మహాప్రవాహం!-28

0
10

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[భాస్కర చౌదరి గారు కారు పంపితే, అన్నదమ్ములిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్తారు. చౌదరిగారు వాళ్ళని సగౌరవంగా ఆహ్వానించి, మర్యాదలు చేసి తన సమస్యలను చెప్తారు. అతని జన్మ నక్షత్రం వివరాలడిగి, మనసులో గణించి, జరుగుతున్న రాహుగ్రహ పీడ వల్ల సంభవిస్తున్నాయనీ, నివారణగా చండీయాగం చేయాలని చెప్తాడు పద్మనాభయ్య. తానూ, తమ్ముడూ ఫ్యాక్టరీకి వెళ్ళి చూసొస్తామని చెప్తాడు. చౌదరిగారు సరేనంటారు. కారులో ఫ్యాక్టరీ అంతా చూసి వచ్చి మళ్లీ రాప్తాడు వస్తారు. ఫ్యాక్టరీ వాస్తులో ఏ లోపమూ లేదు. కాబట్టి వాస్తుహోమాలు, శాంతులు పనిలేదు, చండీయాగంతో పాటు రుద్రాభిషేకము చేయించుకుంటే చాలని చెప్తాడు పద్మనాభయ్య. చండీయాగం నిర్వహించడం తమకిదే మొదటిసారని, కొన్ని రోజులు అమ్మవారిని ఉపాసించాలని, పదిహేను రోజుల సమయం అడుగుతాడు పద్మనాభయ్య. యాగానికి ఎంత ఖర్చవుతుందో, సంభావన ఎంత అని చౌదరి గారు అడిగితే, ఓ వారం తర్వాత చెప్తానంటాడు పద్మనాభయ్య. కారులో వాళ్ళని ఇంటివద్ద దించుతాడు చౌదరి గారి డ్రైవరు. చండీయాగంపై అవగాహన కల్పించుకోడానికి అవసరమనైన గ్రంథాలు తెప్పించుకుని చదువుతాడు పద్మనాభయ్య. పుండరికి కూడా వివరిస్తాడు. పూర్తిగా సంసిద్ధులయ్యాక, ఫ్యాక్టరీలో శాస్త్రయుక్తంగా చండీయాగాన్ని, రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు అన్నదమ్ములిద్దరూ. రుద్రాభిషేకం జరుగుతుండగానే – మునుపు ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదానికి కారకులైన వారు పట్టుబడినారని చౌదరిగారికి ఫోను వస్తుంది. ఆయన చాలా సంతోషిస్తాడు. పద్మనాభయ్య సూచన మేరకు పేదలకు అన్నదానం జరిపిస్తారు చౌదరి. ఈ చండీయాగముతో పద్మనాభయ్య పేరు మార్మోగిపోతుంది. కాలక్రమంలో ఆయనకు మరింతమంది శిష్యులు తయారవుతారు. కేదార పి.జి పూర్తవుతుంది. ఢిల్లీ యూనివర్శిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్‌లో పరిశోధన చేయడానికి సీటు దొరుకుతుంది. తపోవనంలోనే పద్మనాభయ్య సొంత ఇల్లు కట్టుకుంటాడు. వడ్లాయిన రామబ్రమ్మం కోడుకు వీరబ్రమ్మం మంచి రోజు చూసుకోని ఆదోనికి వెళ్ళి తన మిత్రుడు దస్తగిరిని కలుస్తాడు. దస్తగిరి చిన్నాయన గౌసుమియ దగ్గర పని నేర్చుకోవాలని వెళ్తాడు. ఆదోనిలో గౌసిమియ వడ్రంగి పనికి పెట్టింది పేరు. దస్తగిరి – తన చిన్నాయనకు వీరబ్రమ్మం గురించి ముందే చెప్పి ఉంచాడు కాబట్టి, ఇప్పటికే ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నా, వీర ని చేర్చుకోడానికి ఒప్పుకుంటాడు గౌసుమియ. ఇక చదవండి.]

