మహాప్రవాహం!-24

0
12

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మర్నాడు కర్నూలుకు వెళ్ళి- రీగల్ ఫుట్‌వేర్ అనే హోల్‍సేల్ కంపెనీ యజమాని బాలమురుగన్‍ని కలిసి తమని తాము పరిచయం చేసుకుని, తాము వచ్చిన పని చెప్తారు మాదవ, చలమేశు. ఆయన వాళ్ళని వివరాలు కనుక్కుని, బిజినెస్ ఎలా చెయ్యాలో చెప్పి, పదివేల సరుకు ఇస్తాడు. బ్యాంకు లోను వచ్చాకా సరుకు పెంచుదామంటాడు. సుందరేశన్ అనే ఉద్యోగిని పిలిచి వీళ్ళకి కావల్సినవి ఏర్పాటు చేయమని చెప్తాడు. సుందరేశన్ రకరకాల చెప్పులని చూపిస్తూ, ఏది ఎంతకి అమ్మాలో చెప్తాడు. వివరంగా రాసి ఉన్న లిస్టు ఇస్తామని చెప్తాడు. మొత్తం సరుకు విలువ పదివేల ఎనిమిది వందలు అయింది. బిల్లులో క్యాష్ పెయిడ్ – ఏడువేలు, బ్యాలెన్సు డ్యూ మూడు వేల ఎనిమిదివందలు అని రాసిస్తారు. మాదవ అక్కడ మరో గదిలో క్యాషియర్ దగ్గరకు వెళ్ళి డబ్బు కట్టేసి వస్తాడు. బిల్లు ప్రకారం చెప్పులని, ఇతర సామాన్లనీ ఎనిమిది అట్టపెట్టెల్లో సర్ది ఇస్తారు. అక్కడికొచ్చిన మరో రీటైల్ వ్యాపారి సలహా మీద వాటిని బళ్ళారి చౌరస్తా వరకు రిక్షాలో తీసుకువచ్చి, అక్కడ ఓ లారీలో ఎక్కించి, వెల్దుర్ది బైపాసు మీద దింపుకుంటారు. చలమేశు ఊరిలోకి వెళ్ళి ఏదైనా బండి ఉందేమో చూసి వస్తానని వెళ్తాడు. రామళ్లకోట నుండి కరుబూజ కాయలతో వచ్చిన ఎద్దుల బండి కనబడితే, ఆయనని పలకరించి, “చిన్నాయనా, బైపాసు కాడ మావి ఎనిమిది పెద్ద అట్టపెట్టె లుండాయి. ఏసుకొచ్చి మా ఇంటి కాడ దింపుతావా?” అనడుతాడు చలమేశు. ఆయన “నువ్వు పినాకమయ్య కొడుకువి కదా అని అడిగి, ఈ కాయలు దింపినాక పోదాం” అంటాడు. కాసేపయ్యాకా, ఆ బండిలో అట్టపెట్టెలు ఎక్కించుకుని, తాము కూడా ఎక్కుతారు మాదవ, చలమేశు. ఎంత ఆలోచించినా ఆ బండాయన ఎవరో చలమేశుకు గుర్తురాదు. తన తండ్రి నేస్తుడయ్యుంటాడని అనుకుంటాడు. ఇంటికి చేరాకా అట్టపెట్టెలు దింపుకుంటారు. చలమేశు తల్లి ఈశ్వరమ్మ బైటకు వచ్చి బండాయనను జూసి, “ఏమి ఉరుకుందప్పా, బాగుండావా?” అని పలకరిస్తుంది. ఆయన ఆమెకు నమస్కరించి బాగున్ననాని అంటాడు. లోపలికి పిలిచి, మంచినీళ్ళిచ్చి యోగక్షేమాలడుగుతుందామె. తన కోడలికి తన పొడ గిట్టడం లేదని, కొడుకు ఏమనలేకపోతున్నాడనీ, అందుకే వాళ్ళ దగ్గరకి వెళ్ళకుండా, ఇక్కడే ఉండి, బస్టాండు దగ్గర బండి పెట్టుకుని, యావయినా సరుకులు తీసుకుకెళ్లడానికి ఎవరయినా పిలుస్తే వెళ్తున్నాననీ, వచ్చే ఆదాయం తన పశువుల మేతకీ, తన తిండికీ సరిపోతోందని అంటాడు. చలమేశు వచ్చి, “ఎంతిమ్మంటావు సిన్నాయనా” అనడిగితే నవ్వుతాడు. ఇక చదవండి.]

