[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఇల్లమ్మగా వచ్చిన డబ్బు తీసుకుని వెల్దుర్తిలో చెప్పుల షాపు పెట్టాలన్న ఆలోచనతో వెళ్ళి నేస్తం చలమేశ్వర్‍ను కలుస్తాడు మాధవ. మళిగె సిద్ధంగానే ఉందనీ, ఓనరుది ఆ ఊరేననీ, కూరగాయల వ్యాపారం చేస్తాడని, పగటిపూట దొరకడం కష్టమని, రాత్రి వెళ్ళి కలుద్దామని చెప్తాడు చలమేశు. జంగమోళ్ళయిన చలమేశు తండ్రి బ్రహ్మగుండంలోని శివాలయంలో పూజారి. కానీ చలమేశు తండ్రి తరువాత – ఆ వృత్తి స్వీకరించక హోటలు పెట్టుకున్నాడు. చలమేశు మామ బూతపతి బావ దగ్గర అన్నీ నేర్చుకుని ఆ గుడిలో పూజారిగా స్థిరపడిపోతాడు. ఎన్.టి.రామారావుకి వీరాభిమాని అయిన చలమేశు తన హోటలుకి పిడుగు రాముడు ఓటల్ అని పేరు పెట్టుకుంటాడు. యజమానే అయినా చలమేశు కూడా హోటల్లో అన్నీ పనులూ చేస్తాడు. వాళ్ళమ్మ ఈశ్వరమ్మ కొడుక్కి పెళ్ళి చేయాలని ప్రయత్నిస్తూంటూంది కానీ, చలమేశుకు ఒక పట్టాన ఎవరూ నచ్చరు. ఆ రాత్రి మాదవని తీసుకుని మళిగె ఓనరు నారయ్య ఇంటికి వెళ్తాడు చలమేశు. ఆయన వీళ్ళని ఆదరంగా ఆహ్వానించి – చలమేశును కుశల ప్రశ్నలు వేసి, ఏం పని మీద వచ్చావని అడుగుతాడు. మాదవని పరిచయం చేసి మళిగె గురించి మాట్లాడదామని వచ్చామని అంటాడు. నారయ్య మాధవని ఏ ఊరని, ఏం చేస్తారని అడిగితే, తమది బొమ్మిరెడ్డి పల్లె అనీ, మంగలోల్లమనీ చెప్పి, ఊర్లో బ్రతకలేక వెల్దుర్తిలో చెప్పుల షాపు పెట్టుకుందామని వచ్చానని చెప్తాడు మాధవ. నారయ్య నవ్వి, మారుతున్న కాలంలో కులవృత్తులు చాలా తక్కువ మంది చేస్తున్నారనీ, ఇప్పుడు జనాలు కులాల గురించి కాకుండా బతకడం గురించి ఆలోచిస్తారని అంటాడు. ఇక చదవండి.]
[dropcap]“అ[/dropcap]న్ని శాస్త్రాలు చెప్పిన కిస్నపరమాత్మ యదో సిన్నప్పుడు గొల్లోడు కాబట్టి ఆవులు గాసినాడు గాని, పెద్దోడయినంక రాజిమేలనాడే గద! ఇయ్యాల మాలమాది గోండ్లు గుడ్క ఎమ్.ఎల్.ఎలు, మినిస్టర్లు అయితాండారు కదా.”
“అయితే ఇదంతా తప్పంటావా మామా?” అన్నాడు మాదవ
“అంత మాట నేనుందు కంటా. ఒక రకంగ జూస్తే ఇదే శాన మంచిది. ఎవుని నైపున్యం వాడు జూపించుకోవచ్చు. సంపాయిచ్చుకోవచ్చు. శానా కాలం పెద్ద కులాల అదిపత్తెం నదిసినాది. ఇప్పుడందరు సమానమే అని అంటుండారు. సదువు అందర్నీ సమానం జేస్తాది. సదువుకోని బాగుపది నోడ్ని, వాని కులం పేరెత్తి ఏమయినా అననీకె ఎవునికయినా గుండెలుంటాయా నాయినా? అంతెందుకు మన కర్నూలు జిల్లా కలెక్టరు సుగాలాయనంటగదా! ఏదో ‘నాయక్’ అని వస్తాది ఆయన పేరు. ఎంతో మంచాడు అని పేరు తెచ్చుకున్నాడు. ఎవురు బోయినా ఆయన కాడికి, శానా బాగ పల్కరించి, కూసోబెట్టి మాట్టాడతాడంట. ఎవురో కులపిచ్చిగాండ్లు ఇంకా ఆడాడ ఉండారు గాని, కులమేందిరా? దానమ్మ! గునం ముక్యం. గునమంతున్ని గుర్తించే కాలం వచ్చింది. మంచిదే!”