“ఎట్లైన నా జీవితానికి ఒక దావ సూపియ్యాల సిన్నాయనా, నీవు! ఊల్లో బొత్తిగా జరుగుబాటు ల్యాకుండ అయినాది” అన్నాడు వీర. వాని గొంతులో దుక్కము!

“శ, శ, నీవేమీ ఎదారు పడగాకురా. మా దస్తగిరి ఎంతో నీవూ అంతే! మెల్లగా పని ముప్పుతా. ఒక వారం పది దినాలు అంతా చూస్తూండు. కమ్మరోనివి గాబట్టి ఈ విద్దె నీకు సులబంగా పట్టుబడతాది. మరి యాడ ఉండాలని?”

“కొన్ని రోజులు మన శెడ్డులోనే ఒకమూలన..” అన్నాడు దస్తగిరి.

“అంతేలే మరి. యాడుంటాడు పాపం!, మన శెడ్డు ఊరి బయట ఉంది కాబట్టి ‘శెంబట్క’ పోనీకె పికరు లేదు. మనదే బోరింగు ఉండాది తానానికి. ఒరేయి వీరా, ముందే చెబుతున్నా. నీకో దినకర్చుకు రోజు ముఫ్ఫై రూపాయలిస్తా. అన్నం బెడతా. నీవు గూడ్క మా దస్తగిరితో పాటు మా యింట్లో బోంచేయి. ఈ పని ఆ పని గాదు అన్ని పనులు చెయ్యాల. నీవు బాగ పనులన్నీ చేసిడుస్తే (చేసేస్తే) నిన్ను అంతే బాగ జూసుకుంటా. ఈ యాలకు ఇంటికి పోదాం పాండి.”

గౌసుమియ పెండ్లాము కాశింబీ ఈయప్ప అంత మంచిది గాదు. వీన్ని కొంప మిందకు తెస్తాడని ఆ యమ్మకి ముందే తెలుసు..

“ఇదిగో, ఈ పిల్లోడు కొన్ని రోజులు మన దస్తగిరితో బాటు మనింట్లనే తింటాడు. పని నేర్చుకోనీకె వచ్చినాడు. సమజ్ అయినాదా?”

ఆ యమ్మ ముకమంతా చిట్లించుకున్నాది. ఏం మాట్లాడలేదు.

“క్యారే, క్యా హోగయా! మనం గుడ్క ఇట్లా మొదులుబెట్టి నోండ్లమే అని మర్చిపోయినావా? జావ్, ఖానా యిస్తెమాల్ కరో” అన్నాడు కటినంగా.

ఆమె ఏదో గొనుక్కుంటూ లోపలికి బోయింది.

“మీ పిన్నమ్మ మాటలు పట్టించుకోగాకు. మంచిదేగాని, మాట కశరగా ఉంటాది. నీవు కుదురుకునేంత వరకు తప్పదు. ఆమె ఏమన్నా గమ్మునుండు” అని బోద జేసినాడు గౌసుమియ.

స్టీలు తట్టల్లో అన్నము, రామ్ములక్కాయ (టమేట) ఊరిమిండి, పెసరపప్పు పులుసు వడ్డించినాది కాశింబీ. మాట్లాడల్యా గాని మారు వడ్డించి కడుపు నిండా బెట్టినాది.

దస్తగిరి అన్నాడు “సిన్నాయనా, నేను గుడ్క వీరతో బాటు శెడ్డులో పండుకుంటా.”

సరే అన్నాడు గౌసు. పరుసుకోనీకె ఒక చాప, బొంత, ఒక షోలాపూరు దుప్పటి ఇచ్చినాడు.

“పోయెస్తా పిన్నమ్మా! మా అమ్మ మాదిరి కడుపు నిండా అన్నం బెట్టినావు. ఇంట్లో గుడ్క యావన్న పనులుంటే చెప్పు” అన్నాడు వీర.