[dropcap]“బో[/dropcap]యిచ్చినావు లేరా? మీ నాయిన నేను ఇంత కాన్నించి నేస్తులం. రోజూ కోనేటిలోన ఈత కొట్టాలిసిందే. మీ నాయిన గజీతగాడు. శివరాత్రి తిర్నాలలో శివరి రోజున దేవుని రతం ముందర ఆ యప్ప ‘నందికోల’ తొక్కినాడంటే జనం సూడనీకె తొక్కులాడు కొనేటోల్లు. సాక్షాత్తు పరమేశుడే ఆ యప్పను ఆవగించేటోడు (నందికోల సుమారు 50 పీట్ల పొడుగుంటాది. కింద మనిస్తెత్తున తొక్కేవాండ్లు బుజం మింద పెట్టుకొనీకె చెక్కపలక ఉంటాది. అది బుజాని కెత్తుకొని తప్పెట సౌండ్లకు అనుగునంగా రతం ముందు ఆడతాడు పూజారి. బాలెన్స్‌ వచ్చేంతవరకు నందికోలను రెండు చేతులతో పట్టుకొని ఆడతాడు. తర్వాత ఒక చెయ్యి వదిలేస్తాడు. తర్వాత తప్పెట మోతలు తారాస్తాయికి బోతాయి. అప్పుడు రెండు చేతులూ వదిలేసి పినాకమయ్య చేసే తాండవము బూస్తే బయమైతది. నందికోల బరువు అంత ఉండదుగాని, పొడుగు మీద బ్యాలెన్సు పట్టడం కష్టము. ఆకిరికి దాన్ని నెత్తిమింద బెట్టుకొని తొక్కుతుంటే అంత పొడుగు నందికోల నిశ్చలముగా నిలబడతాది. దాన్ని దింపుకున్నాక పూజారి పినాకమయ్యకు ఆరతిచ్చి, ఇబూతి కుంకమ బెడతారు. దేవళం దర్మకర్త ఆ యప్పకు కాల్లకు మొక్కి కొత్తగుడ్డలు పెడ్తాడు. జనాలు ఆయప్ప మింద చిల్లర, రూపాయ, రెండు రూపాయ కాయితాలు ఇసురుతారు. తర్వాత శానా సేపు పినాకమయ్య తెలివిలోకి రాడు).

చలమేశుకు గుర్తొచ్చింది. చనిపోవడానికి రెండు మూడేండ్లు వరకు నాయిన నందికోల తొక్కినాడు. నాయిన గుర్తొచ్చి వానికి ఎందుకో శానా దుక్కవచ్చినాది.

బలవంతంగా పదిరూపాయల నోటు ఆ యప్ప చేతిలో పెట్టినాడు మాదవ. “వద్దంటే ఇనరు సూడమ్మా” అని ఈశ్వరమ్మ పక్కచూస్తే “తీసుకో నాయినా, పడిన కష్టానికి యానాడు పలితముంతాల” అనిందామె. పోయొస్తానని చెప్పి బండి తోలుకోని ఎల్లిపోయినాడు ఉరుకుందప్ప.

అనుకున్నట్టుగానే మళిగె రిపేర్లు జేసుకొని, రంగులేయించుకోని ఒక దావ కొచ్చినాది. పెయింటరుతోనే బోర్డు రాయించినారు. 3×2½ కొలతతో కార్పెంటరు ప్రేము జేసిస్తె దానికి టిన్ రేకు బిగించి దాని మీంద అచ్చరాలు రాయించినారు. ఏం పేరు బెట్టల శాపుకని ఆలోశించినారు ముందు. టేసను ఎస్సయ్య – ‘మాడరన్ పుట్‍వేరు’ అని పెట్టండిరా బాగుంటాది – అని చెప్పినాడు. దాన్ని రాయించినారు.

కార్పెంటరు హబీబు అహమ్మదు పని జరగతా వుంది. మూడు రోజుల్లో అయిపోతుంది. డోనుకు బోయి నాలుగు గాడ్రెజ్ మడత కుర్చీలు కొనుక్కొచ్చినారు.

