మహాప్రవాహం!-25

0
12

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[బండి బాడుగకి డబ్బులెంత ఇవ్వమంటావు చిన్నాయన అని చలమేశు అడిగితే, ఉరుకుందప్ప నవ్వుతాడు. పెద్ద ఇచ్చారు లేరా, మీ నాన్న నేనూ స్నేహితులం అంటూ చలమేశు తండ్రి సంగతులెన్నో చెప్తాడు ఉరుకుందప్ప. ఉత్సవాల్లో పినాకమయ్య ఎంత వైభవంగా నందికోల తొక్కేవాడే చెప్తాడు. తండ్రి గుర్తొచ్చి చలమేశుకి దుఃఖం వస్తుంది. ఉరుకుందప్ప వద్దన్నా, మాదవ బలవంతంగా అతని చేతిలో పది రూపాయలు పెడతాడు. కాసేపాగి వెళ్లిపోతాడతను. అనుకున్నట్టుగానే రిపేర్లు, రంగులు వేయడాలు, కార్పెంటరు పనులు అన్నీ పూర్తయి మళిగె సిద్ధం అవుతుంది. నారయ్యతోని అగ్రిమెంటు రాయించుకుని, దాన్ని పట్టుకుని బ్యాంకుకి వెళ్తారు. బ్యాంకు లోను శాంక్షన్ అవుతుంది. నెలా నెలా ఎంత కట్టాలో మేనేజరు చెప్తాడు. నారయ్య స్నేహితుడు నీలకంఠ శర్మ పెట్టిన ముహూర్తానికి తల్లిదండ్రులని పిలిపించి షాపు ప్రారంభిస్తాడు మాదవ. నారయ్య సలహా మీద పోలీస్ స్టేషన్ యస్సై చేత ప్రారంభోత్సవం చేయిస్తాడు. క్రమంగా వ్యాపారం పుంజుకుంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. బ్యాంకు లోన్ కంతు, కర్నూలు రీగల్ బాలమురుగన్ కంతు సులభంగా కట్టేస్తాడు మాదవ. కిషోరనే కుర్రాడిని పనిలో పెట్టుకుంటాడు. ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అమ్మానాన్నలను పిలిపించుకుంటాడు మాదవ. ఏడాది తరువాత, చలమేశుకి శర్వాణితోనూ, మాదవకి భాగ్యమ్మతోనూ పెళ్ళిళ్ళవుతాయి. బొమ్మిరెడ్డిపల్లెలో – పద్మనాభయ్య, మీనాక్షమ్మ దంపతులు – ఊరు విడిచివెళ్ళిపోతున్నారని అందరికీ తెలుస్తుంది. ఊరివాళ్ళంతా వచ్చి, వెళ్ళవద్దని వేడుకుంటారు. కొంచెం సేపయ్యాకా, అక్కడికి వచ్చిన రుక్మాంగద రెడ్డిని – ఊరివాళ్ళంతా బ్రతిమాలుకుంటారు – నువ్వైనా సామిని ఆపు అని. రుక్మాందర రెడ్డి సామితో మాట్లాడి, ఆయన నిర్ణయం మారదని గ్రహించి – వాళ్ళు వెళ్ళేందుకు కావల్సిన ఏర్పాట్లు చేస్తాడు.  వచ్చినవాళ్లంతా ఎంతో కొంత దక్షిణ ఇచ్చి వెళ్తారు. అంతమంది వచ్చి బ్రతిమిలాడితే, ఎక్కడ సరేనంటారోనని భయపడ్డానని మీనాక్షమ్మ అంటే, అలా ఎందుకంటాను, మనం వెళ్ళేది కేదార భవిష్యత్తు కోసమే కదా – అని, ఆ మహా పట్నంలో ఎలా నెగ్గుకొస్తామో ఏమో అని అంటాడు పద్మనాభయ్య. ఇక చదవండి.]

[dropcap]“ఏం[/dropcap] దిగులుపడకండి. మీ విద్వత్తు మనల్ను ఆదుకుంటుంది. ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అని మీరేగదా అంటుంటారు. అన్నట్లు దక్షిణలన్నీ లెక్కపెట్టినాను. రెండు సూర్ల ఎనభైమూడు రూపాయలు వచ్చింది” అనిందామె. ఆమె కండ్లలో సంతోషం.