కాశింబీ మనసు కదిలినాది. అయినా బింకంగా “సర్లే, పొయ్యిడ్సంది” అనింది. ఆదోని ప్రాంతంలో, కర్నాటక ప్రబావము ఎక్కువ. చేసేయి అనే దానికి ‘చేసిడుసు’ అనీ, ‘చెప్పెయ్యి’ అనే దానికి ‘చెప్పిడుసు’ అనీ అంటారు.

గౌసుమయ శెడ్డు పెద్దదే. ఒక పక్క సామిల్లులో కోయించి పెట్టుకున్న చెక్క పేర్చి ఉంటాది. చెక్క పని చేసేటపుడు వచ్చే శెత్త అంతా షెడ్డు బయట ఒక పెద్ద గుట్ట మాదిరి పేరుకోని ఉండాది. దాన్ని నెలకొకసారి చిన్న ఓటల్లకు అమ్ముతాడు గౌసు. వాండ్లకు అది మంచి ఇందనము. శెడ్డులో గోడకు మక్కా పటము, ‘786’ అర్ధచంద్రుడు ప్రేము కట్టించి తగిలించినారు. దూదేకులు హిందూ పండగలు గుడ్క జరుపుకుంటారు. దేవుండ్లకు మొక్కుతారు. మక్కా పటము పక్కనే పెద్ద కుంకమబొట్టు పెట్టుకోని ఆదవేని (ఆదోని) లచ్చమ్మ తల్లి పొటో గుడ్క ఉండాది. ఆ యమ్మ పెద్ద యోగిని. సిద్ది బొంది సమాది అయినాది. రాయలసీమలో ఆ యమ్మను కొలిచే బక్తులు శానామంది ఉంటారు.

కుడి పక్క గోడకు పెద్దది చెక్కబోశానం ఉండాది. దానికి బీగం ఏసి ఉండాది. దాంట్లో వడ్రంగము కొర్రముట్లు, శేతి మిషన్లు అన్నీ బద్రంగా పెట్టుకుంటారు. కొర్రముట్లంటే పని చేసి సామాన్లు.

దస్తగిరి, వీర శెడ్డు ముందు పలకల వాకిలికి బీగం తెరుచుకోని లోపటికి బోయినారు. సిచ్చి ‘ఏసిడిస్తే’ బల్బు ఎలిగినాది, అరవై కాండిలుది. పండగలు, పెండ్లిండ్ల సీజను లోన శానా కస్తిగ పని ఉంటాది. రాత్రి గుడ్క పని చేస్తారు. అందుకే శెడ్డులో ఒక బారు లైటు, అరవై క్యాండిలు బల్బులు రెండు ఏసినారు.

శెక్క బోశానము ఎంత పెద్దదంటే వీండ్లిద్దరు ఆయిగ పండుకోవచ్చు. దస్తగిరి దాని మింద దుమ్మంతా పోయేటట్టు ఇదిలించి, సాప ఏసి, దాని మింద బొంత పరిసినాడు. మందంగా ఉన్న రెండు శెక్కదిమ్మలు తలకింద పెట్టుకొనీకె తెచ్చిపెట్టినాడు. వాటి మింద బొంత వచ్చీటట్టు పరిసినాడు. తలకాయ కింద మెత్తగా ఉండల్లని. ల్యాకపోతే తల దిమ్మెక్కుతోంది పొద్దునకల్లా.

శెడ్డు, ఐదడుగుల ఇటిక గోడలు తీపి యాజ్‍బెస్టా రేకులు గోడల వింద దింపినారు యాటవాలుగ. బోశానము పక్కనే పెద్ద మంచినీల్ల కుండ, దాని మీద మట్టి మూకుడు మూత పెట్టి ఉంది. మూత మింద పిలేస్టిక్ గలాసుంది. సన్న యిసుక రెండు గంపలు బోసి గుంత జీసి కుండను గుంతలో కుచ్చోబెట్టినారు. కుండ చెమ్మకు ఇసక నాని కుండ సుట్టూ యావో శిన్న మొలకలు ఒత్తుగా పెరిగి ఉండాయి.

