల్లోనే టిపన్ చేస్తాడు. రాత్రి ఇద్దరూ నన్నూరుకు బోయి ఇంత వండుకుంటారు. పాప బడికి పోయొచ్చి శెట్టి గారింట్లో ఉంటాది. అట్లా కాలం ఇంకో కుటుంబాన్ని ఇగ్గుకొచ్చినాది తనెంట. ఇల్లమ్మిన దుడ్డు పిల్ల సదువు, పెండ్లికి పనికొస్తాదని నన్నురు స్టేటు బ్యాంకులో ఏసుకున్నారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here