మర్సటి రోజు నారయ్యను దీసుకోని స్టేటు బ్యాంకుకు బోయినారు. అది మసీదు ఈదిలో ఉంది. గ్రామపంచాయితీ వాండ్లిచ్చిన పర్మిశను తీసుకుబోయినారు. నారయ్యతోని మళిగె బాడిగ అగ్రిమెంటు రాయిచ్చుకున్నారు. ఇవన్నీ ఉండాల లోను ఇయ్యనీకె.

నారయ్యకు, చలమేశుకు మ్యానేజరు బాగా తెలుసు. గ్యారంటి సంతకము చలమేశు చేసినాడు. మొత్తం పన్నెండు వేలు అతను శాంక్షనయింది. బ్యాంకు అకౌంటు తెరవాలనీ, లోను డబ్బు దాంట్లో ఏస్తామని చెప్పినాడు మ్యానేజరు. నెలకు ఐదు నూర్ల ప్రకారము ముపై నెలల్లో దీర్చాల. ఆ యప్ప పేరు శ్రీదర రెడ్డి.

నారయ్య నేస్తుడు నీలకంట శర్మ మంచి రోజు చూసి చెప్పినాడు. శాపులోన అరల రీపర్లకు పెయింటు ఏసినారు. గోడలకు రెండు బారు లైట్లు బిగించినారు. మాదవ గూసోనీకి ప్లయివుడ్డు, డెకొలాం షీటుతో మూడడగుల ఎత్తున అడుగున్నర పొడుగున కౌంటరు, దాని ఎనక ఒక గాడ్రెజ్ కుర్చీ ఏసినారు. గోడకు ఇనాయకుడు లక్ష్మీదేవి ఎంకటేసులు ఉన్న పొటోప్రేము ములికి గొట్టి (మేకు) ఏలాడదీసినారు. శాపు ముందర చిన్న వారపాగు ఉన్నది. దాంట్లో గుడ్క ఒక లైటు వేయించినారు.

పెట్తెలన్నీ దెచ్చి, అరలల్లో చెప్పుల బాక్సులన్నీ సర్దుకున్నారు ముందురోజే. మర్సటిరోజు ముగూర్తము. మామిడి మండలు వర్సగా పురికోస తోని గట్టి తలవాకిలికి కట్టినారు బారుగా. దేవుని పటానికి కదంబ దండ ఏసినారు.

ప్ర్రారంబోత్సవానికి యస్సయి గారినే పిలచమని నారయ్య చెప్పినాడు. “ఆ యప్ప మీకు అండగా ఉంటే మంచిది” అన్నాడు.

పొద్దున తొమ్మిది పదికి యస్.ఐ. క్రిస్టఫర్ రిబ్బను కత్తిరించి షాపు ఓపన్ జేసినాడు. అందురు సప్పట్లు గొట్టినారు. రామక్క దేవుని పటం దగ్గర ఊదుకడ్డీ ముట్టించి, ఆరతిచ్చినాది. అమ్మకు నాయినకు కాల్లకు మొక్కినాడు మాదవ.

మొదుటి బ్యారం యస్సయి కొనుక్కున్నాడు. బెల్టు టైపు చెప్పులు గోదుమ రంగువి తన సైజువి దీసుకున్నాడు. పెట్టె మింద 69 రూపాయలు అని ఉంటే ఆ యప్ప నూర్రూపాయల నోటు ఇచ్చి, సిల్లర యియ్యబోతే వద్దన్నాడు. నారయ్య గుడ్క మంచి రకం చెప్పులు తీసుకోని డబ్బులిచ్చినాడు. వద్దు మామా అంటే ఇనల్యా.

చలమేశు ఓటల్నుండీ అందరికి టీలు టిపన్లు వచ్చినాయి. సాయంత్రము శరబయ్య, రామక్క ఎల్లిపోయినారు. వారం దినాలలో యాపారం ఆనుపానులు అర్తమయినాయి. సాయానికి ఎవరయినా పొట్టిగాన్ని చూస్తాన్నాడు. చలచేశు శానా అండగా ఉన్నాడు. వాండ్లింట్లోనే అన్నం తిని, రాత్రి, శాపులోనే పండుకుంటున్నాడు.