‘కూరగాయల్యాపారం జేసే నారయ్యకు ఇంత గ్యానం ఎట్లా అబ్బినాదబ్బా’ అని నేస్తులిద్దరూ అబ్బురపడినారు. అది గ్రయించిన ఆ యప్ప నవ్వి ఇట్లా అన్నాడు “నేనూ ఎనిమిది వరకు చదివినా లేప్పా. రోజూ పేపరు సదువుతా. రేడియో ఇంటా. మన సామి ఉండాడే పురోగితుడు, నీలకంట శర్మ, బల్లో నా నేస్తుడే. పురసత్తు దొరికితే ఆ యప్ప కాడికి బోతా. శానా మంచి ఇసయాలు చెబుతాడు. వాండ్ల తరంలో ఆయనొక్కడే కులవృత్తిలో ఉన్నాడు. అల్లుడు రాయలసీమ పేపరు మిల్లుల్లో మెకానిక్కు. కొడుకు పాలిటెక్నికు చదివినాడు. అదేదో డెయిరీ టెక్నాలజీ అంట. ఇజయవాడలో, యదో పచ్చల్ల ప్యాక్టరీ లో పని చేస్తాడంట. మా కర్మ అంటాడు రా, ‘ఈ కాలమీ బాగుంది రా నారయ్యా, పదేండ్ల కిందటి వరకు ఎవని కులం పని వాడు చెయ్యాలని, ఆ పనులు ల్యాక, నానా బాదలు పడేటోల్లు. ఇప్పుడే మేలు. యాపారము జేయగల్గినోడు యాపారము, ఉద్యోగము జేయగల్గినోడు ఉద్యోగము చేయొచ్చు. సమాజంలో గౌరవము పొందొచ్చు’ అని అంటాడు.”
“నిజమే, నిజమే” అని తలలూపినారు నేస్తులిద్దరూ.
“సరే, యాడికో వచ్చి యాడికో బోయినాము. మాటిచ్చినాను కాబట్టి మీకే యిస్తాను మలిగె. సైకిలు శాపోడు కాలీ జేసినంక దాన్ని కొంచెం బాగుజేయాల్సి ఉండే. నాల్రోజులు తాలంది. చిన్న చిన్న రిపేర్లుండాయి. అవి జేపిచ్చి, పెయింటింగు చేయించి యిస్తా.”
“మామా! బాడిగె ఎంతో ఒక తూరి అనుకుంటే..”
“దాన్దేముంది లేరా, ఎంతో కొంత యిద్దురు. నేనేమయినా దాని మిందే బతుకుతుండానా ఏంది?” అన్నాడా యప్ప. “పాపం బతకనీకె మన వూరి కొచ్చినాడు ఈ పిల్లడు. పెట్టుబడీ అదీ సగేసు కొన్నావా రా నాయినా?” అని మాదవని అడిగినాడు.
ఊర్లో యిల్లు అమ్ముకున్నామనీ, తమ భాగానికి పదివేలు వచ్చిందనీ చెప్పినాడు మాదవ.
“అది యామూల కొస్తాది? ముందు నీవు షాపు సంతరిచ్చుకో. నేను నీకు స్టేటు బ్యాంకులో లోనిప్పిస్తా. వడ్డీ శానా తక్కువ. నెల నెలా కంతులు కట్టుకోవచ్చు.”
“నేను గుడ్క తీసుకున్నా మామా! మ్యానేజరు సారు శానా మంచాయన” అన్నాడు చలమేశ్వర్.
“ఒక పొద్దు పోదాము లెండి. గ్యారంటి సంతకమం కావల్నంటే నేను చేస్తాలే.”