“నా దగ్గర ఒక రెండునూర్లున్నాయిలే. రేపు చేను గుత్త ఎంతో కొంత ముందే ఇప్పించుకొని వస్తానన్నాడు కొండారెడ్డి. చేను ఉండనీ మీనాక్షి. ఇల్లు అమ్ముతామని నలుగురికీ చెప్పినాను. రామానుజశెట్టి తీసుకుంటానన్నాడు. రేపు పెదరెడ్డి దగ్గర కూర్చుంటాము. ఆయనే గదా ఫయిసులు చేసేది. పరీక్షలయ్యి పిల్లవాడు ఎమ్మెస్సీలో జేరేటప్పటికి ఇంకా రెండు నెలలయితుంది. అప్పటికి సమకూర్చమని అడుగుతాను.”

మర్సటి రోజు రైతులు, ఇంకా అన్నివర్గాలవాండ్లు సామికి, అమ్మయ్యకు దోవతులు, చీరలు, రవికెగుడ్డలు, గాజులు పెట్టినారు. కొందరయితే కందులు, మినుములు, పెసలు తెచ్చిచ్చినారు. అందరూ బోయినాక వచ్చినారు గొల్ల మద్దిలేటి, ఆయన బార్య శేషమ్మ, ఇద్దరూ సామికి అమ్మయ్యకు మొక్కి ఒక అట్టపెట్టి చేతిలో బెట్టినారు.

“ఏమిటిరా ఇది” అనడిగినాడు పద్మనాబయ్య.

“తీసి సూడు సామీ” అన్నాడు మద్దిలేటి.

చూస్తే దాంట్లో నాలుగించిల ఎత్తున్న నల్లని శివలింగమున్నాది. సుట్టూ పానబట్టము. పైన శివునికి గొడుగు పట్టినట్లు సుబ్బరాయుని పడగ. పద్మనాబయ్య మీనాక్షమ్మల మొగాలు విచ్చుకొన్నాయి!

“ఎంత బాగుందిరా మద్దిలేటి! ఎక్కడిదిరా నీకిది?”

“మొన్న కార్తీకముల మా బామ్మరిది శ్రీశైలం బోయిండె సామి! వాండ్లక్కకు తెచ్చినాడు. మీరైతే దినరోజు శివునికి పూజ చేసి అబిశేకం చేస్తారు గదా అని తెచ్చినాము.”

“అనంతపురానికి, మాకు తోడుగా సాక్షాత్తు పరమేశ్వరున్నే ఇచ్చినావు రా మద్దిలేటీ!” అని, “హరహర మహాదేవ శంభోశంకర! పాహిమాం!” అని శివలింగాన్ని తలకు తగిలించుకున్నాడు పద్మనాబయ్య.

“నాయనా, నీకు శుభమగోగాక!” అని ఆశీర్వదించినాడు.

శేషమ్మ ఎనకాడుతూ అమ్మయ్య దగ్గరకు బోయి చిన్న సిమెంటు సంచి యిచ్చింది. దానికీ మూతి పురికొసతో కట్టి ఉంది.

“ఏమిటమ్మా ఇది” అని మీనాక్షమ్మఅడిగితే, “బుడ్డలిత్త నాలమ్మయ్యా. ఒకేసారి వలిచి పెట్టినా, మీరు పొడి, ఉరిమింది అన్నీ చేసుకుంటారు గదా ఇవిటితో” అనింది బిడియపడుతూ. “దచ్చిన ఇయ్యనీకె తాగతు లేకపాయ” అని కండ్ల నీల్లు బెట్టుకొన్నాది.

“తిక్కదానా, దక్షిణకంటే విలువైనదే ఇచ్చినారు. మేము అక్కడికి పోయినంక నెల నెలన్నర వరకు వెతుక్కోవాల్సిన పనియ్యకుండా ఊరివాండ్లు ఉప్పులు, పప్పులు, చింతపండు, ఎండు మిరపకాయలతో సహా కట్టిచ్చినారు. చాలమ్మా, ఇంతకంటె ఏం కావాల?” అనింది అమ్మయ్య.

ఇద్దరూ మొక్కి ఎలబారినారు.