దస్తగిరి గలాసుతో నీల్లు ముంచుకొని తాగి, నేస్తునికి గుడ్క యిచ్చినాడు. నీళ్లు శానా సల్లగ ఉండాయి. కుండ నీల్లు గదా!

“ఆయిగ కింద పండుకొనేటోల్లము గదా” అన్నాడు వీర.

“కిందనా? ఏం చెప్పిడిస్తివి? రాత్రి మండ్రగబ్బలు తిరగతాయి” అన్నాడు దస్తగిరి. వీరకు ఒల్లు జలదరించింది. “అవిట్ని సంపుతారా?” అనడిగినాడు.

“మా సిన్నాయన సంపనియ్యడు, మేము సంపిడుస్తామన్నా. కొన్నైతే కడుపుతో ఉండి కింద పొట్టలో గుడ్లు గుడ్క మనకు కనపడతాయి. సిన్నాయన ఏమంటాడంటే అవిట్ని మనం సాకనపుడు సంపనీకె మనకు అక్కు లేదంటాడు. దేవుని మింద బక్తి శాన ఆ యప్పకు. నమాజు చేస్తాడు. మనం శెడ్డు కొచ్చే దావలో శివుని దేవలం ఉండాది. శివునికి గుడ్క మొక్కుకుంటాడు.”

ఇద్దురూ పండుకున్నారు. వీర దస్తగిరి మింద జెయ్యేసి, “ఒరే, నాకు ఒక దావ సూపిచ్చినావు. తొందరగా పని నేర్చుకోని స్తిరపడల్ల. మా నాయినను అమ్మను సుకపెట్టల్ల” అన్నాడు.

“నీవేం ఎదారుపడగాకు. సిన్నాయన అస్తవాసి మంచిది. ఆ యప్ప కాడ పని నేర్చుకున్నోల్లు, శెడ్లు పెట్టుకోని బాగుపడినారు” అన్నాడు దస్తగిరి.

“కాని సిన్నాయన పని రాచ్చసుడు. చనం గుడ్క కూసోనియ్యడు. పని జేసేటప్పుడు యామాత్రం నిర్లచ్చము జూపించినా బూతులు తిడతాడు. మరీ కోపం వస్తే తన్నిడుస్తాడు గుడ్క” అన్నాడు దస్తగిరి.

“పెట్టేటోనికి కొట్టే అక్కు యానాడైన ఉంటాది” అన్నాడు వీర.

లైటు ఆర్పేసి ఇద్దరూ పండుకున్నారు. పొద్దున లేశి బయట గోలెం లోని రేక డబ్బాలతోన నీల్లు దీసుకోని రెండు పర్లాంగుల దూరంలోన బీడులోకి ‘శెంబటక’ బోయినారు. వచ్చి ముకం కడుక్కున్నారు.

దస్తగిరి అన్నాడు “మనం బోయినానికి పొయ్యెటలకు ఒంటిగంట దాటతాది. చిన్నాయన నాస్తా జేసుకోని తొమ్మిదికిగాని రాడు. మనం గుడ్క నాస్త చేసి టీ తాగి వస్తాముపా.”

ఊరి పక్కకు ఐదు నిమిసాలు నడిస్తే ఒక కొట్టము ఓటలుండాది. ఆడ సుట్టుపక్కల రెండు కోల్లపారాలు, ఒక యిటికె బట్టి, రెండు బీడీ, పాన్ బంకులు ఉంటాయి. ఆదోని టౌను పొలిమ్యార ఇది.

ఇంకా ఏడు గుడ్క గాల్యా! కొట్టం ఓటల్లో అప్పుడే ఏడి ఇడ్లీవాయ దిగతున్నాది. ఒకాయమ్మ ఉగ్గాని కోసరం బొరుగులు నానబెడతాన్నాది. పూరీ పిండి పిసకతాన్నాడొక పొట్టిగాడు. వీండ్లను బూసి ఓటలాయిన నగినాడు.