అప్రయత్నముగా నారయ్య కాల్లకు మొక్కినాడు మాదవ.”మామా! నీ లు నా జన్మలో మరిసిపోను” అన్నాడు. ఆ పిల్లోని గొంతు పూడుక బోయినాది.
“శ శ, తిక్కోడా! అదేం లేదు. లెయ్యి. ఇంక ఎలబారండి మరి. నాకు నిద్దరొస్తాంతాది” అని ఆవులించినాడు నారయ్య.
‘పోయొస్తా’మని చెప్పి ఇంటికొచ్చేసినారు నేస్తులిద్దరూ.
ఈశ్వరమ్మ కొడుకు కేసరము సూపెట్టుకొని ఉండాది. దోస్తున్ని గుడ్క తీసుకొస్తానని ముందే చెప్పి ఉన్నాడు అమ్మకు.
“రాండి నాయనా, కాల్లు సీతులు కడుక్కో పోండి అన్నం తిందురు” అనిందామె.
“నీవు తిన్నావానే” అనడిగినాడు కొడుకు.
“ఇంచేపుంటే నాకు అరిగి సావదు గదా. ఎనిమిదికల్లా దినేస్తి నాయినా. ఏమనుకోగాకు నాయినా” అని మాదవతో అనింది.
“అయ్యో, పిన్నమ్మా, నివ్వు గుడ్క మా అమ్మ లెక్కనే నాకు” అన్నాడు వాడు.
ఇద్దరికీ స్టీలు తట్టలు పెట్టి అన్నం పెట్టింది. చింతకాయ తొక్కు ఉల్లిగడ్డ లేసి నూరి తిరగమాత పెట్టింది. కట్టుచారు చేసింది. పొద్దున మిగిలిన సుక్కకూర పప్పు ఇద్దరికీ చెరి సగం ఏసింది.
“కడుపు నిండా తిను నాయినా” అనిందా యమ్మ. మాదవకు వాండ్లమ్మ మతి కొచ్చి కండ్లు చెమర్చుకున్నాడు.
బోజనమయిన తర్వాత బైట ఈదిలోన మంచమేసుకోని పండుకున్నారు.
“నేను తొందరగ లేచి ఆరుకంతా ఓటలుకు బోవాల రోయ్! నీవు నిదానంగ లేశి రా” అన్నాడు చలమేశు.
“నేను కూడ వస్తాపా నీతోన” అన్నాడు మాదవ.
వీండ్లిద్దరు బోయేటప్పటికి కుశుడు, సుందరయ్య వచ్చి పని మొదులు చెట్నారు. స్టవ్వు మింద సత్తుగిన్నెలో టీ మరుగుతాంది. కుశుడు బెంచీలు, టేబిల్లు శుభ్రంగా తుడుస్తోండాడు.
చలమేశ్వర్ వాండ్లిద్దర్నీ పలకరించి, కాలీనూనె డబ్బాలో రెండు డబ్బాలు బొరుగులు వేసి ప్లాస్టిక్ బకెట్టులోన నానబెట్నాడు. “నాక్కూడ్క యాదయిన పని చెప్పరా” అన్నాడు మాదవ.
చలమేశు నవ్వి, “ఆ గంపన మెరపకాయలు, అల్లము, ఉల్లిగడ్డలు సన్నగా తరగనీకె నీతోన ఐతాదా?” అన్నాడు.
“అదేమంత బ్రమ్మ విద్దెనా, మా యింట్లో మా అమ్మకు తరిగిచ్చేది నేనే” అని ఒక టేబుల్ మింద అన్నీ పెట్టుకోని శాకు తోన తరగ బట్నాడు. సుందరయ్య వచ్చి కట్టెల పొయ్యి మింద బానలి పెద్దది పెట్టి. నూనె బోసి తిరగమాత ఏసినాడు. అది సిటపటమన్నాక ఉల్లిగడ్డలు, పచ్చిమిరప తుంటలు, అల్లం తుంటలు ఏసి మూతబెట్నాడు. కరియపాకు గుడ్క ఏసినాడు.