మద్యాన్నం అన్నం వండుకోకుండా బియ్యప్పు నూకతో ఉప్పుపిండి చేసింది మీనాక్షమ్మ. కొంచెం ఎక్కువ చేసి, రాత్రికి కూడా తీసిపెట్టింది. కొండారెడ్డి దంపతులతో బాటు ఇంకొందరు వచ్చి సామాన్లు గోనెసంచుల్లో సరిమూతులు బిగించినారు. రాత్రి ప్రదోష పూజ చేసి దేవతార్చన గూటి లోని పటాలను విగ్రహాలను, ఇతర పూజచేసీ సామగ్రిని ఒక అట్టపెట్టెలూ సర్దుకుంటే సరిపోతుంది.

మధ్యాహ్నం మూడు గంటలకు మనిషి వచ్చి “సామీ, పెదరెడ్డి నిన్ను ఎంట బెట్టుక రమ్మనె. శెట్టి గూడ్క కుంచెం సేపాయ వచ్చి” అని పిలిసినాడు. మీనాక్షమ్మకు చెప్పి, పెదరెడ్డి యింటికి పోయినాడు పద్మనాబయ్య.

లోపల పడసాలలో సోపాల మీద ముగ్గురూ కూచున్నారు. రెడ్డెమ్మ వెండిగ్లాసుతో సామికి మజ్జిగ దెచ్చిచ్చినాది. మొగునికి, శెట్టికి ‘టీ’ ఇచ్చినాది.

రుక్మాంగద రెడ్డి అన్నాడు “శెట్టిగారో, సామి రేపు అనంతపురానికి వెళ్లిపోతాండు. ఇంటి సంగతి తేలిస్తే ఆయనకు ఎదారుండదు.”

“తేల్చేది నీవే గద రెడ్డీ! నీ మాట కాదని యానాడన్న అనింటినా? పైగా సామి యవగారం. నేను ఐదునూర్లు నష్టపోయినా పరవాల్యా సామికి మాత్రం మనం తక్కువ చేయకూడదు.”

“అదీ మొగోని మాట!” అన్నాడు పెదరెడ్డి, “నాలుగు కనాలకు పైనే ఉంటాది సామోండ్ల యిల్లు. ఆయన ఏనాడు తన కింతగావాలని అడగల్యా. నీవెంతలో ఉండావు?”

“ముపై వేలయితే నాకు గుడ్క బరువుండదు”

“పద్మనాబయ్యా, ఇన్నావు గదా, ఏం చేద్దాము మరి?” అన్నాడు రెడ్డి.

“రుక్మాంగదా! నన్ను పరీక్షిస్తున్నావేమిరా? మీ ఇద్దరూ నా మంచి కోరేవాండ్లే. నేను చెప్పేదేమీ లేదు” అన్నాడు సామి. ఆయన గొంతులో ఒక నమ్మకం.

“సరే శెట్టి, నేనొకమాట చెబుతా. ఇంకా ఐదు వేలు కలిపి ఇచ్చెయి మన సామికి. ఆయన ఆశీస్సులుంటే నీకు ఇంతకింత ఊర్జితమయితది లే” అన్నాడు రెడ్డి.

కోమటాయన కుంచీపు ఎనకాముందాదినాడు. అవతల పెద్దరెడ్డి. ఇవతల పద్మనాబయ్య సామి. ‘బ్రామ్మని కిస్తే మంచిదే లే’ అనుకున్నాడు.

“సరే పెదరెడ్డీ. నీవన్నట్లే ముపై అయిదువేలకు కాయం జెయ్యి” అన్నాడు.

“సంతోశం గనే అంటన్నావా?”

“‘ఇంకోరి సంగతైతే ఏమో గాని, మన పద్మనాబయ్య సామికి మాత్రం శానా సంతోశంగ యిస్తాను.”

“మరి సంచకారం (అడ్వాన్సు) కొంచెం ఎక్కువే యియ్యి సామికి. ఆడ బోయి కుదురుకునే వరకు శానా కర్చులుంటాయి. టవును గదా! అన్నీ కొనుక్కోవాల.”