“ఏందిరా అల్లుడూ! ఇడ్లీ ఇప్పుడే దిగినాది. తింటారా? ఈ పిల్లోడు ఎవరు?” అని అడిగినాడు.

“నా దోస్తు ఉశేనప్ప మామా! మా సిన్నాయన శెడ్డులో పని నేర్చుకోనీకె జేరినాడు – వీరబ్రమ్మం వీని పేరు.”

“కాలగ్యానం చెప్పిన మానుబావుని పేరు” అన్నాడు ఉశేనప్ప. “గౌసన్న శానా మంచోడురా నాయినా, శ్రద్దగ నేర్చుకోని బాగుపడు.”

“అట్నే మామా!” అన్నాడు వీర, యినయంగా.

ఇద్దరూ శెక్క బెంచి మింద కూసోని చెరో ప్లేటు ఇడ్లీ తిన్నారు. నాలుగిడ్లీలు. పొగలొస్తోండాయి. ఒక గుంత స్టీలు ప్లేటు లోనీ ఏసి పొయ్యి మింది కుత కుత ఉడుకుతున్న సాంబారు గంటితో తీసిపోసి, దాని మిందనే పలసని శట్నీ బోసినాడు. స్పూన్లు ఇడ్లీ మింద గుచ్చినాడు.

“ఊదుకోని తినిడుసురోయ్. నోరు కాలతాది” అన్నాడు దస్తగిరి. వీండ్లు రెండిడ్లీలు తినేటాలకి సాంబారు అయిపోయినాది. మల్లా పోయించుకున్నారు శట్నీతో సా.

“సాంబారు తియ్యగుండాది కుంచెము” అన్నాడు వీర.

“కన్నడ దేశము బార్డరు గద! ప్రెతి దాంట్లో బెల్లమేసిడిస్తారు” అన్నాడు దస్తగిరి.

తిన్నంక ఇద్దురికీ టీ లిచ్చినాడు ఉశేనప్ప. పోయెస్తామని చెప్పి వస్తాంటే “మరి డబ్బులు?” అని అడిగినాడు వీర.

“వర్తన కాతా ఉండాదిలే నాకు. రాసుకుంటాడు మామ, నెల మొదుట్లో సిన్నాయన డబ్బులిస్తే చుప్తా జేస్తాము.”

“టిపను, టీ గలిసి ఎంత?”

“మూడు రూపాయలైతే, మన కాడ రెండు తీసుకుంటాడు. మల్ల సాయంత్రము ‘టీ’ అర్ధ రూపాయ. మనకు సబ్బు, నూనె, ఇట్టాంటి కర్చులుంటాయి. సిన్నాయనిచ్చే ముపై యామూలకు రావు. పని పూర్తయినంక పర్నీచరు దీసుకుపోయేటప్పుడు కస్టమర్లు పదో ఇరవయ్యో సేతిలో బెడతారు. శెక్క వేస్టు అమ్మిన డబ్బులు గుడ్క మనకే యిస్తాడు సిన్నాయన. పండగలకు ఇనాము లుంటాయి. ఉగాదికి జత గుడ్డలు గుడ్క శింపించి యిస్తాడు.”

ఇడ్లీ సాంబారు కడుపు నింపినాది. ఇద్దురూ శెడ్డుకు బోయినారు. దస్తగిరి వీరకు ఒక టెంకాయ పుల్లల పొరక (చీపురు) ఇచ్చి “శెడ్డంతా కసువు శిమ్మిడుసు. నేను కుండలో మిగిలిన నీళ్లు పారేసి బోరింగు కాడ నీళ్లు కొట్టుకొచ్చి పోస్తా” అన్నాడు.

“పోసిడుసు” అన్నాడు వీర నవ్వుతా.

“ఈ బాస అప్పుడే పట్టుకున్నావే! నీ పాసుగూల!”అని నవ్వుకుంటా ఎల్లిపోయినాడు దస్తగిరి.