టూరింగ్ టాకీసు రిచ్చాను మాట్లాడి, రోజుకు ముపై రూపాయ లిచ్చి మైకు లోన ఊరంతా చెప్పించినారు – “మోడరన్ పుట్‌‍వేరు. పోలీసు టేశను ఎదురుగ, వెల్దుర్తి. అన్నిరకముల చెప్పలు సరసమైన ధరలకు లభించును. రండి. కొనుక్కోండి” అంటూ.

నెల రోజులు గడిచింది. రోజూ నాలుగొందలు, అమ్ముతుంది శాపు. కర్నూలు బోయి మల్లా సరుకు తెచ్చినారు. రెండో నెల నుంచి ఆరేడు వందలు, మూడో నెల నుంచి ఎనిమిది నుండి వెయ్యి వరకు సేల్స్ పెరిగినాయి. బ్యాంకు కంతు, కర్నూలు రీగల్ బాలమురుగన్ కంతు సునాయాసంగ కట్టేస్తున్నాడు మాదవ. మొదట్లో కస్టమర్ల కాల్లకు చెప్పలు తొడిగి, సైజులు చూస్తాంటే ఒక రకంగా అనిపించేది. తర్వాత అలవాటయి పోయినాది. బతుకు తెరువు నడిపేది వాండ్లే గదా అనిపించేది.

కిశోరు అని ఒక పొట్టిగాడు దొరికినాడు. వానికి పద్నాలుగేండ్లుంటాయి. పక్కనే చెరుకులపాడు వానిది. మ్యాదరోల్ల పిల్లడు. వానికి నెలకు నూటయాభై జీతము. వాడు గుడ్క పని తొందరగానే నేర్చుకున్నాడు. షాపు బెట్టి ఎనిమిది నెలలు దాటింది. మాదవకు ఇంక బాగా బతుకుతాననే సొంత నమ్మకం కలిగింది. కొత్త కొట్టాలలో కొంతమంది మిద్దెలు తీపి బాడిక్కిస్తాన్నారు. మదారుపురం గేటుకు శానా యివతల, కొంచెం లోపటికి ఇల్లు దొరికినాది. బాడిగ నూటరవై. చిన్నదే. రెండు రూములు. ఒకటి పండుకొనీకె, ఒకటి వండుకోనీకి. ఎనక చిన్న దొడ్డి దాంట్లో బోరింగు, లెట్రిను ఉండాయి.

మంచిరోజు చూసి అమ్మను నాయనను పిల్చుకొచ్చినాడు మాదవ. అమ్మకు కట్టెల పొయ్యి ల్యాకుండా ఒక కిరసిను స్టవ్వు, ఒక బొగ్గుల పొయ్యి కొనిచ్చినాడు. శరబయ్య “ఏదయినా మంగలి శాపులో పనిజేస్తా, ఊకె ఎంత సేపు గూసుంటా” అని సనిగితే “నీకు పొద్దుపోకపోతే షాపులో వచ్చి కూచో నాయినా, కౌంటరు కాడ గూసొని డబ్బులు తీసుకుంటుండు” అని చెప్పినాడు కొడుకు.

వచ్చే సంవత్సరమే నేస్తులిద్దరికి పెండ్లిండ్లయినాయి. చలమేశు బార్య దేవిక మాదిరి, రాజశ్రీ మాదిరి లేదు గాని, బాగుంది. వాండ్లది నందికొట్కూరు కాడ గోనెగండ్ల. మామ ఆ ఊరి శివాలయంలో పూజారి. ఎకరన్నర మాన్యముండాది దేవలానికి. ఒక్కత్తె పిల్ల. పేరు శర్వాణి.

మాదవ శాపు పెట్కోని పెయోజకుడయినాడని రామక్క పిన్నమ్మ కొడుకు పిల్లనిస్తానని వచ్చినాడు. ఆ యప్పకు ప్యాపిలిలో మంగలి శాపుండాది. కొడుకు గుడ్క శాపులో పని చేస్తాడు. వాడు సిన్నోడు. ఈ యమ్మ పెద్దది. పేరు బాగ్యమ్మ. చామనచాయైన గుడ్క ముకం కలగా ఉంటాది.

కాలమా! మజాకా! ఎవుర్ని యాడకు దీస్కపోతాదో! మాదవ కుటుంబమును తన ఎంటన గుంజుకొనిపోయింది! దానిస్టమే గాని మనిస్టం గాదు కద!