రామానుజశెట్టి అంగీలోపల బనియనుకున్న దొంగజేబు (రహస్య) ఉంచి ఐదు వేలు తీసి రెడ్డి చేతిలో చెట్టినాడు. రెడ్డి నోట్లను ఎంచి (లెక్కబెట్టి) “యాభై ఉండాయి. అంటే ఐదువేలు” అని పద్మనాబయ్య చేతిలో బెట్టినాడు. నూర్రూపాయల స్టాంపు పేపరు మీద అగ్రిమెంటు రాసుకున్నారు. యదా మామూలుగ సాచ్చి సంతకము పెదరెడ్డే చేసినాడు.

మిగతా ముపై వేలు రెండు నెలల తర్వాత యిస్తానని చెప్పినాడు శెట్టి. ఇద్దరూ సామికి మొక్కినారు.

రాత్రికి సామాన్లు ప్యాకింగు ఐపోయింది మరీ పాతవి, దెబ్బతిన్నవి వదిలేసినారు. పొద్దున మిగిలిన ఉప్పుడుపిండి మజ్జిగ బోసుకోని తిన్నారు. దేవతార్చన సామాగ్రి అంతా ఒక అట్ట పెట్టిలో చేరింది. మందహాసాన్ని (పఠం) విడగొట్టి గోనెపట్టాలో చుట్టినారు.

పొద్దున్నే రెడ్డిగారి ట్రాక్టరు వచ్చింది. డ్రైవరుకు అనంతపురములో ఇంటి అడ్రసు ఒక కాయితం మీద రాసి యిచ్చినాడు పద్మనాభయ్య. అది ‘తపోవనము’ లోనే పుండరీకాక్షయ్య ఇంటికి ఏడెమినిదిండ్ల అవతల ఉంది. శానామంది పద్మనాభయ్యను అమ్మయ్యను బస్సు ఎక్కించనీకె వచ్చినారు. ఉళిందకొండకు బోయి అనంతపురము ఆర్.టి.సి బస్సు ఎక్కి, పదకొండు లోపలే అనంతపురము జేరినారు.

కేదార అమ్మనూ నాయిననూ దింపుకొని రిక్షాలో చిన్నాయన యింటికి దీస్కపోయినాడు. అందరూ బోజనాలు చేసినారు. ఒంటిగంటకు వీండ్ల కోసరము మాట్లాడిన బాడిగింటి నుంచి ఒక పిల్లవాడొచ్చి, ట్రాక్టరొచ్చిందని చెప్పినాడు. పద్మనాబయ్య, పుండరి, కేదార వెంటనే అక్కడికి బోయినారు. సామాన్లు దింపడానికి ఇద్దరు కూలీలను ముందీ మాట్లాడి పెట్టినాడు పుండరి. వంటిల్లు వదిలేసి, పడసాల లోనే అన్నీ దింపిచ్చుకున్నారు. డ్రైవరు సామికి మొక్క ఎలబారుతూంటే పుండరి ఆ యప్పకు ముపై రూపాయలియ్య బోతే తీసుకోలేదు. “సామోల్ల దగ్గర తీసుకుంటానా?” అన్నాడంతే!

మర్సటి రోజు వంటిట్లో మందహాసం అమర్సుకోని, దేవుని పటాలను విగ్రహాలను పెట్టుకున్నారు. గొల్ల మద్దిలేటి యిచ్చిన శివలింగాన్ని పుండరి కూడా మెచ్చుకున్నాడు. మీనాక్షమ్మ అఖిలాండమ్మ కలిసి కొత్త కిరసన్ స్టవ్ మింద కొత్త స్టీలుగిన్నెలో పాలు పొంగించి, దాంట్లోనే కొంచెం బియ్యం వేసి పరమాన్నం చేసి, దేవునికి నైవేద్యం బెట్టి, తలా యింత ప్రసాదం తిన్నారు. ముందు ఇల్లంతా సర్దుకోడానికి రెండు రోజులు పట్టింది.

వీండ్లు వచ్చే లోపలే అఖిలమ్మ కొన్ని గిన్నెలు గరిటిలు ఇట్లాంటివి తెప్పించి పెట్టింది. ఒక కిరసిన్ స్టవ్వు, ఊరినించి ఇనుపది బొగ్గుల పొయ్యి తెచ్చుకున్నది ఉంది. వంటిల్లు పెద్దదే. వంట, దేవుడు పోను ఇంకా నలుగురు బోంచేసేందుకు స్తలం ఉంది.