తొమ్మిదికి గౌసుమియ వచ్చి దేవుండ్ల పటాలకు మొక్కుకోని పని మొదులు బెట్నాడు. ఎవరిదో శిన్న పిల్లలను పండుకోబెట్టి ఉపే ఉయ్యాల తొట్టి రడీ అయినాది. ఇరిడి కర్రలతో నగిశీలు చెక్కి శానా అందంగ జేసినాడు. దానికి వుడ్ పాలీసు జేసేది వీరకు నేర్పించమని దస్తగిరికి చెప్పినాడు. “ముందు శిన్న పాతగుడ్డను పాలీసులో ముంచుకొని శెక్కంతా తుడవాల. ఆరినంక బ్రష్షు కొడితే శైనింగు వస్తాది” అన్నాడు దస్తగిరి. వీర ఉయ్యలతొట్టికి నీటుగ పాలీసు జేసినాడు. గౌసుమియ వచ్చి చూసి “ఇంకా ఆడాడ సందులుండాయి. ఇంకోసారి బ్రష్షు కొట్టండి” అని చెప్పినాడు.

ఆదోనిలో సాయిబుల కుటుంబాలు ఎక్కువగానే ఉంటాయి. పెండ్లి తర్వాత ఆడపిల్ల అత్తింటికెళ్లేటపుడు శానా సారె బెట్టాల వాండ్లు. మంచాలు, దివాను, కుర్చీలు, డ్రస్సింగ్ బల్ల ఇట్లాంటివన్నీ జేయించుకుంటారు గౌసుమియ కాడ. సారె ఆర్డర్లు ఆయాల రెండొచ్చినాయి.

ఒకాయన వచ్చి, “సాయిబూ, మాకు ఒక దేవుని మందసము జెయ్యాల. ఎంతయితాది?” అని అడిగినాడు. ఆ యప్ప పేరు బైరవయ్య. పూల బజారు సెంటరులో ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, అల్లము ఓల్‌సేల్‌  శాపుందంట. కోంటోండ్లు. శిరుగుప్పలో వాండ్ల అల్లుడు ఇల్లు కట్టుకున్నాడంట. వచ్చే వారమే గృహప్రవేశమంట. బిడ్డకు అల్లునికీ బగుమతి ఇయ్యనీకె ఈ దేవుని మందసము.

“శెట్టిగారో, దేవున్ని బెట్టుకొనేదంటొన్నావు కాబట్టి బందోబస్తుగ చైయ్యాల. మూడు తరాలు మన్నాల. పోయిన్నెల పత్తికొండ శివారెడ్డి గారికి చేసిచ్చినా. టేకు చెక్క ఎయ్యాల. కింద పీఠం వస్తాది. దానికి పూజ సామాన్లు పెట్టుకోనీకె సొరుగు బెట్టాల. నాలుగు పక్కల నాలుగు స్తంబాలు వస్తాయి. అవిటికి శేపులు దిప్పి నగిశీలు చెక్కాల. నాలుగు స్తంబాల మింద కప్పు వేసి పైన దేవళానికున్నట్టు గోపురం మాదిరి చేసి, పైన ఇత్తడి బుడిపె బిగిస్తాము. పైన స్తంబాలంబడి రాగి తీగె సుట్టి దానికి సెక్కతో చిన్నచిన్న గంటలో, శంకచక్రాలో కట్టవచ్చును. లేదా అవిట్ని కంచుతో చేపించుకోవచ్చును. ఇత్తడి కంచు సామాన్ల శాపు మహబూబా టాకీసు పక్క సందులో ఉండాది. ఆడ ఇట్లాంటివి రెడీమేడ్‌వి దొరకతాయి. ఒక్క చనం తాళు. మందసము ఎట్టుంటాదో నీకు బొమ్మ ఏసి చూపిస్తా” అన్నాడు గౌసు.