***

పద్మనాభయ్య, మీనాక్షమ్మ అనంతపురానికి సంసారము మారుస్తాన్నారనే మాట బొమ్మిరెడ్డిపల్లెలో అందరికీ తెలిసిపోయినాది. ఊరిడిసి పోయినోల్లు పోగా ఉన్నోల్లు సామి కాడి కొచ్చి శాన ఆరవారపడ (ఉద్వేగం) బట్నారు.

“ఏంది సామి, మేం ఇన్నది నిజవేనా, నీవెల్లపోతే, ఊల్లా మాకు మంచిమాట చెప్పేదెవరు?”

“సామీ, మేమొప్పుకునేది ల్యా. నీవు అమ్మయ్య మాకాడే ఉండాల.”

“మనం సామిని బోనియ్యకూడ్డు.”

“బాపనయ్య లేని ఊరు ఊరే గాదని సుమతీ శతకంలో చెప్పినారు కదా!”

ఇట్లా శానా మంది పద్మనాబయ్య ఇంటికాడికి వచ్చి “పోగాకు సామీ” అని బంగపోతాండారు. ఇంటి ముందున్న రెండరుగులూ జనముతో నిండిపోయినాయి. ఇంతలో ఎవరో “పెదరెడ్డొస్తా౦డాడు. పెదరెడ్డొస్తా౦డాడు!” అని అరిసినారు.

ముందల కొండారెడ్డి, కంబగిరి రెడ్డి, రామానుజశెట్టి దావ జూపిస్తాంటే, రుక్మాంద రెడ్డి పద్మనాబయ్య ఇంటి కాడి కొచ్చి సామికి నమస్కారము చేసినాడు.

జనాలందరు అరుగులు దిగి కింద నిలబడి “నమస్కారం నాయినా! రెడ్డీ దండాలు! పెదరెడ్డీ, నీవైన జెప్పాల సామికి!” ఇట్లా రకరకాలుగా అంటూ రుక్మాంగద రెడ్డికి దావ ఇచ్చి నిలబడినారు. కొండారెడ్డి లోపలికిబోయి అమ్మయ్యనడిగి జంపకానా దెచ్చి అరుగు మింద పరిసినాడు.

“రాండినాయినా, కూచోండి!” అని తానూ కూచున్నాడు పద్మనాబయ్య. రామానుజశెట్టి అన్నాడు “ఏంది సామీ యిది? ఎవురు ల్యాకబోయినా పరవాల్యా గాని, నీవు బోతే ఎట్లా?” అని.

“ఈమాట ఇన్నప్పట్నించి నాకు అన్నం దిన బుద్ది గాల్యా, నిద్రపట్టడంల్యా. నాల్రోజుల్నించి ఎంతగానో చెప్పి చూసినా. సామి అమ్మయ్య యింటే గద!” అన్నాడు కొండారెడ్డి.

రుక్మాంగద రెడ్డి అందరి మాదిరి సామిని బంగపోల్యా. చేతులు జోడించుకోని అన్నాడు – “పద్మనాబయ్య సామీ! మనూరికి వసిస్టుని మాదిరి నీవు. మంచికైనా చెడ్డకయినా, నిన్నడక్కుండా యా పనీ చెయ్యము. కాలం మారింది. పఠిస్తితులు మారినాయి. నిజమే. అంతెందుకు నా పరిస్తితి గుడ్క అట్లనే ఉంది. కర్నూలుకు బోయి మా అన్న కొడుకు కేశవరెడ్డిలోన గలిసి ఎరువులు, పురుగుమందుల డీలరుశిప్పు దీసుకుందామను కుంటాండా. పిల్లోండ్లను సదువులకని అయిదరాబాదుకు పంపిస్తిమి. మా సుజాతమ్మ వాండ్లకు పెద్ద దిక్కుగా ఉంది. కులాలను బట్టి వృత్తులు మారిపోతుంటాయిది. కానీ సామీ, ఇంకా మీ బాపనోల్ల పని వేరేవాండ్లు జేసే గోరకలి ఇంకా రాల్యా. నీవు మనసు మార్చుకుంటానంటే, అందరం కలిసి యాదో ఏర్పాటు చేస్తాము. నీకు చెప్పేటోన్నిగాదు పద్మనాబయ్యా.”