ముందు వీది లోకే ఒక చిన్న గది ఉంది. దానికి కటాంజనం (గ్రిల్స్) ఉంది. పడసాల పెద్దది. ఎడం పక్క వంటిల్లు. కుడి పక్క ఒక పడకటిల్లు, వెనక అరడుగుల వెడల్పు, ముప్పై అడుగుల పొడవున కాళీ స్తలం ఉంది. దాంట్లో ఒక పక్క మున్సిపాలిటి కొళాయి. గుడ్డలుతుక్కొడానికి, అంట్లు కడుక్కోడానికి ఒక గట్టు ఉన్నాయి. ఇంకో పక్క లెట్రిన్, బచ్చలిల్లు (బాత్రూమ్) ఉన్నాయి.

మున్సిపాలిటీ వాండ్ల నీళ్లు రోజూ పొద్దున్న గంట సేపు వస్తాయట. అవి చాలకపోతే వీదిలో రెండు బోరింగులున్నాయి వాడుక నీల్లకు. ఇల్లంతా నీటుగా  గచ్చు చేసి ఉంది. బాడిగ మాత్రం రెండునూర్లకు ఇరవై తక్కువ. కరెంటు చార్జీ వేరే.

కేదార కూడా పాత ఊర్లో రూము కాలీ చేసి తపోవనముకు వచ్చేసినాడు. వాని ఫైనలాయియర్ పరీక్షలు గట్టగా నెలన్నర ఉన్నాయి. కష్టపడి చదువుతున్నాడు

ఒక వారం రోజులు అన్నయ్య కుటుంబం స్తిమితపడేంత వరకు పుండరీకాక్షయ్య గమ్మునున్నాడు. ఒకరోజు సాయంత్రం వచ్చి “అన్నయ్యా! రేపు సెకండు రోడ్డులో ఎ.సి.టి.వో. గారి యింట్లో గ్రహశాంతి, నవగ్రహ జపం ఉన్నాయి. మనిద్దరితోబాటు ఇంకో బ్రాహ్మడు కూడా వస్తాడు. పొద్దున్న ఆరు కల్లా మన నిత్యానుష్ఠానం ముగించుకొని పోతే, పన్నెండు, పన్నెండున్నర కల్లా కార్యక్రమం ముగించుకుని వచ్చేయవచ్చు” అన్నాడు.

‘పోదాం నాయినా!” అన్నాడు పద్మనాభయ్య. “ఏ నక్షత్రానికి రా శాంతి?”

“మూలా నక్షత్రం పద్మన్నయ్యా”

వెంటనే ఆయన సుస్వరంతో మూలానక్షత్ర శాంతి శ్లోకాన్ని ఉచ్చరించినాడు.

“మూలం ప్రజాం వీరవతీం విదేయ

పరాచ్యతు నిర్రుతిః పరాచా

గోభిర్నక్షత్రం పశుభిస్వమక్తం”

“ఇదే కద! ఎప్పుడో పుష్కరం కిందట అల్లుగుండులో ఒక శెట్టిగారింట్లో చేయించినాను, నేనొక్కడినే లే! మూలానక్షత్ర దోషపరిహారార్థము జ్యేష్ఠాధి దేవత ఇంద్రునికి, ప్రత్యధి దేవతకు ఆజ్య ధారబోయడం విధాయకం. తర్వాత మూలా నక్షత్రంలో జన్మించిన శిశువును ‘ఆజ్యావేక్షణము’ అంటే వెడల్పున్న ఇత్తడి గిన్నెలో నేయి బోసి, తండ్రికి శిశువు ప్రతిబింబాన్ని అందులో చూపాలి.

యథాశక్తి నవగ్రహ, మూలా నక్షత్రహవనము (హోమము) నిర్వహించి, చివరన మహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకము చేసి, స్వస్తి వాచకముతో యజమానిని ఆశీర్వదించడంతో క్రతువు పూర్తవుతుంది. అంతేనా, ఏదయినా మరిచిపోయినానా?”

పుండరి సంభ్రమాశ్చర్యాలతో అన్నయ్యను కౌగిలించుకొని పాదాలకు నమస్కారము చేసినాడు. “పద్మన్నయ్యా! సాక్షాత్తు పుంభావ సరస్వతివి నీవు! ఏండ్లుగా వృత్తిలో లేకున్నా, అన్ని ఎంత ధారణలో ఉన్నాయి నీకు!” అన్నాడు. “వదినే! అనంతపురానికి ఈ బ్రహ్మవేతను తీసుకొచినందుకు నా జన్మ ధన్యమైంది! రేపు ఆరుకల్లా బండి తీసుకొస్తా. సిద్ధంగా ఉండు!” అని వెళ్లి పోయినాడు పుండరి.