ఒక తెల్ల కాయితం తెమ్మని దాన్ని ఒక బల్ల మింద పరిశినాడు. చెవెనక బెట్టుకున్న పెనసులు తోసి దానికి మొన లేకపోవడం జూసి ‘ధూత్తెరికి. దీనికి ముక్కు ఇరిగిపోయినా’దని తిట్టి శిన్న బాడిశ దీస్కరమ్మని వీరకు చెప్పినాడు. వీర బోయి శిన్న బాడిశ యాదో అక్కడ పొట్టిగాన్నడిగి తెచ్చిచ్చినాడు. “ఒరేయి అందరూ రాండి! దేవుని మందసము ఎట్టుంటోదో బొమ్మ ఏస్తాండా. చూడండి” అని పిలిస్తే దస్తగిరి, వీర, ఇంకా ఇద్దరు పొట్టిగాండ్లు ఆ యప్ప సుట్టు మూగినారు. బైరవయ్య శెట్టి గుడ్క శానా కయాసతో సూడబట్నాడు. ఏడెనిమిది నిమిసాల్లోనే మందసం బొమ్మ తయారయినది. ఆ యప్ప నైపున్యం శానా బాగుంది. శెట్టికి అర్తమైనాది.

“బాగున్నాది సాయిబూ, టేకుతోనే చెయ్యి. ఎన్ని రోజులు బడతాది?”

“వారమేసుకో శెట్టిగారో, అయితే ఇంకా ముందే ఇచ్చిడుస్తా.”

“ఎంతయితాది?”

మళ్లీ పెనసలుతో కాయితం మింద లెక్కలేసినాడు, గౌసుమియ. “మొత్తం ఎనిమిది నూర్లయితాది, మా మజూరి తోని. మందసానికి పని గోజు. శానా జాగ్రత్తగ చెయ్యాల. యాడ అతుకు రాకుండ సూడాల. దేవునితో పని గదా!”

“కొంచెం తగ్గించు సాయిబూ”

“శెట్టిగారో, పని జూసినంక నీవే యాబై ఎక్కువిస్తావు. బిడ్డ కిచ్చే కాడ కునిస్టి పడగాకు.”

శెట్టి నవ్వినాడు “నీ పాసుగూల. మీ తురకోల్లతో మాట్లాడలేమబ్బా. సరే అట్టే గానీ. బాగ చెయ్యి అయితే. ఇప్పుడెంత ఇమ్మంటావు?”

“ఐదు నూర్లిచ్చిపో. టేకు చెక్క దెచ్చుకోవాలగద!”

శెట్టి డబ్బులిచ్చి ఎల్లి పోయినాడు.

వీరకు మెల్లగా చిత్రిక పట్టడం, మిశినుతో చెక్కకు బెజ్జాలు ఎయ్యడం, తోపడా పట్టడం, పెద్ద రీపర్లను మిసిను రంపముతో శిన్నవి కోయడం నేర్పించినాడు గౌసు. స్వతహాగ కమ్మరి పని జేసినోడు కాబట్టి వానికి సులబంగనే పనిలోన సులువులు తెలుస్తోండాయి.

శెట్టి గారి మందసము తయారయితున్నాది. ఒక స్తంబము వీరకిచ్చి, “దీన్ని ఎట్ట శేపులు దిప్పి నగిశీ జేస్తావో చెయ్యి. చూద్దాము. బాగుంటే మిగతా మూడు గుడ్క నీతోనే జేపిస్త” అన్నాడు గౌసు.

రెండు గంటలు కస్టపడి వీర స్తంబాన్ని చెక్కినాడు. యాడా శీలకుండా, ఇరగకుండా శానా జాగ్రత్తగ పని చేసినాడు. గౌసుమియ అది జూసి “బాగుండాది” అని, కొన్ని మార్పులు చెప్పినాడు. సాయంత్రానికి నాలుగు స్తంబాలు పూర్తయినాయి. వీర ట్రయినింగులో ఇది మొదుటి పని. దస్తగిరి అన్నాడు – “నీ తొలి ప్రయత్నము దేవుని మందసముతో మొదులైనాది. నిలబడతావులే” అని బరోసా యిచ్చినాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here