సామి చిన్నగా నవ్వినాడు. “నీకు తెలియనిదేముంది రా రుక్మాంగదా! మా సంగతి కాదు. మావాడు కేదార ఇంకా పై చదువులు చదువుతానంటున్నాడు. మన ఊరి పరిస్థితి నీకు తెలుసు. మా తమ్ముడు పండరి అనంతపురానికి రమ్మని, టౌనులో అవకాశాలు బాగుంటాయని చెప్పి నన్ను మీ అమ్మయ్యను ఒప్పించినాడు. పిల్లవాని భవిష్యత్తు ముఖ్యం గదా నాయినా” అన్నాడు.

లోపల పడసాలలో నుంచి అంతా వింటూ ఉన్న మీనాక్షమ్మ మనసులో – ‘జరుగుబాటు లేక అవస్థలు పడుతూంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు అందరూ వచ్చి పోవద్దంటున్నారు. ఈయన మొహమాటపడి పెదరెడ్డి మాటలకు ఒప్పుకుంటాడో ఏమో!’ అని బయపడ బట్నాది. పెదరెడ్డి అన్నాడు “అయితే నిర్నయించుకున్నారన్నమాట! కానీ సామీ, కాల పరీచ్చకు నిలబడిన మొగోడు ఎవరున్నారు? మీకు మంచి జరగాలనీ, మీ పిల్లోడు బాగా సదువుకోని మంచి స్తితిలోకి రావాలనీ ఆ సుంకులమ్మ తల్లిని మొక్కుకోడం తప్ప, మేం చేసేదేముంది? వీరు యానాడు ఎలబార్తారో చెబితే సామాన్లు తీస్కబోనీకె మా ట్రాక్టరు పంపుతా.”

“ఎల్లుండి దశమి గురువారం మంచిదని అనుకున్నాము నాయినా. అయితే మంచిది. సామాన్లు ట్రాక్టరు కెక్కించి, మేము బస్సులో పోతాము” అన్నాడు సామి. పెదరెడ్డితోబాటు ఊరి పెద్దమనుసులు ఆ యప్పకాడ సెలవు దీసుకోనిపోయినారు. పోయే ముందు పెదరెడ్డి తాంబూలంలో నూర్రూపాయలు పెట్టి మొక్కినాడు. మిగతా వాండ్లు గూడ్క వాండ్లకు శాతనయినంత సామికిచ్చి మొక్కిపోయినారు. ఆకర్న కొండారెడ్డి మిగిల్నాడు. కండ్ల నిండా నీల్లు పెట్టుకోని అన్నాడు “అమ్మయ్యా, రేపు నేను నాగరత్నమ్మ వచ్చి, సామాన్లు కట్టిపెడ్తాము తల్లీ! దిక్కులేని పచ్చులమైపోతిమి” అని ఏడవ బట్నాడు.

“ఒరే కొండా! పెదరెడ్డి చెప్పినట్లు కాలాని కెదురేగి నిలబడడం కష్టము! ధైర్యంగా ఉండు!” అని ఓదార్చినాడు పద్మనాబయ్య.

రాత్రి భోజనం చేస్తూంటే మీనాక్షమ్మ అనింది “అంతమంది, ముఖ్యంగా పెదరెడ్డి అంతటివాడు చెబుతూంటే సరేనంటారేమోనని తొక్కులాడినా.”

“ఎందుకంటా మీనాక్షీ! మన మంచి గోరే కదా తమ్ముడూ మరదలూ అంతగా చెప్పింది. కేదార భవిష్యత్తు కంటె మనకు కావలసినదేముంది? రుక్మాంగదుడు చెప్పినట్టు, మన పని అందరూ చెయ్యలేరు కాబట్టి మనల్ను బంగపోతున్నారు. ఏమో, రాను రాను పౌరోహిత్యం గూడ యితర కులాలవాండ్లు చేసే రోజులొచ్చినా ఆశ్చర్యము లేదు. ఏది ఏమయినా ఊరివాండ్ల అభిమానం చూడు. చాలా దక్షిణలు యిచ్చి మొక్కినారు. మన కులానికి సమాజంలో ఇంకా గౌరవం ఉంది. ఆ మహా పట్నంలో ఎలా నెగ్గుకొస్తామో ఏమో?” అన్నాడాయన.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here