కేదార తండ్రి వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయినాడు. మీనాక్షమ్మ మాత్రం ఏమీ ఆశ్చర్యపడలేదు. “ఈరోజు కొత్తగా ఆయన నేర్చుకునింది ఏవి లేదురా కేదారా! ఆ పల్లెటూర్లో ఆయనకు తన విద్యత్తు నుపయోగించే అవసరం రాల్యా అంతే” అనింది. పద్మనాబయ్య చిరునవ్వుతో భార్యనూ కొడుకును చూసాడు. ఆ చూపుల్లో నిరహంకారం! అంతా ఆ పరాత్పరుని అనుగ్రహం తప్ప మరేమీ కాదనే ఒకానొక నిర్మమత్వం!

***

ఎ.సి.టి.వో. గరుడాద్రి నాయుడు గారి ఇల్లు సెకండు రోడ్డులో ఉంది. అనంత పురం పట్టణానికి ఫస్టు రోడ్డు, సెకండు రోడ్డు, తరుడు రోడ్డని మూడు చాలా పెద్ద వీధులుంటాయి. రైల్వేస్టేషను నానుకొని వరుసగా ఉంటాయి. ఎక్కువగా ఉద్యోగస్తులు, సంపన్న కుటుంబాల వాళ్లు ఉంటారు. స్టేషనుకి ఇవతల ఆర్ట్స్ కాలేజీ, కొంచెం ముందుకుపోతే ఆర్.టి.సి. బస్టాండు, క్లాక్ టవర్ ఉంటాయి. పాత ఊరు అంటే ఓల్డ్ టవును ఇరుకు వీధులతో ఉంటుంది. కాని ఈ ప్రాంతం విశాలమయిన రోడ్లు, నీలం, శ్రీకంఠం, రఘువీరా లాంటి సినిమా హాళ్ళు, గవర్నమెంటు ఆఫీసులతో ఆధునికముగా ఉంటాది. క్లాక్ టవర్‌కు ఇటు పక్క ఉరవకొండ మీదుగా బళ్లారికి బోయే రోడ్డుంటాది. దానికి అటు పక్కన కోర్టు రోడ్డు.

అనంతపురములో పెద్ద చదువులు అంటే డిగ్రీలే కాకుండా, ఇంజనీరింగ్, పాలిటిక్నిక్, లాంటివి చదవడానికి శానా కాలేజీలుండాయి. ధర్మవరం బోయే రోడ్డులో ‘సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్’ అనే పెద్ద కాలేజీ ఉండాది.

అనంతపురానికి అయిదరాబాదు కంటే బెంగుళూరు శానా దగ్గర. బస్సులో ఐనా, రైలులో అయినా ఐదు గంటల ప్రయానము. రాకపోకలు గుడ్క శానా ఎక్కువ.

శానామంది పిల్లకాయలను అనంతపురములో సదివిచ్చుకుంటారు. సొంతంగా రూములు దీస్కోని, ఆస్టలల్లో ఉండి సదువుకుంటారు, కొంతమంది పిల్లల సదువుల కోసరము ఈ మద్య సంసారాలు గుడ్క పెడుతుండారు, బాడిక్కు ఇయ్యనీకె యిండ్లు గట్టించేది గుడ్క ఈడ శానా ఎక్కువ.

సరిగా అరుంబావుకు సెకండు రోడ్డు చేరుకున్నారు అన్నదమ్ములిద్దరు. మూడో బ్రామ్మడు ముందే వచ్చి ఉన్నాడు. ఆ యప్ప పేరు రంగశాయి. వాండ్లది కల్యాణదుర్గమయితే, అనంతపురంలో పౌరోహిత్యం చేసుకోని బతకతాన్నాడు. పుండరీకాక్షశర్మను జూసి నమస్కారం బెట్టినాడు రంగశాయి. అన్నయ్యను పరిచయము చేసినాడు పుండరి.