అవి మగ్గీ లోపల నానిన బొరుగులన్నీ నీల్లు పిండేసి ఒక బేసిను లోకి తీసుకుని, మూత తీసి బాణలిలో ఏసి బాగ తిరగ తిప్పినాడు. పది నిమిసాలు ఉగ్గాని బాగా మగ్గినాది. తర్వాత దాని మింద పుట్నాల పొడి ఏసి, నాలుగు కట్టలు కొతిమీర తరిగి ఏసినాడు.
మూత బెట్టి కర్రలు తీసేసినాడు. ఐదు నిమిశాల తర్వాత ఉగ్గానిని బానలి నుంచి తీసి పెద్ద బేసిన్ లోనికి మార్చి ఓటలుకు ఒక మూలనున్న అరుగు మింద బెట్టినాడు.
‘టీ’ తాగనీకె జనాలు వస్తాండారు. టీ ని ఒడగట్టి పెద్ద కెటిల్‌లో బోసినాడు సుందరయ్య,
ఈలోపల కుశుడు గోదుమపిండి డబ్బా లోంచి తీసి లోపల ఒక నాపబండ మింద పూరీల పిండి కలిపి పిసకబట్నాడు. సుందరయ్య ఇంకో బేసినులో శనగ పిండి జారుగా కలుపుకుని, మెరపకాయలు మద్యకు చీరి, దాన్లోన కొంత పులుసు, వాముపొడి, బుడ్డల పొడి కూరి, బజ్జీలు ఏయబట్నాడు. పావుగంటలో ఏడి ఏడి బజ్జీ రడీ అయినాది. అవిట్ని గుడ్క పెద్ద సిల్వర్ ప్లేటులో బెట్టి అరుగు మింద ఉగ్గాని పక్కన పెట్టినారు. ఓటలంతా ఉగ్గాని బజ్జీ వాసన గుమగుమలాడబట్నాది.
“మాదవా, నీవు కౌంటరు కాడ గూసోని, ఎంత దీస్కోవాల్నీ మేము అరిచి చెప్తాంటాము. కస్టమర్ల కాడ డబ్బులు తీసుకుంటుండు” అన్నాడు చలమేశు.
ఓటల్లో మంది పెరిగినారు. సుందరయ్య పూరీలు ఒత్తిస్తుంటే చలమేశు బానలి లోన కాగిన నూనెలో ఏయిస్తున్నాడు. అవి బాగా పొంగి కమ్మని వాసనీ రాబట్నాయి.
కుశుడు శానా సురుకుగా కస్టమర్లకు కావల్సినవి అందిస్తూనే, కాలీ ప్లేట్లు గ్లాసులు తీసి ఓటలెనక ఏసొస్తున్నాడు. మస్తానమ్మ అనే ఆ యమ్మ అవి కడుగుతూన్నాది. పూరి రడీ అయి అరుగు మింద జేరినాది. లోపల మిసినులో మెదిగిన ఉద్దిపిందిని ఒక పెద్ద గిన్నెలోకి ఎత్తుకుని వచ్చినాడు సుందరయ్య. కట్టెల పొయ్యిలో మంట ఎగదోసి ఇనప దిపెనం చెట్టినాడు అది పెద్దది. ఒకేసారి మూడు దోసెలు బోయొచ్చు.
ఈ లోపల చలమేశు పురీ కూరకు అన్ని రడీ జేసి, “దోశలు నేను బోస్తాలే, నీవు కూర సంగతి చూడు” అన్నాడు. ఓటల్లొన పొగ అలుము కోకుండా పొయ్యిల మింద పొగగూడు, దాంట్లోంచి పొగగొట్టము మిద్దె పైకి ఉండాది. అవుసరమైతే పొట్టుపొయ్యి గుడ్క వాడతారు.
పదిగంటల వరకూ మా జోరుగా సాగినాయి బ్యారాలు. పదకొండుకు తగ్గిపోయినాయి. “కుశుడూ, నీవు పోయి పోలీసోల్లకు టీ లిచ్చి రా పో” అన్నాడు చలమేశు.