పద్మనాభయ్యకు హోమాలు అప్పజెప్పినాడు తమ్ముడు. జపం రంగశాయి, పుండరి చేసినారు. అధిదేవతా ప్రత్యధిదేవతా ధార, ఆజ్యావేక్షణము పద్మనాభయ్య జరిపిస్తూ మంత్రోచ్చారణము చేస్తూ ఉంటే కార్యక్రమం జరుగుతున్నహాలు ప్రతిధ్వనించింది.

మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంలో గూడ్క పద్మనాభయ్య విద్యత్తు ప్రకాశించినాది. ఆయన స్వరాన్ని కొంతవరకు పుండరి అందుకోగలినాడుగాని, రంగశాయి చేతగాక వెనక బడిపోయినాడు.

చివరన స్వస్తివాచకము పలికి గంభీర స్వరంతో యజమాని దంపతులను ఆశీర్వదించినాడు పద్మనాభయ్య.

“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”

“యజమానస్య గోత్రాభివృద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, ధన కనకవస్తువాహన సమృద్ధిరస్తు,” అని ఆశీర్వదించగానే ఎ.సి.టి.వో, గరుడాద్రినాయుడు, ఆయన బంధువులు ముగ్గులయినారు. పురోహితులకు జరీ అంచు పంచెల చాపులు, అంగవస్త్రాలతో బాటు, వేయిన్నూట పదార్లు తాంబూలంలో పెట్టి ఇచ్చినాడు నాయుడు. పాదాలకు నమస్కారము చేసినాడు.

“సామీ! శానా బాగ జేయించినారు! ఈ సామిని ఇంతకు ముందు సూడలా. యా వూరో?” అనడిగినాడు.

“మా సొంత అన్నయ్య, నాయుడుగారూ, మహా పండితుడు! వేద వేదాంగాలన్నీ ఈయన నాలుక మీద నాట్యమాడతాయి. నేనే మా అన్నయ్యను మన ఊరికి తెచ్చుకున్నా. మొన్నటి వరకు ఒక పల్లెటూర్లో ఉండె” అన్నాడు పుండరి.

“శానా మంచిపని చేసినారు. మంత్రం సదువుతాంటే గొంతు కనేలు మంటుంది” అన్నాడు నాయుడు.

“మంత్రోచ్చారణ నాభి నుంచి రావాల నాయనా, పెదిమల నుంచి గాదు. అప్పుడే దాని ప్రభావము” అన్నాడు పద్మనాభయ్య. అబ్బురంగా జూసినాడు నాయుడు.

“నాయుడుగారూ, మీ స్నేహితులకు బంధువులకు గూడ చెప్పండి. సత్యనారాయణ వ్రతాలు, ఏకాదశరుద్రాభిషేకాలు, చండీ యాగాలైనా సరే, మేము చేయిస్తాము. నేనంటే మీకు తెలుసును. ఇప్పట్నించి వ్యవహారం వేరుగా ఉంటాది. ఎందుకో మీకు చెప్పనక్కరలేదు గదా!” అన్నాడు పుండరి.

“తప్పకుండా సామీ” అని సెలవు తీసుకున్నాడు నాయుడు.

దాదాపు పది కేజీల బియ్యము, ఎండు కొబ్బరిగిన్నెలు, ఖర్చురపండ్లు, నవధాన్యాలు అన్నీ మూటలు కట్టినాడు రంగశాయి.

“రంగా, నీవు రిక్షాలో రా ఇంటికి. మా అన్నయ్య ఇంటికి.. మేము బండి మీద పోతాము” అన్నాడు పుండరి.

ఇంట్లో రంగశాయికి రెండు నూర్లు, కొంచెం బియ్యం, దినుసులు ఇచ్చి పంపిచ్చినాడు. అన్నయ్యకు నాలుగు నూర్లు ఇచ్చినాడు. నాలుగు కేజీల బియ్యం, దినుసులు వదినెకిచ్చినాడు. అంత సంభావన పద్మనాభయ్య తన జీవితంలో చూడలేదు.

“నాయనా పుండరీ! అంతా కల మాదిరి ఉందిరా” అన్నాడు సంతోషంతో.

“ఇదేముంది, చూస్తూండు నిన్ను ఎక్కడికి తీసుకుపోతానో!” అన్నాడు తమ్ముడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here