వాడు ఎనిమిది గాజు గ్లాసులు పట్టే ఇనపస్టాండులో టీలు పెట్టుకోని, పోయి ఇచ్చొచ్చినాడు. “అన్నా యస్సయ్య ఇంటికాడ టిపను చెయ్యలేదంట. ఏటిగా ఏదుంటే అది తెమ్మని చెప్పినాడు” అన్నాడు.
“పెనం ఏడిగానే ఉందిలే. రొండు దోసలు చేసి పంపిస్తా” అన్నాడు సుందరయ్య.
“ఆ యప్పకు నూనె తక్కువెయ్యల సూడు. కారం ఎక్కవ పుయ్యి. రోస్టు చెయ్యగాకు. పిల్లోన్ని బూతులు తిడ్తాడు” అన్నాడు చలమేశు.
పదకొండున్నరకు పురసత్తు దొరికింది. మద్యలో అందరూ ఒక్కసారి టిపన్ జేసినారు. మల్లా టీ తాగి, “కార్పెంటరు కాడికి పోయొద్దాం రా” అని ఎల్లదీసినాడు చలమేశు మాదవను.
కార్పెంటరు పేరు హబీబ్ అహమ్మద్. ఇంటికాడనే పనిచేస్తాడు. శాపు కొలతలు చెప్పినారా యప్పకు. చెప్పుల అట్టపెట్టెలు బెట్టనీకె షెల్పులు చేయాలని అడిగినారు.
“జరూర్ చేద్దాము తమ్మి! అవిటికి తలుపులు అవుసరం లేదు. మాటమాటికి తియ్యాల పెట్టాల గదా. మొన్ననే కోడుమూరులో మా అల్లుడు ఇదే శాపుకు జేసేది చూసినా. చెప్పులు పెట్టెలు అంత బరువుండవు కాబట్టి రీపర్లు టేకువి వద్దు. ఇరిడి చెక్క ఏద్దాము. అగ్గవకొస్తాది. దాని మింద వైట్ పెయింటు ఏయిచ్చకుంటే శెదలు బట్టదు. ముందు పక్క వదిలేసి గోడ లెంబడి మూడు పక్కల షెల్ఫులు చేద్దాము. మధ్యలో కస్టమర్లు కూసోనీకె కుర్చీలు ఏస్తే సరిపోతుంది. కుర్చీలు కుశను బెట్టించి చేయిస్తారా ల్యాక మామూలు గాడ్రిజ్‍వి మడిసేవి ఏసుకుంటారా? కుశవువి టేకు తోన చెయ్యాలంటే శానా అయితాది మరి. కస్టమర్లు కాలు బెట్టుకోని పాదము సైజు చూసుకొనే స్టాండు నాకు జేయ్యనీకె రాదు. అవి కర్నూలులో రెడీమేడువి దొరకతాయి, తెచ్చుకోండి. వన్ టౌన్‌లో బొంగుల బజారు కాడ దొరుకుతాయి.”
“మావోడు కూసోనీకె తలుపు కాడ ఒక కౌంటరు జెయ్యాల.”
“అది జేస్తాలే. ప్లయివుడ్డు తోని జేసి పైన డికొలాం శీటు అంటిస్తే శానా ప్యాసనుగుంటాది.”
“మొత్తం ఎంతయితాది అజరత్?” అనడిగినాడు చలమేశు.
“రొంత సేపు ఇంతజార్ జెయ్యండి. లెక్కేసి చెప్తా” అని చెవి వెనక పెట్టుకున్న పెనసలు దీసి ఒక బుక్కులో లెక్కలేసినాడు హబీబ్.
“చెక్క, కౌంటరు, మజూరీ కలిపి ఎనిమిది నూర్లవుతోంది. అదే కుశను..”
“వద్దులే భై, ముందనుకున్నదే జెయ్యి. కొంచెం తగ్గిస్తే బాగుంటాది. నాల్రోజుల్లో వస్తాము. మళిగెకు చిన్న రిపేర్లుండాయి.”
“ఎంతో కొంత సంచకారం ఇచ్చిపోండి. ఈపల ఇరిడి కర్ర తెచ్చికొని, రీపర్లు జేసిపెట్టుకుంటా.”
“రెండు నూర్లియ్యి మాదవా, హబీబన్నకు” అని యిప్పించినాడు చలమేశు.
(ఇంకా ఉంది)